Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సోనియా మానసిక విశ్లేషణ

మానసిక విశ్లేషకులు, రాజకీయ సమీక్షకులు ''రేపు'' నరసింహారావుగారు ఆంధ్రజ్యోతిలో 'సోనియా గాంధీ జీవన విశ్లేషణ' అంటూ నాలుగు రోజుల పాటు వ్యాసాలు రాశారు. ఆమె జీవితంలోని అనేక ఘట్టాలను - ఆమెను హీనంగా చూపే వాటిని - ఏరి కూర్చారు. వాటితో బాటు ఆమె వ్యక్తిత్వాన్ని విశ్లేషించారు. చివరి వ్యాసంలో ఆమెకు ఆంధ్రులంటే ఆగ్రహం అంటూ కొన్ని ఉదాహరణలు చూపారు.

వాటిలో కొన్ని - 1) 'రాజీవ్‌ గాంధీ ప్రధాని అయిన తర్వాత లోకసభలో ఆయన్ని యిబ్బంది పెట్టినవారు ఎవరు అని అడిగితే దక్షిణాదిన తెలుగు మాట్లాడేవారిని ఆమెకు తెలిసిందట 2) ఆమె భారతపౌరసత్వం లేకుండానే ఓటరుగా నమోదయిన విషయం గురించి ఉపేంద్ర పార్లమెంటులో ఎత్తితే ఆమె 'నీ అంతం చూస్తా' అని ఉపేంద్రను స్వయంగా బెదిరించారట  3) జైపాల్‌ రెడ్డి బోఫోర్స్‌ విషయంలో రాజీవ్‌ను విమర్శించడం రాజీవ్‌ను బాధించింది 4) విపి సింగ్‌ కూటమి ఏర్పాటుకు టిడిపి చొరవ తీసుకుంది 5) ఒక ఆంధ్ర మహిళా ఎంపీ రాజీవ్‌కు అతిసన్నిహితంగా వుండడం సోనియాను బాధించింది 6) సోనియా లాభదాయక పదవిలో వున్నారని ఎర్రన్నాయుడు ఆరోపించడం చేతనే సోనియా మళ్లీ పోటీ చేయవలసి వచ్చింది, అది ఆమెను కలచివేసింది 7) తను ఆమోదించడం చేత ప్రధాని అయిన పివి తనపట్ల కృతజ్ఞత చూపకపోవడంతో ఆమెలో ద్వేషం పెరిగింది 8) వైయస్సార్‌ను సిఎం చేస్తే ఆయన స్వతంత్రంగా వ్యవహరించడం ఆమెకు వ్యతిరేకత ఏర్పడింది. ఇవన్నీ చెప్పి 'ఆంధ్రులంటే  ఆగ్రహం కాబట్టి రాష్ట్రాన్ని విభజించారు' అని తేల్చారు నరసింహారావుగారు.

ఈయన చెప్పిన విషయాల్లో కాస్త లోతుగా వెళితే - 1) రాజీవ్‌ ప్రధాని అయినపుడు టిడిపి ప్రధాన ప్రతిపక్షంగా వుంది. అందుకే వాళ్లు పార్లమెంటులో ప్రభుత్వాన్ని విమర్శించారు. అంతమాత్రం చేత కోపం తెచ్చుకునేమాటైతే ఆ తర్వాత 1989లో, 2004లో, 2009లో కాంగ్రెసు ప్రభుత్వాలను రాష్ట్రంలో గెలిపించినందుకు సోనియాకు కోపం తగ్గి వుండాలిగా! ముఖ్యంగా 2009 యుపిఏ-2 ఏర్పడ్డానికి 33 మంది తెలుగు ఎంపీలే కారణమని అందరికీ తెలిసినపుడు ఆమెకు మాత్రం తెలియదా? 2) నేను ఉపేంద్రగారి ఆత్మకథ చదివాను. ఈ సంఘటన ఎక్కడా చదివిన గుర్తు లేదు. పైగా మితభాషి అయిన సోనియా హైదరాబాదు ఎయిర్‌పోర్టులో బహిరంగంగా అలా బరస్ట్‌ అవుతుందంటే నమ్మగలమా? ఉపేంద్రపై అంతకోపం వుంటే మరి 1998లో విజయవాడ ఎంపీ స్థానానికి కాంగ్రెసు టిక్కెట్టు ఎందుకు యిచ్చినట్లు? 3) బోఫోర్స్‌ విషయంలో చేసిన వ్యాఖ్యల గురించి  జైపాల్‌ రెడ్డిని సోనియా క్షమించలేకపోతే ఆయన్ను మాత్రం కాంగ్రెసులో ఎందుకు చేర్చుకున్నారు? కేంద్ర కాబినెట్‌లో అతి ముఖ్యమైన శాఖలు ఎందుకు అప్పగించారు? ఇప్పుడు తెలంగాణ విషయంలో ఆయన చెప్పినట్ల్లే ఎందుకు ఆడుతున్నారు?

