Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: నాఫ్టాకు సవరణలు - మెక్సికో కోణం

ఎమ్బీయస్‌: నాఫ్టాకు సవరణలు - మెక్సికో కోణం

ఉత్తర అమెరికా, కెనడా, మెక్సికోల మధ్య 1994లో ఏర్పడిన నార్త్‌ అమెరికన్‌ ఫ్రీ ట్రేడ్‌ ఎగ్రిమెంట్‌ (నాఫ్టా) సవరణలకు గురి అవుతోంది. ఈ మూడు దేశాల మధ్య సుంకాలు లేని వాణిజ్యం వర్ధిల్లాలనే ఉద్దేశంతో యిది రూపు దిద్దుకుంది. అయితే దీని వలన నష్టపోతున్నామని ఎవరికి వారే అనుకోవడంతో సవరణలు అవసరమవుతున్నాయి. స్థానికులకు ఉద్యోగాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్‌ నాఫ్టా కారణంగా అమెరికన్లకు ఉద్యోగాలు పోతున్నాయని ఆరోపిస్తూ దాన్ని మార్చడానికి సంకల్పించాడు.

ఒక ఉదాహరణగా చెప్పాలంటే - చైనాలో తయారైన కారుని మెక్సికోకు పట్టుకుని వచ్చి టైర్లు మార్చేసి, మెక్సికోలో తయారైనట్లు చూపించి అమెరికాకు ఎగుమతి చేస్తే సుంకం ఉండదనుకోకూడదు. ప్రస్తుత ఒప్పందం ప్రకారం ఎగుమతి చేసే వస్తువులో 62.5% విడిభాగాలు మెక్సికోలో తయారయితేనే సుంకం వసూలు చేయరు. లాభాల మీద కన్నేసిన అమెరికా కంపెనీలు మెక్సికోలో ఫ్యాక్టరీ పెట్టి ఆ పని చేస్తున్నాయి. అక్కడ జీతాలు తక్కువ కాబట్టి లాభాలెక్కువ. ఈ క్రమంలో అమెరికా వారికి ఉద్యోగావకాశాలు తగ్గిపోతున్నాయి. అందువలన ఆ 62.5% ను 75% చేసి, మెక్సికన్‌ కార్మికుల జీతాలు కూడా పెంచేస్తే అమెరికన్లకు మెక్సికో వెళ్లే ఉత్సాహం తగ్గుతుందని ట్రంప్‌ వాదన. కొత్త సవరణల ప్రకారం అక్కణ్నుంచి ఎగుమతి అయ్యే కార్లలో 40-45% కార్ల తయారీలో పాలు పంచుకున్న కార్మికులకు గంటకు 16 డాలర్ల కనీస జీతం ఉండాలి. వాళ్లకు అంత జీతం యిస్తే గిట్టుబాటు కాదనుకున్న అమెరికన్‌ కంపెనీలు తమ సొంత దేశంలోనే ఫ్యాక్టరీ పెడతాయని ట్రంప్‌ లెక్క.

ఇలాటి సవరణలు చేయడానికి మెక్సికో ఆగస్టు చివరి వారంలో ఒప్పుకున్నా కెనడా అంగీకరించటం లేదు. సవరణలు కుదరవంటోంది. కెనడా యిష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ముందుకు వెళతానని అన్నాడు. కెనడాను ఒప్పించకపోతే  మంచిది కాదని అమెరికన్‌ కార్మిక సంఘాలు, టెక్‌ రంగం కూడా అంటున్నాయి.అమెరికా నుండి దిగుమతి అయ్యే పాల ఉత్పత్తులపై కెనడా భారీ సుంకాలు విధిస్తోంది. దాని వలన అమెరికన్‌ రైతులకు నష్టం అంటాడు ట్రంప్‌. మా రైతులను కాపాడుకోవడం నా ప్రథమ కర్తవ్యం అంటాడు కెనడా ప్రధాని జస్టిన్‌. అలా అయితే మీ కార్ల మీద సుంకాలు పెంచుతాం అంటాడు ట్రంప్‌. వాళ్లిద్దరి మధ్య యుద్ధం సాగుతోంది. నాఫ్టా కాగితాలను చింపి పారవేసి, మెక్సికోతో విడిగా ఒప్పందం చేసుకుంటా అంటున్నాడు ట్రంప్‌.

