Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: ఎన్‌డిటివిపై దాడి

ఎమ్బీయస్‍: ఎన్‌డిటివిపై దాడి

అదానీ గ్రూపు తన సబ్సిడియరీ ఐన ఎఎంజి మీడియా నెట్‌వర్క్‌స్ (ఎఎమ్ఎన్ఎల్) ద్వారా 2022 మేలో క్విన్టిలియన్ బిజినెస్ మీడియా లి.లో 49% పెట్టుబడి పెట్టి ‘‘బిక్యూ ప్రైమ్’’ (పాత పేరు బ్లూమ్‌బర్గ్ క్విన్ట్) అనే డిజిటల్ బిజినెస్, ఫైనాన్షియల్ న్యూస్ ప్లాట్‌ఫాంపై నియంత్రణ సాధించింది. తాజాగా అది ఎన్‌డిటివిలో 29.18% వాటాలను పొందిందని, మరో 26% షేర్లను కొనడానికి షేరుకి రూ.294 రేటు యిస్తానని ఓపెన్‌గా ఆఫర్ యిచ్చిందని అందరికీ తెలుసు. ఇది ఒక వాణిజ్యపరమైన అంశం. దీన్ని దాడిగా అభివర్ణించడం పొరపాటుగా అనిపించవచ్చు కానీ సంఘటనల వరుసక్రమాన్ని చూస్తే నిజమేనేమో అని కూడా అనిపిస్తుంది. ఏదైనా కంపెనీని టేకోవర్ చేసుకోబోయే ముందు మాటా, మంతీ ఉంటుంది. అలాటిదేమీ లేకుండా 48 గంటల నోటీసు యిచ్చి టేకోవర్ చేసుకోవడానికి ప్రయత్నించారు కాబట్టి దీన్ని హోస్టయిల్ టేకోవర్ అంటారు. దీనికి కారణమేమిటి, యిది ఎలా సంభవమైంది అనేది వివరించే ప్రయత్నం చేస్తున్నాను.

ఎన్‌డిటివి అనగానే గోచరించే మొహం - గడ్డంతో ఉన్న 73 ఏళ్ల ప్రణయ్ రాయ్‌ది. అతని జీవిత భాగస్వామిగానే కాక, వ్యాపార భాగస్వామిగా కూడా ఉన్న రాధికా రాయ్ తెర వెనుక ఉండి సంస్థను నడిపిస్తూ ఉంటుంది. ఇద్దరూ బెంగాలీలే. కలకత్తా వారే. ధనిక కుటుంబాలకు చెంది, డెహ్రాడూన్‌లో స్కూలు చదువయ్యాక, పై చదువులకు లండన్ వెళ్లినవారే. ప్రణయ్ ఎకనామిస్ట్, చార్టర్డ్ ఎకౌంటెంట్, తర్వాతి రోజుల్లో సెఫాలజిస్టు కాగా రాధిక ప్రధానంగా ప్రింటు, టీవీ రంగాల జర్నలిజంలో తర్ఫీదు పొందింది. ‘‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’’, ‘‘ఇండియా టుడే’’లలో జర్నలిస్టుగా పని చేసింది. ప్రణయ్ ఉన్నతోద్యోగాలు చేస్తూనే ఎన్నికల ఫలితాలను శాస్త్రీయంగా విశ్లేషించేవాడు. నియోజకవర్గాల గత చరిత్రను రికార్డు చేసి, తాజాగా అభిప్రాయ సేకరణ చేపట్టి, ఏయే అంశాలు ఎన్నికలపై ఎలాటి ప్రభావం కలిగిస్తాయో అంచనా వేసి, గతంలో కంటె మొగ్గు (స్వింగ్) పాజిటివ్‌గా ఉందో, నెగటివ్‌గా ఉందో లెక్క వేసి, రాబోయే ఫలితాలను ఊహించి ప్రకటించేవాడు.

