cloudfront

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: తాజా ఉపయెన్నికలు

ఎమ్బీయస్‌: తాజా ఉపయెన్నికలు

తాజా వార్తల ప్రకారం బిజెపి ఈశాన్యాన్ని హస్తగతం చేసుకుంది. త్రిపురలో కమ్యూనిస్టుల కంచుకోట బద్దలు కొట్టి వారి కంటె రెట్టింపు స్థానాలు గెలుచుకుంది. నాగాలాండ్‌, మేఘాలయలలో కూడా కాషాయధ్వజం రెపరెపలాడుతోంది. కొత్త రాష్ట్రాలు దాని చేతికి వస్తున్నాయి కానీ ఉపయెన్నికలు మాత్రం దానికి అంతగా కలిసి రావటం లేదు. రాజస్థాన్‌లో ఉపయెన్నికలు జరిగిన నెల్లాళ్లకు మధ్యప్రదేశ్‌లో రెండు అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలో ఒక అసెంబ్లీ స్థానానికి ఉపయెన్నికలు జరిగాయి. ఈ ఏడాదిలో సాధారణ ఎన్నికలు జరగబోతున్న యీ రాష్ట్రాలలో బిజెపి మూడు చోట్లా ఓడిపోయింది.

మొదటగా ఒడిశాలోని బిజెపూర్‌ గురించి - ఆ సీటును 2013లో కాంగ్రెసు అభ్యర్థి సుబల్‌ సాహు గెలుచుకున్నాడు. అతను 2017 ఆగస్టులో చనిపోవడంతో ఈ ఉపయెన్నిక అవసరం పడింది. సాహు భార్య రీటారాణి అధికార పార్టీ ఐన బిజెడి (బిజూ జనతా దళ్‌)లో చేరింది. దాంతో అక్కడి బిజెడి తరఫున పోటీ చేసి అతని చేతిలో ఓడిన అశోక్‌ పాణిగ్రాహి వెళ్లి బిజెపిలో చేరాడు. ఇద్దరూ అభ్యర్థులుగా తలపడ్డారు. బిజెడికి 1.02 లక్షల ఓట్లు రాగా బిజెపికి 42 వేలు తక్కువగా 61 వేల ఓట్లు వచ్చాయి. 10 వేల ఓట్లతో కాంగ్రెసు సోదిలోకి లేకుండా పోయింది.

ఎన్నికల ప్రచార సందర్భంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌పై చెప్పు విసిరారు. రాష్ట్ర కార్మికమంత్రి సోదరుడిపై దాడి జరిగింది. వీటి వెనక బిజెపి హస్తం ఉందని బిజెడి ఆరోపించింది. ఏది ఏమైనా బిజెడికి 2014లో 32% ఓట్లు వస్తే 2018లో 57% వచ్చి ముఖ్యమంత్రి పలుకుబడి తగ్గలేదని నిరూపించాయి. బిజెపి అనూహ్యంగా పుంజుకుందనడానికి నిదర్శనం 2014లో 18% తెచ్చుకుంటే 2018లో 34% తెచ్చుకోవడం. ఇక తగ్గిందెవరికంటె కాంగ్రెసుకే. 32% నుంచి 5%కి పడిపోయింది.

అయితే కాంగ్రెసుకు మధ్యప్రదేశ్‌లో ఓదార్పు లభించింది. ఉపయెన్నిక జరిగిన రెండు స్థానాలూ 2013లో కాంగ్రెసు గెలుచుకున్నవే. కాంగ్రెసు నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా సొంత పార్లమెంటు నియోజకవర్గం గుణ-లోనివే. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ పడుతున్న సింధియాను అణచి వేయడానికి బిజెపి చాలా కష్టపడడంతో కాంగ్రెసు గెలుస్తుందా లేదా అన్న సందేహం వచ్చింది.

