cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ : నెరజాణ కథలు – 14

 ఎమ్బీయస్ : నెరజాణ కథలు – 14

పెరూగియా అనే ఊళ్లో పియెత్రో అనే ధనికుడు వుండేవాడు. వివాహం పట్ల ఆసక్తి లేక అతను చాలాకాలం పెళ్లి చేసుకోలేదు. కానీ పెళ్లి కాకపోతే వూళ్లోవాళ్లు ఏమైనా అనుకుని పోతారనుకుని కాస్త బొద్దుగా వున్న వెర్జియానా అనే ఒక పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తను పెద్దగా పట్టించుకోకపోయినా నోరెత్తదని అతని అంచనా. కానీ ఆమె స్వభావరీత్యా మదనతాపం ఎక్కువున్న స్త్రీ. భర్త చూస్తే యిలా వున్నాడు. 

కొన్నేళ్లు ఓపిక పట్టింది కానీ తర్వాత ఆమెకు ఒళ్లు మండింది – ‘భార్య అవసరం పెద్దగా లేనివాడు భారీ కట్నం తీసుకుని నన్ను పెళ్లి చేసుకోవడం దేనికి? అక్రమ సంబంధాలు పెట్టుకునే స్త్రీలను చట్టాలు కఠినంగా శిక్షిస్తున్నాయి కాబట్టి నేనేమీ చేయలేనని ధీమానా? అతను ప్రకృతిసూత్రాలను ఉల్లంఘిస్తే నేను న్యాయసూత్రాలను ఉల్లంఘిస్తాను. ఏమౌతుందో చూదాం.’’ అని గట్టిగా నిశ్చయించుకుంది.

ఆమె ఒక సన్యాసినిని ఆశ్రయించింది. ఆ వృద్ధసన్యాసిని బయటకు పరమ పవిత్రమూర్తిగా కనబడుతూ, మాట్లాడితే సతీత్వం గురించి, గృహస్థ ధర్మాల గురించి ప్రబోధాలు దంచుతున్నా, నిజానికి చాలా చలాకీది. వెర్దియానాకు ఆమె గురించి ఎవరో చెపితే, ఆమె శిష్యురాలిగా మారి, కొన్నాళ్లు కూడాకూడా తిరిగింది. ఒకసారి ఏకాంతంగా వున్నపుడు తన అవస్థ చెప్పుకుంది. అంతా విని సన్యాసిని నిట్టూర్చింది – ‘‘ఈ మొగుళ్లకున్న పోయేకాలం యిదే! చేయవలసిన పని చేయకుండా మన యవ్వనాన్ని వ్యర్థం చేసేస్తారు. వయసు ఉడిగిపోయాక మనమేం చేయగలం చెప్పు. ఫయర్ ప్లేస్ దగ్గర కూర్చుని, దానిలోని తెల్లటి బూడిద చూస్తూ, మన అందచందాలకీ అదే గతి పట్టిందని బాధపడడం తప్ప!  

‘‘నా బతుకు చూడు, ధర్మపన్నాలు వల్లిస్తూ జీవితం వెళ్లమార్చడం తప్ప యీ వయసులో నాకేం మిగిలింది? ఎవడైనా నాకేసి కన్నెత్తి చూస్తాడా? కానీ ఉన్నదున్నట్లు చెప్పుకోవాలంటే, యిలాటి రోజు వస్తుందని వయసులో వుండగానే నాకు తోచింది. అందుకే ముందే జాగ్రత్తపడ్డాను. నా యవ్వనం మొత్తం అడవి గాచిన వెన్నెల అయిందని అబద్ధం చెప్పను కానీ, అనుభవించ వలసినంత యిదిగా అనుభవించలేదన్న చింత మాత్రం మిగిలిపోయింది. నీ బతుకు అలా కాకూడదని నా భావన.

