cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ : నెరజాణ కథలు – 13

ఎమ్బీయస్ : నెరజాణ కథలు – 13

లాంబార్డీ అనే ఒక వూళ్లో ఒక కాన్వెంట్ (మఠం) వుండేది. దానిలో ఉండే క్రైస్తవ సన్యాసినులు (నన్స్) చాలా పవిత్రమైన వారని ప్రతీతి. ఎందుకంటే వారిని పర్యవేక్షించే ఏబెస్ (మహంతిన్) చాలా స్ట్రిక్ట్‌గా వుంటుంది. ఆవిడ పేరు మడొన్నా. పవిత్రతకు, కన్యత్వానికి మారుపేరులా వుంటుంది. ఆమె తన శిష్యురాళ్లలో ఎటువంటి వెకిలితనం కనపడినా సహించేది కాదు. కఠినమైన శిక్షలు విధించేది. మనం నీతిగా వుండకపోతే ఎలా, మన కాన్వెంటు పేరు కాపాడాలి కదా అని ఉపదేశాలు చేసేది.

అయితే ఈ నన్స్‌లో ఇసబెట్టా అనే ఒకామె వాళ్ల వూరికే చెందిన ఒక కుర్రవాడు కాన్వెంట్ పరిసరాల్లో కనబడితే అతనితో ప్రేమలో పడింది. ఎవరికీ తెలియకుండా ఆమె అతన్ని తన గదికి రప్పించుకునేది. ఇద్దరూ కలిసి సుఖించేవారు. పోనుపోను అతని రాకపోకలు పెరిగాయి, ఎవరి కంట పడకపోవడంతో అంతా సవ్యంగానే నడిచిపోతోంది అనుకుంటూండగా ఒకసారి అతను ఆమె గదిలోంచి వెళ్లిపోతూ మరో నన్ కంటపడ్డాడు. ఆ అమ్మాయి ఉబలాటం పట్టలేక సాటి సన్యాసినులకు చెప్పింది. అందరూ కలిసి మడోన్నాకు ఫిర్యాదు చేద్దామా అనుకున్నారు.

అయితే తమ వద్ద సాక్ష్యం లేదు. అబద్ధపు ఆరోపణ చేసినట్లు తోస్తే మడొన్నా సహించదు. అందువలన వాళ్లంతా కూడబలుక్కుని ప్రేమికులిద్దరూ గదిలో వుండగానే పట్టుకుని, బయట గొళ్లం పెట్టేసి వెళ్లి మడొన్నాను పిలుచుకుని వద్దామనుకున్నారు. ఇక అప్పణ్నుంచి వంతుల వారీగా ఇసబెట్టాపై నిఘా వేసి వుంచారు. వీళ్ల కుతూహలం ఎంత పెరిగిపోయిందంటే, చివరకు చీకటి పడగానే వీళ్లకు ప్రార్థనలపై దృష్టి తగ్గిపోయి ఇసబెట్టా ప్రియుడు వచ్చి వుంటాడా, ఈ పాటికి గదిలో ఏం చేస్తూ వుంటాడు అనే ఆలోచనలే ఎక్కువై పోయాయి. భౌతికంగా కాపలా కాయవలసినది ఒకరే అయినా మానసికంగా అందరూ అదే పనిలో పడ్డారు. ఇసబెట్టా కంటె ఎక్కువగా వీళ్లు అతని గురించి ఆలోచించసాగారు.

చివరకు వాళ్ల ‘ప్రార్థనలు’ ఫలించి, ఇసబెట్టా కొన్నాళ్లకు రాత్రి బాగా పొద్దు పోయాక, తన ప్రియుణ్ని గదికి రప్పించుకుంది. ఆ విషయం తెలిసిన వెంటనే తక్కినవాళ్లందరూ గుమిగూడారు. రెండు బృందాలుగా విడిపోయారు. ఒక బృందం ఇసబెట్టా గది బయట కాపు కాసింది. రెండో బృందం మెడొన్నా గదికి వెళ్లి ఆమెను తీసుకురావడానికి బయలుదేరింది. ఆ బృందం తిరిగి వచ్చేలోగా యితను తన పని ముగించుకుని వెళ్లిపోకూడదని యీ బృందం తెగ ఆరాటపడుతోంది. రెండో బృందం మెడొన్నా గదికి వెళ్లి, తలుపు తట్టి ‘‘తొందరగా రండి, ఇసబెట్టా తన గదిలో ఎవడో ప్రియుడితో కులుకుతోంది. వచ్చి చూడండి.’’ అని గగ్గోలు పెట్టింది.

