Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: స్విస్‌ ఛాలెంజ్‌

ఎమ్బీయస్‌: స్విస్‌ ఛాలెంజ్‌

ప్రత్యేక హోదా తర్వాత బ్రహ్మపదార్థం స్థాయిని సంతరించుకున్న పదం - స్విస్‌ ఛాలెంజ్‌! చంద్రబాబుగారి ధర్మమాని అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు. అది అద్భుతమైన విధానమని ఆయన అంటే కాదు, అధ్వాన్నమైనదని కొందరంటున్నారు. పద్ధతిలో స్వతహాగానే కొన్ని లోపాలుంటే బాబు తమ వంతుగా మరిన్ని చేర్చారని కూడా ఆరోపణలున్నాయి. సింగపూరు కన్సార్షియం అమరావతి ప్రతిపాదనపై హైకోర్టు స్టే యివ్వడంతో యీ అనుమానాలు మరింత బలపడ్డాయి. కోర్టులు ఏం చెప్పాయన్నది తర్వాతి సంగతి. ఒక జడ్జి చెప్పినది ఫుల్‌ బెంచ్‌ కొట్టేస్తుంది. ఫుల్‌ బెంచ్‌ కొట్టేసినది సుప్రీం కోర్టు కొట్టేస్తుంది. మధ్యలో మనకంటూ ఒక అవగాహన వుండాలి కదా, ఎవరైనా ముఖ్యమైన విషయాలతో అర్థమయ్యేలా క్లుప్తంగా రాస్తే బాగుండును అని ఎదురుచూస్తూ వచ్చాను. అలాటిదేదీ తారసిల్లకపోవడంతో నేనే మొదలుపెట్టాను. సమాచార సేకరణలో, అవగాహనలో లోపాలు వుంటే (ఉంటాయనే నా అనుమానం, విషయం క్లిష్టంగా వుంది) ఎత్తి చూపప్రార్థన. సరిగ్గా తెలుసుకోకుండా, అర్థం కాకుండా ఎందుకు రాస్తున్నట్లు అంటే పరీక్ష రాస్తేనే కదా తన కెంత తెలుసో, తెలియదో విద్యార్థికి గ్రహింపుకి వచ్చేది!

స్విస్‌ ఛాలెంజ్‌కు ఆ పేరు ఎందుకు వచ్చిందో నిర్ధారణగా ఎవరూ చెప్పటం లేదు. స్విస్‌ అనగానే తట్టేది ఆ దేశపు తటస్థ విధానం. ప్రపంచయుద్ధాలలో ఆ దేశం ఎటూ మొగ్గకుండా వుంది. అదే విధంగా వేర్వేరు కాంట్రాక్టర్లలో ఎవరి పట్ల వలపక్షం చూపకుండా ప్రభుత్వం తటస్థంగా వ్యవహరిస్తుంది కాబట్టి 'స్విస్‌' అన్నారని ఒక వ్యాఖ్యానం. (అంటే తక్కిన విధానాల్లో పక్షపాతం చూపిస్తుందా? అనే ప్రశ్న వస్తుంది మరి) ఏది ఏమైనా అది ప్రభుత్వం కంట్రాక్టర్లకు పని అప్పచెప్పే ఒక పద్ధతి. చాలాకాలంగా అమల్లో వున్న విధానం - ఎల్‌సిఎమ్‌ (లీస్ట్‌ కాస్ట్‌ మెథడ్‌) ప్రభుత్వం ఫలానా పని, ఫలానా విధంగా చేయాలి అని వివరాలన్నీ ప్రకటించి, దీన్ని ఎంత తక్కువలో చేసి చూపిస్తారో చెప్పండి అంటూ కాంట్రాక్టర్లను పిలుస్తుంది. ఈ రేటైతే చేయగలం అంటూ కాంట్రాక్టర్లు ప్రతిపాదనలు (టెండర్లు)  పంపుతారు. అందరి కంటె తక్కువ రేటు 'కోట్‌' చేసిన (రేటుకి సిద్ధపడిన) టెండర్‌ను 'ఎల్‌1' (లోయస్ట్‌ 1) అంటారు. వాళ్లకు పని అప్పచెపుతారు. ఇది పూర్తిగా రహస్యప్రక్రియ. ఒక కాంట్రాక్టరు ఎంత రేటు చెప్పాడో, మరో కాంట్రాక్టరుకి తెలియదు. అన్నీ కలిపి బహిరంగంగా ఒకే రోజు తెరుస్తారు. 

