Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ట్రంప్‌ యిక్కట్లు

ఎమ్బీయస్‌: ట్రంప్‌ యిక్కట్లు

ఇప్పటిదాకా ఏ రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ఎదుర్కోని కష్టాన్ని ట్రంప్‌ ఎదుర్కుంటున్నాడు. ఒక సర్వే ప్రకారం అతని అభ్యర్థిత్వాన్ని ఆమోదించని రిపబ్లికన్లు పార్టీ అభిమానులు సగం కంటె ఎక్కువమంది, కరక్టుగా చెప్పాలంటే 54% మంది వున్నారు. హిల్లరీ అభ్యర్థిత్వాన్ని ఆమోదించని డెమోక్రాట్లు కూడా వున్నారు. వారి శాతం 44. మరో సర్వే ప్రకారం హిల్లరీ డెమోక్రాట్లమని చెప్పుకునే వారిలో 85% మంది అభిమానాన్ని చూరగొనగా, ట్రంప్‌ విషయంలో అది 78% మాత్రమే. ఎలా చూసినా, హిల్లరీ వెనుక డెమోక్రాట్లు నిలిచిన స్థాయిలో ట్రంప్‌ వెనుక రిపబ్లికన్లు లేరనేది వాస్తవం. డెమోక్రాట్‌ నాయకుల్లో హిల్లరీని విమర్శించేవాళ్లు లేరు కానీ, ట్రంప్‌ను అనేకమంది నాయకులు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. 

రిపబ్లికన్‌ సమావేశంలో, తనను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ట్రంప్‌ ఎన్నో పొరపాట్లు చేశాడు. రష్యన్‌ గూఢచారులను హిల్లరీ ఈమెయిలు ఎక్కవుంటును హ్యేక్‌ చేయమంటూ పిలుపిచ్చాడు. 'హిల్లరీ ఎన్నికైతే ఆమె నియమించే జడ్జి ఆయుధాలు ధరించే హక్కు యిచ్చే రెండో సవరణ (సెకండ్‌ ఎమెండ్‌మెంట్‌) తొలగించవచ్చు. అప్పుడు మీరూ నేనూ ఏమీ చేయలేం. చేస్తేగీస్తే గన్‌లాబీల వాళ్లే ఏమైనా చేయాలి' అంటూ గన్‌ లాబీల మీద వేసిన జోకు వికటించింది. హిల్లరీని హత్య చేయమని ప్రేరేపించినట్లుందని అందరూ విమర్శించారు. అన్నిటిని మించి గోల్డ్‌స్టార్‌ సైనికుడి కుటుంబంతో అనవసరంగా గొడవలు పెట్టుకున్నాడు. ''మేం ముస్లిలం. 2004లో ఆత్మాహుతి దాడిలో ఇరాక్‌ నేలపై అమెరికా కోసం ప్రాణాలర్పించిన సైనికుడు హుమయూన్‌ నా కొడుకు. మరి నువ్వేం త్యాగాలు చేశావ్‌?'' అని ఖిజిర్‌ ఖాన్‌ అనే సైనికుడి తండ్రి ప్రశ్నిస్తే ''బిల్డింగులు కట్టాను, ఉద్యోగాలు యిచ్చాను'' అంటూ కుంటి సమాధానం యివ్వడంతో బాటు 'ఆ వేదిక మీదనే వున్న తల్లి ఎందుకు మాట్లాడలేదు? బహుశా బహిరంగ ఉపన్యాసాలివ్వకూడదని మతపరమైన ఆంక్షలున్నాయేమో' అంటూ ఇస్లాంపై తన ద్వేషాన్ని మరోసారి కక్కాడు. బాధాతప్త హృదయం కారణంగా మాట్లాడలేకపోయింది కానీ, మతపరంగా నిషేధం ఏమీ లేదని ఖిజిర్‌ ఖాన్‌ జవాబిచ్చాడు. అంతకు ముందే ''2001లో వ(ర)ల్డ్‌ ట్రేడ్‌ సెంటరు కూలిపోయినపుడు న్యూ జెర్సీలోని ముస్లిములు హర్షధ్వానాలు చేసిన సంగతి టీవీల్లో వచ్చింది. ఆ ఫుటేజి నేను కళ్లారా చూశాను.'' అని చెప్పాడు ట్రంప్‌. అసలలాటి ఫుటేజే లేదని టీవీ వర్గాలు చెప్పినా ట్రంప్‌ తన మాట వెనక్కి తీసుకోలేదు. 'నిజానిజాలతో సంబంధం లేకుండా యితను ముస్లిములపై ద్వేషం కక్కుతున్నాడు, ముస్లిములు యితను చిత్రీకరిస్తున్నంత చెడ్డవాళ్లు కారేమో' అని ప్రజలు అనుకుంటున్న తరుణంలో దేశభక్తుడి తల్లి గురించి ట్రంప్‌ చేసిన యీ వ్యాఖ్యలు వారిలో చికాకును పెంచాయి. అది ఏ మేరకు అని సర్వే చేయిస్తే 70% మంది అని తేలింది. వారిలో 59% మంది రిపబ్లికన్లే. 

