Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ : పాటలపై ఎన్టీయార్ ఆసక్తి

ఎమ్బీయస్ : పాటలపై ఎన్టీయార్ ఆసక్తి

ఇవాళ ఎన్టీయార్ జయంతి. ఆ సందర్భంగా పాటలపై ఆయన ఆసక్తి గురించి కొన్ని జ్ఞాపకాలు. నాగేశ్వరరావు, రామారావు యిద్దరూ గొప్ప నటులే అయినా, నాగేశ్వరరావు తన సినిమాలలో పాటల గురించి వ్యక్తిగతమైన శ్రద్ధ తీసుకున్నట్లు ఎవరూ రాయలేదు. అవన్నీ దర్శకులే చూసుకుంటారను కున్నారేమో! ఆయన భాగస్వామిగా వున్న అన్నపూర్ణ సంస్థ విషయాలన్నీ దుక్కిపాటివారే చూసుకునేవారు. నిజానికి అక్కినేని తొలిదశలో తన పాటలు తనే పాడుకునేవారు. ‘‘బాలరాజు’’లో ‘చెలియా కనరావా’ పాట ఆయన చేత పాడించారు. తర్వాత ఘంటసాల చేత కూడా పాడించి, దాన్ని వాడుకున్నారు. అయినా అక్కినేని తన సినిమాల్లో పాటల సంగతి పెద్దగా పట్టించుకోలేదు. అవి మ్యూజికల్ హిట్స్ అయ్యాయంటే ఆ ఘనత వేరే వారికే దక్కుతుంది.

ఎన్టీయార్ నిర్మాతగా అన్ని వ్యవహారాలూ చూసుకునేవారు కాబట్టి పాటలు దగ్గరుండి రాయించుకునేవారు. ఆయనతో అనుభవాలను సినీకవులు రికార్డు చేశారు. పాటలు రాయించాక, ట్యూన్‌ల విషయంలో త్రివిక్రమరావుగారి ప్రమేయం ఎక్కువ వుండేదిట. ఆయనకు చక్కని సంగీతాభిరుచి వుండడంతో ఎన్‌ఏటి బ్యానర్‌లో పాటలన్నీ బాగుంటాయి. సి నారాయణరెడ్డిని సినీరంగానికి పరిచయం చేసినది ఎన్టీయారే. అప్పుడు తనను ఎంత గౌరవంగా చూసినదీ, ఎంత ఘనంగా సత్కరించినదీ సినారె అనేక సభల్లో చెప్పుకున్నారు. పుస్తకాల్లో రాసుకున్నారు. 1960 చివర్లో ‘‘కలిసివుంటే కలదు సుఖం’’ (1961) షూటింగుకై హైదరాబాదు వచ్చిన ఎన్టీయార్‌ను సినారె సారథీ స్టూడియోలో కలిసి తను రాసిన ‘ఈ నల్లని రాలలో..’, ‘మబ్బులో ఏముంది? నా మనసులో ఏముంది?’ పాటలు పాడి వినిపించారు.

ఎన్టీయార్‌కి నచ్చాయవి. ‘‘సినీగీతాలు రాస్తారా?’’ అని అడిగితే ‘‘సినిమాలో అన్ని పాటలూ నా చేత రాయించుకుంటేనే రాస్తాను.’’ అని షరతు పెట్టారు సినారె. మళ్లీసారి షూటింగుకి వచ్చినపుడు ‘‘మా సోదరుడు, నిర్మాత త్రివిక్రమరావుతో చర్చించాను. మేం ‘‘గులేబకావళి కథ’’ (1962) సినిమా తీస్తున్నాం. దానిలో అన్ని పాటలూ మీ చేత రాయిస్తాం. మద్రాసు రండి.’’ అని పిలిచారు. 1961 మార్చిలో సినారె మద్రాసు వెళితే రైల్వే స్టేషనుకి ఎన్టీయార్‌, త్రివిక్రమరావు నాలుగు కార్లలో స్టేషన్‌కి వచ్చి, తనకు సెంటిమెంటు అయిన మారిస్ కారులో సరాసరి యింటికి తీసుకెళ్లి, భార్యను పరిచయం చేసి, ఎన్‌ఏటి సంస్థ ఆఫీసులో ఎసి గదిలో బస ఏర్పాటు చేశారు. రోజూ ఎన్టీయార్‌ యింట్లోనే లంచ్, డిన్నర్. పదిరోజులు అక్కడే వుండి పది పాటల పని పూర్తి చేశారు. రోజుకో పాట రాయడం, దాన్ని ఎన్టీయార్‌ ఆమోదించిన తర్వాత కంపోజింగ్ చేయించడం. ‘చక్కని లయజ్ఞానం వున్న త్రివిక్రమరావుగారు పక్కనే వుండి రిథిమ్స్ కూర్పులో అందమైన సలహాలిచ్చేవార’ని సినారె తన సమగ్ర సాహిత్యం 7వ సంపుటంలో రాశారు. పాట కంపోజింగ్‌కి రెండు పూటలు పట్టేది.