ముఖ్యంగా ఓట్ల శాతాన్ని సీట్ల సంఖ్యకు అనువదించే విద్యను అతను నేర్చుకున్నాడు. ప్రతిపక్షాలు ఐక్యమైతే అధికారపక్షానికి ముకుతాడు వేయవచ్చని గణాంకాలతో అతను నమ్మించగలిగాడు. ఇండియాలో తొలి సెఫాలజిస్టుగా అతన్ని పేర్కొనవచ్చు. ‘‘ఇండియా టుడే’’ పత్రిక అతనికి యీ విషయంలో చాలా సహకారాన్ని అందించింది. దేశంలోని పార్లమెంటు నియోజకవర్గాలన్నిటితో అతను కూర్చిన ఇండియా మ్యాప్‌ను ఆ పత్రిక ఒక సంచికలో అందించింది. దానిలో అప్పటిదాకా జరిగిన ఎన్నికలలో ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ నెగ్గిందో సూచించబడింది. అది చూసి అబ్బురపడి దాన్ని నేను దాచుకున్నాను. అప్పుడే ప్రణయ్ రాయ్ పేరు తెలిసింది, గౌరవం కలిగింది. 1977 నాటి ఎన్నికలలో జనతా పార్టీ గెలుస్తుందని ఆయన అప్పుడే లెక్కవేసి ‘‘మెయిన్‌స్ట్రీమ్’’ పత్రికలో ప్రకటించాడు. 1984లో కాంగ్రెసు ఘనవిజయాన్ని సాధిస్తుందని కూడా చెప్పగలిగాడు. ఇక ఒపీనియన్ పోల్స్ ఎలా నిర్వహించాలో అతన్ని చూసి చాలామంది నేర్చుకున్నారు.  

1984లో తమ 35వ ఏట ప్రణయ్, రాధిక కలిసి ఎన్‌డిటివి అని స్థాపించి, దూర్‌దర్శన్‌కై కొన్ని కార్యక్రమాలు చేసేవారు. ప్రణయ్ న్యూస్ ప్రెజంటర్‌గా కెమెరా ముందుకు వచ్చాడు. రాధిక తెర వెనక్కాలే ఉండి కథ నడిపించింది. వాళ్లు చేసిన ‘‘ద వ(ర)ల్డ్ న్యూస్‌ దిస్ వీక్’’, ‘‘ద న్యూస్ టునైట్’’ కార్యక్రమాలకు ఎన్నికల ఎనాలిసిస్ వంటి కార్యక్రమాలకు విపరీతంగా పాప్యులారిటీ వచ్చి యాడ్ రెవెన్యూ పెరిగింది. దూరదర్శన్ వాళ్లు ఎన్నికల ఎనాలిసిస్, బజెట్ ఎనాలిసిస్ వీళ్ల చేతే చేయించేవారు. 1984 నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడుతూండగానే దూర్‌దర్శన్‌లో ప్రణయ్ రాయ్, వినోద్ దువా ప్రత్యక్షమయ్యే వారు. ఆ ఫలితాలు ఎందుకలా వస్తున్నాయి, ఇంకా వెలువడని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, యీ స్వింగ్‌కు కారణమేమిటి, అని విశ్లేషకులను, నిపుణులను, నాయకులను పిలిచి చర్చ పెట్టేవారు. గ్రాఫిక్స్ ద్వారా అర్థమయ్యేట్లు వివరించేవారు. ప్రణయ్ ఇంగ్లీషులో చెపితే, వినోద్ హిందీలో అనువదించేవాడు. తన వ్యాఖ్యలు జోడించేవాడు కూడా.

