Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ‘నిధి తెచ్చే సుఖం’ కథ - 1/2

ఎమ్బీయస్‌: ‘నిధి తెచ్చే సుఖం’ కథ - 1/2

‘‘కాఫీ, టీ ఆర్‌ మీ’’ అనే సీరీస్‌ 1970ల్లో ఒక సంచలనాన్ని కలిగించాయి. ట్రూడీ బేకర్‌, రేచెల్‌ జోన్స్‌ అనే యిద్దరు ఎయిర్‌ హోస్టెస్‌ (సింపుల్‌గా స్టూ అంటారు)లు తమ జీవితానుభవాలను గ్రంథస్తం చేసిన పుస్తకం ‘కాఫీ, టీ ఆర్‌ మీ’. స్టూ సాధారణంగా విమాన ప్రయాణికులను కాఫీ ఆర్‌ టీ అనే అడగాలి. కానీ దానికి ‘.. ఆర్‌ మీ’ అని చేర్చడంలో కొంటెతనం ఉంది. వాళ్లు విచ్చలవిడి జీవితం గడుపుతారని లోకం అనుకునేదానికి అనువుగా రాస్తూనే, వారి జీవితాల్లో ఉన్న కష్టనష్టాలను, వాళ్లను ముగ్గులోకి దింపడానికై కొందరు వేసే వెధవ్వేషాలను ఎలా తట్టుకుంటారో కూడా సరదాగా చెప్పుకొచ్చింది ఆ పుస్తకం. విమానంలో ధనికులను, పలుకుబడి వున్నవారిని కలిసే అవకాశాలు మెండు కాబట్టి, ఎవరో ఒక డబ్బున్నవాణ్ని పెళ్లి చేసుకుని సెటిల్‌ అవ్వాని ‘స్టూ’లు ఎలా తపిస్తూంటారో, దాని కోసం వాళ్లు వేసే ట్రిక్కులు ఎలా వుంటాయో చిలిపిగా చెప్పుకొచ్చారు రచయిత్రులు. కొంత అశ్లీలత ఉన్నా ఆ పదవిన్యాసం చేత, వర్ణనాచమత్కారం చేత చదువుతున్నంతసేపు పెదాలపై చిరునవ్వు నర్తిస్తూనే ఉంటుంది.

మొదటి పుస్తకం 1967లో వెలువడింది. రెండు నెలలకే పునర్ముద్రణ, ఆ పై నెలలో మరో ముద్రణ. అలా సూపర్‌ హిట్‌ అయిపోయింది. దానితో సీక్వెల్స్‌ తయారయ్యాయి. ‘‘కాఫీ టీ ఆర్‌ మీ గర్ల్‌స్‌ రౌండ్‌ ద వ(ర)ల్డ్‌ డైరీ’ (1969), ‘.. లే ఇట్‌ ఆన్‌ ద లైన్‌’ (1972), ‘..గెట్‌ ఎవే ఫ్రమ్‌ ఇట్‌ ఆల్‌’ (1974) యిలా వచ్చాయి. మొత్తం 50 లక్షల కాపీలు అమ్ముడు పోయాయనుకుంటాను. ఇంకా అమ్ముడుపోతూనే వుండాలి. టీవీ ఫిల్మ్‌ కూడా వచ్చింది. తెలుగులో ఎవరూ అనువదించినట్లు లేదు. ఈ రచయిత్రుల ఫోటోలు పుస్తకాల వెనక్కాల ఎప్పుడూ వేయలేదు. ఇంత రసవత్తరమైన జీవితం గడిపిన వీళ్లు ఎలా వుంటారా చూడాలనే కుతూహలం కలగడం సహజం కాబట్టి మొదటి పుస్తకం విడుదలైన కొత్తల్లో పబ్లిషర్లు వారిని పరిచయం చేసి పుస్తకాన్ని ప్రమోట్‌ చేయించారు. తర్వాత ఆ అవసరం పడలేదు. వారు మళ్లీ తెర మీదకు రాలేదు.

