cloudfront

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎవరూ సిగ్గు పడరా?

ఎమ్బీయస్‌: ఎవరూ సిగ్గు పడరా?

కర్ణాటక ప్రహసనంలో విదూషక పాత్రకు ప్రతి పార్టీ పోటీపడుతోంది. తమ చేష్టలను ఓటర్లను గమనిస్తున్నారని తెలిసినా పట్టించుకోకుండా, సిగ్గూ శరం అనే వాటిని దగ్గరకు రానీయకుండా రాజకీయం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా సిద్ధాంతాలు వల్లిస్తున్నారు. అక్కడ వస్తోంది చికాకు. తాము ఏం చేసినా ప్రజాస్వామ్యమని, ఎదుటివాళ్లు ఏం చేసినా అప్రజాస్వామ్యమని వారు దబాయించడం చూస్తూంటే 'మన తెలివితేటల మీద వీళ్లకు ఎంత లోకువ!' అని నివ్వెరపోవాల్సి వస్తోంది.

హీరోకు ధీరోదాత్తత ఉంటుంది, విలన్‌కు రోషం ఉంటుంది, కానీ జోకర్‌కు అవేమీ ఉండవు. తను చేసే పనే గొప్పదనుకుంటాడు. మననీ అనుకోమంటాడు. కాంగ్రెసు పార్టీ స్వాతంత్య్రానికి ముందు నుంచి అధికారం అనుభవిస్తూ వచ్చింది. ప్రతి తరంలోను మంచి నాయకులు, చెడు నాయకులు ఉంటూ వచ్చారు. క్రమేపీ విలువలున్న వారి సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. పార్టీ రకరకాలుగా భ్రష్టు పట్టింది. కొందరు పార్టీని విడిచి వెళ్లిపోయారు. చిత్రమైన విషయమేమిటంటే బయటకు వచ్చినవారూ తమ పార్టీల్లో కాంగ్రెసు సంస్కృతినే ప్రవేశపెట్టారు. ఆ విషయం ప్రజలు ఊహించలేకపోయారు.

స్వాతంత్య్రం వచ్చాక 20 ఏళ్ల పాటు నిరాఘంటంగా కాంగ్రెసు ఏలిన తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా తోచిన పార్టీలను ఆదరించారు. కానీ వాళ్లూ యిదే రకం అని తేలడంతో త్వరలోనే నిరాకరించారు. కాంగ్రెసు నాయకత్వంలో మార్పులు వచ్చి, తమకు మేలు చేస్తారు అనుకున్నపుడల్లా మళ్లీ కాంగ్రెసుకు అవకాశం యిస్తూ పోయారు. ఇది కాంగ్రెసుకు అహంకారం పెంచింది. తాము ఏం చేసినా చెల్లుతుందనే పొగరుతో యిష్టారాజ్యంగా పాలించింది. ప్రజాభీష్టాన్ని తుంగలోకి తొక్కి, ఎవరేమనుకుంటే నాకేం అన్న రీతిలో ప్రవర్తించింది. ప్రస్తుతం అధోగతిలో ఉంది.

ఈ కథంతా చూసైనా ప్రతిపక్షాలు నేర్చుకోవాలి. ఇప్పటికీ దేశంలో సరాసరిన 25% ఓటర్ల మద్దతు ఉన్న కాంగ్రెసుకే యీ అవస్థ తప్పలేదంటే మనమెంత జాగ్రత్తగా ఉండాలి అనే అవగాహన పెంచుకోవాలి. అబ్బే, వాళ్లూ అదే పోకడలు పోతున్నారు. కాంగ్రెసు 65 ఏళ్లల్లో చేసి చూపించిన దాని కంటె మేం ఐదేళ్లలో ఎక్కువ చేసి చూపిస్తాం అంటూ బిజెపి నినాదమిస్తే ఏమిటో అనుకున్నాం. విలువలను కాలరాయడంలో, వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో కాంగ్రెసు కంటె నాలుగాకులు ఎక్కువ చదివానని బిజెపి చూపించుకుంటోంది.

