Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : విదర్భకు వచ్చేసరికి...

ఎమ్బీయస్‌ : విదర్భకు వచ్చేసరికి...

రాష్ట్రవిభజనకు ఎందుకు ఒప్పుకున్నారని తెలుగువారెవరైనా బిజెపి నాయకులను అడగగానే వారు ఠక్కున యిచ్చే సమాధానం - 'చిన్న రాష్ట్రాలు మా సిద్ధాంతం' అని. 'మరి సూపర్‌ పెద్ద రాష్ట్రమైన యుపిని అలాగ వదిలేశారేం? అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు కదా, యుపిని ముక్కలు చేస్తామని ప్రచారంలోనైనా ప్రస్తావించటం లేదేం?' అని అడిగితే సమాధానం వుండదు. యుపిలో అధికారంలో లేరు సరే, మహారాష్ట్రలో వున్నారు కదా, ప్రత్యేక విదర్భ ఉద్యమం యీనాటిది కాదు కదా, అక్కడేం చేస్తున్నారు వీరు? ఆగస్టు నెల అసెంబ్లీ సమావేశాల్లో జరిగినది చూస్తే బిజెపి ద్వంద్వవైఖరి బయటపడుతుంది. 

విదర్భ ఉద్యమం గురించి క్లుప్తంగా చెప్పాలంటే - ప్రస్తుత అమరావతి, యవత్‌మల్‌, వార్ధా, నాగపూరు, భండారా, గోండియా, చంద్రాపూర్‌, గడ్చిరోలి జిల్లాలు విదర్భ కింద వస్తాయి. అక్కడ అరణ్యాలు, ఖనిజాలు ఎక్కువ. మహారాష్ట్రలోని తక్కిన ప్రాంతాల కంటె హిందీ వాడకం ఎక్కువ. 1938లో సెంట్రల్‌ ప్రావిన్సెస్‌ అసెంబ్లీ విదర్బకు ప్రత్యేక రాష్ట్రం వుండాలని తీర్మానించింది. 1953లో నాగపూరు ఒప్పందం కింద విదర్భను అభివృద్ధి చేస్తామని, ప్రతీ ఏడూ అసెంబ్లీ ఒక సెషన్‌ నాగపూరులో పెడతామనీ మాట యిచ్చారు. 1960లో భాషాప్రయుక్త రాష్ట్ర ప్రాతిపదికన మహారాష్ట్రలో కలిపారు కానీ నాగపూరు ఒప్పందం అమలు కాలేదని, తమకు అన్యాయం జరుగుతోందని విదర్భ ఉద్యమాన్ని మాధవ్‌ ఆనే అనే కాంగ్రెసు నాయకుడు ప్రారంభించారు. విదర్భకు ప్రత్యేక రాష్ట్రం అనే నినాదంతో 1962లో ఆయన లోకసభకు ఎన్నికయ్యారు. అదే నినాదంతో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయకుడు జంబువంతరావు ధోతే 1971లో ఎన్నికయ్యారు. విదర్భకు ప్రత్యేక రాష్ట్రం యిస్తామని 1979లో బిజెపి వాగ్దానం చేసింది. తాజాగా 2014 ఎన్నికలలో ప్రత్యేక విదర్భ నినాదంతో ఎన్నికలలో పోటీ చేసింది. 

విదర్భలో వెనుకబాటుతనం వుంటూనే వుంది, ఎన్నికల సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడతామని అంటూనే వుంటారు, ఎన్నికలయ్యాక దాని గురించి పట్టించుకోరు. గతంలో కాంగ్రెసు అలాగే చేసింది, యిప్పుడు బిజెపి కూడా అదే చేస్తోంది. నేటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ విదర్భ ప్రాంతం వాడే. ప్రత్యేక ఉద్యమసారథే. కానీ ముఖ్యమంత్రి కాగానే కాంగ్రెసు ముఖ్యమంత్రుల్లాగే విభజనకు అడ్డుపడుతున్నాడు. ఈ ధోరణి గమనించిన శ్రీహరి అనే మహారాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ మార్చి నెలలో తన పదవికి రాజీనామా చేశాడు. అతను మాధవ్‌ ఆనే మనుమడే. ఫడ్నవీస్‌కు సన్నిహితుడే. అతన్ని అడ్వకేట్‌ జనరల్‌ పదవికి ఒప్పించడానికి ఫడ్నవీస్‌కు నాలుగు నెలలు పట్టింది. పదవిలో వచ్చాక ప్రభుత్వ పనితీరు చూసి అతను నివ్వెరపోయాడు. వ్యవసాయం, నీటి వనరులు, పశుగ్రాసం వంటి విషయాలలో ప్రభుత్వాన్ని సమర్థించడం నా వల్ల కాలేదని చెప్పుకున్నాడు. తన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెప్పటం లేదని, చెప్పినా పొంతన లేని సమాధానాలు చెప్తున్నారని, తనకే నమ్మకం కుదరనప్పుడు కోర్టులో ప్రభుత్వం తరఫున వాదించడం తన తరం కాదని చెప్పాడు. దేశానికే ఆర్థిక రాజధాని అయిన ముంబయిని ఏ పార్టీ శాసిస్తే వారికి నిధుల కొరత వుండదనే భావంతో, ముంబయితో కూడిన విశాలమైన మహారాష్ట్రను పాలించాలని ప్రతీ పార్టీ అనుకుంటూ వచ్చిందని, బిజెపి దానికి మినహాయింపు కాదనీ అన్నాడు. 

