cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : తెలుగు రాష్ట్రాలలో నెల్లాళ్ల పాలన

ఎమ్బీయస్‌ : తెలుగు రాష్ట్రాలలో నెల్లాళ్ల పాలన

ఆంధ్రలో బాబు, తెలంగాణలో కెసియార్‌ పాలనకు వచ్చి నెల దాటింది. నెల కాగానే మీడియా వారందరూ సమీక్షలు చేసేశారు. ఇటీవలి కాలంలో యిదో ఆనవాయితీ అయిపోయింది. గతంలో అయితే ఏడాదేడాదికి సింహావలోకనం చేసేవారు. ఇప్పుడు మీడియాకు న్యూస్‌ కావాలి కాబట్టి, వంద రోజుల పాలన, ఏభై రోజుల పాలన అంటూ మొదలుపెట్టి చివరకు నెలకు కూడా వచ్చేశారు. కొన్నాళ్లు పోతే వారాల స్థాయికి వచ్చేస్తారేమో. నిజానికి నెల్లాళ్లలో ఏం సాధించి చూపగలరు? ఇలా చేస్తాం, అలా చేస్తాం అనే ప్రకటనలే తప్ప నిజంగా చేసి చూపించడం కష్టం. ఇదివరకు రోజుల్లో మీడియాకు పెద్ద పాత్ర వుండేది కాదు. నాయకులకు మీడియా అంటే వెర్రీ వుండేది కాదు. ఇప్పుడైతే ప్రతీదీ పేపర్లో, టీవీల్లో రావాలన్న తపన నాయకులకు పెరిగిపోయింది. అధిక నిధుల కోసం డిమాండ్‌ చేస్తూ కేంద్రానికి లేఖ పంపారు, నదీజలాలలో వాటా కోసం కేంద్రాన్ని నిలదీయమని ఎంపీలను ఆదేశించారు.. అంటూ ఏదో ఒక న్యూస్‌ రోజూ పేపర్లో వచ్చేట్లు చూస్తున్నారు. 'మన నాయకులు ఏదో చేసేస్తున్నారు, ఒక్క క్షణం కూడా తీరికగా లేరు' అనే సందేశం ప్రజల్లోకి వెళ్లాలని వాళ్ల తాపత్రయం. మీడియా కూడా పాలకులకు వత్తాసు పలుకుతూ 'సమస్యల పట్ల ఆయన అవగాహన అద్భుతం, ఆయన వేసిన సునిశితమైన ప్రశ్నలకు జవాబు చెప్పలేక అధికారగణం తడబడింది' వంటి స్తోత్రాలు చేస్తున్నారు. 

కెసియార్‌కు సమావేశాలే సమావేశాలు

కెసియార్‌ ఎక్కువగా అధికారుల సమావేశాలతోనే గడిపారు. పాలనపై అన్ని అంశాలపై ఆయనకున్న పరిజ్ఞానం ప్రదర్శితమైందట. అది చూసి అధికారులు ఆశ్చర్యపడ్డారట. ఆశ్చర్యపడవలసిన దేముందో నాకు అర్థం కాలేదు. కెసియార్‌ థాబ్దాలుగా రాజకీయనాయకుడు. ఎన్టీయార్‌లా, చిరంజీవిలా వేరే రంగం నుండి రాజకీయాల్లో వాలిన వ్యక్తి కాదు. ఒక పార్టీని స్థాపించి, అధ్యకక్షుడిగా 12 ఏళ్లగా నడుపుతున్నారు. మంచి చదువరి. గొప్ప వక్త. ఏదైనా సమస్య గురించి అధ్యయనం చేసి, దానిపై అద్భుతంగా అసెంబ్లీలో ప్రసంగించిన  సందర్భాలు (పార్లమెంటులో మాత్రం ఆయన పెద్దగా చర్చల్లో పాల్గొనలేదు) గతంలో కూడా వున్నాయి. గాడ్‌ ఫాదరంటూ ఎవరూ లేకపోయినా ఆయన ఎదుగుదలకు కారణం అదే. అలాటిది తన ప్రాంతం గురించి ఆయనకు తెలియకుండా ఎందుకుంటుంది? పైగా ఆయన ఎదురుగా కూర్చున్నవారెవరు? ఎదురు ప్రశ్నలతో ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేసే రాజకీయ ప్రతికకక్షులు కాదు. ఎస్సార్‌, ష్యూర్‌ సార్‌ అనే అధికారులే. మీరంతా కష్టపడాలి, బంగారు తెలంగాణ నిర్మించి చూపించాలి అని ఆయన ఉపదేశాలు యిస్తూ వుంటే కాదని ఎవరంటారు? ఎవడైనా సాహసించి మీరు చెప్పేవి ఆచరణయోగ్యం కాదు సార్‌ అంటే 'వీడు తెలంగాణ ద్రోహి, మారువేషంలో వున్న ఆంద్రోడు అయి వుంటాడు' అంటారు. అందుకని అందరూ వాహ్‌వాహ్‌ కారాలు చేయడం తప్ప నోరెత్తరు.

