cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: జనసేన టిడిపిలో విలీనమైతే?

 ఎమ్బీయస్: జనసేన టిడిపిలో విలీనమైతే?

రాష్ట్రంలో మునిసిపల్, కార్పోరేషన్ ఎన్నికల తర్వాత వైసిపి ఎంత బలంగా వుందో అందరికీ తెలిసి వచ్చింది. వైసిపికి ప్రధాన ప్రతిపక్షం టిడిపి. ఐదేళ్ల అధ్వాన్నపాలన తర్వాత కూడా అన్ని ప్రాంతాలూ కలిపి 39.6% ఓట్లు తెచ్చుకున్న పార్టీ. ఇప్పుడు పార్టీ నిస్తేజంగా వున్నా, నాయకులు పక్కరాష్ట్రంలో ప్రవాసంలో వున్నా పట్టణప్రాంతాలలో 30.7% తెచ్చుకున్న పార్టీ. సీట్లు ఆ నిష్పత్తిలో కాకపోయినా, కాస్త దగ్గర్లోనైనా రాలేదంటే స్ట్రాటజీ లోపమనే తెలుస్తోంది. ప్రస్తుతం అనుసరిస్తున్న మార్గాలను పక్కన బెట్టి, కొత్తగా, ఔట్ ఆఫ్ ద బాక్స్ అన్నంత వినూత్నంగా ఆలోచిస్తే తప్ప టిడిపిపై నాయకులు, కార్యకర్తలే కాదు ఓటర్లకు కూడా నమ్మకం పోయి, దానికి ఓటేస్తే దండగ అనుకోవచ్చు. ఆ వ్యూహరచనలో భాగంగా జనసేనను విలీనం చేసుకుంటే ఎలా వుంటుంది? అనే ఆలోచనే యీ వ్యాసరచన.

ఇప్పటికే టిడిపి పని అయిపోయిందని ప్రజలు గట్టిగా నమ్మాలనే ప్లానుతో వైసిపి టిడిపి నాయకులందరి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టి కొల్లగొట్టింది. పంచాయితీ ఎన్నికలు పార్టీరహితం కాబట్టి బాబు మాకు యింకా బలం వుందంటూ బుకాయించబోయారు. ఆ మాటలెవరైనా నమ్మి వుంటే వారి సందేహాలు పటాపంచలు చేయడానికై ప్రతి టిడిపి నాయకుడి నియోజకవర్గంలో పార్టీ చావుదెబ్బ తినేట్లు చేశారు. కుప్పం, చిత్తూరులలో అయితే మరీ ఘోరంగా ఓడించి బాబుని తలెత్తుకోనీయకుండా చేశారు. ‘టిడిపి వారిని నామినేషన్లు వేయనీయలేదు, ప్రచారం చేసుకోనీయలేదు, బెదిరించారు’ అంటే మరి యింతమంది పోటీ ఎలా చేయగలిగారు? 30.7% ఓట్లు ఎలా తెచ్చుకోగలిగారు? స్థానికంగా బలంగా వుంటే గెలిచారు, లేకపోతే ఓడారు. తాడిపత్రిలో జెసి బ్రదర్స్ సొంతబలంతో గెలిచారు. మైదుకూరులోనూ అదే పరిస్థితి. 

మాలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఓటమి పాలయ్యేం అని కొందరు టిడిపి నాయకులు చెప్పుకుంటున్నారు. పెదబాబు రోజూ వీడియో కాన్ఫరెన్స్‌లు దంచుతూంటే, చినబాబు ట్విట్టర్‌లో చెడుగుడు ఆడుతూంటే కమ్యూనికేషన్ లేదని ఎలా అంటారు? టీవీల్లో మాట్లాడిన కొందరు టిడిపి అభ్యర్థులు చెప్పినదేమిటంటే – ‘అధిష్టానం పట్టించుకోవడం లేదు. పరిశీలకులంటూ ఎవర్నో పంపుతున్నారు. వారు ఎవర్నీ కలుసుకోరు, టైము వెచ్చించరు, ఫోటోలు తీయించుకుని వెళ్లిపోతారు, వైసిపి వాళ్లు రెండు నెలల ముందే అభ్యర్థి ఎవరో చెప్పేస్తే, వీళ్లు ఆఖరి నిమిషం దాకా అభ్యర్థి ఎవరో తేల్చరు. దాంతో ప్రచారం చేసుకోలేక పోతున్నాం.’ అని. పరిశీలకుల విషయంలో, చివరిదాకా అభ్యర్థిని ఖరారు చేయకపోవడం, ప్రచారానికి అధినాయకత్వం రాకుండా వుంటేనే మంచిదనుకుని అభ్యర్థులు భావించడం - ఇదంతా వింటే కాంగ్రెసు పోకడలు గుర్తుకు రావటం లేదూ! 

