Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : నెరజాణల కథలు 07

ఎమ్బీయస్‌ : నెరజాణల కథలు 07

రిమిని నగరంలో చాలా ధనికుడైన భూస్వామి వుండేవాడు. అతని భార్య అత్యంత సౌందర్యవతి, శీలవతి. అయితే తనకున్న సందేహబుద్ధితో భర్త ఆమెను అనుక్షణం సతాయించేవాడు. ఆమెను చూడగానే తనకు వలపు పుడుతుంది కాబట్టి వూళ్లో మగాళ్లందరికీ అలానే పుడుతుందని, ఆమె తన కోర్కెను అంగీకరించినట్లే, వాళ్లందరి కోర్కెను అంగీకరిస్తుందని ఒక పిచ్చి వూహ పడిపోయిందతనికి. ఆమెను గడప దాటనిచ్చేవాడు కాదు. ఇంటి గుమ్మంలో నిలబడనిచ్చేవాడు కాదు. ఎవరూ యింటికి రావడానికి వీల్లేదు, వచ్చినా యీమె కిటికీ సైతం తెరవడానికి వీల్లేదు. పరపురుషుడి నీడ పడకుండా ఆమెను వెయ్యికళ్లతో కాపాడుకునేవాడు.

పోనుపోను భార్యకు యితని వ్యవహారం చిర్రెత్తుకొచ్చింది. మొదట్లో తనపై వల్లమాలిన ప్రేమ కొద్దీ యిదంతా చేస్తున్నాడని సరిపెట్టుకున్నా, కొంతకాలానికి తనను మనిషిగా చూడడం లేదని, తను పతివ్రతగా వున్నా అనుమానించి అవమానిస్తున్నాడని బాధపడసాగింది. ఎంత సముదాయించినా, ఎంత నచ్చచెప్పినా భర్త మారకపోవడంతో ఆమెలో కసి పుట్టింది. అతని సందేహాన్ని నిజం చేసి తీరాలనే పట్టుదల పుట్టింది.

పక్కిళ్లల్లో అందమైన యువకులు వుండేవుంటారని, వారితో సంపర్కం పెట్టుకోవాలని ఆమె తపించింది. కానీ యింట్లో అన్ని తలుపులను, కిటికీలను అష్టదిగ్బంధం చేశాక తొంగిచూడడం కూడా అసాధ్యం. ఆయినా ఆమె దీక్షగా యింటి తలుపులను, గోడలను అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించింది - ఎక్కడైనా చిన్న చీలికైనా, పగులైనా వుండకపోతుందాని. చివరకు ప్రయత్నం ఫలించి ఒక గది గోడలో సన్నటి పగులు కనబడింది. రిక్కించి చూస్తే పక్క వాటా వాళ్ల పడకగదిలా తోచింది. ఆ వాటాలో ముగ్గురు నలుగురు వుంటారు. వారిలో ఫిలిప్పో అనే అందమైన యువకుణ్ని గత క్రిస్‌మస్‌ పండగలో చర్చిలో చూసింది. ఇది అతని గది అయితే బాగుండును అనుకుంది.

ఆ ఆశతో ఆ పగులులో రాళ్లు, చెక్కముక్కలు దోపి పెద్దది చేస్తూ పోయింది. దానిలోంచి గమనిస్తే అది అతని పడకగదే అనీ, ఒక్కడే పడుక్కుంటాడనీ తెలిసింది. ఇక దాని ద్వారా కాగితం ముక్కలు తోసి, యీలలు వేసి కొన్ని రోజులకు అతని దృష్టిని ఆకర్షించింది. ముందులో కంగారు పడినా అతనూ పలకరించాడు. ఆ క్రిస్‌మస్‌ నాడే అతనూ యీమెను గమనించి ముచ్చటపడ్డాడు. ఇప్పుడామె స్వయంగా చొరవ తీసుకోవడంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఆమె తన దురవస్థ వివరించి చెపితే జాలిపడ్డాడు. వీలున్నప్పుడల్లా కబుర్లు చెప్పేవాడు, చెణుకులు విసిరి ఆమెను సంతోషపెట్టేవాడు.

