Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ :YM: దేశాధిపతి పర్యటన- 3/2

వారం తిరక్కుండా అతను ఇంగ్లండు వచ్చేశాడు కూడా. విమానాశ్రయంలో అతను దిగిన దృశ్యాన్ని టీవీలో చూస్తూనే జిమ్‌ ఆశ్చర్యపడ్డాడు. అతను వేరెవరో కాదు, తనతో పాటు లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చదువుకున్న చార్లీ ఉమ్టాలీ. కొన్నేళ్ల క్రితమే మతం మార్చుకుని సెలీమ్‌ మొహమ్మద్‌ అయ్యాడు. అతను వచ్చీ రాగానే స్కాట్లండ్‌ ఫంక్షన్‌లో తను యివ్వబోయే ఉపన్యాసం కాపీని ఇంగ్లండు ప్రభుత్వానికి ముందుగా పంపాడు. 

దాంట్లో ''బ్యురాండా ప్రజలు స్వాతంత్య్రం కోసం పోరాడే అన్ని జాతుల ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇంగ్లీషు బానిసత్వపు కాడిని విసిరికొట్టిన బ్యురాండా అదే ఇంగ్లండు ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న స్కాట్లండ్‌, ఐర్లండ్‌ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలవడమే కాక, సహాయసహకారాలు కూడా అందిస్తుందని యిందుమూలంగా హామీ యిస్తున్నాను.'' అని వుంది.

అసలే స్కాట్లండ్‌. ఐర్లండ్‌ ప్రజలు ఇంగ్లండు నుంచి విడిపోదామని చూస్తున్నారు. ఇప్పుడీ ప్రసంగం వాళ్లని మరింత రెచ్చగొడుతుంది. పైగా యీ సమావేశం స్కాట్లండ్‌లో జరగడం వలన మరింత డామేజి జరుగుతుంది. ఏం చేయాలో ఎవరికీ తోచలేదు. ఇంతకీ యిప్పుడేం చేయాలని జిమ్‌ అడిగాడు. హంఫ్రీ ఆరు మార్గాలున్నాయన్నాడు. అవేమిటంటే 1. ఏమీ చేయకపోవడం 2. అతని ప్రసంగాన్ని ఖండిస్తూ ఒక ప్రకటన చేయడం 3. అధికారపూర్వకంగా నిరసన తెలపడం 4. ఇచ్చే సాయాన్ని నిలిపేయడం 5. దౌత్యసంబంధాలన్నీ తెంపేసుకోవడం 6. యుద్ధం ప్రకటించడం. 

అన్నీ విని జిమ్‌ వీటిలో ఏది మంచిదన్నాడు. అప్పుడు హంఫ్రీ మళ్లీ పరిష్కార మార్గాల గురించి వివరణ యిచ్చాడు. ''1. ఏమీ చేయకపోతే మనం అతని ఉపన్యాసంతో ఏకీభవించినట్లు అవుతుంది. 2. మన ప్రకటన హాస్యాస్పదంగా వుంటుంది 3. నిరసనను పట్టించుకోరు 4. సాయాన్ని నిలిపివేయడం అంత సులభమేమీ కాదు ఎందుకంటే మనం సాయం యిప్పటిదాకా ఏమీ యివ్వలేదు, అనుకోలేదు 5. దౌత్యసంబంధాలు తెంపేసుకుంటే ఆయిల్‌ రిగ్గులు అమ్మడం కుదరదు 6. యుద్ధం ప్రకటిస్తే మనం అతిగా స్పందించామని ప్రపంచం మనను తప్పుపడుతుంది. 

మొత్తం మీద ఏం చేయాలో ఎవరికీ బోధపడలేదు. స్కాట్లండ్‌లో సమావేశం ప్రతిపాదన చేసినందుకు అందరూ జిమ్‌ను తిట్టుకున్నారు. కావాలని ప్రసంగం ముసాయిదాను ముందే పంపిన అధ్యక్షుడి బ్లాక్‌మెయిల్‌కి లొంగక తప్పదని అర్థం చేసుకున్నారు. ఆ బ్లాక్‌మెయిల్‌ ఖరీదెంతో కనుక్కునే బాధ్యతను అధ్యక్షుడికి పాత క్లాస్‌మేట్‌ అయిన జిమ్‌కి అప్పగించారు.