బిజెపిని గుడ్డిగా సమర్థించేవాళ్లకు తప్ప తక్కినవాళ్లకు తాజాగా కర్ణాటక వ్యవహారం బిజెపి బరితెగింపుకి ఒక నిదర్శనంగా కనబడుతోంది. ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వ ఏజన్సీలన్నిటినీ శుబ్భరంగా దుర్వినియోగం చేసింది. ఇన్‌కమ్‌టాక్స్‌ దాడుల విషయంలో, కేసులు తిరగతోడడంలో బిజెపివారికి, తక్కినవారికి వివక్షత చూపింది. గాలి సోదరుల విషయంలో అయితే మరీనూ. గాలి సోదరులు, ఎడియూరప్ప 2013లో బిజెపి ఓటుబ్యాంకుకి గండి కొట్టారు.

2008లో బిజెపి ప్రభుత్వం నిలబడడానికి కారణం వారి డబ్బుతో జరిగిన ఫిరాయింపులే. 2018లోనూ ఆ అవసరం పడుతుందని తెలుసు కాబట్టి రెండేళ్ల క్రితం నుంచే గాలి సోదరులను రక్షించే పని మీదే ఉంది. రూ.35 వేలకోట్ల విలువైన మైనింగ్‌ కుంభకోణంలో కేసులు మూసివేసేందుకు సిబిఐ రెండేళ్ల క్రితమే ఉద్యమించింది. గోవా రేవుల ద్వారా అక్రమ యినుప ఖనిజాన్ని ఎగుమతి చేశారని అనడానికి ఎలాంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించలేదని కర్ణాటక పరిశ్రమల, వాణిజ్య (మైనింగు) శాఖకు 2016 డిసెంబరులో లేఖ రాసింది.

12.57 కోట్ల మెట్రిక్‌ టన్నుల మేరకు అక్రమ ఎగుమతులు జరిగాయని లోకాయుక్త సాక్ష్యాధారాలతో సహా అభియోగాలు మోపాక సిబిఐ యిలా అనడం విడ్డూరం కాదా! కర్ణాటక నుంచి వచ్చిన ఖనిజాన్ని గోవాలోని యినుప ఖనిజంతో కలిపి గోవా పోర్టు నుంచి చాలామంది ఎగుమతి చేశారట. ఎవరెంత చేశారో తెలియటం లేదని, ఎగుమతిదారులనే అడిగితే డాక్యుమెంట్లు యివ్వటం లేదని, చట్టప్రకారం ఎగుమతిదారు తన వద్ద డాక్యుమెంట్లు ఉంచుకోనవసరం లేదు కాబట్టి వాళ్లపై చర్యలు తీసుకోలేమని, అందువలన దర్యాప్తు ఆపేస్తున్నామని 2017 జూన్‌లో సిబిఐ గోవా విభాగం అధిపతి మరో లేఖ రాశాడు. 

ఎగుమతి, దిగుమతుల విషయంలో ఎవరేం పంపించారో లెక్క లేదంటే నమ్మగలమా? ఇదంతా గాలి సోదరులను, యితర అక్రమ మైనింగు దారులను కాపాడడానికి కాదా? వీళ్లే కాదు, ఎడియూరప్పకు సంబంధించి అక్రమ మైనింగులపై ఉన్న రెండు కేసులను కూడా సిబిఐ కోర్టు తోసిపుచ్చింది. మరి బళ్లారి, పొరుగు జిల్లాలలోని యితర పార్టీ ఎమ్మెల్యేలను లాక్కు రావడంలో గాలి సోదరులు శ్రమిస్తున్నారంటే, వూరికే శ్రమిస్తున్నారా?

ఎన్నో గిమ్మిక్కులు చేసి, బిజెపి 104 సీట్లు తెచ్చుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అది చాలదు. 8 సీట్లు తక్కువ పడ్డాయి. 2014 పార్లమెంటు ఎన్నికలో బిజెపి 41.6% ఓట్లతో 19 స్థానాలలో (132 అసెంబ్లీ సెగ్మెంట్లలో) గెలిచింది. 2018 వచ్చేసరికి అది 36.2% ఓట్లు, 104 సీట్లు (2టిలో ఎన్నిక జరగలేదు) అయ్యాయి. ప్రజలు తమ పక్షాన ఉన్నారు కానీ చాలినంత బలం యివ్వలేదు అని బిజెపి అని ఊరుకోలేదు.

