cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : నెరజాణల కథలు 09

ఎమ్బీయస్‌ : నెరజాణల కథలు 09

సియన్నా అనే వూరిలో రినాల్డో అనే ఒక అందమైన జల్సా యువకుడు వుండేవాడు. ఇంటిపక్కనే వున్న ఒక ధనికుడి భార్యమీద అతని కన్ను పడింది. ఆమెకు చేరువ కావడం ఎలా అని బాగా ఆలోచించి, చివరకు ఆమెకు పుట్టబోయే బిడ్డను దత్తత తీసుకుని, ధర్మపిత (గాడ్‌ఫాదర్‌)గా వుంటానని మాట యిచ్చాడు. అంటే ఆ పిల్లవాడు వాళ్ల యింట్లోనే పెరుగుతాడు కానీ బాప్టిజం జరిగేవేళ యితను పక్కనే వుంటాడన్నమాట.

ఆమె భర్త ఆ ప్రతిపాదనను గౌరవంగా భావించి సరేనన్నాడు. ఆ మిష పెట్టుకుని రినాల్డో వాళ్లింటికి మాటిమాటికీ వచ్చిపోతూ గర్భవతిగా వున్న ఆమె బాగోగులు చూసుకుంటున్నట్లు నటిస్తూ ఆమెతో తరచుగా మాట్లాడుతూ మధ్యమధ్యలో చూపుల తూపులు విసరసాగాడు. అదంతా ఆమె గ్రహించినా పెద్దగా ఆసక్తి కనబరచలేదు. బయటపడి మనసులో మాట చెప్పడానికి అతనికి దమ్ము చాలలేదు. దాంతో కథ ముందుకు సాగలేదు. అతను ఉస్సురన్నాడు.

ఆ తర్వాత కొన్నాళ్లకు ఏం పుట్టిందో ఏమో రినాల్డో మతదీక్ష తీసుకుని ఆ వూరి చర్చిలోనే ఫ్రయర్‌గా అవతారం ఎత్తాడు. ఓ ఏడాది పోయేసరికి ఆ నిరాడంబర జీవితం, బ్రహ్మచర్యం అతనికి విసుగు పుట్టించాయి. మతగురువుగా కొనసాగుతూనే విలాసంగా జీవించసాగాడు. అప్పుడు మళ్లీ ఒకసారి తన యింటి పక్కామెను కదిలించి చూస్తే మంచిదనిపించింది. తన ధర్మశిశువు యోగక్షేమాలు విచారించే మిషపై వాళ్లింటికి మళ్లీ వెళ్లసాగాడు.

అప్పటికీ యిప్పటికీ అతనిలో వచ్చిన మార్పును ఆమె గమనించింది. చేతిలో డబ్బు ఆడడంతో మంచి దుస్తులు, అరుదైన అత్తరులు, ఖరీదైన ఫలహారాలు అలవాటు పడి శరీరంలో నిగారింపు వచ్చింది. అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. కుర్రతనం పోయి, మాటల్లో లౌక్యం, రహస్యాన్ని దాచగల నేర్పు అలవడింది. ఇవి ఆమెను మెప్పించాయి.

అందుకే ఒక రోజు అతను ధైర్యంగా తన ప్రేమ వెల్లడించడంతో ఆమె ముసిముసి నవ్వులతో తన అంగీకారం తెలుపుతూనే '‘ఇలాటి కోర్కెలు మాబోటి సంసారులకు వుంటాయి కానీ, మీరు మతగురువులు కదా, యిలాటివి తగునా?'’ అని అడిగింది.

''పైన వేసుకున్న యీ ఉడుపులు తీసేస్తే అందరం ఒకలాటి వాళ్లమే కదా, అసలైన సమయంలో ఉడుపులుండవని హామీ యిస్తున్నాను.'' అన్నాడతను కొంటెగా.

''మీరు మా అబ్బాయికి ధర్మపిత కదా..'' అని మరో అభ్యంతరం లేవనెత్తింది.

''..అంటే పితృసమానుడననే అర్థం కదా. అతని అసలు పితతో నువ్వు శయనిస్తున్నప్పుడు ధర్మపితతో శయనించననడం అధర్మమవుతుంది.'' అన్నాడు గంభీరంగా.

''ఇంత చక్కగా సందేహనివృత్తి జరిగాక మిమ్మల్ని కాదనడం నా తరమా?'' అంది ఆ జాణ.

ఇక ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. ఇల్లు పక్కనే వుండడం, పిల్లవాడికి ధర్మపిత కావడం చేత అతను యథేచ్ఛగా వస్తూ పోతూ వుండేవాడు. ఆమె భర్త కూడా అభ్యంతర పెట్టేవాడు కాడు. అందువలన వాళ్ల యింట్లోనే వీళ్ల కలాపం సాగుతూ వుండేది.

ఒకరోజు అతను తన సహాయకుణ్ని వెంటపెట్టుకుని వచ్చాడు. ఆ యింట్లో పని చేసే పనిపిల్ల కంటికి నదురుగా వుంది.  ఆమెను అతనికి అప్పగించి ''నువ్వు ఆమెను మిద్దె మీదకు తీసుకెళ్లి కీర్తనలు వాయించు.'' అని పంపించివేసి చంటివాణ్ని ఎత్తుకున్న యింటామెను పడగ్గదిలోకి తీసుకెళ్లాడు. వాళ్లు ఆనందాబుధిలో మునకలు వేస్తూండగా ఆమె భర్త వచ్చి పడక గది తలుపు తట్టాడు. భార్యను పేరు పెట్టి పిలిచి గడియ తీయమన్నాడు.