ఇది వినడానికి బాగానే వుంటుంది కానీ దీనిలో ఒక చిక్కు వుంది. కాంట్రాక్టర్లందరూ కలిసి కూడబలుక్కుని కూటమిగా (కార్టెల్‌ అంటారు) ఏర్పడి, 'యింతకంటె తక్కువ టెండరు యివ్వవద్దు' అని తీర్మానించుకుని వంతుల వారీగా టెండర్లు దక్కించుకోవచ్చు. ఒక్కోసారి కాంట్రాక్టరు ప్రభుత్వంలో తనకున్న పలుకుబడితోనో, పోటీదారుల ఆఫీసుల్లో తన మనుష్యులను నియమించో యితరులు ఎంత రేటు కోట్‌ చేస్తున్నారో తెలుసుకుని దాని కంటె తక్కువ టెండర్‌ వేసి పని దక్కించుకోవడం జరుగుతుంది. ఒక్కోచోట కాంట్రాక్టరుకు స్థానబలిమి ఎక్కువై తను కోట్‌ చేస్తున్న రేటు కంటె తక్కువ రేటుకి వేరే ఎవరూ టెండరు యివ్వకూడదని శాసించడమూ జరుగుతుంది. కొందరు తక్కువ రేటు కోట్‌ చేసి, పని దక్కించుకుని తర్వాత ఏదో వంక చెప్పి - ప్రభుత్వం అనుమతులు రావడం లేటయ్యాయనో, దిగుమతులు సకాలానికి రాలేదనో, కోర్టు ఆదేశాల వలన పనిలో జాప్యం జరిగిందనో యిలాటివి - రేటు పెంచమని ప్రతిపాదిస్తారు. ప్రభుత్వం వారితో కుమ్మక్కయి రేటు పెంచేస్తుంది. చాలాసార్లు నాణ్యతలో రాజీ పడతారు, లంచాలు తీసుకున్న ప్రభుత్వాధికారులు, నాయకులు చూసీ చూడనట్లు వదిలేస్తారు. ఇలా యీ పద్ధతిలో కూడా చిక్కులున్నాయి. అందువలన క్యూసిబియస్‌ (క్వాలిటీ అండ్‌ కాస్ట్‌-బేస్‌డ్‌ సెలక్షన్‌) అనే పద్ధతి వచ్చింది. ఇంత తక్కువ రేటుకి కిట్టుబాటు అవడం లేదనడం వలన 'వయబిలిటీ గ్యాప్‌', 'రివర్స్‌ ఇ-ఆక్షన్‌', 'హైబ్రిడ్‌ ఏన్యుయిటీ' వంటి మార్గాలూ వచ్చాయి. 

పూర్తి గవర్నమెంటు పని అయినా, పిపిపి (పబ్లిక్‌-ప్రైవేట్‌-పార్ట్‌నర్‌షిప్‌) అయినా, పై పద్ధతులన్నిటిలో తొలిదశలో ప్రభుత్వాధికారులకు పని విపరీతంగా వుంటుంది. అంటే ఏ పని చేపట్టాలి, ఎలా చేపట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఆదాయం వస్తుంది, ఎన్నాళ్లలో వస్తుంది వంటి కసరత్తు అంతా ప్రభుత్వాధికారులే చేసి 'ఇదిగో యింతలో, యిన్నాళ్లల్లో, ఫలానా చోట, ఫలానా విధంగా పని చేయాలి' అని మొత్తం డిజైనంతా తయారుచేసి కాంట్రాక్టర్ల ముందు పెట్టాలి. ప్రభుత్వాధికారులకు అంత సామర్థ్యం వుండాలి, తీరిక వుండాలి. ఉంటాయి కాబట్టే యిన్ని పనులు చేపడుతున్నారు. వాటికి ప్రత్యేకమైన శాఖలుంటాయి, నిపుణులుంటారు. అవసరమైతే కన్సల్టెంట్లను పిలుస్తారు. 