పరస్పర ప్రత్యర్థులైన కాంగ్రెసు, జెడిఎస్‌ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అది అంత:కలహాలతో ఆర్నెల్లలోనే పడిపోతుందని, పెద్ద పార్టీగా ఎన్నికయినా అధికారం కోసం అడ్డదారులు తొక్కలేదన్న సానుభూతి 2019 ఎన్నికలలో ఉపకరిస్తుందని అనుకోలేదు. ఎలాగైనా అధికారంలోకి రావాలి అంతే, అదొక్కటే ఆలోచన. ఇప్పుడు మెజారిటీ నిరూపించుకోవడానికి ఒకటే మార్గం - ఫిరాయింపులు ప్రోత్సహించడం, ప్రలోభాలతో, బెదిరింపులతో ఎదుటి పార్టీలను చీల్చి లోపాయికారీ మద్దతు తీసుకోవడం, వచ్చినవారి హిరణ్యాక్ష వరాలు తీర్చడానికి అవినీతికి పాల్పడడం, కొత్తవారికి, పాతవారికి జరిగే నిరంతర కలహాలను తీరుస్తూ పాలన నిర్లక్ష్యం చేయడం.

బలమైన ప్రతిపక్షంగా ఉండి పేరు తెచ్చుకోవడం కంటె, 2019లో అధికసంఖ్యలో పార్లమెంటు సీట్లు తెచ్చుకోవడం కంటె యీ మార్గాన్నే బిజెపి ఎంచుకుంది. ఒకసారి ఎంచుకున్న తర్వాత అన్ని సంప్రదాయాలను పక్కన పెట్టింది. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే గవర్నరు ఎక్కువ సీట్లు తెచ్చుకున్న పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం యివ్వాలి. ఎప్పుడు? స్వతంత్రులు, చిన్న పార్టీలు ఉండి, అవి యీ పార్టీకి మద్దతు యిస్తాయనే నమ్మకాన్ని ఆ పార్టీ తనకి కలిగించినప్పుడు! ఇక్కడ స్వతంత్రులు యిద్దరే.

చిన్న పార్టీలు లేనే లేవు. జెడిఎస్‌ తను కాంగ్రెసు పక్షమని రాతపూర్వకంగా రాసి యిచ్చింది. ఇక మెజారిటీ ఎక్కణ్నుంచి వస్తుంది? ఫిరాయింపుల ద్వారానే వస్తుంది. అది హర్షణీయం కాదు కాబట్టి రెండవ ప్రత్యామ్నాయమైన ఫలితాల అనంతరం ఏర్పడిన కూటమికి అవకాశం యివ్వాలి. దాని బలమూ అరకొరగా ఉంటే ఆలోచించవచ్చు. కానీ ఆ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు అది ముందుకు వచ్చింది. ఈ లాజిక్‌ను గోవాలో, మణిపూర్‌లో బిజెపి వినిపించింది.

కాంగ్రెసు అతి పెద్ద పార్టీగా అవతరించినా అక్కడి గవర్నర్ల చేత దానికి అవకాశం లేకుండా చేసింది. కర్ణాటకకు వచ్చేసరికి రూల్సు మార్చేసింది. గవర్నరును కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా చేయడం కాంగ్రెసు హయాంలోనే మొదలైంది. తర్వాత వచ్చిన పార్టీలన్నీ అదే ధోరణిలో వెళ్లాయి. నీతులు, విలువలు వల్లించిన బిజెపి అధికారంలోకి వస్తూనే గవర్నర్లను మార్చేయడంతో ఓహో, యిదీ ఆ తానులో ముక్కే అనిపించుకుంది. 

