Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ కథలు - జిల్‌.. జిల్‌.. పజిల్‌

ఆంధ్రతేజం, దినపత్రిక ఆఫీస్‌ మెమో:

మిస్‌ మేనక (ఎడిటర్‌) నుండి

శ్రీ సూర్యనారాయణ (ఎకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌) గార్కి   తారీకు : జనవరి 2

సూర్యనారాయణ గార్కి, 

మన పత్రికలో 'గడి లో సుడి' అనే క్రాస్‌వర్డ్‌ పజిల్‌ శీర్షిక మొదలుపెడుతున్నామని మీకు ఇదివరకే చెప్పాను కదా. శీర్షిక నిర్వహించే ఆసక్తి ఉన్నవారు అప్లయి చేయవచ్చని పత్రికలో ప్రకటన ఇవ్వడం జరిగింది. వచ్చిన అప్లికేషన్స్‌ నుండి ఇద్దరిని సెలక్ట్‌ చేయడం జరిగింది. ఒకరు తిరుపతిలో ఉండే చంద్రమోహనరావు అనే సీరియస్‌, సీనియర్‌ రచయిత. ఇంకొకరు విజయవాడలో ఉండే రవికాంత్‌ అనే సరదా రచనలు చేసే యువ రచయిత. 

రకరకాల పాఠకులు ఉంటారు కాబట్టి వెరైటీ కోసం ఈ ఇద్దరు వేర్వేరు తరహా రచయితల చేత ఆ శీర్షిక నడిపిస్తే బాగుంటుందనిపించింది. ఆదివారంనాడు ఆ కాలమ్‌ ఎలాగూ ఉండదు కాబట్టి సోమ, బుధ, శుక్ర వారాలలో చంద్రమోహనరావు చేత మంగళ, గురు, శని వారాల్లో రవికాంత్‌ చేత చేయిద్దామని నా ప్లాను. అచ్చులో ఇద్దరిపేర్లూ కనబడవనీ, 'నిర్వహణ: తేజ' అనే వేస్తామని, రెండువారాలు ముందుగానే మేటర్‌ పంపించాలని, పజిల్‌ ఒక్కింటికి రూ|| 250/- ఇస్తామనీ ఇద్దరికీ తెలియబరచటం జరిగింది. 

చంద్రమోహనరావు గారు ఉత్తరం ద్వారా తమ ఆమోదాన్ని తెలిపారు. ఏదో పనిమీద విజయవాడ నుంచి వచ్చిన రవికాంత్‌ నిన్న మన ఆఫీసులో నన్ను కలిసి పజిల్‌ గురించి నాతో చర్చించారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కాబట్టి సంక్రాంతి నుండి ఆ శీర్షిక మొదలుపెడుతున్నాము. రచయితల అడ్రసులు రాసిన కాగితం జతపరుస్తున్నాను. ప్రచురణ అయిన వారాంతానికే సొమ్ము పంపిస్తానని హామీ ఇచ్చి ఉన్నాను. మీరు మీ స్టాఫ్‌కి ఈ విషయంతో తగు సూచనలు ఇవ్వగోర్తాను - మేనక

***********

లలిత, సెక్రటరీ టు ఎడిటర్‌, ఆంధ్రతేజం - మార్చి 3

మేనక, ఎడిటర్‌ గార్కి -  'గడిలో సుడి' శీర్షిక గురించి ఒక ఉత్తరం వచ్చింది. దానికి సంబంధించి పాఠకుల నుండి వచ్చిన ఉత్తరాల సంగతి తక్కిన స్టాఫ్‌ చూసుకుంటున్నారు కాబట్టి మీరు ఆ శీర్షికపై దృష్టి పెట్టలేదని తెలుసు. కానీ మార్చి 2న వచ్చిన ఉత్తరం మాత్రం ప్రత్యేకంగా చూడమంటూ సబ్‌-ఎడిటర్‌ మీకు పంపారు. లోకల్‌ లెటరే. రాసినది అమ్మాయి పేరూ, మీ పేరూ ఒక్కటే. మీది చాలా అరుదైన పేరు కాబట్టి ఆ పేరున్నవాళ్లు రాసిన ఉత్తరం అని కాకుండా, ఆమె రాసిన విషయం మీ దృష్టికి తేవాలని సబ్‌ ఎడిటర్‌ మీకు పంపారు. జతపరచాను. - లలిత