అయితే వీళ్లకు ఏ పథకం చేపడితే బాగుంటుందనే విషయంలో కొత్త తరహా (యిన్నోవేటివ్‌గా) ఆలోచనలు రాకపోవచ్చు. నాయకుల రాజకీయ అవసరాల కోసమో, అధికారుల ఆలోచనా పరిమితులకు లోబడో వాళ్లు పథకాలు రచిస్తూ వుండవచ్చు. కానీ కావలసినన్ని పథకాలు తయారవుతున్నాయా అనేది ప్రశ్న. ఆర్థిక వ్యవస్థ చురుగ్గా వుండాలంటే ప్రయివేటు రంగం ఏడాదికి రూ.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలిట. ప్రాజెక్టు రెండేళ్లు పడుతుందనుకుంటే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి అవసరమయ్యే పథకాలుండాలి. ఒక్కో పథకానికి  రమారమి వెయ్యి కోట్లు ఖర్చవుతుందని అనుకుంటే వెయ్యి ప్రాజెక్టులుండాలి. ప్రభుత్వాధికారులు ఏడాదికి వెయ్యి పథకాలు తయారుచేయాలి. ఇవి కాక ప్రభుత్వరంగంలో తయారుచేయాల్సినవి ఎలాగూ వుంటాయి. ఇన్ని వాళ్లు చేయలేరు అని గ్రహించినవాళ్లకు స్విస్‌ ఛాలెంజ్‌ విధానం స్ఫురించింది. ప్రభుత్వాధికారులు తాపీగా చేస్తారు, ప్రయివేటు పెట్టుబడిదారులు చకచకా చేస్తారు కాబట్టి దీనివలన టైము కలిసి వస్తుంది అనుకున్నారు.

ఉదాహరణకి 'ఆంధ్రలో యిదివరలో జలరవాణా విరివిగా సాగేది. పోనుపోను కాలువలను నిర్లక్ష్యం చేసి రోడ్డు రవాణానే ప్రోత్సహించారు. దాని కారణంగా రోడ్ల అరుగుదల, నిర్వహణావ్యయం, ఇంధనం ఎక్కువగా ఖర్చవడం, పర్యావరణంలో వేడి పెరగడం వంటి అనేక అనర్థాలు జరుగుతున్నాయి. ఆంధ్రలోని కాలువల్లో పూడిక తీసివేసి,  కొత్తకాలువలు అనుసంధానించి, వాటిలోకి నీరు మళ్లించి, చౌకగా జలరవాణా జరిగేట్లా చేస్తాం' అనే ప్రతిపాదనతో ఎవరైనా ముందుకు వచ్చారనుకోండి. అతన్ని ఒరిజినల్‌ ప్రాజెక్టు ప్రపోజర్‌ (ఒపిపి) అంటారు. ఏ కాలువను వుపయోగించుకోవాలి, దేన్ని కొత్తగా తవ్వాలి, దానికి నీళ్లు ఎక్కణ్నుంచి వస్తాయి, ప్రమాదాలు జరగకుండా సరుకులు వేగంగా వెళ్లేట్లుగా ఎటువంటి బోట్లు, యింజన్లు పెట్టాలి, వీటికంతా అయ్యే ఖర్చెంత.. యిలాటి  అంశాలన్నీ అతనే ఖర్చుపెట్టి అధ్యయనం చేసుకుంటాడు. ఇంత ఖర్చుతో నేను పూర్తి చేస్తాను అని రాసి యిస్తాడు. అది పట్టుకుని సంబంధిత ప్రభుత్వ కార్పోరేషన్‌ వద్దకు వస్తాడు. వాళ్లు దాన్ని పరిశీలించి, యిది జరిగే పనా, జరగని పనా అన్నది తేలుస్తారు. అంటే ప్రభుత్వాధికారులకు నూతనమార్గంలో ఆలోచించే పని తప్పింది, దాని గురించి లోతుగా స్టడీ చేసి ప్రాజెక్టు రిపోర్టు పనీ తప్పింది. చేతికి వచ్చిన రిపోర్టును స్టడీ చేసి సాధ్యాసాధ్యాలను పరీక్షిస్తే చాలు. ఇక్కణ్నుంచి మరో శాఖకు కూడా వెళ్లి ఆర్థికపరమైన అంశాలు కూడా నిర్ధారించుకున్న తర్వాత ప్రభుత్వం దృష్టికి వస్తుంది. 'ఈ ప్రాజెక్టును నేను యింతకు చేయడానికి సిద్ధం, ఇంత తక్కువకు మరెవరూ చేయలేరు' అని ఒపిపి ఛాలెంజ్‌ విసురుతాడన్నమాట. దాన్నే స్విస్‌ ఛాలెంజ్‌ అంటారు. ఇక్కడిదాకా ప్రభుత్వం స్పందించదు.

