Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : వినోద్‌ మెహతా - 8

ఎమ్బీయస్‌ : వినోద్‌ మెహతా - 8

రస్కిన్‌ బాండ్‌ నవలపై ఎవరో కేసు పెట్టారు. అది సాహిత్యంలో అంతర్భాగమైన శృంగారమే అని వాదనలు వినిపించడానికి డెబెనేర్‌, రస్కిన్‌ తరఫున ప్రసిద్ధ వామపక్ష రచయిత ముల్క్‌ రాజ్‌ ఆనంద్‌, మరాఠీ నాటకకర్త విజయ్‌ తెండూల్కర్‌, ఆంగ్ల కవి నిస్సిమ్‌ ఎళికిల్‌ వంటి పెద్దలు సాకక్షులుగా వచ్చారు. దీనివలన పత్రికకు మంచి పబ్లిసిటీ దక్కింది. ఇంతలో సత్యజిత్‌ రాయ్‌ తీసిన ''అశని సంకేత్‌'' సినిమా వెలువడింది. దాన్ని నేను విమర్శిస్తానంటూ ఋత్విక్‌ ఘటక్‌ అనే మరో రియలిస్టిక్‌ బెంగాలీ సినిమా దర్శకుడికి అభిమాని, పూనా ఫిల్మ్‌ యిన్‌స్టిట్యూట్‌ విద్యార్థి అయిన సయీద్‌ మీర్జా (ఇతను తర్వాతి రోజుల్లో విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు) ముందుకు వచ్చాడు. తన సమీక్షలో సత్యజిత్‌లో బూర్జువా పోకడలున్నాయంటూ ఉతికి ఆరేశాడు. ఇది చదివి సత్యజిత్‌ రాయ్‌ పగలబడి నవ్వుకున్నాట్ట అని వినోద్‌ ఆత్మకథలో రాసుకున్నాడు. ఏమైతేనేం సత్యజిత్‌ సినిమాను విమర్శించే మొనగాడు ఒకడున్నాడని కొందరు సంతోషించి, యీ పత్రిక గురించి మరి కొందరికి చెప్పారు. బద్‌నామ్‌ భీ తో నామ్‌ హై అన్నారు, ఏదో ఒకలా పబ్లిసిటీ వస్తోంది కదా అని వినోద్‌ అనుకుంటూండగానే ఎమర్జన్సీ విధించారు. పత్రికల సెన్సారింగ్‌ అంటూ అశ్లీలచిత్రాలు వేయకూడదంటే తన గతి ఏమిట్రా అనుకుంటూండగానే ఓ రోజు ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ మంత్రి విసి శుక్లాను కలవాలని పిలుపు వచ్చింది. రాబోయే సంచికలలో వేయబోయే అమ్మాయిల ఫోటోలు పట్టుకుని వెళ్లాడు. వాటిలో 90% నగ్నంగా వున్న ఒక ఫోటోపై శుక్లా కన్ను పడింది.  తీసి పక్కన పెట్టాడు. వినోద్‌ కాస్త బెదురుతూ ''మేం సెంటర్‌స్ప్రెడ్‌ విభాగం ఎత్తేయాలంటారా?'' అని అడిగాడు. శుక్లా తెల్లబోయి ''అబ్బెబ్బే, కాస్త డీసెంటుగా వుండేట్లు చూడండి, చాలు'' అన్నాడు. బతుకు జీవుడా అనుకుని వినోద్‌ ఆ ఫోటోలన్నీ ఏరుకుని బ్రీఫ్‌కేస్‌లో పెట్టుకున్నాడు. విడిగా పెట్టిన ఫోటో కూడా తీయబోతూంటే అది అక్కడే వుండనీ అన్నట్టు సైగ చేశాడు శుక్లా! 

