Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఉజ్బెకిస్తాన్‌ నియంత కరిమోవ్‌ మృతి

ఎమ్బీయస్‌: ఉజ్బెకిస్తాన్‌ నియంత కరిమోవ్‌ మృతి

ఇనుప పిడికిలితో పాతికేళ్ల పాటు ఉజ్బెకిస్తాన్‌ను ఏలిన దేశాధ్యక్షుడు ఇస్లామ్‌ కరిమోవ్‌ బ్రెయిన్‌ హెమరేజితో ఆగస్టు 29న కుప్పకూలి, సెప్టెంబరు 2 న చనిపోయాడు. పేరుకు ప్రజాస్వామ్యం, ఎన్నికలు అని చెప్పుకుంటూనే ప్రతిపక్షాలను దారుణంగా అణచివేసి పాలించాడు. రెండున్నరేళ్లగా కన్నకూతుర్ని, మనవరాలితో సహా జైల్లో పెట్టించాడు. తన రాజకీయ వారసుడిగా ఎవర్నీ ప్రకటించలేదు. ఒక్కసారిగా అతను కనుమరుగు కావడంతో దేశాన్ని ఎవరు పాలిస్తారో తెలియక ప్రజలంతా తబ్బిబ్బు పడుతున్నారు. 

1965 ఇండో-పాక్‌ యుద్ధం గుర్తుకు రాగానే తాష్కెంట్‌ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే అక్కడే ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య రష్యా అధ్యక్షుడు కోసిగిన్‌ రాజీ కుదిర్చాడు కనుక, అక్కడే లాల్‌ బహదూర్‌ శాస్త్రి మరణించారు కనుక. తాష్కెంట్‌ రాజధానిగా గల ఉజ్బెకిస్తాన్‌ రిపబ్లిక్‌ అప్పట్లో రష్యన్‌ సమాఖ్యలో భాగం. 1991లో రష్యా నుంచి విడిపోయాక స్వతంత్రదేశంగా మారి, తాష్కెంట్‌ను దేశరాజధానిగా చేసుకుంది. రష్యా నుంచి విడిపోయే ప్రక్రియ చేపట్టినది కరిమోవ్‌యే. అతను 1938లో సమర్‌ఖండ్‌లో పుట్టాడు. ఇద్దరు ప్రభుత్వోద్యోగులకు పుట్టిన అక్రమసంతానం కాబట్టి అనాథాశ్రమంలో పెరిగాడని కొందరంటారు. మెకానికల్‌ యింజనియంగు చేశాక, యింజనియరుగా ప్రభుత్వ జలవనరుల శాఖలో పనిచేశాడు. 1967లో ఎకనమిక్స్‌లో డిగ్రీ సంపాదించాడు. 1966-86 మధ్య ఉద్యోగంలో పదోన్నతి సంపాదిస్తూ వచ్చాడు. చీఫ్‌ స్పెషలిస్టుగా, శాఖాధిపతిగా, మంత్రిగా, స్టేట్‌ ప్లానింగ్‌ కమిషన్‌ చైర్మన్‌గా, మంత్రివర్గానికి డిప్యూటీ చైర్మన్‌గా ఎదుగుతూ వచ్చి 1996లో యుఎస్‌ఎస్‌ఆర్‌ ఉజ్బెక్‌ ప్రాంతీయ శాఖ కమ్యూనిస్టు పార్టీ ఫస్ట్‌ సెక్రటరీ అయ్యాడు. సెంట్రల్‌ కమిటీలో ఫస్ట్‌ సెక్రటరీగా వున్నతను 1989లో ఫెర్గానా ప్రాంతంలో తలెత్తిన వర్గకలహాలను అదుపు చేయడంలో విఫలం కావడంతో అతని స్థానంలో యితన్ని వేశారు. సెంట్రల్‌ కమిటీలో పాలిట్‌బ్యూరోలో 1990 నుండి 91 వరకు పనిచేశాడు. 1990 మార్చిలో ఉజ్బెక్‌ రిపబ్లిక్‌కు  అధ్యక్షుడయ్యాడు. అతనా పదవిలో వుండగానే 1991 ఆగస్టులో మాస్కోలో ఒక కుట్ర జరిగి విఫలమైంది. అదే అదనుగా అది జరిగిన పదిరోజులకు ఉజ్బెకిస్తాన్‌ను స్వతంత్రదేశంగా వ్యవహరిస్తుందని ప్రకటించాడు. అప్పటికే పొరుగున వున్న కిర్గిస్తాన్‌ అలా ప్రకటించుకుంది. 

