cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : నెరజాణల కథలు 08

ఎమ్బీయస్‌ : నెరజాణల కథలు 08

బెర్లింగెరి అనే అతను కష్టపడి పైకి వచ్చినవాడు. ఇంకా పైకి రావాలంటే జమీందారీ కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుని ఫిలోమినా అనే అందగత్తెను చేసుకుంటానంటూ ఆమె సోదరులకు కబురంపాడు. తమ స్థాయికి తగినవాడు కాదని ఆమె తల్లి అభ్యంతర పెడుతున్నా, ఆమె సోదరులు యితను తెలివైనవాడని తమ తల్లికి నచ్చచెప్పి పెళ్లి చేశారు.

అయితే పెళ్లి తర్వాత బెర్లింగెరి తన భార్య తనను తక్కువగా చూస్తోందన్న పనికిమాలిన సందేహాలతో ఆమెను విసిగించి మానసికంగా దూరం చేసుకున్నాడు. ఇతని పట్ల విరక్తి చెంది ఆమె రుబెర్టో అనే యువకుణ్ని మరిగింది. ఈ సంగతి చూచాయగా విన్న భర్త ఆమెపై నిరంతరం నిఘా వేసి వుంచసాగాడు. ఆమె నిద్ర పోయేదాకా తను నిద్ర పోయేవాడు కాదు. దాంతో ఆమెకు పట్టుదల పెరిగి ఒక ఉపాయం కనిపెట్టింది.

వాళ్ల పడకగది మేడ మీద వుండేది, దాని కిటికీ వీధివైపు వుండేది.  ప్రియుడు వస్తాడని కబురు పెట్టిన రోజు రాత్రి పడుక్కునేటప్పుడు కాలు బొటనవేలుకి ఓ దారం కట్టుకుని కిటికీ ద్వారా కిందకు వదిలేసేది. అతను అనుకున్న వేళకు వచ్చి ఆ దారం లాగేవాడు. మొగుడు నిద్రపోతూ వుంటే వేలి నుంచి దారం యిప్పేసి, మెట్లు దిగి కిందకు వెళ్లి చడీచప్పుడు కాకుండా తలుపు తీసి ప్రియుణ్ని లోపలకి తీసుకుని వచ్చేది. కింద గదుల్లో ఏదో ఒక దానిలో అతనితో రమించేది. భర్త మెలకువగా వున్న పక్షంలో అతను లాగినా కదిలేది కాదు. మూడుసార్లు లాగి చూసి ప్రియుడు వెళ్లి పోయేవాడు.

ఈ ఏర్పాటు చాలా రోజులు బాగానే నడిచింది కానీ ఒక రోజు భర్త తన కాలు విదిలిస్తూంటే దుప్పటి కింద వున్న దారం కాలికి తగిలింది. ఎక్కణ్నుంచి వచ్చిందాని చూస్తే భార్య కాలి బొటనవేలుకి కట్టేసి కనబడింది. ఇందులో ఏదో తంత్రం వుందని అనుమానించి అతను ఆ దారాన్ని ఆమె వేలినుంచి విప్పేసి తన వేలుకి కట్టుకుని నిద్రపోయాడు.

అర్ధరాత్రి దాటాక ప్రియుడు వచ్చి దారం లాగాడు. భర్త గట్టిగా కట్టుకోకపోవడం వలన ఆ దారం వూడిపోయి లాగితే ప్రియుడి చేతికి వచ్చేసింది. ఓహో, తను కాస్సేపటిలో కిందకు వస్తుందన్నమాట అనుకుని ప్రియుడు అక్కడే కాచుకున్నాడు. అయితే, దారం లాగడం వలన మెలకువ వచ్చిన భర్త మహాకోపంతో మెట్లు దిగి విసురుగా సింహద్వారం తీశాడు.

ఫిలోమినా అయితే రహస్యంగా చప్పుడు కాకుండా వచ్చేది, వీరెవరో వేరే వాళ్లు అనుకుని ప్రియుడు పారిపోవడానికి సిద్ధంగా వున్నాడు. ఎప్పుడైతే భర్త విసురుగా తలుపు తీశాడో అతను పరుగు లంకించుకున్నాడు. భర్త గట్టిగా కేకలు వేస్తూ అతని వెంట పరుగు పెట్టాడు.

ఈ అలికిడికి ఫిలోమినాకు మెలకువ వచ్చింది. కాలివేలికి దారం లేకపోవడం చూసి జరిగినది గ్రహించింది. జరగబోయేది వూహించి అప్పటికప్పుడు ఒక పథకాన్ని రచించింది. తన పనిమనుషుల్లో ఒకదానికి తన వ్యవహారం సంగతి తెలుసు. దాన్ని తీసుకుని వచ్చి తన పక్కమీద  తన స్థానంలో పడుక్కోబెట్టింది. 'మా ఆయన వచ్చి తిట్టినా, కొట్టినా నోరు విప్పవద్దు, నీ మొహం చూపించవద్దు. నా మాట వింటే నీకు మంచి బట్టలు, డబ్బు యిస్తాను.' అని చెప్పింది. గదిలో దీపాలు ఆర్పివేసి తను వెళ్లి వేరే గదిలో దాక్కుంది.

అవతల బెర్లింగెరికి భార్య ప్రియుడు దొరకలేదు. చీకటి ఆసరాగా చేసుకుని ఎటో పారిపోయాడు. ఆగ్రహంతో, అక్కసుతో అతను యింటికి తిరిగి వచ్చి సరాసరి పడకగదికి వెళ్లి భార్యను చితక్కొట్టేశాడు. కింద పడేసి తొక్కేశాడు. ఇంకా కోపం పట్టలేక ఒక కత్తెర తెచ్చి జుట్టు సగానికి కత్తిరించేశాడు.