బట్టల్లేని అమ్మాయిల బొమ్మలతో మ్యాగజైన్‌ నడపడమేమిటని కొందరు వినోద్‌ను విమర్శిస్తూ వున్నా కొత్తగా ఏది కనబడినా ఆహ్వానించే కొందరు మాత్రం వినోద్‌ను బాహాటంగా సమర్థించేవారు. వారిలో కబీర్‌ బేదీ ఒకడు. 'ఖజురహో వారసత్వాన్ని డెబెనేర్‌ నిలుపుతోంది. ఇది భారతీయతకు ప్రతీక'' అని మెచ్చుకున్నాడు కూడా. అతని భార్య ప్రతిమా కూడా అలాటి భావాలే కలిగి వుంది. ఓ రోజు వినోద్‌ను పిలిచి ''నా విశ్వరూపం చూపిన ఫోటోలు కావాలా?'' అని అడిగింది. వెళ్లి చూస్తే అవి అద్భుతంగా వున్నాయి. ఆ లైటింగ్‌, ఆ ఫోటోగ్రఫీ, కలర్‌ కంపోజిషన్‌, ఆమె నగ్నత్వం అన్నీ సమ్మోహనకరంగా వున్నాయి. మోడల్స్‌తో చేసుకునే కాంట్రాక్టు ఫారం మీద ఆమె సంతకం పెడుతూంటే వినోద్‌ గులేబకావళి సాధించినంత సంతోషించాడు.  ఆ రోజుల్లో ప్రతిమా బేదీ అంటే కొత్త భావాలకు, ధైర్యానికి సింబల్‌గా యువతలో క్రేజ్‌ వుంది. పబ్లిషరు సోమానీ కూడా అవి చూడగానే గంతులేశాడు. 1970లలో ముద్రణా రంగం యింతగా అభివృద్ధి చెందలేదు. నాలుగు రంగుల పోస్టరంటే ఒక్కోటి ఒక్కోసారి ప్రింటు చేయాలి. ఈమె బొమ్మల పేజీలు రెండు రంగులు కొట్టారో లేదో కబీర్‌ బేదీ ఫోన్‌ చేశాడు. ''ప్రతిమా యిచ్చిన ఫోటోలు వెంటనే వెనక్కిచ్చేయండి. అవి మార్కెట్లోకి వెళ్లడానికి వీల్లేదు.'' అని అతను వినోద్‌కు నిష్కర్షగా చెప్పాడు. ''లాభం లేదు గురూ, అవి అప్పుడే ప్రింటయిపోతున్నాయి'' అన్నాడు వినోద్‌. మర్నాడు హిందీ సినిమాల్లో రౌడీ వేషాలేసే యిద్దరు అదే ఫక్కీలో అంటే నూనెరాసిన మీసాలు, మెడ చుట్టూ గళ్లరుమాలుతో ప్రెస్‌కు వచ్చి వేలు చూపుతూ ''ఫోటోలు వేయడానికి వీల్లేదని సాబ్‌ చెప్పారు'' అని బెదిరించారు. ఇంకో రెండు గంటలకు ప్రతిమ ఫోన్‌ చేసింది. ''కబీర్‌ చాలా అన్యాయంగా తిడుతున్నాడు. ఈ ఫోటోలు బయటకు వస్తే తన కెరియర్‌ నాశనమవుతుందట. నువ్వు ఏదో ఒకటి చేయకపోతే నా పెళ్లి పెటాకులయ్యేట్లుంది. మీకు జరిగిన నష్టాన్ని నేను పూడుస్తాను.'' అని బతిమాలింది. తన కారణంగా ఒకరి కొంప కొల్లేరు కావడం యిష్టం లేక వినోద్‌ వాటి ముద్రణ ఆపేశాడు. ప్రతిమ నష్టాన్ని పూరించడం మాట కూల్‌గా మర్చిపోయింది. 

