Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: జాతీయ రాజకీయాల్లో ఎన్టీయార్

ఎమ్బీయస్: జాతీయ రాజకీయాల్లో ఎన్టీయార్

రాజకీయాల్లోకి వద్దామని నిశ్చయించుకున్న ఏడాదిలోగానే రాష్ట్రస్థాయిలో కింగ్ అయిపోయిన ఎన్టీయార్ జాతీయస్థాయిలో విపి సింగ్ కావడానికి కింగ్‌మేకర్‌గా ఉపయోగపడ్డారు. ఆ క్రమంలో మనస్తాపానికి గురయ్యారు కూడా. ఆనాటి ముచ్చట్లే యీ మూడు వ్యాసాలు.

కేంద్రంలో 20 ఏళ్లపాటు కాంగ్రెసు అప్రతిహతంగా పాలిస్తూ వచ్చింది. ఇప్పుడు మోదీ పాలనను ఏమైనా విమర్శిస్తే ‘మీరెంత ఏడ్చినా బిజెపియే అన్నిచోట్లా గెలుస్తూ వస్తోంది. దాని కేమంటారు?’ అని ప్రశ్నిస్తారు కొందరు పాఠకులు. కాంగ్రెస్సూ 30 ఏళ్లపాటు కేంద్రంలో, అనేక రాష్ట్రాలలో అంతకుమించిన కాలం పాటు అలాగే గెలుస్తూ వచ్చింది. అంతమాత్రం చేత కాంగ్రెసు పాలన అద్భుతంగా వుందని మనం ఒప్పుకోవడం లేదు కదా! ఎన్నికలు గెలిచినంత మాత్రాన పరిపాలన బాగుందని అనడానికి లేదు. ఆ గెలుపుకి ప్రధాన కారణం ప్రతిపక్షాల అనైక్యత.

1967లో కొన్ని ప్రతిపక్షాలు, కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెసును ఎదుర్కోవడంతో గట్టి కుదుపు వచ్చింది. అప్పుడు ప్రధానిగా వున్న ఇందిర పరిస్థితి గమనించి, ఆనాటి కాంగ్రెసును చీల్చి, ప్రజాకర్షణీయ విధానాలతో కొత్త కాంగ్రెసును సృష్టించింది. దాంతో మరో పదేళ్లు పాలించేసింది. అయితే 1975లో విధించిన ఎమర్జన్సీ కాలంలో జరిగిన అత్యాచారాల కారణంగా ఉత్తరభారతంలో ఘోరంగా ఓడిపోయి అధికారాన్ని పోగొట్టుకుంది. ఇందిర వ్యతిరేకత మాత్రమే ఏకైక ఎజెండాగా దగ్గరకు చేరిన 5 (మొదట నాలుగు వుంటే తర్వాత ఒకటి వచ్చి చేరింది) ప్రతిపక్షాలు జనతా పార్టీగా ఏర్పడి పాలించసాగాయి. కానీ అంతర్గత కలహాలతో, రాజీపడలేని అహంకారపూరిత ప్రవర్తనతో 1979 కల్లా తమ ప్రభుత్వాన్ని కూలదోసుకున్నాయి. కొన్ని నెలలపాటు ఆపద్ధర్మ ప్రభుత్వం నడిచి, చివరకు 1980లో ఎన్నికలు జరిగితే, ఇందిరా గాంధీ బ్రహ్మాండమైన మెజారిటీతో కేంద్రంలో గెలిచింది.

1977లో జనతా పార్టీ గెలవగానే ఏ విధంగా అయితే ఉత్తరాది రాష్ట్రాలలోని కాంగ్రెసు ప్రభుత్వాలను రద్దు చేసి ఎన్నికలు నిర్వహించిందో, 1980లో ఇందిర కూడా అదే పని చేసింది. దాంతో కేంద్రంలోనే కాక, అనేక రాష్ట్రాలలో కాంగ్రెసు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెసే పాలిస్తోంది. 1982లో పార్టీ పెట్టి కాంగ్రెసుకు కంచుకోట అనుకున్న ఆంధ్రప్రదేశ్‌లో దాన్ని మట్టి కరిపించిన ఎన్టీయార్‌ను చూసి ప్రతిపక్షాలు నివ్వెరపోయాయి. ఈరోజు మోదీకి ఎదురు మాట్లాడడానికే ప్రతిపక్షాలు ఎలా దడుస్తున్నాయో, అప్పట్లో ఇందిరను చూసి ప్రతిపక్షాలు అలాగే గడగడ వణుకుతూండేవి. అలాటిది రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించి, ఇందిరను ఢీకొన్న ఎన్టీయార్‌ను చూసి ప్రతిపక్షాల మనసులో ఆశాదీపాలు వెలిగాయి. ఆ విషయాన్ని గ్రహించిన ఎన్టీయార్ జాతీయస్థాయిలో ఇందిరకు ప్రత్యమ్నాయాన్ని తయారు చేసి చూపించాలని సంకల్పించారు.

