Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ట్రంప్‌ గెలుపు మన కనర్థమా?

ఎమ్బీయస్‌: ట్రంప్‌ గెలుపు మన కనర్థమా?

మన దేశంలో చాలామంది ప్రజలు ట్రంప్‌ విజయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అమెరికాకు, అది అగ్రరాజ్యం కాబట్టి ప్రపంచానికి శని పట్టిందని వాపోతున్నారు. అమెరికా మీడియా, దాని వలన ప్రభావితమైన భారతీయ మీడియా ట్రంప్‌ అపజయం ఖాయమని వాళ్లను ఊరిస్తూ రావడంతో ఫలితాలు చూశాక ఉసూరుమన్నారు. ట్రంప్‌ భారతీయులకు వ్యతిరేకి అని, మన ఉద్యోగాలు పీకేస్తాడనీ, అక్కడకు రానివ్వడని, అసలిప్పుడు అమెరికాకు వెళ్లి చదువు కోవాలంటే మనసు రావటం లేదని ఉస్సురన్నవాళ్లూ వున్నారు. అమెరికన్లు నాగరికులమనుకున్నామని, ట్రంప్‌ వంటి జోకర్‌ ప్లస్‌ విలన్ని ఎన్నుకుంటారని ఊహించలేదని చాలామంది ఖేదపడ్డారు. ట్రంప్‌ ముస్లిం వ్యతిరేకి కాబట్టి పాకిస్తాన్‌ను, చైనా దిగుమతులను వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి చైనాను శత్రువులుగా చూస్తాడని, తద్వారా మన జంట శత్రువుల పీచమణుస్తాడని ఆశ పడుతున్న కొందరు మాత్రం హర్షిస్తున్నారు. మన దేశం ఒక్కటే కాదు, ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెటు ట్రంప్‌ గెలుపుకి వ్యతిరేకంగా స్పందించింది. ఇండెక్స్‌ ధడాలున పడిపోయింది. బయటి దేశాల మాట ఎందుకు అమెరికాలోనే చూడండి. నేను నెగ్గితేనే ఎన్నికల ఫలితాన్ని ఆమోదిస్తాను అని ట్రంప్‌ అనడం కలకలం రేపింది. అతనికి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదని అందరూ తిట్టిపోశారు. కానీ ఫలితాలు వచ్చాక ప్రజాస్వామ్యవాదుల మని చెప్పుకునే హిల్లరీ మద్దతుదారులు ట్రంప్‌ మాటల్ని ఆచరణలో పెట్టి చూపారు. ట్రంప్‌ మా అధ్యక్షుడు కాడు అంటూ న్యూయార్కుతో సహా 25 ముఖ్యనగరాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించి అతని దిష్టిబొమ్మలు తగలేశారు. సిలికాన్‌ వ్యాలీలో అయితే మరీ ఘోరం. అక్కడి కంపెనీలు ట్రంప్‌కు యిచ్చిన దాని కంటె 114 రెట్లు అధికంగా హిల్లరీకి విరాళాలిచ్చాయి. ఇప్పుడు ఆమె ఓడిపోవడంతో అనేకమంది సిఇఓల మొహాలు మాడిపోయాయి. 9/11 నాటి ఉగ్రవాద దాడి కంటె భయంకరమైనది యీ 11/9 నాటి తీర్పు అంటున్నారు. అసలీ స్థాయిలో ఖేదమోదాలు అవసరమా అన్నది చూద్దాం. 

మొదటగా మనం ఆలోచించవలసినది, యీ గెలుపు రైట్‌ మలుపుకు సంకేతమా? అనే పాయింటు. కొందరు మేధావి పాత్రికేయులు అమెరికా రైట్‌కి టర్నింగు తీసుకుందని ఫీలవుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో మైనారిటీల పట్ల, విదేశీయుల పట్ల జాలి, కరుణ కలిగిన  ఉదారవాద సోషలిస్టు సమాజం వుందని అనుకునేవాళ్లు మాత్రమే యీ ధోరణిలో ఆలోచించాలి. నిజానికి గత 30 ఏళ్లగా అమెరికాలో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగాయి. సామాన్య ప్రజల స్థితి దిగజారుతూండగా కంపెనీలు విపరీతంగా లాభాలు గడిస్తున్నాయి. ఈ విషయమై అనేక గణాంకాలు చూశాం. ఇది సోషలిజమా? వామపక్షవాదమా? ఇతర విషయాలకు వస్తే ఒబామా 8 ఏళ్ల కాలంలో కంపెనీలను రక్షించడానికి సామాన్యుల నడ్డి విరిచాడు, వలసదారులను భారీ సంఖ్యలో పంపేశాడు, యుద్ధాలు కొనసాగించడంలో, యితర దేశాల వ్యవహారాల్లో తలదూర్చడంలో బుష్‌కు తీసిపోకుండా ప్రవర్తించాడు. మరి అలాటప్పుడు అతను లిబరల్‌ అనీ, అమెరికాది సోషలిస్టు లేదా ఎగాలిటేరియన్‌ సమాజం ఎలా అనగలం? ఈ 30 ఏళ్లల్లో పాలించిన రిపబ్లికన్లు, డెమోక్రాట్లు యిద్దరూ కలిసి అమెరికన్‌ సమాజాన్ని యిలా తగలేశారు. ట్రంప్‌ వచ్చి సరిదిద్దగలడని చెప్పలేం కానీ యింతకంటె అధ్వాన్నం కానీయడని అనుకోవచ్చు. చదువురాని వాళ్లే అతనికి ఓటేశారని తొలిదశలో అనుకున్నారు కానీ తరచి చూస్తే కాలేజీ చదువు చదివిన మహిళల్లో 45%, మగవాళ్లల్లో 54% అతనికి వేశారని తేలింది. అందుచేత వాళ్ల ఉద్యోగాలు కాపాడవలసిన బాధ్యతా అతనిపై వుంది.