4) రాజీవ్‌ గాంధీకి అత్యంత ఆత్మీయుడిగా మెలగిన విపి సింగ్‌ బోఫోర్స్‌ విషయంలో రాజీవ్‌తో విభేదించి, అరుణ్‌ నెహ్రూతో కలిసి బయటకు వచ్చి నేషనల్‌ ఫ్రంట్‌లో చేరారు. ఎన్టీయార్‌ ఆ ఫ్రంట్‌కు కన్వీనరుగా వున్నారు. 1989 ఎన్నికలలో టిడిపి ఘోరంగా ఓడిపోయి, పార్లమెంటులో సోదిలోకి లేకుండా పోయింది. సోనియాకు కోపం వుంటే విపి సింగ్‌, అరుణ్‌ నెహ్రూలపై వుండాలి, నరసింహారావుగారి లాజిక్‌ ప్రకారం వారి సొంత రాష్ట్రమైన యుపిపై వుండాలి, మధ్యలో తెలుగువాళ్లపై కోపం ఏమిటి?

5) రాజీవ్‌ గురించిన యీ ఆరోపణ గాని యిలాటి ఆరోపణగాని నేనెన్నడూ వినలేదు. అయినా భర్త ప్రియురాలు ఏ భాష మాట్లాడితే వారందరినీ దూరం చేసుకుంటారా? అలా అయితే పురంధరేశ్వరి, రేణుకా చౌదరి.. వంటి వాళ్లకు ఏ పదవి యివ్వకుండా వుండవచ్చు కదా 6) పార్లమెంటులో ప్రతిపక్షం అన్నాక లక్ష ఆరోపిస్తారు. వాధ్రా గురించి బిజెపి అనడం లేదా? ఎర్రన్నాయుడు ఓ ఆరోపణ చేశారు కదాని తెలుగువాళ్లందరిపై కక్ష కట్టారంటే అంతకంటె జోక్‌ మరొకటి వుండదు 7) పివికి, సోనియాకు మధ్య అనేక రాజకీయాలు నడిచాయి. సోనియాను కట్టడి చేయడానికి పివి  ప్రయత్నాలు చేశారు. చివరకు సోనియా పార్టీపై పట్టు సాధించి పివిపై కసి తీర్చుకున్నారు. పివి తెలుగువాడు కాకుండా మలయాళీ అయినా అదే జరిగి వుండేది. పివి పోయిన 9 ఏళ్లకు యిప్పుడు గుర్తు పెట్టుకుని కక్ష సాధించాలని రాష్ట్రాన్ని విభజించిందంటే నమ్మడం ఎలా? 8) వైయస్సార్‌ సోనియాకు ఆప్తుడు కాడంటే నవ్వు వస్తుంది. రాష్ట్రంలో కనబడిన ప్రతీ రాయిపై రాజీవ్‌ పేరు రాసి శిలాఫలకాలుగా పాతేసిన వైయస్‌ అంటే సోనియాకు కోపమా?