ఎలాగోలా సుంకాలు లేని ఐటమ్స్‌ని తగ్గించేసి, మెక్సికో నుంచి దిగుమతి అయ్యే వాటిపై సుంకాలు విధించి, దిగుమతులు తగ్గించాలని అతని తాపత్రయం. ఆటోమొబైల్స్‌పై 25% దాకా సుంకం విధించాలని చూస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అమెరికాలోని నిరుద్యోగులకు సంతృప్తి కలిగించేందుకు ట్రంప్‌ యీ సవరణలు చేయవచ్చు సరే, దీనికి మెక్సికో ఎందుకు ఒప్పుకుంటోంది అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మెక్సికో రాజకీయ నేపథ్యం, రెండు నెలల కిందట అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరిగి డిసెంబరు 1 నుంచి అధికారంలోకి రాబోతున్న వామపక్ష నాయకుడు ఆమ్లో గురించి, నాఫ్టా పట్ల, అమెరికా విధానాల పట్ల అతని దృక్పథం గురించి చెప్పాలి. ఆ ప్రాంతమంతా రైట్‌ వింగ్‌ రాజకీయ నాయకులు గెలుస్తూ ఉంటే యీ మెక్సికో మాత్రం ట్రంప్‌ను విమర్శించే లెఫ్టిస్టును ఎందుకు ఎన్నుకుంది?

1821లో మెక్సికో స్వాతంత్య్రం సంపాదించుకుంది. తదాది అనేకమంది పాలించారు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం నుంచి లెక్క వేసుకుంటే 1946లో ఎన్నికైన మిగ్యెల్‌ అలెమాన్‌ తొలి సైనికేతర అధ్యక్షుడు. అతనిది ఇన్‌స్టిట్యూషనల్‌ రివల్యూషనరీ పార్టీ (పిఆర్‌ఐ) అనే లెఫ్టిస్టు పార్టీ. అప్పణ్నుంచి 1994 వరకు అదే పాలిస్తూ వచ్చింది. 2000 సం.లో ఒకటి రైట్‌ వింగ్‌కు చెందిన నేషనల్‌ ఏక్షన్‌ పార్టీ (పిఎఎన్‌) అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పాలించింది. 2012లో మళ్లీ పిఆర్‌ఐ అధికారంలోకి వచ్చింది. చాలాకాలంగా అధికారంలో ఉండడంతో పిఆర్‌ఐ పార్టీ తన జాతీయవిధానాలకు, ప్రగతివాదానికి తిలోదకాలు యివ్వడం ప్రారంభించింది. ముఖ్యంగా 1960ల నుండి! అవినీతి, బంధుప్రీతి పార్టీల్లో పెచ్చుమీరింది. ప్రజాదరణ తగ్గసాగింది.