అమెరికా ప్రజల నిరాశానిస్పృహలే ట్రంప్‌కు ఊపిరిగా పనిచేశాయి. 'ప్రభుత్వం నుంచి మీకు వచ్చింది ఎక్కువా? ప్రభుత్వం మీ నుంచి తీసుకున్నది ఎక్కువా?' అని సర్వేలో అడిగితే 72% మంది మేం యిచ్చిందే ఎక్కువ అన్నారు. ప్రభుత్వం పెద్దపెద్ద సంక్షేమ పథకాలు పెడుతోంది కదా, మీకు ఆనందమేనా? అని అడిగితే 69% మంది 'పథకం బజెట్‌ పెరిగిన కొద్దీ వృథా అయ్యేది ఎక్కువవుతుంది' అని అభిప్రాయపడ్డారు. మరి 'పరిస్థితులు మారాలా? ఉన్నదానితో సర్దుకుపోవాలా?' అని అడిగితే డెమోక్రాట్స్‌కు ఓటేసే వారిలో 65% మంది సర్దుకుపోవడం మంచిదన్నారు. రిపబ్లికన్లకు ఓటేసేవారిలో 65% మంది 'రాజీ పడితే లాభం లేదు. ప్రభుత్వం తిక్క కుదర్చాల్సిందే' అన్నారు. ఇలా మార్పు కోరేవాళ్లే ట్రంప్‌ని గెలిపించారు. వీళ్లు మీడియా హిల్లరీ పక్షపాతిగా వుందన్న కోపంతో పోల్‌ సర్వేలలో పాల్గొనడానికి యిష్టపడకపోవడంతో సర్వే ఫలితాలు అసమగ్రంగా, అసంబద్ధంగా వచ్చాయిట. మార్పు కోరి తనకు పదవి కట్టబెట్టిన తన దేశప్రజల కోసం ట్రంప్‌ ఏదో ఒకటి చేసి చూపించాలి. లేకపోతే అప్రతిష్ఠ పాలవ్వాలి. దేశప్రజలందర్నీ కలుపుకుని పోతా అంటూనే మెక్సికో సరిహద్దుల్లో కొంతమేర గోడ, మరి కొంతమేర ముళ్ల కంచె పెడతానని పునరుద్ఘాటించాడు. తన విధానాల వలన మెక్సికో ఏమంటుంది, భారత్‌ ఏమనుకుంటుంది అనేది ట్రంప్‌కు పెద్దగా పట్టకపోవచ్చు. ప్రపంచ నేతలుగా ఎదుగుదామనుకున్నవారు తమ ఖ్యాతి కోసం దేశప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తారు. ట్రంప్‌కు ప్రపంచ సభ్యసమాజంలో అర్జంటుగా పేరు తెచ్చేసుకోవాలనే తాపత్రయం వుందనుకోను. తొలుతగా అమెరికాలో ప్రజలను తృప్తి పరచాలి. అదే అతనికి ముఖ్యం. మన దేశపు ప్రయోజనాలను పక్కనపెట్టి ఆలోచిస్తే నిజానికి అదే మనకూ మంచిది కదా. 

గతంలో కమ్యూనిస్టుల గురించి మాట్లాడుతూ జోక్‌ చేసేవారు, రష్యాలో వాన వస్తే యిక్కడ వాళ్లు గొడుగులు పట్టుకుంటారు అని. ఇప్పుడు అమెరికాలో చల్లగాలి గట్టిగా వీస్తే తెలుగిళ్లల్లో తుమ్ములు రావడం మాత్రం ఖాయం. మన టీవీ ఛానెళ్లు, వెబ్‌సైట్లు, రియల్‌ ఎస్టేటు వ్యాపారాలు, చిన్న స్థాయి ఐటీ కంపెనీలు అన్నీ అమెరికాలోని తెలుగు ఎన్నారైల స్థితిగతులపై ఆధారపడి వున్నాయి. ఆ మధ్య మెల్ట్‌డౌన్‌ అయినప్పుడు యిక్కడ భూముల రేట్లపై ప్రభావం చూపింది. ప్రపంచంలో ఏ దేశం ఎటు పోయినా మనకు ఫికర్‌ లేదు కానీ, అమెరికాలో ఏదైనా జరిగితే మాత్రం దాని ప్రభావం మనవాళ్లపై వుంటుంది. అందువలన అమెరికా చల్లగా, స్థిరంగా వుండాలని కోరుకోవడంలో మన స్వార్థం వుంది. నిజానికి ట్రంప్‌ అధికారంలోకి రావడం వలన అక్కడ ఎన్నాళ్లగానో పాతుకు పోయిన తెలుగువాళ్లకి ఏ యిబ్బందీ వుండదు. సిటిజన్‌షిప్‌ వున్నవారికీ వుండదు. కొత్తగా వెళ్లడం మాత్రం కష్టతరం కావచ్చు. అది కూడా ట్రంప్‌ తన విధానాలను అమలు చేయగలిగితేనే! చేయగలడా?

