cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: టిడిపి కొంపముంచిన నిమ్మగడ్డ టైమింగ్

ఎమ్బీయస్: టిడిపి కొంపముంచిన నిమ్మగడ్డ టైమింగ్

పేకాటలో ఓ మాట అంటూంటారు. ‘ముక్క వేసీ చెడగొట్టాడు, వెయ్యకా చెడగొట్టాడు’ అని. అలా టిడిపి వాళ్లు నిమ్మగడ్డ రమేశ్ గారి గురించి అనుకుంటూ వుండాలి. గత ఏడాది జగన్ ఎన్నికలు పెడతానన్నపుడు పెట్టనివ్వక టిడిపిని దెబ్బ తీశారు. ఎందుకంటే వాయిదా వేయగానే కరోనా వచ్చిపడింది. చాలా ఇన్నోవేటివ్‌గా జగన్ నియమించిన వాలంటీరు వ్యవస్థ పూర్తిగా అక్కరకు వచ్చింది.

వాలంటీర్లకు, సామాన్య పౌరులకు అనుబంధం విపరీతంగా పెరిగిపోయి, అదంతా ఎన్నికల సమయంలో వైసిపికి ప్లస్ అయింది. పైగా మొదట్లో కరోనాను సాధారణ జ్వరంగా కొట్టిపారేసినా జగన్ త్వరలోనే మేలుకొని, విపరీతంగా టెస్టింగులు చేయించి, కరోనాను బాగా కట్టడి చేసిన రాష్ట్రాలలో ఆంధ్ర ఒకటి అనిపించుకున్నాడు. కరోనా సంక్షోభానికి ముందే ఎన్నికలు జరిగి వుంటే జగన్‌కు యిప్పుడున్నంత గుడ్‌విల్ వుండేది కాదు.

కరోనా యింకా పూర్తిగా పోకముందే నిమ్మగడ్డ ఎన్నికలు పెడతానని మొండికేశారు. ఆయన ఇసిగా వుండగా ఎన్నికలు జరగడం తమ ప్రతిష్ఠకు భంగం అనుకున్న వైసిపి పంతానికి పోయి, అడ్డుకుంది. చివరకు కోర్టు మొట్టికాయలు వేయడంతో గతిలేక సరేనంది. తీరా చూస్తే పంచాయితీ ఎన్నికలలో వైసిపికే 80% సీట్లు వచ్చాయి. అప్పటికైనా నిమ్మగడ్డ తగ్గాలా? మునిసిపల్ ఎన్నికలు పెడతానని మారాం చేశారు. పెట్టారు. ఏమైంది? వైసిపికే 83% వచ్చాయి. 75 మునిసిపాలిటీల్లో 73టిలో గెలిచి మరొకటి మేనేజ్ చేశారు. 12 కార్పోరేషన్లలో 11 వచ్చేశాయి. ఇంకోటి కూడా వచ్చేసేట్లే వుంది. పంచాయితీవి పార్టీరహితం కాబట్టి ఎవరికి వారు 50%, 27% అని చెప్పేసుకోగలిగారు. మా బలం చూసి దడిసి, వైసిపి ఎన్నికలంటే భయపడుతోంది అని చెప్పుకోగలిగారు. మునిసిపల్ ఫలితాలు తెర చింపేసి, ఉన్న పరిస్థితిని స్పష్టంగా, అందరికీ తెలిసేట్లు చేశాయి.

నిమ్మగడ్డ యిప్పుడీ మునిసిపల్ ఎన్నికలు పెట్టనేల? మా పరువు తీయనేల? మేం బలహీనంగా వున్నామని ఎక్స్‌పోజ్ చేయనేల? ఇలా అయితే మునిగే నౌక అనుకుని మా పార్టీ విడిచి అందరూ వెళ్లిపోతే యీయన వెనక్కి తెచ్చియిస్తాడా? అని ప్రతిపక్షాలు పళ్లు నూరుకుంటూండవచ్చు. ‘అయినా మార్చి నెలాఖరుకి పదవీకాలం ముగిసేలోగా అన్నిరకాల ఎన్నికలూ పూర్తి చేయాలన్న పంతం దేనికి? ఈయన కాకపోతే మరొకడు చేస్తాడు. అప్పగించిన పని చేస్తే చాలు కదా, ఏదో తనే ప్రజాస్వామ్య పరిరక్షకుడిలా పోజు కొట్టి అర్జంటుగా అన్నీ చేయడం దేనికి? ఈయన తర్వాతివారిని వైసిపియే సిఫార్సు చేస్తుంది కాబట్టి, యీ ఫలితాలు అప్పుడు వచ్చినా ఇసి, సిఎం కుమ్మక్కయ్యారని చెప్పుకుని కాలక్షేపం చేసేవాళ్లం. ఇప్పుడు కత్తికట్టిన కమిషనర్ హయాంలోనే జరిగిన ఎన్నికలు కాబట్టి ఏమీ అనలేకపోతున్నాం. ఇలా అయితే మా పార్టీ కాడర్‌లో నైతిక స్థయిర్యం నింపడం ఎలా? గట్టిగా ఏమైనా అనాలన్నా, కేసు పెట్టాలన్నా నిన్నటిదాకా మనం ఆకాశానికి ఎత్తేసిన వ్యక్తే కదా. అయినా ఫర్వాలేదని కోర్టుకెళితే ఖరీదైన లాయర్లను పెట్టుకుని వాదించుకునే సత్తా ఆయనకుందని, మోతుబర్లయిన ఎంపీలతో స్నేహం వుందనీ యిప్పటికే నిరూపించుకున్నాడు.’ అని పరిపరివిధాలా చింతిస్తూండవచ్చు.