ఆంధ్ర సీడ్‌ క్యాపిటల్‌ నిర్మాణ విషయంలో యీ వరుస పాటింపబడలేదు. 'పాపం మీ రాష్ట్రానికి రాజధాని లేదుట కదా, ఓటి కట్టుకుంటే మంచిది కదా, కట్టిపెట్టనా?' అంటూ ఒపిపి ఐన సింగపూరు కన్సార్షియం వచ్చి చెప్పలేదు. అదేమీ వాళ్ల కొత్త ఐడియా కాదు. నిజానికి ఒపిపిని ఇన్నోవేటర్‌ అని కూడా అంటారు. స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో ఇతని ఛాలెంజ్‌ స్వీకరించి, యితని కంటె తక్కువ రేటు కోట్‌ చేసిన పోటీ కాంట్రాక్టర్లు చాలామంది వస్తే అప్పుడు ప్రభుత్వం యితని యిన్నోవేటివ్‌ ఐడియా పేటెంట్‌కు గాను అతనికి కొంత డబ్బు చెల్లించి సొంతం చేసుకుని వాళ్లకు పని అప్పచెబుతుంది. అంత కొత్తగా, ఎవరికీ తట్టనంత పద్ధతిలో వుండాలన్న మాట ప్రతిపాదన. రాజధాని నిర్మాణం ఎవరికీ తట్టని సరికొత్త ఆలోచనా? విభజన ప్రకటన వెలువడగానే చంద్రబాబుగారు 'ఆంధ్ర రాజధాని కట్టుకోవడానికి నాలుగైదు లక్షల కోట్లు కావాలి' అంటూ పాట మొదలుపెట్టారు. తెలుగుజాతి యిలా చీలిపోతున్నందుకు అందరూ నిర్ఘాంతపోతున్న సమయంలో కూడా రాజధాని, దానికయ్యే ఖర్చు అంటూ ఆలోచించగలిగిన దీర్ఘదర్శి ఆయన. మామూలుగా రాజధాని అనగానే చండీగఢ్‌, భువనేశ్వర్‌, గాంధీనగర్‌, నయా రాయపూర్‌.. యిలాటివి తడతాయి. వాటికి లక్షల కోట్లు ఎందుకు? ఎవరూ అడగనూ లేదు, ఎవరూ యివ్వనూ లేదు. కానీ బాబుగారి వూహలో రాజధాని ప్రభుత్వాఫీసుల సముదాయంతో వుండే పాలనాకేంద్రం మాత్రమే కాదు, వాణిజ్యకేంద్రం, విజ్ఞానకేంద్రం, విలాసకేంద్రం, సాంస్కృతిక కేంద్రం, సాహిత్యకేంద్రం, క్రీడా కేంద్రం, యాత్రాకేంద్రం.. యిలా ఎన్ని కేంద్రాలకే కేంద్రం. అందుకే నాలుగైదు లక్షల కోట్ల బజెట్‌. 

ఈ ఆలోచన చేసేనాటికి ఆయన ఆంధ్రకు ముఖ్యమంత్రి కూడా కాదు. తను కాకుండా మరొకరు వచ్చినా సరే, లక్షల కోట్లు కావాల్సిందే అనుకుని తన ప్లాను వెల్లడించిన నూత్న ఆలోచనాపరుడాయన. రాజధాని ఇన్నోవేటర్‌ అంటూ ఎవరినైనా పేర్కొనాలంటే బాబు పేరే చెప్పాలి. ప్రతిపక్షంలో వుండగా తీరిక ఎక్కువ కాబట్టి ఎన్ని ఆలోచనలైనా వస్తాయి. కానీ బాబు అధికారంలోకి వచ్చాక కూడా ఆ ఆలోచన వదిలిపెట్టలేదు సరి కదా, ఎన్నో మెరుగులు దిద్దారు. తన స్వప్నాన్ని ఆంధ్రప్రజల ముందు ఆవిష్కరించారు. వారేనా, తను వెళ్లిన ప్రతీ రాష్ట్రంలో, ప్రతీ దేశంలో దాని గురించే ప్రచారం చేశారు. దీని నిర్మాణంలో పాలు పంచుకోకపోతే భవిష్యత్తులో మిమ్మల్ని మీరు క్షమించుకోలేరుసుమా అని సుతారంగా హెచ్చరించారు. రియాల్టీ రంగంలో హేమాహేమీలే తలదించుకునేట్లా రంగురంగుల ప్రకటనలు వేయించారు. పోటీలు పెట్టి డిజైన్లు తయారుచేయించారు, మార్పించారు. 

