Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ : నందిగ్రామ్ సంగ్రామ్

ఎమ్బీయస్ : నందిగ్రామ్ సంగ్రామ్

ఇమేజిలో మమతా బెనర్జీతో పోటీ పడగల నాయకుడు బిజెపిలో లేడని అందరికీ తెలుసు. అందుకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవర్నీ నిలపకుండా దీదీ వెర్సస్ మోదీగానే ప్రచారం నడిపించింది బిజెపి. అధికారమంటూ సిద్ధిస్తే ముఖ్యమంత్రిగానో, దగ్గరిదాకా వచ్చి ఆగిపోతే ప్రతిపక్ష నాయకుడిగా వుంటూ ఫిరాయింపుదారులను కోసం గేలం వేసుకుని కూర్చునేవాడిగానో ఎవరో ఒక నాయకుణ్ని ఎంపిక చేయవలసిన తరుణం వచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, పాత ఫిరాయింపుదారు ముకుల్ రాయ్, తాజా ఫిరాయింపుదారు శుభేందు అధికారి యిలా కొన్ని పేర్లు ముందుకు వస్తాయి. నందిగ్రామ్‌లో మమత మీద గెలవగలిగితే ‘జయంట్ కిల్లర్’గా శుభేందుకే అవకాశాలు మెండుగా వుంటాయి. ఇంతకీ నందిగ్రామ్ సంగ్రామ్‌లో శుభేందు గెలవగలుగుతాడా?

2007లో మమత నందిగ్రామ్‌లో ఆందోళన మొదలుపెట్టినపుడు ఆమెకు మద్దతు ప్రకటించినది ఆడ్వాణీ, సుష్మా స్వరాజ్‌లే. క్షేత్రస్థాయిలో కలిసి పోరాడినది మావోయిస్టులు. ఎందుకంటే అప్పుడు వారందరికీ ఉమ్మడి శత్రువు - కమ్యూనిస్టులు. ఆ పోరులో ఆమెకు సేనాపతులుగా పనిచేసినది శుభేందు, అతని తండ్రే. ఇప్పుడు మమత ఒకవైపు, బిజెపిలో చేరిన శుభేందు మరోవైపు అయ్యారు. నా వలననే మమత ఉద్యమం విజయమైంది అంటుంది శుభేందు కుటుంబం. ఈ ఎన్నికలో ఆ విషయం తేలిపోతుంది. రాష్ట్ర పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తారంటూ ఎన్నికల కమిషనర్ సెంట్రల్ ఫోర్సెస్‌ను తెచ్చారు. వాళ్లు పోలీసులను పోలింగు బూతుల దగ్గరకు కూడా రానివ్వలేదు. తెచ్చిన కేంద్ర బలగాలు బిజెపి పాలిత రాష్ట్రాలైన యుపి, ఎంపిల నుంచి అని తృణమూల్ ఆరోపణ. పోలింగు బూతు ఏజంట్లు ఆ నియోజకవర్గం వారే అయి వుండాలన్న నిబంధనను బిజెపి కోరిక మేరకు ఎన్నికల కమిషనర్ ఎన్నికల మధ్యలో సవరించడం విమర్శలకు దారి తీసింది.

పరిశ్రమ వస్తే మా పంటపొలాలు పోతాయి అని అప్పుడు ఉద్యమించిన నందిగ్రామ్ రైతులు యిప్పుడు అక్కడ సాగు చేయడమే తగ్గించేశారు. ఆస్తి పంపకాలలో భూమి చిన్న చిన్న ముక్కలై పోయి, అన్ని చేలకు నీరు వచ్చే సదుపాయం లేకుండా పోయింది. దాంతో వాటిని రొయ్యల చెరువులుగా మార్చేశారు. ఆ రోజు ఉద్యమంలో ముందుండి హిందు, ముస్లిములను ఒక్కతాటిపై నడిపించిన శుభేందు ప్రస్తుతం ముస్లిములకు వ్యతిరేకంగా మాట్లాడడం స్థానికులకు వింతగా వుంది. ‘ముస్లిం ఓట్ల గురించే మమత యిక్కడకు వచ్చింది. ఆమె గెలిచిందంటే ఇక్కడి హిందువులు తమ ఆచారాలను పాటించలేరు’ అంటూ రెచ్చగొడుతున్నా డతను. నందిగ్రామ్‌లో 1.60 లక్షల మంది హిందువులు 0.80 లక్షలమంది ముస్లిములు వున్నారు. హిందువుల్లో 75శాతం మంది శుభేందుకు ఓటేస్తే అతను గెలుస్తాడు. కానీ అతనికి 60శాతం మంది మాత్రమే వేసి, ముస్లిములందరూ మమతకే గంపగుత్తగా వేస్తే మమత గెలుస్తుంది.