 **********

చార్లీ జిమ్‌ను సాదరంగా ఆహ్వానించాడు. అతనికి స్కాట్లండ్‌ ఉపయెన్నికల గురించి, తన పర్యటన ద్వారా అధికార పార్టీ రాజకీయలాభం పొందుదామనుకుంటోన్న సంగతి తెలుసు. డైరక్టుగా పాయింటుకు వచ్చేశాడు. ప్రసంగాన్ని మార్చాలంటే తన దేశానికి 5 కోట్ల పౌండ్ల ఋణం   వడ్డీలేకుండా యివ్వాలని, చెల్లింపు పదేళ్ల తర్వాతే ప్రారంభం కావాలని షరతు విధించాడు. జిమ్‌తో పాటు వెళ్లిన హంఫ్రీ ఓ కాగితం మీద 'ఏటా వడ్డీ 10% అనుకుంటే పదేళ్ల పాటు వడ్డీ లేదంటే ఆ ఋణం వూరికే యిచ్చినట్లవుతుంది' అని రాసిచ్చాడు. ఆ ముక్క జిమ్‌ చార్లీకి చెపితే 'కానీ ఆ ఋణం తీసుకునేది మీ రిగ్గులు కొనడానికే కదా'' అన్నాడు. వెంటనే హంఫ్రీ 'వీడు మన రిగ్గులను మన డబ్బుతోనే కొంటున్నాడు' అని. 

కానీ జిమ్‌కు దానిలో అభ్యంతరపెట్టవలసినది ఏమీ కనబడలేదు. బోల్డన్ని ఉద్యోగాలు వస్తాయి అన్నాడు. హంఫ్రీ మళ్లీ ఏదో కాగితం మీద గిలకబోయాడు. క్లాసురూములో టీచరును వెక్కిరిస్తూ కాగితాలు రాసి మార్చుకునే అల్లరి పిల్లల్లా వున్నామని తోచి జిమ్‌ హంఫ్రీని వెంటపెట్టుకుని కారిడార్‌లోకి వెళ్లాడు. 

''ఈ డబ్బు మళ్లీ వెనక్కి రాదు. మన రిగ్గులూ పోతాయి. మీ నియోజకవర్గాల్లో ఉద్యోగాలు వస్తాయి కదాని మీరు తలూపుతున్నారు.  బ్లాక్‌మెయిల్‌కు లొంగి రాజకీయ ప్రయోజనాలకై ప్రజాధనం యిలా దుర్వినియోగం చేయడం అన్యాయం, అక్రమం, ఆర్థికశాఖ ఎప్పటికీ ఒప్పుకోదు.'' అని హంఫ్రీ ఉపన్యాసాలు దంచసాగాడు. 

జిమ్‌ హఠాత్తుగా, అసందర్భంగా ''జిసిబి'' అన్నాడు.

హంఫ్రీ ఒక్కసారిగా ఆగిపోయాడు. తను ఆ పురస్కారం కోసం ఎదురుచూస్తున్న సంగతి జిమ్‌కు తెలిసిపోయిందని అర్థం చేసుకున్నాడు.  అది పెట్టుకుని యిప్పుడు జిమ్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని గ్రహించాడు. కానీ బ్లాక్‌మెయిల్‌కు లొంగినట్లు కనబడకుండా ''మీరు చెప్పినదానిపై దీర్ఘంగా ఆలోచిస్తే చాలా మంచి ఆలోచన అనిపించిందండి. మనం యీ ఆఫర్‌ తీసుకోకపోతే రష్యన్లు రంగంలోకి వచ్చి అవకాశాన్ని గద్దలా తన్నుకుపోవచ్చు. అదీకాక ఎల్‌డిసి దేశాలకు ఉదారంగా సాయం చేయవలసిన నైతిక బాధ్యత మన తెల్లవాళ్లపై వుంది. మన ఆర్థిక శాఖ అభ్యంతరాలు తెలుపుతుంది కానీ మనం ఉద్యోగకల్పన శాఖను, పరిశ్రమల శాఖలను కలుపుకుని వెళితే వాళ్లు నచ్చచెప్పవచ్చు. అనేక విధాలుగా యీ ఒప్పందం లాభదాయకం కాబట్టి ఒప్పించండం సాధ్యమే అనుకుంటున్నాను.'' అని ప్లేటు ఫిరాయించాడు.

ఇద్దరూ లోపలకి వెళ్లి చార్లీతో ''మనం ఒక అంగీకారానికి రాగలమని అనుకుంటున్నాం.'' అన్నాడు.

చార్లీ ''మరి దానికి చెల్లించాల్సిన మూల్యం ఏమిటో తెలుసుగా'' అన్నాడు.

జిమ్‌ హంఫ్రీ వైపు తిరిగి ''ఆశ్చర్యమేముంది? ప్రతీ మనిషికి ఒక మూల్యం వుంటుంది, ఏమంటావ్‌ హంఫ్రీ'' అన్నాడు.

''ఎస్‌ మినిస్టర్‌'' అన్నాడు హంఫ్రీ తలూపుతూ.(మూడో కథ సమాప్తం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2016) 

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?