వినోద్ జర్నలిస్టుగా బాగా రాణించాడు. అనేక టీవీల్లో షోలు, యూట్యూబ్ ఛానెల్ నిర్వహించాడు. రామ్‌నాథ్ గోయెంకా ఎవార్డు, పద్మశ్రీ తెచ్చుకున్నాడు. నిర్మొగమాటంగా మాట్లాడడంతో మోదీ ప్రభుత్వానికి కన్నెఱ్ఱ అయ్యాడు. 2017లో ఓ కామెడీ షోలో అతని కూతురిపై అక్షయ్ కుమార్ చేసిన సెక్సిస్ట్ కామెంట్‌కు వినోద్ అభ్యంతరం తెలిపాడు. వినోద్ కూడా తనను హెరాస్ చేశాడంటూ నిష్ఠా జైన్ అనే ఆమె ఆరోపించింది కానీ నిరూపించే ప్రయత్నం చేయలేదు. 2020లో దిల్లీ అల్లర్లను ఆపడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించలేదని వినోద్ తన యూట్యూబ్ ఛానెల్లో వ్యాఖ్యానిస్తే హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన బిజెపి ప్రతినిథి అతనిపై దేశద్రోహం కేసు పెట్టించాడు. సుప్రీం కోర్టు కేసు కొట్టేసింది. 2021లో కోవిడ్ సోకి వినోద్ తన 67వ ఏట మరణించాడు. ప్రణయ్ బతికే ఉన్నాడు కాబట్టి మోదీ ప్రభుత్వ ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా పెట్టుబడిదారు అయ్యాడు కాబట్టి చిక్కుల్లో పెట్టడం ప్రత్యర్థులకు సులభమైంది.

1998లో ఎన్‌డిటివి స్టార్ ఇండియాతో ఐదేళ్ల కాంట్రాక్టు కుదుర్చుకుని దేశంలోని తొలి 24 బై 7 న్యూస్ ఛానెల్ ప్రారంభించింది. 2003లో స్వతంత్ర ఛానెల్‌గా మారింది. నిర్భీకతకు, క్వాలిటీకి మారుపేరుగా ఎన్‌డిటివి వన్నె కెక్కింది. రాజ్‌దీప్ సర్దేశాయి, అర్ణబ్ గోస్వామి వంటి అనేకమంది టీవీ జర్నలిస్టులు అక్కడ పెరిగి వేరే చోట్లకు వెళ్లారు. శ్రీనివాసన్ జైన్, సోనియా సింగ్, విష్ణు సోమ్ వంటి వారు అక్కడే ఉన్నారు. బర్ఖా దత్ వంటి వాళ్లు అక్కడ ఎదిగి, ఆ పలుకుబడితో అక్రమాలకు పాల్పడినట్లు రాడియా టేపులు బయటపెట్టాయి. ఇప్పటికీ ఎన్‌డిటివియే ఫేవరెట్ ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్. రాయిటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ న్యూస్ రిపోర్టు, 2022లో ఎక్కువ మంది ఆన్‌లైన్ పాఠకులు ఎన్‌డిటివి డాట్‌కామ్‌ను చూస్తున్నారని, దాని సమాచారాన్ని నమ్ముతున్నారనీ తేలింది.

పాప్యులారిటీ రావడంతో ఎన్‌డిటివి పలుముఖాలుగా ఎదుగుదామని చూసింది. ఎన్‌డిటివి ఇండియా అనే హిందీ ఛానెల్, ఎన్‌డిటివి ప్రాఫిట్ అనే బిజినెస్ న్యూస్ ఛానెళ్లు ప్రారంభించింది. కానీ అప్పటికే అనేక యితర ఛానెళ్లు ఎన్‌డిటివిని అనుకరిస్తూ మార్కెట్‌ను ముంచెత్తాయి. దానితో ఎన్‌డిటివి లైఫ్‌స్టయిల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌గా ఎన్‌డిటివి గుడ్ టైమ్స్, ఎన్‌డిటివి ఇమాజిన్ వంటివి పెట్టి న్యూస్ ఛానెల్‌కు నిధుల కొరత లేకుండా చూద్దామనుకున్నారు. వీటి కోసం మోర్గాన్ స్టాన్లీ నుంచి అప్పులు తెచ్చారు. కానీ న్యూస్ ఛానెల్ నిర్వహణ ఖర్చులు అధికం కావడంతో ఆర్థిక యిబ్బందులు వచ్చాయి. బై బ్యాక్ షేర్ల ప్రతిపాదన చేసినప్పుడు 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చిపడింది. ఎన్‌డిటివి షేరు వేల్యూ పడిపోయింది.