2016లో బిజెపికి నందిగ్రామ్‌లో 11 వేల ఓట్లు వచ్చాయి. 2019 వచ్చేసరికి 62 వేలు వచ్చాయి. లెఫ్ట్ ఓట్లు 53 వేల నుంచి 9 వేలకు పడిపోయాయి. ఆ నియోజకవర్గంలో మతకలహాలు ఎన్నడూ జరగలేదు కాబట్టి బిజెపి ఎదుగుదలకు కారణం తృణమూల్ గూండాగిరీయే అని చెప్పాలి. తృణమూల్ గూండాగిరీకి బాధ్యత వహించవలసినది స్థానిక దళపతి శుభేందుయే. అతనే యిప్పుడు బిజెపికి వచ్చేశాడు. నందిగ్రామ్‌లో రోడ్లు విశాలం కావడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరగడం గట్రా జరిగాయి. కానీ అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగింది. దానిపై అసంతృప్తితో బాటు పరిశ్రమలు రాలేదు, ఉద్యోగాలు దొరకటం లేదు అనే నిరాశ కూడా తోడయ్యింది. పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నది ప్రజలే, రాలేదని అంగలారుస్తున్నదీ ఆ ప్రజలే. బిజెపి అధికారంలోకి వచ్చినా స్థానికులు పరిశ్రమలను రానివ్వాలి. అప్పుడే అభివృద్ధి.

2019 ఓటమి తర్వాత మమత మేల్కొని అక్కడి గిరిజనులు కోసం చాలా స్కీములు పెట్టింది. జయ జోహార్ బంధు ప్రకల్పన, బాగ్డీ డెవలప్‌మెంట్ డెవలప్‌మెంట్ బోర్డ్ వంటివి ఏర్పరచి, వారి అసంతృప్తిని చాలావరకు పోగొట్టింది. గత ఏడాది లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు వెనక్కి వచ్చేయడం, కరోనా కారణంగా ఆర్థికస్థితి మందగించడం .. యిలాటి వాటివలన చేతివృత్తి పనుల వారు కూడా ఆదాయం కోల్పోయారు. బెంగాల్‌లో మమత కరోనాను సరిగ్గా కట్టడి చేయలేక పోయిందన్న విషయంలో కూడా సందేహం లేదు. ఈ మైనస్ పాయింట్లకు తోడు, 2020 మేలో వచ్చిన యాంఫన్ తుపాను కారణంగా నాశనమైన జిల్లాలలో (కలకత్తా, హుగ్లీ, ఉత్తర దక్షిణ 24 పరగణాలు, తూర్పు మేదినీపూర్) నందిగ్రామ్ ఉన్న తూర్పు మేదినీపూర్ ఒకటి.

మమతకు యీ ఎన్నికలలో బాగా నెగటివ్‌గా వున్న అంశాల్లో ఒకటి – యాంఫన్ బాధితులకు నష్టపరిహారం అందించడంలో జరిగిన అవినీతి! అసలు బాధితులకు పరిహారం అందకపోగా, మూడంతస్తుల భవంతులున్న వాళ్లకు కూడా గుడిసె మళ్లీ కట్టుకోండంటూ డబ్బులివ్వడం. నందిగ్రామ్‌లోనూ యాంఫన్ బాధితులకు కోపంతో వున్నారు. వాళ్లు ఆ సమయంలో నందిగ్రామ్‌లో తృణమూల్ వ్యవహారాలు చూసిన శుభేందుపై కోపం చూపించారా, లేక అధినేత్రి మమతపై చూపించారా అన్నది రేపు తేలిపోతుంది.