కర్ణాటకలో మోదీ ఒకప్పటి సహచరుడు అక్కరకు వచ్చాడు. సరే, బిజెపికి ఎలాగూ ఛాన్సిస్తాడని తెలుసు, కానీ చేసేదేదో కాస్త సుతారంగా, పెద్దమనిషి తరహాగా చేయవచ్చు కదా. అతి మోటుగా చేశాడు. మే 17న సుముహూర్తంలో ప్రమాణస్వీకారం చేస్తానని ఎడియూరప్ప గతంలోనే ప్రకటించాడు కాబట్టి అతని మాట నిలబెట్టడానికి జస్ట్‌ 12 గంటలకు ముందు గవర్నరు ఆహ్వానించడం, సుప్రీం కోర్టు జడ్డిలు అర్ధరాత్రి కూర్చుని సరేనంటూ తెల్లారేసరికల్లా తీర్పు వెలువరించడం! అతి ముఖ్యమైన కేసులు ఎన్నో పెండింగులో ఉంటే జడ్జిలు నెలల తరబడి వేసవి సెలవులు తీసుకుంటారు.

ఇప్పుడు వచ్చిన ఎమర్జన్సీ ఏమిటి? రాష్ట్రంలో ఏదో ఒక ప్రభుత్వం అంటూ ఉందిగా. సిబ్బంది జీతభత్యాలు ఆగిపోలేదుగా. ఎడియూరప్ప తనకు బలం ఎంతుందో కమిట్‌ కాకుండా లెటర్‌ యిచ్చాడన్న కారణం చూపి ప్రమాణస్వీకారంపై స్టే యివ్వవచ్చుగా! ఇవ్వలేదు. పదవిలోకి వస్తూనే ఎడియూరప్ప చెడుగుడు ఆడేశాడంటే అలా ఆడనిచ్చిన కోర్టుది తప్పు లేదా? బల నిరూపణకు ఎడియూరప్ప వారం అడిగితే రెండు వారాలు తీస్కో అన్నాడు గవర్నరు. సాధారణంగా వారం, పదిరోజులు యిస్తారు. గోవాలో అయితే నాలుగు రోజులే యిచ్చారు. ఇక్కడ ఏకంగా పదిహేను రోజులు. 

సుప్రీంకోర్టు దీని దగ్గరకి వచ్చేసరికి మొహమాట పడింది. 19 సాయంత్రాని కల్లా బలం నిరూపించుకోమంది. ఎడియూరప్ప చేయించిన ఆంగ్లో ఇండియన్‌ ఎమ్మెల్యే నియామకాన్ని ఒప్పుకోలేదు. సీక్రెట్‌ బ్యాలెట్‌కు ఒప్పుకోలేదు. లైవ్‌ టెలికాస్ట్‌ చేయించాలంది. ఇన్ని చేసి బోపయ్య ప్రోటెమ్‌ స్పీకరు నియామకానికి అడ్డు చెప్పలేదు. దీపక్‌ మిశ్రా బెంచ్‌ మీద లేరు కాబట్టే యీ మాత్రమైనా జరిగింది. టైము తగ్గించినా ఎడియూరప్ప నో ప్రాబ్లెమ్‌ 120 మంది ఉన్నారు నా దగ్గర అన్నాడు. అంటే 16 మంది డిఫెక్టర్లను మోపు చేశానని చెప్పుకోవడమన్నమాట!

అధికారం చేపడుతూనే ఎడ్వకేట్‌ జనరల్‌ను మార్చాడు. పోలీసు వ్యవస్థను చేతిలోకి తీసుకున్నాడు. ఉన్నత స్థానాల్లో ఎడాపెడా బదిలీలు చేశాడు - తన వాళ్లు జారిపోకుండా చూసుకోవడానికి, ఎదురు ఎమ్మెల్యేలను బెదిరించడానికి, ప్రతిపక్ష శిబిరాలను భగ్నం చేయడానికి! ఎమ్మేల్యేలకు పోలీసు రక్షణ తొలగించాడు. కాంగ్రెసు శిబిరం నడుస్తున్న రిసార్టుకు సెక్యూరిటీ తీసేశాడు. స్థానిక ఎస్పీని మార్చేశాడు. ఇక ఆ ఎమ్మెల్యేలను ఎవరైనా ఎత్తుకు పోవచ్చునన్నమాట. సుప్రీం కోర్టు కీలక నిర్ణయాలు తీసుకోవద్దంది. మరి యివన్నీ కీలకమైనవి కావా? పదవిలోకి వచ్చిన గంటల్లోనే యిన్ని మార్పులు చేయాలా?