 

మేనక, స్టెనో, వైభవ్‌ ఇంజనీరింగు కంపెనీ - మార్చి 1

ఎడిటర్‌ గార్కి, నమస్తే. సంక్రాంతి నుండి మీరు ప్రారంభించిన 'గడి లో సుడి' శీర్షిక చాలా ఆసక్తికరంగా సాగుతోంది. కానీ పజిల్‌ శీర్షికే ఒక పజిల్‌లా ఉందని అనిపిస్తోంది నాకు అప్పుడప్పుడు. తేజ గారు సోమ, బుధ, శుక్ర వారాల్లో ఇచ్చే పజిల్‌ చాలా ఇంట్రస్టింగుగా, ఒక్కోప్పుడు ఫన్నీగా కూడా ఇస్తారు. కానీ మంగళ, గురు, శని వారాల్లో మాత్రం మహా బోరుగా, అయోమయంగా ఇస్తారు. మా ఆఫీసులో స్టాఫందరమూ ఈ పజిల్‌ చేస్తూంటాము. బొత్తిగా తెలివితేటలు లేని వాళ్లమేమీ కాదు. నాకు ప్రత్యేకంగా దీంట్లో చాలా ఏళ్ల అనుభవం ఉంది. అయినా ఆయన ఇచ్చిన క్లూ తట్టదు. తేజ గారు ఒక్కోరోజు ఒక్కోలా ఎందుకు రాస్తారో తెలియదు. అసలు 'తేజ ఒకళ్లు కాదు, ఇద్దరు' అని అంటూంది మా కొలీగ్‌ ఒకామె. నిజమేనా? అయితే మంగళ, గురు, శని వారాల్లో రాసే ఆయన్ని తక్షణం తీసిపారేయండి. సోమవారం ఆయన్నే వారమంతా రాయమనండి - ఇట్లు మేనక.

తా.క. మీ ఆదివారం ప్రత్యేక సంచికలో వచ్చే 'వంటా-వార్పూ' కాలమ్‌ చాలా బాగుంటుంది. అది చూసి నేను తయారు చేసి పట్టుకొచ్చినది మా ఆఫీసులో అందరికీ బాగా నచ్చుతుంది.

***********

మేనక, ఎడిటర్‌, ఆంధ్రతేజం - మార్చి 6

కుమారి మేనక, వైభవ్‌ ఇంజనీరింగు కంపెనీ గార్కి

మేనక గార్కి, నమస్తే. మీ ఉత్తరానికి ధన్యవాదాలు. కొన్ని రోజుల్లో పజిల్‌ కఠినంగా ఉంటోందని మీరు రాసారు. రకరకాల పాఠకులను దృష్టిలో పెట్టుకుని ఆ శీర్షిక తయారు చేయబడిందని గుర్తించగోర్తాను. 'అయోమయం'గా ఉందని మీకనిపించిన వాటినే ఛాలెంజ్‌గా తీసుకుని గడులు పూరించేవారుంటారని గ్రహించగోర్తాను. 'వంటా-వార్పూ' గురించిన మీ అభినందనలను ఆ శీర్షిక  చూసే సబ్‌-ఎడిటర్‌కు అందజేసాను - మేనక

 

మేనక, వైభవ్‌ ఇంజనీరింగు కంపెనీ - మార్చి 9

ఎడిటర్‌ మేనక గార్కి, మీ ఉత్తరం చేరింది. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదనుకుంటాను. మాకు పజిల్‌ నచ్చనిది 'కొన్ని రోజుల్లో' కాదు. మంగళ, గురు, శని వారాల్లో మాత్రమే. ఇంతకీ తేజ ఒక్కరా? ఇద్దరా? - మేనక