ప్రస్తుతం సెనేట్‌లో రిపబ్లికన్లు 51 మంది, డెమోక్రాట్లు 46 మంది, యితరులు యిద్దరు వున్నారు. కీలక అంశాలపై 60 మంది మద్దతు వుంటేనే బిల్లు పాసవుతుంది. ఇక ప్రతినిథుల సభలో రిపబ్లికన్లు 238 మంది వుంటే డెమోక్రాట్లు 193 మంది వున్నారు. 218 మంది మెజారిటీ వుంటేనే బిల్లు పాసవుతుంది. ట్రంప్‌ తన పార్టీని తన వెంట తీసుకెళ్లడమే కాకుండా, డెమోక్రాట్లలో కొందరిని కూడా ఆకర్షించగలగాలి. డెమోక్రాటిక్‌ పార్టీ నామినేషన్‌కు హిల్లరీతో పోటీ పడి ఓడిపోయిన సోషలిస్టు బెర్నీ శాండర్స్‌ కార్మికుల సంక్షేమం కోసం ట్రంప్‌ చేసే పనులను సమర్థిస్తానన్నాడు. ''ప్రస్తుత పరిస్థితులతో విసిగి వేసారిన మధ్యతరగతిలోని నిరాశా నిస్పృహలను ట్రంప్‌ అర్థం చేసుకున్నాడు. వారికి ఉద్యోగాలు మళ్లీ తెప్పించే పని అతను తలపెడితే నా మద్దతు వుంటుంది'' అన్నాడు. లెఫ్ట్‌ వింగ్‌ డెమోక్రాట్‌ నాయకురాలు ఎలిజబెత్‌ వారెన్‌ కూడా తనకు ట్రంప్‌ అంటే యిష్టం లేకపోయినా కార్మికుల జీవితాల్లో మళ్లీ వెలుగు తెచ్చే ఆర్థిక వ్యవస్థను రూపొందిస్తానంటే మాత్రం సమర్థిస్తా అంది. 

ఇన్నాళ్లూ అమెరికా యితర ప్రాంతాల్లో పెత్తనం చలాయించడానికై నాటో వుంటి కూటములు ఏర్పరచి, కొన్ని దేశాలతో మిత్రత్వం నెరపి, ఆ పాలకులు నియంతలైనా, సైన్యాధిపతులైనా, ఎవరైనా సరే వారి కాపలాకు తన ఖర్చుతో తన సైన్యాన్ని అక్కడ పెట్టి వారి ప్రయోజనాలను కాపాడేది. దానికి తోడుగా తన సైనిక స్థావరాలను, నిఘా స్థావరాలను నిర్వహించుకోనివ్వాలని  కోరేది. ఇప్పుడు 'అమెరికా ఫస్ట్‌' అనే నినాదంతో ముందుకు వచ్చిన ట్రంప్‌ 'ఇకపై మా సైన్యాలను మీ దేశాల్లో వుంచాలంటే మీరు ఖర్చులు భరించండి. లేకపోతే సైన్యాన్ని వెనక్కి రప్పించేసుకుంటాం' అంటున్నాడు. 12 దేశాలతో అమెరికా ఏర్పరచిన పాన్‌-పసిఫిక్‌ ట్రేడ్‌ పాక్ట్‌ను ట్రంప్‌ తోసిరాజు అనాలంటున్నాడు. జపాన్‌, దక్షిణ కొరియాలు అణ్వస్త్రాలు తయారు చేసుకుంటే చేసుకోనివ్వండి అంటున్నాడు. అమెరికా మద్దతుతో ఎందరో నియంతలు దేశాలేలుతున్నారు. ఇప్పుడు హఠాత్తుగా అమెరికా మీ దారి మీరు చూసుకోండంటే వాళ్లు వూరుకుంటారా? గగ్గోలు పెట్టరా? 

ఐసిస్‌ చెలరేగడానికి ఒబామా సిరియా విషయాల్లో కలగజేసుకోవడమే అని ట్రంప్‌ కుండ బద్దలు కొట్టాడు. సిరియా అధ్యక్షుడు బషర్‌ నియంత, సందేహం లేదు. ఈజిప్టు తదితర అరబ్‌ దేశాల్లో ప్రభుత్వాలు తలకిందులవుతున్నపుడు తన చాప కిందకూ నీరు వస్తుందని అతను భయపడి, పాలనపై మరింత పట్టు బిగించాడు. అతని ప్రతిక్షకులు ఉద్యమాలు మొదలుపెట్టారు. అది వాళ్ల అంతర్గత వ్యవహారం. ఇద్దరూ కొట్టుకుని ఎవరో ఒకరు గెలుస్తారనుకుని వూరుకుంటే బాగుండేది. కానీ అమెరికా తగుదునమ్మా అని తలదూర్చి బషర్‌ని గద్దె దింపడానికి సకల యత్నాలు చేస్తూ, ప్రభుత్వవ్యతిరేకులకు ఆయుధాలందిస్తూ, సిరియా ప్రభుత్వాన్ని బలహీనపరిచింది. బషర్‌ రష్యా శరణు చొచ్చాడు. అమెరికాకు ప్రతిగా వాళ్లూ రంగంలోకి దిగారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో ఐసిస్‌ చొరబడి అమెరికా ఆయుధాలు చేజిక్కించుకోసాగింది. సిరియా శరణార్థులు యితర దేశాలకు వలస వెళ్లి స్థానిక కార్మికులకు ముప్పుగా పరిణమించడంతో ఆ దేశాల రాజకీయపరిస్థితి అల్లకల్లోలమైంది. ఇప్పటికైనా మాకెందుకు వచ్చిన గొడవ యిది అని అమెరికా వెనక్కి వెళ్లిపోయిన రోజున ఐసిస్‌ను బషర్‌, రష్యా కలిసి అణచగలగవచ్చు. ట్రంప్‌ సిరియా నుంచి తప్పుకుంటాడా? తప్పుకుంటే దేశప్రతిష్ఠ దెబ్బ తిందని డెమోక్రాట్లు అల్లరి చేయకుండా వుంటారా? అమెరికాలో బలమైన ఆయుధవ్యాపారుల లాబీ ఊరుకుంటుందా?

