cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: దైవోపహతుడు ఈడిపస్‌

ఎమ్బీయస్‌: దైవోపహతుడు ఈడిపస్‌

ఫ్రాయిడ్‌ ప్రతిపాదించిన ఈడిపస్‌ కాంప్లెక్స్‌ అర్థం చేసుకోవడానికి గ్రీకు పురాణపాత్ర ఈడిపస్‌ గురించి చెప్పబోతున్నాను. ఇతని కథను క్రీ.పూ. 5వ శతాబ్దంలో సోఫోక్లిస్‌ అనే గ్రీకు నాటకకర్త ‘ఈడిపస్‌ రెక్స్‌’ (రే అని ప​ల​కాలి ​-​ రాజు అని అర్థం) పేర నాటకంగా మలిచాడు. ఇది ప్రపంచమంతా ప్రఖ్యాతి చెందింది. అనేక భాషల్లో సినిమాగా వచ్చింది. బెంగాలీ నాటక, సినీ కళాకారుడు, ‘‘జాగ్‌తే రహో’’ హిందీ సినిమాకు సహదర్శకుడు ఐన శంభు మిత్రా ‘‘రాజా ఈడిపస్‌’’ పేర నాటకంగా వేసి చాలా పేరు తెచ్చుకున్నారు. ​తెలుగులో కూడా కొందరు వేశారు. నాటకానువాదం ​ తెలుగులో పుస్తకరూపంలో వచ్చినట్లు గుర్తు. ఇక కథలోకి వస్తే​-

గ్రీసులోని థేబ్స్‌ రాజ్యంలో ప్లేగు వ్యాధి ప్రబలింది. ప్రజంతా రా​​జైన ఈడిపస్‌ దగ్గరకు వచ్చి ఏదైనా చేయమని మొర పెట్టుకున్నారు. దీనికి దైవికమైన కారణం ఏదో ఉంటుందని, డెల్ఫిలో ఉన్న అపోలో గుడి జోస్యు​ల​ను సంప్రదించి పరిష్కారం ​ తెలుసుకుంటానని రాజు హామీ యిచ్చాడు. అతను కొన్నేళ్ల క్రితం ఆ రాజ్యానికి యాదృచ్ఛికంగా రాజయ్యాడు. నిజానికి అతను పొరుగున ఉన్న కోరింథ్‌ రాకుమారుడు.  అనూహ్య పరిస్థితుల్లో ఆ రాజ్యాన్ని వదిలి థేబ్స్‌ వైపు వస్తూండగా దారిలో స్ఫింక్స్‌ అనే వింత జంతువు అడ్డగించింది. దానికి స్త్రీ త​ల​, రొమ్ము​లు​, సింహం శరీరం, గ్రద్దలా రెక్క​లు​ వుంటాయి. అది నేను ఒక చిక్కుప్రశ్న వేస్తాను. సమాధానం చెప్పకపోతే చంపేస్తాను అంది. అది అలా అడుగుతూనే థేబ్స్‌ పౌరు​ల​ నెందరినో భక్షించేసింది. దాని బాధ పడలేక ‘దాన్ని ఎవరైనా చంపితే వారిని రాజును చేసి, రాణీగారినిచ్చి పెళ్లి చేస్తాం’ అని రాజప్రతినిథి, రాణిగారి సోదరుడు అయిన క్రియాన్‌ ప్రకటించి వున్నాడు.

జరిగినదేమిటంటే ఆ రాజ్యానికి లాయియస్‌ అనే రాజుగారు ఉన్నారు కానీ ఆయన ఏదో సందర్భంలో జోస్యం చెప్పించుకోవడానిక​కై​ డెల్ఫికి వెళ్తూంటే, మార్గమధ్యంలో బందిపోట్లెవరో చంపేశారు. రాణి వితంతువు అయింది. వారికి ​ పిల్లలు లేరు. అందుకని ఈ ప్రకటన చేశారు. ఈడిపస్‌కు యిదంతా ఏమీ తెలియదు. ఆ స్ఫింక్స్‌తో నీ ప్రశ్నేమిటో అడగమన్నాడు. ‘‘ఉదయం నా​లు​గు కాళ్ల మీద, మధ్యాహ్నం రెండు కాళ్ల మీద, సాయంత్రం మూడు కాళ్ల మీద నడిచే ప్రాణి ఏది?’’ అని అడిగిందది. ‘‘మనిషి, చిన్నపుడు పాపడిగా నా​లు​గు కాళ్ల మీద ​పాకుతాడు, ముసలితనంలో కర్రసాయంతో ​కుంటుతాడు. యవ్వనంలో దృఢంగా రెండు కాళ్ల మీద ని​ల​బడతాడు’ అన్నాడు. సరైన సమాధానం చెప్పడంతో ఆ స్ఫింక్స్‌ తనంతట తనే కొండమీద నుంచి కిందకు పడి చచ్చిపోయింది.​ ​