కనీసం జిల్లా పరిషత్ ఎన్నికలైనా పెట్టకయ్యా నాయనా అన్నారో ఏమో ఆయన సడన్‌గా చప్పబడ్డారు. ఎన్నికలు జరగకపోతే ఆకాశం బద్దలై పోతుంది, భూమి కృంగిపోతుంది అన్నంత బిల్డప్ యిచ్చినాయన, చురుకుచురుగ్గా ఎడాపెడా నిర్ణయాలు తీసుకుని, సొంతంగా యాప్‌లు చేయించి, వాటి సెక్యూరిటీ టెస్టు చేయించడానికి కూడా వ్యవధి లేకుండా రంగంలోకి ఉరికిన మనిషి, యివాళ లీవు పెట్టి టూరుకి వెళతానంటున్నారట. అదేం చోద్యమో! ఇప్పుడు వైసిపికి ఆరాటంగా వుంది. ఆ ఎన్నికలు కూడా యీయన హయాంలోనే పూర్తి చేసేస్తే ఓ పనైపోతుంది కదాని. అది మొదలుపెట్టగానే నిమ్మగడ్డ పెత్తనం చలాయించడం మొదలుపెట్టగానే ఎలాగూ కోర్టుకి వెళతారనుకోండి.

నిమ్మగడ్డకు కానీ, ప్రతిపక్షాలకు కానీ ఏకగ్రీవాల మీదనే కదా అనుమానం. ఈ ఫలితాలతో అది తీరిపోయింది. ‘22 నెలలైనా జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఇప్పుడు ఎన్నికలలో నిలబడినా నెగ్గం. అనవసరంగా డబ్బు ఖర్చు, శ్రమ వ్యర్థం. దానికి బదులు ఆ శక్తియుక్తులు అసెంబ్లీ ఎన్నికలదాకా దాచుకోవడం మేలు కదా.’ అని ప్రతిపక్ష అభ్యర్థులు అనుకుని వుంటారని తేటతెల్లమైంది కదా. హైదరాబాదులో కూర్చుని ఊహాగానసభలు చేసే వారి కంటె క్షేత్రస్థాయిలో వున్నవారికి ఎక్కువ తెలుస్తుంది కదా. మతమార్పిడులు, ఆలయాలపై దాడులు వంటివి పెద్ద అంశాలై పోయి జగన్ మెడకు గుదిబండ లవుతాయనుకున్నారు. అయ్యాయా? మతమార్పిడులు ఎప్పుడూ జరుగుతూనే వున్నాయి. ఇప్పుడు ఎక్కువ జరిగినట్లు గణాంకాలు చూపిస్తే తప్ప నమ్మలేం. జరిగినా, వాటికి జగన్ ప్రోద్బలం వుందని నిరూపించ గలగాలి. అది జరిగేనా?

ఇక ఆలయాలపై దాడులు! వేలాది గుళ్లు వేల సంవత్సరాలుగా వున్న అదేమిటో యీ మధ్యే దాడులన్నీ ఒక్కసారిగా టపటపా జరిగాయి. వాటిపై ఆందోళన చేసి బిజెపి, టిడిపి లాభపడదామని చూశాయి. అధికార పార్టీ చేయించిందని అన్నవారితో వైసిపి వారు ‘మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చుకునే పని మేమే ఎందుకు చేయిస్తాం?’ అన్నారు. క్రైస్తవ శిలువ ఒకటి నెత్తి మీద యిప్పటికే వేలాడుతూండగా జగన్ కావాలని యివి చేయించి, ప్రతిపక్షాలకు కొత్త ఆయుధాన్నిస్తాడా? ‘టిడిపి వాళ్లు పార్టీ సభలో తీర్మానం చేసి, యివి చేపట్టారని అనుకోలేం. ఇదేదో తాగుబోతుల పని అయివుంటుంది.’ అన్నారు ఉండవల్లి. అలా అయితే ఆ పీరియడ్‌లోనే తాగుబోతులు గుళ్లకి వెళ్లారని, యీ మధ్య మళ్లీ వెళ్లడం మానేశారనీ అనుకోవాల్సి వస్తుంది.

