cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ప్రత్యేక హోదాకై ఆత్మహత్య - 2

ఎమ్బీయస్‌: ప్రత్యేక హోదాకై ఆత్మహత్య - 2

ఇద్దరు ముఖ్యమంత్రుల్లో కెసియార్‌ కంటె బాబుకి రెండు షోలు ఎక్కువ చూపించే అవకాశం వుంది. అవి - 'ప్రత్యేక హోదా', 'కొత్త రాజధాని'. ప్రత్యేక హోదా షో ఎన్నికల టైములో బాగా క్లిక్‌ అయింది. హోదా వస్తే 90% గ్రాంట్‌, ఎక్సయిజ్‌లో రాయితీ వగైరా లాభాలెన్నో ఏకరువు పెట్టారు. అది వస్తే ఇక పట్టపగ్గాలు లేకుండా, పిచ్చిపిచ్చిగా, విచ్చలవిడిగా ఆంధ్ర డెవలప్‌ అయిపోతుందని, కాంగ్రెసు ఐదు సంవత్సరాలు హోదా యిస్తానంది కానీ మేం పది సంవత్సరాలు, ఆట్టే మాట్లాడితే పదిహేను సంవత్సరాలు కొనసాగిస్తామని బిజెపి-టిడిపి ఉపన్యాసాలు దంచడమే కాదు, పుస్తకాలు వేసి పంచారు. హోదా విషయంలో చేసిన కృషికై వెంకయ్యనాయుడిగారికి సన్మానం జరిగినట్లు కూడా గుర్తు. అప్పుడే సందేహజీవులు అనుమానాలు వెలిబుచ్చారు - 'చట్టప్రకారం ఆ హోదాకు కావలసిన అర్హతలు ఆంధ్రకు లేనట్టున్నాయి' అని. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? మొండివాడు మోదీ తలచుకుంటే హోదాకు కొఱవా?' అని వారి నోరు మూయించారు. అభ్యంతరాలు పెట్టడానికి ప్లానింగ్‌ కమిషన్‌ ఎవరు, బోడి, తీర్మానం చేస్తే చాలు, ఉత్తరాఖండ్‌కు అలాగే యిచ్చారు అని కొట్టి పారేశారు. ఆంధ్రులు నమ్మారు. ప్రత్యేక హోదా కారణంగా పారిశ్రామికవేత్తలు యిబ్బడిముబ్బడిగా వచ్చి పెట్టుబడులు పెట్టేస్తారు అనుకున్నారు. తెలంగాణ నుంచి కూడా వచ్చేస్తారు, దెబ్బకు తెలంగాణకు తిక్క కుదురుతుంది, హైదరాబాదు వుంచేసుకున్నందుకు ఆ మాత్రం శాస్తి జరగాలిలే అని లోలోపల అనుకుని వుంటారు. అప్పుడు ఆశ ఎంత తీవ్రంగా వుందో యీ రోజు ఆశాభంగం కూడా అంతే తీవ్రంగా వుందని మనం గ్రహించాలి. కానీ టిడిపి మాత్రం గ్రహించటం లేదు. అధికారం చేజిక్కాక తాము స్వరం మార్చాం కాబట్టి ప్రజలు కూడా దానికి తగ్గట్టే తలలూపాలని అనుకుంటున్నారు.

