Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: భర్తపై కోపంతో పిల్లల్ని చంపిన మెడియా

ఎమ్బీయస్‌: భర్తపై కోపంతో  పిల్లల్ని చంపిన మెడియా

ఇది జేసన్‌ భార్య మెడియా కథ. గ్రీకు పురాణాల్లోనిదే. ఆమె అకృత్యాన్ని శీర్షికలోనే చెప్పేశాను. ఆ సందర్భం ఎలా వచ్చిందో పూర్వాపరాలు చెప్తున్నాను. జేసన్‌ అనే యువకుడు ఐల్కస్‌ అనే గ్రీకు రాజ్యానికి వారసుడు. అతని సవతి పినతండ్రి పెలియాస్‌ సింహాసనాన్ని ఆక్రమించి తండ్రిని ఖైదులో పడేశాడు. ఖైదులోనే జేసన్‌ పుట్టాడు. తల్లి ఉపాయంతో అతన్ని బయటకు తరలించేయడంతో యితను చనిపోయి వుంటాడని పెలియాస్‌ అనుకున్నాడు. యుక్తవయసు వచ్చాక జేసన్‌ ప్రత్యక్షమై అధికారాన్ని అప్పగించమనడంతో కంగు తిన్నాడు. కోల్చిస్‌ రాజు దగ్గరున్న గోల్డెన్‌ ఫ్లీస్‌ తీసుకువస్తే అప్పగిస్తానన్నాడు. రెక్కలున్న పొట్టేలు చర్మమది. బంగారు వర్ణంలో వుంటుంది. క్షణం కూడా రెప్పవాల్చని ఒక డ్రాగన్‌ దానిని నిరంతరం రక్షిస్తూ వుంటుంది. అది తెచ్చే ప్రయత్నంలో జేసన్‌ మరణిస్తాడని పెలియాస్‌ ఆశ.

అయితే జేసన్‌ కొంతమంది యోధానయోధులను వెంటపెట్టుకుని ఆర్గో అనే నౌకలో పయనిస్తూ ఎన్నో అవరోధాలు దాటుకుంటూ కోల్చిస్‌ రాజు వద్దకు వెళ్లాడు. అతను చెప్పిన అనేక అసాధ్యకార్యాలను నెరవేర్చాడు. వీరందరినీ కలిపి జేసన్‌ అండ్‌ ఆర్గోనాట్స్‌ అన్నారు. వీరిపై 1963లో, 2000లో హాలీవుడ్‌లో సినిమాులు వచ్చాయి. ఎన్ని చేసినా గోల్డెన్‌ ఫ్లీస్‌ మాత్రం చేజిక్కలేదు. అయితే కోల్చిస్‌ రాజు కూతురు మెడియా జేసన్‌పై మనసు పడింది. తన మంత్రశక్తితో డ్రేగన్‌ను నిద్రపుచ్చి, జేసన్‌కు అది దక్కేట్లు చేసింది. జేసన్‌ వస్తూ, వస్తూ ఆమెను తనతో పాటు తీసుకుని నౌకలో వచ్చేశాడు. ఆమె తండ్రి వాళ్లను వెంటాడాడు. అప్పుడు మెడియా తన సోదరుణ్ని ముక్కలు ముక్కలు చేసి సముద్రంలో పడేసింది. తండ్రి ఆ ముక్కలు ఏరుకుంటూ వుండగా వీళ్లు తప్పించుకుని  ఐల్కస్  చేరారు.

తన రాజ్యానికి వచ్చాక జేసన్‌ మెడియాను పెళ్లాడాడు. వాళ్లకు యిద్దరు కొడుకులు కలిగారు. అయితే గోల్డెన్‌ ఫ్లీస్‌ యిచ్చాక కూడా పెలియాస్‌ జేసన్‌కు రాజ్యాన్ని అప్పగించకుండా ఏమార్చసాగాడు. జేసన్‌ తన తండ్రిని జైల్లోంచి బయటకు తీసుకువచ్చాడు కానీ అతను కదలలేని పరిస్థితిలో వున్నాడు. అప్పుడు మెడియా ఆయన నుంచి రక్తం తీసుకుని కొన్ని మూలికలు కలిపి ఉడికించి, మళ్లీ శరీరంలోకి ఎక్కించింది. దాంతో అతనికి మళ్లీ ఎంతో శక్తి వచ్చింది. అది చూసి పెలియాస్‌ కూతుళ్లు మెడియా వద్దకు వెళ్లి ‘‘మా నాన్నకు కూడా అలా శక్తి తెప్పించవా?’’ అని అడిగారు. పెలియాస్‌ అడ్డు తొలగించుకోవడానికి మార్గం దొరికిందనుకుని మెడియా పన్నాగం పన్నింది.