ముంగావ్‌లీ నియోజకవర్గంలో మహేంద్ర సింగ్‌ కాలూఖేడా అనే ఎమ్మెల్యే చనిపోవడంతో కాంగ్రెసు బ్రజేంద్ర సింగ్‌ యాదవ్‌ అనే అతన్ని నిలబెట్టింది. గతంలో ఎమ్మెల్యేగా చేసిన దేశ్‌పారజ్‌ సింగ్‌ భార్య ఐన బైసాబ్‌ యాదవ్‌ ను బిజెపి నిలిపింది. కొలారెస్‌లో రామ్‌ సింగ్‌ యాదవ్‌ చనిపోవడంతో కాంగ్రెసు మహేంద్ర సింగ్‌ యాదవ్‌ను నిలపగా, బిజెపి దేవేంద్ర జైన్‌ను నిలబెట్టింది. 

ఇదే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు రాబోతూండడంతో ముఖ్యమంత్రి శివరాజ్‌ చౌహాన్‌ యీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని 18 మంది కాబినెట్‌ మంత్రులను ప్రచారంలోకి దింపాడు. 40 ర్యాలీలు, 15 రోడ్‌ షోలు నిర్వహించాడు. సింధియాను దెబ్బ తీయడానికి అతని మేనత్త, బిజెపి నాయకురాలు, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి ఐన వసుంధరా రాజెను కూడా తీసుకుని వచ్చి ప్రచారం చేయించాడు. ఓటర్లకు వాగ్దానాలు కురిపించాడు. సహారియా గిరిజనులు ఓటర్లలో ఎక్కువ శాతం అని గమనించి, వారికి నెలకు వెయ్యి రూపాయల సాయం చేస్తానని వాగ్దానం చేశాడు.

ముంగావ్‌లీలో వంతెన కడతామని ఎన్నికల సభలో హామీ యిస్తే ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారు, జాగ్రత్త అని ముఖ్యమంత్రిని కమిషనర్‌ హెచ్చరించవలసి వచ్చింది. ఈ హడావుడి చూసి సింధియా బెదరలేదు. గత ఏడాది చిత్రకూట్‌ ఉపయెన్నికలో కూడా కాంగ్రెసు నెగ్గింది. ఆ ధైర్యంతో యిక్కడ 75 ర్యాలీలు, 15 రోడ్‌ షోలు నిర్వహిస్తూ బిజెపిని ఎదుర్కున్నాడు. 15 ఏళ్లగా యీ పనులు ఎందుకు చేయలేదని అడిగాడు. 'ఇది నాకు చౌహాన్‌కు వ్యక్తిగతమైన పోటీ' అన్నాడు. నేనేం కుస్తీ పోటీకి రాలేదంటూ చౌహాన్‌ దాన్ని కొట్టిపారేశాడు. 

మొత్తానికి ఎన్నికలు జరిగాయి. ముంగావ్‌లీలో 77% ఓటింగు, కొలారస్‌లో 70% జరిగింది. ముంగావ్‌లీలో 2013లో 51% ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెసు యీ సారి 48% తెచ్చుకుని 71 వేల ఓట్లు తెచ్చుకుంది. 2013లో 36% ఓట్లు తెచ్చుకున్న బిజెపి యీసారి 34% తెచ్చుకుని 69 వేల ఓట్లు తెచ్చుకుంది. 2124 ఓట్ల స్వల్పమైన తేడాతో కాంగ్రెసు నెగ్గింది. ఇక కొలరాస్‌లో 2013లో 46% తెచ్చుకున్న కాంగ్రెసు యీసారి 48% తెచ్చుకుని 82 వేల ఓట్లు తెచ్చుకుంది. 2013లో 30% తెచ్చుకున్న బిజెపి యీసారి 43% తెచ్చుకుని 74 వేల ఓట్లు సంపాదించింది. 8083 ఓట్ల తేడాతో కాంగ్రెసు గెలిచింది.