ఈ క్రమంలో మరాఠ్వాడా, విదర్బ కొన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందక వెనకబడి పోతున్నాయని, ఆంబేడ్కర్‌ కూడా మహారాష్ట్రను నాలుగు చిన్న రాష్ట్రాలు చేయమన్నాడని గుర్తు చేస్తూ జాల్నాలో ఒక బహిరంగసభలో ప్రత్యేక విదర్భ లాగానే ప్రత్యేక మరాఠ్వాడా రాష్ట్రం ఏర్పడాలని పిలుపు నిచ్చాడు. మహారాష్ట్రను విడగొట్టడానికి సుతరామూ ఒప్పుకోని శివసేనకు యిది దుస్సహమై పోయింది. అప్పటికే వాళ్లకు శ్రీహరిపై చాలా ఫిర్యాదులున్నాయి. ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతివారిపై దేశద్రోహం కేసు పెట్టడం తప్పని, బీఫ్‌ కేసుల్లో నేరం జరిగిందని రుజువు చేయవలసినది ఆరోపించినవారు తప్ప, ఆరోపణ ఎదుర్కుంటున్నవారు కాదని అతను వాదించడం వాళ్లకు నచ్చలేదు. అతనికి వ్యతిరేకంగా సంపాదకీయాలు రాసి ఫడ్నవీస్‌కు ఫిర్యాదు చేసింది. బిజెపి ప్రభుత్వానికి కూడా అతనితో యిబ్బంది వుంది. మరాఠ్వాడాకు నాసిక్‌ నుంచి నీరు వదిలిపెట్టాలని, హిట్‌ అండ్‌ రన్‌ కేసులో కోర్టు సల్మాన్‌ ఖాన్‌ను వదిలివేయడాన్ని ప్రతిఘటించాలని సలహా యిచ్చి వాళ్లను యిరకాటంలో పెట్టాడు. అందువలన ఫడ్నవీస్‌ శ్రీహరిని రాజీనామా చేయమని కోరాడంటారు. అబ్బే కాదు, నేనే రాజీనామా చేశా అంటాడు శ్రీహరి.   

అతన రాజీనామా చేయగానే యిచ్చిన యింటర్వ్యూలో చాలా విషయాలే ప్రస్తావించాడు. ''జనాభా నిష్పత్తి ప్రకారం ప్రాంతాలపై ఖర్చు పెడతామని మాకు వాగ్దానం చేశారు. మహారాష్ట్ర జనాభాలో 22% విదర్భలో వుంది, అంటే బజెట్‌లో 22% మాకు రావాలి, కానీ ఒక్కసారి కూడా యివ్వలేదు. ఆర్టికల్‌ 371(2) ప్రకారం ప్రభుత్వ విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో 22% రిజర్వేషన్‌ రావాలి. కానీ మాకు అవేమీ రాలేదు. గత మూడేళ్లలో ఉద్యోగాల్లో పుణేకు 52.5% వాటా వచ్చింది. మరి విదర్భకు - 2.5%! ప్రత్యేక తెలంగాణకు మద్దతు యిచ్చారు కదా ప్రత్యేక విదర్భ ఎందుకివ్వరు అని శరద్‌ పవార్‌ను, రాజనాథ్‌ సింగ్‌ను అడిగాను. మహారాష్ట్రను విభజించవలసిన అవసరం లేదు అని శరద్‌ అంటే, తెలంగాణలా చురుకైన ఉద్యమేమీ లేదు కదా అని రాజ్‌నాథ్‌ అన్నారు. అంటే మేం కూడా బంద్‌లు, ధర్నాలు, హింసాత్మక ఘటనలు, ఆత్మహత్యలు.. అన్నీ జరపాలా? అవన్నీ అవసరమని రాజ్యాంగం చెపుతోందా? అంత అనుమానం వుంటే ప్రజాభిప్రాయం సేకరించమనండి. 51% మంది ప్రత్యేక రాష్ట్రం కావాలని అడగకపోతే మర్నాడే ఉద్యమం విరమిస్తాం.'' అని సవాలు విసిరాడు.