1977 మార్చి ఎన్నికలలో ఇందిరా గాంధీ ఓడిపోవడంతో అప్పటిదాకా జనమంతా తిట్టుకుంటూ వున్న సంజయ్‌ గాంధీ గురించి పుస్తకం వేస్తే బాగా అమ్ముడుపోతుందని జైకో వాళ్లకు అనిపించింది. గతంలో తమకు మీనాకుమారిపై పుస్తకం రాసి పెట్టిన వినోద్‌కు కబురు పెట్టారు. నడుపుతున్నది మాసపత్రికే కాబట్టి, విరామసమయం బాగానే వుండేది. సంజయ్‌ గురించి రాయడమంటే నెహ్రూ కుటుంబంతో మొదలుపెట్టాలి. ఇలహాబాద్‌, లఖనవ్‌, దెహ్రాదూన్‌, మసూరి, రాయబరేలి ఊళ్లకు వెళ్లి నెహ్రూ కుటుంబానికి సన్నిహితుల నుండి, దూరపు బంధువుల నుండి వాళ్లింట్లో  పనిచేసిన పనివాళ్ల నుంచి సమాచారం సేకరించి వినోద్‌ పుస్తకం రాశాడు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన కారణంగా, ఫోర్కులు, కత్తులు వాడడం తెలియకపోవడం వలన కమలా నెహ్రూ (ఇందిర తల్లి)  అత్తవారింట్లో ఆడపడుచు విజయలక్ష్మీ పండిట్‌ చేత, మావగారు మోతీలాల్‌ చేత ఎలా యీసడించబడిందో, ఆమె జబ్బు పడినపుడు పక్కనే వుండి సేవ చేసిన ఫిరోజ్‌ గాంధీ (అప్పటికింకా అల్లుడు కాలేదు, లాయరు, కాంగ్రెసు కార్యకర్త మాత్రమే)తో ఆమెకు సంబంధం అంటగడుతూ ఇలహాబాద్‌లో పోస్టర్లు ఎలా వెలిశాయో రాసి, పుస్తకాన్ని ఆసక్తికరంగా మలిచాడు. సంజయ్‌ గాంధీ చిన్నప్పటి నుంచి రాలుగాయిగా పెరిగాడనీ, తను భర్తతో విడిగా వుండడం చేతనే వీడిలా తయారయ్యాడని తల్లి గిల్టీగా ఫీలయ్యేట్లు చేసి తను అనుకున్నది ఆమె నుంచి రాబట్టాడనీ, ఆర్చీ కామిక్స్‌ తప్ప వేరేదీ అతని బుర్రకు ఎక్కేది కాదనీ యిలా అన్నీ అక్షరబద్ధం చేశాడు. సంజయ్‌ ఎప్రెంటిస్‌గా పనిచేసిన రోల్సు రాయిస్‌ ప్లాంటులోంచి రిటైరైన ఉద్యోగుల నడిగి కార్ల గురించి అతని సాంకేతిక పరిజ్ఞానం ఎంతో తెలుసుకున్నాడు. గాంధీలకు కుటుంబ స్నేహితురాలైన ఒకామె రాజీవ్‌, సంజయ్‌ ఎలా కొట్లాడుకునేవారో చెప్పింది.

సంజయ్‌ వైపు నుంచి సమాచారం వుంటే తప్ప యీ పుస్తకానికి బాలన్స్‌ రాదని అనిపించి వినోద్‌ సంజయ్‌కు ఒక ఉత్తరం రాశాడు. సంజయ్‌ ఉత్తరం చదివి 'ఛాన్సే లేదు' అన్నాడని వినోద్‌కు తెలిసింది. అప్పట్లో అతని భార్య మేనక ''సూర్య'' మాగజైన్‌కు సంపాదకురాలు కాబట్టి ఎడిటరు-ఎడిటరు సంబంధంతో వినోద్‌ ఆమెకు ఫోన్‌ చేసి చూశాడు. ''మిమ్మల్ని కలవాలి'' అనగానే ఆమె ''మీరు సంజయ్‌పై రాయబోయే పుస్తకం గురించా?'' అని అడిగింది. అవుననగానే ''అది తప్ప వేరేదైనా మాట్లాడండి.'' అందామె. అప్పుడు మేనకకు బాగా తెలిసిన ఒక ఢిల్లీ జర్నలిస్టు ద్వారా మేనకు ఎప్రోచ్‌ అయ్యాడు. ఈ సారి మేనక కాస్త ఓపెన్‌గా మాట్లాడింది. ''జర్నలిస్టులందరూ అతని మీద పగబట్టారు. బాలన్స్‌డ్‌గా రాస్తామని ప్రతివాడూ అంటాడు. చివరకి అది మరోలా తేలుతుంది.'' అని వాపోయింది. ''మీకు స్నేహితులైన ఫలానాఫలానా వారిని కలిసి మాట్లాడాకనే మీకు ఫోన్‌ చేస్తున్నాను.'' అన్నాడు వినోద్‌. ''అంటే పుస్తకం సగం రాసేసి వుంటారు కదా, మీరు రాసినది చూపిస్తే అప్పుడు సంజయ్‌ మిమ్మల్ని కలవడానికి ఒప్పుకుంటాడు.'' అంది మేనక. రాసింది చూస్తే మార్చమంటాడని తెలుసు కాబట్టి వినోద్‌ ఆ ప్రయత్నం మానేసి తను సేకరించిన సమాచారంతోనే 1978 జనవరిలో పుస్తకం విడుదల చేసేశాడు. దానికి మంచి పేరు వచ్చింది.