‘‘మగాడికంటావా, వంద వ్యాపకాలు. భార్యను తృప్తి పరచడమనేది వాటిలో ఒకటి మాత్రమే. కానీ ఆడదానికి భర్తే సర్వస్వం. ఆమె ప్రపంచం చిన్నది. భర్తను సంతోషపెట్టడానికి ఏ నిమిషంలోనైనా తయారుగా వుంటుంది. కానీ మగాడి సంగతి అలాక్కాదే! అతను సిద్ధం కావడానికి ఎంతో తతంగం జరగాలి. కావాలనుకుంటే ఒక స్త్రీ ఎంతమంది మగవాళ్లనైనా అలిసేట్లు చేయగలదు. కానీ కొందరు మగవాళ్లు కలిసినా స్త్రీ చేత ‘ఇకచాల’నిపించలేరు. భగవంతుడు మనల్ని యిలా తయారుచేసినప్పుడు, మగవాళ్లు అది అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా కొంతవరకైనా మనల్ని సుఖపెట్టే ప్రయత్నం చేయాలి.

‘‘కానీ వీళ్లేం చేస్తున్నారు? కంటపడితే రాత్రి కార్యక్రమం ఏమిటని అడుగుతామనే భయంతో మనల్ని వంటింట్లోనే పడేసి వుంచుతున్నారు. నీకు కావలసిన కబుర్లన్నీ పెంపుడు పిల్లితో చెప్పుకో. పనిమనిషి గిన్నెలు, తప్పాళాలు ఎత్తుకుపోకుండా కాపలా కాయి. నన్ను మాత్రం సతాయించకు, నా దగ్గర్నుండి ఏమీ ఆశించకు.’ అంటున్నారు. ఇది ధర్మమా? ఇది ధర్మమే అయితే మనం పక్కదారులు వెతుక్కోవడమూ ధర్మమే. నీ కంటికి నచ్చిన కుర్రవాడెవడైనా మనూళ్లో ఉంటే చెప్పు. లేదూ, నన్ను వెతికి పెట్టమంటే వెతికిపెడతాను. నేనే వెళ్లి అన్నీ సంధానపరుస్తాను. నా వయసు చూసి, వేషం చూసి ఎవరూ సందేహపడరు. నీ సుఖం నువ్వు చూసుకో. నన్ను కూడా బాగా చూసుకో. నేను బీదదాన్ని కాబట్టి కాస్త డబ్బు యిస్తే నీ గుట్టు బయట పడకుండా వుండాలని ప్రభువుకి ప్రార్థనలు చేస్తాను.’’ అంది ఆ ముసలామె.

వెర్దియానా వెంటనే ఆమెకు కడుపునిండా తిండి పెట్టి, తృప్తి పరచింది. ఆమె ఒక అందగాణ్ని వెతికిపెట్టి, ఓ రోజు రహస్యంగా తన గదికి చేర్చినపుడు భారీగా డబ్బు ముట్టచెప్పింది. కొన్నాళ్లు అతనితో సుఖించాక, మరొకణ్ని చూసి పెట్టమంది. ముసలామె ఆ ఏర్పాటూ చేసింది. ఇలా ఒక ఏడాది గడిచేసరికి, నలుగురైదుగురు ప్రియులతో వెర్దియానా రకరకాల అనుభవాలను రుచి చూసింది. ఇదంతా భర్తకు తెలియకుండా జాగ్రత్త పడాలి కాబట్టి అతను తన దుకాణానికి వెళ్లినపుడు మిట్టమధ్యాహ్న శృంగారం సలిపేది.