ఆ ముస్లిము దంపతులు డెమోక్రాటిక్‌ పార్టీ సమర్థకులు కాబట్టి ట్రంప్‌ అలా మాట్లాడేడు అనుకోవడానికి లేదు. తన పార్టీలోని సహచరులమీదే అతను దయాదాక్షిణ్యాలు చూపటం లేదు. అతనితో పోటీ పడి ఓడిపోయిన టెడ్‌ క్రూజ్‌ సమావేశంలో ట్రంప్‌ విధానాలను విమర్శిస్తూ వుంటే ట్రంప్‌ అభిమానులు గోలగోల చేశారు. టెక్సాస్‌ వాస్తవ్యురాలైన క్రూజ్‌ భార్య మాజీ కాల్‌ గర్ల్‌ అనీ, ఆమె తన కస్టమర్లకు ఫోన్లు చేస్తూండగా తను ఆ గదిలోనే వున్నాననీ అన్నాడు. కెనెడీను హత్య చేసిన ఆస్వాల్డ్‌తో బాటు క్రూజ్‌ తండ్రి వున్న ఫోటో చూపించి, హత్యలో అతనికీ హస్తం వుందన్న పుకారు గురించి ప్రస్తావించి అతన్ని అవమానించాడు. ట్రంప్‌తో పోటీ చేసి ఓడిపోయిన ఒహైయో గవర్నర్‌ జాన్‌ కాసిక్‌, ఓటమి తర్వాత ట్రంప్‌ కుమారుడు తనకు వైస్‌ప్రెసిడెంటు పదవి యివ్వజూపాడని చెప్పుకుంటే, అదేమీ లేదని చెప్పించాడు. ఓటమికి, అవమానాన్ని జోడించాడు. తన మైనారిటీ, మెక్సికన్‌ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ వచ్చిన సాటి రిపబ్లికన్‌ నాయకుడు, స్పీకరు పాల్‌ ర్యాన్‌ను ప్రైమరీలలో ఎండార్స్‌ చేయడానికి తిరస్కరించి అవస్థ పెట్టాడు. 2008లో పార్టీ అభ్యర్థి ఐన జాన్‌ మెకైన్‌ గురించి మాట్లాడుతూ ''అతను యుద్ధంలో పట్టుబడిపోయాడు కాబట్టి వార్‌హీరో అంటున్నారు, పట్టుబడని వాళ్లంటేనే నాకు గౌరవం'' అన్నాడు. పార్టీకి అది నచ్చలేదు. యుద్ధవీరులందరినీ అది బాధిస్తుందనే అభిప్రాయంతో ట్రంప్‌ను క్షమాపణ చెప్పమంది. కానీ అతను మొరాయించాడు. చివరకు మెకైన్‌ను ఎండార్స్‌ చేశాడు. 

ఇక క్యాంపెయిన్‌ పరంగా చేసిన పొరపాట్లు కూడా చాలా వున్నాయి. 13 మందితో ఎకనమిక్‌ ఎడ్వయిజరీ కమిటీ వేస్తే దానిలో ఒక్క మహిళయినా లేదు. మగవాళ్లలో నిపుణులైన ఎకనమిస్టులు ముగ్గురే ముగ్గురున్నారు. ఓ డిబేట్‌లో ఫాక్స్‌ టీవీకి చెందిన మహిళా యాంకర్‌ గురించి అశ్లీలం స్ఫురించేలా వ్యాఖ్యానించాడు. ఒక శ్వేతజాతీయుడు నల్లవారి చేతిలో హతులైన శ్వేతజాతీయుల సంఖ్యను విపరీతంగా పెంచి ట్వీట్‌ చేస్తే, ట్రంప్‌ దాన్ని రీట్వీట్‌ చేశాడు. నీ గణాంకాలు తప్పు, వాటిని ఎలా ప్రచారం చేస్తావు అని అడిగితే రీట్వీట్‌లలో వుండే అంకెలకు తను బాధ్యుణ్ని కానన్నాడు. విదేశాలు అమెరికాను ఎలా దోచుకుంటున్నాయో చెప్పడానికి ఉదాహరణగా 'ఇరాన్‌లో బందీలుగా పట్టుకున్న అమెరికన్‌ పౌరులను విడిపించడానికి 400 మిలియన్‌ డాలర్ల సొమ్ముతో అమెరికన్‌ విమానం వెళ్లడం నేను చూశాను.' అని ట్రంప్‌ చెపుతూంటాడు. 'ఆ వీడియో ఫుటేజి ఇరాన్‌లోది కాదు, జెనీవాలోని ఖైదీలను విడిపిస్తున్నది' అని సొంత క్యాంప్‌ మేనేజర్లు చెప్పినా ట్రంప్‌ వినకుండా మళ్లీమళ్లీ ఆ కథ రిపీట్‌ చేస్తున్నాడు. తన మీద నడుస్తున్న ఓ కేసులో ఫలానా జడ్జి తన పట్ల న్యాయబద్ధంగా వ్యవహరించకపోవచ్చని, దానికి కారణం అతని తలిదండ్రులు మెక్సికన్లని అన్నాడు. 

