cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సినిమా టైటిల్‌ వివాదంలో ఇద్దరు పెద్దలు

ఎమ్బీయస్‌: సినిమా టైటిల్‌ వివాదంలో ఇద్దరు పెద్దలు

మన తెలుగునాట సినిమా టైటిళ్లు వివాదంలో చిక్కుకోవడం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ''గ్యాంగ్‌ లీడర్‌'' టైటిల్‌తో నాని సినిమా టీజరు బయటకు రాగానే ఎంఎంకె ఫిల్మ్‌స్‌ అనే సంస్థ ఆ టైటిల్‌ మా పేర రిజిస్టర్‌ అయి వుందని గొడవ చేసింది. వెంటనే వీళ్లు ''నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌'' అని మార్చేశారు. గతంలో ''కత్తి'' సినిమా టైటిల్‌ను రవితేజతో తీద్దామనుకున్న సినిమాకై గుణశేఖర్‌ రిజిస్టర్‌ చేసుకోగా కళ్యాణ్‌రామ్‌కు కూడా ఛాంబర్‌ ఆ పేరు యిచ్చేసింది. గుణశేఖర్‌ అభ్యంతరం తెలపడంతో ''కళ్యాణ్‌రామ్‌ కత్తి'' అని పేరు మారిపోయింది. అలాగే ''ఖలేజా'' సినిమా పేరుతో వివాదం రాగానే ''మహేశ్‌ ఖలేజా'' అయిపోయింది. ఇలాటప్పుడు ప్రి-ఫిక్స్‌ చిన్నగా పెట్టి తాము అనుకున్న టైటిల్‌ పెద్ద అక్షరాల్లో రాస్తారు. ఇలాటి గొడవ హిందీ చిత్రసీమలో 1970లో వచ్చింది. అదీ పూర్తి పేరుతో కాదు, సగం పేరుతోనే. నిర్మాతలిద్దరూ వెనక్కి తగ్గలేదు. ఇద్దరూ హేమాహేమీలే.

వారిలో ఒకరు రాజ్‌ కపూర్‌. హిందీ సీమలో ''షో మ్యాన్‌'' పేరుకు అర్హుడు. అనేక శ్రమదమాదుల కోర్చి భారీ బజెట్‌తో, తను హీరోగా సిమి, పద్మిని, ఓ రష్యన్‌ తార హీరోయిన్లగా, మనోజ్‌ కుమార్‌, రాజేంద్ర కుమార్‌, బాల ఋషి కపూర్‌లతో ఏళ్ల తరబడి ''మేరా నామ్‌ జోకర్‌'' అనే సినిమా తీశాడు. దానికి పోటీగా వచ్చిన సినిమా ''జానీ మేరా నామ్‌'' దేవ్‌ ఆనంద్‌, హేమమాలిని, ప్రాణ్‌, ప్రేమ్‌నాథ్‌ నటించిన ఆ సినిమా నిర్మాత గుల్షన్‌ రాయ్‌.  నిర్మాతగా అతనికి అదే మొదటి సినిమా. అప్పటిదాకా డిస్ట్రిబ్యూటర్‌, ఫైనాన్షియర్‌. ఆ సినిమా తర్వాత  ''జోషిలా'' (1973) ''దీవార్‌'' (1975), ''త్రిశూల్‌'' (1978), ''విధాతా'' (1982), ''యుధ్‌'' (1985), ''త్రిదేవ్‌'' (1989), ''విశ్వాత్మా'' (1992) ''మొహ్రా'' (1994), ''గుప్త్‌'' (1997) వంటి మల్టీస్టారర్‌ హిట్స్‌ ఎన్నో తీశాడు. పద్మశ్రీ బిరుదు పొందాడు. రాజ్‌, గుల్షన్‌ సినిమాలలో కామన్‌గా వచ్చిన పదం ''మేరా నామ్‌'', అంతే. కానీ చిన్న విషయం చివికి చివికి గాలివానై చివరకు పెద్ద వివాదమైంది. 