కాంగ్రెసుకయితే అనేక రాష్ట్రాలు చూసుకోవాలి. వీళ్ల కేముంది? లింగులింగు మని ఒక్కటి! రెండు కళ్లల్లో పక్క కన్ను గుడ్డిదై పోయింది. మూసినా, తెరిచినా ఒకటే. పంచాయితీ ఎన్నికలలో కుప్పంలో ఎదురుదెబ్బ తగలడంతో బాబు వెళ్లి అందర్నీ పలకరించి వచ్చారు. చిత్తూరు ఎయిర్‌పోర్టులో గంటల తరబడి పద్మాసనం వేసి చూపించారు. ఆయన ఫిజికల్ ఫిట్‌నెస్ జిల్లా ఓటర్లను మెప్పించలేదు. 134 సీట్లలో 13 అంటే 10% యిచ్చి ఊరుకోబెట్టారు. చిత్తూరు కార్పోరేషన్‌లో 50టిలో 3 యిచ్చి సర్దుకోమన్నారు. నిజానికి టిడిపి తన సత్తా చాటినది వైజాగ్ కార్పోరేషన్‌లోనే! 98కి 31%, అంటే 30 తెచ్చుకుంది. విశాఖ జిల్లాలో 53 వార్డుల్లో 13 (25%) తెచ్చుకుంది. నర్సీపట్నంలో అయితే 28లో 12 (43%) తెచ్చుకుంది. దీని అర్థమేమిటి? హైదరాబాదు తరహాలో వైజాగ్‌కి అన్నీ కట్టపెట్టేసి, సామాన్యులెవరికీ అందుబాటులో లేకుండా చేసేద్దామనే వైసిపి ప్లాన్లను అక్కడి జనం హర్షించలేదనే కదా!

బాబు తర్వాత బాబు అంతటి పోరాటవీరుడు అనిపించుకుంటున్న అచ్చెన్నాయుడిగారి సొంత జిల్లా శ్రీకాకుళంలో 74 వార్డుల్లో 17 (23%), అన్యాయానికి గురైపోయానని ఆక్రోశిస్తున్న అశోక గజపతిరాజు గారి విజయనగరం జిల్లా 110 వార్డుల్లో 28 (25%) గెలిచారు. విజయనగరం కార్పోరేషన్‌కు వచ్చేసరికి 30 డివిజన్లలో 1 మాత్రమే గెలిచారు. బొబ్బిలి మునిసిపాలిటీలో 31 వార్డుల్లో 11 (35%) గెలిచారు. యనమల, బుచ్చయ్య చౌదరి సొంత జిల్లా అయిన తూర్పు గోదావరిలో 268 వార్డుల్లో 34 (13%) గెలిచారు. యనమల తునిలో అయితే టిడిపి గెలిచిన వార్డులు 0.  మరి తాడిపత్రిలో ఏకంగా 50% (36లో 18) గెలిచారు. కడప జిల్లా మైదుకూరులోనూ 50శాతమే (24లో 12) అంతే. రెండు చోట్లా వైసిపి కంటె ఎక్కువే. అంటే దీని అర్థమేమిటన్నమాట? స్థానికంగా ఎక్కడ బలమైన నాయకులున్నారో అక్కడ టిడిపి గెలిచింది. నామినేషన్లు చింపేసి, అభ్యర్థులను దాచేసి, ఫోర్జరీలు చేసి విత్‌డ్రా చేయించి వుంటే వీళ్లంతా ఎలా గెలిచేవారు? నెగ్గే ఆశ లేనిచోట అభ్యర్థులే ముందుకు వచ్చి వుండరు, అందుకే అన్ని ఏకగ్రీవాలు అనుకోవాలి.