ఈ పుస్తకాన్ని ఆ రచయిత్రులు డొనాల్డ్‌ బెయిన్‌ అనే అతనికి అంకితం యిచ్చినట్లు ఉంటుంది. పుస్తకం వెలువడిన 35 ఏళ్లకు ఆ డొనాల్డ్‌ బెయిన్‌ నిజమేమిటో వెల్లడించాడు. ట్రూడీ బేకర్‌, రేచెల్‌ జోన్స్‌ అనే స్టూలు లేనే లేరు. ఆ పుస్తకాలన్నీ అతను రాసినవే. అతను ఘోస్ట్‌ రైటర్‌ (ఎవరైనా ప్రసిద్ధులకు వారి పేర రాసి పెట్టి డబ్బు పుచ్చుకునేవాళ్లు)గా చాలా పుస్తకాలు రాశాడు (2017లో మరణించేవరకు 40 ఏళ్ల కెరియర్‌లో మొత్తం రాసినవి 115) అతను అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కి పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసరుగా పనిచేసే రోజుల్లో ఒక పబ్లిషరు ‘మీ ఉద్యోగకారణంగా అనేకమంది స్టూలతో పరిచయం ఏర్పడి వుంటుంది కనుక, వాళ్ల జీవితానుభవాల పేరుతో పుస్తకం రాయండి’ అని అడిగాడు. ఓ యిద్దరు ఎయిర్‌హోస్టెస్‌లను తనతో కూర్చోబెట్టాడు కూడా. వాళ్లు తమవి, తమకు తెలిసున్నవాళ్లవి కొన్ని ఉదంతాలు చెప్పారు కానీ అవేమంత గొప్పగా లేవు.

దాంతో డొనాల్డ్‌ తను కన్నవి, విన్నవి, ఊహించినవి అన్నీ కలిపి పుస్తకం రాశాడు. ఆత్మకథ అంటేనే రంజుగా వుంటుంది కాబట్టి, పుస్తకంలో కొన్ని అనుభవాలు ట్రూడీ రాసినట్లు, కొన్ని రేచెల్‌ రాసినట్లు రాశాడు. పబ్లిషరు ఈస్టర్న్‌ ఎయిర్‌లైన్స్‌ నుంచి యిద్దరు స్టూలను బేరమాడి రచయిత్రులుగా చూపించాడు. (కథల్లో వాళ్లు ఏ ఎయిర్‌లైన్స్‌కు పని చేశారో ఎక్కడా వుండదు) తర్వాత వాళ్లని ఎవరూ పట్టించుకోలేదు. ఆ పుస్తకాల మీద రాయల్టీతో డొనాల్డ్‌ 17 ఏళ్ల పాటు హాయిగా బతికాడు. 2002లో ఆత్మకథ రాస్తూ తనే పుస్తకరచయితననే విషయం బయటపెట్టాడు. నేను పరిచయం చేసే ‘‘ఓర్‌ ఈజ్‌ ఇన్‌ ద ఐ ఆఫ్‌ బిహోల్డర్’’ అనే కథ సీరీస్‌లో నాలుగో పుస్తకం నుంచి తీసుకున్నాను. కథలో డ్రామాతో బాటు హాస్యమూ వుంది. బాడీ హ్యూమర్‌ అనవచ్చు కూడా. పెంగ్విన్‌ వాళ్లు యీ పుస్తకాలను ‘అడల్ట్‌ ఫిక్షన్‌’ కేటగిరీలో పెట్టారు. తర్వాత నన్నేమీ అనకుండా ముందే చెప్పేశా కాబట్టి యిక ముందుకు సాగుతారో లేదో మీ యిష్టం.