గుల్షన్‌ లాహోర్‌లో పుట్టి పెరిగాడు. 23వ యేట 1947లో బొంబాయికి చుట్టపుచూపుగా వచ్చాడు. వచ్చిన మూడు వారాలకు దేశవిభజన జరిగింది. ఇక అక్కడే ఉండిపోయాడు. చిత్రసీమ ఆకర్షించింది. పరిచయాలు పెంచుకున్నాడు. కెఎ అబ్బాస్‌ దర్శకత్వం వహించగా రాజ్‌ కపూర్‌, నర్గీస్‌ నటించిన ''అన్‌హోనీ'' (1952) సినిమాకు ఫైనాన్స్‌ చేసి, డిస్ట్రిబ్యూషన్‌ చేయడంతో తొలి అడుగు పడింది. అది ఘనవిజయం సాధించినా తర్వాత  ఫైనాన్స్‌ చేసిన ''షికస్త్‌'' (1953 - దిలీప్‌ కుమార్‌, నళినీ జయవంత్‌) పరాజయం పొంది అతన్ని దెబ్బ తీసింది. మళ్లీ ''ఘర్‌ సంసార్‌'' (1958) అతన్ని నిలబెట్టింది. ''గర్ల్‌ ఫ్రెండ్‌'' (1960) పాత జవజీవాల నిచ్చింది. అతను ముందుకు దూసుకుపోయాడు. 1968 వచ్చేసరికి అతను పెద్ద ఫైనాన్షియర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా స్థిరపడడమే కాదు, తరచుగా పార్టీలిస్తూ ఓ షో మ్యాన్‌గా కూడా పేరుకెక్కాడు.

అప్పుడతనికి అనిపించింది - మన డబ్బు యితరుల చేతిలో పోసి, వాళ్లు ఎలాటి సినిమా తీస్తారోనని టెన్షన్‌ పడడం కంటె మనమే నిర్మాతగా మారి మన డబ్బుతో ప్రయోగం చేస్తే మంచిది కదాని. ''గైడ్‌'' ''జ్యూయల్‌ థీఫ్‌'' సినిమాల డిస్ట్రిబ్యూషన్‌తో స్నేహితుడైన దేవ్‌ ఆనంద్‌ ప్రోత్సహించాడు. త్రిమూర్తి ఫిల్మ్‌స్‌ అని పేరు పెట్టి సంస్థ నెలకొల్పాడు. దానికి లోగో సూచించండి అంటూ సినిమా మాగజైన్లలో పాఠకులను కోరాడు. చివరకు ప్రస్తుతం ఉన్న లోగోను స్థిరపరిచాడు. త్రి అని పేర్లో ఉంది కాబట్టి ఒక త్రికోణం ఉంటుంది. దానిలో కమలం పట్టుకున్న బ్రహ్మ చెయ్యి, చక్రం పట్టుకున్న విష్ణువు చెయ్యి, త్రిశూలం పట్టుకున్న శివుడి చెయ్యి ఉంటాయి. త్రిశూలం ప్రస్ఫుటంగా కనబడుతూ త్రికోణాన్ని చీలుస్తూ ఉంటుంది. 

తొలి సినిమా కాబట్టి మంచి కథ కావాలి.  'మీ దగ్గర కథేమైనా ఉందా?'' అని దేవ్‌ను అడిగితే వాళ్ల నవకేతన్‌ సంస్థకు కథలు రాస్తూండే కె ఎ నారాయణ్‌ రాసి సిద్ధంగా పెట్టిన ''జానీ మేరా నామ్‌'' స్క్రిప్టు చేతిలో పెట్టాడు. డైరక్షన్‌ చేసి పెట్టడానికి మా తమ్ముడు విజయ్‌ ఆనంద్‌ ఉన్నాడు అని హామీ యిచ్చాడు. ''ఆ స్క్రిప్టు నా చేతికి వచ్చేసరికే పైన ఆ పేరు టైపు చేసి ఉంది. అప్పటికే రాజ్‌ కపూర్‌ ''మేరా నామ్‌ జోకర్‌'' కొన్నేళ్లగా నిర్మాణంలో ఉంది. దానికీ దీనికీ పేరు కలిసింది అని నాకు తట్టలేదు. ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ వారి రిజిస్ట్రేషన్‌ చిఠ్ఠా చూస్తే అలా కలిసినవి వందల్లో కనబడతాయి. మేం ఆ పేరుతో సినిమా తీయబోతున్నాం అని తెలియగానే రాజ్‌ కపూర్‌ నన్ను పిలిచి 'మీది మార్చుకోండి' అని చెప్పి వుంటే మార్చేసేవాణ్ని. నాకు ఆ పేరు మీద వ్యామోహం ఏమీ లేదు. కానీ మధ్యలో కొందరు చేరి మొత్తమంతా చెడగొట్టారు.'' అన్నాడు గుల్షన్‌ తర్వాతి రోజుల్లో. 