అందుకే అవేళ తన భర్త ఎర్కొలానో అనే స్నేహితుడి యింటికి డిన్నర్‌కు వెళతానన్నపుడు, వెర్దియానా చాలా సంతోషించింది. అతను తిరిగి వచ్చేసరికి ఏ అర్ధరాత్రో అవుతుంది కాబట్టి, యీ లోపున చీకటివేళ ప్రియుడితో కులకవచ్చనుకుని ముసలామెకు కబురంపి ‘ఇవాళ కొత్త పుంజుని పట్టుకుని రా’ అంది.  ఆమె డియోనియో అనే ఒక నాజూకు యువకుణ్ని పంపించింది. ఇద్దరూ కలిసి డిన్నర్‌కు కూర్చోగానే పియెత్రో వచ్చి తలుపు దబదబా బాదాడు. వచ్చినది భర్త అని తెలియగానే వెర్దియానా చచ్చాంరా దేవుడా అనుకుంది. తన ప్రియుణ్ని పక్కనే వున్న గదిలోకి పంపి, అతని మీద కోళ్ల గంప బోర్లించి, పైన ఓ ఖాళీ గోనెసంచె కప్పేసింది. డిన్నర్ పళ్లాలను దాచేసి, తలుపు తెరిచి, ‘‘ఏం మీ ఎర్కొలానో పెళ్లం వంట అంత బాగుందేమిటి? గుటుకుగుటుకున మింగేసి, అప్పుడే యింటికి దయచేశారు.’’ అంది వెక్కిరింతగా.

‘‘నా మొహం, ఒక్క మెతుకైనా కతకలేదు.’’ అన్నాడు భర్త చికాగ్గా.

జరిగినదేమిటంటే, వాళ్లు డిన్నర్‌కు కూర్చోగానే పక్క గదిలోంచి తుమ్ములు వినబడ్డాయి. ఒకటి, రెండు, మూడూ కాదు, వరుసగా తుమ్ములు వస్తూనే వున్నాయి. ఎర్కొలానో ఎవరక్కడ అంటూ పక్కగదికి వెళ్లాడు. మెట్ల కింద పాత సామాను పడేయడానికి కట్టిన చెక్క అలమారాలోంచి ఆ తుమ్ములు వస్తున్నాయి. తలుపు తీస్తే గుప్పున గంధకం వాసన వేసింది. అసలు భోజనానికి కూర్చున్న దగ్గర్నుంచి ఎర్కొలానో ‘‘ఏమిటీ గంధకం కంపు?’’ అంటున్నాడు. ‘‘నా తెల్లబట్టలు బ్లీచ్ చేయడానికి గంధకం వాడాను. పాత సామాన్ల అలమార్లో ముక్కవాసన వస్తోంది కదాని అది పోవడానికి ఓ కప్పులో గంధకం వేసి అక్కడ పెట్టాను. బహుశా దాని వాసనేమో’’ అంది అతని భార్య.

తలుపు తీయగానే గంధకం కప్పుతో బాటు తుమ్ములు తుమ్మే తమ్ముడు కూడా కనబడ్డాడు. ‘‘ఓహో అందుకా, నువ్వు తలుపు తీయడానికి అంతసేపు చేశావ్. ఎన్నాళ్లగా సాగుతోందీ రంకు?’’ అంటూ ఎర్కొలానో మండిపడ్డాడు. ‘‘ముందు వాణ్ని బయటకు లాగు. లేకపోతే వాడు జీవితంలో మళ్లీ తుమ్మడానికే కాదు, ఎందుకూ పనికిరాకుండా పోతాడు.’’ అని సలహా యిచ్చాడు పియెత్రో. తన సంగతి బయటపడిపోయిందని గ్రహించిన ఎర్కొలానో భార్య యింట్లోంచి పారిపోయింది. ఎర్కొలానో యీ తుమ్ములబ్బాయిని అల్మైరా లోంచి కాలు పట్టుకుని బయటకు యీడ్చి, కింద పడేసి వాణ్ని చంపడానికి కత్తి తేవడానికి వెళ్లాడు.

