Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: బిహార్‌లో ఈడీ దాడులెప్పుడు?

ఎమ్బీయస్:  బిహార్‌లో ఈడీ దాడులెప్పుడు?

బిహార్‌లో బిజెపి తన కాళ్ల కింద తివాచీ లాగేసే లోపు నీతీశే పల్టీ కొట్టి మరో తివాచీపైకి లంఘించాడు. దెబ్బకి బిజెపికి అధికార వియోగం సంభవించింది. ఇక బిజెపి నాయకులు, వారి అనుకూల మీడియా నీతీశ్‌కు పల్టూ రామ్ అనే బిరుదు ప్రసాదించి, ఏకేస్తున్నారు. అతను అటు నుంచి యిటు పల్టీ కొట్టినపుడు వారికి యీ వర్ణనలేవీ గుర్తుకు రాలేదు. తాము పడగొట్టేవరకూ ఆగకుండా తమనే కంగు తినిపించడమేమిటని వారికి అక్కసుగా ఉంది. ప్రతీ రాష్ట్రంలోనూ ‘ఇక్కడా మాకు శిందేలున్నారు’ అని బెదిరిస్తున్న బిజెపికి ‘ప్రతీ ముఖ్యమంత్రీ ఉద్ధవ్ కాదు, ముంచుకొచ్చేదాకా ప్రమత్తంగా ఉండే రకాలు అన్ని చోట్లా లేరు’ అనే పాఠాన్ని నీతీశ్ నేర్పాడు.

బిజెపితో వచ్చిన యిబ్బంది ఏమిటంటే తనతో పొత్తు కలిపిన పార్టీలకు తమ కంటె భిన్నమైన సిద్ధాంతాలుండకూడ దనుకుంటుంది. ఇద్దరివీ ఒకే సిద్ధాంతాలైతే వేరేవేరే పార్టీ లెందుకు? రెండూ విలీనమై పోవచ్చు కదా. సంకీర్ణ భాగస్వామి అంటే కొన్ని విషయాలలో అభిప్రాయం కలుస్తుంది, కొన్నిట్లో కలవదు అనే కదా అర్థం. అందుకనే యిద్దరూ కలిసి పరస్పరం అంగీకరించిన విషయాలపై కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ అని రాసుకుని, దాన్ని ప్రజల ముందు పెట్టి వారి ఆమోదంతో అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చాక సంకీర్ణానికి నాయకత్వం వహిస్తున్న పార్టీ ఏదైనా కొత్త పాలసీని అమలు చేద్దామనుకుంటే తన భాగస్వామ్య పక్షాలతో సంప్రదించి, అందరూ ఆమోదించిన దాన్నే అమలు చేయాలి. బిజెపికి యీ సంకీర్ణధర్మం అర్థం కావటం లేదు. సాగు బిల్లులు పెడదామనుకున్నపుడు అకాలీ దళ్‌ను అడగలేదు. అందుకే అది బయటకు నడిచింది.

అలాగే కులపరంగా జనగణన, అగ్నిపథ్, సిఏఏ వంటి అనేక విషయాల్లో మరో భాగస్వామి అయిన జెడియు అభిప్రాయాలు అడగలేదు. తమ చిత్తం వచ్చినట్లు చేసేసి, ఒప్పుకుని తీరాల్సిందే అంటోంది. ఇక ఆ కాడికి సంకీర్ణం అనే మాట ఎందుకు? ఇది భరించి, భరించి చివరకు జెడియు సంకీర్ణం లోంచి బయటకు వెళ్లిపోతే ప్రజలిచ్చిన తీర్పుని వంచించాడు అంటున్నారు. మేము కలిసి ఆలోచించుకుని, ఒక్కమాటపై నిలిచి పాలిస్తాం అని ప్రజలకు చెప్పి తర్వాత ఏకపక్షంగా పాలిస్తే అది ప్రజలిచ్చిన తీర్పుని వంచించినట్లు కాదా? వారి మానిఫెస్టోలో బిసి కులగణన చేయం, అగ్నిపథ్ పెడతాం అని ఏమైనా చెప్పారా? మహారాష్ట్రలో శివసేనతో కలిసి పోటీ చేసినప్పుడు మానిఫెస్టోలో ముఖ్యమంత్రి పదవి మాకే దక్కాలని పట్టుబడతాం, శివసేన ఒప్పుకోకపోతే ఎన్సీపీని చీల్చి ఫిరాయింపుదారుల మద్దతుతో రాత్రికి రాత్రి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అని చెప్పారా?