ఎందుకీ మొరటుతనం అంటే 'మేం తలచుకుంటే ఏమైనా నిస్సిగ్గుగా, అన్ని పద్ధతులు తోసిరాజని చేయగలం. మాకు అడ్డు లేదు, అదుపు చేసేవారు లేరు. మాతో వైరం పెట్టుకున్నారో, మేం చెప్పినట్లు వినలేదో, మీ పని ఆఖరు' అని ప్రత్యర్థులకు చాటిచెప్పడం! ఫిరాయిద్దామా వద్దా అని ఊగిసలాడే ఎమ్మెల్యేలకు తమ తడాఖా చూపి, అడలగొట్టడం! కాంగ్రెసు ఎమ్మెల్యేలు విమానాల్లో కొచ్చిన్‌కు వెళదామనుకుంటే ఎయిర్‌పోర్టు అథారిటీ అనుమతి యివ్వలేదు.

పోనుపోను అందర్నీ తన చేతిలోకి లాక్కుందామనుకున్నారు. కొందరు కాంగ్రెసు ఎమ్మెల్యేలను కంచె దూకించారు. జెడిఎస్‌లో రేవణ్ణను దువ్వారు. 'బాహాటంగా పార్టీ మారనక్కరలేదు, ఓటింగు సమయంలో మాకు ఓట్లేయండి చాలు అన్నారు. క్రాస్‌ ఓటింగు చేశారు కాబట్టి వాళ్లని అనర్హులుగా ప్రకటించండి అని ఆ పార్టీల వాళ్లు ఉత్తరాలిస్తే మన స్పీకరు గారు వాటిని అటక మీద పడేస్తాడు, రికార్డు ప్రకారం మీరు ప్రతిపక్షం, ఆచరణలో అధికారపక్షం. మంత్రులు కూడా అయిపోతారు. కోర్టుకి వెళితే స్పీకరుదే సర్వాధికారం అంటారు. ఈ నాటకం తెలుగు వెర్షన్‌ ఎప్పుడో చూసేశాం. కన్నడ రీమేక్‌ చూపించబోతాం.' అని చెప్పారు. 

ఇంత చేసినా కాంగ్రెసు ఎమ్మెల్యేలను, జెడిఎస్‌ వాళ్లను కదల్చలేకపోయారు. చివరి నిమిషం దాకా నానా అగచాట్లూ పడినా భంగపాటు తప్పలేదు. రెండురోజుల్లో ఎడియూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. పైగా బేరాసారాల ఆడియోలు బయటకు వచ్చేసి రభస కూడా అయింది. ఇంతా చేసి, యిదంతా ప్రజాస్వామ్య పరిరక్షణకే చేశాం అంటోంది బిజెపి. అదీ వాళ్ల జాణతనం. ప్రస్తుతం బిజెపి ఏం చేసినా చెల్లుతోంది. చెల్లుతోంది కదాని అది అది చెలరేగుతోంది. ఇదీ కొన్నాళ్ల ముచ్చటే. ఆ తర్వాత కష్టకాలం దాపురిస్తుంది. అప్పుడు అన్నీ ఎదురు తిరుగుతాయి.

1977 జనతా ప్రభుత్వం నాటి నుంచి చక్రం తిప్పిన బిజెపి (అప్పటి జనసంఘ్‌) తర్వాతి కాలంలో 2 సీట్లకు పడిపోలేదా? అప్పుడు కూడా వాళ్లకు యిదే ఆర్గనైజేషన్‌, ఆరెస్సెస్‌ మద్దతు, బూత్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండేవి. అయినా అధ:పాతాళంలో పడ్డారు, మళ్లీ లేచారు. రేపు ఎలా ఉంటుందో అనే భయం వున్నపుడు యింత బరితెగించకూడదు. కానీ తెగిస్తున్నారు. కాంగ్రెసు చేసిందని వీళ్లు, మాకంటె ఎక్కువ చేసిందని వాళ్లు, ఇంతకింత చేస్తామని మళ్లీ వీళ్లు.. యిలా పోటీలు పడి పాతాళానికి వేగంగా జారిపోతున్నారు.