కేట్‌ అనే ఎయిర్‌హోస్టెస్‌ (స్టూ) కథ యిది. ఆమెకున్న సమస్య ఏమిటంటే ఎత్తయిన ఎద. దాన్ని చూసి విమానప్రయాణీకుల్లో ఎవడో ఒకడు ఏదో ఒకటి అనకమానడు. ఈమె పక్కనున్న వాళ్లతో చెప్పుకుని బాధ పడకామానదు. ఆ మాటకొస్తే ఆమె ఎక్కడికి వెళితే అక్కడ దానికి సంబంధించి వ్యాఖ్యలు చేస్తూనే వుంటారు. వారిని ఏమీ చేయలేదు కానీ బొత్తిగా తన చేత సేవలు చేయించుకుంటున్న ప్రయాణీకులు కూడా యిలా అంటూండడం ఆమెకు పిచ్చెక్కిస్తుంది. అవేళ విమానం గ్యాలీలో తన తోటి స్టూ రీటాతో అదే చెప్పింది. ‘‘27ఇలో ఉన్న వెధవ మళ్లీ నా రొమ్ముల గురించి ఏమైనా వెకిలిగా అనాలి, వేడివేడి బఠాణీల గిన్నె వాడి మొహం మీద ఒంపకపోతే అప్పుడడుగు’’ అని. కాస్సేపటికి వాడు అనా అన్నాడు. ఈమె వాడిని తిట్టా తిట్టింది. నీమీద పైవాళ్లకు ఫిర్యాదు చేస్తానంటే చేసుకో పోరా అంటూ తన సూపర్‌వైజర్‌ పేరు కూడా చెప్పేసింది.

చెప్పిందే కానీ గ్యాలీలోకి వచ్చి భోరున ఏడుపు లంకించుకుంది. ఏమిటీ బతుకు? నాకు వెకేషన్‌ కావాలి. లేకపోతే ఎవడేమంటాడో అన్న టెన్షన్‌తో చచ్చిపోయేట్లు ఉన్నాను అని. ఆమె సహచరి రీటా జాలిపడింది. ‘‘నాకూ వెకేషన్‌ కావాలి. ఇద్దరం కలిసి ఓ వారం ఎక్కడికైనా చెక్కేద్దాం.’’ అంది. వేడి వాతావరణం కారణంగా ఎక్కువ మంది టూరిస్టులు వెళ్లని అరిజోనా రాష్ట్రానికి వెళదామని యిద్దరూ నిశ్చయించుకున్నారు. రాజధాని ఐన ఫీనిక్స్‌లో దిగి ఇద్దరూ ఒక మోటల్‌లో బస చేశారు. రూములోకి రాగానే కేట్‌ ‘‘చూశావా, మనం లాబీలోకి వస్తూండగా ఎవరూ నా వాటి కేసి తిరిగి చూడలేదు. నాకు యిక్కడ బాగా నచ్చింది.’’ అంది. అప్పటికే కేట్‌ ఛాతీ గురించి వినివిని రీటాకు విసుగెత్తిపోయింది. ప్రయాణంలో అది తప్ప యింకో విషయం మాట్లాడలేదు కేట్‌. చిన్నప్పటి నుంచి మొగాళ్లు వాటిని రకరకాలైన పేర్లతో ఎలా పిల్చారో చెప్పుకునిచెప్పుకుని వాపోయింది.