ప్రతిపక్ష నాయకుడిగా ఏదైనా మాట్లాడవచ్చు కానీ ఒకసారి అధికారంలోకి వచ్చాక, వున్నది మార్చాలంటే చాలా కష్టపడాలి. ఎన్టీయార్‌ సంప్రదాయ రాజకీయాల్లోంచి రాకపోవడం చేత, సాంకేతిక నిపుణులను సలహాదారులుగా పెట్టుకుని, ఎవరూ వూహించలేని కొత్త పథకాలను రూపొందించారు. రాజకీయ పర్యవసానాలు ఆలోచించకుండా సాహసంతో అమలు చేయగలిగారు. ట్రంప్‌ కూడా మామూలు రాజకీయ నాయకుడిగా రాలేదు. ఎన్టీయార్‌ తరహాలో విభిన్నంగా ఆలోచిస్తాడా లేక ప్రస్తుత వ్యవస్థనే కొనసాగిస్తాడా అన్నది కొంతకాలం పోతే తప్ప తెలియదు. కానీ యీ లోపున అతని గెలుపు యితర దేశాలపై ప్రభావం చూపవచ్చు.

బ్రెగ్జిట్‌కై గట్టిగా వాదించిన ఇండిపెన్‌డెన్స్‌ పార్టీ నాయకుడు నైజిల్‌ ఫరాగేకు మరింత స్ఫూర్తి నిచ్చినట్లవుతుంది. డిసెంబరు 4 న ఎన్నికల జరగబోతున్న ఆస్ట్రియా అధ్యక్ష ఎన్నికలలో ఫార్‌-రైట్‌ విధానాల ఫ్రీడమ్‌ పార్టీ నాయకుడు నార్బెర్ట్‌ హోఫర్‌ గెలవవచ్చు. ఇటలీలో ప్రభుత్వం ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణలను వ్యతిరేకిస్తున్న ఫైవ్‌ స్టార్‌ మూవ్‌మెంట్‌ నాయకుడు బెప్పో గ్రిలోను అధికారానికి దగ్గరగా తీసుకురావచ్చు. నెదర్లాండ్స్‌లో మార్చిలో జరిగే ఎన్నికలు జరగబోతున్నాయి. బ్రిటన్‌ తరహాలో తామూ ఈయూ నుండి వైదొలగాలని వాదిస్తున్న ముస్లిం వ్యతిరేక పార్టీ ఐన ఫ్రీడమ్‌ పార్టీ, అధికారంలో వున్న లిబరల్స్‌తో సమానస్థాయికి చేరుకుంది. ఫ్రాన్స్‌లో 2017 మేలో జరిగే ఎన్నికలలో ఫార్‌-రైట్‌ పార్టీ ఐన నేషనల్‌ ఫ్రంట్‌ లీడరు మెరీనా లె పెన్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హాలండ్‌పై గెలుపు సాధించవచ్చు. జర్మనీలో ఆగస్టులో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ ఛాన్సెలర్‌ ఏంజిలా మెర్కెల్‌ బలం క్షీణించి, ఫ్రాక్‌ పెట్రీ నాయకత్వంలోని రైటిస్టు పార్టీ ఐన ఆల్టర్నేటివ్‌ ఫర్‌ జర్మనీ పార్టీ బలం పుంజుకుంటోందని సర్వేలు చెపుతున్నాయి. 

ఇవన్నీ రైటిస్టు సిద్ధాంతాలపై ప్రపంచ దేశాలు మొగ్గు చూపుతున్నాయన్న భావన కలిగించవచ్చు. కానీ లోతుగా ఆలోచిస్తే, ప్రతీ దేశం తన సొంత ప్రయోజనాల గురించి ఎక్కువగా ఆలోచిస్తోందని అర్థమవుతోంది. గ్లోబలైజేషన్‌ పేరుతో యితర దేశాలను తమ అదుపులోకి తీసుకోవాలనే ఉద్దేశంతో అమెరికా, దానికి తోకలా వ్యవహరించిన యూరోప్‌ దేశాలు అనేక దేశాల వ్యవహారాల్లో కలగజేసుకున్నాయి. అమెరికా చేసే సహాయానికి ఆశపడి బ్రిటన్‌ సద్దాం గురించి చెప్పిన అబద్ధాలను నమ్మినట్లు నటించి ఇరాక్‌పై యుద్ధంలో పాలు పంచుకుంది. అలాగే ఎన్నో దేశాలలో చొరబడి, పెత్తనం చలాయించబూనడంతో సొంతింటి కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. తాము చేసిన పాపాలను కడుక్కోవడానికి శరణార్థులను ఆదరించడంతో స్థానికుల కడుపు మండింది. పాలకులకు బుద్ధి చెప్పారు. యూరోప్‌లోని యితర దేశాల్లో కూడా యిలాటి కారణాల వలననే ప్రాంతీయవాదం ప్రబలుతోంది. ఇయు పేరుతో గ్రీస్‌ వంటి కట్టుతప్పిన దేశాలను రక్షించడానికి, గట్టున పడెయ్యడానికి తమ దేశ ఆర్థికవ్యవస్థ నాశనమవుతోందని తక్కిన దేశాల ప్రజల ఆవేదన. గ్లోబలైజేషన్‌ పేరు చెప్పి యితర దేశస్తులు తమ దేశానికి వచ్చి ఉద్యోగాలు సంపాదించుకుని, తమ పొట్ట కొడుతున్నారని ఆక్రోశం. ఈ ఆందోళన లోంచి రక్షణవాదం (ప్రొటెక్షనిజం) పురి విప్పుకుంటుంది. ఇతర దేశాల వస్తువులను, మనుష్యులను స్వేచ్ఛగా రానివ్వకూడదనే నినాదం వూపందుకుంటుంది. 

