Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సినీమూలం - అక్కాచెల్లెలు - 1/2

1970 నాటి ''అక్కా-చెల్లెలు''  సినిమాకు మూలం 1960 నాటి ''కానూన్‌'' అని చెప్పుకోవచ్చు. అంటే కానూన్‌లో వున్న ఒక అంశాన్ని తీసుకుని దాని చుట్టూ చాలా కథ అల్లుకుంటూ వచ్చారు మనవాళ్లు. అది సినిమా ఒక మహత్తరమైన సినిమా. న్యాయవ్యవస్థలో వున్న లోపాలను ఎత్తి చూపిన సినిమా. ఏదైనా తీర్పు యిచ్చేటప్పుడు కోర్టు సాక్ష్యాలమీద ఆధారపడుతుంది. అయితే ఆ సాక్ష్యం ఎల్లవేళలా నిజం అయివుండాలని లేదు. వాళ్లు పొరబడవచ్చు, కావాలని తప్పు చెప్పవచ్చు. అలాటి సాక్ష్యాన్ని పట్టుకుని ఒకవేళ ముద్దాయికి ఉరిశిక్ష వేసేస్తే ఎంత అనర్థం జరుగుతుంది - అన్న విషయాన్ని మనసుకు హత్తుకునేట్లా చెప్పారు దానిలో. అది చిన్న సినిమా. పాటలు లేవు, హీరో హీరోయిన్ల మధ్య డాన్సులు లేవు. ఏకబిగిన నడిచే సీరియస్‌ డ్రామా. దాన్ని తెలుగులో అలాగే తీస్తే మనవాళ్లు హరాయించుకోలేరని భయం. అందుకని మార్పులు చేశారు. మొదట హిందీ సినిమా గురించి ముందుగా చెప్పి తర్వాత దాని ముందూ, వెనకా తెలుగులో ఎలా మార్చుకుంటూ వచ్చారో చెప్తాను.

జీవన్‌ ఓ ముద్దాయి. గణపతి అనే అతన్ని చంపిన నేరంలో పట్టుబడ్డాడు. అతనిదొక వింతగాథ. అదే గణపతిని పదేళ్ల కితం చంపాడని అతని మీద కేసు పెట్టి పదేళ్లపాటు జైల్లో పెట్టారు. జైలునుండి విడుదల అవుతూనే అతను ఆ గణపతిని చంపి పారేశాడు. ఇప్పుడు కోర్టును ప్రశ్నిస్తున్నాడు - 'ఇదే నేరానికి అప్పుడు శిక్ష వేశారుగా, ఇప్పుడు మళ్లీ ఎలా వేయగలరు? ఆ రోజే నేను గణపతిని చంపి వుంటే మరి యీ గణపతి ఎక్కణ్నుంచి వచ్చాడు? ఆ రోజు నేను తప్పు చేయకపోయినా శిక్ష వేశారు. ఈ రోజు నేను హత్య చేశానని చెప్పినా శిక్ష వేయలేరు. ఎందుకంటే ఒకే నేరానికి రెండు సార్లు శిక్ష వేయలేరు కాబట్టి! అప్పుడు నేను హత్య చేస్తూండగా చూశానని చెప్పిన సాక్షులందరూ దొంగ సాక్షులే కదా! ఆ సాక్ష్యాలని నమ్ముకుని మీరు నన్ను జైల్లో వేశారు. అది పొరబాటేనని యిప్పుడు మీరు ఒప్పుకున్నంత మాత్రాన నా పదేళ్ల జీవితం వెనక్కి వస్తుందా? నా భార్య యవ్వనం వెనక్కి వస్తుందా?' అంటూ ప్రశ్నలు సంధిస్తూనే అతను బోనులోనే కుప్పకూలిపోయాడు.

ఆ కేసు విచారించిన జడ్జి అశోక్‌కుమార్‌ ఆలోచనలో పడ్డాడు. బార్‌ రూములో చర్చ జరిగింది. అతని సీనియర్‌ జస్టిస్‌ ఝా యిలాటివి తప్పవులే అన్నాడు. 'ఇలాటి సాక్ష్యాలు పట్టుకుని మనం వురిశిక్ష వేసేయకూడదు కదా. నిజానికి యిందాకటి వాడికి అప్పుడు ఉరిశిక్ష వేసి వుంటే యీ నిజం ఎప్పటికీ బయటపడేది కాదు కదా. అందుకని ఉరిశిక్షను రద్దు చేయాలంటాను' అన్నాడు అశోక్‌కుమార్‌. 'నేరం చేస్తే అది ఎలాగైనా బయటకు వస్తుంది. దానికోసం మనం చట్టాలు మార్చనవసరం లేదు' అన్నాడు ఝా. 'నువ్వు హత్య చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించు చూద్దాం, అది ఎంత అసాధ్యమో తెలుస్తుంది' అని అశోక్‌కుమార్‌ను ఛాలెంజ్‌ చేశాడు కూడా. అశోక్‌కుమార్‌ నవ్వుతూ ఓకే అన్నాడు. ఆ విషయం తన డైరీలో రాసుకున్నాడు కూడా. అదే అతని కొంప ముంచింది.