ఆ సమయంలో మెడొన్నా తన పక్కమీద ఒక ప్రీస్ట్‌తో అదే పని చేస్తోంది. నిజానికి ఆమె అందరూ అనుకునేటంత పవిత్రురాలేమీ కాదు. పక్కనే వున్న బ్రహ్మచారుల మఠానికి పర్యవేక్షకుడిగా (మహంత్) వున్న ఈ ప్రీస్ట్‌తో ఆమెకు చాలాకాలంగా వ్యవహారం నడుస్తోంది. ముందుగా అనుకున్న రోజున అతను ఒక పెట్టెలో పడుక్కుంటాడు. ఈవిడ ఆ పెట్టెను తన గదికి రప్పించుకుంటుంది. చీకటి పడ్డాక, బ్రహ్మచారిణులందరూ తమ తమ గదుల్లోకి వెళ్లిపోయారని నిశ్చయించుకున్నాక, తన గది తలుపులు మూసి, పెట్టె తలుపు తెరుస్తుంది. ఇక అప్పణ్నుంచి రాసలీలలు ప్రారంభం. ఈ కార్యానికి విఘ్నం కలిగించడానికా అన్నట్లు యీ ఫిర్యాదు.

ఎంతైనా డ్యూటీ ఫస్ట్ అనుకున్న మెడొన్నా ముందు వెళ్లి ఆ నన్‌ను దండించి వచ్చి, తన పని పునఃప్రారంభిద్దామనుకుంది. నైట్‌డ్రస్‌తో బయటకు రాకూడదు కాబట్టి (ఆ మాట కొస్తే ఆ సమయంలో ఒంటి మీద ఏ డ్రస్సూ లేదు) మామూలు ఏబెస్ యూనిఫాంలోనే బయటకు వెళ్లాలనుకుంది. గదిలో దీపం వెలిగిస్తే మంచం మీద ఉన్న ప్రీస్ట్ నీడ కిటికీ అద్దం మీద పడవచ్చు. అందుకనే చీకటిలోనే తడుముకుంటూ తన బట్టలు వేసుకుని గది బయటకు వచ్చి, తలుపుకి జాగ్రత్తగా గడియ పెట్టి ‘‘ఎక్కడుందా పాపిష్టిది, పదండి వెళ్లి పట్టుకుందాం.’’ అని బయలుదేరింది.

వీళ్లు వచ్చేదాకా కాపలా కాస్తూన్న మొదటి బృందం వుంది. వీళ్లు వచ్చి చేరగానే అందరూ కలిసి తలుపులు దబదబా బాదారు. లోపలున్న ప్రేయసీప్రియులు ఉలిక్కిపడ్డారు. ఏమీ మాట్లాడలేదు. ఈ బ్రహ్మచారిణులందరూ సమరోత్సాహంతో తలుపులు ఊడిపోయేట్లా బాదడంతో అవి తెరుచుకున్నాయి. లోపల ఉన్న జంట బిక్కుబిక్కుమంటూ మంచం మీద నుంచి దిసమొలతో లేచి నిలబడింది. తక్కిన నన్స్ అంతా ఇసబెట్టా మీద పడి తామే బట్టలు తొడిగేసి ఏబెస్ ఆదేశం మేరకు చాప్టర్‌హౌస్‌ (సమావేశమందిరం)కు లాక్కుని వెళ్లారు. ఆమె ప్రియుడు మాత్రం తన బట్టలు తనే తొడుక్కుని అక్కడే వుండిపోయాడు. తన కారణంగా యీ అమ్మాయికి ఏదైనా యిబ్బంది వస్తే ఆమెను మఠంలోంచి తప్పించి బయటకు తీసుకుని వెళ్లిపోయి, పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నాడు.