సొంత జిల్లాలో ఓటమి కంటె తన కర్మక్షేత్రమైన కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఓటమే బాబుని కలచివేసి వుంటుంది. తన, తన అనుయాయుల పెట్టుబడులు రక్షించడానికై ఆ జిల్లా ప్రజలు యావచ్ఛక్తులూ ఉపయోగించి ఏళ్లపాటు ఉద్యమాలు చేస్తారనే ఆయన ఆశ అడుగంటిపోయింది. అమరావతి ఉద్యమం జరిగే ప్రాంతాల్లో పంచాయితీ ఎన్నికలలో అధికార పార్టీ గెలవడంతోనే ఆయనకు మండిపోయింది. సంయమనం కోల్పోయారు. ‘ఇక్కడి వారు పిరికివారు, స్వార్థపరులు. పోరాడి, ఇక్కడే స్వర్ణనగరం ఏర్పరచుకోకుండా బెంగుళూరు, హైదరాబాదు, చెన్నయ్‌లకు వెళ్లి పాచిపనులు చేసుకుంటున్నారు..’ అంటూ తిట్టిపోశారు. మీ వల్లే ఓడిపోయాను అంటూ కార్యకర్తలను, ఓటర్లను పవన్ కళ్యాణ్ వంటి అనుభవశూన్యుడైన రాజకీయవేత్త అనవచ్చేమో కానీ, తలపండిన చాణక్యుడు చంద్రబాబు అలా మాట్లాడవచ్చా? ఆయన మాత్రం అమరావతిలో వుంటున్నారా? ఉన్న చోట ఏ పనులు చేసుకుంటున్నారు? ఆ జిల్లా వాసులు పాచి పనులు చేస్తూనే జూబిలీ హిల్స్‌లో ఆస్తులు కొనేసి తెలంగాణ వాళ్లకు కన్నెఱ్ఱ అయ్యారా?

ఇంత రెచ్చగొట్టినా కృష్ణా, గుంటూరు వాసులు పట్టించుకున్నారా? ఆవేశపడి, రోషంతో టిడిపికి మేలు చేశారా? లేదే! వాళ్ల అవసరాల మేరకు, ఆలోచనల మేరకు వారు ప్రవర్తించారు. కృష్ణా జిల్లాలో 115 వార్డులుంటే 23 వార్డులు (20%), గుంటూరు జిల్లాలో 233 వార్డులుంటే 26 (9%) యిచ్చి చాల్లే అన్నారు. విజయవాడ కార్పోరేషన్‌లో 64 డివిజన్లుంటే 14 (22%), గుంటూరు కార్పోరేషన్‌లో 57 డివిజన్లలో 9 (16%) టిడిపికి వచ్చాయి. విజయవాడలో మేయరు అభ్యర్థి అనుకున్న కేశినేని నాని గారమ్మాయి శ్వేత కార్పోరేటర్‌గా మిగిలారు. నానిపై టిడిపి నాయకులు బుద్ధా వెంకన్న, బోండా ఉమ, నాగుల్ మీరా బహిరంగంగా ధ్వజమెత్తడంతో పార్టీలో లుకలుకలు బయటపడిపోయాయి. మళ్లీ చెప్పాల్సి వస్తోంది – కాంగ్రెసు బాటలోనే టిడిపి నడుస్తోందని! 

మొత్తం మీద చూస్తే 2742 డివిజన్లలో వైసిపికి 83%, టిడిపికి 15% వచ్చాయి. 11 కార్పోరేషన్లలోనూ వైసిపియే గెలిచింది. 75 మునిసిపాలిటీలలో ఒక్కటంటే ఒక్కటి టిడిపికి మిగిలింది. ఓట్ల శాతం ప్రకారం చూస్తే వైసిపి 52.63% టిడిపి 30.73% జనసేన 4.87% బిజెపి 2.41% సిపిఐ 0.80% సిపిఎం 0.81% కాంగ్రెసు 0.62% నోటా 1.07% వచ్చాయి. 2014 వరకు ఉమ్మడి రాష్టంలో రాజ్యం చేసిన కాంగ్రెసు యిప్పుడెక్కడ వుందో కనుక్కోవాలంటే లాస్ట్ అండ్ ఫౌండ్ ఆఫీసులో వెతకాలి. కమ్యూనిస్టులు దేశంలోనే అడ్రసు లేకుండా తిరుగుతున్నారు. ఊగుతున్న కేరళ కొమ్మను పట్టుకుని వేళ్లాడుతున్నారు. ఆంధ్రలో నస్మరంతిగా వున్నారు. చెరి కమ్యూనిస్టు పార్టీల కంటె 0.2% తక్కువగా 0.6% ఓట్లు వచ్చాయంటే అసలా పార్టీ వుండవలసిన అవసరం వుందా? సోనియా కుటుంబం కబంధ హస్తాలలోంచి విడివిడితే తప్ప కాంగ్రెసుకు ముక్తి లేదు. విడివడినా ఆంధ్రలో మళ్లీ పుంజుకోవడం కల్ల.