కొలరాస్‌లో 2013లో బియస్పీ అభ్యర్థి 24 వేల ఓట్లు తెచ్చుకున్నా కాంగ్రెసు అభ్యర్థి 25 వేల తేడాతో బిజెపిని ఓడించాడు. ఉపయెన్నికలలో పోటీ చేసే అలవాటు లేని బియస్పీ తన అభ్యర్థిని నిలపకపోవడంతో ఆ ఓట్లు బిజెపికి పడ్డాయి. ఈ రెండూ గ్రామీణ నియోజకవర్గాలే. రైతులు అధికంగా ఉన్న ప్రాంతాలే. బిజెపికి నగరాలలో ఉన్న పట్టు గ్రామాల్లో లేదని మరొక్కమారు నిరూపితమైంది. 

ఈ సందర్భంగా 2014 నుంచి పార్లమెంటు స్థానాలకు జరిగిన ఉపయెన్నికలను పరామర్శిస్తే ఒక అవగాహన ఏర్పడవచ్చు. తెరాస మెదక్‌ (2014), వరంగల్‌ (2015) నిలుపుకుంది. బిజెడి కంధమాల్‌ (2014) నిలుపుకోగా, ఎస్‌పి మెయిన్‌పురి (2014) నిలుపుకుంది. ఐయుఎమ్‌ఎల్‌ మళప్పురం (2017), ఎన్‌పిపి తురా-మేఘాలయ (2016), కాంగ్రెస్‌ అమృత్‌సర్‌ (2017) నిలుపుకోగా తృణమూల్‌ బన్‌గావ్‌ (2015), కూచ్‌బిహార్‌, తామ్లుక్‌ (2016), ఉలుబెరియా (2018) నిలుపుకుంది. బిజెపి వడోదరా (2014), బీడ్‌ (2014), లఖింపూర్‌-అసాం (2016) షాదోల్‌-మధ్యప్రదేశ్‌ (2016) నిలుపుకుంది కానీ రత్‌లామ్‌-ఝభువా (2015), గురుదాస్‌పూర్‌ (2017) అల్‌వార్‌ (2018), అజ్మేర్‌ (2018) యిలా నాలుగు స్థానాలు కాంగ్రెసుకు పోగొట్టుకుంది.

మరే యితర పార్టీ ఉపయెన్నికలలో యీ స్థాయిలో పోగొట్టుకోలేదు. బిజెపి మిత్రపక్షమైన పిడిపి శ్రీనగర్‌ (2017)ను నేషనల్‌ కాన్ఫరెన్సుకు పోగొట్టుకుంది. బిజెపికి 282 స్థానాలుండేవి. నాలుగు కాంగ్రెసుకు పోగొట్టుకోగా, మరో నాలుగిటిలో ఎంపీలు మరణించడం చేత 274కు చేరింది. ఆ నాలుగు స్థానాల్లో యీ ఏడాది ఉపయెన్నికలు జరుగుతాయి.

బిజెపి ఆ నాలుగూ ఎందుకు పోగొట్టుకుందో పరికించి చూస్తే 2015లో జరిగిన రతలామ్‌-ఝభువా నియోజకవర్గంలో కాంగ్రెసు తరఫున దిలీప్‌ సింగ్‌ భూరియా అనే అతను 1980 నుంచి 1996 వరకు గెలుస్తూ వచ్చాడు. తర్వాత పార్టీ అతన్ని మార్చి కాంతిలాల్‌ భూరియాను 1998 నుంచి 2009 వరకు  నిలబెట్టి గెలిపించుకుంది. బిజెపికి ఏం పుట్టిందో దిలీప్‌ సింగ్‌ను తన పార్టీలోకి లాక్కుని 2014లో తన అభ్యర్థిగా నిలబెట్టింది. కాంతిలాల్‌ కాంగ్రెసు తరఫున మళ్లీ నిలబడ్డాడు. దిలీప్‌కు 50% ఓట్లు, కాంతిలాల్‌కు 40% ఓట్లు వచ్చాయి.