‘‘ఎవరికైనా సరే మళ్లీ యవ్వనం తెప్పించగలిగే విద్య నాకు వచ్చు. వాళ్లను ముక్కలుముక్కలుగా నరికి నా దగ్గరకు తెస్తే కొన్ని మూలికలు కలిపి వండుతాను. వాళ్లు యవ్వనంలో ఎలా ఉన్నారో ఆ రూపంలో తిరిగి వస్తారు.’’ అంది. వాళ్లకు నమ్మకం కలిగించడానికి ఒక ముసలి పొట్టేలును నరికి, ఓ గుండిగలో వండి, దానిలోంచి కుఱ్ఱ పొట్టేలును రప్పించింది. తమ తండ్రి మళ్లీ యవ్వనవంతుడై రాజ్యాన్ని యింకా కొన్నేళ్లు పాలించాలనే ఆశతో అతని కూతుళ్లు తండ్రికి మత్తిచ్చి చంపి ముక్కలు చేసి పట్టుకుని వచ్చారు. మెడియా మూలిలు కలపకుండా వండింది. అతను తిరిగి రాలేదు. ఆ విధంగా పెలియాస్‌ పీడ వదిలింది కానీ మెడియాపై, జేసన్‌పై పెలియాస్‌ కొడుకు మండిపడ్డాడు. జేసన్‌ కుటుంబాన్ని దేశం నుంచి బహిష్కరించాడు.

ఈ విధంగా ఎంతో కష్టపడి అనేక అసాధ్యకార్యాలను నెరవేర్చిన జేసన్‌ చివరకు దేశభ్రష్టుడయ్యాడు. కుటుంబంతో సహా కోరింథ్‌ అనే పొరుగు రాజ్యానికి చేరాడు. అయితే అక్కడి రాకుమార్తె యితన్ని చూసి వలచింది. పెళ్లాడతానంది. కోరింథ్‌ రాజు కూడా ఒప్పుకున్నాడు.  ఐల్కస్ సింహాసనం దక్కించుకునేందుకు కొత్త మావగారు సాయపడతాడు కదాన్న రాజకీయపు టాలోచనతో, మెడియా తనకు చేసిన ఉపకారాలన్నీ పక్కన పెట్టి జేసన్‌ యువరాణిని పెళ్లి చేసేసుకుని, ఆ తర్వాత మెడియాకు చెప్పాడు. ఇది మెడియాను బాధించింది. నువ్వు రాజువి కావాలని, నా సోదరుడితో సహా ఎంతమందిని చంపానో గుర్తు లేదా అని భర్తను నిలదీసింది. అయితే జేసన్‌ పట్టించుకోకుండా యీ కొత్త రాజ్యంలో ఆమె కర్మానికి ఆమెను వదిలిపెట్టేసి, రాకుమారితో ఉండసాగాడు.

తన వారంటూ ఎవరూ మిగలని మెడియా, ఒక స్త్రీగా తను పడిన కష్టాలన్నీ తలపోసుకుని కుములుతూ ఆ దేశపు రాజును, తన సవతిని తిట్టిపోసింది. ఒక రోజు రాజు ఆమె యింటికి వచ్చి, ‘నిన్ను నమ్మడానికి లేదు, పిల్లలతో సహా నువ్వు రాజ్యం వదిలి వెళ్లాల్సిందే’ అని ఆదేశించాడు. రాజ్యకాంక్షతో తనను దిక్కుమాలినదానిని చేసి, ఈ గతి పట్టడానికి కారకుడైన భర్తపై కక్ష తీర్చుకోవాలంటే కపటనాటకమే శరణ్యమనుకుంది మెడియా. ‘ఒక్కరోజు గడువివ్వండి, వెళ్లిపోతా. నాకు నా భర్తమీదే కోపం తప్ప, వేరెవరిపైన లేదు’ అని రాజుని బతిమాలింది. అతను ఒప్పుకుని ‘సరే రేపు వెళ్లండి’ అని చెప్పి వెళ్లిపోయాడు. అతను వెళ్లగానే జేసన్‌ వచ్చాడు. ‘ఇదంతా నీ పొరపాటే. రాజుని తిట్టడంతో ఆయనకు కోపం వచ్చింది. మీరు ఏ దేశం పోయినా నీకూ, నీ పిల్లలకు డబ్బు ఏర్పాటు చేస్తానులే’ అన్నాడు పొగరుగా.