గతంలో రెండు రూపాయలకు కిలో బియ్యం, మద్యనిషేధం వంటి విషయాల్లో బాబు ఎన్నికలలో ఒక రకమైన హామీలు యిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని నీరుకార్చారు. చెల్లిపోయింది. ఇప్పుడు మాత్రం ఎందుకు చెల్లదు అని బాబు ధీమా. 'ప్రత్యేక హోదా వస్తే మంచిదే కానీ, అదేమీ గొప్ప విషయం కాదు' అనే పల్లవి ఆర్నెల్లగా అందుకున్నారు. 'హోదా కావాలా? నిధులు కావాలా?' అని గద్దించడం మొదలుపెట్టారు. ఇదేం ప్రశ్న? విస్తరీ కావాలి, దానిలోకి అన్నమూ కావాలి. అన్నీ పోగొట్టుకున్న రాష్ట్రం ఆంధ్ర. పోయినవి ఎలాగూ పోయేయి. ఇస్తానన్నవి కూడా యివ్వకపోతే ఎలా? హోదా వస్తే పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయి. నిధులు వస్తే ప్రభుత్వానికి వస్తాయి, జీతాలు యిచ్చుకోవచ్చు, పండగకు పప్పుబెల్లాలు పంచుకోవచ్చు. ప్రభుత్వమూ బతకాలి, పెట్టుబడిదారుడూ బతకాలి అంటే రెండూ కావాలి. హోదా మాత్రమే కావాలి, నిధులు అక్కర్లేదు, ఉత్తరాంధ్రకు, రాయలసీమకు వాగ్దానం చేసిన ప్యాకేజీలు వద్దు అని ఎవరూ చెప్పలేదు. హోదాలో పెద్ద ఏం లేదు అని చంద్రబాబు అంటూనే వుంటారు. ఇంకో పక్క ఆయన పార్టీ ఎంపీ రామ్మోహన నాయుడు పార్లమెంటులో హోదా ఎంత అత్యావశ్యకమో లెక్చరు దంచారు.  ఢిల్లీ కోటలో పాగా వేసిన కంభంపాటి రామ్మోహనరావు గారు 'దాని గురించి మా ప్రయత్నాలు ఆగలేదు, యిప్పటిదాకా ఏం జరగలేదు అని అనడమూ సరికాదు, ఎప్పటికైనా వస్తుందని నాకు ప్రగాఢ విశ్వాసం' అని సౌమ్యంగానే, చిరునవ్వు చెదరకుండానే చెప్తూనే వుంటారు. సుజనా చౌదరి మరింత ధైర్యంగా వచ్చేస్తోంది అంటూ వుంటారు. టిడిపిలో యిలాటి భిన్నస్వరాలుంటే దానికి అనుబంధ సభ్యుడిగా వున్న వెంకయ్యనాయుడుగారు ఏ పూటకి ఏం మాట్లాడతారో తెలియదు.  ఓసారి హోదా తథ్యం అంటారు, యింకోసారి రాదంటారు, మూడో రోజు పరిశీలనలో వుందంటారు. ఇలాటి గందరగోళం వలననే ఆ హోదా ఏదో రాకపోతే చచ్చిపోతామనే భయం నిరుద్యోగులకు, యువతకు పట్టింది. అప్పుడు చచ్చేబదులు యిప్పుడే చస్తే మేలు కదా అనుకున్నాడు మునికోటి. 

ఇప్పటిదాకా ప్రత్యేక హోదా గురించి ఏమీ సాధించలేకపోయారని టిడిపి, బిజెపి నాయకులను ఎద్దేవా చేసినప్పుడల్లా వాళ్లు 'చట్టంలో లేకపోబట్టే యిన్ని చిక్కులు వస్తున్నాయి. లేకపోతే ఎప్పుడో వచ్చేసేది, ఇది కాంగ్రెసువారు చేసిన తప్పిదం. ఇప్పుడు మమ్మల్ని అడగడానికి వారికి నైతికాధికారం లేదు' అంటున్నారు. విభజన చట్టం సవ్యంగా వుండి వుంటే..., హైదరాబాదును యుటీ చేసి వుంటే.., ఆంధ్రకు అన్నీ కట్టబెట్టి వుంటే... అసలు కాంగ్రెసు ఎందుకు ఓడిపోయేది? మీకు ఓట్లెవరు వేసేవారు? 'ఆయనే వుంటే..' అనే సామెతలా వుంది మీరు చెప్పేది. వాళ్లు విభజన సరిగ్గా చేయలేదు కాబట్టే వాళ్లకు తిరుక్షవరం చేసి మీకు ఓట్లు కురిపించారు. వాళ్లు ఏ మాత్రం సజావుగా చేసి వున్నా ఓట్లు మూడు పార్టీల మధ్య చీలిపోయి వుండేవి. మీరు అధికారంలోకి వచ్చేవారో లేదో తెలియదు. అయినా అలాటి అసమగ్ర, అన్యాయపు బిల్లుకు బిజెపి ఎందుకు మద్దతు యిచ్చి గెలిపించింది? టిడిపి టి-విభాగం ఎందుకు మద్దతిచ్చింది? కాంగ్రెసు వాళ్లు చేసిన అనేక చట్టాలను మోదీ తిరగతోడుతున్నారు, అనేక వ్యవస్థలను కూలదోస్తున్నారు, అనేక వ్యవస్థల్లో వ్యక్తులను మారుస్తున్నారు. తలచుకుంటే ఈ చట్టంలో లొసుగును సవరించలేరా?