ప్రభుత్వం ప్రెస్‌కు యిస్తున్న హేండ్‌ఔట్స్‌ ఏమిటి? విశ్వంలోనే హైదరాబాదును అత్యంత సురక్షిత నగరం చేయాలని కెసియార్‌ ఆదేశాలు యిచ్చారు, చెఱువులు ఆక్రమించుకోకుండా చూడాలని చెప్పారు, ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించమన్నారు, వర్షాలు రాకపోయినా రైతులను ఆదుకోమన్నారు, ఎస్సీ ఎస్టీలకు వారికి కేటాయించిన బజెట్‌ను వినియోగించమన్నారు, ఉద్యోగులకు ఏ కష్టం రాకుండా చూడమన్నారు, విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించమన్నారు, పరిశ్రమలు పెడతామని వచ్చినవారిని ఎయిర్‌పోర్టులోనే కలిసి, అన్ని లైసెన్సులు జేబులో పెట్టి మరీ పంపమన్నారు, ఛత్తీస్‌గఢ్‌ నుండి కరంటు తెమ్మన్నారు, తప్పు చేసినవారు కుటుంబసభ్యులైనా సరే జైలుకి పంపిస్తామన్నారు... యిలాటి స్టేటుమెంట్లే. వీటిలో ఎన్ని అమలవుతాయో కాలమే చెప్పాలి. ఇలాటి ఆదేశాలు, అభిభాషణలు ఏళ్ల తరబడి ప్రతి పాలకుడూ చెప్తూ వస్తున్నవే. ఇంకో మూణ్నెళ్లు పోయాక ఎంతవరకు వచ్చాయని ప్రెస్‌ వారు అధికారుల నడిగితే 'బజెట్‌లో నిధులు కేటాయించలేదు, సిబ్బంది లేరు, పనులు ఎలా అవుతాయండి' అని విసుక్కుంటారు. తెలంగాణకు మిగులు బజెట్‌ వుంటుందన్న ధైర్యంతో కెసియార్‌ చాలా చాలా హామీలు గుప్పించారు. వాటిలో ఎన్ని అమలవుతాయో తెలియదు. ఆయన వచోసామర్థ్యం అందరికీ తెలుసు కానీ పాలనాసామర్థ్యం గురించి తెలియదు. గతంలో రాష్ట్రంలో రవాణా మంత్రిగా చేసినపుడు, కేంద్రంలో కార్మికశాఖలో పనిచేసినపుడు ఆయన పనితీరు ప్రశంసలు పొందిన సందర్భం లేదు. అంతమాత్రం చేత ఆయనకు ఏదీ చేతకాదని అనలేం. కొంతకాలం వేచి చూసి అప్పుడు మాత్రమే అనుకున్న గమ్యం చేరారో లేదో వ్యాఖ్యానించగలం.