డెబోనేర్‌ పత్రికలో మరిన్ని వివాదాస్పద విషయాలు ధైర్యంగా వేయాలనుకున్నాడు వినోద్‌. మీడియా వాళ్లు లోకాన్నంతా విమర్శిస్తారు కానీ తమను తాము విమర్శించుకోరు. ఒకరి జోలికి మరొకరు పోరు. దీన్ని ఛేదించాలనుకున్నాడు. కె ఆర్‌ సుందరరాజన్‌ అని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో అసిస్టెంటు ఎడిటరుగా పనిచేసే ఆయన్ని పట్టుకున్నాడు. ఆయన ప్రతిభావంతుడే కానీ కాస్త తిక్క మనిషి. ఇందిరా గాంధీకి వ్యతిరేకి. అధికారంలో వున్నవాళ్లను సమర్థించడమే పాలసీగా పెట్టుకున్న టైమ్స్‌ గ్రూపు ఎమర్జన్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సుందరరాజన్‌ను పైకి ఎదగనివ్వలేదు. వినోద్‌ అతన్ని పట్టుకుని ఎమర్జన్సీ టైములో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఎలా అమ్ముడుపోయిందో ఒక వ్యాసం రాయమని అడిగి రాయించుకున్నాడు. అది అచ్చవగానే వినోద్‌కు ధైర్యవంతుడైన సంపాదకుడిగా మరింత పేరు వచ్చింది. డెబెనేర్‌లో ఎందరో ప్రఖ్యాతులు రాశారు. వియస్‌ నైపాల్‌, నీరద్‌ సి చౌధురీ, ఖుశ్వంత్‌ సింగ్‌, విజయ్‌ తెండూల్కర్‌, నిస్సిమ్‌ ఎళికిల్‌, ఆర్‌ కె నారాయణ్‌.. యిలా ఎందరో. ఎందరు రాసినా డెబెనేర్‌కి బూతు పత్రిక అనే పేరు చెరిగిపోలేదు. ఆ పత్రిక ఎడిటరుగా వినోద్‌ను పరిచయం చేయగానే అవతలివాళ్లు కళ్లెగరేసేవారు, రాబోయే నవ్వు అణచుకునేవారు. ఇది వినోద్‌ను ఆలోచింపచేస్తూ వుండేది. ఒకసారి వాజపేయి దగ్గర కెళ్లి ఇంటర్వ్యూ యిమ్మనమంటే ఆయన యిచ్చాడు. సంచిక మార్కెట్లోకి వచ్చిన రెండువారాల తర్వాత కలిస్తే ఆయన ''మీ పత్రిక చాలా బాగుంది. కానీ దిండు కింద దాచుకుని చదవాల్సి వస్తోంది.'' అన్నాడు. 

ఇక యీ పత్రిక వదిలేసి వేరే ఉద్యోగం చూసుకుంటే మంచిదని వినోద్‌కు ఆ రోజే అనిపించింది. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]

Click Here For Previous Articles

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?