***********

లలిత, సెక్రటరీ టు ఎడిటర్‌, ఆంధ్రతేజం - మార్చి 11

మేనక, వైభవ్‌ ఇంజనీరింగు కంపెనీ గార్కి - నమస్తే. ఎడిటర్‌ మేనక గార్కి మీ ఉత్తరం చేరింది. కలంపేరుతో రాసే రచయితల పేర్లు వెల్లడించడం మా పత్రిక పాలసీ కాదని మీకు తెలియబరచమన్నారు - లలిత

***********

 

మేనక, వైభవ్‌ ఇంజనీరింగు కంపెనీ - మార్చి 12

లలిత, సెక్రటరీ టు ఎడిటర్‌, ఆంధ్రతేజం గార్కి,

'తేజ' ఇద్దరు అని మీ ఉత్తరం బట్టే తెలిసిపోయింది! ఒక్కరే అయివుంటే ఆ విషయం గట్టిగా రాసి వుండేవారు. అయినా మీరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నవారం పేపర్లే చూడండి. సోమవారం నాడు 8 అడ్డం 'ఆడవాళ్ల బ్రెస్ట్‌ ఫ్రెండ్‌' (ఆన్సర్‌: బ్రా) అని భలే సరదాగా క్లూ ఇచ్చారు. మా ఆఫీసులో వాళ్లందరూ ఆ పద చమత్కారానికి పడిపడి నవ్వుకున్నాము. అదే మంగళవారం 8 అడ్డం చూడండి - అన్నమయ్య కీర్తనలో అలివేలు మంగ చేసే పని (ఆన్సర్‌: బెంగళించు) బెంగళించు ఏమిటండి? అసలా మాట వాడుకలో ఉందా? అన్నమయ్య వేలాది పాటలు రాస్తే అన్నీ మేం కంఠతా పట్టాలా? అసలా క్లూ ఇచ్చినవాళ్ల ఉద్దేశ్యం ఏమిటని? అందుకే ఇద్దరు వేర్వేరు తరహా మనుషులు రాస్తున్నారని మేమందరం అనుకుంటున్నాము.

మా వైభవ్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ స్టాఫంతా నాతో ఏకీభవిస్తున్నారు. అందరం వెళ్లి మేనేజరుకి చెప్పాము - మంగళ, గురు, శని వారాల్లో మీ పేపరు కాకుండా 'ఆంధ్రప్రజ' పేపరు వేయించమని. వాళ్ల క్రాస్‌వర్డ్‌ పజిల్‌ అంత గొప్పగా ఉండదు కానీ మీ మంగళవారం ఆయన కంటే లక్ష రెట్లు మెరుగు.    -  మేనక

***********

మేనక, ఎడిటర్‌  - మార్చి 14

ఆంధ్రతేజం మార్కెటింగ్‌ మేనేజర్‌ గార్కి - వైభవ్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ వాళ్లు వారంలో మూడు రోజులు మన పేపరు మాన్పించేసి 'ఆంధ్రప్రజ' కొనబోతున్నారని తెలిసింది. నిజానిజాలు తెలుసుకోగోర్తాను - మేనక

***********

సుబ్రమణ్యన్‌, మార్కెటింగ్‌ మేనేజర్‌, ఆంధ్రతేజం - మార్చి 14

మేనక, ఎడిటర్‌ గార్కి - మీకు వచ్చిన సమాచారం కరెక్టే. ఆంధ్రప్రజ మార్కెటింగ్‌ మేనేజరును నిన్న ఒక కాన్ఫరెన్స్‌లో కలవడం జరిగింది. 'మీ పత్రిక చందాదార్లు మాది కొనడం మొదలెట్టారు తెలుసా?' అంటూ పోజు కొట్టాడు. అడగ్గా, అడగ్గా వైభవ్‌ ఇంజనీరింగు కంపెనీ నుండి వాళ్ల చందారేట్ల గురించి వాకబు చేసారని చెప్పాడు. ఒక చందాదారు తగ్గితే మీకు చెప్పేదేముందిలే అని ఊరుకున్నాను. - సుబ్రమణియన్‌