తొలి అడుగులు యిస్తున్న సంకేతాలు

గమ్యం చేరాలంటే తొలి అడుగులు సరైన దిశలో పడాలి. పడుతున్నాయో లేదో గమనిస్తే కొంతవరకు మనకు ఓ అంచనా వస్తుంది. కెసియార్‌ అసాధ్యమైన హామీలు గుప్పించారు. అందువలన యిచ్చిన హామీల్లో సగం నెరవేర్చినా ప్రజలు తృప్తి పడవచ్చు. వాటి సంగతి చూడకుండా కెసియార్‌ కొత్తకొత్తవి చేరుస్తున్నారు. హైదరాబాదు పోలీసుల యూనిఫాం మారుస్తామని.. మరోటని. ఇప్పుడు అవి తక్షణావసరమా? ఏకకాలంలో అనేక విషయాల గురించి మాట్లాడుతూంటే ఏ ఒక్కటైనా జరుగుతుందా అని అనుమానం వస్తోంది. తెలంగాణ ఉద్యోగులకు తెలంగాణ యింక్రిమెంటు, కేంద్రసిబ్బందితో సమానజీతాలు యిస్తామన్నారు. కానీ వాళ్లు తృప్తిపడలేదు. వీటితో బాటు ఆంధ్రలోలా 60 ఏళ్ల రిటైర్‌మెంట్‌ కూడా అడుగుతున్నారు. అదిస్తే నిరుద్యోగులు గొల్లుమంటారో, గొడవ చేస్తారో చూడాలి. కాంట్రాక్టు సిబ్బందిని పర్మనెంటు చేస్తామని చెప్పేశారు. కానీ ధైర్యం చాలటం లేదు, సర్వీసు పొడిగిస్తూ పోతున్నారు. ఇలా ఎన్నో సమస్యలు. పరిష్కరించాలంటే అందర్నీ కలుపుకోవాలి, ఘర్షణ వాతావరణం లేకుండా చూసుకోవాలి, కేంద్రంతో సయోధ్య నెరపాలి. 

కెసియార్‌ వీటిలో ఏదీ చేయడం లేదు. ఉద్యమం నడిచినంతకాలం 'ఆంద్రోళ్లు పరాయోళ్లు, తెలంగాణ వాళ్లం అంతా ఒకటే, అందరం కలిసి బంగారు తెలంగాణ తెద్దాం' అంటూ చెప్తూ వచ్చారు. ఇప్పుడు తెలంగాణలో ఏ పార్టీని, ఏ నాయకుణ్నీ లెక్క చేయడం లేదు. అందర్నీ అణచాలని, తను తన పార్టీ మాత్రమే వెలగాలని చూస్తున్నారు. ఇతర పార్టీల నుండి ఎమ్మెల్సీలను గుంజుకోవడం, కౌన్సిల్‌ చైర్మన్‌ ఎన్నిక, జెడ్పీల ఎన్నిక.. యివన్నీ యీ ధోరణికి కొన్ని మచ్చుతునకలు మాత్రమే. రాజకీయాల్లో యివన్నీ సహజం. అధికార పార్టీ సాధారణంగా యిలాగే చేస్తుంది. రాజకీయంగా వాళ్లు థాబ్దాలుగా ఒకరితో మరొకరు పోట్లాడుతూనే వుంటారు. అయితే తెలంగాణ విషయంలో నవతెలంగాణ నిర్మాణం పేరుతో ఉద్యమంలో వీరందరితో చేతులు కలిపి, చేతులెత్తి ఫోటోలు దిగి, యిప్పుడు యిలా వెన్నుపోట్లు పొడవడం వింతగా తోస్తోంది. ఇలాటి చర్యలకు కొంతకాలం ఆగి వుంటే బాగుండేది.