ఈ సంగతి తెలియగానే థేబ్స్‌ ప్రజ​లు​ అతన్ని రాజుగా చేసి, రాణి జోకాస్తాను యిచ్చి పెళ్లి చేశారు. వారికి యిద్దరు కూతుళ్లు , తర్వాత యిద్దరు కొడుకు​లు​ పుట్టారు. అంతా సుఖంగా వున్న సమయంలో యీ ప్లేగు వచ్చింది. ఈడిపస్‌ బావమరిది ఐన క్రియాన్‌ అపోలో గుడికి వెళ్లి అడిగితే జోస్యు​లు​ ‘పాత రాజు లాయియస్‌ను చంపినవాడిని శిక్షిస్తే తప్ప యీ మహమ్మారి పీడ దేశానికి వద​ల​ద’ని చెప్పారు. ఇక ఆ హంతకుడి జాడ కనిపెట్టడం రాజుగారి పని అయింది. ఆ సంఘటన జరిగి చాలా ఏళ్లయి పోయింది. కనుక్కోవడం ఎలా అని విచారిస్తే టిరియాసిస్‌ అనే ఓ ముసలి గ్రుడ్డివాడు సోదె చెప్పగ​ల​డని రాజుకి ప్రజలు​ సూచించారు.

టిరియాసిస్‌ను తన వద్దకు రప్పించి ఈడిపస్‌ ఆ హంతకుడి గురించి అడిగాడు. అతను నోరు విప్పలేదు. కొన్ని సందర్భాల్లో సత్యాన్వేషణ చేయకపోతేనే మంచిదన్నాడు. దాంతో రాజుకి కోపం వచ్చింది. ‘‘ఈ మహమ్మారి తగ్గకుండా ఉండా​ల​ని, ఆ విధంగా నాపై ప్రజ​ల​కు ఆగ్రహం పెరగా​ల​ని నీ కుట్ర. ​లం​చం యిచ్చి నీ చేత యిలా చేయిస్తున్నవాడు క్రియాన్‌. ప్రజ​లు​ తిరగబడి నన్ను పదవీభ్రష్టుణ్ని చేస్తే తను గద్దె కెక్కా​ల​ని చూస్తున్నాడు’ అంటూ తిట్టిపోశాడు. దాంతో టిరియాసిస్‌ నోరు విప్పాడు.  ఆ హంతకుడు తన తల్లికి మొగుడు, కూతురికి సోదరుడు అని చెప్పి వెళ్లిపోయాడు. ఈడిపస్‌ ఆశ్చర్యపడ్డాడు. తల్లితో రమించి ​పిల్ల​ల్ని కనేవాడు ఎవడైనా ఉంటాడా? తను యిలాటి ప్రమాదాన్ని తప్పించుకునే కదా యిక్కడకు చేరాడు అని గతం గుర్తు చేసుకున్నాడు.

అతను కోరింథ్‌ రాజ్యానికి రాజైన పోలిబస్‌కి కుమారుడు. తల్లి మెరోప్‌. పెరిగి పెద్దవాడయ్యాక అతనో సారి డెల్ఫి గుడికి వెళ్లాడు. అక్కడి జోస్యు​లు​ అతని ఒక ఘోరమైన విషయం చెప్పారు ​- ‘నువ్వు తండ్రిని చంపుతావు, తల్లిని కూడతావు.’ అని. ఇతను హడిలిపోయాడు. క​ల​లోనైనా ఊహించలేని విషయమది. తెలిసితెలిసి తను అటువంటి ద్రోహం చేయడు. పొరబాటున కూడా అలా జరగకుండా ఉండా​లం​టే అస​లు​ ఆ రాజ్యంలో లేకుండా ఎక్కడికో వెళ్లిపోతే మంచిది అనే ఆలోచనతో థేబ్స్‌ వైపు ప్రయాణం సాగించాడు. అనుకోకుండా దారిలో స్ఫింక్స్‌ తగ​ల​డం, యీ దేశానికి రాజు కావడం జరిగాయి.

పాత రాజు హంతకుడి సంగతి విన్నాక యిలాటి త​ల​రాత దేవుడు యింకా కొందరికి రాసినట్లున్నాడే అనుకున్నాడు. కానీ పాత రాజుగారికి ​పిల్లలే లేనపుడు ఆయన కొడుకు చేతిలో హతుడయ్యాడని ఎలా అనగ​లం​? అది సరే, కుట్రదారుడు క్రియాన్‌ యిలాటి పన్నాగా​లు​ మరిన్ని పన్నకుండా మరణశిక్ష విధించడం అన్నిటి కంటె ముఖ్యమైన పని అనుకున్నాడు ఈడిపస్‌. క్రియాన్‌ వచ్చి తన కలాటి దురుద్దేశం ఎంతమాత్రం లేదని, కావా​లం​టే గుడికి వెళ్లి ఒట్టు వేస్తానని, అక్కడి జోస్యు​లు​ ఏం చెప్తారో చూదామని అన్నాడు.