ఇందిరా గాంధీ కాకలు తీరిన రాజకీయవేత్త. ప్రత్యర్థుల బలాబలాలను చక్కగా అంచనా వేయగలరు. ఎన్టీయార్ ఘనవిజయం తర్వాత రాష్ట్ర కాంగ్రెసు నాయకులు తనను తప్పుదారి పట్టించారని గుర్తించి, తమిళనాడులాగానే ఆంధ్రప్రదేశ్ కూడా కాంగ్రెసు చేతుల్లోంచి జారిపోయిందని అర్థం చేసుకున్నారు. తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు ఒకదానితో మరొకటి పోరాడుతూనే, జాతీయ పార్టీలతో సఖ్యాన్ని పాటించాయి. ఎన్నికల వేళ పొత్తులు పెట్టుకుని అసెంబ్లీలో మూడింట రెండు వంతుల టిక్కెట్లు తాము తీసుకుని, పార్లమెంటు టిక్కెట్లలో మూడింట ఒక వంతు మాత్రమే తీసుకుంటూ, కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి సాయపడుతూ, కేంద్రం నుంచి నిధులు, ప్రత్యేక ప్రాజెక్టులు తెచ్చుకుంటూ గడుపుకుంటూ వచ్చాయి.

1983 నాటికి ఎమ్జీయార్ తమిళనాడులో అధికారంలో వున్నారు. కేంద్రంతో ఘర్షణ పెట్టుకోకుండా లాభాలు పొందుతున్నారు. ఎన్టీయార్ సాటి నటుడు ఎమ్జీయార్‌కు మిత్రుడు కాబట్టి, ఆయన లాగానే సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి, ఆయనా ఎమ్జీయార్ తరహాలోనే వుంటారని ఇందిర ఆశించారు. ఆ మేరకు రాయబారాలు పంపారు. అయితే ఎన్టీయార్ ఆలోచనలు వేరు. ఎమ్జీయార్‌కు ప్రధాని అయ్యే ఆశలు లేవు. ఆయనకు మలయాళం, తమిళం తప్ప వేరే భాష రాదు. పెద్దగా చదువుకోలేదు. పైగా అప్పటికే వయసు పెద్దది. ఎన్టీయార్ చదువుకున్నవారు. ఇంగ్లీషు అప్పటికే వచ్చు. హిందీ కూడా నేర్చుకుని ఉత్తరాదివారిని ఆకట్టుకోగలనన్న ధైర్యం వుంది. అందువలన ప్రధాని కావాలన్న ఆశ బలంగా వుంది. రాబోయే ఎన్నికలలో ఇందిరా గాంధీ పార్టీకి తగినన్ని సీట్లు రాకపోతే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తను ప్రధాని కావాలనే ఐడియా వచ్చింది.

రాజకీయ నాయకుడు ఎప్పుడూ పైకి ఎదగాలనే చూస్తాడు. ఎమ్మెల్యే పదవితో ఆగిపోదామని అనుకోడు, మంత్రి, వీలైతే ముఖ్యమంత్రి అవుదామని చూస్తాడు. అలాగే ఎన్టీయారూ ప్రయత్నించారు. ఆ దిశగా అడుగులు వేశారు. లేకపోతే ఆయన సన్యాసి కావడానికి కారణం ఏమీ కనబడదు. వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా తీసే సమయంలో ఆయన తత్త్వాలు ఎన్టీయార్‌ను బాగా ప్రభావితం చేశాయి. ‘వెధవలు, సన్నాసులు రాజ్యమేలుతారు’ అని ఆయన నీచార్థంలో ఆయన చెప్పినదానికి ఎన్టీయార్‌కి కొందరు వింత వ్యాఖ్యానాలు చెప్పారుట - వెధవ కాదు, విధవ. సన్నాసి కాదు, సన్యాసి అని. ఇందిర విధవ కాబట్టి, ఆమె తర్వాత ప్రధాని అయ్యేవారు సన్యాసి అవుతారు అని జోస్యం చెప్పారని, అందుకే ఎన్టీయార్‌ సన్యాసం తీసుకున్నారని చెప్పుకున్నారు. ఇది నిజమే కావచ్చు. లేకపోతే ఆయన సన్యాసం తీసుకోవడానికి కారణాలేవీ కనబడవు. కారణమడిగితే ‘ఎవరో ముసలాడు ఒక చిన్నపిల్లను రేప్ చేశాడని వినగానే లోకం మీద రోత పుట్టి తీసుకున్నాను’ అని కొంతకాలం చెప్పారు.