‘నేను ఎక్కడ వుండగలను? నీ కోసం నా వారిని వదులుకున్నాను, నీ రాజ్యంలో అందరితో శత్రుత్వం కొని తెచ్చుకున్నాను. నీకు చేసిన ఉపకారాలు మర్చిపోయి, నన్ను భ్రష్టురాలిని చేశావ్‌.’ అని మెడియా ఏడిస్తే ‘ఉపకారాలంటూ మిడిసిపడకు. దేవతలు నాకు సాయపడదామనుకున్నారు. నీ ద్వారా సహాయం అందించారు. అదంతా నీ ప్రజ్ఞ అనుకోవద్దు’ అంటూ జేసన్‌ తీసిపారేశాడు. అతను వెళ్లిన తర్వాత ఆమెకు గతంలో పరిచితుడైన ఏథెన్స్‌ రాజు అనుకోకుండా మెడియా వద్దకు వచ్చాడు. ‘నేను ఎలాగోలా ఏథెన్స్‌ వచ్చేస్తే, నువ్వు నాకు ఆశ్రయం యివ్వాలి. నీ సంతానలేమి సమస్యను నా మంత్రాలతో నయం చేస్తాను’ అంది మెడియా. అతను ఒప్పుకున్నాడు. అప్పుడు జేసన్‌ను పిలిపించింది.

‘నువ్వు తెలివితేటలతో ఒక పని చేస్తే అది అర్థం చేసుకోకుండా కోపావేశంలో ఏదేదో అన్నాను, వదిలేయ్‌. నేను చేసిన తప్పులకి  పిల్లల్ని శిక్షించడం దేనికి? నేను ప్రవాసంలోకి వెళ్లిపోతాను. వాళ్లను యిక్కడే వుండనిచ్చేందుకు నీ కొత్త భార్యను ఒప్పించు.’ అంది. ‘సరే, ప్రయత్నిస్తాను’ అన్నాడతను. ‘ఆమెను మంచి చేసుకోవడానికి మన  పిల్లల  ద్వారా ఆమెకు కొత్త దుస్తులు బహుమతిగా పంపుతున్నాను. నువ్వు దగ్గరుండి వాళ్ల చేత యిప్పించు.’ అని కోరింది. అతను సరేనన్నాడు. అయితే మెడియా కుట్లలో విషం పూసింది. జేసన్‌  పిల్లల చేత యువరాణికి బట్టలిప్పించాడు. ఆమె సంతోషించి, మా నాన్నతో మాట్లాడతాను అని హామీ యిచ్చింది.  పిల్లలు  వెళ్లాక బట్టలు వేసుకుంది. వేసుకోగానే ఆ విషం రాకుమారి చర్మాన్ని, శరీరాన్ని దహించివేసి చంపేసింది. ఆమె శవాన్ని కౌగలించుకుని, భోరుమని ఏడ్చిన రాజు కూడా విషప్రభావంతో మరణించాడు.

రాజును, రాకుమారిని తన భార్య చంపిన విషయం బయటకు పొక్కగానే ఆ దేశప్రజలు తన కొడుకులకు ఆపద తలపెడతారని భయపడిన జేసన్‌ వారిని రక్షించడానికి యింటికి పరుగు పెట్టాడు. మెడియా యిది ముందే వూహించింది. మోసం చేసిన భర్తను మరింత బాధించాలంటే, అతనికి అత్యంత ప్రియమైన తమ సంతానాన్ని మట్టుపెట్టాల్సిందే అనుకుంది. వాళ్లు తనకు పుట్టినవారైనా సరే, పుత్రప్రేమను అణచుకుని, భర్తపై పగతో, అతన్ని మానసికంగా శిక్షించడానికి కొడుకులిద్దర్నీ చంపేసింది. వారి శవాలను తీసుకుని డ్రేగన్లు లాగే మంత్రరథంలో ఏథెన్స్‌కు పారిపోయింది. వారి అంత్యక్రియులు ఘనంగా నిర్వహించి, తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని జేసన్‌కు చెప్పింది.

చివరకు జేసన్‌కు కుటుంబసభ్యులెవరూ దక్కలేదు. తర్వాత కొన్నాళ్లకు పెలియాస్‌ కొడుకును యుద్ధంలో ఓడించి సింహాసనం దక్కించుకున్నాడు. కానీ చివరిలో మెడియా శాపం ఫలించి, తనకు ఎంతో పేరు తెచ్చిన ఆర్గో నౌకలోని ఒక చెక్క ముక్క నెత్తిన పడి దుర్మరణం పొందాడు. సాహసవంతుడిగా జేసన్‌, పుత్రహంతకిగా మెడియా గ్రీకు ప్రజలకు గుర్తుండిపోయారు. మెడియాపై గ్రీకు నాటకాలున్నాయి. 1969లో ఇటాలియన్ ఫిల్మ్ వచ్చింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?