1968లో మెక్సికోలో ఒలింపిక్స్‌ తలపెట్టినపుడు దాన్ని ప్రతిఘటిస్తూ పది రోజుల ముందు వేలాది వామపంథా విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేస్తే పిఆర్‌ఐ ప్రభుత్వమే పోలీసుల చేత కాల్పులు కాల్పించింది. వాటిలో వందలాది మంది విద్యార్థులు మరణించారు. ఇటువంటి విధానాల కారణంగా 1989లో దానిలోంచి విడిపోయి డెమోక్రాటిక్‌ రివల్యూషనరీ పార్టీ (పిఆర్‌డి) అనే పార్టీ ఏర్పడింది. 1976లో తన 23వ యేట రాజకీయాల్లోకి వచ్చిన ఆమ్లో (పూర్తి పేరు ఆండ్రే మాన్యుయెల్‌ లోపెజ్‌ ఒబ్రడార్‌) ఆ పార్టీ తరఫున 2000 సం.లో మెక్సికో సిటీకి మేయరు అయ్యి చాలా పేరు తెచ్చుకున్నాడు. నేరస్తులపై విరుచుకు పడి, శాంతిభద్రతలు నెలకొల్పి దాన్ని నివాసయోగ్యంగా చేశాడు. అనేక విద్యాసంస్థలను ప్రారంభించాడు. ఐదేళ్ల పాలన తర్వాత అతను పదవి విరమించేనాటికి 83% మంది అతన్ని గొప్ప మేయరుగా ఆమోదించారు. ఇతని మాట ఎలా ఉన్నా 2000 సం. వరకు పిఆర్‌ఐ వారే అధ్యక్షులవుతూ వచ్చారు.

2000 సం.లో అధికారంలోకి వచ్చిన రైటిస్టు పార్టీ పిఎఎన్‌ హయాంలో అది గ్లోబలైజేషన్‌, ఆర్థిక సంస్కరణల పేరుతో నియోలిబరల్‌ ఆర్థిక విధానాలను అమలు చేసింది. దానివలన దేశంలోని పెద్ద వ్యాపారస్తులు బాగుపడ్డారు. కార్లోస్‌ స్లిమ్‌ వంటి మెక్సికన్లు ప్రపంచంలోనే అతి పెద్ద ఎంటర్‌ప్రెనార్స్‌గా అవతరించారు. ప్రభుత్వం, కార్పోరేట్లు అతి సన్నిహితంగా మెలగి, సామాన్యుడి నడ్డి విరిచారు. మెక్సికోలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో అత్యధిక వాటా అమెరికాదే. అమెరికన్‌ కార్పోరేట్లు మెక్సికోను దోపిడీ చేయసాగాయి. దీన్ని ప్రతిఘటిస్తూ ఆమ్లో 2006లో పిఆర్‌డి అభ్యర్థిగా అధ్య్ష పదవికోసం పోటీ చేశాడు. పిఎఎన్‌ అభ్యర్థి ఫెలిపి కాల్డెరాన్‌ కంటె 0.6%  తక్కువ ఓట్లతో ఓడిపోయాడని ఎన్నికల కమిషన్‌ ప్రకటించినప్పుడు ఆమ్లో ఆ నిర్ణయాన్ని ఆమోదించలేదు. అతని అనుచరులు ఎన్నికైన అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేసే సమయంలోనే సమాంతరంగా యితని ప్రమాణస్వీకార సభ నిర్వహించారు, యితనే అసలైన అధ్యక్షుడు అంటూ! అదో ప్రహసనంగా మిగిలిందంతే.

ఆరేళ్లు పోయాక 2012లో మళ్లీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగినపుడు యితను మళ్లీ నిలబడ్డాడు. మళ్లీ ఓడిపోయాడు - ఈ సారి తన పాత పార్టీ ఐన పిఆర్‌ఐ పార్టీకి చెందిన ఎన్‌రిక్‌ పేనా నియెటో అనే వ్యక్తి చేతిలో! తనది లెఫ్టిస్టు పార్టీ అయినా పేనా రైటిస్టు పిఏఎన్‌ విధానాలనే అవలంబించాడు. అతని పాలనలో వ్యాపారసంస్థలు వృద్ధి చెంది, దేశం వ్యాపారంపై గుత్తాధిపత్యం సంపాదించుకున్నాయి. మెక్సికో జనాభాలో 40% మంది దారిద్య్రరేఖకు దిగువనే ఉండిపోయారు. ఆమ్లో 2012 ఎన్నికలలో అక్రమాలు జరిగాయని ఆరోపించాడు. కొన్ని ఆధారాలు చూపించాడు. అయినా అతని పార్టీ అతనికి సమర్థనగా నిలబడలేదు. 'మన పార్టీ నాయకత్వం కూడా పిఆర్‌ఐ పార్టీలాగానే తయారైంది' అని ఆరోపిస్తూ అతను పార్టీ నుంచి 2012లో తప్పుకుని లేబర్‌ పార్టీ, సోషల్‌ ఎన్‌కౌంటర్‌ పార్టీ అనే వామపక్ష పార్టీలతో చేతులు కలిపి వామపంథా విశాల వేదిక ఏర్పాటు చేస్తానన్నాడు. 2014లో చేశాడు కూడా. మోరేనా (నేషనల్‌ రిజెనరేషన్‌ మూవ్‌మెంట్‌) పేర సరికొత్త పార్టీ పెట్టి 2018 ఎన్నికలలో పాల్గొన్నాడు.