చంద్రబాబు మంచి టీము లీడరు. తనకున్న ఆలోచనలను, ఉత్సాహాన్ని సహచరుల్లో కూడా రగిలించారు.  సింగపూరువాళ్లకు అప్పగించాలని ముందే అనుకున్నారు కాబట్టి, మంత్రులను అక్కడకు పంపించి దాన్ని చూడమన్నారు. 'సార్‌, యిక్కడ మొత్తం దేశమంతా కలిపి హైదరాబాదంత నగరం. మన రాష్ట్రంలో ఒక్క నగరం కూడా లేదు. అన్నీ పెద్దా చిన్నా పట్ణణాలూ, పల్లెలే కదా. ఈ మోడలు మనకెందుకు పనికి వస్తుంది?' అని అడుగుదామన్న ఆలోచన కూడా రానంత యిదిగా ఊదరగొట్టేశారు. అందర్నీ ముందే మెంటల్‌గా సింగపూరు కన్సార్షియం అంటే ఓహో అనేట్లా చేశారు. ఇలాటి పరిస్థితుల్లో ఒపిపి అని చెప్పుకుంటున్న సింగపూరు కన్సార్షియం ఒరిజినాలిటీ ఏముంది? ఇన్నోవేషన్‌ ఏముంది? 

స్విస్‌ ఛాలెంజ్‌ నిర్వచనంలో 'అన్‌సొలిసిటెడ్‌ బిడ్‌' అన్నారు. అంటే మనం అడక్కుండా వాళ్లంతట వాళ్లే పట్టుకుని వచ్చే ప్రతిపాదన అన్నమాట. ఇక్కడ అది అన్వయిస్తుందా? బాబు సింగపూరు వాళ్లను పిలక పట్టుకుని లాక్కుని వచ్చారు. వచ్చేముందు యిక్కడివాళ్లంతా సన్నాసులు అని మనందరి మెదళ్లల్లో ఎస్టాబ్లిష్‌ చేయవచ్చు. భారతీయ కంపెనీలు పరదేశాలలో అనేక చోట్ల అద్భుతమైన ప్రాజెక్టులు చేయవచ్చు. కానీ బాబు దృష్టిలో హైటెక్‌ సిటీ (టిడిపి ఆఫీసు కూడానా?) కట్టిన ఎల్‌అండ్‌టి వంటి ఒకటి రెండు సంస్థలు తప్ప తక్కినవన్నీ పనికి మాలినవి, వాటికి మురికివాడల్లాటి ఊళ్లు కట్టడం తప్ప మరేమీ చేతకానివి. ఆ ముక్క నిర్మొగమాటంగా పైకి చెప్పేశారు కూడా. ఇంకో అంశంలో కూడా యీ ప్రతిపాదనలో లోపం కనబడింది. మామూలు పద్ధతి ప్రకారం తన యిన్నోవేషన్‌తో ప్రపోజల్‌ పట్టుకుని వచ్చిన కన్సార్షియం తన ప్రతిపాదనలను సిఆర్‌డిఏకు సమర్పించాలి. వాళ్లు ఓకే చేశాక, అక్కణ్నుంచి అది చీఫ్‌ సెక్రటరీ నేతృత్వంలోని మౌలిక సదుపాయాల సంస్థకు వెళ్లాలి. ఆ తర్వాత ప్రభుత్వానికి చేరాలి. కానీ ప్రస్తుత సందర్భంలో పరిస్థితి రివర్సులో వెళ్లింది. ముందుగా ప్రభుత్వమే దీన్ని డీల్‌ చేసిందని జీవో ద్వారా తెలుస్తోంది. ఒకసారి పై వాళ్లు నిర్ణయం తీసుకున్నాక కిందిస్థాయి వ్యవస్థలు ఆ నిర్ణయానికి విరుద్ధంగా వెళ్లలేవు కదా! ఈ ముక్క న్యాయమూర్తే అన్నారు. వాళ్ల కంటె ముందు ఆంధ్ర చీఫ్‌ సెక్రటరీతో సహా అనేకమంది ఉన్నతాధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారట కానీ బాబు లెక్కచేయలేదు.