ఆ అభాగ్యుడి తలకి గంధకం వాసన బాగా ఎక్కేసిందేమో, పారిపోవడానికి ఓపిక లేక, నేల మీద పడి తుమ్ముతూ వున్నాడు. తన కళ్లెదురుగా హత్య జరిగితే కేసులో యిరుక్కుంటానని పియెత్రోకు భయం వేసింది. వద్దువద్దు అంటూ పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపట్ల జనం పరిగెట్టుకుని వచ్చారు. అందరూ కలిసి అప్పటికే స్పృహ తప్పి వున్న యువకుణ్ని బయటకు మోసుకుపోయారు. తన భార్యను, ఆమె రంకుమొగుణ్ని బండబూతులు తిడుతున్న ఎర్కొలానోను భోజనం సంగతేమిటి? అని అడిగే ధైర్యం చేయలేక పియెత్రో చల్లగా బయటకు జారుకుని, ఆకలితో నకనకలాడుతూ యిల్లు చేరాడు.

కథంతా విన్నాక వెర్జియానా ‘అమ్మయ్య, నాలాటి వాళ్లు యింకా వున్నారన్నమాట, బయటకు పొక్కకుండా యిలా ఎన్ని వ్యవహారాలు నడుస్తున్నాయో’ అనుకుంది. ఆమెపై సానుభూతి చూపిస్తూ మాట్లాడితే భర్తకు అనుమానం వస్తుందని భయపడి, ‘‘పైకి ముద్దరాలులా కనిపించే ఎర్కొలానో భార్య యింత జాణ అని నాకు తెలియదు సుమండీ! అయినా అంత చక్కని మొగుడు వుండగా అవేం పనులు చెప్పండి. అలాటిదాన్ని సజీవంగా దహనం చేసినా తప్పు లేదు. తన కారణంగా యావత్తు స్త్రీజాతికి చెడ్డపేరు వస్తుంది. పాపం తన కారణంగా భర్త పరువు బజార్న పడింది కదా! ఇప్పుడతను తగుదునమ్మా అని బజార్లో తలెత్తుకుని ఎలా తిరగగలడు, అంతా అతని వెనక్కాల నవ్వుకోరూ!’’ అంటూ సుద్దులు చెప్పింది.

ఇలా చెప్తూనే వున్నా పక్క గదిలో తన ప్రియుడు దాక్కుని వున్న సంగతి మర్చిపోలేదు. అందుకని మొగుడితో ‘‘ఈ వెధవ గొడవతో బాగా అలసిపోయి వుంటారు. వెళ్లి పడుక్కోండి.’’ అని జాలి చూపించింది. ‘‘కడుపు మాడిపోతూ వుంటే నిద్రంటావేమిటి నా మొహం, నీకోసం వండుకున్నదేమైనా మిగిలిందేమో చూడు, కాస్త నములుతా.’’ అన్నాడు భర్త. ‘‘మీరు యింట్లో లేనప్పుడు డిన్నర్‌లు చేసుకుని మెక్కడానికి నేనేమైనా ఎర్కొలానో పెళ్లాననుకున్నారా? మధ్యాహ్నం మిగిలిన దానితోనే కాస్త ఎంగిలిపడి భోజనం అయిందనిపించాను. ఇవాళ్టికి ఒక్కపొద్దు అనుకుని, ఆరోగ్యానికి మంచిదని సర్దిచెప్పుకుని, పడగ్గదికి వెళ్లి పడుక్కోండి. నేను యిల్లు సర్దుకుని వస్తా.’’ అంది వెర్దియానా వగలు పోతూ.

భార్య చెప్పిన దానితో కన్విన్స్ అయి పియెత్రో పడగ్గదికి వెళ్లబోతూ వుండగా అనుకోని సంఘటన ఒకటి జరిగింది. ఆ రోజు మధ్యాహ్నం కొందరు పనివాళ్లు పల్లెటూరి నుంచి పియెత్రో యింటికి సామాన్లు తెచ్చిపడేశారు. సామాన్లు మొయ్యడానికి ఉపయోగించిన గాడిదలను పెరట్లో కట్టేశారు కానీ వాటికి తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడం మర్చిపోయారు. దాంతో గాడిదలు నీటి కోసం అల్లాడసాగాయి. వాటిలో ఒకటి తన కట్టు తెంపుకుని, నీరు వెతుకుతూ వెర్దియానా ప్రియుడు డియోనియో దాక్కుని వున్న గదికి వచ్చి నిలబడింది.