పేనా అధికారంలోకి వచ్చినపుడు చాలా ఆశలు రేకెత్తించాడు. కానీ ఆరేళ్ల పాలనలో సర్వనాశనం చేసి చెడ్డపేరు తెచ్చుకున్నాడు. అభిప్రాయ సేకరణ సర్వేలలో 80% మంది అతన్ని తిరస్కరించారు. దీనికి కారణాలు ఉన్నాయి. 1938లో పిఆర్‌ఐ ప్రభుత్వం ఉండగానే అప్పటి అధ్యక్షుడు లాజరస్‌ కార్డియాన్స్‌ ఆయిల్‌ సెక్టార్‌ను జాతీయం చేసి, ప్రభుత్వరంగంలో పెట్రోలియస్‌ మెక్సికానో (పెమెక్స్‌) అనే సంస్థ నెలకొల్పాడు. తైలం వెలికి తీయడానికి, శుద్ధిచేసి ఎగుమతి చేయడానికి దానికి ఒక్కదానికే హక్కులు యిచ్చాడు. ఇది అమెరికన్‌ కంపెనీలను నష్టపరచింది, అమెరికన్‌ ప్రభుత్వాన్ని బాధించింది. కానీ మెక్సికోకు మేలు కలిగించింది.

ప్రపంచంలో అత్యధికంగా పెట్రోలు ఉత్పత్తి చేసే దేశాల్లో మెక్సికో ఒకటి. దాని మీద వచ్చే ఆదాయం జాతీయ ఆర్థికవ్యవస్థకు 10% వరకు సహకరిస్తుంది. తన హయాంలో పేనా ఆయిల్‌, ఇంధన రంగాల్లో విదేశీ సంస్థలను అనుమతించి, పెమెక్స్‌ ఆధిపత్యానికి అడ్డుకొట్టాడు. అమెరికన్‌ కంపెనీలు మెక్సికో నుండి ముడి పెట్రోలు తీసుకుని వెళ్లి శుద్ధిపరచి, మళ్లీ మెక్సికోకే అమ్ముతున్నాయి. మెక్సికోలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో అత్యధిక వాటా అమెరికాదే. అమెరికన్‌ కార్పోరేట్‌ కంపెనీలు మెక్సికోలోని పెట్రోలు, ఇంధన రంగాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జిస్తున్నాయి.

ఇది గమనించిన ఆమ్లో తన ఎన్నికల ప్రచారంలో గత ప్రభుత్వాలు ముఖ్యమైన రంగాలను ప్రైవేటు పరం చేయడంతోనే దేశ ఆర్థికవ్యవస్థ అమెరికాపై ఆధారపడ వలసి వస్తోందని, ఆ విధానాన్ని తిరగతోడి దేశాన్ని తన కాళ్లపై తను నిలబెడతానని అన్నాడు. ఇకపై పెట్రోలు బావులను వేలం వేసేటప్పుడు విదేశీ సంస్థలను అనుమతించనని, గతంలో విదేశీ సంస్థలతో జరిగిన ఒప్పందాలన్నిటినీ సమీక్షిస్తాననీ అంటున్నాడు. పెమెక్స్‌ను ప్రయివేటు రంగానికి అప్పగించాలని పేనా తీసుకున్న నిర్ణయంపై రిఫరెండం (ప్రజాభిప్రాయ సేకరణ) చేస్తానంటున్నాడు. పేనా విధానం వలన మెక్సికో పెట్రోలు దిగుమతులకై అమెరికాపై ఆధారపడవలసి వచ్చిందని, మాటిమాటికి పెట్రోలు, విద్యుత్‌ ధరలు పెరగడానికి యిదే కారణమని అన్నాడు.

