cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

నెరజాణ కథలు – 15

నెరజాణ కథలు – 15

సియెనా నగరంలో టావెనా, జెప్పా అనే యిద్దరు ధనికులైన, అందగాళ్లయిన ప్రాణస్నేహితులున్నారు. ఇద్దరికీ అందమైన భార్యలున్నారు. భార్యలు కూడా సహకరించడంతో సొంత అన్నదమ్ముల కంటె ఎక్కువగా మసలుతూ కలిసి తిరుగుతూంటారు. పిల్లలు లేరు. పక్కపక్క యిళ్లలోనే వుంటూ, ఒకళ్ల యింట్లో మరొకరు ఎక్కువగా గడుపుతూంటారు. వంటల దగ్గర్నుంచి, డ్రెస్‌ల నుంచి, ఫర్నిచర్ దాకా, భార్యలను తప్ప.. అన్నీ పంచుకుంటారు. ఇంత ఆత్మీయంగా ఉంటున్నా టావెనా బుద్ధి వికటించింది. జెప్పా యింట్లో ఎక్కువసేపు గడపడంతో అతని భార్య మీద మక్కువ పెరిగింది. ఆమాటా యీమాటా చెపుతూ ఆమెకు చేరువయ్యాడు. ఆమె కూడా ఇది మిత్రద్రోహం అవుతుంది అంటూనే అతని కౌగిట్లో కరిగిపోయింది.

ఓ రోజు జెప్పా పని మీద బయటకు వెళతానని భార్యకు చెప్పి బయలుదేరాడు కానీ ఆఖరి నిమిషంలో బద్ధకించి, ఓ గదిలో ముసుగెట్టి పడుక్కున్నాడు. మధ్యాహ్నం అతనికి మెలకువ వచ్చేసరికి పక్కగదిలో టావెనా మాటలు వినబడుతున్నాయి. ‘‘జెప్పా లేడా? అయితే యింకేం, మనకు పండగే!’’ అంటున్నాడు. ఆ తర్వాత యిద్దరు వ్యక్తులు కౌగలించుకుని, గాఢంగా ముద్దులు పెట్టుకుంటున్న శబ్దం వినబడింది. ఆ స్త్రీ తన యింట్లో పనిమనుషుల్లో ఎవరాన్న కుతూహలంతో జెప్పా లేచి, చాటుగా చూశాడు. చూస్తే తన భార్యే! తెల్లబోయాడు. ఏమనాలో, ఎలా అర్థం చేసుకోవాలో తెలియక యితను అయోమయంలో వుండగానే, వాళ్లు తమకం పట్టలేక, పడగ్గదిలోకి దారి తీసి, తలుపు వేసేసుకున్నారు.

సర్వం విదితమయ్యాక, జెప్పా చప్పుడు చేయకుండా యింట్లోంచి బయటకు వెళ్లిపోయి, ఒక తోటలో కూర్చుని గాఢంగా ఆలోచించాడు. తను భార్యపై న్యాయాధికారికి ఫిర్యాదు చేయవచ్చు. ఆమెకు తప్పకుండా దండన పడుతుంది. కానీ అంతిమంగా తన పరువు పోతుంది. ‘అందగాడివే కానీ, నీ దగ్గర సుఖం పొందలేకనే కదా ఆమె పక్కదారులు పట్టింద’ని జనాలు హేళన చేయవచ్చు. పైగా అందమైన పక్కింటి మహిళను వలలో వేసుకోగలిగిన పెద్ద దక్షిణనాయకుడిగా టావెనా పేరు పడతాడు. అందువలన తను నోరు విప్పకూడదు. కానీ యీ మిత్రద్రోహికి శాస్తి చేయడమెలా? అని తీవ్రంగా ఆలోచించి, ఒక పథకం వేశాడు.