వేషానికే సన్యాసి, వివేకానందుడు తప్ప ఆయన ఏ విధంగానూ సన్యాసి లక్షణాలు ప్రదర్శించలేదు. నాన్‌వెజ్ మానలేదు. భోగాలు త్యజించలేదు. రాజకీయాలు వదులుకోలేదు. కుటుంబసభ్యులతో సంబంధాలు తెంచుకోలేదు. నిజానికి కుటుంబసభ్యులు తనను పట్టించుకోవటం లేదనే కారణం చూపి ద్వితీయవివాహం చేసుకున్నారు. సన్యాసి అయినవాడు మళ్లీ సంసారి కావడం, రంగురంగుల బట్టలు వేసుకుని, ప్రచారవేదికలపై లక్ష్మీపార్వతితో కలిసి డాన్సులు చేయడం చూస్తే ‘ఈయనేం సన్యాసిరా’ అనిపించదూ! ఇందిర మరణం తర్వాత సన్యాసి కాకుండా సంసారే (రాజీవ్) ప్రధాని కావడంతో ఎన్టీయార్‌కు ఆ జోస్యం మీద నమ్మకం పోయిందనుకోవాలి. ఏది ఏమైతేనేం ప్రధాని పదవిపై ఆయనకు కన్నుంది కాబట్టే కేంద్రంతో, కాంగ్రెసుతో తలపడ్డారు. అందుకే 1989లో ఓడిపోయారు. కేంద్రంతో రాజీపడిన ఎమ్జీయార్ ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాక చనిపోయేవరకూ అదే పదవిలో కొనసాగారు. ఎన్టీయార్ మాత్రం ఒకసారి ఓడిపోయారు.

దిల్లీలో ప్రతిపక్ష నాయకులను ఒప్పించి, తన వద్దకు రప్పించుకోవడానికి ఎన్టీయార్‌ ఉపేంద్రను ఉపయోగించుకున్నారు. ఉపేంద్ర రైల్వేశాఖలో దిల్లీలో ఉన్నతోద్యోగం చేస్తూ జనతా హయాంలో రైల్వే మంత్రిగా చేసిన మధు దండవతేతో సన్నిహితంగా వుండటం చేత ఆయన ద్వారా అనేకమంది ప్రతిపక్షనాయకులను కలుసుకుని ఒప్పించగలిగారు. 1983 మే 28-29 తారీకుల్లో విజయవాడలో జరిపిన మహానాడులో పాల్గొనమని ఎన్టీయార్ దేశంలోని 23 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 23 మంది నాయకులను ఆహ్వానించారు. అందరూ వచ్చి, ఇందిరను అడ్డుకొనకపోతే నియంతృత్వం వెర్రితలలు వేస్తుందని, అందుచేత అందరూ ఒక తాటిపై నిలబడి ఒక ఫ్రంట్‌గా ఏర్పడాలని అభిభాషించారు. తీర్మానం చేద్దామంటే ఎమ్జీయార్ అడ్డుకున్నాడు. సభలో అందరి కంటె ముందు తనే మాట్లాడి, ఇందిరకు వ్యతిరేకంగా ఏమీ అనకుండా పని వుందంటూ మద్రాసు వెళ్లిపోయాడు. ఆ తర్వాత జరిగిన కాన్‌క్లేవ్‌లకు హాజరు కాలేదు.