అవన్నీ సహజమేలే అని ఓదార్చబోయింది రీటా. కానీ ‘నీకు నాలా ఉండి వుంటే తెలిసేది బాధ’ అని తీసిపారేసింది కేట్‌. రీటాకు ఏమనాలో తెలియలేదు. ఆమె కంటె తక్కువే కానీ మరీ అంత నాసిగా ఏమీ వుండదు తను. ఈమె ఫిర్యాదు చేస్తోందా, లేక ఆ రూపేణా తన గురించి గొప్పు చెప్పుకుంటోందా అన్న సందేహం కలిగిందామెకు. ఏమైతేనేం అరిజోనా మొగాళ్లు ఓ వారం నోరు మూసుకుంటే అంతే చాలు, నా వెకేషన్‌ సవ్యంగా గడిచిపోతుంది అనుకుంది. అయితే కాస్సేపటికే కేట్‌ ఓ చిన్న బికినీ కట్టుకుని స్విమ్మింగ్‌ పూల్‌కు తయారైంది. ఇద్దరూ ఈత కొట్టి తిరిగి వస్తూంటే ఓ నడివయసాయన తన పక్కనున్న కుర్రాడితో కేట్‌ గురించి ఏదో అన్నాడు. వాడు పెద్దగా చప్పుడు చేస్తూ లొట్ట వేశాడు. అంతే కేట్‌ రూముకి వచ్చేసి విరుచుకు పడిపోయింది - ‘‘ఇక్కడా అదే కథ. ఊరొదిలి వెళ్లిపోదాం.’’ అంటూ. రీటా నేను ఛస్తే కదలను అని ఠలాయించింది. చివరకు యిద్దరూ రాజీ పడ్డారు, ఆ వూళ్లోనే వేరే మోటల్‌కు మర్నాడు పొద్దున్నే మారిపోదామని.

ఆ రోజు రాత్రి అక్కడే డిన్నర్‌ హాలుకెళ్లి డ్రింక్స్‌ తీసుకున్నారు. కేట్‌ రిలాక్సయింది. పక్కనున్న ఒక యువకుడితో మాటలు కలిపింది కూడా. అతను అందగాడు, మంచి బట్టలేసుకుని, మర్యాదగా మాట్లాడుతున్నాడు. పేరు పాల్‌. అతని పక్కన మొహం మీద పొక్కులతో, కాస్త క్రూరుడైన కౌబాయ్‌లా కనబడుతున్న మధ్యవయస్కుడు హేరీ. అతనికి యీ కబుర్ల వ్యవహారం ఏమీ నచ్చటం లేదు. ఏమీ మాట్లాడకుండా మొహం చిట్లిస్తూ కూర్చున్నాడు. మాటల్లో అమ్మాయిలిద్దరూ తాము జనసమ్మర్దం లేని మోటల్‌కు మారిపోదా మనుకుంటున్నామని చెప్పారు. వెంటనే పాల్‌ ‘సూపర్‌స్టిషన్‌ మౌంటెన్స్‌ కింద సూపర్‌స్టిషన్‌ ఇన్‌ అని వుంది. మేం రేప్పొద్దున్న అక్కడికే వెళుతున్నాం. కావాలంటే మీరూ మా ట్రక్కులో రావచ్చు.’ అన్నాడు. కేట్‌ సరేననేసింది.

రూముకి రాగానే రీటా నిలదీసింది, ‘మొగాళ్లంటే అసహ్యం అంటూనే ముక్కూమొహం తెలియనివాళ్ల వెనక్కాల వెళ్లడానికి ఎలా తయారయ్యావ్‌’ అని. ‘ఇన్నాళ్లకు ఓ జెంటిల్మన్‌ కనబడ్డాడు. అతను నా ఛాతీకేసి ఒక్కసారి కూడా చూడలేదు.’ అంది కేట్‌. ..మూడు సార్లు అని రీటా సరిదిద్దినా విననట్లు నటించింది. కేట్ సంగతి ఎలా వున్నా వెళ్లడానికే నిశ్చయించుకుంది రీటా. పర్వతసానువులపై మోజుతో కాదు, పాల్‌తో పరిచయం పెంచుకోవాలని. రాత్రి పడుక్కోబోయేముందు కేట్‌ చేస్తున్న ఎక్సర్‌సైజ్‌ చూసి మందలించింది - అలాటివి చేస్తే బస్ట్‌లైన్‌ పెరిగి, నీ సమస్య మరింత పెద్దదవుతుంది తెలుసాని. కేట్‌ నోరు చప్పరించి ఊరుకుంది. ఈ అమ్మాయి వరస నాకేమీ అర్థం కావటం లేదనుకుంది రీటా నలభయ్యోసారి.