ఎందుకంటే సిసిటివిల భయంతోనే దాడులు ఆగాయంటే నమ్మలేం. నూటికి నూరు శాతం గుళ్లన్నిటికీ అష్టదిక్కులా సిసిటివిలు పెట్టారని, పెట్టినా అవన్నీ పెర్‌ఫెక్ట్‌గా పని చేస్తున్నాయనీ అనుకోవడానికి లేదు. ఎన్నో కెమెరాలున్న దుర్గ గుడిలోనే అక్రమాలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. మరి యీ సంఘటనలు ఎందుకు మొదలయ్యాయి? ఎందుకు ఆగిపోయాయి? ముక్కులు విరక్కొట్టినా, మూతులు పగలకొట్టినా రాజకీయంగా గిట్టుబాటు కావటం లేదనా? ఆ దాడులు జరిగిన ఊళ్లల్లో ఏ పార్టీ నెగ్గిందో తెలిస్తే స్థానిక ప్రజలు ఎవరి మాటలు విశ్వసించారో అర్థమయ్యేది. ఏది ఏమైనా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అధికార పార్టీకి, ఆలయవిధ్వంసాలకు లింకు లేదని భావించినట్లు తోస్తోంది.

ఎన్నికల ఫలితాలు వెలువడగానే ప్రతిపక్ష నాయకులు, స్వతంత్రంగా వున్నామని చెప్పుకునే పరిశీలకులు కొందరు ‘ఇది ముందే వూహించినదే! స్థానిక ఎన్నికలలో అధికార పక్షం గెలుపొందడం సర్వసాధారణంగా జరిగేదే’ అని నోరు చప్పరించారు. ముందే వూహించి వుంటే ఎన్నికలంటే భయపడి వాయిదా వేయడానికి చూసిందని ఎందుకన్నట్లో మరి! చరిత్ర తిరగేసి చూస్తే అధికార పార్టీ నెగ్గిన సందర్భాలూ వున్నాయి, ఓడిన సందర్భాలూ వున్నాయి. నెగ్గినప్పుడు కూడా సాధారణంగా 65-70% సీట్లు గెలుస్తారు. వైసిపి అధికారంలోకి వచ్చి 22 నెలలైంది కాబట్టి ప్రభుత్వవ్యతిరేకత ప్రారంభమై 70 లోపే రావాలి. కానీ అలా జరక్కుండా యిలా 83% గెలవడం విశేషమే. దాన్ని విస్మరించకూడదు.

ఎన్నికలలో అక్రమాలు జరిగాయి. నామినేషన్ వేయనీయలేదు. ఒత్తిడి చేశారు. అధికారులు వారికి సహకరించారు వంటి ఆరోపణలు ఎలాగూ వచ్చాయి. అలాటివి ఏ 5-10% జరిగితే జరిగి వుండవచ్చు. కానీ ఎంతైనా ఎప్పుడూ జరిగేవాటి కంటె యిలాటివి యీ సారి తక్కువే జరిగాయనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఫ్యాక్షనిస్టు కుటుంబం వాడు, నా ప్రాణాలకే హాని తలపెట్టాడు అంటూ కేంద్ర హోం మంత్రికి ఉత్తరాలు రాసిన నిమ్మగడ్డే అదే ముఖ్యమంత్రి ఆధ్వర్లంయో పంచాయితీ, మునిసిపల్ ఎన్నికలు భేషుగ్గా జరిగాయని ప్రకటించాల్సి వచ్చింది.

మొత్తం మీద మూడ్ అధికార పార్టీకే అనుకూలంగా, అదీ తీవ్రస్థాయిలో వుందని, ఒప్పుకోక తప్పని పరిస్థితి. ‘అసెంబ్లీ ఎన్నికలలో 151 సీట్లు వచ్చిన కారణమేమిటంటే ‘ఒక్క ఛాన్స్ యిమ్మని బతిమాలుకున్నందుకు పోనీ కదాని యిచ్చారు’ అని చెప్పుకుంటూ వచ్చారు. మరి యిప్పుడేమీ ఒకటీ, అరా అనలేదే! అయినా నూటికి 83 కట్టబెట్టారే! ఇలా అడిగితే ‘ఇదంతా సంక్షేమ పథకాల వల్లనే! మాకు ఓటేయకపోతే మీకు పథకాలు వర్తింపచేయకుండా చేస్తామని ఎమ్మెల్యేలు బెదిరించారు. ప్రజలు భయపడి వాళ్లకు ఓటేశారు.’ అనే పల్లవి దాదాపు అన్ని ప్రతిపక్షాలూ అందుకున్నాయి.