మమత అనుయాయులు శుభేందును ‘మీర్ జాఫర్’గా పిలుస్తున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ రోజుల్లో దేశంలో అతి పెద్ద రాజ్యమైన బెంగాల్‌ను సిరాజ్ ఉద్దౌలా పాలిస్తున్నాడు. ఈస్ట్ ఇండియా తరఫున రాబర్ట్ క్లయివ్ అతనిపై దండెత్తాడు. అదే 1757 నాటి ప్లాసీ యుద్ధం. ఫ్రెంచ్ వారి సాయంతో సిరాజ్ వాళ్లను ఎదుర్కున్నాడు. అయితే అతను ఎంతో నమ్మిన సేనాపతి మీర్ జాఫర్ నమ్మకద్రోహం చేసి బ్రిటిషు వాళ్లతో చేతులు కలిపి, సిరాజ్‌ను పట్టించాడు. వాళ్లు సిరాజ్‌ను ఉరి తీసి, జాఫర్‌కు పట్టం కట్టారు. ఆ తర్వాత మూడేళ్లకు జాఫర్‌ను ముప్పుతిప్పలు పెట్టి, అతని అల్లుణ్నే అతనికి ప్రత్యర్థిగా నిలిపారు. అతని గోల ఎలా వున్నా, యిప్పటికే మీర్ జాఫర్ పేరు బెంగాలీలలో విశ్వాసఘాతుకత్వానికి ప్రతీకగా మిగిలిపోయింది. మమతకు నమ్మినబంటుగా వుంటూ, ఎన్నో లాభాలు పొందిన శుభేందు యీ రోజు శత్రుశిబిరంలో చేరిపోవడం తృణమూల్ కార్యకర్తలు జీర్ణించుకోలేక అతన్ని మీర్ జాఫర్‌గా నిందిస్తున్నారు.

నిన్నటిదాకా దేవతగా కనిపించిన మమత ప్రస్తుతం శుభేందుకు ‘ఔట్‌సైడర్’ (బహిరాగత)గా అనిపించసాగింది. నందిగ్రామ్ గోడలపై ‘భూమిపుత్రుడు శుభేందునే గెలిపించండి, బయటివారిని రానివ్వకండి’ అని నినాదాలు రాయిస్తున్నాడు. నిజానికి ఈ బయటివారు స్లోగన్ మమత ఏడాదిగా బిజెపివాళ్లపై ఉపయోగిస్తోంది. నందిగ్రామ్‌లో తనపై యీ ముద్ర కొడుతున్నారని ఆమె ‘బంగ్లా నిజేర్ మేయేకే చాయ్ (బెంగాల్ సొంత కూతురే కావాలి)’ నినాదాలు యిప్పిస్తోంది. బెంగాల్ జనాభాలో 81శాతం మంది బెంగాలీలు కాబట్టి, మతం పేరుతో బిజెపి సమీకరిస్తూంటే ప్రాంతీయత పేరుతో తృణమూల్ సమీకరించడానికి చూస్తోంది. ఇది యింత పెద్ద ఎన్నికల అంశం కావడానికి కారణమేమిటో తెలుసుకోవాలంటే బెంగాల్ నేపథ్యం తెలుసుకోవాలి.

తూర్పు ప్రాంతంలో వందల సంవత్సరాలుగా కలకత్తా మహానగరంగా వెలసిల్లింది. ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలో దేశరాజధానిగా కూడా వెలిగింది. రాజస్థాన్ నుంచి మార్వాడీ వ్యాపారస్తులు కలకత్తాకు వచ్చి వ్యాపారసంస్థలు నెలకొల్పారు. పెద్ద రేవు కూడా వుండడం చేత విదేశాలకు ఎగుమతులు కూడా యిక్కణ్నుంచే జరిగేవి. అందువలన అనేక అనుబంధ వ్యాపార సంస్థలు వెలిశాయి. గుజరాతీలు, యితర వ్యాపార వర్గాలూ వచ్చాయి. పైగా కలకత్తా సాంస్కృతిక రాజధానిగా, విద్యాసంస్థలకు నెలవుగా ఎదిగింది. చదువు కోసం, ఉద్యోగావకాశాల కోసం, వ్యాపారావసరాల కోసం, ఉపాధి కోసం చుట్టూ వున్న ప్రాంతాల నుంచి బెంగాల్‌కు జనాలు వెల్లువెత్తారు. ఈశాన్య రాష్ట్రాలు, బిహార్, తూర్పు యుపి, ఒడిశా వంటి రాష్ట్రాలన్నీ కలకత్తా మీదే ఆధారపడ్డాయి. మన తెలుగువాళ్లు కూడా కలకత్తా, ఖరగపూర్ వంటి ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో వున్నారు. ఇప్పుడు బిజెపి వీరి ఓట్లపై కన్నేసింది.