ఎందుకు? కాంగ్రెసు పార్టీ ఓటుబ్యాంకు మొత్తాన్ని జగన్ కబళించి వేశాడు. టిడిపి నుంచి కూడా అనేక వర్గాలను తనవైపు గుంజుకుంటూ, ఓటు బ్యాంకు పెంచుకుంటున్నాడు. సంక్షేమ పథకాల వల్లనే యిదంతా సాధ్యపడింది అనడం అతిశయోక్తి. అవి అందని వర్గాలు కూడా జగన్ పాలన పట్ల సానుకూల దృక్పథం ఏర్పరచుకుంటున్నారని అనుకోవాలి. అవినీతి జరుగుతూంటే యింకా బయటపడలేదు. కానీ సంక్షేమపథకాలు టూమచ్ అయిపోయి, రాష్ట్రం అప్పులపాలై పోయిందని విడిగా చెప్పనక్కరలేదు. పరిశ్రమలు పెద్దగా రావటం లేదు. ఈ పథకాలు యివాళ జగన్‌తో ప్రారంభం కాలేదు. ఎన్టీయార్‌తో ప్రారంభమై పోనుపోను శ్రుతి మించి రాగాన పడ్డాయి. బాబు కూడా ఎన్నో పథకాలు అమలు చేశారు. జగన్ వచ్చాక కొన్ని మూసేసి, కొన్నిటికి పేర్లు మార్చి, మరికొన్నిటిని చేర్చాడు. అయితే పక్షపాత రహితంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా పథకాలు అమలు చేయడంలో యితరుల కంటె పైచేయి సాధించాడని అనిపిస్తోంది. ఎందుకంటే సిపిఐ నారాయణే ‘పేదలందరికీ పూర్తి స్థాయిలో పథకాలు అందడంతోనే యీ విజయం’ అనాల్సి వచ్చింది. ప్రతిపక్షాలకు దిక్కు తోచకుండా పోతోంది.

ఇది ప్రస్తుతానికి బాగుండవచ్చు కానీ దీర్ఘకాలంలో రాష్ట్రానికి చేటు చేస్తుంది. ప్రకృతిలో ప్రతీదానిలోనూ తూకం వుంటుంది. సంసారంలోనైనా, సంస్థలోనైనా, రాజకీయాల్లోనైనా యిరు పక్షాలూ పోటాపోటీగా వుండాలి. అపరిమిత అధికారం అహంకారానికి, దుర్వినియోగానికి దారి తీస్తుంది. జగన్ ప్రస్తుతం ఇందిరా గాంధీ బాటలో వెళుతున్నాడు. అవినీతి కట్టడి చేసే క్రమంలో ప్రజాప్రతినిథులకు అసంతృప్తి కలగచేస్తున్నానని అతనికి తెలుసు. రేపు వాళ్లు విడిగా వెళ్లిపోతామని బెదిరిస్తే తన సీటు కదులుతుందనీ తెలుసు. అందుకని ఎవరినీ బలపడనీయకుండా, ఏ జిల్లాలోనూ ఏ కుటుంబానికీ అన్ని పదవులూ కట్టబెట్టకుండా అనామకులకు, రాజకీయంగా బలహీనులకు అవకాశమిచ్చి, వారిని ప్రత్యమ్నాయ నాయకులుగా నిలబెడుతున్నాడు. ఇది ఇందిరే కాదు, ఎన్టీయారూ అమలు చేసిన ఫార్ములాయే. వారిని మించి జగన్ ప్రతి పథకానికీ తన పేరే పెట్టుకుంటూ ప్రజల మనసులో తనను పొజిషన్ చేసుకుంటున్నాడు. 