అసలు మనమందరం ఒప్పుకోవాల్సిన పాయింటు ఒకటుంది - తెలుగువాళ్లని విడగొట్టాలన్న ఐడియా కాపీరైటు సోనియాది కాదు. చిన్నారెడ్డి వంటి ఎమ్మెల్యేలది. వాళ్లు ఎప్పుడో లేఖ యిస్తే పక్కన పడేసింది. మన తెలుగువాళ్లలోనే 40% ప్రాంతపు ప్రజాప్రతినిథులు - పార్టీల భేదం లేకుండా - 'మేం సాటి తెలుగువాళ్లతో వేగలేకపోతున్నాం, వాళ్లు దుర్మార్గులు, దుష్టులు, రాక్షససంతతి వారు, మమ్మల్ని దోచుకుంటున్నారు' అని హాహాకారాలు చేసి ఆవిణ్ని బతిమాలారు. గత తొమ్మిదేళ్లగా 'ఇంకా తేల్చలేదేం?' అంటూ ఊదరగొట్టేశారు. వాళ్లను వూరుకోబెట్టడానికి 2004లోనే కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాంలో చేర్చినా, ఏకాభిప్రాయం సాధించాక చేస్తాం, సరైన సమయంలో సరైన నిర్ణయం అంటూ జోకొట్టి జోకొట్టి తొమ్మిదేళ్లపాటు రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచిన ఘనత సోనియాదే. ఇప్పుడు కూడా సమైక్యవాది ఐన నరసింహారావుగారికి సోనియా చేస్తున్నది దుర్మార్గంగా తోచవచ్చు. కానీ తెలంగాణ ప్రజలకు ఆమె దేవతగానే కనబడుతోంది. తెలంగాణ ప్రజలు కూడా తెలుగువారే అని రావుగారు భావిస్తే ఆమెకు తెలుగువారంటే ద్వేషం, ఆగ్రహం అనే మాటలను సవరించుకుని, 'కొందరు తెలుగువారంటే..' అని వ్యాసం రాసుకోవాలి.

అంత మాత్రం ఆలోచన లేకుండా నరసింహారావుగారు యింతటి వితండ వాదన ఎందుకు చేసినట్లు? తన మీద కోపంతో సోనియా తెలుగువాళ్లను విభజిస్తోందని చంద్రబాబు చేస్తున్న చేస్తున్న ప్రచారానికి యీయన సైద్ధాంతిక అంశాలు అద్దబోయారు. రావుగారి పాయింట్లలో చాలా భాగం టిడిపి నాయకులను హీరోలుగా చూపించే ప్రయత్నం ప్రస్ఫుటంగా కనబడుతోంది. గతంలో రావుగారు జగన్‌ మానసిక విశ్లేషణ అంటూ కూడా చేశారు. అది చదివితే జగన్‌ అంటే ఎవరో అండర్‌ వరల్డ్‌ డాన్‌ అనుకుంటాం. ఇప్పుడు సోనియాని పట్టించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఆమె చేసిన నిర్ణయానికి 'తెలుగువాళ్లపై కోపం' అంటూ విపరీత వ్యాఖ్యానం చేసి' దానికి 'ఆమెకు భారతసమాజం గురించి కనీస అవగాహన లేదు' అంటూ మానసిక విశ్లేషణ చేర్చి వ్యాసం రాసేశారు.

'తెలుగువాళ్లను విభజించండి' అని లేఖ యిచ్చి, అంతటితో ఆగకుండా దాన్ని పదేపదే ఉటంకించి, 'ఏం యింకా విడగొట్టరేం? నిర్ణయం తీసుకునే దమ్ము లేదా? చేతకాదా?' అని సోనియాను ఉడికించి, రెచ్చగొట్టి యిప్పుడు కూడా 'విభజిస్తే తప్పు లేదు కానీ కొబ్బరి చిప్పల్లా సమానంగా విడగొట్టాలి' అంటూ పాట పాడుతున్న చంద్రబాబు గారికి తెలుగువాళ్ల మీద ప్రేమో, కోపమో, ద్వేషమో, వారికి భారత సమాజం మాట ఎలా వున్నా తెలుగుసమాజంపై అవగాహన వుందో లేదో కూడా.. అది కూడా త్వరలోనే విశ్లేషణ చేసి చెప్తారని ఎదురు చూస్తున్నాను.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?