***********

రవికాంత్‌,  విజయవాడ -  మార్చి 14

మేనక, ఎడిటర్‌ గార్కి - మీ పత్రికలో నా పజిల్‌ ప్రచురణ జరగగానే పారితోషికం పంపుతున్నారు. నేను మేటర్‌ పంపించగానే డబ్బు పంపే ఏర్పాట్లు చేయించగలరా? నేను రాస్తున్న నవల పూర్తి కాలేదు. పబ్లిషరు ఇస్తానన్న అడ్వాన్స్‌ పంపలేదు - రవికాంత్‌

***********

మేనక, ఎడిటర్‌ - మార్చి 17

రవికాంత్‌ గార్కి - ఓ చేత్తో పజిల్‌ తయారు చేస్తూ మరో చేత్తో నవల రాద్దామనుకుంటే అది మీ తలకాయనొప్పి.  మీరు ఇక్కడకు వచ్చినప్పుడు కూడా చెప్పాము - ప్రచురణ జరిగేకనే పేమెంటు జరుగుతుందని. ఈవాళ మీ అవసరాల గురించి పద్ధతి మారదు.

ఇది పక్కనబెడితే మీరు పంపుతున్న పజిల్స్‌ తమాషాగా, సరదాగా ఉంటున్నాయి. ఆడవాళ్ల బ్రెస్ట్‌ ఫ్రెండ్‌ గురించి మీరు రాసినది చదివి నాకు నవ్వు వచ్చింది. పాఠకులొకరు దాని గురించి రాసారు  కూడా.- మేనక

***********

మేనక, ఎడిటర్‌ - మార్చి 17

చంద్రమోహన్‌ గార్కి - నమస్తే. మీరు పంపుతున్న పజిల్స్‌ నేను పరిశీలిస్తున్నాను. మంగళ, గురు, శని వారాల్లో 'గడి లో సుడి' గురించి కొందరు పాఠకులు ఫిర్యాదు చేసారు కూడా. మీరిచ్చే క్లూలు కొన్ని అయోమయంగా ఉంటున్నాయి. ఉదాహరణకి మొన్న మంగళవారం మీరిచ్చిన 'బెంగళించు' అనే మాట ఎక్కడా వాడుకలో లేనిది. సోమ, బుధ, శుక్ర వారాల్లో వస్తున్న పజిల్స్‌ చూడగోర్తాను. నేను పాఠకులకు అందిద్దామనుకున్నదానికి అనుగుణంగా ఉందది. మీరు కూడా ఇకపై ఆ ప్రకారం రాస్తారని ఆశిస్తాను.    - మేనక.

***********

రవికాంత్‌ - మార్చి 19

మేనక, ఎడిటర్‌ గార్కి - మీరు పజిల్స్‌ చూస్తారని తెలిసి ఆశ్చర్యపడ్డాను. మీకంత తీరిక ఉంటుందా? క్లూల ద్వారా నేను వేసే జోక్స్‌ మీకు నచ్చుతున్నందుకు థాంక్స్‌. నా అభిమాని ఎవరో ఉత్తరం రాసారన్నారు. అది నాకు పంపితే చాలా ఉత్సాహకరంగా ఉంటుంది. నా నవల పూర్తి కాలేదు. పబ్లిషరు డబ్బూ పంపలేదు. - రవికాంత్‌

తా.క : నా పజిల్స్‌ నచ్చాయంటున్నారు కదా, నా పారితోషికం పెంచడం ద్వారా నన్ను ప్రోత్సహించవచ్చు కదా?

***********

మేనక, ఎడిటర్‌ - మార్చి 22

రవికాంత్‌ గారికి - సారీ, పారితోషికం పెంచడం అసంభవం. ఇప్పటికే అనుకున్నదానికంటే పజిల్‌ ఖర్చులు పెరిగాయి. ఇక ఉత్తరం మీకు పంపడం గురించి - అది రాసినది మీ అభిమాని కాదు. మా పత్రికలో ఏమేమి తనకు నచ్చుతాయో రాస్తూన్న పాఠకురాలు. సోమ, బుధ, శుక్రవారం పజిల్స్‌ నచ్చుతాయని రాసింది అంతే! - మేనక