ఓం ప్రకాశ్‌ ఒక సేఠ్‌. వడ్డీవ్యాపారం చేస్తాడు. రాజేంద్రకుమార్‌ హీరో. వృత్తి రీత్యా లాయర్‌. ఇప్పుడు జడ్జి అయిన అశోక్‌కుమార్‌ లాయరుగా వుండగా అతని సహాయంతో చదువుకుని, అతని వద్దనే జూనియర్‌గా చేసి, ప్రస్తుతం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్నాడు. జడ్జిగారి కూతురు నందాను ప్రేమిస్తున్నాడు. ఆమె చదువు పూర్తవగానే పెళ్లి చేసుకుందామనుకుంటున్నాడు. నందాకు ఒక అన్న వున్నాడు. మెహమూద్‌. ఒట్టి జులాయి మనిషి. అమ్మాయిలతో తిరగడానికి సేఠ్‌ వద్ద నాలుగువేలు అప్పు తీసుకుని ఖాళీ ప్రామిసరీనోటు రాసి యిచ్చేశాడు. వడ్డీతో సహా అది ఏడువేలు అయింది. డబ్బు చెల్లించకపోతే జడ్జిగారికి చెప్తానని సేఠ్‌ బెదిరించాడు. మెహమూద్‌ చెల్లికి చెప్తే ఆమె హీరోకి చెప్పుకుంది. హీరో ఓ పార్టీనుండి తిరిగి వస్తూ రాత్రి 11.30కి సేఠ్‌ యింటికి వచ్చాడు. అతను యిచ్చిన షర్బత్‌ తాగి, ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టించుకుంటున్నందుకు సేఠ్‌ని మందలించాడు. అతను భయపడి నోటు తిరిగి యిచ్చేశాడు.

ఇంతలో హీరో కిటికీలోంచి చూస్తే అశోక్‌కుమార్‌ వస్తూన్నట్టు కనబడింది. ఆయనా యీ నోటు గురించే వస్తున్నాడనుకుని యితను పక్కకు వెళ్లి దాగున్నాడు. అశోక్‌కుమార్‌ వచ్చాడు. వస్తూనే కత్తితో సేఠ్‌ను పొడిచాడు. సేఠ్‌ చనిపోయాడు. రాజేంద్ర కుమార్‌ తెల్లబోయాడు. తను దేవుడిలా భావించే జడ్జి యింత క్రూరుడా? అని. అక్కడనుండి పారిపోయినా, అప్పటినుండీ అతనిలో మథన ప్రారంభమైంది. నిజానికి సేఠ్‌ను పొడిచినది జడ్జి కాదు. అతని పోలికలున్న మరొక వ్యక్తి. ఆ విషయం సినిమాలో చివరిలో తెలుస్తుంది. అంటే రాజేంద్రకుమార్‌ తన కళ్లతో చూసినది కూడా తప్పేనన్నమాట. జడ్జి చంపాడని అతను నిజాయితీగా సాక్ష్యం చెప్పినా అది తప్పుడు సాక్ష్యమేనన్నమాట. మనల్ని కూడా హీరో పడిన సందిగ్ధంలో పడేయడానికి దర్శకనిర్మాత బియార్‌ చోప్డా ఆ రెండో వ్యక్తి గురించి చూపిస్తూ మనలో అనుమాన బీజాలు నాటుతూ వచ్చారు. 

జరిగినదేమిటంటే సేఠ్‌ బ్లాక్‌మెయిలర్‌ కూడా. అతని బ్లాక్‌మెయిల్‌కు గుర్తయిన ఒక వ్యక్తి శశికళ. ఆమె ఒక డబ్బున్నవాడి భార్య. అతను వుండగానే గణపతి అనే అతన్ని ప్రేమించి అతని చేత భర్తను చంపించింది. ఆస్తి కైవసం చేసుకుంది. ఆ గణపతి యిటీవలే హత్యకు గురయ్యాడు. అతను వుండగానే యీ డూప్లికేట్‌ అశోక్‌కుమార్‌ను మరిగింది. అతనో నేరస్తుడు. 'నీ కథంతా బయటపెడితే నీ భర్త ఆస్తి నీకు దక్కదు సుమా' అని సేఠ్‌ తనను బెదిరించడంతో ఆమె తన ప్రియుడికి చెప్పి యితన్ని చంపించేసింది. ఆ అశోక్‌కుమార్‌ను శశికళతో తిరుగుతూన్నట్టుగా దర్శకుడు మనకు చూపిస్తూ కాస్త గందరగోళ పరుస్తాడు. అందువలన జడ్జిగారే ఒకవేళ హత్య చేసాడేమోనన్న అనుమానం మనలో రగిలి, హీరోతో ఐడెంటిఫై అవుతాం. 