పేనా హయాంలోనే మత్తుమందుల వ్యాపారం చేసే మాఫియాకు, రాజకీయ నాయకులకు చెందిన గూండాల కారణంగా అనేకమంది మరణించారు. డెత్‌ రేట్‌ విపరీతంగా పెరిగింది. లక్షల కోట్ల వ్యాపారం చేసే డ్రగ్‌ మాఫియాను అంతం చేస్తానని ఆమ్లో చెప్తున్నాడు. యువతను విద్యను సులభంగా అందుబాటులోకి తెచ్చి వాళ్లు మాఫియాలో చేరకుండా చేస్తానంటున్నాడు. ఈ మత్తుమందు లన్నిటికీ గమ్యస్థానం అమెరికాయే. ఆ రవాణాను సక్రమంగానో, అక్రమంగానో నివారించడానికి అమెరికా డ్రగ్స్‌ నిరోధక శాఖ మెక్సికో పోలీసుల సాయం కోరేది. మెక్సికన్‌ ప్రభుత్వాలు తమ పోలీసులను అలా వాడుకోవడానికి అనుమతించేవి. దీని వలన మెక్సికోలో రక్తపాతం ఎక్కువయ్యిందే తప్ప డ్రగ్‌ రవాణా మాత్రం ఆగలేదు. ఎందుకంటే డ్రగ్స్‌ మెక్సికో నుంచి అమెరికాకు వెళుతూంటే, తుపాకీలు అమెరికా నుంచి మెక్సికోకు వచ్చి పడేవి. మెక్సికోలో హింస పెరిగింది.

డ్రగ్‌ మాఫియాను అడ్డుకోవడానికి 2006 నుంచి మెక్సికన్‌ ప్రభుత్వం సైన్యాన్ని వినియోగిస్తోంది. దాని వలన 2 లక్షల మంది చనిపోయారు, 30 వేల మంది అదృశ్యమయ్యారు. 2017లో 29 వేల మంది చచ్చిపోయారు. అంటే సగటున రోజుకి 80 మంది అన్నమాట. ఇంత చేసినా డ్రగ్‌ మాఫియా బలపడుతోందే తప్ప తగ్గటం లేదు. సామాన్యుడి బతుకు దుర్భరమైంది. భద్రతాదళాల చేతిలో, డ్రగ్‌ మాఫియా చేతిలో వాళ్లు మాయమై పోసాగారు.

గత 50 ఏళ్లగా మెక్సికోను పట్టి పీడిస్తున్న మాఫియా అధికారాన్ని వదులుస్తానని ఆమ్లో ఎన్నికల వాగ్దానం చేశాడు. ఎవరు అధికారంలో ఉన్నా మాఫియా వారిని లొంగదీసుకోవడంతో యిప్పటిదాకా పాలిస్తున్న పార్టీలన్నీ ఒకే మాదిరి తయారయ్యాయని అంటాడతను. ఫలితాల నివ్వని యీ పద్ధతిని ఆమ్లో సమీక్షిస్తానన్నాడు. డ్రగ్‌ ఆపరేషన్స్‌ నుంచి సైన్యాన్ని తప్పించి, నార్కో వాడకం కారణంగా జైల్లో ఉన్నవారి శిక్షాకాలాన్ని తగ్గిస్తానన్నాడు. ఫలానా పరిమాణంలో డ్రగ్‌ కొన్నా, వాడినా శిక్ష అనే రూలులో పరిమాణాన్ని పెంచుతానంటున్నాడు. ఆ విధంగా యువతను బయటకు తీసుకుని వచ్చి వారికి ఉచిత విద్య యిచ్చి, పని కల్పించి, మత్తుమందు అలవాటు నుంచి బయటపడేస్తా నంటున్నాడు.