ఇలా మైనారిటీల పట్ల, విదేశీయుల పట్ల, మహిళల పట్ల అబద్ధాలాడుతూ వ్యతిరేక ప్రచారం చేస్తే గెలవడం ఎలా అని అనుకున్న 50 మంది అనుభవజ్ఞులైన రిపబ్లికన్లు ట్రంప్‌ను వ్యతిరేకిస్తూ ఉత్తరం రాశారు. అనేకమంది కాంగ్రెసుమెన్‌, కొందరు సెనేటర్లు కూడా 'ట్రంప్‌కు ఓటు వేయం' అని చెప్పసాగారు. ప్రచారంలో భాగంగా ట్రంప్‌ తమ నగరానికి వస్తే రిసీవ్‌ చేసుకునేందుకు ఎయిర్‌పోర్టులకు రాని, తమ సభల్లో మాట్లాడించని నాయకులెందరో! ఈ వరసంతా చూసి రిపబ్లికన్‌ పార్టీ బాస్‌ రైన్స్‌ ప్రైబస్‌ ట్రంప్‌కు ఫోన్‌ చేసి ''మన పార్టీ అంతర్గతంగా జరిపిన సర్వేలో నీ ఓటమి తథ్యం అని తేలింది. రాబోయే వారాల్లో నీ ధోరణి మారి, నీ పాప్యులారిటీ పెరగకపోతే యిక నీ ఎన్నికపై ఆశ వదులుకుని, పార్టీ శక్తియుక్తులను, ఆర్థిక వనరులను హౌస్‌, సెనేట్‌ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మళ్లించాలని రిపబ్లికన్‌ నేషనల్‌ కమిటీ ఆలోచిస్తోంది.'' అని చెప్పాడట. దెబ్బకి ట్రంప్‌కి దిమ్మ తిరిగిపోయిందట. ''నేను పార్టీ కోసం, దాని అభ్యర్థుల కోసం లక్షలాది డాలర్లు పోగుచేస్తున్నది యిందుకేనా?'' అని అడిగాడట. ఈ మధ్యే అతను 8 లక్షల డాలర్ల ఫండ్స్‌ సేకరించడానికి డిన్నర్‌ ఏర్పాటు చేశాడు. అనేకమంది 50 వేల డాలర్లకు చెక్కులు రాసి యిచ్చారు. ఇదంతా తనను చూసే అని ట్రంప్‌ నమ్మకం. ''నువ్వు కాస్త మృదువుగా, లౌక్యంగా, యీజీగోయింగ్‌గా మాట్లాడు అని నాకు సలహా చెపుతున్నారు నా హితైషులు. సరే అలాగే కానీయండి, అది దేశాధ్యక్షుడికి యిలాటి గుణాలు మాత్రమే వుంటే దేశానికి అది మంచి చేస్తుందో లేదో నాకు తెలియటం లేదు. హిల్లరీని నెగ్గించాలని ఆమె పార్టీ యాడ్స్‌పై యిప్పటికే 240 మిలియన్‌ డాలర్ల ఖర్చు పెట్టింది (యిది అతిశయోక్తి). మరి నా విషయంలో నేను ఒక్క సెంటు కూడా ఖర్చు పెట్టలేదు, పెట్టించలేదు.'' అని చెప్పుకున్నాడు ట్రంప్‌. 

ఇలా లౌక్యం లేకుండా, మొరటుగా, ఉన్నదున్నట్లు (?) మాట్లాడడం కూడా చాలామంది శ్వేతజాతి ఓటర్లకు నచ్చుతోంది. సర్వేలో 65% మంది హిల్లరీ హిపాక్రసీని ఎండగట్టారు. నమ్మదగిన వ్యక్తి కాదన్నారు. విదేశీ శక్తులతో కుమ్మక్కయి, దేశానికి ముప్పు తెచ్చిపెట్టగల దనుకుంటున్నారు. ప్రస్తుతం వున్న దుర్భర పరిస్థితి కొనసాగాలంటే హిల్లరీకి, మార్పు కావాలంటే ట్రంప్‌కు వేయాలని అనుకుంటున్నారు. కాస్త తెలివితక్కువగా, మూర్ఖంగా వున్నా ట్రంప్‌ అమెరికా భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నాడని నమ్ముతున్నారు. వీరి సంఖ్య పెరిగిన కొద్దీ రిపబ్లికన్‌ పార్టీ నాయకులు తమ అపనమ్మకాలను, అభిప్రాయభేదాలను పక్కనపెట్టి, అతని చుట్టూ మూగవచ్చు.  

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?