వారి స్నేహం క్రమంగా వలపులోకి మారింది. ఒకరి పొందు కోసం మరొకరు తపించారు. కానీ ఆమె వుంటున్న పరిస్థితుల్లో అది సాధ్యపడడం కలలో కూడా వూహించలేని విషయం. అందుకే ఆమె ఒక దుస్సాహసానికి దిగింది. భర్తతో ''వచ్చేవారమే క్రిస్‌మస్‌ కదా. నేను చర్చికి వెళ్లి పాపాల ఒప్పుకోలు చేద్దామనుకుంటున్నాను. అనుమతించండి.'' అంది. అతను ఆశ్చర్యంగా ''నువ్వు చేసిన పాపాలేమున్నాయి కనుక, ఒప్పుకోవడానికి?'' అని అడిగాడు.

''మనిషన్నాక పాపాలు చేయకుండా వుంటారా? పాపిష్టి ఆలోచన రావడం కూడా తప్పే కదా? వాటన్నిటికి క్షమాపణ చెప్పకపోతే పరలోకంలో అవస్థ పడనా?'' అని అడిగింది. అసలే అనుమానస్తుడైన భర్తకు భార్య మెదడులో మసలే ఆలోచనలు కూడా తెలుసుకునే అవకాశం వదులుకోకూడదన్న ఆలోచన వచ్చింది. ''సరే వెళ్లు, కానీ నేను చెప్పిన చర్చికే, నేను చెప్పిన మతగురువు దగ్గరకే వెళ్లు. అది కూడా పొద్దున్నే జనాలంతా వచ్చేందుకు ముందే..'' అని షరతులు పెట్టాడు. ఆమె అన్నిటికి సరేనంది.

క్రిస్‌మస్‌ ముందు రోజే అతను తమ చర్చిలోని మతగురువు వద్దకు వెళ్లి బహుమతులు సమర్పించుకుని, తన భార్య ఒప్పుకోలు వినే అవకాశం తనకివ్వాలని, తనకు మతగురువు వేషం వేసి ఆమె వద్దకు పంపాలని కోరాడు. మొహమాటం కొద్దీ అతను సరేనన్నాడు. మర్నాడు భార్య వచ్చేసరికి భర్త మతగురువు దుస్తులు ధరించి పైన కుళ్లాయి పెట్టుకుని, తల కనబడకుండా చేసుకుని, గొంతు గుర్తుపట్టకుండా నోట్లో గులకరాళ్లు పెట్టుకుని ఆమె వద్దకు వెళ్లాడు. భర్తను చూడగానే ఆమె గుర్తు పట్టేసింది. అయినా ఏమారిపోయినట్లు నటించి ఒప్పుకోలుకు సిద్ధపడింది. దారుమందిరంలో ఒక కక్ష్యలో ఆమె కూర్చొనగా, మరో కక్ష్యలో అతను నిలబడి ప్రశ్నలడగసాగాడు.

ఆమె చెప్పసాగింది - ''ఒక మతగురువంటే నాకెంతో యిష్టం. అతను ప్రతిరాత్రి వచ్చి నాతో శయనిస్తున్నాడు.'' అని.

భర్త యిది వినగానే ఉలిక్కిపడ్డాడు. ''అదెలా సంభవం? నీ కుటుంబసభ్యులెవరూ అడ్డుకోరా?'' అని అడిగాడు.

''అతన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఇంట్లో ఏ ద్వారమూ అతన్ని అడ్డుకోలేదు. అతను వస్తే పడకగది తలుపైనా సరే తెరుచుకోవాల్సిందే. రాత్రి ఏ సమయంలోనైనా సరే రాగలడు. అతని ప్రేమపరవశంలో నేనతన్ని అడ్డుకోలేను. అతనిచ్చే సౌఖ్యం నాకెంతో ఆనందాన్నిస్తుంది.''

భర్తకు ఏమనాలో తోచలేదు. ఆ మతగురువెవరో కాని మాయామంత్రం తెలిసినవాడై వుంటాడు. ఏదో యింద్రజాలం చేసి తన భార్య పక్కలో చొరబడుతున్నాడు. గట్టిగా కాపలా కాసి వాడి పని పట్టాలి అనుకున్నాడు. ప్రస్తుతానికి ''ఆ పూజారిని నిరోధించడానికి నేను నీకోసం దైవప్రార్థనలు చేస్తాను. వాటి ప్రభావం వలన అతను లోపలకి రాలేడు. నా శిష్యుణ్ని అప్పుడప్పుడు నీ దగ్గరకు పంపి అతను రాగలుగుతున్నాడో లేదో తెలుసుకుంటూ వుంటాను. దాన్ని బట్టి ప్రార్థనలు పెంచాలో వద్దో అర్థం చేసుకుంటాను. ప్రస్తుతానికి నీకు క్షమాపణ యివ్వలేను. అతన్ని పూర్తిగా ఆపివేయగలిగిన తర్వాతనే ఆలోచిద్దాం.'' అన్నాడు.