బిజెపి వాళ్లు కాంగ్రెసువాళ్లకు జవాబుదారీ కాదు, కానీ ప్రజలకు జవాబుదారీ. బిజెపిని ప్రశ్నించే నైతికపరమైన హక్కు కాంగ్రెసుకి లేదు, ప్రజలకు ఉంది. 'వారి కంటె మెరుగనుకున్నాం. మిమ్మల్ని తెచ్చుకున్నాం. మీరూ ఇంతేనా? ఇదేమిటంటే అడిగితే కాంగ్రెసు వాళ్లు చేయలేదా అంటారు. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వద్ద కూడా యిలా వాదిస్తే ఊరుకుంటాడా? వాడి సంగతి తర్వాత చూస్తాను, ముందు నీ సంగతి తేలుస్తానంటాడు. మీరు నకలు కాంగ్రెసుగా మారడంతో ఆగకుండా పైగా నీతిప్రబోధాలు ఒకటి!' అనేసిన రోజున బిజెపి పతనం వేగవంతం అవుతుంది.

ఇక కాంగ్రెసు గురించి - వాళ్లు ప్రజాస్వామ్యం గురించి, సంప్రదాయాల గురించి మాట్లాడుతూంటే వినడానికి రోత పుడుతుంది. గవర్నరు వ్యవస్థను ఆడుకోవడంలో కానీ, రాష్ట్రపతి పాలన విధించడంలో కానీ వాళ్లు పాల్పడినన్ని ఉల్లంఘనలు వేరెవరూ పాల్పడలేరు. అవన్నీ ప్రస్తావిస్తే ఒక ఉద్గ్రంథం తయారవుతుంది. 1980లో ఇందిరా కాంగ్రెసు నెగ్గగానే భజనలాల్‌ హరియాణాలో తన కాబినెట్‌ మొత్తంతో సహా ఆ పార్టీలోకి ఫిరాయించేశాడు. అలాటి సిగ్గుమాలిన పనులు ప్రోత్సహించిన కాంగ్రెసు యిప్పుడు బిజెపిని ఏ మొహం పెట్టుకుని ఫిరాయింపుల గురించి నిలదీస్తుంది?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తీర్మానాన్ని లెక్కలోకి తీసుకోకుండా, శ్రీకృష్ణ కమిషన్‌ను పక్కన పడేసి, తలుపులు మూసేసి, కెమెరాలు కట్టేసి, గూండాగిరీతో బిల్లు పాస్‌ చేసి తెలుగు ప్రజలను విడగొట్టిన తీరు చూశాక కాంగ్రెసుకు ప్రజాస్వామ్యమంటే గౌరవముందంటే ఎవరు నమ్ముతారు? ఇక పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమా? ఇప్పటికి కూడా ఎమ్మెల్యేలందరూ కలిసి ఒక తీర్మానం చేస్తారు - ముఖ్యమంత్రి ఎవరవుతారనేది అధిష్టానం నిర్ణయానికి వదిలేశాము అని. సీల్డు కవరులో పేరు వస్తుంది.

బిజెపి పాలనతో అసంతృప్తిగా ఉన్న ఓటర్లకు ప్రత్యామ్నాయం చూపించలేని అసమర్థ నాయకత్వం సోనియాది. స్థానిక నాయకత్వం బలంగా ఉన్నా, రాహుల్‌ అధినేతగా ఉండగా ఆ పార్టీకి పుట్టగతులుండవనేది తాజాగా కర్ణాటకలోని రాజకీయ నిర్ణయాలతో తేటతెల్లమైంది. తమ కంటె బిజెపికి 26 సీట్లు ఎక్కువ వచ్చాయని గ్రహించాక, అత్యధిక సీట్లు వచ్చిన పార్టీని గవర్నరు తొలుతగా పిలవాలని గోవా, మణిపూర్‌లలో వాదించిన కాంగ్రెసు యిక్కడ బిజెపికి అవకాశం యిచ్చి హుందాగా తప్పుకోవలసినది. అధికారం కోసం వెంపర్లాడలేదన్న సానుభూతి కలిగి, 2019లో పనికి వచ్చేది.