ఎన్నో ఆర్డినెన్సులు యిస్తున్నారు. ఇదొకటి యివ్వలేరా? అంత అశక్తుడా? చేతకానివాడైతే చెప్పేస్తే పోయె కదా! ఇష్టం లేకపోతే ఆ ముక్కయినా చెప్పాలి. తిరుపతి ఎన్నికల సభ తర్వాత 'తూర్పు తిరిగి దణ్ణం పెట్టమన్న మోదీ' అనే వ్యాసంలో 'కెసియార్‌ ఆరోపించినట్టు హైదరాబాదును యూటీ చేస్తామని మోదీ చెప్తారా లేదా అని చూశా. ఢిల్లీని తలదన్నే నగరం కట్టండి, నేను నిధులిస్తాను అనే హామీ తప్ప మోదీగారు చెప్పినదేమిటి? 'ప్రపంచమంతా తూర్పువైపు చూస్తోంది.

మీరూ చూడండి. సముద్రం కనబడుతుంది. పశ్చిమాన సముద్రతీరం వున్న గుజరాత్‌ కంటె తూర్పున సముద్రతీరం వున్న మీకు అవకాశాలు అధికంగా వుంటాయి. ఏం దిగులు పడకండి. కష్టపడడం మీకు ఎలాగూ అలవాటే. పడండి. పడుతూనే వుండండి, మరింత అలవాటు పడతారు. పెట్రోలు, గ్యాస్‌ వంటి సహజవనరులు మీకున్నాయి అని చెప్పారు.... ఇక మోదీ సీమాంధ్రులకు యిచ్చిన వరాల మాట ఏమిటంటారా? ఆయనే చివర్లో అందరి చేతా అనిపించారు - గోవిందా గోవింద అని! అదే ఆయన మనకిచ్చిన సందేశం!' అని రాశాను. ఆ రోజు నా మీద విరుచుకు పడిన వారిలో సగం మందికైనా యీ పాటికి ఆవేశం చల్లారి వుంటుంది. 'బాబు, మోదీ, పవన్‌ ముగ్గురూ కలిస్తే  పంగనామాలు' అని కెసియార్‌ అంటే అదే మీటింగులో పవన్‌ మంచి రిటార్టు యిచ్చారు - మూడు ఒకట్లు చూస్తే తనకు తిరుపతి వెంకన్న గుర్తుకు వస్తాడని. తిరుపతి గుర్తుకు రాగానే తిరుక్షవరం గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఆంధ్రకు అదే జరిగిందన్న వ్యథతో ఆ వెంకన్న సాక్షిగానే యిప్పుడు మునికోటి ఆత్మహత్య చేసుకున్నాడు. (సశేషం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2015)

[email protected]

Click Here For Archives

మహేష్ ఙోకులు మామూలుగా వుండవు

టార్గెట్ 175.. కొడతారా? లేదా?