ప్రధానంగా ఉత్తరప్రాంతానికి చెందిన పార్టీ కాబట్టి బిజెపి రాముడు, ఆంజనేయుణ్ని (ఉత్తరాదివాళ్లు వ్యవహరించే ధోరణిలోనే బజరంగ్ బలీ అంటున్నారు) తమ మాస్కట్‌లా పెట్టుకుని బెంగాల్‌లో చొచ్చుకుపోతోంది. మాట్లాడితే ‘జై శ్రీరామ్’ అని నినాదాలు యిస్తున్నారు. ‘అది మతపరమైన నినాదం. దాన్ని గుళ్లల్లో, దేవుడి ఊరేగింపులో వాడవచ్చు. నిరసన తెలపడానికి, కోపం చూపడానికి, నేతాజీ స్మారకసభల్లో, రాజకీయ సమావేశాల్లో వాడితే ఎలా?’ అన్న మమత వాదన అర్థం చేసుకోవచ్చు. ఓ సారి ఆమె కారు వెళుతూంటే బిజెపి నిరసనకారులు అడ్డుగా నిలిచారు. ఆమె కారు దిగి విషయం ఏమిటని అడగబోతే సమాధానం చెప్పకుండా ‘జై శ్రీరామ్’ నినాదాలు అందుకున్నారు. ఆమెకు చికాకేసి ‘వీళ్లపై కేసులు పెట్టండి’ అంది. ‘శ్రీరాముడి పేరు వింటేనే ఆవిడకు కంపరం, రామనామం జపించినందుకు కేసులు పెట్టించింది.’ అని బిజెపి వాళ్లు గోల చేయసాగారు, సమయం, సందర్భం లేకుండా తాము రాముడి పేరెత్తుతున్నామన్న మాట మర్చిపోయి. యోగి ఆదిత్యనాథ్ వచ్చి తృణమూల్ వాళ్లు రామద్రోహులని తిట్టేసి పోయాడు.

బెంగాల్‌లో వున్న యితర ప్రాంతీయులందరూ బెంగాల్ సంస్కృతికి లోబడే వుంటూ వచ్చారు యిన్నాళ్లూ. హైదరాబాద్ లోని మార్వాడీలు, గుజరాతీలు తెలుగు నేర్చుకోకుండా తరతరాలు గడిపేయగలరు కానీ కలకత్తా అంతకంటె పెద్ద నగరమైనా బెంగాలీ నేర్చుకుని తీరతారు. ఇప్పుడు వారికి ఒక ఐడెంటిటీ యివ్వడానికి సమకట్టింది బిజెపి. గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీరామనవమి ఉత్సవాలు, ఊరేగింపులు చేయనారంభించింది. ఎక్కడ పడితే అక్కడ హనుమాన్ మందిర్‌లు, వినాయకుడి గుళ్లు కొత్తగా వెలవసాగాయి. అయోధ్యలో రామమందిరానికి మోదీ భూమి పూజ చేసిన ఫోటోలను పంచుతున్నారు. రామమందిర నిర్మాణానికి అంటూ విరాళాలు వసూలు చేస్తున్నారు.