ఇదంతా రాజకీయక్రీడ. దీనిలో ప్రజల తీర్పు వంటి పెద్దపదాలు వాడడం అనవసరం. దేశాన్ని కాంగ్రెస్ ముక్త్ చేయడమే కాక, బిజెపియేతర ఏ పార్టీ కూడా మనజాలని పరిస్థితిని కల్పించడమే బిజెపి అజెండా. ప్రలోభాలు, బెదిరింపులు, మార్గాంతరం లేకుండా చేయడాలు.. ఏదో ఒకటి చేసి ఫిరాయింపులతో మెజారిటీ సమకూర్చుకోవడం, అలా లేని చోట ఫిరాయింపులతో అవతలి పార్టీని చీల్చి నేలకూల్చడం, దేశమంతా యిదే ఆట. జాతీయ పార్టీ ఐన కాంగ్రెసు ఎలాగూ ఆత్మహత్య చేసుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో బిజెపిని ఎదిరిస్తున్న ప్రాంతీయ పార్టీలను కూడా స్వాహా చేసేస్తే ప్రాంతీయ పార్టీలనేవే ఉండవు. చైనాలాగ ఒకటే పార్టీ పాలిస్తుంది. ఆ పార్టీలో కూడా నాయకద్వయం ఏం చెపితే అది నడుస్తుంది. ఒకప్పుడు బిజెపికి బలం కలక్టివ్ లీడర్‌షిప్. థింక్ ట్యాంక్. ఇప్పుడది పోయింది. ఏకచ్ఛత్రాధిపతి ఏలుతున్నాడు. జీహుజూర్ అనేవారికి పదవులు దక్కుతున్నాయి. అనలేనివారు దూరంగా నిలబడి విస్తుపోయి చూస్తున్నారు.

విస్తరించడానికి, యితర పార్టీలను లుప్తం చేయడానికి బిజెపి ఏ సూత్రాలనూ పాటించటం లేదు. దానితో శత్రుత్వం పాటించినవాటిని మాత్రమే పీచమణుస్తుందని సూత్రీకరించడానికి లేదు. స్నేహంగా ఉన్నా ప్రమాదం తప్పదు. దానికి ఉదాహరణ బిహార్‌లోని వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ ఉదంతాన్ని చెప్పుకోవచ్చు. అది బిహార్‌లోని ఎన్‌డిఏ ప్రభుత్వంలో బిజెపితో పాటు భాగస్వామి. దాని నాయకుడు ముఖేశ్ సహానీ మంత్రి కూడా. అయినా అతని వెనక్కాల ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలను బిజెపి తమ పార్టీలోకి లాగేసుకుంది. 2020 ఎన్నికలలో ఎన్‌డిఏ కూటమిలో ఉన్న ఆ పార్టీ నాలుగు సీట్లు గెలిచింది. ఎమ్మెల్సీగా ఉన్న ముఖేశ్ మంత్రి అయ్యాడు.

ఆ నలుగురిలో ఒకరు 2021 నవంబరులో చనిపోగా వచ్చిన ఉపయెన్నికలో బిజెపి తన అభ్యర్థిని నిలిపింది. ఆ సీటు మాది కదా అంటూ ముఖేశ్ తన పార్టీ అభ్యర్థిని నిలిపాడు. నీ కింత ధైర్యమా అని బిజెపి అతనికి మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలనూ ఉపయెన్నికకు ముందే తన పార్టీలో కలిపేసుకుంది. ఫిరాయించిన ముగ్గురూ రాష్ట్రహితాన్ని కోరే ఫిరాయించామని చెప్పారనుకోండి. ప్రజలిచ్చిన తీర్పును వంచించినట్లు వాళ్లేమీ ఫీలవలేదు. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయటం లేదు. కొసమెరుపేమిటంటే ఏప్రిల్‌లో జరిగిన ఆ ఉపయెన్నికలో రెండు పార్టీలూ ఓడిపోయి ఆర్‌జెడి నెగ్గింది.