మర్నాడు పొద్దున్న ట్రక్కు చూస్తే ముగ్గురికే చోటుంది. ‘హేరీ డ్రైవ్‌ చేస్తాడు. ఒకరు మధ్యలో కూర్చోవచ్చు, ఇంకోరు నా ఒళ్లో కూర్చోవచ్చు.’ అన్నాడు పాల్‌. కేట్‌కు మగాళ్లంటే చికాకు కాబట్టి తనను పాల్‌ ఒళ్లో కూర్చోమంటుందని ఆశపడింది రీటా. తీరా చూస్తే కేట్‌, రీటాను మధ్యకు తోసి, పాల్‌ కూర్చున్నాక అతని ఒళ్లో కూర్చుంది. పైగా ఓ లూజ్‌ షర్టు వేసుకుని పై బొత్తాలు రెండూ విప్పేసింది. ఎడారిలో గంటసేపు సాగిన ప్రయాణంలో హేరీ నోరెత్తకుండా మొహం మొటమొటలాడిస్తూనే ఉన్నాడు. ఊరు చేరి ఇన్‌లో దిగాక సాయంత్రం అందరూ డ్రింక్స్‌కు కలిశారు. కేట్‌ వేసుకున్న డ్రస్సు పాల్‌ చూపులను తన ఛాతీవైపు ఆకర్షించడానికి ఉద్దేశించినదే అని గ్రహించాక, పాల్‌ చూపులు అక్కడ కాస్సేపు తచ్చాడడం గమనించాక రీటాకు కేట్‌ హిపాక్రసీపై ఏవగింపు కలిగింది.

అంతలో ఎవరూ ఊహించని విధంగా పాల్‌ తనతో పాటు ట్రక్కులో షికారుకి వెళదాం రమ్మనమని రీటాను అడిగాడు. కేట్‌కు యిది ఎదురుచూడని దెబ్బ. తన స్తనసంపద చూసి పాల్‌ మురిసిపోతాడనుకుంటే రీటా ఎగరేసుకుని పోవడం ఆమెకు మింగుడు పడలేదు. దానికే చికాకు పడుతూండగా మధ్యలో హేరీ ‘నా రూముకి వెళ్లి కబుర్లు చెప్పుకుందామా, అక్కడ ఫుల్‌ బాటిల్‌ ఉంది’ అంటున్నాడు. చికాకెత్తి రూముకి వెళ్లిపోయింది. వెళుతూవెళుతూ రిసెప్షన్‌లో ఉన్న ‘ద లాస్ట్‌ (పోయిన) డచ్‌మాన్స్‌ గోల్డ్‌మైన్‌’ అనే చిన్న పుస్తకాన్ని కొనుక్కుని, గదిలోకి వచ్చి ఏకబిగిన చదివింది.

దాని ప్రకారం సూపర్‌స్టిషన్‌ పర్వతాలో కొన్ని మైళ్ల మేర ఉన్న బంగారుగనులను స్థానికంగా ఉండే రెడ్‌ ఇండియన్స్‌ (అపాచీ లంటారు) కాపాడుతూండేవారు. మాంటెజుమా అనే అతను అవి ఎక్కడున్నాయో కనిపెట్టి, మ్యాప్‌ తయారు చేశాడు. ఆ మ్యాప్‌ చేతబట్టి మెక్సికోకు చెందిన పెరాల్టా ఫ్యామిలీ వాళ్లు 1840లో అరిజోనాకు వచ్చారు. అయితే జేకబ్‌ వాల్ట్‌జ్‌ అనే డచ్‌మన్‌ ఒకడు ఆ కుటుంబాన్ని నరికేసి, ఆ గని ఎక్కడుందో తెలుసుకున్నాడు. తన అంతిమ దినాల్లో తను ఆలనాపాలనా చూసుకున్న బోర్డింగ్‌హౌస్‌ యజమానురాలు, తన ప్రియురాలు ఐన జూలియా థామస్‌ అనే ఆమెకు ఆ మ్యాప్‌ యిచ్చాడు. మ్యాప్‌ యిచ్చాడు కానీ గని ఎక్కడుందో దానిపై గుర్తు పెట్టలేదు. దాంతో ఆ గనిని అతని పేర పిలవసాగారు. ఇది 1891లో జరిగింది.