డియోనియో కోళ్ల గంప కింద నక్కాడన్న మాట నిజమే కానీ అతను దాని కింద పూర్తిగా పట్టలేదు. ఒక చెయ్యి బయటకు వచ్చేసింది. ఈ గాడిద వచ్చి సరిగ్గా ఆ చేతి వేళ్ల మీద నిలబడింది. దాని గిట్టల వలన వేళ్లు నలిగిపోవడంతో భరించలేక డియోనియో కెవ్వు మని కేక పెట్టడం, అది విని పియెత్రో అక్కడకి వచ్చి గంప ఎత్తి అతన్ని చూడడం జరిగాయి. ‘‘ఇక్కడేం చేస్తున్నావ్ చెప్పు’’ అని అడగగానే, ఆ కుర్రవాడు గజగజ వణుకుతూ సమస్తం చెప్పేశాడు. అతన్ని వెంటపెట్టుకుని, పియెత్రో భార్య దగ్గరకు వచ్చాడు. ‘‘ఎర్కొలానో వాళ్లావిడ గురించి అన్ని నీతికబుర్లు చెప్తున్నదానివి, నువ్వు చేస్తున్న పనులేమిటి? సిగ్గుందా? మీ ఆడాళ్లందరూ ఒక్కటే.’’ అంటూ విరుచుకు పడ్డాడు.

వెర్దియానా భయపడలేదు. ‘‘అవును, నేనూ తక్కిన ఆడవాళ్లలాటి దాన్నే. మొగుడి నుంచి సుఖం ఆశిస్తాను. ఎర్కొలానో తన భార్యను బాగానే చూసుకుంటాడు, సుఖపెడతాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నాకు తిండీ, బట్టా యిస్తే చాలనుకుంటున్నావు. నాకు చింకిబట్టలియ్యి, చిరిగిన మేజోళ్లియ్యి, కానీ పడకసుఖం యిస్తే చాలు, నేను యింకేమీ అడగను. ఆ పని చేయకుండా వుంటే నాకు వేరే దారేమి వుంది? ఒకదానికి సంతోషించు. నేను ఏ అలగా కుర్రాడితోనో పోవటం లేదు. మంచి కుటుంబానికి చెందిన నవనవలాడే కుర్రాడిని పట్టాను. చూడు ఎంత నాజూగ్గా వున్నాడో.’’ అంది.

డియోనియో నాజూకుతనాన్ని పియెత్రో చాలా సేపటి నుంచి అనుభవిస్తూనే వున్నాడు. అతను కనబడిన దగ్గర్నుంచి చెయ్యి పట్టుకుని వదలటమే లేదు. నిజానికి అతనికి అతనికి ఆడవాళ్ల కంటె మగవాళ్ల పైనే మోజెక్కువ. అందుకే భార్యతో అలా వ్యవహరిస్తున్నాడు. కోపంతో రంకెలేస్తున్న భార్యను ఆపి ‘‘సర్లే జరిగిందేదో జరిగింది. ఈ సమస్యను నేను ఎలా పరిష్కరిస్తానో చూడు. నువ్వు దాచేసిన డిన్నర్ పళ్లాలు బయటకు తీయి. ముందు ముగ్గురం చక్కగా భోజనం చేసి, తర్వాతి విషయాలు ఆలోచిద్దాం.’’ అన్నాడు. మర్నాడు ఉదయం పియెత్రో యింటినుంచి బయటకు వచ్చి, తన యింటికి నడుస్తున్న డియోనియోకు గతరాత్రి తను భార్యాభర్తల్లో ఎవరితో ఎక్కువసేపు గడిపాడో గుర్తు రాక చాలా అవస్థ పడ్డాడు!

– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2020)
mbsprasad@gmail.com

 


×