నిత్యఘర్షణ

ఇక ఘర్షణ వాతావరణం గురించి చెప్పాలంటే - మొదటి రోజు నుండి కెసియార్‌ అదే పనిలో వున్నారు. తెలంగాణ ఉద్యమానికి పునాదిరాయి వేసినది '1956 నాటి పెద్దమనుష్యుల ఒప్పందం అమలు చేయలేదు' అనే వాదనతోనే! ఇప్పుడు కెసియార్‌ అలాటి ఉల్లంఘనలకే పాల్పడుతున్నారు. పోలవరంకై మండలాల బదిలీ విషయం, జంటనగరాల శాంతిభద్రతలు గవర్నరుకు అప్పగించే విషయం అన్నీ విభజన బిల్లులో అంశాలు, ఆ సందర్భంగా ప్రధాని యిచ్చిన హామీలు. ఆ రోజు యిదే బిల్లుకు ఓటేసి, మద్దతు యిచ్చి, పండగలు చేసుకుని, యీనాడు వాటిలో అంశాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపడితే కేంద్రం హర్షిస్తుందా? ఆ బిల్లు కాంగ్రెసు ప్రతిపాదించినది కావచ్చు కానీ బిజెపి కూడా అన్ని అంశాలకు మద్దతు యిచ్చింది. ఆనాటి ఒప్పందాలను తిరగతోడడానికి బిజెపి ఒప్పుకుంటుందా? బిజెపి, కాంగ్రెసులను కాదని కెసియార్‌ ఎక్కడికి వెళ్లగలరు? కృష్ణా జలాల పంపకం దగ్గర్నుంచి ప్రతీదీ వివాదాస్పదం చేస్తున్నారు కెసియార్‌. స్థానికతకై 1956 పెట్టడం ఖాయం అంటున్నారు, అదో న్యాయపరిశీలనకు నిలుస్తుందో లేదో తెలియదు. ఫీజు రీయంబర్స్‌మెంటుతో ప్రారంభమైనది ప్రతీ అంశానికీ అన్వయించాలని స్థానికులు ఆందోళన చేయవచ్చు. ఇక్కడ పరిశ్రమ పెట్టడానికి వచ్చేవారిని యివన్నీ బెదరగొడతాయి. 

కూలిస్తే లక్ష కోట్లు వస్తాయా?

కూల్చివేతలు, స్థలాలు వెనక్కి తీసుకోవడం సంగతి సరేసరి. అన్నీ న్యాయస్థానాల్లో నిల్చిపోతున్నాయి. ప్రస్తుతానికి చప్పట్లు పడవచ్చు కానీ దీర్ఘకాలికంగా యివి నష్టదాయకమే. అక్రమ కట్టడాలను ఎవరూ హర్షించరు. కానీ శిక్ష ఎవరికి పడుతోందో అది గమనించాలి. మోసం చేసి ప్రభుత్వ భూములను, ట్రస్టు భూములను అమ్మినవారికి శిక్ష లేదు, అనుమతించిన అధికారులకు, యిప్పటిదాకా సకలరకాలైన పన్నులు వసూలు చేసిన ప్రభుత్వానికి శిక్ష లేదు. కొని మోసపోయినవారికే శిక్ష పడుతోంది. ప్రభుత్వం మినహాయింపు యిస్తుందన్న ధీమాతో స్థలాలు కొని, రిపీట్‌.. కొని, ఫ్లాట్స్‌ కట్టిన మధ్యతరగతివారు అక్రమ ఆక్రమదారులట,  మరి ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలలో గుడిసెలు వేసుకున్న పేదలు కారా మరి? వాళ్లు రామోజీ ఫిల్మ్‌ సిటీలో లేదా కెసియార్‌ ఫామ్‌ హౌస్‌లోని స్థలాల జోలికి వెళ్లరు. రూపాయి రూపాయి కూడగట్టి కొనుకున్న మధ్యతరగతి ప్రజల స్థలాలు మాత్రమే ఆక్రమిస్తారు. ఆ గుడిసెలు తీసేసి, స్థలాలు సొంతదారులకు అప్పగిస్తేనే సమన్యాయం జరిగినట్లు లెక్క. 'లక్షదాకా ఋణమాఫీ అంటున్నారు, ఎడాపెడా హామీలు గుప్పిస్తున్నారు, గ్రామాలకు రోడ్లు వేస్తానంటున్నారు, ఆధునీకరణ అంటున్నారు, నిధులెక్కడ వస్తాయి?' అని కెసియార్‌ను అడిగితే హైదరాబాదులో 58 వేల అక్రమ నిర్మాణాలున్నాయి, వాటికి జరిమానా వేస్తే లక్ష కోట్ల రూపాయలు వస్తాయి అన్నారటాయన. ఆ నిర్మాణాల్లో పేదలు వేసుకున్న గుడిసెలు కూడా కలిపి చెప్పారో, తీసేసి చెప్పారో తెలియదు. 