దానిలోంచి బయటపడడానికి అప్పుడు చేపట్టిన చర్యలు యిప్పుడు ముప్పు తెచ్చిపెట్టాయి. 2008 జులైలో ఇండియా బుల్స్ నుంచి రూ.501 కోట్ల అప్పు తీసుకున్నారు. ఆ అప్పు తీర్చడానికి ఐసిఐసిఐ బ్యాంకు నుంచి 2008 నవంబరులో రూ.375 కోట్లు తీసుకున్నారు. దానికి 19% వడ్డీ కట్టాలి కాబట్టి దాన్ని తీర్చడానికి విశ్వప్రధాన్ కమ్మర్షియల్ ప్రై.లి. (విసిపిఎల్) నుంచి 2009 ఆగస్టులోను, 2010 మార్చిలోను రెండు విడతలుగా రూ.403.85 కోట్ల వడ్డీ లేని ఋణం తీసుకున్నారు. ఇదే యిప్పుడు కొంప ముంచింది. విసిపిఎల్ ముకేశ్ అంబానీ యొక్క రిలయన్స్ ఇండస్ట్రీస్‌ కంట్రోలులో ఉండేది. ఈ లోను అగ్రిమెంటు చేసుకునేటప్పుడు కంపెనీ ఓనర్‌షిప్‌లో ప్రమోటర్లు కొన్ని మార్పులు చేశారు. ప్రణయ్ రాయ్ 15.94% షేర్లు, రాధికా రాయ్ 16.32% షేర్లు వ్యక్తిగతంగా ఉంచుకుని ‘రాధికారాయ్, ప్రణయ్‌రాయ్ (ఆర్‌ఆర్‌పిఆర్) హోల్డింగ్స్ ప్రై.లి పేర ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి 29.18% షేర్లు బదిలీ చేసి, దాని ద్వారా విసిపిఎల్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఇక మిగతా 38.55% షేర్లు పబ్లిక్ చేతిలో ఉన్నాయి. వాటిలోంచే 26% తీసుకుందామని అదానీ ఆఫర్ యిస్తున్నాడు.

తీసుకున్న అప్పుకు బదులుగా ఆర్ఆర్‌పిఆర్ విసిపిఎల్ పేర కన్వర్టబుల్ వారంట్లను జారీ చేసింది. ఋణం తీర్చలేని పక్షంలో ఆ వారంట్లను కన్వర్టు చేసుకుని విసిపిఎల్ ఆర్ఆర్‌పిఆర్ కున్న షేర్లలో 99.9% పొందవచ్చని ఒప్పందం. ఇప్పుడు అదానీ ఏం చేశాడంటే ఆ విసిపిఎల్‌ను స్వాధీనం చేసుకుని, దాని ద్వారా ఆర్ఆర్‌పిఆర్ చేతిలో ఉన్న 29.18% షేర్లను చేజిక్కించుకున్నాడు. ఇది ఎందుకు, ఎలా జరిగిందంటే ఎన్‌డిటివి అప్పయితే తీసుకుంది కానీ ఆదాయమార్గాలు పెంచుకోలేక పోయింది. యాడ్స్ ద్వారానే ఆదాయం రావాలి. ఇంగ్లీషు టీవీ న్యూస్ ఛానెళ్లు కుక్కగొడుగుల్లా పుట్టుకుని వచ్చాయి. పైగా ప్రాంతీయ భాషల్లో కూడా లెక్కకు మిక్కిలిగా అవతరించాయి. వీటి మధ్య నిలదొక్కుకోవడం ఎవరికైనా కష్టమే. యాడ్స్ రావాలంటే టిఆర్‌పి రేటింగులు చూపించాలి. ఆ రేటింగుల్లో ఎంత గోల్‌మాల్ జరుగుతుందో రెండేళ్ల క్రితం అందరికీ తెలిసింది. కానీ ఆ రేటింగులను చూపించి, ప్రభుత్వం తన యాడ్స్ యివ్వకుండా టీవీ ఛానెళ్లను ఆడించసాగింది. పైగా ప్రభుత్వం కక్ష కట్టిన ఛానెల్ అనగానే కార్పోరేట్లు కూడా యాడ్స్ యివ్వడానికి జంకుతాయి.