చివరకు ''నీ పని యిలాక్కాదు, వెళ్లి మీ అన్నలను తీసుకుని వచ్చి వాళ్ల చేత బుద్ధి చెప్పిస్తాను చూడు' అని యింట్లోంచి బయటకు వెళ్లాడు. అతనలా వెళ్లగానే ఫిలోమినా తన పడకగదిలోకి వెళ్లి అప్పటిదాకా తను అనుకుని భర్త చావగొట్టిన పనిమనిషిని ఓదార్చి, డబ్బు యిచ్చి యింటికి పంపివేసింది. పడకగదిలో  పక్క అంతా మామూలుగా సర్దేసి, జుట్టు చక్కగా దువ్వేసుకుని, దీపం వెలిగించి తను వెళ్లి మెట్ల మీద కూర్చుని వూలు మేజోళ్లు కుట్టుకుంటూ కూర్చుంది.

బెర్లింగెరి తన బావమరదుల యిళ్లకు, అత్తగారింటికి వెళ్లి 'ఫిలోమినా చేష్టలు చూడండి' అంటూ అందర్నీ లేపి తీసుకుని వచ్చాడు. అర్ధరాత్రి నిద్ర లేపినందుకు అందరూ తిట్టుకుంటూనే అతని మాట తీసేయలేక వచ్చారు. ఆమెను చూస్తూనే తిట్లు లంకించుకున్నారు - మా పరువు తీశావంటూ! ఆమె ఏమీ అర్థం కానట్లు మొహం పెట్టింది. 'నీ రంకుతనం భరించలేక మీ ఆయన నీ తోలు తీశాడటగా, నీ జుత్తు కత్తిరించాడటగా, అయినా బుద్ధి రాలేదా?' అన్నారు వాళ్లు.

''మా ఆయన నన్ను కొట్టడమేమిటి? నా ఒంటి మీద చిన్న గాయమైనా వుందా? నా జుట్టు చూడండి, ఎంత పొడుగ్గా వుందో, రాత్రికి రాత్రి మొలిచేసిందా? మా ఆయన యీ మధ్య బాగా తాగుతున్నాడు. మాదకద్రవ్యాలు కూడా సేవిస్తున్నాడేమో ఏవేవో భ్రమలకు లోనై చిత్తం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు మీరు నమ్మి యింత రాత్రివేళ వచ్చారా?'' అందామె ఆశ్చర్యపడుతూ.

ఆమె చెప్పినది విని బెర్లింగెరికి నోట మాట రాలేదు. పడకగదిలో తాను చేసిన బీభత్సమూ కనబడటం లేదు, యీమె ఒంటి మీద గీతైనా లేదు,  తను కలగన్నాడా? నిజంగా ఏమీ జరగలేదా? అనే సంశయం పట్టుకుంది.

ఫిలోమినా గుడ్లలో నీళ్లు కుక్కుకుంటూ ''నిజానికి ఫిర్యాదు చేయాలంటే నేను చేయాలి. అతను తాగుతాడు, వేశ్యల వెంట తిరుగుతాడు. వాళ్లతో తిరిగితిరిగి నన్నూ అలాటిదాన్నే అనుకుంటాడు. చాలా హీనంగా చూస్తూంటాడు. నేనెక్కడ మీతో వచ్చి మొత్తుకుంటానో, తను సంజాయిషీ చెప్పవలసి వస్తుందో అని, తనే నా మీద కథలల్లి చెప్పాడు. ఇప్పుడు అతని గురించి నేనేం చెప్పినా మీరు నమ్మరు కదా..'' అంటూ ఏడ్చింది.

ఈ దశలో ఫిలోమినా తల్లి గొంతెత్తింది. 'మొదట్నుంచి మొత్తుకుంటున్నాను. డబ్బుంటే ఏం లాభం, ఉత్తమజాతి లక్షణాలు లేవని. నా మాట వినలేదు, పాపం దాని గొంతు కోశారు. ఈ సంస్కారహీనుడి చేతిలో దాని బతుకు దుర్భరం అయిపోయింది.' అని.

తల్లి మాటలతో ఫిలోమినా అన్నలకు తిక్క రేగింది. బెర్లింగెరి కేసి తిరిగి ''భూదేవంత సహనం వున్న మా చెల్లెలు గురించి మరొక్క మాట ఎప్పుడైనా అన్నావో నీ ప్రాణం తీస్తాం. బజారులో మా సత్తా ఏమిటో తెలుసుకదా, మాతో పెట్టుకుంటే సర్వనాశనమే. దాన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకో. మరోసారి నీ గురించి ఫిర్యాదు చేసిందో... ఏం జరుగుతుందో మాకే తెలియదు.'' అని బెదిరించి యింటికి వెళ్లిపోయారు.

ఇక అప్పణ్నుంచి ఫిలోమినా అంటే బెర్లింగెరి భయపడసాగాడు. ఆమె వ్యవహారాన్ని చూసీచూడనట్లు వదిలేశాడు. ఎన్నిసార్లు ఆలోచించినా ఆ రాత్రి ఏం జరిగిందో అతనికి తెలియలేదు. ఆ చిక్కుప్రశ్న అతన్ని ఎన్నటికీ వెంటాడుతూనే వుంది.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2020)
mbsprasad@gmail.com

 


×