***********

రవికాంత్‌ - మార్చి 25

మేనక, ఎడిటర్‌ గార్కి - అయితే నా అభిమాని ఒక అమ్మాయి అన్నమాట. నా గురించి మెచ్చుకున్నందుకు కృతజ్ఞతలు చెబుతూ నేను ఆమెకు ఉత్తరం రాస్తే అది మీరామెకు పంపుతారా? నా నవల పూర్తి కాలేదు, పబ్లిషరు డబ్బు రాలేదు. కరెంటు బిల్లు కట్టేందుకు డబ్బు లేదు. ఇలాటి పరిస్థితుల్లో ఒక అందమైన, చక్కని అభిరుచి గల అమ్మాయి నుండి ఉత్తరం వస్తే అది ఎంత ఉత్తేజకరంగా ఉంటుందో ఊహించండి. - రవికాంత్‌

***********

చంద్రమోహనరావు, తిరుపతి - మార్చి 22

మేనక, ఎడిటర్‌ గారికి - నేను సెమినార్‌ నుండి తిరిగివచ్చేసరికి మీ ఉత్తరం పడి ఉంది. పజిల్స్‌ రాయడం నేను వేరే వారి దగ్గర నేర్చుకోవడమేమిటి? నాన్సెన్స్‌! 'బెంగళించు' అనే సాధారణమైన మాట కూడా తెలియని పాఠకులు మీకు రాయడం, అది పట్టుకుని మీరు నన్ను సోమవారం రాసే ఆయన దగ్గర శిష్యరికం చేయమనడం ఆశ్చర్యంగా ఉంది. నేనూ ఆయన పజిల్స్‌ చూస్తున్నాను. ఆడవాళ్ల బ్రెస్ట్‌ ఫ్రెండు అంటూ అశ్లీలమైన క్లూలు ఇస్తున్నాడాయన. ఆయన గురించి మిమ్మల్ని నేను హెచ్చరిద్దామనుకున్నాను. ఇంతలోనే మీ ఉత్తరం! ఇలా అయితే మన ఒప్పందం సాగడం కష్టం. రద్దు చేసుకుంటే మంచిది - చంద్రమోహనరావు

***********

మేనక, ఎడిటర్‌ - మార్చి 25

చంద్రమోహనరావు గారికి - మన మధ్య ఉన్నది మామూలు ఒప్పందం కాదనీ, లీగల్‌ అగ్రిమెంటని గుర్తుంచుకోగోర్తాను. మీకు ఇష్టం లేకపోయినా మీ చేత రాయించే ఉబలాటం నాకు లేదు. మీ స్థానంలో వేరొకరు దొరికేదాకా మీరు యథాప్రకారం పంపిస్తూనే ఉండండి. పంపించాలి కూడా. మీరిచ్చే క్లూలు సామాన్య పాఠకులకు అర్థం కావని మాకనిపిస్తే మార్చే అధికారం మాకు ఉందని మీరు గుర్తుంచుకుంటే మంచిది. - మేనక

***********

మేనక, ఎడిటర్‌ - మార్చి 25

రవికాంత్‌ గారికి - మీ నవల పూర్తికాకపోవడం, కరెంటు కట్‌ అయ్యే ప్రమాదం తొలగకపోవడం అనే కారణాల వల్ల మీరు పజిల్స్‌ కోసం ఎక్కువ టైము కేటాయిస్తారని ఆశిస్తాను. మంగళ, గురు, శని వారాల్లో పజిల్‌ తయారు చేసే ఆయన సరిగ్గా రాయడం లేదని ఫిర్యాదులు వచ్చాయి. అందువల్ల ఆ పని కూడా మీకు అప్పజెప్పుతున్నాము. అవి కూడా సకాలంలో అందిస్తారని ఆశిస్తున్నాను. ఇది తాత్కాలికమైన ఏర్పాటు మాత్రమేనని గ్రహించగోర్తాను. చాలా తక్కువ వ్యవధిలో అడుగుతున్నాను కాబట్టి, ఆ మూడు రోజుల పజిల్స్‌కి మాత్రం రూ|| 300.00ల చొప్పున చెల్లించేట్లా మా మేనేజిమెంటు వారిని ఒప్పించాను. ఇక మీ 'అభిమాని' ఉత్తరం గురించి - అది మీకు పంపడం జరగదు. ఆమె అందమైనదీ, చక్కటి అభిరుచి గలదీ అవునో కాదో గానీ పేరు మాత్రం మేనక. అవును, నా పేరే.     - మేనక.