ఆమ్లో  రష్యా మద్దతుతో రంగంలోకి దిగాడని, నెగ్గితే వెనెజులా అధినేత హ్యూగో చావెజ్‌లా తయారయి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాడని ప్రభుత్వం, మీడియా హోరెత్తించింది. అయినా 2012లో 32% ఓట్లు తెచ్చుకున్న అతను యీసారి 53% ఓట్లు తెచ్చుకున్నాడు. అతని మాతృసంస్థ పిఆర్‌ఐ తరఫున నిలబడిన జోస్‌ ఏంటోనియో మియాడ్‌ అనే అభ్యర్థికి 21% ఓట్లు వచ్చాయి. 1929 నుంచి ఆ పార్టీకి యింత తక్కువ ఓట్లు ఎప్పుడూ రాలేదు. రైటిస్టు పార్టీ పిఏఎన్‌ అభ్యర్థి రికార్డో అనయాకు 24% ఓట్లు వచ్చాయి.

ఆమ్లో లెఫ్ట్‌ కూటమికి అధ్యక్ష ఎన్నికలతో బాటు రాష్ట్ర, మునిసిపల్‌ ఎన్నికలలో కూడా విజయం సిద్ధించింది. 500 మంది సభ్యుల దిగువ సభలో యీ వామకూటమికి 300 సీట్లు దక్కాయి. 8 రాష్ట్రాలలో గవర్నరు పదవికి ఎన్నిక జరిగితే 4 రాష్ట్రాలలో వామకూటమి గెలుపొందింది. మెక్సికో మేయరు పదవి కూడా దక్కించుకుంది. అధికారంలో ఉన్న పిఏఎన్‌ పార్టీ కండబలం, ధనబలం ప్రదర్శించినా వీరి విజయాన్ని ఆపలేకపోయింది. ఎన్నికల సందర్భంగా 50 మంది అభ్యర్థులతో సహా 130 మంది నాయకుల్ని హత్య చేశారు. హింసకు భయపడి 600 మంది విత్‌డ్రా అయిపోయారు.

12.50 కోట్ల జనాభా ఉన్న మెక్సికోకు డిసెంబరు 1 నుంచి ఆమ్లో అధికారంలోకి రాబోతున్నాడు. ఎన్నికలలో ఏం మాట్లాడినా వెంటనే వ్యాపారస్తులతో పేచీ పెట్టుకునే ఉద్దేశం లేదతనికి. ఆల్ఫోన్సో రోమో అనే అగ్రోనమిస్టు-ఎంటర్‌ప్రెనార్‌ను తన ప్రధాన ఆర్థిక సలహాదారుగా వేసుకున్నాడు. అతన్ని తన ఆర్థికమంత్రి చేయబోతాడట. వ్యాపారస్తులతో సత్సంబంధాలున్న కొందరిని మంత్రులుగా వేసుకుంటాడట. 13 బిలియన్‌ డాలర్ల న్యూ మెక్సికో ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు రద్దు చేయవచ్చనే భయం ఉంది. ప్రభుత్వోద్యోగుల జీతాలు తగ్గించి, రాజధాని నుంచి ప్రభుత్వాఫీసులను యితర నగరాలకు మార్చేసి, అవినీతిని రూపుమాపి ఖఱ్చు మిగిలిస్తానంటున్నాడు.