అయినా ఏకంగా లక్ష కోట్లా? ఇదేదో జగన్‌పై లక్ష కోట్ల ఆరోపణ వ్యవహారంలా వుంది. ఆ అంకె ఎలా వచ్చిందో సిబిఐతో సహా ఎవడూ చెప్పడు. అలా కాకపోతే క్రూయల్‌ జోకయినా అయి వుండాలి. లక్ష కోట్లు ఆదాయం రావాలంటే సగటున ఒక్కో నిర్మాణంపై రూ.1.72 కోట్ల జరిమానా వసూలు చేయాలి. జరిమానాయే అంత వుంటే ఆ నిర్మాణం విలువ ఎంత వుండాలంటారు? అంత విలువున్న నిర్మాణాలు హైదరాబాదులో ఎన్ని వున్నాయంటారు?58 వేలా? మై గాడ్‌! అంత విలువైన భవనాల యజమానులు రూ. 1.72 కోట్ల జరిమానా కట్టే బదులు రామ్‌ జఠ్మలానీని లాయరుగా పెట్టుకుని కోర్టు నుండి స్టే తెచ్చుకుంటారు. మన సర్కారు కాగితాలపై వస్తే గిస్తే లెక్కలు వేసుకుని, అవి చూసుకుని మురిసిపోవాలి. ఇప్పటికే ఎన్‌ కన్వెన్షన్‌, ఎపి ఎన్జీవోలు స్టే తెచ్చుకున్నారు. ఇదేదో లాయర్లను బాగుచేసే వ్యవహారంగా కనిపిస్తోంది తప్ప ఆచరణయోగ్యమైన ప్రణాళికలా కనబడటం లేదు. లాంకో హిల్స్‌ దగ్గరకు వెళ్లి అడావుడి చేశారు. అవి వక్ఫ్‌ తాలూకు భూములు కావు, సర్కారువే అని గత ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ ఉపసంహరించుకుంటాం అన్నారు హరీశ్‌. అదే చేస్తే ఆ భూముల విలువను వక్ఫ్‌ బోర్డుకి యివ్వాలి. ఖజానా అడుగంటుతుంది. లేకపోతే అంత భూమి యివ్వాలి. అది ఎక్కణ్నుంచి తేవాలి? గతంలో ఐటీ కంపెనీలకు అవసరం లేకపోయినా వేల ఎకరాలు కట్టబెట్టారు. వాళ్లు లాండ్‌ స్కేపింగ్‌ చేసుకుని కూర్చున్నారు. వాటిని వెనక్కి తీసుకుంటే మంచిదే కానీ, అలా చేస్తే ఆ కంపెనీలకు తప్పుడు సంకేతాలు వెళ్లి, ఐటిఐఆర్‌లో పెట్టుబడులు పెట్టడానికి రారేమోనన్న భయం వుంది. ఇలాటి చిక్కుముళ్లు ఎన్నో వున్నాయి. అందరితో గిల్లికజ్జాలు పెట్టుకునే సమయాన్ని వీటిపై వెచ్చిస్తే ఏదో ఒక మార్గం దొరకవచ్చు. 