మహారాష్ట్ర ఉదంతం తర్వాత బిజెపి సామ్రాజ్యవాదం అందరికీ తేటతెల్లమైంది. ఎదుటి పార్టీలో ముఖ్యమైన నాయకుణ్ని వెతికి పట్టుకుని ప్రలోభపెట్టి, ఆ పార్టీని చీల్చేందుకు సకల సౌకర్యాలు సమకూర్చే వ్యూహం అందరికీ అర్థమైంది. బిజెపి తన పార్టీకీ ఆ గతి పట్టిస్తుందని నీతీశ్ భయపడి ముందు జాగ్రత్త చర్యగా కూటమిలోంచి తనే బయటకు వచ్చేశాడు. వాళ్లిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడానికి కొన్ని కారణాలున్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి, జెడియుతో పొత్తు పెట్టుకున్నా జెడియు సీట్లను తగ్గించడానికి చిరాగ్ పాశ్వాన్ ద్వారా చేయని ప్రయత్నం లేదనేది బహిరంగ రహస్యం. కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఐన నీతీశ్‌పై చిరాగ్ ఎంత విరుచుకు పడినా, అతని పార్టీ అభ్యర్థి ఉన్నచోట తన అభ్యర్థిని నిలిపి, ఓడించడానికి ప్రయత్నించినా బిజెపి వారించలేదు.

ఇది నీతీశ్‌ను, జెడియును చాలా బాధించింది. ముఖ్యమంత్రిగా నీతీశ్‌ సామర్థ్యం టర్మ్‌టర్మ్‌కీ తగ్గుతూ వస్తోంది. కానీ అతనికి ప్రత్యామ్నాయం ఎవరూ కనబడటం లేదు. మహిళల్లో, అట్టడుగు వర్గాల్లో అతనిపై ఆదరణ తగ్గలేదు. ఇతర పార్టీల్లో అతనితో వ్యక్తిగతంగా పోటీ పడగల నాయకుడు ఎవరూ లేరు. అందుకే బిజెపి విధిలేక అతన్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపింది. అతనికి, మోదీకి పరస్పరం పడదని, యిద్దరికీ విధిలేక పొత్తు పెట్టుకోవలసి వచ్చిందనీ అందరికీ తెలుసు. ఎన్నికలలో బిజెపి ప్రయత్నాలు ఫలించి, జెడియుకు సీట్లు తగ్గి, 43 స్థానాలతో మూడో స్థానంలో నిలిచింది. బిజెపికి 74 రాగా, యువ నాయకుడు తేజస్వి నాయకత్వంలోని ఆర్జెడికి అందరి కంటె ఎక్కువగా 75 వచ్చాయి. తమకు ఎక్కువ సీట్లు వచ్చినా బిజెపి నీతీశ్‌నే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి, కీలకశాఖలన్నీ తను తీసుకుని నీతీశ్‌ను కీలుబొమ్మగా చేయసాగింది.

