Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: మోదీ ప్రచారసరళి

ఎమ్బీయస్‌: మోదీ ప్రచారసరళి

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు బిజెపికి, ఎన్‌డిఏకు పట్టం కడుతున్నాయి. దాదాపు అన్నీ ఎన్‌డిటివి యిచ్చినట్లుగానే 300 దరిదాపుల్లో వస్తాయంటున్నాయి. ఇండియా టుడే, టుడేస్‌ చాణక్య అయితే ఏకంగా 350 వరకు తీసుకుపోయాయి. ఏబిపి నీల్సన్‌ 267 మాత్రమే యిచ్చింది. న్యూస్‌ ఎక్స్‌ అందరి కంటె తక్కువగా 242 యిచ్చింది. దీని కంతా కారణం కాంగ్రెసు వైఫల్యం. ఆ పార్టీ సొంతంగా 100 తెచ్చుకుంటుందని, భాగస్వాములతో కలిసి 150 తెచ్చుకుంటుందని చాలాకాలంగా అంచనాలు వేస్తూ వచ్చారు.

ఎన్నికల జోరు పెరిగిన కొద్దీ కాంగ్రెసుకు ఊపు వచ్చేసిందని, అందువలన అదే సొంతంగా 150 తెచ్చేసుకుంటుందని అనసాగారు. యుపిఏకు మరిన్ని సీట్లు వస్తాయని, అందుకే 'ఇతరుల' సాయంతో రాహుల్‌ ప్రధాని కావచ్చు అనే మాట కూడా పుట్టింది. తీరాచూస్తే కాంగ్రెసు సొంతంగా 100 సీట్లయినా గెలుస్తుందాన్న అన్న అనుమానం వ్యక్తపరుస్తున్నాయి ఎగ్జిట్‌ పోల్స్‌. ఏ ఒక్క సర్వే కూడా కాంగ్రెసుకు కాదు, యుపిఏ మొత్తానికి 150 యివ్వడానికి సిద్ధంగా లేదు. సగటున చూస్తే 125 దగ్గర ఆగిపోయింది. ఒక్క న్యూస్‌ ఎక్స్‌ మాత్రమే యపిఏకు 164 వస్తాయంది. ఇండియా టుడే బొత్తిగా 77-108 అంది.

మధ్యభారతంలో కాంగ్రెసు పాలిస్తున్న రాష్ట్రాలలో కూడా బిజెపికే అత్యధికంగా వస్తాయని సర్వేలు చెపుతున్నాయి. అంటే ముఖ్యమంత్రులుగా స్థానిక కాంగ్రెసు నాయకులు ఓకే కానీ, ప్రధానిగా రాహుల్‌ పనికి రాడని అక్కడి ప్రజలు స్పష్టంగా చెప్పారన్నమాట. ఇంత గట్టి సందేశాన్ని వినిపించుకోకుండా ఇంకా గాంధీ ఫ్యామిలీ అంటూ వేళ్లాడడం కాంగ్రెసు తలరాత. రాహుల్‌ ఫోర్సు చాలలేదా, అయితే ప్రియాంకాను దింపుదాం, ఆఖరి నిమిషంలో తెచ్చినా ఆవిడ మొహం చూసి, ఇందిరతో పోలికలు చూసి జనాలు ఓటేసేస్తారు అనుకోవడం మూర్ఖత్వం. 

ఇక యితరులు మాటకు వస్తే 150 దాకా వచ్చేస్తాయని కెసియార్‌, బాబు నమ్మబలుకుతున్నారు. కానీ ఎగ్జిట్‌ పోల్స్‌ సరాసరిన 125 లోపే యిచ్చాయి. ఎబిపి నీల్సన్‌ మాత్రమే 148 యిచ్చింది. దీనికి ముఖ్యకారణం - తూర్పు రాష్ట్రాలు, యుపి! బెంగాల్‌లో బిజెపి తృణమూల్‌తో యించుమించు సమానంగా సీట్లు తెచ్చుకుంటుందంటున్నారు. మమత మీద కోపంతో సిపిఎం క్యాడరంతా బిజెపికి వేసేసిందట. ఒడిశాలో బిజెడి కంటె బిజెపి రెండు రెట్లు ఎక్కువ సీట్లు తెచ్చుకుంటుందట.