బిజెపి, జెడిఎస్‌లు ఎన్నికలకు ముందు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని తమను ఓడించాలనుకుంటున్నాయని కాంగ్రెసు ఆరోపించింది. ఫలితాలలో కూడా అది స్పష్టమైంది కూడా. మరి తమను ఓడించడానికి కుట్ర పన్నిన అలాటి జెడిఎస్‌ ముందు కాంగ్రెసు సాగిలబడడం దేనికి? మేం బయటినుంచే మద్దతు యిస్తాం, మాకే పోస్టులు అక్కరలేదు అని ప్రాధేయపడడం దేనికి? అంతకు ముందుదాకా మోదీని కర్ణాటకలో నిలవరించగల మొనగాడిగా నిలబెట్టిన సిద్ధరామయ్యను హఠాత్తుగా కిందపడేయడం దేనికి? మీరు కూడా ప్రభుత్వంలో చేరాలి అని దేవెగౌడ షరతు విధించేసరికి సిద్ధరామయ్యను బలి యిచ్చేసి పరమేశ్వరను ఉపముఖ్యమంత్రిగా ముందుకు తోశారు.

అంతకంటె సిద్ధరామయ్యను సమర్థుడైన ప్రతిపక్ష నాయకుడిగా నిలబెట్టి, 2019లో లబ్ధి పొందవచ్చు. నిజానికి  కాంగ్రెసుకు  బిజెపి కంటె 1.8% ఎక్కువగా 38.0% ఓట్లు వచ్చాయంటే దానికి సిద్ధరామయ్య పాలనే కారణం. ముఖ్యమంత్రిగా తక్కిన యిద్దరు అభ్యర్థుల కంటె సిద్ధరామయ్యకు ఆమోదం ఉందని సర్వేలలో కూడా తేలింది. అలాటతన్ని పక్కన పడేసి, ముఖ్యమంత్రిగా అతి తక్కువ ఆమోదం (సిద్ధరామయ్య పాప్యులారిటీలో సగం), ఓట్లు, సీట్ల పరంగా సగం కంటె తక్కువ తెచ్చుకున్న కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేస్తామంటూ బయలుదేరితో కర్ణాటక ఓటరు హర్షిస్తాడా?

అతనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుని ఉంటే వాళ్ల పార్టీకే ఓట్లేసేవారుగా! అది కుటుంబపార్టీ, ఒక్కళిగలకు మాత్రమే పరిమితమైన పార్టీ అని నిన్నటిదాకా ప్రచారం చేసి, యివాళ అనారోగ్యపీడితుడైన కుమారస్వామే ముఖ్యమంత్రి అనడం ఎంత ఎబ్బెట్టుగా ఉంది! అయినా జెడిఎస్‌ బలంగా ఉన్న పాత మైసూరు ప్రాంత కాంగ్రెసు ఎమ్మెల్యేలు దీన్ని ఆమోదిస్తారా? తమను ఓడించి గెలిచిన ఆ ఎమ్మెల్యేలను జెడిఎస్‌ వాళ్లను నమిలి మింగేయదా? వాళ్ల మాట చెల్లనిస్తుందా?

మమతా బెనర్జీ చెప్పినట్లు, కాంగ్రెసు ఎన్నికలకు ముందే జెడిఎస్‌తో పొత్తు పెట్టుకుని ఉంటే కథ యింకోలా ఉండేది. ఇప్పుడు తోకలాటి పార్టీకి కుచ్చుగా ఉంటానంటే పరువు ఏమైంది? ఈ నిర్ణయం నచ్చని ఎమ్మెల్యేలు పార్టీకి దూరమైతే..? పార్టీని చీలిస్తే..? దీని ప్రభావం యితర రాష్ట్రాలపై పడదా? ఒక ప్రాంతీయపార్టీకి యింత యిదిగా ఒంగి సలాంలు చేస్తోందంటే అది బిజెపి వ్యతిరేక కూటమికి కేంద్రబిందువు ఎలా అవుతుంది?  పోనీ వ్రతం చెడినా ఫలం దక్కుతుందా? ఆ గ్యారంటీ కూడా లేదు.