నెగ్గిన దిలీప్‌ చనిపోవడంతో, ఉపయెన్నికలో కాంతిలాల్‌ కాంగ్రెసు తరఫున, నిలబడి 50% ఓట్లు తెచ్చుకోగా దిలీప్‌ కూతురు బిజెపి అభ్యర్థిగా నిలబడి 42% తెచ్చుకున్నారు. 2017 నాటి గురుదాస్‌పూర్‌ ఉపయెన్నిక బిజెపి ఎంపీ వినోద్‌ ఖన్నా చనిపోవడంతో వచ్చింది. కాంగ్రెసు తరఫున సునీల్‌ జాఖడ్‌ నిలబడ్డాడు. బిజెపి అభ్యర్థికి బలం చాలలేదు. గతంలో 46% ఓట్లు తెచ్చుకోగా యీసారి 36% మాత్రమే వచ్చాయి. 2014లో 17% ఓట్లు తెచ్చుకున్న ఆప్‌ ఉపయెన్నిక నాటికి చప్పబడడంతో బిజెపి వ్యతిరేక ఓటంతా కాంగ్రెసుకు వెళ్లి సునీల్‌ సులభంగా గెలిచేశాడు. అల్వార్‌, అజ్మేర్‌ల గురించి యీ మధ్యే విపులంగా చర్చించుకున్నాం. 

ఇక రాబోయే ఉపయెన్నికలు జరగబోతున్న అరారియా లాలూ ఆర్‌జెడి సీటు. అతను జైల్లో ఉన్నాడు కాబట్టి జెడియు, బిజెపి చేతులు కలిపాయి కాబట్టి అక్కడ బిజెపి గెలిచే అవకాశం ఉంది. గోరఖ్‌పూర్‌ యోగి ఆదిత్యనాథ్‌ వదిలిపెట్టిన స్థానం. అతను ముఖ్యమంత్రి కూడా కాబట్టి అక్కడ బిజెపి గెలుపు ఖాయం. ఫూల్‌పూర్‌ ఉపముఖ్యమంత్రి కెపి మౌర్య స్థానం. ఎస్పీ, కాంగ్రెసు విడివిడిగా నిలబడుతున్నాయి.

అనంత్‌నాగ్‌లో ఎన్నికలు జరిగే పరిస్థితి లేదంటోంది, ఎన్నికల కమిషన్‌. కైరానా నియోజకవర్గం బిజెపికి పటిష్టమైన స్థానమని చెప్పలేం కానీ 2014లో 51% ఓట్లు తెచ్చుకుంది. ఇప్పుడది నిలుపుకోవడం కష్టం. మహారాష్ట్రలో భండారా-గోండియా సీటును 2014లో బిజెపి గెలుచుకుంది కానీ దాని ఎంపీ నానా పటోలే పార్టీ వదిలి, కాంగ్రెసులో చేరాడు. పాల్‌ఘర్‌లో 2014లో బిజెపి నెగ్గింది కానీ సగం నియోజకవర్గాల్లో బహుజన వికాస్‌ అఘాడీ అనే పార్టీకి బలం ఉంది. పాల్‌ఘర్‌ పట్టణంలో శివసేనకు పట్టుంది. శివసేనతో బంధాలు తెంపుకున్నాక జరగబోయే ఎన్నికలు కాబట్టి మహారాష్ట్రలో బిజెపి ఏ మేరకు నెగ్గుతుందో చూడాలి. 

సాధారణ ఎన్నికలలో జాతీయ అంశాలు, రాష్ట్రవ్యాప్తమైన అంశాలు హైలైట్‌ అవుతాయి. కానీ ఉపయెన్నికలలో స్థానిక అంశాలు హైలైట్‌ అవుతాయి. క్షేత్రస్థాయిలో ఉన్న బలాబలాల బట్టి గెలుపోటములు ఉంటాయి.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com