***********

రవికాంత్‌

చాలా థాంక్స్‌. మంగళవారం ఆయన పజిల్స్‌ నాకూ నచ్చలేదు. కానీ సాటి రచయితను కించపరచడం ఇష్టం లేక నేనిన్నాళ్లూ ఊరుకున్నాను. మీ ప్రతిపాదన నాకు సమ్మతమే. మేనక  చాలా అందమైన పేరు.- రవికాంత్‌

***********

మేనక, వైభవ్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ - ఏప్రిల్‌ 26

మేనక, ఎడిటర్‌ గారికి - వారంలో సగంరోజులు మీ పత్రిక ఆపేస్తామంటూ నేను ఇదివరలో ఉత్తరం రాసాను కానీ మీ 'వంటా-వార్పూ' శీర్షిక కోసం ఆ పని చేయలేదు. ఇంతలోనే మీ పత్రికలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఆరురోజుల పజిల్సూ బాగుంటున్నాయి. మా ఆఫీసులో కూడా అందరూ అదే మాట! ఇవాళ్టి పజిల్‌లో 9 నిలువు చూసారా? 'అప్సరసలో గాంధీగారు తాగే పాలు' అనే క్లూ ఇచ్చారు. జవాబు అందరికీ తట్టింది - 'మేనక'. నా పేరే! మా ఆఫీసులో కూడా అందరూ అదే అన్నారు. భలే చిత్రంగా ఉంది. తేజ గారి పేర నేనొక ఉత్తరం రాసి జతపరుస్తున్నాను. అది వారికి అందజేయగోర్తాను. తేజగారిలో వచ్చిన మార్పుకి మేమందరమూ హర్షిస్తున్నామని తెలుపగోరుతాము - మేనక

***********

మేనక, ఎడిటర్‌ - ఏప్రిల్‌ 30

రవికాంత్‌ గారికి - మేనక అనే పాఠకురాలి వద్ద నుండి వచ్చిన ఉత్తరం మీకు పంపుతున్నాను. క్రితంసారి నేను ఆమె పేరు తెలియబరచడం వల్ల మీరు తెలివిగా ఆమె పేరును క్లూగా ఇచ్చేరని అర్థమయింది. మళ్లీ ఇంకోసారి మేనక పేరు జవాబుగా (అందునా గాంధీ గారి పేరు ఉపయోగిస్తూ అశ్లీలంగా క్లూ ఇస్తే) వస్తే మన ఒప్పందం రద్దవుతుందని గ్రహించగోర్తాను.    - మేనక

***********

 - కాన్ఫిడెన్షియల్‌    

లెఫ్టినెంట్‌ కల్నల్‌ గజపతి నాయుడు - జూన్‌ 2

మేనక, ఎడిటర్‌ గారికి - నేను ఇందుమూలముగా మిమ్మల్ని హెచ్చరించేదేమంటే దేశవ్యతిరేక కార్యకలాపాలకు వేదికగా మీ పత్రికను ఉపయోగించుకోవడం జరుగుతోంది. మీ పజిల్స్‌ ద్వారా ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జరుగుతున్నట్టు తోస్తోంది. నేను గత రెండేళ్లగా మీ 'గడి లో సుడి' చేస్తూ ఉంటాను. గత నెల్లాళ్లగా జవాబులను పరికించి చూడగా 'నేనంటే ఇష్టమేగా?' 'ఇంకా తెలియలేదా?' 'సాయంత్రం కలుద్దాం' 'బిగికౌగిలి' 'ఫ్రెంచ్‌ కిస్‌' 'మేనక మేనుకై తపన' ఇలా జవాబులు వస్తున్నాయి. ఇద్దరు దేశద్రోహులు ఏదో కోడ్‌లో సంకేతాలు పంపుకుంటున్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది. నేను ఈ విషయమై హోమ్‌ సెక్రటరీకి రాశాను. మీ హితైషిని కాబట్టి ముందుగానే మీకు తెలియబరుస్తున్నాను. లాయర్ని సంప్రదించి పెట్టుకోండి. మీరు కూడా కటకటాల వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది - గ.నాయుడు