2021 నవంబరులో రాసిన ‘‘లాలూతో కాంగ్రెసు చెడగొట్టుకున్న విధం’’ అనే వ్యాసంలో నీతీశ్, బిజెపిల మధ్య గొడవలు ఎలా జరుగుతున్నాయో వివరించాను. నీతీశ్‌కు సన్నిహితంగా వున్న సుశీల్ మోదీని బిజెపి రాజ్యసభకు పంపి, తన పార్టీ నుంచి యిద్దరు ఉపముఖ్యమంత్రులను నియమించింది. వారిలో ఒకరైన తార్‌కిశోర్ ప్రసాద్‌కు ఫైనాన్స్, కమ్మర్షియల్ టాక్సెస్, అర్బన్ డెవలప్‌మెంట్, హౌసింగ్ వంటి ముఖ్యమైన శాఖలు యిప్పించింది. ఈ తార్‌కిశోర్‌కు రాజకీయంగా చాలా ప్రణాళికలున్నాయి. నీతీశ్ తన పాలనలో రాజకీయ నాయకుల ప్రమేయం తగ్గించి, అధికారులకు పైచేయి కల్పించాడు. తార్‌కిశోర్ ‘అధికారులు మా మాట వినాల్సిందే’ అన్నాడు. ప్రతి మంగళవారం జనతా దర్బార్ ఏర్పరచి ముఖ్యమంత్రి కంటె ఎక్కువ పాప్యులర్ అవుదామని చూశాడు. అసెంబ్లీ స్పీకరుగా ఉన్న బిజెపి నాయకుడు విజయ కుమార్ సిన్హాను ఆ పదవి నుంచి తీసేద్దామని నీతీశ్ చూస్తే బిజెపి ఒప్పుకోలేదు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయంటూ నీతీశ్‌పై విసుర్లు విసురుతూ వచ్చాడు.

జాతీయ స్థాయిలో కూడా అభిప్రాయభేదాలు తక్కువేమీ లేవు. ఉత్తర ప్రదేశ్ జనాభా నియంత్రణ బిల్లును నీతీశ్ బహిరంగంగా విమర్శించాడు. ఇలాటి చట్టాల కన్నా బాలికలలో విద్యాభ్యాసం ప్రోత్సహిస్తే జనాభా అదుపు సాధ్యమని హితవు చెప్పాడు. అంతేకాదు, జనాభాగణనను కులపరంగా చేయాలని డిమాండు చేయడంతో బాటు తన రాష్ట్రంలోని అన్ని పార్టీలతో కలిసి వెళ్లి దిల్లీలో హోం శాఖను కలిశాడు. గత ఆగస్టులో పెగాసస్ వివాదం వచ్చినపుడు ఎన్‌డిఏ భాగస్వామి అయి కూడా దానిపై విచారణ జరగాలని డిమాండ్ చేశాడు. ఎన్నార్సీని వ్యతిరేకించిన రికార్డు కూడా నీతీశ్‌కు ఉంది. ఇటీవలి అగ్నిపథ్ పథకాన్ని కూడా నీతీశ్ వ్యతిరేకించాడు. జులైలో అమిత్ షా ఏర్పరచిన ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనలేదు. ఆగస్టు 7న మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ భేటీకీ వెళ్లలేదు. రాజకీయావసరాల కొద్దీ చేతులు కలిపినా, బిజెపి హిందూత్వ పాలసీతో తన ఏకీభవించనని, తనకు స్వతంత్ర భావాలున్నాయనీ నీతీశ్ మాటిమాటికీ తన అభిమానులకు చాటుకుంటున్నాడు.

రెండు పార్టీల మధ్య కలహానికి కేంద్ర బిందువు ఆర్‌సిపి సింగ్. 2021 జులైలో కేంద్ర కాబినెట్ విస్తరణ సమయంలో 16 మంది ఎంపీలున్న తమ పార్టీకి ఒకే ఒక్క మంత్రి పదవి యివ్వడంతో నీతీశ్‌కు కోపం వచ్చింది. ఆ ఆఫర్‌ను ఆర్‌సిపి తిరస్కరిస్తాడని నీతీశ్‌తో సహా అందరూ ఆశించారు. అతను గతంలో ఐఏఎస్ అధికారి, నీతీశ్‌కు రెండు దశాబ్దాలుగా ఆత్మీయుడు. కానీ ఆర్‌సిపి నిరభ్యంతరంగా పదవి స్వీకరించడంతో జెడియులో అందరికీ కోపం వచ్చింది. పార్టీ నుంచి వేరెవరూ ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదు. తర్వాత సింగ్, పేరుకి జెడియు మనిషిగా ఉన్నా, బిజెపితోనే అంటకాగడంతో, అతని రాజ్యసభ సభ్యత్వం 2022 జులైలో ముగిసినప్పుడు నీతీశ్ దాన్ని కొనసాగించలేదు. దాంతో అతని మంత్రి పదవి పోయింది. పైగా అతను అవినీతికి పాల్పడ్డాడన్న అనుమానంతో అతని ఆస్తుల గురించి వివరణ అడిగాడు నీతీశ్.

