cloudfront

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: కశ్మీర్‌లో శ్రీశ్రీ రవిశంకర్‌

ఎమ్బీయస్‌: కశ్మీర్‌లో  శ్రీశ్రీ రవిశంకర్‌

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ మార్చి నెలలో శ్రీనగర్‌లో జరిపిన 'ప్రేమసందేశం' (పైగామ్‌ ఎ మొహబ్బత్‌) సమావేశం విఫలమైందనే చెప్పాలి. రవిశంకర్‌  సర్కారీ సాధువుగా పేరుబడడానికి కారణాలు కనబడుతున్నాయి. కశ్మీరీ యువతను ఉగ్రవాదం నుంచి మరల్చి నైపుణ్యం, ఉపాధి అవకాశాలు పెంచడానికి కేంద్రం తన స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఎంట్రప్రెనార్‌షిప్‌ మంత్రిత్వ శాఖ ద్వారా 500 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లకు సహాయం అందిస్తుంది. వాళ్లు ఎంపిక చేసిన యువతకు రాష్ట్రం బయట తర్ఫీదు యిచ్చి అక్కడే ఉద్యోగాలు దొరికేందుకు ప్రయత్నాలు జరుగుతాయి.

యువతకు తర్ఫీదు యిచ్చే బాధ్యతను ఆ శాఖ రవిశంకర్‌ గారి ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ (ఎఓఎల్‌) సంస్థకు అప్పగిస్తూ ఆ శాఖ  ఒప్పందం (ఎమ్‌ఓయు) కుదుర్చుకుంది. తర్ఫీదు యిచ్చేందుకు ఎఓఎల్‌కు ఉన్న శక్తిసామర్థ్యాలు ఏ పాటివో కానీ వాళ్లు యిప్పటికే తమ బెంగుళూరు స్కిల్‌ సెంటరులో వెయ్యిమంది కశ్మీరీ యువతకు తర్ఫీదు యిచ్చేశారట. 2017 నవంబరులో ఆ బెంగుళూరు సెంటర్‌లో ప్రేమసందేశం పేరుతో నిర్వహించిన కార్యక్రమం చూడడానికి ట్రైనింగ్‌ అవుతున్న పిల్లల తలిదండ్రులు వచ్చి చూసి, ముచ్చటపడి మా శ్రీనగర్‌లో కూడా అలాటిది చేయమని అడిగారని, అందువలననే 2018 మార్చి 12న అక్కడ పెట్టామని ఎఓఎల్‌ ప్రతినిథులు అంటున్నారు.

రవిశంకర్‌కు యోగ, జీవనశైలి కార్యక్రమాలతో సరిపెట్టుకోవడం యిష్టం ఉండదు. 2016లో యమునా నదీతీరంలో వెయ్యి ఎకరాలలో,  650 పోర్టబుల్‌ టాయిలెట్స్‌తో  'వ(ర)ల్డ్‌ కల్చర్‌ ఫెస్టివల్‌' పేర ఏడు ఎకరాల వేదికపై 35 వేల మంది సంగీత, నృత్యకారులతో మూడు రోజుల భారీ కార్యక్రమం నిర్వహించారు. దీని తర్వాత భారతీయ సంస్కృతికి వచ్చిన లాభమేమిటో తెలియదు కానీ పర్యావరణపరంగా యమునా నదిలో ఫ్లడ్‌ప్లెయిన్స్‌కు నష్టం వాటిల్లింది. నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ రూ.5 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని చెప్పింది. అలా ఏమీ వాటిల్లలేదని రవిశంకర్‌ వాదించారు. దానిపై నిపుణులతో విచారణ జరిపారు.

చివరకు 2017 నవంబరులో గ్రీన్‌ కోర్టు తీర్పు వెలువరించింది. యమునా ఫ్లడ్‌ప్లెయిన్స్‌ పాడయ్యాయని, దాని మరమ్మత్తు ఖర్చులు ఎఓఎల్‌ భరించాలని, రూ.5 కోట్ల కంటె ఎక్కువైతే ఎక్కువ యివ్వాలని, తక్కువైతే కాషన్‌ డిపాజిట్టుగా కట్టిన రూ.5 కోట్లలోంచి మిగిలినది వెనక్కి యిచ్చేస్తామని చెప్పింది. రవిశంకర్‌ యీ తీర్పుతో ఏకీభవించలేదు. సుప్రీం కోర్టుకు వెళతానంటున్నారు.

అదే నవంబరు 2017లో రవిశంకర్‌ అయోధ్యా వివాదంలోకి కూడా దూరారు. యుపికి వచ్చి, ఆదిత్యనాథ్‌ ఆతిథ్యం స్వీకరించి, ముస్లిములలో ఒక వర్గాన్ని ఆకట్టుకుని ఆ స్థలంలోనే రామమందిరం కట్టుకోవచ్చు అనిపించారు. ఇదంతా బిజెపి కనుసన్నల్లోనే జరిగిందన్న అనుమానంతో తక్కినవారు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఈయన తగ్గలేదు. సుప్రీం కోర్టులో తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా తక్కినవారికి కడుపుమంటగా ఉంటుందని, అందువలన యిద్దరూ కోర్టు వెలుపల రాజీ పడాలని పిలుపు నిచ్చాడు. దీనిపై ముస్లిము సంస్థలే కాక, విశ్వ హిందూ పరిషత్‌ కూడ మధ్యలో నీ రాయబారం దేనికి అంది.