వెయ్యి మందికి పైగా చనిపోయిన 2002లో గోధ్రా అల్లర్ల విషయంలో ఎన్‌డిటివి చాలానే కవర్ చేసింది. గోధ్రాపై గగ్గోలు పెట్టిన ఎవర్నీ మోదీ, అమిత్ వదిలిపెట్టడం లేదు. తమపై కేసులు ఎత్తివేయించుకున్న తర్వాత, తమపై విచారణ జరిపిన పోలీసు అధికారుల పని పట్టారు. తీస్తా తాట తీస్తూండడం చూస్తూనే ఉన్నాం. 2014లో మోదీ ప్రధానిగా వచ్చిన దగ్గర్నుంచి ఎన్‌డిటివి కష్టాలు పెరిగాయి. ఏవేవో కేసులు పెట్టడం జరుగుతోంది. యాడ్స్ రాకుండా చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏ మాట కా మాట చెప్పాలంటే ఎన్‌డిటివి పని గట్టుకుని మోదీ లేదా బిజెపి ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేయటం లేదు. తక్కిన ఛానెళ్లలా భజన చేయటం లేదంతే! అతిశయోక్తులు చెప్పారని, కాంగ్రెసు లేదా మరో పార్టీని వెనకేసుకుని వచ్చారని, అసత్యాలు ప్రచారం చేసి, ప్రజలను రెచ్చగొట్టారని బిజెపి వాళ్లు కూడా అనలేదు, కేసులు పెట్టలేదు.

వీళ్ల నేరమల్లా ఉన్నదున్నట్లు చెప్పడం! 2016లో ఎన్‌డిటివి హిందీ న్యూస్ ఛానెల్‌ను బహిష్కరించాలనే ప్రయత్నాలు జరిగాయి కానీ జర్నలిస్టుల నుంచి ప్రతిఘటన రావడంతో వెనక్కి తగ్గారు. బిజెపి నాయకుడి ప్రకటనలను ఎన్‌డిటివి జర్నలిస్టు ప్రశ్నించడంతో 2017 ప్రణయ్ దంపతుల యింటిపై సిబిఐ దాడులు జరిగాయి. ఎడిటర్స్ గిల్డ్ వారు దీన్ని పత్రికాస్వేచ్ఛగా పేర్కొన్నారు. ఇన్ని అవరోధాల మధ్య ఛానెల్ నడపడం కష్టమైంది. కరోనా ఆర్థిక వ్యవస్థను కుదిపివేసింది. ఛానెళ్లకు యాడ్స్ రావడం తగ్గిపోయింది. వచ్చినా కారుచౌక రేట్లకు ప్రైమ్ టైమ్ యివ్వాల్సి వస్తోంది. వార్తా సేకరణ ఖర్చుతో కూడిన పని కావడంతో అది మానేసి నలుగురు నిపుణులను స్టూడియోలోనో, జూమ్‌లోనో కూర్చోబెట్టి చర్చలు జరిపి అదే నిరంతర వార్తా స్రవంతి అనుకోమంటున్నారు.