ఇవతల సమావేశమందిరంలో దోషిని నిలబెట్టి మడొన్నా కడిగికడిగి పారేస్తోంది. అలాటి పాపి వలన ఆమె కుటుంబానికీ, తలిదండ్రులకూ, సొంత ఊరికీ, మఠానికీ, తక్కినవారికీ, మీదుమిక్కిలి తనకూ ఎంత చెడ్డపేరు వస్తుందో, బ్రహ్మచర్యం బాట తప్పి చరించినందుకు నరకంలో ఎలాటి శిక్షలు అనుభవించవలసి వస్తుందో, అటుతిప్పి, యిటుతిప్పి వాయించేస్తోంది. ఇసబెట్టా నోరెత్తకుండా తల వంచుకుని తిట్లు పడుతోంది.  ఆ తిట్లపర్వం మరీ ఘోరంగా వుండడంతో తక్కిన నన్స్‌కి క్రమేపీ ఆమెపై జాలి కలగసాగింది. తన నుంచి రియాక్షన్ ఏమీ లేకపోవడం చేత, ఆమె వంక చూడడానికి ఏమీ లేక మడొన్నా వైపే అందరూ చూడసాగారు.

అలా చూస్తూండగా వాళ్లకు ఆమె తన నెత్తి మీద మగవాళ్ల ప్యాంటును ముసుగులాగ మడిచి పెట్టుకుని వచ్చిందని స్ఫురించింది. అప్పటిదాకా ఇసబెట్టాను పట్టివ్వాలనే తొందర, ఆ తర్వాత నగ్నంగా వున్న జంటను చూడాలనే ఆతృత, ఆమెను తిట్టించాలనే ఉబలాటం.. వీటి వలన మడొన్నా కేసి ఎవరూ తేరిపార చూడలేదు. పైగా నడవాలలో చీకటిగా కూడా వుంది. ఇక్కడ సమావేశమందిరంలో కొవ్వొత్తుల వెలుతురు బాగా వుండడంతో స్పష్టంగా కనబడింది. ఒకళ్ల నొకళ్లు గిచ్చుకుని, దాన్ని చూపించుకున్నారు. ముసిముసి నవ్వులను అణచుకుంటున్నారు. కానీ మడొన్నా యిదేమీ గ్రహించే స్థితిలో లేదు. తనెంత పవిత్రురాలో, తనను చూసి ఏం నేర్చుకోవాలో లెక్చర్లిచ్చేస్తోంది.

కాస్సేపటికి ఇసబెట్టా తల కాస్త ఎత్తి పక్కవాళ్ల వేపు దీనంగా చూసింది. ఆమె స్నేహితురాలు వెంటనే మడొన్నా తలవైపు చూడు అన్నట్లు సైగ చేసింది. తలెత్తి చూడగానే అక్కడ వున్నది తెలిసింది, ఏం జరిగిందో ఊహించింది. మడొన్నా ఊపిరి పీల్చుకోవడానికి మధ్యలో ఆగిన సమయం చూసుకుని, గొంతు సవరించుకుని ‘‘మదర్ ఏబెస్, ముందు మీ నెత్తి మీద ప్యాంటును సరిగ్గా ముడివేసుకుని మిగతా తిట్లు కొనసాగించవచ్చు కదా’’ అంది. మడొన్నాకు ఒళ్లు మండిపోయింది. ‘‘నీతిమాలినదానా! తప్పు చేసినదే కాకుండా నా మీద జోకులేస్తున్నావా? నా నెత్తి మీద ప్యాంటేమిటే కులటా!’’ అని అరిచింది.