ఈ సేఠ్‌ హత్య పాపం ఓ చిల్లరదొంగమీద పడింది. సేఠ్‌ యింటి కిటికీ తలుపు తీసి వుండడం చూసి ఆశపడి, దొంగతనానికి వచ్చాడు. అక్కడ కారి వున్న పాలపై జారిపడి, శవం మీద పడ్డాడు. కత్తిపై యితని వేలిముద్రలు పడ్డాయి. రక్తం చేతికి అంటింది. పైపుద్వారా దిగి పారిపోతూ వుంటే పోలీసులు పట్టుకున్నారు. ఇతనే హంతకుడని వాదించండి అని పబ్లిక్‌ ప్రాసిక్యూటరైన హీరోను అడిగారు. ఈ చిల్లరదొంగ (ఆ పాత్ర వేసినది నానా పల్సికర్‌ అనే నటుడు) ను హంతకుడిగా బోను కెక్కించడానికి హీరోకి మనసు రాలేదు. అసలు హంతకుడెవరో అతనికి తెలుసు. కానీ మోటివ్‌ ఏమిటి? మెహమూద్‌ని అడిగాడు, నీ ప్రోనోటు సంగతి మీ నాన్నకు చెప్పావా? అని. లేదన్నాడు. మరి ఉత్తిపుణ్యాన ఎందుకు చంపినట్టు? అని ఆలోచిస్తూ అశోక్‌కుమార్‌ గదిలోకి వచ్చి ఆయన డైరీ తిరగేశాడు. దానిలో జీవన్‌ కేసు నాటి సంఘటన, జస్టిస్‌ ఝాతో అశోక్‌కుమార్‌ చేసిన ఛాలెంజ్‌ కనబడ్డాయి.  

ఇంతలో జడ్జి వచ్చాడు. హీరో తనొక కథ చదువుతున్నట్టుగా చెపుతూ తన సమస్య చెప్పాడు. నేరస్తుడు తనంత తానే నేరం వొప్పుకుంటే సమస్య వుండదని చెప్పాడు. హంతకుడు నేరం తనంతట తాను ఎన్నడూ ఒప్పుకోడని జడ్జి చెప్పాడు. అతను యాథాలాపంగా చెప్పినా, దాన్ని ఆయనకు అన్వయించి యీయన ఓ పట్టాన లొంగడని అర్థం చేసుకున్నాడు హీరో. అంతే,  పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పదవికి రాజీనామా చేసి ముద్దాయికి డిఫెన్సు లాయరుగా కోర్టుకి వచ్చాడు హీరో. ఎందుకంది హీరోయిన్‌. అతను నిర్దోషి అన్నాడితను. దోషి ఎవరంది ఆమె. నీకు కావలసినవాళ్లే అన్నాడితను నర్మగర్భంగా. ఆమె మరోలా అర్థం చేసుకుంది. హీరోయే తనపై ప్రేమకోసం హత్య చేశాడని, మధ్యలో ఓ అమాయకుడు యిరుక్కోవడంతో గిల్టీగా ఫీలవుతున్నాడనీ అనుకుంది. 

ఇక విచారణ ప్రారంభమైంది. ఇది ఓపెన్‌ అండ్‌ షట్‌ కేస్‌ అన్నాడు కొత్త పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌. కానీ ప్రాసిక్యూషన్‌లో లోపాలు ఎత్తి చూపాడు హీరో. తలుపు ఎందుకు తీసివుందన్నాడు. హత్య చేసిన తర్వాత, పోలీసులు వచ్చేందుకు ముందు ముద్దాయి ఏం చేసి వుంటాడని అడిగాడు. హత్యాస్థలం వద్ద వున్న షర్బత్‌ గ్లాసులపై వేలిముద్రల గురించి విచారణ జరపలేదేమన్నాడు. దీనిలో మూడో వ్యక్తి వున్నాడని గట్టిగా వాదించాడు. సరే ఆ గ్లాసులపై వేలిముద్రలు  వెరిఫై చేయించారు. ఒకటి సేఠ్‌. రెండోది ఎవరిదో తెలియలేదు. రికార్డుల్లో లేదు. పాత నేరస్తుడు కాదు. ఆనాటి హియరింగ్‌ అయ్యాక హీరోయిన్‌ వుండబట్టలేక హీరోని అడిగేసింది - ఆ వేలిముద్రలు ఎవరివి? అని. నావే అన్నాడు హీరో. దాంతో హీరోయిన్‌కు రూఢి అయిపోయింది, హంతకుడు తన ప్రియుడేనని. వెళ్లి ముద్దాయితో మాట్లాడింది. నేరం ఒప్పేసుకుంటే అతని కొడుకుని చదివించే భారం తనదంది. పదివేల రూపాయలు అతని పేర బ్యాంకులో డిపాజిట్‌ చేసింది. (సశేషం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?