ఈ పరిణామాలతో మండిపడిన సింగ్ పార్టీని దుమ్మెత్తి పోస్తున్నాడు. జెడియు మునిగిపోతున్న నౌక అన్నాడు. అతన్ని శిందేలా ఉపయోగించుకుని పార్టీని చీలుస్తాడన్న అనుమానం నీతీశ్‌కు కలిగింది. అంతకు ముందు జులైలో జెడియు నుంచి అజయ్ అలోక్ అనే అతన్ని బహిష్కరిస్తే, ఆరెస్సెస్ పత్రిక ఆర్గనైజర్ అతనితో పెద్ద ఇంటర్వ్యూను ప్రచురించింది. అతను దానిలో నీతీశ్‌ను తిట్టితిట్టి పోశాడు. అతని మద్యనిషేధం పాలసీని తప్పు పట్టాడు. గుజరాత్‌లో బిజెపి ప్రభుత్వం మద్యనిషేధం అమలు చేస్తోందని ఆ పత్రికకు గుర్తు రాలేదు. ఆ పత్రిక అంతకు కితం నెల సంచికలో అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించాలని అన్నందుకు నీతీశ్‌ను దుయ్యబట్టింది.

ఇలా తన భాగస్వామి నీతీశ్‌ను దిగజార్చడానికి, పదవి నుంచి దింపడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రాంతీయ పార్టీలన్నీ త్వరలోనే మాయమై పోతాయని నడ్డా చేసిన ప్రకటన జెడియును భయపెట్టింది. ఇప్పటికే బిజెపి జెడియుకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను, ఇద్దరు మంత్రులను ఎప్రోచ్ అయిందనే వార్తలు నీతీశ్‌ను కలవర పరిచాయి. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ ఆ మేరకు ఆడియో ఆధారాలున్నాయని, సరైన సమయంలో వాటిని బయటపెడతామనీ అన్నారు. బిజెపి వెన్నుపోటు పొడిచే దాకా ఆగకుండా గబుక్కున తిరిగిపోయి వెన్ను కాచుకున్నందుకు గాను బిజెపి దృష్టిలో నీతీశ్ ప్రజాస్వామ్యద్రోహి అయిపోయాడు. ఆగి బిజెపి చేత పొడిపించుకుని ఉంటే దాన్ని తన చాణక్యంగా బిజెపి ప్రచారం చేసుకునేది.

నీతీశ్ బిజెపి కూటమి నుంచి బయటకు రాగానే, గత విభేదాలను మరచి, అతనితో పొత్తు పెట్టుకోవడానికి తేజస్వీ యాదవ్ పరిగెత్తుకుని వచ్చాడు. నిర్లజ్జగా పొత్తులు కలుపుకోవడానికీ, తెంపుకోవడానికీ తటపటాయించని నీతీశ్ తను ముఖ్యమంత్రిగా కొనసాగడానికి, తేజస్విని ఉపముఖ్యమంత్రిని చేసేసుకున్నాడు. గతంలో అతనిపై కేసు ఉందన్న కారణం చూపి తొలగించిన నీతీశ్‌కు యిప్పుడా విషయం అతి కన్వీనియెంట్‌గా గుర్తుకు రాలేదు. ఇప్పుడీ కొత్త ప్రభుత్వానికి అంకెల పరంగా చూస్తే బలం బాగా ఉంది. 243 స్థానాల ఎసెంబ్లీలో ఆర్జెడి 79, జెడియు 45, దానికి మద్దతు యిచ్చే స్వతంత్రుడు 1, కాంగ్రెసు 19, సిపిఐఎంఎల్ 12, సిపిఐ 2, సిపిఎం 2, ఎచ్ఏఎం 4 కలిస్తే 164 అయింది. సిద్ధాంతపరంగా, స్వప్రయోజనాల దృష్ట్యా వీళ్లు ఎంత సంఘటితంగా ఉండగలరో చూడాలి. కొందరినైనా లోబరుచుకుని, యీ కూటమిని విడగొట్టడానికి 74 సీట్ల బిజెపి సర్వయత్నాలు చేస్తుందనడంలో సందేహమే అక్కరలేదు.   