ఇది ఉదారవాదం కాదని పాలకులు ప్రజలను మందలించబోవచ్చు. కానీ ఉదరం నింపుకోవడం కష్టమైనవారికి ఉదారవాదం కబుర్లు తలకెక్కవు. ఇదీ ఒకందుకు, కాదుకాదు, చాలా రకాలుగా మంచిది. ప్రపంచ శాంతి కాపాడడానికి స్వయంగా నియమించుకున్న పోలీసులం అనే భ్రమలు వదల్చుకుని తమ దేశప్రజల ప్రయోజనాలు పట్టించుకుంటే అదే మహ బాగు. ఈ యూరోప్‌ దేశాలను యిన్నాళ్లూ రెచ్చగొడుతూ వచ్చినది అమెరికాయే, మీకు ఆర్థికసాయం చేస్తానంటూ వాళ్లను వెంటేసుకుని పెత్తనం చేస్తూ ఎక్కడో అక్కడ యుద్ధం జరిగేట్లు చేసింది. ట్రంప్‌ హయాంలో అమెరికా యీ ధోరణి నుండి మరలితే అంతకంటె ఏం కావాలి? ఆయుధాల సరఫరా ఆగితే శాంతి నెలకొనేందుకు వీలు చిక్కుతుంది. శాంతి మాట ఎలా వున్నా ఆ యా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదుటపడి, ప్రజలకు తిండి, బట్టా దొరుకుతుంది.

తక్కిన దేశాల సంగతి ఎలా వున్నా, మన దేశంపై ప్రభావం ఎలా వుంటుంది అన్నదే మనకు ఎక్కువ ఆసక్తి కలిగిస్తుంది. భారతీయులు సాధారణంగా డెమోక్రాట్లకే మద్దతిస్తూ వచ్చారు. ఒబామాకు రెండు సార్లుగా ఓటేసినా అతను టెర్రరిజాన్ని అణచలేకపోయాడని ఫీలయి, యీ సారి వారిలో కొందరు ట్రంప్‌కు ఓటేశారు. హిల్లరీ పాకిస్తాన్‌ పక్షపాతి కావడం, ఆమె ముఖ్య సహచరురాలు హ్యూమా అబేదిన్‌ పాకిస్తాన్‌కు చెందిన ముస్లిము కావడం చేత పాకిస్తానీ అమెరికన్లు హిల్లరీకి మద్దతు పలకడం వారికి నచ్చలేదు. పన్నులు తగ్గిస్తానని ట్రంప్‌  చేసిన వాగ్దానం ధనిక భారతీయులను మెప్పించింది. పైగా అమెరికన్‌ అధ్యక్షులందరిలో తాను భారత్‌కు ఆత్మీయుడిగా వుంటానని ట్రంప్‌ అనడమూ నచ్చింది. 

కానీ మన భారతీయ మీడియా ట్రంప్‌ గెలుపును యింకా జీర్ణించుకోలేకపోతోందనే చెప్పాలి. వీసా నిబంధనలను కఠినతరం చేస్తాడట, ఔట్‌సోర్సింగ్‌ అడ్డుకుంటాడట అనే భయపడుతున్నారు. కాస్సేపు మన దృక్కోణం పక్కకు పెట్టి చూద్దాం. నిజానికి అమెరికాలో వ్యాపారరంగంలో వున్న భారతీయులకు ఏ ముప్పూ లేదు. చక్కగా చేసుకోవచ్చు. వైద్యులు, యితర సెల్ఫ్‌ ఎంప్లాయిడ్‌ కేటగిరిలో యిబ్బంది లేదు. ఇక మిగిలినది ఉద్యోగాల విషయంలోనే - బయటివాళ్లు వచ్చి ఉద్యోగాలు గుంజుకుంటున్నారనేగా దేశంలో అనేక ప్రాంతాల్లో 'భూమిపుత్రులు' ఉద్యమం వచ్చింది. చైనా దిగుమతులను అడ్డుకోవాలని యీ మధ్య దీపావళి సమయంలో మనవాళ్లు ఎంత ప్రచారం చేశారు, దాన్ని తప్పు అనగలమా? ఎవరైనా నార్త్‌ ఇండియన్‌ మన దగ్గర ఫ్యాక్టరీ పెట్టి ఏ బిహారీ వాళ్లతోనే ఉద్యోగాలు భర్తీ చేస్తే గోల చేయమా? 'దుమ్ము మాకు, ఉద్యోగాలు వాళ్లకీనా? స్కిల్‌ వున్నా లేకపోయినా మాకూ ఉద్యోగాలివ్వాలి, ఆ మాటకొస్తే మాకే యివ్వాలి' అని ఆందోళన చేయమా? ఆ మాటే అమెరికన్లు అడుగుతున్నారు. తప్పేముంది? అమెరికన్‌ కంపెనీలకు ఋణాలు, పన్ను రాయితీలు ఆ ప్రభుత్వం ఎక్కణ్నుంచి యిస్తోంది? అక్కడ పన్ను కట్టే సామాన్యుడి జేబులోంచే కదా!