ఇక ట్రంప్‌ విషయానికి వస్తే తమ దేశంలోకి అక్రమంగా వలస వచ్చి పడుతున్న మెక్సికన్లపై, దాన్ని సాగనిస్తున్న మెక్సికోపై ట్రంప్‌ కారాలు, మిరియాలు అందరికీ తెలుసు. నిజానికి మెక్సికో అమెరికాకు మూడో పెద్ద వాణిజ్య భాగస్వామి. అయినా మెక్సికన్లంటే ట్రంప్‌కు చిన్నచూపు. అమెరికాకు మెక్సికోకు మధ్య గోడ కడతానని ట్రంప్‌ ప్రకటించినపుడు మానవహక్కుల హననం నేరంపై అమెరికాను ఐక్యరాజ్యసమితి ముందు బోనులో నిలబెట్టాలని ఆమ్లో వాదించాడు. ఇప్పుడు ''మా దేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సౌకర్యాలు పెంచి డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులు చేపట్టేందుకు మీరు సహకరించండి. మా వద్ద ఉపాధి అవకాశాలు పెరిగితే, మా వాళ్లు మీ దేశానికి రావడం మానేస్తారుగా'' అంటున్నాడు ఆమ్లో అమెరికాతో. మెక్సికన్లంటే చిన్నచూపు ఉన్న ట్రంప్‌కు ఆ ప్రతిపాదన రుచిస్తుందా?

రైటిస్టులు పాలించినా, లెఫ్టిస్టులు పాలించినా మెక్సికో పరిస్థితి యిప్పటివరకు దిగజారుతూ వచ్చింది. పొరుగుదేశాలకు కూడా ప్రమాదకరంగా తయారైంది. లెఫ్టిస్టుగా ప్రారంభించి సెంట్రిస్టుగా మారిన ఆమ్లో తన దేశానికి ఏమైనా చేయగలడా లేదా అన్నది కొన్నేళ్ల తర్వాతే తెలుస్తుంది. ఈ కొత్త నాయకత్వం పట్ల ట్రంప్‌ ఎలా వ్యవహరిస్తాడో, ఎన్ని అడ్డంకులు సృష్టిస్తాడో తలచుకుంటే తమాషాగా ఉంటుంది.

ఇక నాఫ్టా విషయానికి వస్తే - 1990 వరకు మెక్సికో స్వతంత్ర విధానాలనే అవలంబించింది. అమెరికా ప్రభావానికి లోను కాలేదు. అయితే 1994 లో ఏర్పడిన నార్త్‌ అమెరికన్‌ ఫ్రీ ట్రేడ్‌ ఎగ్రిమెంట్‌ (నాఫ్టా) తర్వాత అమెరికాపై ఆధారపడడం ఎక్కువైంది. విదేశీ వ్యవహారాలలో అమెరికా చెప్పినట్లే మెక్సికో నడుచుకుంటోంది. ఈ పద్ధతి మారాలని, మారాలంటే నాఫ్టా ఒప్పందంలోని కొన్ని అంశాలపై మళ్లీ చర్చలు జరగాలని ఆమ్లో వాదిస్తూ వచ్చాడు. నాఫ్టా వలన అమెరికా నుంచి చౌకగా వ్యవసాయోత్పత్తులు దిగుమతి అవుతున్నాయి. చౌక ఎందుకంటే అమెరికా ప్రభుత్వం వాటికి సబ్సిడీ యిస్తోంది. కానీ అవి చౌకగా లభించడంతో మెక్సికోలో, ముఖ్యంగా దక్షిణ మెక్సికోలో వ్యవసాయం దెబ్బ తింటోందని ఆమ్లో అభిప్రాయం. అందుకే సవరణలకు ఒప్పుకుంటున్నాడు. ట్రంప్‌ కారణాల గురించి ముందే చెప్పుకున్నాం. 'నువ్వు ఒకందుకు పోస్తే, నేను ఒకందుకు తాగా' అనే సామెత యిలాటి విషయాల్లో వర్తిస్తుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?