‘నన్ను దోచుకొందువటే..’ పాట రాయడానికి ముందు హీరోహీరోయిన్లపై వున్న యీ పాట సముదాత్తంగా, కవితాత్మకంగా వుంటే బాగుంటుందని ఎన్టీయార్‌ సూచించారు. అలాగే మరో హీరోయిన్‌తో వున్న పాట ‘కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై’ కూడా చక్కని కవితాధారతో రాయించారు. చివరగా హీరోపై విషాదగీతం రాయాలి. సినారె తన అలవాటు ప్రకారం చీకటి, ఎడారి, తుపాను, కన్నీళ్లు, శూన్యం లాటి పదాలతో పై స్థాయిలో పాట రాస్తే ఎన్టీయార్‌ ‘ఉహూఁ అలా కాదే’ అంటూ పోయారు. సూటిగా, తేటమాటలతో వుండాలని అర్థమై, ‘రామారావుగారూ, పల్లవి ఎలా వుండాలో మీరే చెప్పండి’ అన్నారు సినారె. ‘చాలా సింపుల్. ఏ దిక్కూ లేని ఒంటరి వాణ్నయిపోయాను. ఎలా వెళ్లను ఇంటికి?’ అని అందించారు ఎన్టీయార్‌. ‘అయితే వినండి – ఒంటరినై పోయాను, ఇక యింటికి ఏమని పోను – ఇంతే కదా’ అన్నారు సినారె. ‘కరక్టు. నాక్కావలసింది అదే. ట్యూన్‌లో ఎంత బాగా వస్తుందో మీరే చూద్దురుగాని’ అన్నారు ఎన్టీయార్‌. ఆ పాటా హిట్టయింది.

‘‘శ్రీకృష్ణపాండవీయం’’ (1966) సినిమాలో రెండు పాటలు రాయిస్తూ ఎన్టీయార్‌ షరతులు విధించారు. ఒకటి హిడింబి మానవాంగనగా మారి పాడే పాట జానపద ధోరణిలో సినీగీతాల్లో అంతగా వాడుకలో లేని మాటలతో రాయాలి. వస్తువు ఉసిగొల్పేదిగా వుండాలి. ఇక రెండోది దుర్యోధనుణ్ని సభలోకి ఆహ్వానిస్తూ ఆలపించే పాటలో సామాన్యులకు అర్థం కాకున్నా ప్రౌఢసమాసాలుండాలి. అందుకే ‘స్వాగతం సుస్వాగతం’ పాటలో ‘ధరణిపాలశిరోమకుటమణి తరుణకిరణ పరిరంజితచరణా’ వంటి సమాసాలుంటాయి. ‘చాంగురే బంగారు రాజా’ పాటలో ‘మజ్జారే, అయ్యారే, అమ్మకచెల్ల, మగరేడు, వగకాడు, మొలకమీసం, సింగపునడుము, మచ్చెకంటి చూపు, పచ్చలపిడిబాకు, విచ్చిన పువురేకు..’ వంటి పదాలుంటాయి.

‘‘ఉమ్మడి కుటుంబం’’ (1967) సినిమా టైటిల్ సాంగ్ రాసేటప్పుడు సినారె కాస్త కవిత్వం గిలకాలని ప్రయత్నిస్తే ఎన్టీయార్‌ ‘‘రెడ్డిగారూ! నో లిరిసిజమ్ ప్లీజ్’’ అంటూ కాస్త బిగించేవారు. సామాన్య ప్రేక్షకుడి మనసు కెక్కేట్టు వారికి అందుబాటులో వున్న పదాల్లో చెప్పండి అన్నారు. అందుకే దానిలో ‘మనసులన్నీ పెనవేసి – తలపులన్నీ కలబోసి, మమతలు పండించేది – మంచితనం పెంచేది, కుటుంబం – ఉమ్మడి కుటుంబం’ వంటి సరళమైన పదాలుంటాయి. ఎన్టీయార్‌కు బాగా నచ్చిన పాటల్లో ‘‘రేచుక్క – పగటిచుక్క’’ (1959)లోని జూనియర్ సముద్రాల రాసిన ‘మనవి సేయవే..’ ఒకటని లక్ష్మీపార్వతి చెప్తారు. ఆయన మాటిమాటికీ ఆ పాట వేయించుకునేవాడట. ఆ సినిమాను ఎన్టీయార్, విజయావాళ్లు కలిసి తీశారు కాబట్టి దాని రూపకల్పనలో కూడా ఎన్టీయార్‌ హస్తం వుండి వుండవచ్చు.