శ్రీహరి రాజీనామా తర్వాత బిజెపి డిఫెన్సులో పడింది. అందువలన అది తమ అనుకూల మీడియాలో ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపి చేయగలిగేదేమీ లేదంటూ వ్యాసాలు రాయించుకుంది. వాటి వాదన ప్రకారం 'అసెంబ్లీలో, కౌన్సిల్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ వుంటే తప్ప విభజన బిల్లు పాసు కాదు. 288 సభ్యులున్న అసెంబ్లీలో బిజెపికి 122 మంది సభ్యులే వున్నారు. తక్కిన వారిలో భాగస్వామి శివసేనకు 63, కాంగ్రెసుకు 41, ఎన్‌సిపికి 40, ఎంఎన్‌ఎస్‌కు 1, యితరులు 21 మంది సభ్యులున్నారు. వీరెవ్వరికీ విభజన యిష్టం లేదు. అందువలన బిజెపి ముందడుగు వేయలేకపోతోంది. విదర్భ అభివృద్ధి కోసం ఫడ్నవీస్‌ రెండు డజన్ల మెగా ప్రాజెక్టులు చేపట్టారు. విదర్భలో 60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేందుకు కృషి చేస్తున్నారు..' యీ ధోరణిలో సాగింది. తెలంగాణ ఏర్పడడానికి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో మెజారిటీ వుందా? అక్కడ బిల్లు పాస్‌ అయిందా? విభజన విషయంలో కేంద్రానికే సర్వాధికారాలు కట్టబెట్టారనే కదా, వాళ్లు చీల్చి పారేయగలిగారు. అసెంబ్లీ తీర్మానం కేవలం లాంఛనానికే తప్ప దాన్ని లెక్కలోకి తీసుకోనక్కరలేదని కదా బిజెపితో సహా అందరూ వాదించారు. ఇప్పుడు మహారాష్ట్రకు వచ్చేసరికి రూల్సు మారిపోయాయేం? ఇక అభివృద్ధి మాట గురించి చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏకైక ఒయాసిస్సు లాటి హైదరాబాదు పెట్టుకుని కూడా తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం కోరలేదా?  

విదర్భ విషయంలో బిజెపి ఆడుతున్న దోబూచులాటను బయటపెట్టడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. గోండియా నుంచి బిజెపి తరఫున ఎంపీగా ఎన్నికైన నానా పటోలే జులై 29 న లోకసభలో విదర్భ ఏర్పాటుకై ప్రయివేటు బిల్లు ప్రవేశపెట్టాడు. వెంటనే ఎన్‌సిపి, కాంగ్రెసు మీ పార్టీ విధానమేమిటో క్లియర్‌గా చెప్పాలంటూ డిమాండ్‌ చేశాయి. అసెంబ్లీలో విదర్భ నుంచి వచ్చిన బిజెపి ఎమ్మెల్యేలు ప్రత్యేకరాష్ట్రం కోసం నినాదాలిస్తూండగా సమైక్యవాదులైన శివసేన మంత్రి దివాకర్‌ రౌతే వాళ్లతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. మర్నాడు మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రావ్‌సాహెబ్‌ దాన్వే 'విదర్భపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది (ఎక్కడో విన్నట్లుందా? ఈసారి అన్నది బిజెపి వారు) ఇక శివసేనతో బంధమంటారా, అది కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసుకున్నదే' అన్నాడు. దీనిపై ప్రతిపక్ష నాయకుడు రాధాకృష్ణ పాటిల్‌ '2014 లోకసభ ఎన్నికలలో మీరంతా మోదీ హవాపై గెలిచారు. ప్రత్యేక విదర్భ కోరుతున్న ఎంపీలు తమ స్థానాలకు రాజీనామా చేసి, ప్రత్యేక రాష్ట్ర నినాదంపై మళ్లీ పోటీ చేసి, గెలవాలి' అని డిమాండ్‌ చేశాడు. 