ఏళ్లు గడుస్తున్నకొద్దీ ఎవరెవరో ఏవేవో మ్యాప్‌లు పట్టుకుని యిక్కడకు వచ్చి వెతుకులాడుతున్నారు. ప్రతివాళ్లు అక్కడ కనబడిన తనలాటి వారందరినీ అనుమానిస్తారు. అడ్డుకుంటారు. వీలైతే చంపేస్తారు. ఇలా యిన్ని దశాబ్దాలలో అనేక శవాలు అక్కడ కనబడ్డాయి. కొన్నిటి పక్కన బంగారు తునకలు కనబడడంతో బంగారం వుందన్న ఆశ చావటం లేదు. కొంతమంది యిక్కడే బిచాణా వేసి బంగారం వేటకు వచ్చినవాళ్లను వేటాడి, వాళ్లను దోచుకుని డబ్బు సంపాదించు కుంటున్నారు. ఇప్పటిదాకా బంగారం దొరికినవాళ్లెవరూ లేరు. కానీ ఆశ మాత్రం చావటం లేదు.

ఇదంతా చదివి, యిక్కడకు వచ్చి పడ్డావేమిటిరా భగవంతుడా అనుకుని కేట్‌ భయపడింది. కాస్సేపు మెలకువగా కూర్చుంది కానీ రీటా తిరిగి రాకపోవడంతో ఎదురు చూస్తూచూస్తూ నిద్రలోకి జారుకుంది. అర్దరాత్రి దాటాక రెండు గంటకు రీటా గదికి వచ్చేందుకు రెండు నిమిషాల ముందే మెలకువ వచ్చింది. తను వస్తూనే ‘లే, లే, నీకో విషయం చెప్పాలి.’ అన్నప్పుడు నిద్ర నటించింది. పాల్‌కి, తనకూ జరిగిన శృంగారకాండ గురించి వినే ఉత్సాహం ఏ మాత్రం లేదు, కానీ రీటా ఊరుకోలేదు. లేపి కూర్చోబెట్టి మరీ చెప్పింది - పాల్‌, హేరీ బంగారం వేటలో వచ్చారని, హేరీ దగ్గర అసలైన మ్యాప్‌ ఉందని, పాల్‌ కాస్త స్థితిమంతుడని, యీ వేట కార్యక్రమానికి అతనే ఫైనాన్స్‌ చేస్తున్నాడని, చూడ్డానికి అలా వున్నా హేరీ పెద్దమనిషని పాల్‌ అభిప్రాయమనీ! అమ్మాయిలిద్దరూ  వీటి గురించి కాస్సేపు మాట్లాడుకుని తర్వాత అది తమకు సంబంధం లేని విషయమని తేల్చుకుని, నిద్రకు ఉపక్రమించారు.