ఢిల్లీతో గిల్లికజ్జా

తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కూడా ఘర్షణ పడుతోంది. ఆంధ్రకు పక్షపాతం చూపిస్తోందంటూ విరుచుకు పడుతోంది. కృష్ణా జలాల విడుదల విషయంలో కూడా కేంద్ర అధికారులపై మండిపడుతున్నారు. పోలవరం ఆర్డినెన్సు దొడ్డిదారిన తెచ్చారంటూ పార్లమెంటులో రగడ చేస్తున్నారు. స్థానికంగా బిజెపిని కలుపుకుని పోవడం లేదు. తెల్లవారితే కేంద్రం వద్దకు బిచ్చానికి పోవలసిన అవస్థ వుండగా, యిలా తగవులాడడం ఏపాటి విజ్ఞత? రైల్వే బజెట్‌లో కాచిగూడా జోన్‌ లేదు, కోచ్‌ ఫ్యాక్టరీ లేదు, ఎంఎంటియస్‌కు విస్తరణకు యిచ్చిన నిధులు అతి స్వల్పం. మామూలు బజెట్‌లో తెలంగాణకు హార్టికల్చర్‌ యూనివర్శిటీ యిచ్చి సరిపెట్టారు. లోన్‌ రికవరీ ట్రైబ్యునల్‌ హైదరాబాదులో పెడితే తెలంగాణకు లాభం ఏమిటి? అక్కడ వందమందికైనా ఉద్యోగాలు వస్తాయా? 'నీ పెళ్లి నా మొహంలా వుంది, నా పెళ్లికి వచ్చి కాగడా పట్టు' అన్నాట్ట వెనకటి కెవడో. కేంద్రంతో ఘర్షణ పడుతూనే, మాకు సాయం చేయండి అంటే యిలాగే వుంటుంది. అది చాలనట్లు ప్రతీదానికీ ఆంధ్రతో పోటీ పడుతోంది. ఇవాళ బజెట్‌ ఉపన్యాసంలో ఫైనాన్స్‌ మినిస్టర్‌ ఎయిమ్స్‌ యిస్తున్న రాష్ట్రాలు అంటూ ఆంధ్రప్రదేశ్‌ పేరు చదవగానే తెలంగాణ ఎంపీలందరూ లేచి నిలబడి మాకో మాకో అన్నారు. తక్కిన రాష్ట్రాలకు ఎన్ని యిచ్చినా ఫర్వాలేదు, ఆంధ్రకు మాత్రం యివ్వకూడదు అనే ధోరణి స్పష్టంగా కనబడుతోంది. హైదరాబాదు మెడికల్‌ టూరిజంకు సెంటర్‌గా ఏర్పడిన నేపథ్యంలో, ఆంధ్రకు సూపర్‌ స్పెషాలిటీ హాస్పటల్‌ యిస్తామని విభజన బిల్లులోనే చెప్పారు కాబట్టి యిచ్చారు. ఆ మాత్రానికే యింత ఉలికిపాటా? విద్యుత్‌ కొరత దారుణంగా వుంది. విభజన జరిగితే అన్ని విధాలా అనర్థం అని కిరణ్‌ కుమార్‌ రెడ్డి చెప్పిన జోస్యం నిజమైంది - అని నేననడం కాదు, అతన్ని అప్పుడు ఎద్దేవా చేసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారే అంటున్నారు. నీళ్లు లేవు, కరంటు లేదు, లోపాలు ఎత్తి చూపించిన మీడియాను అణుస్తున్నారు, భూమిపుత్రుల వాదాన్ని ఎక్కడా లేనంత ఘోరంగా లేవనెత్తుతున్నారు.. యిలాటి పరిస్థితుల్లో యిక్కడకు కొత్త పెట్టుబడులు వస్తాయా? ఉన్నవి నిలుస్తాయా? ఈ నెలరోజుల పాలన చూస్తే ధీమాగా వస్తాయి, ఉంటాయి అని చెప్పలేని పరిస్థితి.