దీని తర్వాతది జూన్‌లో చండీగఢ్‌లో నిర్వహిస్తానని అకాలీదళ్ అంది. కానీ పంజాబ్‌లో పరిస్థితులు బాగాలేవని దిల్లీలో జరిపారు. 16 పక్షాలకు చెందిన 40 మంది నాయకులు హాజరయ్యారు. అందరూ ఇందిర దిగాలనేవారే కానీ, ప్రత్యామ్నాయం విషయంలో ఏకాభిప్రాయానికి రాలేదు. తర్వాతి సమావేశం అక్టోబరులో శ్రీనగర్‌లో జరిగే లోపునే ప్రతిపక్ష శిబిరం చీలింది. బిజెపి, లోకదళ్ కలిసి నేషనల్ డెమోక్రాటిక్ ఎలయన్స్‌గా ఏర్పడ్డాయి. జనతా పార్టీ, కాంగ్రెస్-ఎస్, డెమోక్రాటిక్ సోషలిస్ట్ పార్టీ, రాష్ట్రీయ కాంగ్రెస్, యింకా కొన్ని కలిసి యునైటెడ్ ఫ్రంట్‌గా ఏర్పడ్డాయి. శ్రీనగర్ సమావేశానికి ఎన్‌డిఏ హాజరు కాలేదు. ఈ రెండు ఫ్రంట్‌లలో దేన్ని బలపరచాలో తెలియక ఎన్టీయార్‌ చల్లబడ్డారు. ఆ తర్వాత సమావేశం 1984 జనవరిలో కలకత్తాలో జరిగింది కానీ కళ తప్పింది. ఆ తర్వాతది మద్రాసులో జరగాలి కానీ అప్పటికే వీళ్ల మధ్య విభేదాలు పెచ్చుమీరడంతో అది జరగలేదు.

ఈ కాన్‌క్లేవులు చూసి ఇందిర చికాకు పడ్డారు. ఉత్తర భారతం గాలికోడిలా అటూయిటూ తిరిగినా, దక్షిణాదిన కాంగ్రెసు బలంగా వుంటూ వచ్చింది. ఈ ఎన్టీయార్‌ ధర్మమాని ఒక పెద్ద రాష్ట్రంలో గండి పడింది. పోనీలే అని వూరుకుంటే యీ ఎన్టీయార్‌ తక్కినవాళ్లను కూడా రేప్పెడుతున్నాడు అని చికాకు పడి, అధికారుల ద్వారా కూడా రాయబారాలు పంపారు. ఎన్టీయార్‌ మాకు రాష్ట్రమే ముఖ్యం అని పైకి చెప్తూనే ఇందిరను ధిక్కరించడానికి నిశ్చయించుకున్నారు. 1984 జులైలో ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేసిన జాతీయాభివృద్ధి మండలి సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన విషయాలపై కాకుండా జులైలో కశ్మీరులో ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వ బర్తరఫ్‌ను నిరసిస్తూ రాజకీయ ప్రకటన చదివారు. నేను చదవబోయేది యిది అని ముందుగా సర్క్యులేట్ చేసిన ఉపన్యాసం వేరు, యీయన అక్కడ యిచ్చిన ఉపన్యాసం వేరు.

‘ఇది రాజకీయవేదిక కాదు, ఉపన్యాసం ఆపండి’ అని ఇందిర ఎంత చెప్తున్నా వినకుండా ఎన్టీయార్ ప్రసంగిస్తూనే పోయారు. దానితో దాన్ని రికార్డులోంచి తొలగిస్తున్నట్లు ఇందిర ప్రకటించారు. దీనికి నిరసనగా ఎన్టీయార్‌ వాకౌట్ చేశారు. ఆయనతో బాటే కర్ణాటక, బెంగాల్, త్రిపుర ముఖ్యమంత్రులు కూడా వాకౌట్ చేశారు. దీంతో ఎన్టీయార్‌కు ముకుతాడు వేయకపోతే తక్కినవాళ్లను కూడా ‘చెడ’గొట్టేట్టున్నాడని ఇందిర అనుకున్నారు. వెంటనే వెంగళరావును కాంగ్రెసులోకి ఆహ్వానించారు. నాదెండ్లతో బేరాలాడి, టిడిపిని చీల్చారు. అయితే నాదెండ్ల బలాన్ని అతిగా అంచనా వేయడంతో ఆ పథకం పారలేదు. 1984 ఆగస్టులో నాదెండ్ల తిరుగుబాటును ఎన్టీయార్ ప్రజాబలంతో ఎదుర్కుని, ఇందిర అహాన్ని మరోసారి దెబ్బ తీశారు. (సశేషం) 

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2021)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?