ఎన్టీయార్ కూడా ప్రతి నియోజకవర్గంలో రాజకీయంగా వెనుకబడిన వర్గాల నుంచి ప్రత్యామ్నాయ నాయకులను తయారుచేసి, వాళ్లు తనకు విశ్వాసంగా వుండేట్లు ప్లాను చేశారు. నాదెండ్ల తిరుగుబాటు చేసినపుడు ప్రజలు ఎన్టీయార్‌కు అండగా నిలబడడంతోనే, నాదెండ్ల వైపు వెళ్లిన ఎమ్మెల్యేలు కూడా వెనక్కి వచ్చేశారు. 11 ఏళ్ల తర్వాత అలాటి సందర్భమే మళ్లీ వచ్చినపుడు, విజయం సాధించిన కౌటిల్యం చంద్రబాబుది. ఎమ్మెల్యేలలో ఎవరెటు పోయినా ప్రజలు తనతో ఉంటారనే ధీమా ఎన్టీయార్‌ది. 1996 పార్లమెంటు ఎన్నికల టైముకి బతికి వుండి వుంటే రెండు తెలుగుదేశాల మధ్య  పోటీ జరిగి, ప్రజలు ఎవరి పక్షాన వున్నారో తేలిపోయేది. కానీ మూడు నెలల ముందుగానే జనవరిలోనే ఎన్టీయార్ మరణించారు. లక్ష్మీపార్వతిని ప్రజలు ఎన్నడూ ఆదరించలేదు. 

ఇప్పుడు జగన్ మేయర్లగా, చైర్మన్లగా అనేకమంది మహిళలను (60%కి యిచ్చారట), మైనారిటీలను, దళితులను, బిసిలను (78%) చేయడంలో ఇందిర, ఎన్టీయార్ తరహా స్ట్రాటజీయే వుందని నాకు తోస్తోంది. రేపు కమ్మ, రెడ్డి వంటి పాలకవర్గాలు తిరుగుబాటు చేసినా, యీ వర్గాలు జగన్‌కు అండగా నిలుస్తాయి. వారి దన్ను చూసుకుని జగన్ ఏదైనా చేయవచ్చు. ప్రతిపక్షం మేలుకొని, గట్టిగా ఏదైనా చేయకపోతే ఇందిర, ఎన్టీయార్ తరహా నియంత అయినా ఆశ్చర్యపోనక్కరలేదు. 

ప్రతిపక్షాల్లో నోటా కంటె తక్కువ ఓట్లు తెచ్చుకున్న మూడు పార్టీల గురించి రాయడం దండగ. ఇక జాతీయస్థాయిలో బిజెపి ఎంత పెద్ద పార్టీ ఐనా కావచ్చు, ఆంధ్రలో దానికి యిప్పట్లో ఛాన్సు లేది 2.4% చెప్తోంది. అందువలన ప్రతిపక్షంగా ఎదిగే ఛాన్సున్నది టిడిపికి మాత్రమే. పావులు సరిగ్గా కదిపి, మళ్లీ ప్రాధాన్యత సంతరించుకోకపోతే హక్కునూ, బాధ్యతనూ, అవకాశాన్నీ వదులుకున్నట్లే. జాతీయస్థాయిలో పోషించవలసిన ప్రతిపక్ష పాత్ర పోషించకుండా కుటుంబమే పరమావధిగా ఉంటూ చారిత్రక బాధ్యత తప్పించుకుంటోందని కాంగ్రెసుపై ముద్ర పడినట్లే, రాష్ట్రస్థాయిలో టిడిపిపై ముద్ర పడుతుంది. కానీ పంచాయితీ, మునిసిపల్ ఎన్నికలలో తమ పరాజయానికి నిమ్మగడ్డ వైసిపి కోవర్టుగా పనిచేశారు, లేకపోతేనా... అని చెప్పుకుంటూ బతికేయాలని టిడిపి అనుకుంటోంది. 