ఆంధ్రలో కథే మొదలు కాలేదు

తెలంగాణలో అయితే పాలన ప్రారంభమైంది కాబట్టి ఏవో కొన్ని వ్యాఖ్యలు చేయగలిగాం. ఆంధ్రలో పాలనే ప్రారంభమయినట్లు లేదు. ముఖ్యమంత్రికే ఛాంబర్‌ లేదు, అధికారులకు బల్లలు, కుర్చీలు లేవు. ఫైళ్లు ఎక్కడున్నాయో తెలియదు. ఐదేళ్లయినా హైదరాబాదు వదలం అంటారు కాస్సేపు, తక్షణం వెళ్లిపోయి చెట్టుకింద కాపురం పెడతామంటారు కాస్సేపు. అంటూనే సిఎం ఛాంబర్‌కై పది కోట్ల ప్రజాధనం ఖర్చు పెడతారు, ఎడం చేత్తో యిలా ఖర్చు పెడుతూ కుడిచేయి చాపి, రాజధానికి డబ్బు లేదు, యివ్వండి అని అడుగుతారు. తాత్కాలికమైన ఏర్పాట్లకై యింతింత డబ్బు ఖర్చు పెట్టాలా? 'సిరి గలవానికి చెల్లును..' అన్నట్లు సిరిసంపదల భాగ్యనగరం దక్కిన తెలంగాణ దొరతనం బోనాల పండుగకు ఖర్చు పెట్టినా అదో అందం, తిరిపమెత్తే ఆంధ్ర సర్కారుకి యిన్ని హంగులు అవసరమా? పొదుపు పొదుపు అని ఉద్బోధించే మంత్రిగణం తాము గుడారాల్లో వుండి పని ప్రారంభిస్తే అందరికీ జాలి పుడుతుంది. శివరామకృష్ణన్‌గారు  నెలకో ఊరు కాకుండా త్వరగా పర్యటనలు ముగించి తొందరగా తమ రిపోర్టు యిచ్చేస్తారు. కేంద్రం కూడా నిధులు విదిలిస్తుంది. బాబు ప్రమాణస్వీకారానికే బోల్డు డబ్బు తగలేసి హంగు చేశారు. ఇప్పుడు ఆర్భాటపు రిపేర్లకు కోట్లు. జీతాలకే డబ్బు లేదు, ఆదుకోండి అంటే ఎవరు పట్టించుకుంటారు? 

ఆంధ్రప్రభుత్వం యిప్పటిదాకా చేసినదేమైనా వుందా అంటే విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని వస్తుందని గాఢసంకేతాలు యిచ్చి అక్కడ భూముల విలువకు రెక్కలు వచ్చేట్లు చేసింది. చివరకు వారే రిజిస్ట్రేషన్లు ఆపేయవలసి వచ్చింది. ప్రతీదీ విజయవాడకే కట్టబెడతున్నారన్న ఫీలింగు యితరప్రాంతాల్లో బాగా కలిగించారు. ఎపి ఎక్స్‌ప్రెస్‌ వైజాగ్‌ నుండి వేయాల్సింది విజయవాడ నుంచి వేశారు. ఏం లాభం? అది తెలంగాణ నివాసులకే లాభదాయకం. ఎయిమ్స్‌ రాయలసీమకు యిస్తూంటే గుంటూరుకు తరలించారన్నారు. అక్కడ మెట్రో వస్తుందన్నారు. వైజాగ్‌ రైల్వే జోను తథ్యం అనుకుంటూ వుంటే అదీ విజయవాడకు కావాలన్నారు. బజట్‌ చూడబోతే మెట్రో లేదు, జోనూ లేదు. అక్కడే కాదు, వైజాగ్‌లో మెట్రో వచ్చేస్తోంది, దానికి టెండర్లు కూడా పిలిచేస్తున్నాం అని మంత్రిగారు ప్రకటిస్తే దాని వూసూ లేదు. సాధారణ బజెట్‌లో మాత్రం ఐఐటీ వంటి కొన్ని కేటాయింపులు జరిగాయి. వాటిని ఎక్కడెక్కడ పెడతారో, ఎలా మేనేజ్‌ చేస్తారో చూడాలి. 