ఇదంతా సాధారణ బెంగాలీలను హడలెత్తిస్తున్నాయి. స్థూలంగా చెప్పాలంటే - తమిళుల లాగానే బెంగాలీలకు కూడా తమ సంస్కృతిపై అపారమైన గౌరవం. ఇతర రాష్ట్రాలకు వెళ్లినా తమ భాషీయులు పదిమంది చేరితే అక్కడ తమకు సంబంధించిన కల్చరల్ సెంటర్, గుడి (కాలీబాడీ) పెట్టేసి అక్కడ గుమిగూడతారు. స్థానికులను డామినేట్ చేయడానికి చూస్తారు. అలా వాళ్లు వీళ్లను తరిమివేసే స్థితి తెచ్చుకుంటారు. అసాంలో అయితే 1960లలో ‘బంగాల్ ఖేడా’ ఉద్యమమే జరిగింది. ఇప్పటికీ అసాంలో అసామీ కాళీ మందిరాలు, బెంగాలీ కాళీ మందిరాలు విడివిడిగా వున్నాయి!

నేను గమనించినంత వరకు ‘కల్చరల్ ఏరోగెన్స్’ విషయంలో బెంగాలీలు, తమిళులకు సామ్యం వుంది. తమదే ఉన్నత సంస్కృతి అని, పొరుగున వున్న వారిది తక్కువ స్థాయి సంస్కృతి అని యిద్దరూ ఫీలవుతారు. ఇది జనరలైజ్ చేసి మాట్లాడుతున్నది. వ్యక్తిగతంగా అందరికీ వుంటుందని నా భావం కాదు. బెంగాలీలు నార్త్ ఇండియన్స్ అందర్నీ కలిపి చులకనగా మాట్లాడినప్పుడు ‘మేడో’ అనేస్తారు. (మేవాడ్ నుంచి వచ్చినవాళ్లు అని ఒకాయన వ్యాఖ్యానం చెప్పాడు). మామూలుగా మాట్లాడినప్పుడు ‘హిందూస్తానీలు’ అంటారు, వాళ్లు హిందూస్తాన్‌లో భాగం కానట్లు, బెంగాల్ ఏదో ప్రత్యేక దేశమైనట్లు!

బిహారీలు ఎక్కువ మంది పనివాళ్లుగా పనిచేయడం వలన వాళ్లతో హిందీలో మాట్లాడతారు. ఆ హిందీ కూడా సరైన ఉచ్చారణతో మాట్లాడరు. ఏదో ఇంగ్లీషు వాళ్లు వచ్చీరాని హిందీలో ఇండియన్స్‌తో మాట్లాడినట్లు మాట్లాడతారు. సంస్కృత నాటకాల్లో కథానాయకుడు మాత్రమే సంస్కృతంలో మాట్లాడి, తక్కువ స్థాయి పాత్రలు ప్రాకృతంలో మాట్లాడినట్లు, బెంగాలీ సినిమాల్లో పాత్రలు పనివాడితో మాట్లాడినప్పుడు యాసతో హిందీ మాట్లాడినట్లు చూపుతారు. ఇటువంటి నేపథ్యం వున్న బెంగాలీలకు, యిప్పుడు బిజెపి తమది కాని సంస్కృతితో ముంచెత్తడం గాబరా కలిగిస్తూ వుండాలి అనే అంచనాతోనే మమతా బెనర్జీ ‘మనమూ-పరాయివాళ్లూ’ అనే పల్లవి ఎత్తుకుంది. ‘యుపి నుంచి పాన్ బహార్ నములుతూ కాషాయగుడ్డలేసుని వచ్చిపడి మన సంస్కృతిని నాశనం చేస్తున్నారు’ అని మమత అంటే ఆమె మేనల్లుడు అభిషేక్ ‘ఉత్తరప్రదేశ్ గుట్కా ఉమ్ములు ఎన్ని ఉమ్మినా మన ఉక్కు బెంగాల్ తుప్పు పట్టదు’ అన్నాడు. తృణమూల్ కార్యకర్తలు గోడల మీద ‘బంగ్లా అమార్ (మన) మాఁ, ఉత్తర ప్రదేశ్ హోబే న (కాలేదు)’ అని రాస్తున్నారు. మమత ‘బెంగాల్‌ను పాలించేది బెంగాలీలే, గుజరాతీలు కాదు’ అని సభల్లో చెప్తోంది.