ఆ రాత్రి అతను భార్యతో ''నన్ను క్రిస్‌మస్‌ విందుకు స్నేహితులెవరో పిలిచారు. తిరిగి వచ్చేసరికి ఆలస్యమవుతుంది. కంగారు పడకు.'' అని చెప్పి బయటకు వచ్చి పడకగది తలుపులు గట్టిగా బిడాయించి తాళాలు వేశాడు. దానికి దారితీసే మెట్లగది తలుపుకు కూడా తాళాలే. తను సింహద్వారం దగ్గరే కాపలా కాశాడు. ఆ పూజారి ఎవరో రాగానే అతన్ని తాళ్లతో కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కేసి మంత్రాలు చదవకుండా ఆపేయడానికి గుడ్డముక్కలు, తాళ్లు సిద్ధంగా పెట్టుకున్నాడు. తెల్లవారేవరకు అతను అక్కడే కునికిపాట్లు పడ్డాడు.

రాత్రంతా భర్త తన గస్తీ స్థానం నుంచి కదలడని ముందే వూహించిన భార్య ప్రియుణ్ని తన పడకగదికి వచ్చేయమంది. అతను తన యింటి పై కప్పెక్కి, అక్కణ్నుంచి వీళ్ల వాటా పై కప్పు గాజు కిటికీ తెరుచుకుని లోపలకి దిగాడు. ఆ పై యిద్దరూ ఆనంద డోలికలలో వూగారు. తెల్లవారుతూండగా అతను వచ్చిన దారినే వెళ్లిపోయాడు. రాత్రంతా నిద్రలేక వాచిపోయిన కళ్లతో కాళ్లీడ్చుకుంటూ భర్త కోడి కూసే వేళకి భార్య దగ్గరకు వచ్చాడు. ''విందు ముగిసిందా?'' అని ఆమె అడిగిన ప్రశ్నకు తలవూపాడు.

మర్నాడూ, ఆ మర్నాడూ యిదే భాగోతం. వారం రోజులు పోయాక భర్తకు అనుమానం వచ్చింది - ఆ మతగురువు సింహద్వారం గుండా రాకుండా వేరే మార్గంలో లేదా అదృశ్యరూపంలో వస్తున్నాడా అని. చర్చిలో ఒక చిన్న గురువును భార్య వద్దకు పంపి 'గతంలో నీ దగ్గరకు వచ్చి శయనించే మతగురువు యీ మధ్య వస్తున్నాడా?' అని అడిగించాడు. 'వారం రోజులుగా రావటం లేదు' అని చెప్పిందామె.

అది విని భర్త సంతోషించాడు. ఇలా కాపలా కాయడమే సరైన పద్ధతి అనుకున్నాడు. భార్యకు రోజుకో అబద్ధం చెపుతూ పడగ్గదిలోంచి బయటకు రావడం, తాళం వేయడం, సింహద్వారం వద్ద దుప్పటి కప్పుకుని చలికి వణుకుతూ, కునికిపాట్లు పడుతూ పహరా కాయడం! అటు భార్య కూడా ప్రియుణ్ని యింటి పై కప్పుద్వారా రప్పించుకోవడం, సుఖించడం, వెలుగురేకలు పొడసూపేలోగా తిరిగి పంపించివేయడం మరిగింది.

మూణ్నెళ్లు గడిచేసరికి భర్త నీరసించిపోయాడు. రాత్రుళ్లు నిద్రలేకపోవడంతో పగలంతా జోగుతూ వుండేవాడు, ఆరోగ్యంతో పాటు అతని వ్యాపారం కూడా దెబ్బ తినసాగింది. కోపం, ఉక్రోషం ముంచుకువచ్చాయి. చివరకు తెగించి భార్యపై విరుచుకు పడ్డాడు. ''సిగ్గుమాలినదానా! పాపిష్టిదానా! నువ్వెలాటిదానివో, పూజారితో నీ కామకలాపాలెలాటివో నాకు తెలుసు. ఆ రోజు మతగురువు వేషంలో నీ ఒప్పుకోలు విన్నది నేనే!  నిన్ను దండించక మానను.'' అని అరిచాడు.