రినాల్డో వులిక్కిపడ్డాడు - 'గడియ ఎందుకు వేశావని అతను భార్యను గద్దించవచ్చు. బట్టలు కట్టుకుంటున్నానని ఆమె సమాధానం చెప్పినా అతను గదిలోకి వచ్చి దిసమొలగా వున్న తనను చూడవచ్చు. ఏ సంజాయిషీ చెప్పుకున్నా నమ్మడు. ఈ గండం గడిచేది ఎలా?' అనుకుంటూండగానే ఆమె కళ్లతోనే ధైర్యం చెప్పింది. నేను ఆయనతో చెప్పినది జాగ్రత్తగా వింటే ఏం చేయాలో నీకు తెలిసిపోతుంది అని సైగలతో చెప్పింది.

త్వరగా పరికిణీ ఒకటి తొడిగి వెళ్లి తలుపు తీసి భర్తను బయటే నిలబెట్టి ''హమ్మయ్య వచ్చారా, ఇవాళ ఎంత గండం గడిచిందో తెలుసా?'' అంది.

అతను కంగారు పడుతూ ''ఏం జరిగింది?'' అని ఆదుర్దాగా అడిగాడు.

''ష్‌, గట్టిగా మాట్లాడకండి. లోపల ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇవాళ మనబ్బాయి మనకు దక్కేవాడు కాదు. వాడికి అకస్మాత్తుగా స్మారకం పోయింది. మీరా యింట్లో లేరు. ఏం చేయాలిరా భగవంతుడా అనుకుంటూ వుండగా పక్కింటి రినాల్డో వచ్చారు. పిల్లవాణ్ని తన చేతుల్లోకి తీసుకుని పరీక్షించి 'భయపడకు, పిల్లవాడి పొట్టలో నులిపురుగులున్నాయి. కాస్సేపుంటే అవి ఛాతీలోకి చేరిపోయి ప్రాణానికే ముప్పు తెచ్చేవి. అవి మందులతో చావవు. నేను మంత్రం వేసి వాటిని నాశనం చేస్తాను. మంత్రం పని చేయాలంటే యింకొకరు యింటి పైభాగంలో కూర్చుని కీర్తనలు పాడాలి.' అన్నారు.

‘‘మిమ్మల్ని రప్పించి మీ చేత కీర్తనలు పాడిద్దామని పనిమనిషిని పంపితే మీరెక్కడా కనబడలేదు. అప్పుడు రినాల్డో తనకు తోడుగా వచ్చిన మతగురువుకు ఆ పని అప్పగించారు. ఆయన పైకి వెళ్లాడు. ఈయన పడకగదిలో పిల్లవాణ్ని తన చేతిలో తీసుకుని మంత్రాలు పఠిస్తున్నారు. తల్లి పక్కనే వుండి మౌనంగా ప్రార్థనలు చేయాలన్నారు. అందుకే వున్నాను. మీరు గట్టిగా మాట్లాడితే రినాల్డో ఏకాగ్రత చెడిపోతుంది, మంత్రం పారదు.'' అని చెప్పింది.

ఇవన్నీ భర్త నోరు తెరుచుకుని విన్నాడు. బట్టలు వేసుకుంటూ యివన్నీ వింటున్న రినాల్డోకి ఏం చేయాలో తెలిసిపోయింది. వెంటనే పిల్లవాణ్ని చేతిలోకి తీసుకుని ఆమె వద్దకు వచ్చి, భర్తను చూసి ''అదృష్టవంతుడివి, మంత్రం ఫలించింది. పిల్లవాడు బతికాడు.'' అన్నాడు. తండ్రిని చూడగానే చంటివాడు కేరింతలు కొట్టాడు. వాడు ఏకంగా స్మశానంలోంచి లేచి వచ్చినంత సంతోషించాడు తండ్రి!

ఇంటి యజమాని గొంతు విని, కిందకు వచ్చి మెట్లకింద దాక్కుని అంతా విన్న రికార్డో అనుచరుడికి కూడా తను ఏం మాట్లాడాలో తెలిసిపోయింది. బయటకు వచ్చి ''కీర్తనలు వాయించడం పూర్తయింది'' అని ప్రకటించాడు. రికార్డో ఆనందం ప్రకటిస్తూ ''చాలా సంతోషం, ఎన్ని వాయించావు?'' అని అడిగాడు. ''రెండు పూర్తయ్యాయి. మూడోది సాగుతూండగా యింటి యజమాని రాకతో విఘ్నం కలిగింది.''అని జవాబిచ్చాడతను.

''ఏం ఫర్వాలేదు. నా మంత్రబలంతో ఏ కొరతా లేకుండా చూశాను. పిల్లవాడు బతికాడు.'' అన్నాడు రినాల్డో. తండ్రి కేసి తిరిగి ''మృత్యుముఖం నుంచి మీ పిల్లవాణ్ని కాపాడినందుకు సెయింట్‌ ఆంబ్రోస్‌ విగ్రహానికి మీ పిల్లవాడి మైనపు బొమ్మను సమర్పించండి.'' అని ఆదేశించాడు. అతను తలూపడమే కాదు, తన కొడుకు కోసం రినాల్డో అతని అనుచరుడు పడుతున్న శ్రమ చూసి మురిసిపోయి యిద్దరినీ బహుమతులతో ముంచెత్తాడు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2020)
mbsprasad@gmail.com