Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : వినోద్‌ మెహతా - 6

పత్రిక నిలదొక్కుకునేదాకా పెద్దవారెవరూ రాయడానికి ముందుకు రారు కాబట్టి సంపాదకుడో, సిబ్బందో, అతని స్నేహితులో కొన్ని సంచికలను తామనుకుంటున్న రీతిలో, మంచి స్టఫ్‌తో నింపాలి. దాన్ని పాఠకులు ఆదరిస్తే, లబ్ధప్రతిష్టులైన రచయితలకు యీ పత్రిక కారెక్టరు యిలాటిది అని అర్థమై ఆసక్తి చూపుతారు. పత్రిక ఎంత నిలదొక్కుకున్నా బయటి రచనల నాణ్యత గొప్పగా వుంటుందన్న గ్యారంటీ లేదు. స్టాఫ్‌ చేత కొన్ని రాయించుకోకపోతే బండి నడవదు. అందువలన ఎడిటర్లు, అసిస్టెంటు ఎడిటర్లు నిరంతరం రాస్తూనే వుండాలి. వచ్చినవి ఎడిట్‌ చేయడమే మా పని అనుకుంటే పత్రిక అంతే సంగతులు. ఇవన్నీ నాకు యిప్పుడు తెలిశాయి. 1990ల్లో రమణగారి రచనల కోసం ఆంధ్రపత్రిక పాత సంచికలు వెతికే రోజుల్లో తెలియదు. రచనలన్నీ ఆయన పేరుతో వుంటే ఏరుకుని  జిరాక్సు చేసుకోవడం యీజీ. కానీ రమణగారు ఎన్నో రచనలను మారుపేర్లతో రాశారు, కొన్ని పేరు లేకుండా రాశారు. ఆ మారుపేరు కూడా వూహించలేని విధంగా వుండేది - సివి విజయలక్ష్మి (''సీతాకల్యాణం'' కథ ఆ పేరుతో వెలువడింది), ఎస్‌.పార్థసారథి (''గిరీశం లెక్చర్లు''ఆ పేరుతో..), పి.దక్షిణామూర్తి (''విమానం కథ').. ఎవరు గెస్‌ చేయగలరు? ఆయన చెపితే తప్ప! ''బుడుగు'' పేరు లేకుండానే వెలువడింది. చివరి సంచికలో పేరు రాశారు. చాలా రచనలకు పేరే లేదు. దాంతో పత్రికలో ఎవరి పేరుతో వున్న రచనైనా సరే చదవడం, అది రమణదో కాదో గెస్‌ చేయడం - పెద్ద పని అయిపోయింది. నాకు విసుగేసేది. రాసిన ప్రతీదానికీ ఎంచక్కా తన పేరు రాసుకుంటే నాకీ బాధ తప్పేది కదా అనుకునేవాణ్ని. 

రమణగారి రచనలు సేకరించి యిచ్చానని తెలిసిన నండూరి రామమోహనరావుగారు నన్ను కూడా ఆ లైబ్రరీకి తీసుకెళ్లరా? అని అడిగారు. అప్పటికే పొనుగోటి కృష్ణారెడ్డి ఆయన రచనలు సేకరించి పుస్తకాలు వేసి వున్నారు. వేయనివి ఇంకా వున్నాయని నండూరివారికి గుర్తు. అఫ్జల్‌గంజ్‌లోని లైబ్రరీకి తీసుకెళ్లి పాత సంచికలు చూపిస్తూ వుంటే పొంగిపోతూ 'ఇదిగో యిది నాదే.. యిదీ నాదే..' అనసాగారు. ఏవేవో మారు పేర్లు - 'సామవేదం రాజ్యలక్ష్మి..' వంటివి. ఈయనా యిదే పని చేసేరేమిటి? అనుకున్నాను. ఆంధ్రపత్రిక వీక్లీలో రమణగారు సబ్‌ ఎడిటరైతే యీయన ఎడిటరు. సందర్భం బట్టి, అవసరం బట్టి రకరకాలుగా రాసి అప్పటికి తోచిన పేరు పెట్టేసేవారన్నమాట. ఈ పద్ధతేమీ బాగా లేదని అనుకున్నాను. కానీ 2001లో నేను ''హాసం'' పత్రికకు మేనేజింగ్‌ ఎడిటరు అయినప్పుడు నేనూ అదే పద్ధతి అవలంబించ వలసి వచ్చింది. ''హాసం'' విలక్షణమైనది. హాస్యం, సంగీతం అనే రెండే రెండు అంశాలపై మొత్తం పత్రిక నడపాలి. వారఫలాలు, వంటావార్పూ, ఆరోగ్యదీపిక.. వంటి శీర్షికలు ఏవీ వుండకూడదు. ఈ రెండు అంశాలలో సకల విభాగాలు స్పృశించాలి. వీక్లీ సైజులో 72 పేజీలు నింపాలి. సాధ్యమా అని అడిగారు మార్కెటింగు నిపుణులు. ఈ కాన్సెప్టు బోధపరచాలంటే అదెలా వుంటుందో కొన్ని సంచికలు తయారుచేసి చూపిస్తే తప్ప అర్థం కాదు. అందువలన తొలి సంచికలో ఎడిటరూ, మేనేజింగ్‌ ఎడిటరుగా నేనూ కొన్ని శీర్షికలు స్వయంగా రాశాం. ఆయన రాసిన ''ఆపాతమధురం'' శీర్షిక ''జూక్‌ బాక్స్‌ 1931-40, జూక్‌ బాక్స్‌ 1951-60, సినీగీతాలతో సీతారామవనవాసం అనే బొమ్మల కథ, 'సమ్‌వీక్షణం' పేర ''మీ ఘంటసాల'' అనే పుస్తక సమీక్ష (తర్వాతి నుంచి ఆ శీర్షికను నేనే మేన్‌టేన్‌ చేశా)లకు కింద ఆయన పేరు వేసుకున్నాడు. పేరు లేకుండా టేకులు - మిస్టేకులు అనే బాక్స్‌ ఐటమ్‌, పాఠకుల కంట్రిబ్యూషన్‌తో ''చౌచౌ చౌరస్తా'' శీర్షిక, ఇంగ్లీషు జోక్స్‌ను అనువదింపచేసి వాటిని సబ్జక్ట్‌వారీగా (వ్యాపారం, పిల్లలు, ఆలుమగలు) విడగొట్టి బొమ్మలతో సహా పేర వేసే ''హ్యూమర్‌ బాక్స్‌'' శీర్షిక, ఇష్టపది పేర టాప్‌ టెన్‌ ఆడియోలపై విశ్లేషణ, స్టూడెంట్‌ నెం.1, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా పాటల పుస్తకాలు సూపర్‌వైజ్‌ చేశారు.