అట్టు తిరగవేసినందుకు నీతీశ్‌కు వ్యతిరేకంగా బిజెపి ప్రదర్శనలు చేసింది కానీ ప్రజలు పట్టించుకోలేదు. రాజకీయాల్లో యివన్నీ సర్వసాధారణం అనుకున్నారో, ఎప్పుడో జరగాల్సింది, యిప్పుడు జరిగిందను కున్నారో తెలియదు. పదవులు దక్కిన తేజస్వి యాదవ్, అతని అనుచరులు ఎలా ప్రవర్తిస్తారో దాన్ని బట్టి చాలా ఉంటుంది. నీతీశ్ బిజెపికి జెల్ల కొట్టారని తెలియగానే మీడియా హడావుడి చేసింది. ఆయన మోదీకి ప్రత్యామ్నాయ మౌతారా అని చర్చ మొదలుపెట్టి, చివరకు ఎందుకూ పనికిరాడని తేల్చింది. మోదీతో పోలిక తేవడమే అనవసరం. రాష్ట్రస్థాయిలోనే ఎవరి ఒకరితో పొత్తు లేకుండా అధికారంలోకి రాలేని నీతీశ్ ఎక్కడ? దేశమంతా ఏలేస్తున్న మోదీ ఎక్కడ? 43 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న నీతీశ్ మోదీని ఢీకొట్టగలడా? ఈ రౌండులో మాత్రం నీతీశ్ పదవి నిలబెట్టుకోగలిగాడు. ఈ భాగ్యం ఎన్నాళ్లో తెలియదు.

కెటియార్ చెప్పినట్లు బిజెపి భాషలో డబుల్ ఇంజన్ అంటే మోడీ-ఈడీ. చూస్తూండండి, బిహార్‌లో ఈడీ దాడులు పెరుగుతాయి. బిజెపి ఈడీకి అపరిమత అధికారాలను కట్టబెట్టింది. నువ్వు ఫలానా నేరం చేశావు అని చెప్పకుండా కూడా ఈడీ ఎవర్నయినా అరెస్టు చేయవచ్చు. తర్వాత కూడా వాళ్లకు చెప్పనక్కరలేదు. ఇలాటి ఈడీని ప్రతిపక్ష నాయకులపై, విమర్శకులపై బిజెపి పాలిత కేంద్రం ఉసిగొల్పుతోంది. బిహార్‌లో జెడియు ఆర్జెడి నాయకులు త్వరలోనే ఈడీ పాలబడబోతున్నారు. వారిలో కొందరైనా బిజెపిలో చేరి పవిత్రపాపులు అయిపోతారు. అంటే పాపులే కానీ, బిజెపిలో చేరి పవిత్రులై పోతారన్నమాట. ఇక అప్పణ్నుంచి కేసులు బజ్జుంటాయి. అలాటి పరిస్థితుల్లో నీతీశ్ ఏం చేస్తాడనేది చూడాలి. రంగులు మార్చడంలో నీతీశ్ దిట్ట. 2013లో మోదీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎన్‌డిఏలోంచి బయటకు వచ్చిన నీతీశ్ 2002 గోధ్రా అల్లర్లప్పుడు కిమ్మనలేదు. హాయిగా కేంద్ర వ్యవసాయ మంత్రిగా కుదురుగా ఉన్నాడు. అందువలన అలాటి ప్రమాదం వచ్చినపుడు నీతీశ్ బిజెపితో మళ్లీ చేతులు కలిపినా ఆశ్చర్యపడవద్దు. 

ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2022)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?