శ్వేతపత్రాలు-శోకవిలాపాలు

ఆంధ్రలో బాబుగారి నెలపాలనలో కనబడినవి- ఆత్మస్తుతి, పరనింద, శ్వేతపత్రాలు, వాటితో పాటు ఆయన శోకవిలాపాలు. 'రాష్ట్ర ఆర్థిక పరిస్థితి యింత అధ్వాన్నంగా వుందని నాకు తెలియనే లేదే' అంటూ బాబు తెగ ఆశ్చర్యపడిపోతున్నారు. విభజన సమస్య కారణంగా యీ గణాంకాలు రాష్ట్రంలో సామాన్యుడికి కూడా కంఠతా వచ్చేశాయి. ఇంకా ఎవడికైనా అర్థం కాదేమోనని కిరణ్‌ కుమార్‌ రెడ్డి టీచరులా విప్పి చెపుతూ వచ్చారు. మేధావి అయిన బాబుకి ఆయనంత కూడా తెలియదంటే నమ్మాలా? 'విభజన బిల్లు ఘోరంగా వుందని నేనంటే అప్పుడు నన్ను ఎద్దేవా చేశారు' అని బాబు నింద వేస్తున్నారు. ఏ పనీ సవ్యంగా చేయని కాంగ్రెసు చేతికి విభజన బాధ్యతను అప్పగిస్తూ లేఖ యిచ్చింది బాబుగారే! పైగా ఆ విభజన బిల్లుకు తన తెలంగాణ ఎంపీల చేత మద్దతు యిప్పించి, అడ్డుపడబోయిన ఆంధ్ర ఎంపీలను చావగొట్టించింది కూడా బాబుగారే! ఈ రోజు అలా అనుకోలేదు, యిలా అనుకోలేదు అంటే ఎవరు నమ్ముతారు? తెలంగాణలో కెసియార్‌ లాగే ఆంధ్రలో బాబు కూడా ఫిరాయింపులు ప్రోత్సహించి ప్రతిపక్షాలను నిర్మూలించాలని చూస్తున్నారు. ఆంధ్రకు తాను ఏకైక నాయకు డనిపించుకోవాలని చూస్తున్నారు. ప్రతిపక్షాలను అంత రెచ్చగొడితే వాళ్లు కలిసి వస్తారా?

మాఫీ అనగా తెలుగులో రీషెడ్యూలా?

ఆంధ్రలో బాబు నాయకత్వం రాగానే హైదరాబాదు నుండి పరిశ్రమలు దుకాణం ఎత్తేసి, తరలి వెళ్లిపోతాయి అని చాలామంది వూహించారు. ఇప్పటిదాకా ఆ దాఖలాలు ఏమీ కనబడటం లేదు. ఎట్‌లీస్ట్‌, ఎవరూ ప్రకటనలు చేయడం లేదు. సినీ పరిశ్రమ కూడా వేచి చూస్తోంది. ఏదో అద్భుతం జరుగుతుందని అందరూ ఎదురుచూస్తున్నారు. అక్కడ ప్రస్తుతం జోరుగా నడుస్తున్న యిండస్ట్రీ రియల్‌ ఎస్టేటు మాత్రమే. ఇప్పుడు కొనకపోతే ధరలు యింకా పెరిగిపోతాయనుకుంటూ అందరూ స్థలాలు కొంటున్నారు. డబ్బులు చేతులు మారుతున్నాయి. అంతిమంగా ఏ కల సాకారమవుతుందో తెలియదు. ఆయన దురదృష్టం, మొదటి విడతలో ఋతుపవనాలు దెబ్బ తీశాయి. వ్యవసాయ ఆధారితమైన రాష్ట్రం కాబట్టి దీని ప్రభావం బలంగా వుంటుంది. బాబు జమానాలో కేంద్రం నుండి ఓవర్‌ డ్రాఫ్టులు తెచ్చుకోవడం ఆనవాయితీగా వుండేది. రోశయ్యగారు ఆర్థికమంత్రి అయ్యాకనే అది ఆగింది. బాబు తిరిగి వచ్చారు. ఓవర్‌డ్రాఫ్టులూ తిరిగి రావచ్చు. పొరుగు రాష్ట్రాలతో గిల్లికజ్జాల విషయంలో బాబు సంయమనం పాటిస్తున్నారు. కేంద్రంతో కూడా స్నేహసంబంధాలు పాటిస్తున్నారు. ఆ హుందాతనమే ఆ రాష్ట్రానికి నిధులు తెచ్చిపెట్టవచ్చు. 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2014)

mbsprasad@gmail.com

మహేష్ ఙోకులు మామూలుగా వుండవు

టార్గెట్ 175.. కొడతారా? లేదా?