అమెరికాలో ఎచ్‌1 బి వీసాలపై పరిమితి 65 వేలు. దాన్ని పెంచమని కంపెనీలు అడుగుతున్నాయి. ట్రంప్‌ ఖాయంగా పెంచడు. అమెరికాలో టాలెంటెడ్‌ ఉద్యోగులు దొరకనప్పుడే ఆ వీసా కింద పరదేశస్తులను దిగుమతి చేసుకోవాలి. దాన్ని నిరూపించడం కష్టం. ఇటీవల ఫ్లారిడాలోని డిస్నీలాండ్‌లో అమెరికన్లకు తీసివేసి ఇండియన్లను పెట్టారు. నైపుణ్యం పెద్దగా లేని స్థానికులకు కూడా ఉద్యోగాలు యిస్తేనే ఇండియన్‌ కంపెనీలను అనుమతించే పరిస్థితి రావచ్చు. దీన్ని ట్రంప్‌ విమర్శించాడు. భారత్‌ గురించి అతను రెండు రకాలుగానూ మాట్లాడాడు. సాంకేతికత పరిజ్ఞానం ఎక్కువ అవసరంగా వున్న ఉద్యోగాలలో భారతీయులున్నా ఫరవాలేదని, చిన్న ఉద్యోగాల్లో అక్కరలేదని అతని భావం కావచ్చు. 

అమెరికాలో ఏటా యిచ్చే 1.40 లక్షల ఎంప్లాయ్‌మెంట్‌ గ్రీన్‌కార్డుల సెలక్షన్‌లో ఒక్కో దేశ పౌరులకు 7% కోటా చొప్పున యిచ్చే పద్ధతి వుంది. ఉదాహరణకి నేపాల్‌ నుంచి తక్కువమంది వెళతారు కాబట్టి ఎచ్‌1 వీసా వున్న నేపాలీకి ఏడాదికే గ్రీన్‌ కార్డు వచ్చేయవచ్చు. మన దేశం నుంచి చాలామంది వెళతారు కాబట్టి మన ఎచ్‌1 బి వీసా హోల్డరుకు గ్రీన్‌ కార్డు రావడానికి 12 ఏళ్లు పట్టవచ్చు. ఈ కోటా సిస్టమ్‌ మాట ఎలా వున్నా ఎమ్మెస్‌ చదివేవారిలో 20 వేల మందికి కూడా యిచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తామని హిల్లరీ అంది. 2015-16 సం||రంలో అమెరికాలో మొత్తం 10.44 లక్షల విదేశీ విద్యార్థులు కాలేజీ, యూనివర్శిటీ స్థాయిలో వున్నారు. వీరు మొత్తం విద్యార్థుల్లో 5%. కితం ఏడాదితో పోలిస్తే 7% విద్యార్థులు పెరిగారు. వీరిలో 1.66 లక్షల మంది భారతీయ విద్యార్థులు కాగా, వారిలో 25% మంది తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లినవారే. నిజానికి మనవాళ్లల్లో ఎమ్మెస్‌ చదివిన అందరూ హైలీ-స్కిల్‌డ్‌ జాబ్స్‌లో లేరు. ఎమ్మెస్‌ చదువుకోవడానికి వెళుతున్నాం అనడం, అక్కడ చట్టవిరుద్ధంగా చిల్లరమల్లర ఉద్యోగాలు చేయడం జరుగుతోంది. దీన్ని ట్రంప్‌ అడ్డుకోవచ్చు. కాదనలేని పరిస్థితి కదా. బోగస్‌ యూనివర్శిటీలలో చదువు పేరు చెప్పుకుని అక్కడకు వెళ్లి రూల్సుకు వ్యతిరేకంగా హోటళ్లలో సర్వర్‌గా చేయడమేమిటి? స్థానికులకు ఉద్యోగాలు ఊడగొట్టి, పొట్టకొట్టడం కాకపోతే! అమెరికా వెళ్లిన మనవాళ్లకు ఉద్యోగం పోతే యింటి నుంచి డబ్బు పంపిస్తారు. ఓ ఆర్నెల్లు చూసి యింకా ఉద్యోగం రాకపోతే యింటికి వచ్చేయరా, పొలం చూసుకుందువు గాని అంటారు. అదే అమెరికన్‌కు ఉద్యోగం పోతే ఎక్కడకి వెళ్లగలడు? వాళ్ల సమాజంలో తలిదండ్రులు డబ్బు పంపే విధానం అరుదు కదా!

విదేశాల్లో నెలకొల్పుకున్న సంస్థలపై 35% పన్ను విధిస్తానని ట్రంప్‌ అంటున్నాడు. అమెరికన్‌ కంపెనీలు ఎచ్‌1బి వీసాలిచ్చి విదేశాల నుంచి తెప్పించుకునే ఉద్యోగులకు కనీస వేతనం 60 వేల నుంచి 80 వేలుండాలనే రూలు వుంది. ఇకపై కనీసం లక్ష డాలర్ల వేతనం వున్నవారికే ఆ వీసా యిస్తామనేే నిబంధన ట్రంప్‌ పెడతానంటున్నాడు. ఎల్‌1, బి1 వీసాలున్న మన దేశస్తులు చాలామందికి 45 వేల నుంచి 60 వేల డాలర్ల జీతం మాత్రమే వస్తోందట. ఆ నిబంధన వస్తే సీనియర్‌ ఉద్యోగులకు మాత్రమే ఆ వీసా ఛాన్సు వస్తుంది. తక్కినవారికి వీసా కష్టమే. అలా అయితే మనవాళ్లు అమెరికాకు వెళ్లడం కష్టమవుతుంది. అదే మన భయం. 