ఈ మధ్య జనాభా ఎవరంటే గతంలో సినిమాలు తీసి యిప్పుడు రికామీగా ఉన్నవారు. ఓ సాయంత్రం గుల్షన్‌తో, మర్నాడు రాజ్‌తో, ఆ మర్నాడు గుల్షన్‌తో.. మందు కొట్టేవాళ్లు. నీ గురించి వాడు అలా అనుకుంటున్నాడు, అలా అన్నాడు అంటూ కథలు పుట్టించేవాళ్లు. మందు ప్రభావంలో అది వీళ్ల తలకెక్కేది. పట్టుదలలు పెరిగాయి. పేరు మార్చవచ్చు కదా అని ఎవరైనా హితైషులు చెప్పబోయినా 'ఆ ముక్క వాళ్లకే చెప్పవచ్చుగా' అనేవారు. ఇలా పేర్లు కలిసే సినిమాలు చాలా ఉన్నా, మీడియా వీటిని హైలైట్‌ చేసి, కథనాలు రాయసాగింది - ఇద్దరూ ప్రముఖులే కాబట్టి! రెండిటిని ఒకదానికి మరొకటి పోటీగా నిలబెట్టారు. అయితే ''మేరా నామ్‌ జోకర్‌'' ఆలస్యమైంది. ఆరేళ్ల నిర్మాణం తర్వాత ఫస్ట్‌ కట్‌ చూసుకుంటే రాజ్‌కు సినిమాలో కామెడీ లోపించినట్లు తోచింది. ''పేరు చూసి కామెడీ ఉంటుందని ఆశించి వస్తారు. సినిమా యింత సీరియస్‌గా ఉంటే జీర్ణించుకోలేక పోతారు.'' అనుకున్నాడు. అప్పుడు పార్శీ హాస్య నాటకాలు రాసే ఆది మర్జ్‌బాన్‌ను పిలిపించి కొన్ని హాస్యఘట్టాలు రాయించి జోడించాడు. వాటి చిత్రీకరణతో ఆలస్యమైంది.

ఆ పాటికి 'జానీ..' విడుదల కావాల్సిందే. కానీ దాని ఫస్ట్‌ కట్‌ చూశాక గుల్షన్‌కు క్లయిమాక్స్‌ నచ్చలేదు. డైరక్టరు విజయ్‌ను పిలిచి మార్చి తీయమన్నాడు. అతను ఒప్పుకోలేదు. విషయం సందిగ్ధంలో పడింది. గుల్షన్‌ దేవ్‌ వద్దకు వెళ్లి ''ఇది నా తొలి సినిమా. భారీ బజెట్‌ సినిమా. నాకు తృప్తి కలిగేలానైనా తీయకపోతే ఎలా? రీషూట్‌ చేయడానికి అదనంగా ఖర్చు పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను, కానీ విజయ్‌ ఒప్పుకోవటం లేదు.'' అని ఫిర్యాదు చేశాడు. దేవ్‌ అంతా విని, ఒక రోజు తన యింట్లో సమావేశం ఏర్పరచాడు. తమ్ముడికి నచ్చచెప్పబోతే అతను వినటం లేదు. రాత్రి అవుతున్న కొద్దీ అసహనం పెరిగి గుల్షన్‌ ''సినిమా హిట్‌ అవ్వాలంటే క్లయిమాక్స్‌లో కమెడియన్‌ ఐఎస్‌ జోహార్‌ పాత్ర నిడివి పెంచాల్సిందే'' అన్నాడు. అది దేవ్‌ అహాన్ని దెబ్బ తీసింది. ''జోహార్‌ వల్లే సినిమా హిట్టయితే మరి నేనిక్కడ ఏం చేస్తున్నట్లు?'' అన్నాడు. అప్పుడు గుల్షన్‌ అతన్నీ బతిమాలుకోవలసి వచ్చింది. 