ఆమె బెదరలేదు, ఫక్కున నవ్వింది. ''ఆ విషయం నాకు తెలుసు. అందుకే అలా చెప్పాను.'' అంది.

భర్త తెల్లబోయాడు. ''నాకేం అర్థం కావటం లేదు.'' అన్నాడు.

''నేనేం చెప్పాను? రోజూ మతగురువుతో శయనిస్తున్నాను అన్నాను. మీరు ఆ రోజు మతగురువుగానే వున్నారు కదా!''

భర్త తల గోక్కున్నాడు ''అతనికి మంత్రాలు వచ్చు, ఇంద్రజాలంతో తలుపులు తెరిచేస్తాడు అన్నావు కదా''

''నేనలా అనలేదు. అవన్నీ మీరూహించినట్లుగా వున్నారు. నేనన్నది, 'అతన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఇంట్లో ఏ ద్వారమూ అతన్ని అడ్డుకోలేదు. అతను వస్తే పడకగది తలుపైనా సరే తెరుచుకోవాల్సిందే. రాత్రి ఏ సమయంలోనైనా సరే రాగలడు.' అని. అది అబద్ధమా? మీరు యీ యింటి యజమాని. నా హృదయానికి రారాజు...''

భర్త నోటి వెంట మాట రాలేదు. ''నన్ను ఉద్దేశించి చెప్పావా? 'అతని ప్రేమపరవశంలో నేనతన్ని అడ్డుకోలేను. అతనిచ్చే సౌఖ్యం నాకెంతో ఆనందాన్నిస్తుంది.' అని అంటే వేరేవాళ్ల నుకున్నాను.''

భార్య అతన్ని తిట్టిపోసింది - ''మీరంటే నాకు ఎంతో ప్రేమ అన్న సంగతి తెలియదా? అయినా వేరేవాళ్లు ఎక్కణ్నుంచి వస్తారు? చీమ దూరే సందుకూడా లేకుండా తలుపులు, కిటికీలు బిడాయించి నన్ను యింట్లో బందీ చేసి కూర్చోపెడితే..?'' అని.

భర్త ఒక్కసారిగా తన ప్రవర్తనకు సిగ్గుపడ్డాడు. తల వంచుకుని కూర్చున్నాడు. కాస్సేపు పోయాక ''అవును, నిన్ను మనిషిలా చూడలేదు. ఇనప్పెట్టెలో దాచిపెట్టే వస్తువులా చూశాను. నీ మనసు చంపేశాను. అయినా నువ్వు నన్ను గాఢంగా ప్రేమిస్తూనే వున్నావు. నా పెడబుద్ధి వలన అది గుర్తించలేకపోయాను.'' అని పశ్చాత్తాప పడసాగాడు.

అంతలోనే తలెత్తి ''నువ్వు ఏ తప్పు చేయనప్పుడు మరి ఒప్పుకోలుకై ఎందుకడిగావు?'' అని అడిగాడు.

''నేనలా చెప్పగానే మీరే మతగురువులా తయారవుతారని ముందే వూహించాను. అందుకే అలా నర్మగర్భంగా మాట్లాడి ఉడికించాను. భార్యాభర్తల మధ్య ఆపాటి సరసం లేకపోతే అది యింకేం దాంపత్యం?'' అంది ఆ జాణ.

భర్త మనసు తేలికపడింది. ఆమె మాటలను పూర్తిగా విశ్వసించాడు. ఆమెపై ఆంక్షలన్నీ ఎత్తివేశాడు. ఎవరితో నవ్వుతూ మాట్లాడినా ఏమీ అనేవాడు కాదు. అప్పటికే ప్రియుణ్ని మరిగిన ఆమె ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంది. భర్త యింట్లో లేని సమయంలో ప్రియుణ్ని పడకగది గుమ్మంలోంచే రప్పించుకునేది. కప్పులోంచి పిల్లిలా పాకుతూ రావలసిన అగత్యం అతనికి తప్పింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?