మమత వేస్తున్న యీ గేలానికి బెంగాలీలు పడుతున్నారన్న భయం బిజెపివాళ్లకు కలిగిందేమో, వాళ్లూ దుర్గా, కాళీ అంటున్నారు. 2020 అక్టోబరులో తొలిసారిగా బిజెపి దుర్గా పూజ నిర్వహించింది. ఆ మండపాన్ని మోదీ చేత వర్చువల్‌గా ఆవిష్కరింప చేసింది. గరియా నుంచి కాళీఘాట్‌ను కలుపుతూ కలకత్తా శివార్లలో వున్న దక్షిణేశ్వర్ (ఇక్కడా కాళి గుడి వుంది) వరకు వేసిన మెట్రో రూటును యీ ఫిబ్రవరిలో మోదీ చేత ప్రారంభింప చేస్తూ ‘ఇది మోదీ బెంగాల్‌లోని కాళీ భక్తులకు యిచ్చిన బహుమతి’ అని చెప్పుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్‌లోని 100 గుళ్లు, ఆశ్రమాలు సందర్శించి పూజలు చేసే కార్యక్రమాన్ని రూపొందించారు. వీటిల్లో కొన్ని జనాలు మర్చిపోయినవి కూడా ఉన్నాయి. పశ్చిమ మేదినీపూర్‌లో 17వ శతాబ్దపు మహామాయ (కాళీ మరోపేరు) ఆలయం, కూచ్ బిహార్‌లోని సిద్ధేశ్వరీ ఆలయం వంటివి అమిత్ షా పర్యటనల కారణంగా వెలుగులోకి వస్తున్నాయి.

ఎన్నికలు ఎక్కడ జరిగినా బిజెపికి వాళ్లపై ప్రేమ పొర్లుతుంది. రజనీకాంత్ కూడా నటుడేనని యిప్పుడే గుర్తుకు వచ్చి దాదా ఫాల్కే ఎవార్డు యిచ్చారు. పుదుచ్చేరికి ప్రత్యేక హోదా యివ్వకపోతే కొంప మునుగుతుందని యిప్పుడే గుర్తుకు వచ్చింది. ఇక బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారి ఓట్లు కావాలి కాబట్టి  ఆ దేశపు జాతిపిత ముజిబుర్‌ రహమాన్, గాంధీ పురస్కారానికి అర్హుడని యిప్పుడే తట్టింది. బిశ్వజీత్‌కు అవార్డు యిచ్చినపుడు నేను సంశయిస్తే కొంతమంది నొచ్చుకున్నారు. తర్వాత ప్రసేనజీత్ బిజెపిలో చేరుతున్నాడని ప్రచారం రావడానికి ఏం చేశారో మరో ఆర్టికల్‌లో రాశాను. ఇప్పుడు తమ మానిఫెస్టోలో హామీలిచ్చిన స్కీములకు బెంగాలీ ప్రముఖుల పేర్లు పెడతానంటోంది.

స్కూళ్ల స్థితిగతులు బాగుపరచడానికి, ఐఐటి, ఐఐఎమ్‌ల వంటి 5 యూనివర్శిటీలు స్థాపించడానికి రూ. 20 వేల కోట్ల ప్రాజెక్టు పెడతామంటూ దానికి విద్యావేత్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ పేరు పెడతామని ప్రకటించింది. అలాగే ఆరోగ్యవ్యవస్థ బాగు చేయడానికి పెట్టే రూ.10 వేల కోట్ల ప్రాజెక్టుకు కాదంబినీ గంగూలీ పేరు పెడతానంది. తాము పెట్టబోయే స్పోర్ట్స్ యూనివర్శిటీకి శైలేన్ మన్నా పేరు, రూ. 2 వేల కోట్లతో పెట్టబోయే స్పోర్ట్స్ ఫండ్‌కు గొష్టో పాల్ పేరు పెడతానంటోంది. సత్యజిత్ రాయ్ పేర అంతర్జాతీయ ఎవార్డు పెడతామంటోంది. బెంగాలీలకు కళలపై, సాహిత్యసంస్కృతులపై మక్కువ ఎక్కువ కాబట్టి రూ. 11 వేల కోట్లతో మరో నిధి పెడతానంటోంది. మానిఫెస్టోలో అలవికాని పథకాల గురించి వాగ్దానాలు గుమ్మరించడం కామనే, కానీ యిలా పథకాల పేర్లు కూడా ముందే ప్రకటించడం ‘మేం ఉత్తరాదివాళ్లం కాదు, బెంగాలీ కల్చర్‌తో మమేక మయ్యేవాళ్లమే మహాప్రభో’ అని చాటి చెప్పుకోవడానికే!