కుమారస్వామి నమ్మదగ్గ భాగస్వామి ఎంత మాత్రం కాదు. గతంలో జెల్లకాయ కొట్టాడు. ఇవేమీ ఆలోచించకుండా 'పిపిపి' ట్యాగ్‌ తప్పించుకోవడానికి చేసిన తొందరపాటు చేష్ట యిది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన, గోవా, మణిపూర్‌లలో కాంగ్రెసు నాయకులు హఠాత్తుగా నిద్ర మేల్కొని గవర్నరు తలుపు తట్టడం, యివన్నీ హాస్యాస్పదంగా లేవూ! ఇవాళ ఎడియూరప్ప రాజీనామా చేశాడు. భేష్‌! రేపణ్నుంచి కాంగ్రెసు-జెడిఎస్‌ల జగడాల గురించి వినాలి. ఉపముఖ్యమంత్రి పదవికై కాంగ్రెసు నాయకుల కుమ్ములాటలు చూడాలి. 

ఇక జెడిఎస్‌. ఐదేళ్లూ నిద్రపోయి ఎన్నికల సమయంలో మాత్రమే నిద్ర లేచే పార్టీ. ఏ సిద్ధాంతమూ లేదు. మాట నిలకడ లేదు. వాళ్లూ సిద్ధాంతాల గురించి మాట్లాడితే ఎలా? దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కూడబలుక్కుని అతన్ని ముఖ్యమంత్రి చేయాలట. విడ్డూరంగా లేదూ? వాళ్ల వ్యవహారాల్లో నువ్వు యిప్పటిదాకా ఏమైనా సాయం చేశావా? కనీసం మాటసాయం...? అవి కాంగ్రెసు, బిజెపిలకు సమానదూరం పాటిస్తానంటూ ఉంటే నువ్వు కాంగ్రెసుతో కలిసి ఊరేగుతూ వాళ్ల సాయం కోరడమేమిటి? 2019 పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెసుకు నిధులు కావాలి.

పంజాబ్‌ రాష్ట్రంలోని కాంగ్రెసు ప్రభుత్వం కొద్ది కాసులు రాలుస్తుందేమో కానీ పుదుచ్చేరి బొత్తిగా లాభం లేదు. కర్ణాటక మీదనే ఆశలు. అందుకే అది దానికి దక్కకుండా చేయాలని బిజెపి నానా తంటాలూ పడింది. ఇప్పుడు 2019లోగా కర్ణాటక ప్రభుత్వం కార్పోరేట్‌ నిధుల సేకరణలో ముమ్మరంగా పని చేయాలి. ఇద్దరూ గొడవల్లేకుండా పంచుకోవాలి. మరి యిలాటి పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వం స్వచ్ఛ పాలనను అందించగలదా?

కర్ణాటకలో బిజెపి ప్రజాస్వామికంగా వ్యవహరించలేదని టిడిపి, టిఆర్‌ఎస్‌ అన్నా నవ్వు వస్తుంది. ఫిరాయింపుదారుల విషయంలో, ప్రతిపక్ష సభ్యుల విషయంలో, మీడియా స్వేచ్ఛ విషయంలో వీళ్లు ఏ ప్రజాస్వామ్యం పాటిస్తున్నారు? స్పీకరు వ్యవస్థను యిష్టానికి వాడుకోవడం లేదా? గవర్నరు వ్యవస్థ తమ చేతిలో ఉంటే దాన్నీ ఎడాపెడా వాడేసి ఉండేవారు. నిజానికి యిప్పుడు టీవీ చర్చల్లో గవర్నరు, స్పీకరు వ్యవస్థల దుర్వినియోగం గురించి అన్ని పార్టీల వాళ్లూ ప్రసంగించేస్తూ ఉంటే వినడానికి దుస్సహంగా ఉంది.

వీళ్లందరూ ఏదో ఒక సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్నవారే! వ్యవస్థలో లోపాల్ని సరిదిద్దడానికి వీళ్లెవరూ ఎందుకు సమకట్టలేదు? అధికారంలో వుండగా దుర్వినియోగం చేయడం, ప్రతిపక్షంలో ఉండగా గావుకేకలు పెట్టడం! రేపు వీళ్లు గద్దె నెక్కినా పరిస్థితి చక్కదిద్దరు, తమ అవసరానికి వాడుకుంటారు. అందుకే అనుమానం వస్తుంది - వీళ్లెవరికీ సిగ్గు అనే మాటకు వర్ణక్రమం తెలియదా? అని!

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2018)