నేను అంతకంటె ఎక్కువ రాశాను. రాసినవాటన్నిటి కింద నా పేరు వేసుకుంటే యిద్దరు ఎడిటర్లూ కలిసి పత్రికను డామినేట్‌ చేసేశారంటారని భయపడ్డాను. అందుకని ''అచలపతీ-కరోడ్‌పతీ'' అనే కథ ఒక్కదానికే నా పేరు వేసుకున్నాను. 'మీ పదసంపద' శీర్షికను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి అనుమతి తీసుకుని ఆయన పేర నడిపాను. మా అమ్మాయి మంజీర పేర ''ఉడ్‌హౌస్‌ ఫర్‌ యు'' శీర్షిక నడిపి ఉడ్‌హౌస్‌ రాసిన నవలలను పరిచయం చేశాను. (తొలి సంచికలో ''సమ్‌థింగ్‌ ఫ్రెష్‌'' నవల పరిచయం). పేరు లేకుండా వేసినవి - 'బ్రహ్మచారిని గుర్తుపట్టడం ఎలా?' (ఆబిడ్స్‌లో ఆదివారం దొరికే ఫారిన్‌ మ్యాగజైన్లలో వుండే ఫీచర్‌ను మన వాతావరణానికి మార్చి బాలి బొమ్మలతో వేసినది), 'సిద్ధాంతాలు-రాద్ధాంతాలూ' - 'సమస్యాశాస్త్రం' (మర్ఫీస్‌ లాను తెలుగులోకి తీసుకుని వచ్చి బాలి బొమ్మలతో వేసినది), సామల సదాశివ గారి పుస్తకంలోని సమాచారం ఆధారంగా తిరగరాసిన 'ఉస్తాద్‌ అల్లావుద్దీన్‌ ఖాన్‌' వ్యాసం, 'కరీం ఖాన్‌' ఉదంతం, ఇంగ్లీషు హాస్యనటుడు జిమ్‌ క్యారీపై వ్యాసం, హిందీ హాస్యనటుడు మెహమూద్‌ జీవిత ఘట్టాలు, బాపురమణీయం శీర్షిక, ''అప్పు పుట్టించే తాహతు'' అనే స్టీఫెన్‌ లీకాక్‌ ఆంగ్ల హాస్యకథకు అనువాదం, న్యూస్‌వ్యూస్‌ పేర సంగీతానికి, హాస్యానికి సంబంధించిన వార్తలు, ''అర్థం చేసుకుందాం-ఆనందిద్దాం'' పేర హిందీ పాటల అర్థసందర్భాలను తెలుగులో వివరించే శీర్షిక, సినారె చమత్కారాలపై వెలువడిన పుస్తకంలోంచి కొన్ని ఏరుకుని 'సినారె-భళారె' పేర బాక్స్‌ ఐటమ్‌ - వున్నాయి. అన్నీ పేరు లేకుండా వుంటే అనుమానం వస్తుందని కమ్యూనికేటర్‌ ఫీచర్స్‌ అనే సంస్థ వున్నట్టు, దానికీ ''హాసం''కు టై అప్‌ వున్నట్టు బిల్డప్‌ యిచ్చి దాని పేర ఆ సంచికలో 'క్లాసిక్స్‌ రీటోల్డ్‌' శీర్షికన 'పానుగంటి వారి 'నాటకప్రదర్శనం' యీనాటి భాషలో తిరగరాసిన రచన, ''స్క్రీన్‌''నుంచి దించేసిన అమీన్‌ సయానీతో యింటర్వ్యూ వేశాను. తర్వాతి రోజుల్లో అనేక శీర్షికలకు, వ్యాసాలకు అదే పేరు వాడాను. ''హాసం'' కాన్సెప్టు నాదే కాబట్టి దాన్ని వివరిస్తూ సంపాదకీయం రాశాను. ఆ తర్వాత ఆ శైలి మేన్‌టేన్‌ చేయడానికి సంపాదకీయాలన్నీ నేనే రాశాను. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

mbsprasad@gmail,com

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

Click Here For Part-5

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?