నిమ్మగడ్డను కోవర్డు అనుకోవాల్సిన పని లేదు. ఆయన ఇప్పటికీ వైసిపిని యిరకాటంలో పెట్టే పనులు చేస్తూనే వున్నారు. ఎవరికీ చెప్పకుండా యాప్‌ చేయించారు. రాజకీయ నాయకుళ్లా ఊళ్లు తిరిగి ఉపన్యాసాలు దంచారు. చీటికీమాటికీ కోర్టంటారు. పంచాయితీ ఎన్నికలలో వైసిపి విజయం తర్వాత కూడా మనమనుకున్నంత స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత లేదని గ్రహించినా తగ్గలేదు. కనీసం పట్టణ ప్రాంతాలలో వుంటుందనే ఆశించారు. వాలంటీర్ల ఫోన్లు తీసుకోమన్నారు. సాటి ఐఏఎస్‌లపై రిమార్కులు రాసి రికార్డుల్లో ఎక్కించారు. నాకు పెత్తనం యిస్తే తలంతా గొరిగేస్తా అన్నాడట వెనకటికి ఒకడు. ఆ ప్రయత్నమూ చేస్తూ తన పరిధికి మించి వ్యవహరించారు. ఆయనను వైసిపికి మిత్రుడనడం అసమంజసం. వైసిపిని అడ్డుకోలేక పోయారంతే. 

తమ బావుటా ఎగరేయడానికి అనుకోకుండా సాయపడ్డాడు కదాని వైసిపి ఆయన్నేమీ క్షమించలేదు. ఇప్పుడు జిల్లా పరిషత్ ఎన్నికల విషయంలో వెనుకంజ వేస్తున్నాడని గమనించి, సభా హక్కుల నోటీసు యిచ్చి రెచ్చగొడుతోంది. అలాగైనా ఎన్నికలు పెడతాడని ఆశ. కానీ యిప్పుడాయన హఠాత్తుగా యుద్ధవిరమణ చేసి శాంతమూర్తి అయినట్లు కనబడుతోంది. ఈయన వెళ్లాక జరిగే ఎన్నికలలో కొత్త కమిషనర్ వైసిపి కొమ్ము కాసి ఎక్కువ స్థానాలు గెలిచేట్లు చేశాడని చెప్పుకోవాలని టిడిపి ప్రయత్నించవచ్చు కానీ దానివలన ఒరిగేదేమీ లేదు. దాని కంటె ఆత్మపరిశీలన చేసుకుని, దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. లేకపోతే పార్టీ మనుగడే ప్రశ్నార్థకమౌతుంది. 

ఈ ఎన్నికలలో దానికి 30.7% వస్తే దాన్ని వెన్నంటి వున్న జనసేనకు 4.9% ఓట్లు వచ్చాయి. ఈ రెండూ విలీనమైతే 36% అవుతుంది. ఒక మేరకైనా ప్రతిపక్షం బతుకుతుంది. జగన్ పాలన పక్కదారి పట్టినపుడు అవకాశాన్ని దొరకబుచ్చుకుంటుంది. పవన్ యిప్పటికైనా ముసుగు తీసేసి, బాహాటంగా టిడిపిలో విలీనమై పోతే మంచిది. ఆంధ్రలో బిజెపికి సమీపంలో భవిష్యత్తు లేదు. బిజెపిలో పవన్‌కు ఎప్పటికీ భవిష్యత్తు లేదు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల రోజునే తెరాస అభ్యర్థికే ఓటేసి, సిటింగ్ ఎమ్మెల్సీ బిజెపి అభ్యర్థిని ఓడించండి అని పిలుపు నిచ్చాక, అమిత్ షా అతన్ని క్షమిస్తాడని అనుకోను. 12-15 వేల తేడాతో బిజెపి అభ్యర్థి ఓడిపోయేట్లున్నారు. పవన్ పిలుపు నివ్వకుంటే ఆ తేడా తగ్గేదని అమిత్ అనుకోవచ్చు కదా!