1991 సెప్టెంబరు 1 నుంచి ఉజ్బెకిస్తాన్‌ స్వాతంత్య్రం పొందింది. కమ్యూనిస్టు పార్టీ ఉజ్బెక్‌ యూనిట్‌ తన పేరును పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ పార్టీ ఆఫ్‌ ఉజ్బెకిస్తాన్‌ (పిడిపి)గా మార్చుకుంది. కరిమోవ్‌ మూణ్నెళ్లపాటు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించి డిసెంబరు నెలలో ఎన్నికలు నిర్వహించాడు. అతనికి 86% ఓట్లు రాగా, అతని ప్రత్యర్థి ఎర్క్‌ పార్టీ చైర్మన్‌ సలీహాకు 12.3% ఓట్లు వచ్చాయి. ఎన్నికలో, ఓట్ల లెక్కింపులో చాలా మోసాలు జరిగాయని అంతర్జాతీయ సంస్థలు ఎలుగెత్తి చాటాయి.   కరిమోవ్‌ క్రమేపీ అధికారాలన్నీ తన చేతిలోకి తీసుకోవడంతో, అతనికి పార్టీ సహచరుడిగా వున్న మిర్సాడోవ్‌ ఎదురు తిరిగాడు. అతన్ని అణచడానికి కరిమోవ్‌ ప్రజా సంస్థ ఐన బిర్లిక్‌, ఇస్లామిక్‌ రినైజాన్స్‌ పార్టీలను దువ్వి మిర్సాడోవ్‌ను అణచాడు. బిర్లిక్‌ రాజకీయపార్టీగా మారి బలం పుంజుకుందామని చూస్తే అప్పుడు కరిమోన్‌ రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను కష్టతరం చేశాడు. దానికి కనీసం 60 వేల మంది సంతకాలుండాలన్నాడు. ఆ సంతకాలు సేకరించడానికి ఒక్క రోజు మాత్రమే గడువు యిచ్చాడు. తీరా సంతకాలు తెస్తే వాటిలో 25 వేల సంతకాలను తిరస్కరించాడు. (గద్వాల్‌ జిల్లా ఏర్పాటుకై చేసిన సంతకాలను కెసియార్‌ తిరస్కరించినట్లు..) ఇలా తనను ప్రతిఘటించిన వారిని చంపేస్తూ, జైలుపాలు చేస్తూ, చిత్రహింసలు పెడుతూ 2015లో నాలుగోసారి 90% ఓట్లతో మళ్లీ అధ్యక్షుడిగా నెగ్గాడు. 2002లో యిద్దరు ఖైదీలను సజీవంగా నూనెలో వేసి కాల్పించాడట. 

తన వారసురాలిగా తన పెద్దకూతురు గుల్‌నారా కరిమోవాను తీర్చిదిద్దాడు కానీ అంతలోనే ఏం తేడా వచ్చిందో ఏమో, 2014 ఫిబ్రవరి నుంచి గృహనిర్బంధంలో వుంచాడు. ఉజ్బెకిస్తాన్‌లో సహజవనరులు, ఖనిజాలు పుష్కలంగా వున్నాయి. భౌగోళికంగా కూడా చాల కీలకమైన ప్రదేశంలో చైనాను, మధ్య ప్రాచ్యాన్ని కలుపుతూ వుంది. కానీ కరిమోవ్‌ పరిపాలనలో అవినీతి, అసమర్థత రాజ్యమేలాయి. అతని స్థానంలో దృఢమైన నాయకత్వం రాకపోతే దేశం ఆర్థికంగా బలహీనపడి, అఫ్గనిస్తాన్‌లో బలంగా వున్న ఇస్లామిక్‌ అతివాదులు యీ దేశంలో చొరబడవచ్చు. కరిమోవ్‌ అంత్యక్రియలు అతని జన్మస్థలమైన సమర్‌ఖండ్‌లోని రేగిస్థాన్‌ స్క్వేర్‌లో జరిగాయి. (ఫోటో చూడండి) వాటికి అఫ్గనిస్తాన్‌, తజికిస్తాన్‌, టర్క్‌మెనిస్తాన్‌ వంటి 17 దేశాల నుంచి ప్రతినిథులు హాజరయ్యారు. పుతిన్‌, ఒబామా సంతాప సందేశాలు పంపారు. సెనేట్‌ స్పీకరైన నిగ్మాతిల్లా తాత్కాలిక అధ్యక్షుడిగా వున్నాడు. ప్రధానిగా వున్న షౌకత్‌ మిర్జియోయెవ్‌ అధ్యక్షుడు కావచ్చని కొంతమంది రాస్తూండగా మంత్రుల్లో ఎవరు ఆ పదవి అలంకరించాలో నిర్ణయించేది రుస్తమ్‌ ఇనోయాటోవ్‌ అంటున్నారు కొందరు. అతను అందరూ వణికి చచ్చే సెక్యూరిటీ శాఖకు అధిపతి. ఏది ఏమైనా కొత్తగా వచ్చే అధ్యక్షుడు కరిమోవ్‌ అంతటి నియంత కాకూడదని ఆశిద్దాం.  

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?