కానీ తను చెప్పినవన్నీ ట్రంప్‌ అమలు చేయగలుగుతాడా లేదా అన్నదే పెద్ద సందేహం. ట్రంప్‌ కంపెనీల్లోనే ఔట్‌సోర్సింగు చేసుకుంటున్నారు. ఔట్‌సోర్సింగు లేకుండా, భారతీయుల సేవలు అస్సలు వినియోగించుకోకుండా వుండడం బండి లాక్కుని రావడం ఏ అమెరికన్‌ కంపెనీకైనా ప్రస్తుతం కష్టమే. రాత్రికి రాత్రి మార్పు తీసుకురాలేరు. ట్రంప్‌ మొండిగా వుంటే క్రమేపీ తగ్గించుకుంటూ, స్థానికులకు తర్ఫీదు యిచ్చుకుంటూ రావాలి. ఇది ఏ రెండు, మూడేళ్లో పట్టే ప్రక్రియ. ఈ లోపున మన కొంపలు మునిగిపోతాయని అనుకోవడం అనవసరం. ఒకవేళ అలాకాకుండా  వెంటనే మార్పు వచ్చేస్తుందని, భారతీయులకు అమెరికా ఛాన్సులు క్షణాల్లో యిగిరిపోతాయని, అమెరికన్‌ ఔట్‌సోర్సింగ్‌పై ఆధారపడిన యిక్కడ ఐటీ పరిశ్రమ దెబ్బతింటుందని అనుకుని ఆలోచిస్తే...?

గత రెండు దశాబ్దాలుగా భారతదేశంలో ఐటీ పరిశ్రమ పుంజుకుంది తప్ప అంతకుముందు మనం బతకలేదా? ఎదగలేదా? నిజానికి ఐటీ ఎదుగుదల మన దేశాన్ని, ముఖ్యంగా మన తెలుగు సమాజాన్ని చాలా ప్రభావితం చేసింది. మనవాళ్లు అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు తెచ్చుకోవడం గతంలో అరుదుగా వుండేది. ఐటీ ఉద్యోగాలు వచ్చాక ప్రతీ వూరు నుంచి కనీసం పదిమంది అమెరికా వాసులు కనబడుతున్నారు. స్థానికంగా కూడా ఐటీ, ఐటీ సంబంధిత ఉద్యోగాలు పెరిగి, మనవాళ్లు ఆన్‌సైట్‌ వెళుతున్నారు. దానివలన మంచే కాదు, చెడూ జరిగింది. ఐటీ ఉద్యోగాల పేర పెద్దగా ప్రతిభ లేనివాళ్లకు సైతం విపరీతంగా జీతాలు రావడంతో, అందరూ తక్కిన ఉద్యోగాలు వదిలేసి వాటిపై పడ్డారు. ఇతర కంపెనీ యజమానులకు ఉద్యోగులు దొరకడం దుర్లభమవుతోంది. ఐటీ తప్ప తక్కిన ఇంజనీరింగు విభాగాలు మూలపడ్డాయి. వాటిలో చదివినవారు కూడా ఆ బ్రాంచ్‌ వదిలిపెట్టి, ఐటీకి మారిపోయారు. ఐటీకి దారి తీసే ఇంజనీరింగు తప్ప తక్కినవేవీ చదువులు కావనే ధోరణిలో పడ్డారు. బేసిక్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లు, ఆర్ట్‌స్‌, హ్యుమానిటీస్‌, కామర్స్‌, లా, సెక్రటరీషిప్‌ - వీటిలో చదవడం న్యూనతగా భావించసాగారు. చదువు పూర్తవుతూనే నెలకు పాతిక వేల జీతం కళ్ల చూడడంతో కొందరు ఐటీ వాళ్లకు కళ్లు తిరిగి, తక్కిన వృత్తులను చులకనగా చూడసాగారు. ఇలాటి హడావుడి చూసి సమాజంలో వారి పట్ల వ్యతిరేక ధోరణి ప్రబలింది. వాళ్లపై, వాళ్ల జీవనశైలిపై, సంసారాలపై జోకులు పుట్టుకుచ్చాయి. 

ఎన్నారైలు యిళ్లకు పంపించే డబ్బు వలన యిక్కడి రియల్‌ ఎస్టేటు ప్రభావితమైంది. ఉత్తిపుణ్యాన స్థలాల ధరలకు రెక్కలొచ్చి, తక్కినవారికి అందుబాటులో లేకుండా పోయాయి. ఎన్నారైలు ప్రత్యేక జాతి అనే భావాన్ని కలిగిస్తూ వారి కోసమే కట్టామంటూ కొన్ని వెంచర్లు వెలిశాయి. అది సమాజంలో వారి పట్ల యితరులకు అసూయ పెంచాయి. అమెరికాలో మాంద్యం ఏర్పడినప్పుడు ఆ ప్రభావం యిక్కడా చూపింది. ఎన్నారైల తలిదండ్రులకూ కొమ్ములు వచ్చాయి. పిల్లల పేర ఆస్తులు కొనడమూ, సంరక్షించడమూ, అమ్మడమూ, వాటి గురించి గొప్పలు చెప్పడమూ వారికి ముఖ్యవ్యాపకమైంది. ఓపికున్నంత కాలం అమెరికా వెళ్లి పిల్లలకు పనులు చేసిపెట్టడం, ఓపిక తగ్గాక ఓల్డ్‌ ఏజ్‌ హోంలో చేరినప్పుడు వాళ్లని తిట్టుకోవడమూ జరుగుతోంది. 

