cloudfront

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: వసుంధరా రాజె సర్దుబాట్లు

ఎమ్బీయస్‌: వసుంధరా రాజె సర్దుబాట్లు

రాజస్థాన్‌ ఉపయెన్నిక ఫలితాలు బిజెపిని కదిలించాయి. అర్జంటుగా ఏదో ఒకటి చేయకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసును ఎదిరించడం కష్టమనుకుంది. వారి చూపు గిరిజన తెగకు చెందిన మీనా కులస్తుల నాయకుడు కిరోడీలాల్‌ మీనాపై పడింది. రాజస్థాన్‌లోని తూర్పు, దక్షిణంలోని కొన్ని నియోజకవర్గాలలో మీనా కులస్తుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది.

మొత్తం 200 అసెంబ్లీ స్థానాలలో 24 వాటిలో వాళ్లు ఫలితాలను ప్రభావితం చేయగలరు. కిరోడీలాల్‌ స్వతహాగా ఆరెస్సెస్‌ కార్యకర్త. బిజెపిలో ఎదిగాడు. అయితే పదేళ్ల క్రితం వసుంధరతో పేచీ పెట్టుకుని పార్టీలోంచి వెళ్లిపోయాడు. దరిమిలా వేరే పార్టీలో చేరాడు. మళ్లీ తిరిగి వద్దామని కాచుకున్నాడు. కానీ అతని తిరుగుబాటు స్వభావం తెలిసిన ముఖ్యమంత్రి వసుంధరా రాజె రానీయటంలేదు.

ఇప్పుడీ ఓటమి తర్వాత ఆరెస్సెస్‌, బిజెపి హై కమాండ్‌లు ఆమెపై ఒత్తిడి చేసి ఒప్పించారు. ఆమె గత్యంతరం లేక సరే రమ్మనమంది. కిరోడీ పరిగెట్టుకుంటూ వచ్చేశాడు. ఈ నెల 12న వసుంధర సమక్షంలో చేరాడు. వనవాసం పూర్తయి యింటికి తిరిగి వచ్చినట్లుంది అన్నాడు. తను అప్పటికీ, యిప్పటికీ ఆరెస్సెస్‌ సిద్ధాంతాలకు కట్టుబడే ఉన్నాననీ, రాష్ట్రం కోసం 380 ఆందోళనలు చేశాననీ, తనపై రాజకీయ కారణాలతో 103 కేసులు బనాయించారని చెప్పుకున్నాడు.

66 ఏళ్ల కిరోడీ ఎంబిబిఎస్‌ చదివాడు. ఆహార, పౌరసరఫరాల శాఖకు మంత్రిగా చేశాడు. 2008లో ముఖ్యమంత్రి వసుంధర రాజేతో తీవ్రంగా కలహించి, పార్టీ నుంచి వెళ్లిపోయాడు. అది కూడా 2008 అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపింది. బిజెపి ఓడిపోయి కాంగ్రెసు గెలిచింది. ఆ ఎన్నికలలో కిరోడీ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాడు. అతని భార్య గోల్మా దేవి కూడా స్వతంత్రంగానే నెగ్గి అశోక్‌ గెహ్‌లోట్‌ కాబినెట్‌లో మంత్రి అయింది.

2009 లోకసభ ఎన్నికలలో కిరోడీ దౌసా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాడు. 2013లో ఎన్‌పిపి(నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ)లో చేరాడు. 2013 అసెంబ్లీ ఎన్నికలలో వాళ్లకు నాలుగు సీట్లు వచ్చాయి. ఒకటి అతనిది, మరొకటి అతని భార్య గోల్మా దేవిది. ఇంకోటి గీతా వర్మా అనే ఆవిడది. వాళ్లంతా యిప్పుడు పొలోమని బిజెపిలో చేరినా, నాలుగో ఎమ్మెల్యే అయిన నవీన్‌ పిలానియా బిజెపిలో చేరనన్నాడు. అయితే మూడింట రెండు వంతుల మెజారిటీ ఉంది కాబట్టి ఆ పార్టీని బిజెపిలో విలీనం చేసినట్లు పరిగణించాలని కిరోడీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌ పర్నామీకి లేఖ యిచ్చాడు. 

మళ్లీ పార్టీలోకి రానిచ్చినా వసుంధర అతన్ని రాజస్థాన్‌లో ఉండనీయ దలచుకోలేదు. రాజ్యసభ ఎంపీగా పంపాలంది. కానీ అది కిరోడీకి యిష్టం లేదు. తను పార్టీలో చేరగానే మీడియాతో మాట్లాడుతూ ''నేను రాజస్థాన్‌లోనే ఉండదలచుకున్నాను. నా అనుచరులు పార్టీలో, ప్రభుత్వంలో ఏ పదవులూ కోరరు.'' అన్నాడు. ఆ తర్వాత జోక్‌ వేసినట్లు వసుంధరతో ''ఈ వయసులో నన్నూ, నా భార్యనూ విడదీయకండి. నన్ను దిల్లీ పంపించినా, నేను అక్కడ ఎక్కువ సమయం గడపను. ఇక్కడికి వచ్చేస్తూంటాను.'' అన్నాడు. అతనేమన్నా పట్టించుకోకుండా రాజ్యసభకు ఎంపీగా తరిమి వేసింది వసుంధర. కాదనలేని పరిస్థితిలో ఉన్నాడు కిరోడీ.

నిజానికి బిజెపిలోని తక్కిన మీనా కులనాయకులు కిరోడీ పునరాగమనం పట్ల అంత సంతోషంగా ఏమీ లేరు. ''అతను ఒకప్పుడు మొనగాడే కానీ యిప్పుడు కాదు. 2008లో బిజెపి ఓటమికి కారణం వసుంధర అహంకారమే తప్ప కిరోడీ నిష్క్రమణ కాలేదు. అతనూ, అతని భార్యా చెరో రెండు స్థానాల్లో నిలబడితే ఒక్కో స్థానంలోనే గెలిచారు. మరో దానిలో ఓడిపోయారు. 2013 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి అతని ప్రభావం పూర్తిగా లుప్తమై పోయి, వసుంధర తిరిగి అధికారంలోకి వచ్చేసింది.

2009లో గెలుచుకున్న లోకసభ సీటులో 2014లో మళ్లీ నిలబడితే కిరోడీ స్వయంగా ఓడిపోయాడు. అతని ప్రాభవం తగ్గడంతో కాంగ్రెసు అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌ తను గుర్జర్‌ కులస్తుడైనా మీనాలలో పలుకుబడి బాగా సంపాదించుకున్నాడు. ఇలాటప్పుడు యితని రాక వలన ఒరిగేదేముంది? అని వాళ్ల వాదన. ఓ కాంగ్రెసు నాయకుడు ''బిజెపి మునిగిపోతున్న నౌక. ఇతని బరువుతో మరింత వేగంగా మునిగిపోతుంది.'' అని చమత్కరించాడు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com