మర్నాడే టావెనా లేనప్పుడు అతనింటికి వెళ్లి అతని భార్యను కలిశాడు. ఆ మాటా యీ మాటా చెప్పి, ‘చూశావా, ఏం జరుగుతోందో’ అని ఆమెకు అసలు సంగతి చెప్పాడు. విని చాలా బాధపడింది. ‘నేను ఏం తక్కువ చేశానని అతను పక్కచూపులు చూడాలి? నీ భార్య కంటె నేను తక్కువ అందమైనదాన్నా? శృంగారంలో తీసిపోతానా? ఇంట్లో భార్యపై చులకన, పక్కింటివాడి పెళ్లాంపై మోజు. మగబుద్ధి మారదు. ఇతనికి బుద్ధి చెప్పాలంటే నేను కూడా ఎవరితోనైనా సంబంధం పెట్టుకుని తడాఖా చూపించాలి. అప్పుడు తెలిసివస్తుంది, మోసగించబడితే ఎంత బాధ కలుగుతుందో’ అంటూ ఆవేశపడింది.

అంతా విని ‘‘వాడిని ఉడికించడానికి నువ్వు వేరెవరితోనో సంబంధం పెట్టుకునే బదులు, నాతోనో పెట్టుకోవచ్చు కదా. మనిద్దరి పగా ఒకేసారి తీరుతుంది.’’ అన్నాడు జెప్పా. ‘‘నువ్వు మంచివాడివి. నిన్నెందుకు చెడగొట్టడం?’’ అందామె. ‘‘నేనంటే యిష్టం లేదని డొంకతిరుగుడుగా చెప్తున్నావా?’’ అని అడిగాడు జెప్పా.

‘‘అదేం లేదు, నిజానికి నాకు నీపై మోజు లేకపోలేదు. కానీ మనిద్దరమూ పెళ్లయినవాళ్లం కదాని, నా భర్త నీ స్నేహితుడు కదాని, మనసును అదుపులో పెట్టుకున్నాను. మా ఆయనకు ఆ యింగితం లేకపోయింది చూడు.’’ అందామె బాధగా.

‘‘నీ భర్త ఒక్కడికే కాదు, నా భార్యకూ వివేకం లేకుండా పోయింది. నేనేం తక్కువ చేశాను చెప్పు.’’ అన్నాడు జెప్పా.

‘‘అవునవును, నువ్వు మీ ఆవిణ్ని బాగా చూసుకుంటావు. పైగా టావెనా కంటె ఒకలా చూస్తే నువ్వే ఎక్కువ అందగాడివి.’’ అందామె. అతనితో శయనించడానికి ఆమె మానసికంగా సిద్ధపడిపోయిందని గమనించాక జెప్పా ‘‘సరే, అలా అయితే ఒకటి రెండు రోజుల్లో అదను చూసి, ఓ మధ్యాహ్నం మా ఆవిడ యింట్లో లేనప్పుడు మా యింటికి పిలుస్తాను. వచ్చేసేయ్.’’ అన్నాడు. ఆమె సరేనంది.

మర్నాడు జెప్పా తన భార్యను టావెనాతో అక్రమసంబంధం గురించి నిలదీశాడు. ఆమె భయంతో వణికిపోయింది. పొరపాటై పోయింది క్షమించమని, ఇకపై బుద్ధిగా వుంటాననీ, యికపై అతని మొహం చూడననీ వేడుకుంది. ‘‘..చూడాలి, అంతేకాదు, అతన్ని మన యింటికి పిల్చి మీరిద్దరూ రతికేళి జరపాలి.’’ అన్నాడు జెప్పా కోపంగా.

అతనేం చెప్తున్నాడో ఆమెకేమీ అర్థం కాలేదు. ‘‘ఛ, ఛ. నువ్వు వెక్కిరిస్తున్నావు కదూ. నేనిక అతని జోలికి వెళ్లనని దేవుడి ముందు ప్రమాణం చేస్తాను.’’ అందామె గజగజలాడుతూ. ‘‘నేను చెప్పినట్లు చేయకపోతే ఊరుకునేది లేదు.’’ అని భర్త ఉగ్రరూపం చూపడంతో ఆమె ‘‘నువ్వేం చెపితే అదే చేస్తాను. నాపై ఫిర్యాదు చేయకుండా వుంటే చాలు.’’ అని ఒప్పుకుంది.  