అదే నిజమైతే వైసిపికి 53% ఓట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి? 47% మందికి పథకాలు అక్కరలేదా? లేక వాళ్లకు భయం లేదా? ‘అబ్బే, వారిలో పథకాల వలన లబ్ధి పొందనివారు కూడా వుంటారు కదా’ అంటే అలాటి బెదిరింపులకు (ఉంటే), ఓటింగుకి లింకు లేదన్నమాట. గతంలో చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేయలేదా? అయినా ప్రజలు ఓడించలేదా? దుబ్బాక ఉపయెన్నికలో, కార్పోరేషన్ ఎన్నికలలో తెరాసను ఓడిద్దామనుకున్నపుడు పథకాలు ఆపేస్తారన్న భయం ఓటర్లకు లేదనుకోవాలా? అందుచేత యీ బెదిరింపుల కబుర్లు వట్టి కబుర్లే అనుకోవాలి.

సాధారణంగా పట్టణ, నగర వాసులు ఎప్పుడూ అధికార పార్టీ పట్ల అసంతృప్తితో వుంటారు. అలాటిది మునిసిపల్, కార్పోరేట్ ఎన్నికలలో కూడా 53% మంది దానికి ఓటేశారంటే విశేషమే. 2019 ఎన్నికలతో పోలిస్తే 3%కు మించి పెరిగిందనే లెక్క చెపుతున్నారు. అది పల్లెల్ని కూడా కలుపుకుని చెప్పిన అంకె. 2019లో అర్బన్ ఓటింగు శాతం కరక్టుగా తెలిస్తే ఈ తేడా ఏ 4-5% కో చేరుతుందని నా సందేహం. అలాగే టిడిపికి 9% ఓట్లు మాత్రమే తగ్గాయంటున్నారు. బాబుకి అర్బన్ మిడిల్‌క్లాస్ ఓటు బ్యాంకు ఎప్పుడూ పటిష్టంగా వుంది. 2019 అర్బన్ ఓటింగు శాతానికి యిప్పుడు వచ్చిన 30%కి తేడా చూస్తే ఏ 12-13% యో వుండవచ్చని నా అంచనా. బిజెపికి అర్బన్ ఓటర్లే బలం. గ్రామాల్లో క్యాడరే లేదు. మరి అర్బన్‌లోనే 2.5% లోపు వచ్చిందంటే అన్ని ప్రాంతాలూ కలిపితే సరాసరి శాతం దానిలో సగానికి పడిపోతుందేమో!

ఇలాటి పరిస్థితిలో జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా జరిపి జగన్నాథ రథ చక్రాల కింద ప్రతిపక్షం నలిగి పచ్చడవుతోందని చాటడం తనకు అవసరమా? అని నిమ్మగడ్డ ఆలోచిస్తూండవచ్చు. ఎవరికీ కాకుండా, ఎవరి మెప్పూ పొందకుండానే కెరియర్ ముగుస్తోందేనన్న చింత ఆయన్ను ముంచెత్తుతూండవచ్చు.  అందుకే ఆయనకు అర్జంటుగా లీవు తీసుకుని టూర్‌కు వెళ్లి ‘నేను నిమిత్తమాత్రుణ్నే, నా డ్యూటీ నేను చేశాను. వారి గెలుపోటములు నా చేతిలో లేవు కదా’ అని తనకు తనే గీతోపదేశం చేసుకోవాలనిపిస్తోంది కాబోలు. ప్రజాస్వామ్యమంటారా? దానికేముంది? ఇంకో నెల్లాళ్లు ఆలస్యమౌతుంది, అంతేగా! తన చేతుల మీదుగా జరిగే అనర్థం యింతటితో ఆగితే, టిడిపి అక్షింతల వర్షం కూడా ఆగుతుందనే ఆశ ఆయనది.

ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2021)

mbsprasad@gmail.com

లోకేష్ సవాల్ చూస్తే.. బ్రహ్మానందం గుర్తొస్తున్నాడు

దేవి సిక్స్ కొడితే...నేను రెండు సిక్సులు కొడ‌తా

 


×