స్విస్‌ ఛాలెంజ్‌ కొత్తది కాబట్టి దాని పద్ధతి ఎలా వుంటుందో తెలియక చేసిన పొరపాట్లు కావివి. ఇప్పటికే దాన్ని చిలీ, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్‌, ఇండోనేసియా,  శ్రీలంక, తైవాన్‌లలో (వీటిల్లో చాలాభాగం సింగపూరులాగానే వాయువ్య ఆసియాలో వున్నాయి గమనించండి) ఆ పద్ధతి ప్రయత్నించి చూశారు. కొన్ని చోట్ల పనిచేసింది, కొన్ని చోట్ల చేయలేదు. భారతదేశంలో గుజరాత్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, బిహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలలో పిపిపి బిడ్స్‌ విషయంలో ఉపయోగించి చూశారు. ప్లానింగు కమిషన్‌ 'దీన్ని అలవాటుగా చేసుకోకండి, మరీ అవసరమైతేనే వాడండి' అని చెప్పింది. సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ దీనిలో గోల్‌మాల్‌ జరగడానికి చాలా అవకాశం వుంది అని అనుమానదృక్కులతోనే చూస్తుంది. ఠాణేలో యిళ్లు కట్టడానికి మహారాష్ట్ర హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, మెగాఫిల్మ్‌ సిటీ కట్టడానికి జయపూర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ యీ పద్ధతిని ఎంచుకున్నాయి. 

ఏడాది క్రితం ఇండియన్‌ రైల్వేస్‌ స్విస్‌ ఛాలెంజ్‌ తరహాలో 400 రైల్వే స్టేషన్లను రీడెవలప్‌ చేయడానికి నిశ్చయించుకుని ప్రకటించింది. ఇప్పటిదాకా పురోగతి ఏమిటా అని చూడబోతే మూడు, నాలుగు స్టేషన్ల గురించి మాత్రమే వెబ్‌సైట్‌లో కనబడుతోంది. పని జరుగుతున్నవాటిలో కూడా స్విస్‌ ఛాలెంజ్‌ విసిరిన ఛాలెంజర్‌ ఎవరో తెలియలేదు. అసలా పద్ధతి విడిచిపెట్టి సంప్రదాయ పద్ధతుల్లో టెండర్లు పిలిచారేమో కూడా తెలియదు. కేంద్రంలోని రోడ్‌ ట్రాన్స్‌పోర్టు అండ్‌ హైవేస్‌ మంత్రిత్వ శాఖ 18637 కిమీల పొడుగున 16 గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేస్‌ పిపిపిలో కట్టించబోయి, దానికి రెస్పాన్సు సరిగ్గా రాకపోవడంతో పోనీ యీ పద్ధతిలో కట్టిద్దామనుకుంది. అయితే  ఫైనాన్స్‌ సెక్రటరీ విజయ్‌ కేల్కర్‌ ఆధ్వర్యంలోని కమిటీీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, డెవలప్‌మెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కై యీ పద్ధతి అవలంబించవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దాంతో ప్రభుత్వం యిరకాటంలో పడింది. (ఆంధ్ర రాజధాని నిర్మాణం కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లేదా డెవలప్‌మెంట్‌లోకే వస్తుందంటే ఆ హెచ్చరికలు ఆంధ్రకూ వర్తిస్తాయి) ఏది ఏమైనా ఇండియాలో యిది యింకా స్థిరపడలేదని అర్థమవుతోంది. స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతి న్యాయబద్ధమే అని 2009లో సుప్రీం కోర్టు చెపుతూనే చాలా సేఫ్‌గార్డ్‌స్‌ తీసుకోవాలని నొక్కి చెప్పింది. వాటిల్లో లోపం వుందని తేలితే మాత్రం బిడ్‌ కాన్సిల్‌ అయిపోయే ప్రమాదం వుంది.