***********

మేనక, ఎడిటర్‌ - జూన్‌ 3

లలిత, సెక్రటరీకి - ఈ నాయుడు గారి ఉత్తరం చెత్తబుట్టలో పారేయి. ఇంతకుముందు ఈయనకి మనం ప్రచురించిన చేగోడీల బొమ్మల్లో అణుబాంబు డిజైన్‌ కనబడింది. పెద్దగోల చేసాడు. అప్పటి అనుభవంతో పోలీసులు ఈయన మాటలు పట్టించుకోరు. కానీ రవితేజ పజిల్స్‌ ద్వారా మేనకకు ప్రేమసందేశాలు పంపుతున్నాడని స్పష్టమయింది నాకు. ఈ నాయుడి గారి ఉత్తరం వచ్చాక పాత సంచికలన్నీ చదివి చూశానులే. నువ్వొకసారి శ్రమ అనుకోకుండా వైభవ్‌ ఇంజనీరింగు కంపెనీకి వెళ్లి అక్కడ మేనకను స్వయంగా కలిసి వచ్చి ఆమె ఎలా ఉందో చెప్పగోర్తాను. జస్ట్‌ క్యూరియాసిటీ! అంతే! రవికాంత్‌ను నేను స్వయంగా చూసాను. మనిషి బాగుంటాడు. ఈ మేనక ఎలా ఉంటుందో చూద్దాం.- మేనక

***********

మేనక, ఎడిటర్‌ - జూన్‌ 5

ఆంధ్రతేజం తిరుపతి ఆఫీసు మేనేజరు గార్కి - నమస్తే. రవికాంత్‌ అనే ఆయన మన పత్రికలో పజిల్స్‌ రాస్తూంటారు. ఈ ఊళ్లోని వైభవ్‌ ఇంజనీరింగు కంపెనీలో పనిచేసే మేనకను ఆకర్షించడానికి ఆయన పజిల్స్‌ను ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణపై విచారణ జరిపించగా అసలా కంపెనీలో మేనక అనే అమ్మాయే లేదని తెలిసింది. ఇదంతా రవికాంత్‌ ప్లానులా ఉంది. తిరుపతిలో చంద్రమోహనరావు గారు అనే రచయిత ఉన్నారా? లేక రవికాంతే ఆ పేరుతో సీరియస్‌ రచనలు చేస్తున్నారా? అనే విషయం విచారించి వెంటనే తెలియబరచగోర్తాను.- మేనక

***********

మేనక, ఎడిటర్‌ - జూన్‌ 10

రవికాంత్‌ గార్కి - మీ తెలివికి జోహార్లు. బహుముఖప్రజ్ఞాశాలురైన మీరు చంద్రమోహనరావు పేరుతో సీరియస్‌ రచనలు, రవికాంత్‌ పేరుతో సరదా రచనలు చేస్తున్నారని తెలిసిపోయింది నాకు. రెండు అప్లికేషన్లు పెట్టి, ఒకరిపై ఒకర్ని పోటీగా పెట్టి చివరికి మీ పారితోషికం పెరిగేట్లా చేసారు. పైగా మేనక అనే పాఠకురాలిని సృష్టించి మీ పజిల్స్‌ గురించి, వాటి ద్వారా మీరు నాకిద్దామనుకున్న ప్రేమ సందేశాల గురించి నా దృష్టిని ఆకట్టుకున్నారు. నన్ను మీరు స్వయంగా చూసారు కాబట్టి నేను మీకు నచ్చిన తర్వాతనే ఇదంతా చేసారని అనుకుంటున్నాను. మీరూ, మీ తెలివితేటలూ నాకు చాలా నచ్చాయి. నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం మీకుంటే ఈసారి సోమవారం పజిల్‌లో 'మేనకా, పెళ్లాడదాం రా' అనే జవాబు వచ్చేట్లా క్లూ ఇవ్వగోర్తాను.    - మీ దాని ననుకునే, మేనక.  (ఆంధ్రజ్యోతి ఆదివారం మే 1999)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?