ఇతరుల సినిమాల్లో సాహిత్యాన్ని కూడా ఎన్టీయార్ పట్టిపట్టి చూసేవారన్న సంగతి నిర్మాత ‘యువచిత్ర’ మురారి ఆత్మకథ ‘నవ్విపోదురు గాక’ చెపుతుంది. ‘‘జస్టిస్ చౌదరి’’ సినిమా షూటింగులో మురారి సెట్స్ మీదకు వెళితే ఎన్టీయార్ ‘‘మీరు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘‘త్రిశూలం’’ (1982) అనే సినిమా తీస్తున్నారనీ, దాని మీద రాముడి మీద మంచి పాట రాయించారనీ విన్నాను. పల్లవి ఏమిటి?’’ అని అడిగారు. మురారి వెంటనే ‘‘రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా, ఏమనుకోను, నిన్నేమనుకోను..’’ అని చెప్పి కథాపరంగా ఎందుకిలాంటి పల్లవి రాయించాల్సి వచ్చిందో సన్నివేశాన్ని, పాటనీ వివరించారు. ఎన్టీయార్ ఆనందించి, అభినందించారు. ఆ ధైర్యంతో మురారి ‘‘రాఘవేంద్రరావు సినిమాల్లో యిలాంటి పాటలు వుండవు.’’ అని మెల్లగా అంటే ఆయన ఓ నవ్వు నవ్వి, ‘‘ఈ రోజుల్లో యిలాంటి పాటలు రాయించడానికి నిర్మాతకి ధైర్యం, అభిరుచి రెండూ వుండాలి.’’ అని వ్యాఖ్యానించారు. మురారి పొంగిపోయారు.

ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకు మురారి బాలకృష్ణను, యిద్దరు హీరోయిన్లను పెట్టి ‘‘నారీనారీ నడుమ మురారి’’ (1990) సినిమా తీశారు. దానికి మకుటగీతం అనదగిన పాట రాయమని ఆత్రేయ నడిగితే ఆయన 20 రోజులు తీసుకుని తొలి రెండు లైన్లు రాసిచ్చారు.

‘ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకునపడి నీవు నలిగితివా

వలపుల వానల జల్లులలో స్వామి తలమునకలుగా తడిసితివా...’

పాట పూర్తి చేయకుండానే ఆత్రేయ మరణించడంతో అదే కొలతలతో రాయమని వేటూరికి అప్పగించారు. పల్లవికి ముందు నాలుగు వాక్యాలు సీతారామశాస్త్రి చేత రాయించారు. సినిమా పూర్తయాక మురారి ఎన్టీయార్‌కు చూపించారు. ఆయన సినిమాను మెచ్చుకుని, ‘ఇరువురు’ పాటలో ‘యదునాథా భామవిడుము రుక్మిణి చాలున్ - రఘునాథా సీతనుగొని విడు శూర్పణఖన్’ అనే వాక్యాలు కూడా వేటూరే రాశారా?’ అని అడిగారు. ‘అవునండి. రాముడికి శూర్పణఖ మీద మోజు వున్నట్లు అర్థం స్ఫురిస్తుందని అనుమానం వచ్చి, యిదేమిటండీ అని అడిగితే, ‘కథలో సందర్భానికి సరిపోతుందిలే’ అని సమర్థించుకున్నారు. నేను మాత్రం ఏమంటాను సార్’’ అన్నారు మురారి.

‘నిర్మాత మీరే కదా? మరి మీరెలా ఒప్పుకున్నారు?’’ అని, మురారి నోట మాట రాకుండా నిలబడితే ‘డబ్బు కోసం పురాణాలను భ్రష్టు పట్టించేంత స్థితికి దిగజారారన్నమాట’ అనే అర్థంలో ఎన్టీయార్ కోప్పడ్డారు. మురారి జవాబు చెప్పలేకపోయారు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2021)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?