చివరకు తెల్లవారుతూండగా విజయ్‌ క్లయిమాక్స్‌ మార్చడానికి ఒప్పుకున్నాడు. కానీ అప్పణ్నుంచి గుల్షన్‌తో మాట్లాడడం మానేశాడు - సినిమా రిలీజై హిట్టయ్యేదాకా! ఈ తర్జనభర్జనలతో వీళ్ల సినిమా కూడా లేటైంది. మొత్తానికి రెండూ 1970 ఆఖర్లో రిలీజయ్యాయి. ''జోకర్‌'' సినిమాపై చాలా అంచనా లుండడంతో సాధారణ ప్రజలు కూడా టిక్కెట్లు ముందుగా కొనేసి పెట్టుకున్నారు - బ్లాక్‌లో అమ్ముకుందామని! ఒక థియేటర్లో టిక్కెట్లు అమ్మే బుకింగ్‌ క్లర్క్‌ తన అప్పులు చేసి, ఆస్తులమ్మి రూ.25 వేలు పోగేసి, టిక్కెట్లు కొనుక్కుని పెట్టుకున్నాడు. సినిమా రిలీజైంది. నిడివి చాలా ఎక్కువైందని, కామెడీ లేదని, విసుగు పుట్టిందని ప్రేక్షకులు ఫీలవడంతో సినిమా ఘోరంగా ఫ్లాపయింది. సెకండ్‌ రిలీజ్‌లో హిట్టయింది కానీ ఫస్ట్‌ రిలీజ్‌లో ఫెయిలయింది. రెండో రోజుకే హాలు ఖాళీ కావడంతో ముందుగా టిక్కెట్లు కొనుక్కున్నవాళ్లు అసలు ధర కంటె తక్కువ రేటుకే అమ్మేసి, పెట్టుబడి రాబట్టుకో బోయారు. ఇది రాజ్‌ ఆత్మాభిమానాన్ని తీవ్రంగా దెబ్బ తీసింది. దానికి తోడు మధ్యనున్నవాళ్లు కొందరు వచ్చి 'ఇదంతా గుల్షన్‌ చేయించిందే' అని చెప్పారు. 

నా ప్రమేయం ఏమీ లేదంటాడు గుల్షన్‌. ఎందుకంటే అప్పటికే అతని సినిమా ఐదువారాల క్రితం రిలీజై సూపర్‌ సూపర్‌ హిట్‌ అయింది. ఈ సినిమా ఎలా పోతే అతనికేం? కానీ పంతం కొద్దీ నాది ఫెయిల్‌ చేయించాడని రాజ్‌ అనుమానం. తర్వాత గుల్షన్‌ అనేక మల్టీస్టారర్లు తీసి హిట్లు కొట్టాడు. అన్నగారు బిఆర్‌ చోప్డా నుంచి బయటకు వచ్చిన యశ్‌ చోప్డా తీసిన ''దాగ్‌'' (1973)కు గుల్షన్‌ ఫైనాన్స్‌ చేశాడు. రిలీజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి యశ్‌, రాజ్‌ కపూర్‌ను ఆహ్వానించాడు. పార్టీ అయిపోయాక ముఖ్యులందరూ కూర్చుని మందు కొట్టారు. ఇంచుమించు తెల్లవారుఝామున మద్యం నిషా తలకెక్కిన రాజ్‌ కపూర్‌, గుల్షన్‌ రాయ్‌పై విరుచుకు పడ్డాడు. నానా తిట్లూ తిట్టాడు. దాంతో కోపం చల్లారింది. ఆ తర్వాత యిద్దరూ మళ్లీ మిత్రులయ్యారు.
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2020)