దాంతో ప్రజలు టీవీలు చూడడం మానేశారు. మరో పక్క సోషల్ మీడియా వేడివేడి వార్తలు వండి వారుస్తోంది. పోటీ తట్టుకోవడానికి టీవీ ఛానెళ్లు స్టాఫ్‌ను తగ్గించసాగాయి. ఎలాగైనా నిలదొక్కుకోవడానికి ఎన్‌డిటివి డిజిటల్ ప్లాట్‌ఫాం ఎంచుకుంది. దాని వలన ఆదాయం వచ్చి 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.357.63 కోట్ల ఆదాయం, రూ.74.86 కోట్ల లాభం వచ్చాయి. ఎన్‌డిటివి ఒక వెలుగు వెలిగిన గత దశాబ్దంతో పోలిస్తే యీ అంకెలు స్వల్పమనే చెప్పాలి.

దీని కథ ఇలా నడుస్తూండగా విసిపిఎల్‌ను రిలయన్స్ గ్రూపు తమకు సన్నిహితుడైన మహేంద్ర నహతాకు చెందిన ఎచ్‌ఎఫ్‌సిఎల్‌కు అమ్మేసింది. ఇప్పుడు అదానీ గ్రూపు వాళ్ల దగ్గర్నుంచి కొనేసింది. ఎంతకు? కేవలం రూ.113.74 కోట్లకు! పన్నెండేళ్ల క్రితం ఎన్‌డిటివికే 404 కోట్ల రూ.లు ఋణం యివ్వగలిగిన కంపెనీ యిప్పుడు రూ.114 కోట్లకే అమ్ముడు పోవడం విచిత్రంగా లేదా? అలా కొనడమేమిటి, యిలా అదానీ ఎన్‌డిటివి వారంట్లను షేర్లగా కన్వర్ట్ చేయమని పీకల మీద కూర్చోడమేమిటి? రెండూ వెంటవెంటనే జరిగాయి.

అదానీ వేలు పెట్టని, స్వాధీనం చేసుకోని పరిశ్రమ ప్రస్తుతం దేశంలో లేదు. ఏ అనుభవం లేకపోయినా సరే, ప్రతీ రంగంలోనూ పెట్టుబడులు పెట్టేస్తున్నాడు. ఎవరి డబ్బుతో? మన డబ్బుతో! అదానీ యింత ధనవంతుడు, అంత ధనవంతుడు అని పేపర్లలో వచ్చేస్తుంది. కానీ అతని ఆస్తుల కంటె అప్పులే ఎక్కువని యీ మధ్యే క్రెడిట్‌సైట్స్ సంస్థ రిపోర్టు వచ్చింది. తర్వాత మరీ అంత అప్పులకుప్ప కాదంటూ సవరణ కూడా వచ్చింది కానీ అప్పులైతే పుష్కలంగా ఉన్నాయన్నది వాస్తవం. ఓ కార్టూన్ వచ్చింది. అదానీ ఓ బ్యాంకు దగ్గరకు వెళ్లి ‘అప్పియ్యండి, దానితో మీ బ్యాంకునే కొనేస్తాను’ అంటూంటాడు. అలాగే వుంది వ్యవహారం. పెద్ద పెద్ద గ్రూపులుగా ప్రచారం చేసుకున్న వాళ్లందరూ అప్పుల ఊబిలో యిరుక్కుని బ్యాంకులను ముంచేస్తున్నారు. బయటపడని విజయ్ మాల్యాలు ఎందరో ఉన్నారు. వాళ్లందరూ బ్యాంకుల సొత్తు, అనగా మనబోటి డిపాజిటర్ల సొమ్ముతో సోకు వెలిగించేవారే!