ఇక యుపికి వస్తే ఇతరులకు అసలైన దెబ్బ యిక్కడ పడింది. మాయావతి, అఖిలేశ్‌ చేతులు కలపడంతో వాళ్లు 50 సీట్ల దాకా గెలిచి బిజెపిని ఏ 25 దగ్గరో ఆపేస్తారని చాలామంది ఆశ పెట్టుకున్నారు. గతంలో బిజెపి యుపి బలంతోనే దిల్లీ గద్దె నెక్కింది. ఈసారి కుంభస్థలం మీదే దెబ్బ పడుతుంది కాబట్టి బిజెపి బలం చాలక అల్లాడుతుందని, ఎన్‌డిఏ భాగస్వాములపై, యితరులపై ఆధారపడుతుందని వాళ్లు మోదీని తప్పిస్తేనే మద్దతిస్తామనే షరతు పెడతారని, తద్వారా దేశానికి మోదీ, షా పీడ వదలిపోతుందని తెలుగు మీడియా చాలాకాలంగా కథనాలు వండి వారుస్తోంది. మోదీ అంటే మండిపడుతున్న ఆంధ్రప్రజలు అది చదివి కేరింతలు కొడుతున్నారు.

కానీ తీరా చూస్తే యుపిలో ఎస్పీ-బియస్పీ కూటమి నిరాశ పరిచిందని ఎగ్టిట్‌ పోల్స్‌ అంటున్నాయి. యుపి ఉపయెన్నికల సమయంలో బియస్పీ పోటీ చేయలేదు, తన ఓట్లను ఎస్పీకి బదిలీ చేసింది కాబట్టి ఎస్పీ బిజెపిని ఓడించగలిగింది. ఇప్పుడు కొన్ని స్థానాల్లో ఎస్పీ సమర్థకులైన యాదవులు బియస్పీ అభ్యర్థులైన దళితులకు తమ ఓట్లు బదిలీ చేయాలి. వాళ్లకు అలా బదిలీ చేసే అలవాటు లేదు - దళిత వ్యతిరేకత వారిలో అంతలా పాతుకుపోయింది. దశాబ్దాలుగా ఎస్పీ, బియస్పీ కార్యకర్తలు కలహిస్తూనే ఉన్నారు. ఈనాడు నాయకులు రాజకీయ అనివార్యత వలన చేతులు కలపవచ్చు కానీ కార్యకర్తలు కలపాలని లేదు. ఈ ఓట్ల బదిలీ గురించి మొదటి నుంచీ సందేహాలున్నాయి. ఇప్పుడు యీ పోల్స్‌ నిర్ధారించాయి. కాంగ్రెసును కలుపుకుని పోవడం విషయంలో కూడా అఖిలేశ్‌కు అభ్యంతరం లేకపోయినా, మాయావతికి ఉంది. తను ప్రధాని కావాలంటే ప్రతీ సీటూ ముఖ్యమే ననుకుంది. కాంగ్రెసుకు ఓట్లేసేవారెవరనుకుంది.

ఇప్పుడు సర్వేలు చెపుతున్న ప్రకారం కాంగ్రెసు బిజెపి వ్యతిరేక ఓట్లను చీల్చి యీ కూటమి అవకాశాలను దెబ్బ తీసిందట. చాలా సర్వేలు యీ కూటమికి 20 నుంచి 40 మధ్యలోనే వస్తాయన్నాయి. బిజెపికి గతంలో కంటె 20, 25 తగ్గవచ్చు కానీ మరీ అంత చేటుగా నష్టపోదని అన్నాయి. వీటిని ఎవరు నమ్మినా నమ్మకపోయినా మాయావతి నమ్మినట్టున్నారు, సోనియా, రాహుల్‌తో సమావేశం రద్దు చేసుకున్నారు. ఈ ఫలితాలు చూశాక ప్రతిపక్ష నాయకుల్లో ఉత్సాహం సన్నగిల్లినట్లే కనబడుతోంది. బిజెపి మంచి అప్‌బీట్‌ మూడ్‌లో ఉంది. నా అనుమానం, మోదీ కూడా యింతటి ఫలితాలను ఊహించి ఉండరని! తన ప్రాభవం తగ్గిందని ఎన్‌డిఏకు 250కు లోపునే వస్తాయనే భావనలో యిన్నాళ్లూ ఉన్నారని నా సందేహం.