‘‘రేపు మధ్యాహ్నం మేమిద్దరం తోటలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ వుంటాం. వాడు ఏదో ఒక సాకు చెప్పి, మనింటికి వచ్చేయాలి. నువ్వు ముందే కబురు పెట్టి అలా జరిగేట్లు చూడు. వాడు యింటికి రాగానే పడగ్గదిలోకి తీసుకెళ్లి, పని మొదలుపెట్టు. అంతలో నేను వచ్చి తలుపు తడతాను. నువ్వు భయపడినట్లు నటించి, మన పడగ్గదిలో పెట్టిన భోషాణం పెట్టెలో వాణ్ని దాక్కోమని చెప్పి, మూతపెట్టి తాళం వేసేయ్.’’

‘‘ఆలస్యమైతే ఊపిరాడక చచ్చిపోతాడేమో, తీసుకెళ్లి నదిలో పడేస్తావా?’’ అని జెప్పా భార్య భయసందేహాలతో. ‘‘తర్వాత ఏం చేస్తానో నువ్వే చూద్దువుగాని. ముందుగా ప్రశ్నలు అడక్కు.’’ అన్నాడు జెప్పా విసుగ్గా. అపరాధం చేసింది తను కాబట్టి ఆమె నోరు మూసుకుని అతను చెప్పినట్లే చేసింది.

మర్నాడామె టావెనాను భోషాణంలో పెట్టి, తాళం వేసి, తలుపు తీశాక జెప్పా లోపలకి వచ్చి, ‘‘ఇప్పుడు నువ్వు పై అంతస్తు గదికి వెళ్లి పడుక్కో. నేను పిల్చినప్పుడే వద్దువుగాని.’’ అన్నాడు. ఆమె పైకి వెళ్లాక, జెప్పా పక్కింటికి వెళ్లి టావెనా భార్యను పిలుచుకుని వచ్చాడు. ఆమె అన్ని విధాలా సిద్ధంగా వుంది. జెప్పా తన పడగ్గదిలోకి తీసుకుని వచ్చి,  వెరైటీగా వుంటుందంటూ భోషాణంపై పడుక్కోబెట్టి రకరకాల భంగిమల్లో అనుభవించాడు. ఆమె కూడా పూర్తిగా సహకరించింది. ఆనందాతిరేకంతో వాళ్లు చేసే శబ్దాలు పెట్టెలో దాక్కున్న టావెనాకు కర్ణకఠోరంగా వున్నాయి. తన భార్య కంఠస్వరాన్ని గుర్తుపట్టాడు కానీ తనంతట తానుగా బయటపడలేడు కదా. అందువలన తనను తాను తిట్టుకుంటూ అంతా భరించాడు.

కొద్దిసేపటికి జెప్పా, టావెనా భార్యను పెట్టె దిగమని చెప్పి, ‘‘ఇప్పుడు నీకో వింత చూపిస్తాను చూడు’’ అంటూ తాళం తీసి తలుపు తెరిచాడు. లోపలున్న తన భర్తను చూసి టావెనా భార్య కొయ్యబారిపోయింది. టావెనా కూడా బయటకు వచ్చి, తలవంచుకుని నిలబడ్డాడు. జెప్పాను ఏమైనా అందామంటే అనే నైతికపరమైన హక్కు తను కోల్పోయేడు. ముందుగా మిత్రద్రోహం చేసింది తను! ఈ లోగా జెప్పా తన భార్యను కిందకు పిలిచాడు. ఆమెను చూసి టావెనా భార్య కుచించుకుపోయింది కానీ, అంతలోనే ‘చూశావా దెబ్బకు దెబ్బ’ అన్నట్లు తలెత్తి ధైర్యంగా నిలబడింది.

జెప్పా చేసిందేమిటో అందరికీ అర్థమైంది. ఇప్పుడు అందరూ దోషులే. ఏమనాలో ఎవరికీ తోచలేదు. మౌనంగా కాస్సేపు మద్యం సేవించాక అందరూ కలిసి ఒక తీర్మానానికి వచ్చారు - ‘‘ఇన్నాళ్లూ అన్నీ పంచుకుంటూ వచ్చాం, జీవిత భాగస్వాములను తప్ప. ఇకపై వారినీ పంచుకుందాం. అప్పుడు మన స్నేహబంధానికి భవిష్యత్తులో కూడా ఎలాటి విఘాతమూ రాదు.’’ అని!

దీనితో యీ కథలు ముగిశాయి. ఇవి చెప్పే నీతి ఏమిటో ముక్తాయింపు వ్యాసంలో!

- ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2020)
mbsprasad@gmail.com

 


×