పడుక్కోబోయేముందు కుతూహలం ఆపుకోలేక కేట్‌ అడిగింది మీ యిద్దరూ కులాసాగా గడిపారా అని. రీటా ఉత్సాహంగా ‘ఓ, అతను చాలా మంచివాడు. నాకు యిష్టం ఏర్పడింది. అతనూ నన్ను లైక్‌ చేస్తున్నాడని అనుకుంటున్నాను.’ అంది. ఇక కేట్‌కు నిద్ర పట్టలేదు. ఎప్పుడో సూర్యోదయానికి కాస్త ముందు పడకేసింది. ఇద్దరూ లేచేసరికి మధ్యాహ్నమైంది. భోజనం ముగించాక, కాలి నడకన కొండ ఎక్కుదామని నిశ్చయించుకున్నారు. కారేసుకుని వస్తున్న అల్లరి కుర్రవాళ్లు కొందరు వాళ్లకు లిఫ్ట్‌ ఆఫర్‌ చేశారు కానీ వీళ్లు వద్దన్నారు. ఆకాశంలో హెలికాప్టర్‌ కనబడింది. రీటా ‘అది పాల్‌ అద్దెకు తెప్పించినదే అయి వుంటుంది. కాస్సేపటిలో వాళ్లకు బంగారం చిక్కుతుంది.’ అంది. హెలికాప్టర్‌ కిందకు దిగుతూండగా తుపాకీ కాల్పులు వినబడితే పాల్‌కు ఏమవుతుందో అని కంగారు పడింది కూడా. కానీ కేట్‌ ఏమీ చలించలేదు. భుజాలు ఎగరేసి ఊరుకుంది.

కాస్సేపు పోయాక వాళ్లు వేరే దారిలో కొండ దిగసాగారు. దారిలో ఒక పొద లోంచి బూట్లు కనబడ్డాయి. లోపల ఎవడో మనిషి పడిపోయి వున్నాడేమో. పారిపోదామా, తొంగి చూద్దామా అని కాస్సేపు సంశయించి, మానవసహజమైన కుతూహలంతో పొదలోకి వెళ్లారు. అతుకుబొంతలాటి బట్టల్లో ఒక ముసలాయన పడివున్నాడు. ‘‘వీడు చచ్చాడు’’ అంది రీటా. ‘‘నేనలా అనుకోవటం లేదు.’’ అన్నాడతను పీల గొంతుతో, అంగుళం కదలకుండానే. ‘‘అయ్యో పాపం, ఎవరో నిన్ను చావగొట్టి, గొంతు కోసేశారే’’ అంది కేట్‌. ‘‘అది నాకు తెలియదా?’’ అని విసుక్కున్నాడతను. కాస్త లేవదీయండి. కూర్చుంటా అన్నాడు. ఇద్దరూ సాయపడితే ఓ బండనానుకుని కూర్చున్నాడు. ‘‘ఏదైనా కారు ఆపి, నిన్ను ఆసుపత్రికి తీసుకెళతాం’’ అన్నారు అమ్మాయిలు. అక్కరలేదన్నాడు ముసలాయన.

మాటలు కూడబలుక్కుంటూ చెప్పాడు - ‘‘వెధవలకి గొంతు కోయడం కూడా రాదు. అది కాదు సమస్య. ఇప్పటికే రెండు సార్లు నాకు హార్ట్‌ఎటాక్‌ వచ్చింది. ఇప్పుడు మళ్లీ వస్తోంది. నా ఆయుర్దాయం కొద్ది క్షణాలే. మీరు నాకు చేసే సాయం ఏమీ లేదు. ఆరేళ్లగా బంగారం కోసం యిక్కడిక్కడే తిరుగుతూ వచ్చాను. కష్టపడి మ్యాప్‌ తయారుచేశాను. బంగారం సరిగ్గా చేతికి వచ్చేసమయానికి చావు యిలా ముంచుకు వచ్చింది. అనుకోకుండా మీరు కనబడ్డారు. ఆ మ్యాప్‌ నా కోటు జేబులోంచి తీసుకోండి. మీరు ఆ బంగారం తీసుకుని బోస్టన్‌లో ఉన్న మా చెల్లెలికి కొంత, నేను చదువుకున్న స్కూలుకి కొంత పంపించండి.’’ అన్నాడు. ఇద్దరు అమ్మాయిలు తల వూపాక, అతి కష్టం మీద పైకి లేచి రెండు చేతులా కేట్‌ వక్షాన్ని అదిమి, తృప్తిగా చిరునవ్వు నవ్వి, అంతలోనే కళ్లు తేలేశాడు. (ఫోటో - మొదటి పుస్తకం, అజ్ఞాత రచయిత డొనాల్డ్‌ బెయిన్‌)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?