నా సందేహానికి కారణం - ఆయన ప్రచార ధోరణి. 2014 ఎన్నికల సమయంలో ఆయన మంచి ఊపు మీద ఉన్నాడు. ప్రజలంతా యుపిఏ-2 పాలనలోని అవినీతితో విసిగి వున్నారు. యువతరం నిస్పృహలో ఉన్నారు.  అందువలన యీయన కొత్త ఆశాదీపంలా కనబడడంతో అన్ని వర్గాల వారిలో ఆయన వంక ఆసక్తిగా చూశారు. దానికి తగ్గట్టు మోదీ ప్రగతి, అభివృద్ధి, ఉద్యోగకల్పన, నల్లధనాన్ని వెనక్కి రప్పించడం, యువత నైపుణ్యాన్ని పెంచడం వంటి గంభీరమైన విషయాలను అందరికీ అర్థమయ్యే భాషలో నాటకీయంగా చెప్పి ఆకట్టుకున్నారు. ప్రచారం కూడా మోదీ మాస్కులతో వినూత్నంగా సాగింది. గతంలో ఎన్నడూ బిజెపికి ఓటేయనివారు సైతం మోదీని చూసి ముగ్ధులై ఓటేశారు. స్థానిక నాయకులు ఎవరన్నది పట్టించుకోలేదు. ఆ రోజుల్లో మోదీ అనుకున్నది సాధించి చూపుతాననే ఆత్మవిశ్వాసంతో తొణికిస లాడుతున్నారు. 

2019 నాటి ప్రచారానికి మోదీ ధోరణి మారిపోయింది. స్విస్‌ బ్యాంకుల నుంచి డబ్బు వెనక్కి తేవడం, అందరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేయడం, ఉద్యోగకల్పన, పారిశ్రామిక ప్రగతి, జిడిపి, విదేశాల్లో భారత్‌ ప్రతిష్ఠ యిలాటివి మాట్లాడడం మానేశారు. తన పాజిటివ్‌ విషయాల గురించి కంటె ప్రత్యర్థుల నెగటివ్‌ విషయాలపై ఎక్కువ మాట్లాడారు. ముఖ్యంగా కాంగ్రెసు గురించి! తను చౌకీదార్‌ అని, రాహుల్‌ నామ్‌దార్‌ అనీ యాగీ చేయవలసిన అవసరం ఏముంది? 'మా వంశం గొప్పది. ఎందరో ప్రధానులున్నారు. మోదీ కుటుంబానికి రాజకీయనేపథ్యం లేదు' అని రాహుల్‌ ఎద్దేవా చేశాడా? మా నాన్న గొప్ప ప్రధాని అని చెప్పుకున్నాడా? కానీ మోదీ మాత్రం ఎప్పుడో చచ్చిపోయిన రాజీవ్‌ గురించి చాలా మాట్లాడారు. ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను విహారనౌకగా వాడుకున్నాడని వగైరా. లేదని ఆనాటి నౌకాదళాధికారులు ఖండించినా తన మాట వెనక్కి తీసుకోలేదు. ఆ విహారయాత్ర యిప్పటి ఎన్నికల అంశమా?