అయినా ఇసబెట్టా బెదరలేదు. ‘‘మీ యిష్టం వచ్చిన తిట్లు తిట్టండి, మదర్. కానీ ఆ ప్యాంటు నెత్తి మీద నుంచి జారిపడుతుందేమోనని భయంగా వుంది. అందుకే చెప్తున్నా.’’ అంది ధైర్యంగా. ఆమె మాటలతో అప్పటిదాకా మెడొన్నా తలమీదకు దృష్టి సారించనివారంతా సారించారు. అందరూ కలిసి ఫక్కున నవ్వారు. దాంతో మెడొన్నా ఆశ్చర్యపడుతూ రెండు చేతులతో, తలకు రెండు పక్కలా తడుముకుంది. ప్యాంటు కొసలు తగలడంతో జరిగిందేమిటో గ్రహించింది.

వెంటనే పల్లవి మార్చేసింది. ‘‘మూర్ఖురాలా! ఏదైనా వ్యవహారాన్ని గుట్టుగా వుంచకపోతే ఎంత ప్రమాదమో, ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో నేను చెప్తూ వుంటే అది గ్రహించకుండా, వెర్రిమొర్రి జోకులు వేస్తున్నావేమిటి? ఉప్పూకారం తినే శరీరం మనది. అప్పుడప్పుడు కక్కుర్తి పడాల్సివస్తుంది. లేకపోతే దైవం పట్ల ఏకాగ్రత కుదరదు. కానీ పవిత్రమైన వృత్తిలోకి వచ్చాక, దాని పరువుప్రతిష్ఠ కాపాడవలసిన బాధ్యత మన పట్ల వుంది. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఏదీ బయటపడకుండా వ్యవహారం నడుపుతూంటాను.

‘‘మరి నువ్వు చూడు, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించావో! కాన్వెంటులో వున్న అందరికీ తెలిసిపోయింది. వీళ్లలో రేప్పొద్దున ఎవరికైనా చెపితే ఎంత ప్రమాదం! అసలు వీళ్లకు బుద్ధి వుందా? రేపు తాము కూడా దేహతాపం భరించలేక ఎవడో ప్రియుణ్ని గదికి తెచ్చుకోవలసి వస్తుంది కదా, యిప్పుడిలా నిన్ను అల్లరి పెడితే ఎలా అనే ఇంగితం వుందా? అందరూ కలిసిమెలసి గుట్టుగా వుంటే యీ నాలుగుగోడల మధ్య ఎన్ని రాసలీలలు సాగినా ఏ యిబ్బందీ వుండదు. పేరుకు పేరూ వుంటుంది, సుఖానికి సుఖమూ దక్కుతుంది. కానీ వీళ్లకు ఆ ముందుచూపు లేదే, కావాలని నిన్ను అల్లరిపెట్టారు. ఇలాటి మూక చుట్టూ వున్నపుడు నువ్వెంత జాగ్రత్తగా వుండాలి? అందుకే నిన్ను అంత తీవ్రంగా మందలించవలసి వస్తోంది.’’ అని అంతే కాఠిన్యంతో ఉపన్యాసం సాగించింది.

అప్పటికే నన్స్ అందరికీ జ్ఞానోదయం అయిపోయింది. అందరూ ముక్తకంఠంతో ‘‘మదర్, మాకు బుద్ధి వచ్చింది. ఇకపై అంతా గప్‌చుప్. ఒకరి గుట్టు మరొకరు కాపాడుకుంటాం. మీ జోలికి మేము రాము. మా జోలికి మీరు రాకండి.’’ అన్నారు. మదర్ ‘‘సంతోషం, మీ అవివేకం వలన నా విలువైన సమయం వృథా అయింది. అరుదుగా వచ్చే అవకాశాలు యిలా వృథా అయితే ఎంత బాధో మీకేం తెలుసు? ఒక్కమాట - మరీ విచ్చలవిడిగా తిరిగి బయటపడకండి. మగస్నేహితులు లేనివాళ్లు ఉన్నవాళ్లను చూసి అసూయ పడకండి. ప్రయత్నిస్తే మీకూ దొరకకపోరు. అందరూ తృప్తిగా వుండడమే నాకు కావలసింది.’’ అని ముగించి, హడావుడిగా తన గదికి వెళ్లిపోయింది.

తర్వాతి రోజుల్లో కూడా ఆ కాన్వెంటుకు అతి పవిత్రమైనదనే పేరు కొనసాగింది.  

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×