అదానీ పోర్టుల్లో, ఎయిర్‌పోర్టుల్లో పెట్టుబడి పెట్టాడంటే లాభాల కోసం అనుకోవచ్చు. కానీ నష్టదాయకంగా ఉన్న ఎన్‌డిటివిలో పెట్టుబడి పెట్టాడంటే ఏమనుకోవాలి? దాన్ని తన నియంత్రణలోకి తీసుకుని దాని స్వేచ్ఛను హరించాలనే ఉద్దేశం తప్ప వేరొకటి కనబడుతోందా? టీవీ మీడియాలోకి వద్దామంటే వేరే ఎన్ని ఛానెళ్లు లేవు? దేన్నయినా తీసుకుని నిధులు గుమ్మరించి, ఎన్‌డిటివిని మించిపోయేలా తీర్చిదిద్దవచ్చు. కానీ అది కాదు లక్ష్యం! మోదీని సమర్థించకుండా, బిజెపి కంట్లో నలుసుగా ఉన్న టీవీ ఛానెల్ కన్ను పొడవడమే ఆశయం. ఒకసారి తాము చెప్పినట్లు ఆడేట్లా చేస్తే ప్రభుత్వ యాడ్స్ యిప్పించి, ఆదాయం వచ్చేట్లు చేసి, దాన్ని లాభసాటిగా మార్చవచ్చు. అదానీ ఊహ తెలిశాక, అతనికి మోదీ ఉన్న సాన్నిహిత్యం తెలిశాక మహేంద్ర నహతా కిక్కురుమనకుండా అంత పెద్ద కంపెనీని 114 కోట్లకే, నష్టానికి అమ్మేశాడు. నిజానికి అతనే వారంట్లు కన్వర్ట్ చేయించుకుని ఆర్‌ఆర్‌పిఆర్‌ షేర్లు తీసుకుని ఉంటే అంతకంటె ఎక్కువ వచ్చేది. కానీ అదానీతో పేచీ ఎవడు పెట్టుకుంటాడు?

విసిపిఎల్ తన చేతికి రాగానే అదానీ వెంటనే చేసిన పని, తన చేతిలో ఉన్న కన్వెర్టిబుల్ వారంట్లను 48 గంటల్లో షేర్లగా మార్చి యిమ్మనమని ఎన్‌డిటివి యాజమాన్యాన్ని అడగడం! అలా అడగడానికి ముందు రాయ్ దంపతులను పిలిచి చర్చించలేదు. ఇటు 29% తీసుకుంటూ కు తోడుగా పబ్లిక్ నుంచి 26% కూడా తీసుకుంటాం అని ప్రకటించేశాడు. కానీ దానికి అతను ఆఫర్ చేసిన రేటు షేరుకి రూ. 294 మాత్రమే! అప్పటికి మార్కెట్‌లో ఎన్‌డిటివి రేటు రూ. 384 ఉండగా 90 రూ.లు తక్కువకు ఆఫర్ చేస్తే ఎవడైనా కొంటాడా? ఈ ప్రకటన రాగానే రేటు పెరుగుతూ పోయి, రూ.540 కు చేరి, ప్రస్తుతం 466 దగ్గర ఆగింది. కంపెనీ ప్రస్తుత మార్కెట్ కాపిటలైజేషన్ రూ.2899 కోట్లు. 29% షేర్లు చేతికి వచ్చాక ఏదో చేసి ఎన్‌డిటివి మార్కెట్ రేటును పడగొట్టి ఆ 294 యిచ్చినా చాలు అని షేర్‌హోల్డర్ల చేత అనిపిస్తారేమో చూడాలి.