అంతేకాదు, మహారాష్ట్రను సంయుక్తంగా వుంచాలా, చీల్చాలా? అన్న విషయంపై ఫడ్నవీస్‌ అసెంబ్లీలో, కౌన్సిల్‌లో ఒక తీర్మానం ప్రవేశపెట్టి దాన్ని ఏకగ్రీవంగా ఆమోదింపచేయాలని అడిగాడు. అలా చేస్తే విదర్భలో తమ పార్టీకి దెబ్బ అన్న భయంతో ఫడ్నవీస్‌ వెనకాడాడు. 'అయితే మేమే ఆ తీర్మానాన్ని పెడతాం, అనుమతి యివ్వండి' అని స్పీకరును కోరాయి ప్రతిపక్షాలు. అంతేకాదు, యీ దెబ్బతో బిజెపి-శివసేనల మధ్య చీలిక తేవడానికి కూడా చూశాయి. ఎందుకంటే శివసేన సమైక్యవాది. బిజెపితో చేతులు కలిపేముందు విదర్భ విషయాన్ని ప్రస్తుతానికి అటకెక్కించాలనే ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు ఫడ్నవీస్‌ తటపటాయిస్తే, దాన్ని చూసి తాము వూరుకుంటే తమ పార్టీ బేస్‌ దెబ్బ తింటుంది. ఇది తెలిసి మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెసు నాయకుడు పృథ్వీరాజ్‌ చౌహాన్‌ ఆ సాయంత్రం ఉద్ధవ్‌ ఠాక్రేకు ఫోన్‌ చేసి 'ఏమిటి మీ సంగతి? మా సంయుక్త మహారాష్ట్ర తీర్మానానికి మద్దతిస్తారా? లేదా?' అని అడిగాడు. అదే సమయంలో ఫడ్నవీస్‌ ఫోన్‌ చేసి యిదంతా ప్రతిపక్షాల కుట్ర అని చెప్పాడు. 

మర్నాడు శివసేన నాయకులు అసెంబ్లీలో ''ప్రతిపక్షాల తీర్మానానికి మేం మద్దతివ్వం. ఒంటిచేత్తో మహారాష్ట్రను ఏకతాటిపై వుంచగల సత్తా శివసేన కుంది. అధికారానికి, అఖండ మహారాష్ట్రకు మధ్య ఎంచుకోవలసి వస్తే మేం అధికారం వదిలేస్తాం' అని ప్రకటించాడు. ఈ లోగా ఫడ్నవీస్‌ కాంగ్రెసు, ఎన్‌సిపిలు గతంలో ఎలా ప్రవర్తించాయో ఏకరువు పెట్టాడు. చంద్రాపూర్‌ జిల్లాకు చెందిన విజయ్‌ వడెట్టివార్‌ అనే కాంగ్రెసు ఎమ్మెల్యే విదర్భ రాష్ట్రం గురించి తీర్మానం ప్రవేశపెటాడు. విదర్భకు చెందిన మరో అయిదుగురు కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఆ వినతిపై సంతకాలు పెట్టారు. ఎన్‌సిపి లీడరు ప్రఫుల్‌ పటేల్‌ విదర్భ ఏర్పాటుకి మద్దతు ప్రకటించాడు. ఇప్పుడు మాత్రం సంయుక్త మహారాష్ట్ర అంటున్నారు. ఇవన్నీ చెప్పి విదర్భ ఏర్పాటు గురించిన ప్రతిపాదన ఏదీ మహారాష్ట్ర ప్రభుత్వం ముందు లేదని, ప్రతిపక్షాలు దీనిపై రాజకీయం చేస్తున్నాయని ఆసెంబ్లీలో ప్రకటించారు. గద్దె ఎక్కేవరకు ఉద్యమకారుడిగా వున్న ఫడ్నవీస్‌ యిప్పుడు వేరే రకమైన వాదనలకు దిగి, 'నేను అఖండ మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పదవీస్వీకారం చేసినవాణ్ని.' అని చెప్పుకున్నాడు.

ఇదంతా చూస్తూంటే తెలంగాణ విషయంలో చాలా ఏళ్ల పాటు కాంగ్రెసు ఆడిన నాటకమే గుర్తుకు వస్తుంది. ఆ పార్టీ వారే విభజన కోరతారు, మళ్లీ ఆ పార్టీ నాయకత్వమే విభజన లేదంటుంది. అనేక విషయాల్లో కాంగ్రెసు లక్షణాలను పుణికి పుచ్చుకుంటున్న బిజెపి, యీ అంశంలో దాని బాటే పడుతోంది. చిన్న రాష్ట్రాల సిద్ధాంతానికి కట్టుబడ్డామని చెప్పుకునే బిజెపికి చిత్తశుద్ధి వుంటే ప్రస్తుతం కేంద్రంలో మెజారిటీలో వుంది కాబట్టి, తెలంగాణ యిచ్చినట్లే యిచ్చేయాలి. అలా యివ్వటం లేదంటేనే ఆ సిద్ధాంతానికి కట్టుబడి లేదని తెలుస్తోంది. ఇరుగు పొరుగు రాష్ట్రాల కంటె చిన్న రాష్ట్రాలుగా చేయడానికై తెలుగువారిని చీల్చడానికి మాత్రం ఆ సిద్ధాంతం ఎంచక్కా వల్లించారన్న విషయం మర్చిపోతే ఎలా?

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?