ఆంధ్ర పంచాయితీ ఎన్నికలలో, మునిసిపల్ ఎన్నికలలో జనసేన బిజెపితో కాకుండా టిడిపితో పొత్తు కుదుర్చుకోవడం చేతనే యీ మేరకైనా లాభపడిందనేది బహిరంగ రహస్యం. ఓపెన్‌గా కలిసిపోతే నష్టమేముంది? నన్నడిగితే పవన్ తన పార్టీని టిడిపిలో కలిపివేయాలి. చంద్రబాబు లోకేశ్ స్థానంలో పవన్‌ను తన డిప్యూటీగా, వారసుడిగా నియమించాలి. ఇదేదో జోక్‌గా చెపుతున్న విషయం కాదు. టిడిపిలో యువనాయకులు లేరు. లీడరు అలిసి, నిస్తేజంగా వుంటూ, ప్రజలను చూడగానే సంయమనం కోల్పోయి, అక్కసుతో మాట్లాడుతున్నారు. ఆయన ఏం చెప్పినా వినే పరిస్థితిలో ప్రజలు లేరు. ఆయన జనంలోకి ఎక్కువగా వెళ్లకుండా కరుణానిధిలా వ్యూహరచనకు పరిమితమైతే చాలు. లోకేశ్ పట్ల ఓటర్లకే కాదు, టిడిపి నాయకులకు కూడా నమ్మకం లేదు. అతనికి వాక్చాతుర్యం లేదు, ప్రజల్లో తిరిగే ఓపికా, ఆసక్తీ లేదు. కావాలంటే పార్టీ కోశాధికారిగా వుండవచ్చు.

పవన్ కరిజ్మా వున్నవాడు. పార్టీని నడిపే ఓపిక, తీరిక అతనికి లేకపోయినా, నియోజకవర్గాల వారీగా పార్టీ నిర్మాణం లేకపోయినా, అతన్ని నమ్మే వర్గాలు వున్నాయని నిరూపణ ఐంది. అయినా యీ ఎన్నికలలో 7 డివిజన్లలో,  19 వార్డులు మాత్రమే గెలవగలిగిందంటే ప్రస్తుత పరిస్థితిని కొనసాగించడంలో అర్థం లేదని తేలుతోంది. అతనిప్పుడు ఎడాపెడా సినిమాలు వేసేస్తున్నాడు కాబట్టి వాటిలో సగం హిట్టయినా, మరింతమంది యువ ఓటర్లు అతని పట్ల ఆకర్షితులవుతారు. కానీ వాళ్లని ఛానలైజ్ చేసేవాళ్లు లేరు. జనసేన పార్టీ టిడిపిలో విలీనమై పోతే పాతరోజుల్లోలా టిడిపిలోకి యువరక్తం వచ్చి చేరుతుంది. ఎన్నికల సమయంలో వాళ్లను ఆర్గనైజ్ చేయడానికి టిడిపి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అక్కరకు వస్తుంది. పవన్ సినిమాలు చేసుకుంటూనే అప్పుడప్పుడు పార్టీ కార్యకర్తలను కలిసి, ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. కుప్పంలో టిడిపి కార్యకర్తలు జూ. ఎన్టీయార్ వస్తే బాగుండునని అన్నారట. కెరియర్‌లో బిజీగా వున్న  అతనెందుకు వస్తాడు? అతనికి బదులు రాజకీయాల్లోకి ఆల్‌రెడీ వచ్చేసిన పవన్ బెటరు కదా!

చంద్రబాబు యిలాటి ప్రాక్టికల్ ఆలోచనలు చేస్తున్నారో లేదో తెలియదు. తన తర్వాతి స్థానం భార్య లక్ష్మీపార్వతికే దక్కాలని మొండిపట్టు పట్టిన ఎన్టీయార్ అధికారంలో వున్నా ముఖ్యమంత్రి కుర్చీ కోల్పోయారు. అదే తరహాలో వ్యవహరించి లోకేశ్‌కే దక్కాలని పట్టుబడితే బాబు ప్రతిపక్ష కుర్చీ కూడా కోల్పోవచ్చు. అధికారం కోల్పోయాక కూడా బాబు దాదాపు రెండేళ్ల పాటు లోకేశ్‌కు అవకాశం యిచ్చి చూశారు. అయినా లోకేశ్ ప్రజామోదం పొందలేక పోయారు. అక్కరకు రానివాడు చుట్టమైనా గ్రక్కున వదిలిపెట్టాలని పెద్దలు చెప్పలేదా! 

– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2021)

లోకేష్ సవాల్ చూస్తే.. బ్రహ్మానందం గుర్తొస్తున్నాడు

దేవి సిక్స్ కొడితే...నేను రెండు సిక్సులు కొడ‌తా

 


×