సరే, ఒపిపి తన ప్రతిపాదనను సవ్యమైన మార్గంలోనే ప్రభుత్వానికి పంపాడనుకోండి. అప్పుడు ప్రభుత్వం దాన్ని సకల వివరాలతో ప్రజల ముందు పెడుతుంది. ఇదిగో దీనిలో ఖర్చు యింత, ఆదాయం యింత,  తనకు వచ్చినదానిలో యితను ప్రభుత్వానికి యింత వాటా యిస్తానంటున్నాడు. మీ సంగతేమిటి? అని బహిరంగంగా అందర్నీ అడుగుతుంది. అంకెలు యిప్పటికే తెలుసు కాబట్టి, అంతకంటె తక్కువకు యిస్తామని అనగలిగినవాడే ముందుకు వస్తాడు. రాకపోతే ఒపిపికే ప్రాజెక్టు దక్కుతుంది. వచ్చాడనుకోండి, అప్పుడు వాడిది ఎల్‌1, వాడికే కాంట్రాక్టు యిచ్చేస్తున్నాం అనదు ప్రభుత్వం. 'ఇదిగో వాడు నీ కంటె తక్కువకు చేస్తాడట, నువ్వు ఆ ధరకు చేయగలవా, ఆలోచించుకుని చెప్పు' అని కౌంటర్‌-ప్రపోజల్‌ చేసే అవకాశం ఒపిపికి యిస్తుంది. ఇదంతా దేనికంటె ప్రభుత్వానికి కూడా తట్టని ఐడియాను పుట్టించి, పెంచి పోషించినందున్నమాట. 

ఆంధ్ర విషయంలో జరిగినదేమింటే ప్రభుత్వం తనకు ఒపిపినుంచి వచ్చే ఆదాయవివరాలను దాచేసింది. కన్సార్షియం తను ప్రతిపాదించిన ఆదాయ వివరాలను సీల్డ్‌ కవర్లో పెట్టి యిచ్చిందట. అది ప్రభుత్వమే విప్పి చూడలేదు కానీ 'వాళ్లతో సరితూగే ప్రతిపాదన మీరు చేయగలరా?' అని బిడ్డర్లను అడిగింది. వాళ్లింత యిస్తారని చెపితే, అంతకంటె రూపాయి ఎక్కువ యిస్తామనో, లేదనో చెప్పగలరు వీళ్లు. ఎంత యిస్తారో చెప్పకపోతే అది స్విస్‌ ఛాలెంజ్‌ ఎలా అవుతుంది? సంప్రదాయక  సీల్ట్‌ కవర్ల టెండర్ల విధానమవుతుంది. ఈ గందరగోళాన్ని కోర్టే అర్థం చేసుకోలేక పోయింది. 'ఆదాయ వివరాలు బహిర్గతం చేయకపోతే ఎలా?' అని అడిగింది. అంతకంటె ముందు మరో సందేహం వచ్చింది కోర్టుకి - 'అవునూ, వాళ్లు ఎంత యిస్తారో సీల్డు కవర్లోనే వుందంటున్నారు. అది మీ ప్రభుత్వానికి లాభదాయకమో, నష్టదాయకమో మీకెలా తెలుసు?' అని అడిగింది. నిజమే కదా, సింగపూరు 'ఏమీ యివ్వం' అని వాళ్ల భాషలో రాసిన ఓ కాగితం పెట్టిందనుకోండి. అదే ఫైనల్‌ అయిపోతుంది కదా! కోర్టు వాళ్లు అడిగిన యీ ప్రశ్నకు ప్రభుత్వం తరఫున హాజరైన లాయరు ముకల్‌ రోహతగీ సమాధానం చెప్పలేకపోయారు. ఆయన నిజానికి కేంద్ర ప్రభుత్వానికి అటార్నీ జనరల్‌. తమ అడ్డగోలు విధానాన్ని సమర్థించడానికి చిన్నవాళ్లయితే సరిపోరని రాష్ట్రప్రభుత్వం ఆయన్ను లాక్కునొచ్చింది. 