కానీ అది జరుగుతుందా? అదానీ కొనబోతున్నాడట అని పుకార్లు రావడంతోనే గత ఆర్నెల్లలో షేరు విలువ 186% పెరిగింది. ఇంత హెచ్చు రేటులో కొంటే నష్టం కదా. అందుకని 26% తీసుకోవడం సాధ్యపడకపోయినా యీ 29% తోనే సతాయించి, నియంత్రణలోకి తెచ్చుకుంటారేమో మరి! ఏదైనా కంపెనీ షేర్లు బైబ్యాక్ చేయాలన్నా, అప్పులు తీసుకోవాలన్నా, ఇన్వెస్ట్ చేయాలన్నా, కొందరు డైరక్టర్లను ఎపాయింట్ చేయాలన్నా స్పెషల్ రిజల్యూషన్లు చేయాలి. దానికి 75% మంది షేర్‌హోల్డర్ల అనుమతి ఉండాలి. ఇప్పుడు యీ 29% షేర్లతో అదానీ గ్రూపు ప్రతీదానికీ సైంధవుడిలా అడ్డుపడుతూ ఉంటుంది. రోజువారీ కార్యకలాపాల్లో అది ఏమీ చేయలేకపోయినా, యిలాటి ముఖ్యమైనవాటిని చేయనివ్వదు. వీళ్లతో విసిగిపోయి పబ్లిక్ అమ్మినా అమ్మకపోయినా రాయ్ దంపతులు తమ వాటాలు అమ్ముకుని వెళ్లిపోతారేమో!

అయితే అదానీ అనుకున్నంత సులభంగా టేకోవర్ జరగటం లేదు. దానికి కారణం ఎన్‌డిటివిపై సెబి  (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) విధించిన ఆంక్షలు. అవి యిప్పుడు వరంగా మారాయి. సెబి ద్వారా ఎన్‌డిటివిని వేధించడం ఎప్పణ్నుంచో సాగుతోంది. 2020 డిసెంబరులో రాయ్ దంపతులపై రూ.27 కోట్ల జరిమానా విధించింది. మా వాదన వినకుండా అలా ఎలా చేస్తారు? అని అడిగితే అయితే ఆ మొత్తం డిపాజిట్ చేసి మరీ రండి అంది సెబీ. దానిపై శాట్ (సెక్యూరిటీస్ ఎప్పెలేట్ ట్రైబ్యునల్)కు అపీలుకి వెళితే సగమైనా కడితేనే హియరింగ్ ఉంటుందని చెప్పింది. అప్పుడు వీళ్లు సుప్రీం కోర్టుకి వెళ్లారు. న్యాయమూర్తి డిపాజిట్టు కట్టనక్కరలేదని తీర్పు యిస్తూ ట్రైబ్యునల్ చాలా దురుసుగా ప్రవర్తించిందని వ్యాఖ్యానించారు. కథ అంతటితో ఆగలేదు. సెబి యీ జూన్‌లో మరో నిర్ణయం తీసుకుంది. ఋణం తీసుకునేటప్పుడు కీలకమైన సమాచారాన్ని దాచి పెట్టారని వచ్చిన ఆరోపణల ఆధారంగా రెండేళ్ల పాటు రాయ్ దంపతులు మేనేజరియల్ పోస్టులు కానీ, డైరక్టరు పోస్టులు కానీ నిర్వహించకూడదంటూ సెబి నిషేధించింది. దీనిపై రాయ్ దంపతులు శాట్‌కు అప్పీలుకి వెళ్లారు.

సెబి ఆంక్షల ప్రకారం యీ నవంబరు నెలాఖరు వరకు రాయ్‌లు సెక్యూరిటీస్‌కు సంబంధించిన ఏ కార్యకలాపాలు చేయకూడదు. ఈ కారణం చూపించి రాయ్‌లు అదానీ డిమాండును మన్నించలేదు. ఇది కాకుండా ఒప్పందంలోని మరో క్లాజు రాయ్‌లకు అనుకూలంగా ఉంది. మొత్తం సంస్థలో విసిపిఎల్ వాటా 26% కు మించి పెరగాలంటే ప్రమోటర్లయిన రాయ్ దంపతుల అనుమతి తప్పనిసరి. వాళ్లు అనుమతించకపోతే అదానీ గ్రూపు 26% వాటాకు మించి వారంట్లు కన్వర్టు చేసుకోలేదు. అందువలన యీ సంగతులన్నీ కోర్టులోనే తేలాలి.

– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?