ఇక అందరి నోళ్లలో దశాబ్దాలుగా నాని, నాని వెగటు పుట్టించిన బోఫోర్స్‌ గురించి ప్రస్తావన ఎందుకు? దేశవాసులందరికీ బోఫోర్స్‌ భోక్తలెవరో అంచనా ఉంది. అయినా కాంగ్రెసును మూడుసార్లు గెలిపించారు. సిబిఐ ఎప్పటికప్పుడు మాట మారుస్తూ వస్తోంది. ఆధారాలు దొరకలేదన్నారు. చేవ వుంటే మధ్యలో ఆరేళ్ల పాటు నడిచిన ఎన్‌డిఏ హయాంలో వెలికి తీయవలసి ఉంది. పోనీ గత ఐదేళ్లగా మోదీ దీక్ష పూని ఆధారాలు వెలికి తీయాల్సింది. అదేమీ చేయకుండా ఎన్నికల అంశంగా వాడుకుందామని చూడడం విచిత్రం. అలాగే 1984 శిఖ్కుల ఊచకోత. 35 ఏళ్లగా దాని గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఆనాటి అకృత్యాలను క్షమించకపోయినా, శిఖ్కులు దాన్ని చరిత్రలో భాగంగా అంగీకరించి ఉంటారు. అందుకే కాబోలు 1984 తర్వాత పంజాబ్‌లో కూడా కాంగ్రెసు అధికారంలోకి వచ్చింది. మోదీకి అది నచ్చకపోయి ఉంటే తన హయాంలో ఆనాటి అల్లర్లపై ఒక కమిషన్‌ వేసి ఉండాల్సింది. 

ప్రచారంలో భాగంగా మోదీ హుందాకి తగని మాటలన్నారు. 40 మంది తృణమూల్‌ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని ఆయన అనవలసిన అవసరం ఏముంది? పార్టీ అధ్యక్షుడైన అమిత్‌ షా ద్వారా చెప్పించి ఉండవలసినది. ఫిరాయింపులు ప్రోత్సహించడం ప్రధాని విధుల్లో ఒకటి కాదు కదా! అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించారని బిహార్‌లో చెప్పడం దేనికి? అది గతం. ఆ చారిత్రక తప్పిదంలో బిజెపిది కూడా ప్రధాన భూమికే. ఇప్పుడు దాన్ని కెలికి సాధించినదేమిటి? - విభజనవాదుల గుండెలు మండించడం తప్ప! ఇది కాకుండా మబ్బులుంటే రాడార్లు కనిపెట్టలేవని సైన్యానికి సలహా యిచ్చానని చెప్పడం, ఈ మెయిల్‌, డిజిటల్‌ కెమెరా లేని రోజుల్లోనే తను వాడానని గొప్పలు చెప్పుకోవడం - అవసరమా యివన్నీ? 

మోదీ చేసిన అత్యంత ఘోరమైన పని - సైనిక విజయాలను తన ఖాతాలో వేసుకుని వాటిని పదేపదే ప్రస్తావించడం. ఇది అంతర్జాతీయ వ్యవహారాలను ప్రభావితం చేస్తుంది. సైన్యం గురించి సాధారణ పౌరులకు ఎక్కువ అవగాహన కల్పించడం ప్రమాదకరం. రాజకీయ నాయకులతో విసిగిన ప్రజలు క్రమేపీ సైనికపాలన పట్ల ఆకర్షితులవుతారు. అదను చూసి సైన్యం అధికారం చేజిక్కించుకుంటే బయట పడడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది.  ఏది ఏమైనా యీ ఎన్నికలలో మోదీ ఐదేళ్లలో తను సాధించిన నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి వాటి గురించి ఘనంగా చెప్పుకోలేదు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని చెప్పుకోలేదు. వచ్చే కాలంలో తాను ఏం చేయబోతానో వాగ్దానాలు చేయలేదు. ప్రచారం అడ్డదిడ్డంగా నడిచింది. అంతిమంగా తమకు 300-325 సీట్లు వస్తాయని ముందే తెలిస్తే మోదీ కాస్త హుందాగా ప్రవర్తించేవారేమో!

డిగ్రీ, బీటెక్ యువకుల్లో బెట్టింగ్ జాడ్యం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?