ఐటీ వాళ్ల ఉద్యోగాల్లో కూడా స్థిరత్వం లేకుండా పోయింది. పని చేస్తే అదే చేయడమూ, లేకపోతే బెంచ్‌పై కూర్చోవడమూ, ఉద్యోగంలో ఆటుపోట్లు వస్తే తట్టుకునే మానసిక స్థయిర్యం లేక అఘాయిత్యాలకు పాలుపడడమూ..! ఉద్యోగభద్రత లేకపోవడం చేత ప్రతి చిన్నదానికి ఆందోళన పడి, ఆరోగ్యం చెడగొట్టుకోవడం, కాపురాలు పాడుచేసుకోవడం కూడా తక్కిన వర్గాల్లో కంటె వీరిలో ఎక్కువగా కనబడుతోంది. వచ్చినంతకాలం డబ్బు వచ్చిపడడం తప్ప ఐటీ ఉద్యోగాలలో ఏదో సాధించామన్న తృప్తి పెద్దగా కనబడటం లేదు. మనవాళ్లు ఐటీ రంగంలో యింతమంది వున్నా సాధించిన పేటెంట్లు ఎక్కువగా కనబడవు. రొటీన్‌ పని చేయడమే తప్ప, సృజనాత్మకంగా పనిచేసేవారు తక్కువ. చైనీయులు గట్టిగా పట్టుబట్టి ఇంగ్లీషు నేర్చుకుని తక్కువ జీతాలకు సిద్ధపడి మనకు పోటీ వస్తే పదేళ్ల తర్వాత మనం యీ రంగంలో ఎక్కడ వుంటామో తెలియదు. ప్రస్తుతం అమెరికా వాళ్ల వుద్యోగాలు వూడగొట్టి అవి మనకిస్తున్న అమెరికా కంపెనీలు, రేపు మనల్ని యింటికి పంపించి చైనావాళ్ల కివ్వవచ్చు. ఈ సినారియోలో ఐటీ ఉద్యోగాలకు మోజు తగ్గితే నష్టమేముంది?

అమెరికా, యితర యూరోప్‌ దేశాలు గ్లోబలైజేషన్‌ పక్కనపెట్టి లోకలైజేషన్‌ (ట్రంప్‌ అమెరికా ఫస్ట్‌ అంటున్నాడుగా)కి మరలితే కూడా మనకు నష్టం లేదు. గ్లోబలైజేషన్‌ వలన మన దేశస్తులు కొందరు విదేశాల్లో డబ్బులు సంపాదించారు కానీ, తక్కిన ప్రజలకు చాలా నష్టమే జరిగింది. పాతికేళ్ల గ్లోబలైజేషన్‌ వలన మన దగ్గర ఆర్‌ అండ్‌ డి (పరిశోధన, అభివృద్ధి) అడుగంటింది. (దాని గురించి వేరే వ్యాసంలో వివరిస్తాను) మాన్యుఫేక్చరింగ్‌ మానేశాం. మన దగ్గరే ఎచ్‌ఎంటి, ఆల్విన్‌ వంటి కంపెనీలు వాచీలు తయారుచేసేవి. అవి మూతపడి, యిప్పుడు ఫారిన్‌ సరుకులే కొంటుంన్నాం. ఒకప్పుడు చౌక సరుకులు పంజాబ్‌, హరియాణాల నుండి వచ్చేవి. ఇప్పుడు వాటి స్థానంలో చైనా వస్తువులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. మనం సర్వీసెస్‌పై పడి, తయారీ రంగాన్ని అటకెక్కించాం. తాము తయారుచేసిన వస్తువులు కొనేవాళ్లు లేక స్థానిక పరిశ్రమలు మూతపడుతున్నాయి. నిరుద్యోగం ప్రబలింది. సమాజంలో అశాంతి పెరిగింది. విదేశీ శక్తులు మన మార్కెట్‌ను కైవసం చేసుకున్నాయి. బాలన్స్‌ ఆఫ్‌ ట్రేడ్‌ తూకం తప్పి ఎగుమతుల కంటె దిగుమతులు విపరీతంగా పెరిగాయి. ఆర్థికవ్యవస్థ కుంటుపడింది. ద్రవ్యోల్బణం పెరిగింది. మన మార్కెట్‌లో మన సరుకులే ప్రధానంగా అమ్ముడు పోవాలంటే గ్లోబలైజేషన్‌ నుండి బయటకు రావాలి. ఆ పరిస్థితుల్లో ఎగుమతులు చేయడం కుదరకపోయినా ఫర్వాలేదు. మన సరుకులు అమ్ముడు పోయేటంత పెద్ద మార్కెట్టు మనకే వుంది. 

చివరిగా చెప్పేదేమిటంటే - ఏది జరిగినా మన మంచికే. ఆందోళన చెందవలసిన పని లేదు. ట్రంప్‌ నిజంగా తన వాగ్దానాలు నెరవేర్చి, యితర దేశాల వ్యవహారాల్లో తల దూర్చడం మాని, కంపెనీలకు పన్నులు తగ్గించి, వెనక్కి వచ్చేందుకు ఆకర్షించి, ఔట్‌సోర్సింగ్‌ విధానంపై ఆంక్షలు పెట్టి, అంతిమంగా స్థానికులకు ఉద్యోగాలు వచ్చేట్లా చేస్తే అమెరికా బాగుపడుతుంది. అది బాగుపడితే ప్రపంచం బాగుపడుతుంది. గ్లోబలైజేషన్‌ స్థానంలో స్వీయరక్షణవాదం వస్తే మనమూ బాగుపడతాం. దిగుమతులు తగ్గి, పారిశ్రామికీకరణ హెచ్చి, మన దగ్గరా ఉద్యోగాలు పెరుగుతాయి. మనకు కావలసినది నైపుణ్యం పెంచుకోవడం, కష్టపడే స్వభావం వదులుకోకపోవడం, తయారు చేసే వస్తువుల నాణ్యత కాపాడుకోవడం, ఉద్యోగిగానైనా, వ్యాపారిగా నైనా నీతి, నిజాయితీ, క్రమశిక్షణలను నమ్ముకోవడం. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2016)

[email protected]

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?