అంత పెద్దవాడైనా ఆయన వాదనలు కూడా తిక్కతిక్కగా వున్నాయి. అసలు యీ కేసు వేయడానికి పిటిషనర్లకు అర్హత లేదన్నాడు. 'ఎల్‌అండ్‌టీ వంటి పెద్ద సంస్థే ఏమీ అనలేదు కానీ రోడ్డు మీద వెళ్లే అనామకుల్లాటి యీ పిటిషనర్లెవరు అభ్యంతర పెట్టడానికి..' అని వాదించాడు. ఈయనకి బాబు స్వయంగా బ్రీఫింగు యిచ్చినట్టున్నారు. తమకు తోచినట్లు ఏదో చేసేయడం, యిది నియమాలకు విరుద్ధంగా వుందంటూ కోర్టుకి వెళ్లినవారిని ఉన్మాదులనడం బాబుకి అలవాటైంది. అందరూ మన్నించే ఎబికె ప్రసాద్‌ వంటి సీనియర్‌ పాత్రికేయుడిపై ఉన్మాది అంటూ నోరుపారేసుకున్నారు బాబు. ఇప్పుడు రోహతగి! పిటిషనర్‌ వాదన సమంజసమా కాదా అని మాట్లాడాలి తప్ప అతడు అనామకుడైతే మీకేం, కాకపోతే మీకేం? ఎల్‌ అండ్‌ టి అభ్యంతర పెట్టలేదంటే దానికేం మొహమాటాలున్నాయో, దీని విషయంలో వూరుకో, నీకు యింకోటి యిప్పిస్తా అని ఆశపెట్టారేమో! అసలు అవన్నీ అనవసరం. రూలు ప్రకారం ఆదాయవివరాలు యివ్వాలి, యివ్వలేదు, తప్పు.. దట్సాల్‌! 

న్యాయమూర్తికి వచ్చిన మరో సందేహం ఏమిటంటే - ఒపిపికి 5 నెలలు గడువిచ్చారు. తక్కిన బిడ్డర్లకు కౌంటరు ప్రపోజల్‌కై యివ్వాల్సిన 60 రోజుల గడువు బదులు 45 రోజులే యిచ్చారేం? అని. దానికి సమాధానం యివ్వకపోగా 'స్టే యిస్తే జాతి ప్రయోజనాలకు విరుద్ధం' అంటూ రోహతగి దబాయింపు ఒకటి. ఆలస్యం చేస్తే సింగపూరు కన్సార్షియం వెనక్కి వెళిపోతుందన్న బెదిరింపు ఒకటి. వెళితే వెళ్లనీయండి, వీడు కాకపోతే మరొకడు. అసలు మొదట్లో సింగపూరు ప్రభుత్వమే ఆంధ్ర రాజధాని కడుతుందని బాబు డప్పేశారు. అప్పుడు నేను సింగపూరు పత్రికలు, వెబ్‌సైట్లు తిరగేసి, అదేమీ కాదని వాదించాను. అటుతిరిగి యిటుతిరిగి ఫైనల్‌గా అది మూడు ప్రయివేటు సంస్థలు ఏర్పరచిన కన్సార్షియంగా తేలింది. దాని కథ, అది పొందుదామని చూస్తున్న ప్రయోజనాల గురించి మరోసారి చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం గ్రహించవలసినది - ఆంధ్రప్రభుత్వం రూల్సును పట్టించుకోకుండా స్విస్‌ ఛాలెంజ్‌ పేరుతో ఆ కన్సార్షియంకు కాంట్రాక్టు కట్టబెట్టబోయింది. బిడ్డు మాట ఎలా వున్నా ప్రభుత్వ నోటిఫికేషన్‌నే ఛాలెంజ్‌ చేశారు కొందరు బిల్డర్లు. హైకోర్టు స్టే యిచ్చింది. ప్రభుత్వాన్ని కౌంటరు దాఖలా చేయమంది. అక్టోబరు 31 న తదుపరి విచారణ అంది. ఈ స్టేను ఆంధ్రప్రభుత్వం ఛాలెంజ్‌ చేస్తోంది. ఇన్ని ఛాలెంజ్‌లు చూస్తూ వుంటే యీ బిడ్‌లో స్విస్‌ ఛాలెంజ్‌ కంటె ఆంధ్రా ఛాలెంజ్‌లే ఎక్కువగా కనబడుతున్నాయి.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?