రామ్‌ మందిర్‌ ఉద్యమంలో భాగస్వామి, బిజెపి మాజీ ఎంపీ ఐన విలాస్‌ వేదాంతి 'ఈ రవిశంకర్‌ ఒక స్వచ్ఛందసంస్థ నడుపుతూ విదేశీ నిధులు సంపాదిస్తున్నాడు. దానిపై విచారణ తప్పించుకోవడానికి యీ రామమందిరం విషయంలో చొరబడ్డాడు.' అన్నాడు. అయినా రవిశంకర్‌ తన ప్రయత్నాలు మానలేదు. 'అయోధ్యలో రామమందిరం కట్టుకోనివ్వకపోతే అంతర్యుద్ధం వస్తుంది కాబట్టి ముస్లిములే సుప్రీం కోర్టు తీర్పు వచ్చేదాకా ఆగకుండా వెంటనే వెనక్కి తగ్గి గుడి కట్టుకోవడానికి హిందువులకు ఆ వివాదాస్పద స్థలాన్ని బహుమతిగా యివ్వాలి. దానికి బదులుగా దానికి ఐదు రెట్లు స్థలాన్ని బాబ్రీ మసీదు స్థలానికి దూరంగా హిందువులు యిస్తారు. దాన్ని తీసుకుని అక్కడ మసీదు కట్టుకోవాలి.' అని ఆల్‌ ఇండియా ముస్లిమ్‌ పర్శనల్‌ లా బోర్డు వారికి ఒక లేఖ రాశాడు.

రాముడు అక్కడ పుట్టాడన్నది ఒక నమ్మకం. దాదాపు వెయ్యేళ్ల క్రితం అక్కడున్న ఒక గుడిని కూల్చి బాబ్రీ మసీదు కట్టారన్నది చరిత్ర. ప్రభుత్వం వారిస్తున్నా, ధిక్కరించి హిందూత్వవాదులు ఆ మసీదును ఒక్క రోజులో కుప్పకూల్చారన్నది ప్రత్యక్ష సత్యం. అలాటప్పుడు ముస్లిములు ఆ స్థలాన్ని ఉత్తిపుణ్యానికి ఎందుకు వదులుకుంటారు? దూరంగా కట్టుకోమని హిందూసంఘాలు ఎప్పణ్నుంచో చెపుతూ వచ్చాయి.

ఈ రోజు యీయన కొత్తగా చెప్పినదేమీ లేదు. పైగా ఎంత దూరంలో కట్టుకోవాలో కూడా చెప్పలేదు. ఎట్టి పరిస్థితుల్లో స్థలాన్ని వదులుకోబోమని ముస్లిమ్‌ బోర్డు వారు రవిశంకర్‌కు తెగేసి చెప్పారు. 'తీర్పు వచ్చాక అంతర్యుద్ధం జరుగుతుందని నువ్వెలా చెప్పగలవు? సంఘవ్యతిరేక శక్తులను, తీవ్రవాదులను పురిగొల్పుతున్నావా? దానికి బదులు తీర్పుని మన్నించమని హిందువులకు సలహా చెప్పు.' అని అడిగింది.

ఈ నేపథ్యంలో మార్చి 12న శ్రీనగర్‌లోని షేర్‌ ఎ కశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో రవిశంకర్‌ సమావేశం జరిగితే ముస్లిములు ఆదరిస్తారని ఎలా అనుకుంటాం? ఆ సందేహంతోనే పీపుల్స్‌ ఎలయన్స్‌ అనే పార్టీ పెట్టబోతున్న షేక్‌ ఇమ్రాన్‌ అనే అతన్ని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వారు కలుపుకున్నారు. అతను కొంతమందిని తీసుకుని వచ్చాడు. ఇంకా జనాల్ని పోగేయాలని జమ్మూ నుంచి కూడా ప్రేక్షకులను తీసుకుని వచ్చారు. మొత్తం 10 వేల మంది వచ్చారని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వారు చెప్పుకుంటున్నారు కానీ రవిశంకర్‌ ఉపన్యాసం జరుగుతూండగానే జనాలు లేచి వెళ్లిపోసాగారు.

అది చాలనట్లు కొందరు యువకులు హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌ మాజీ కమాండర్‌ జాకీర్‌ మూసాను ప్రశంసిస్తూ నినాదాలు చేశారు. 'పోలీసులు సరైన ఏర్పాట్లు చేయలేదు. 10 మంది పోలీసులను పంపి చేతులు దులుపుకున్నారు.' అని నిర్వాహకులు అంటున్నా, పిడిపి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వం ఆశీస్సులు లేనిదే సమావేశమే జరిగేది కాదని అందరూ ఊహించగలరు. 'మాకు క్రికెటు బాట్లు, కుట్టుమిషన్లు, బ్యాంకు లోన్లు యిప్పిస్తామని చెప్పి రప్పించారు. అదేమీ జరగలేదు.' అని హాజరైన జనాలు సమావేశానంతరం స్థానిక, జాతీయ మీడియా ప్రతినిథులకు చెప్పారు. నిజానిజాల మాట ఎలా ఉన్నా రవిశంకర్‌ మరో వివాదాన్ని రగిల్చారు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com