ఇలా బిజెపి బెంగాలీ వాళ్లను మచ్చిక చేసుకుంటూ పోతూ వుంటే మమతకు భయం పట్టుకుంది. తన ‘బయటివాళ్లు’ నినాదం కారణంగా రాష్ట్రంలో వున్న కోటిన్నర మంది హిందీ భాషీయుల ఓట్లన్నీ బిజెపికే పడతాయని! లెఫ్ట్ ఫ్రంట్ పరిపాలించిన రోజుల్లో కూడా కలకత్తా తృణమూల్‌కు కంచుకోటలా వుంది. ఈసారీ గెలుస్తానని మమతకు ధైర్యం వుంది కానీ, బయటివాళ్లు-బెంగాలీలుగా విడిపోయిన యీ ఎన్నికలలో మార్వాడీలు, గుజరాతీలు, బిహారీలు, ఒడియాలు ఎక్కువగా వున్న నియోజకవర్గాల్లో దెబ్బ తింటామేమోనన్న భయం వుందామెకు. పైగా సరిహద్దు జిల్లాలలో కూడా బయటివారి జనాభా ఎక్కువే.  అందువలన అర్జంటుగా యితర భాషలకు, ముఖ్యంగా హిందీకి ప్రాధాన్యత యివ్వడం మొదలుపెట్టింది.

ఎందుకంటే హిందీ భాషీయులు ప్రభావితం చేయగల అసెంబ్లీ స్థానాలు 40 ఉన్నాయి. డార్జిలింగ్‌లో 17శాతం, జల్పాయిగురిలో 20శాతం, ఉత్తర దినాజ్‌పూర్‌లో 17శాతం, వర్ధమాన్‌లో 11శాతం, హుగ్లీలో 8శాతం, ఉత్తర 24 పరగణాలలో 8శాతం, సెంట్రల్ కలకత్తాలో 23శాతం, హౌడాలో 11శాతం హిందీ భాషీయులున్నారు. వీళ్లని మెప్పించడానికి 2020 సెప్టెంబరు 14 హిందీ దివస్ నాడు మమత హిందీ ఎకాడమీని పునరుద్ధరించింది. తృణమూల్‌ పార్టీలో హిందీ సెల్ పెట్టింది. వీళ్లతో బాటు ఆదివాసీలు, ఎస్సీలు మాట్లాడే భాష ఒల్చికి వంటి వాటి ఉద్ధరణ కోసం నడుం బిగించింది. 500 స్కూళ్లు పెట్టడానికి, టీచర్లను నియమించడానికి రూ.150 కోట్లు బజెట్‌లో కేటాయించింది. ఉత్తర బెంగాల్‌లోని యితర మైనారిటీ భాషల (నేపాలీ, హిందీ, ఉర్దూ, కాంటాపురి, రాజవంశీ, సాద్రి, కుర్మాలీ...) కోసం 400 స్కూళ్లు పెట్టడానికి, 600 మంది పార్ట్‌టైమ్ టీచర్ల నియామకానికి రూ.150 కోట్లు కేటాయించింది.

ఇలా ఓ పక్క బెంగాలీ ఐడెంటిటీ కోసం పోరాడుతూనే, రకరకాల ఎత్తుగడలతో ‘బయటివారిని’ ఆకర్షించడానికి మమత తంటాలు పడుతోంది. మరి శుభేందు మాత్రం నందిగ్రామ్‌లో ‘బయటి వ్యక్తి’ని తరిమివేయడానికే చూస్తున్నాడు. ఏ మేరకు సఫలమౌతాడో రేపు తెలుస్తుంది.

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే, 2021)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?