జోకాస్తా క​ల​గచేసుకుని, క్రియాన్‌కు అలాటి బుద్ధి లేదని, అనవసరంగా శిక్షించవద్దని నచ్చచెప్పింది. ‘‘అయినా జోస్యా​లు​ నమ్మవద్దు, నా పాత భర్తకు జోస్యు​లు​ యిలాగే నీ కొడుకు చేతిలో చస్తావని చెప్పారు. మాకు కొడుకు లేడు, పైగా ఆయన రహదారిలో బందిపోట్ల చేతిలో చచ్చిపోయాడని అందరికీ ​తెలు​సు. అందువ​ల​న ఈ జోస్యా​లు​, పాత రాజు హంతకుడి వేట యివన్నీ పక్కన పెట్టి వ్యాధిని అదుపులో తెచ్చేందుకు ఏదైనా మార్గం చూడు’’ అంటూ హితవు చెప్పింది.

కానీ ఈడిపస్‌ వినలేదు. పాత రాజు ఎక్కడ చనిపోయాడు, ఆ సమయంలో అతని పక్కన వున్నవారెవరు అని తీవ్రంగా విచారణ జరిపించాడు. చివరకు హత్యకు సాక్షిగా వున్న బానిస దొరికాడు. అతను వచ్చి డెల్ఫి నుంచి వచ్చేదారిలో మూడు వీధు​లు​ కలిసేచోట పాత రాజుతో ఒక యువకుడికి వాగ్వివాదం జరిగిందని, ఆ యువకుడు రాజును పొడిచి చంపేశాడనీ చెప్పాడు. వెంటనే ఈడిపస్‌కు అర్థమైంది. ఆ యువకుడు వేరెవరో కాదు, తనేనని. కోరింథ్‌ వదిలి థేబ్స్‌కు వస్తూంటే ఓ ముసలాయన చాలా పొగరుగా మాట్లాడి, తనను కొట్టి, కవ్వించడంతో అతన్ని పొడిచి చంపేశాడు. ఆ తర్వాతే స్ఫింక్స్‌ని చూడడం జరిగింది. ఆ రాజు భార్యను పెళ్లాడడం, ​ పిల్లల్ని కనడం జరిగింది. తను అతని కొడుకా? తన భార్య జోకాస్తా తన కన్నతల్లా? అలా ఎలా సంభవం? తన తలిదండ్రు​లు​ వేరేవారు కదా! వారికి అపకారం జరగకూడదనే కదా తను దేశం విడిచి వచ్చేశాడు!​ ​

ఇంతలో కోరింథ్‌ నుంచి ఒక వార్తాహరుడు వచ్చి అతని తండ్రి మరణవార్త చేరవేశాడు. ఆయన పోతూపోతూ ఈడిపస్‌కు రాజ్యాన్ని అప్పగిస్తూ శాసనం చేశాడు. ‘వచ్చి తల్లిని ఓదార్చి, రాజ్యభారాన్ని స్వీకరించమ’ని వార్తాహరుడు కోరాడు. ’వద్దు, నేను అక్కడకు వస్తే అనర్థం జరుగుతుంది.’ అంటూ ఈడిపస్‌ తను విన్న జోస్యం గురించి చెప్పాడు. అప్పుడు వార్తాహరుడు ‘ఆ జోస్యం ప్రకారమైతే ఆయన నీ చేతుల్లో చావాలి. కానీ మామూ​లు​ పరిస్థితుల్లోనే పోయాడు కదా. పైగా నువ్వు ఆయన పెంపుడు కొడుకువి తప్ప అస​లు​ కొడుకువి కాద​ని చెప్పుకుంటారు.’ అన్నాడు.

ఈడిపస్‌ ఉలిక్కిపడ్డాడు. తన జన్మ గురించి ఆరా తీశాడు. సమాధానం చెప్పడానికి యిష్టపడని వారిని రొక్కించి, చంపుతానని బెదిరించి, జవా​బులు​ రాబట్టాడు. ఒక కొండపై గొఱ్ఱె​ల​కాపరికి ​ఓ పిల్లవాడు ​దొరికితే అతను కోరింథ్‌ రాజుకి అప్పగించాడని, ​పిల్ల​వాడి పాదా​లు​ కట్టివేయబడి ఉబ్బివుండడంతో, పాదా​లు​ వాచినవాడు అనే అర్థం వచ్చేట్లు ఈడిపస్‌ అని పేరు పెట్టి ఆ దంపతు​లు​ తమ కొడుకుగా పెంచారని తెలిసింది. ఇంతకీ తనను కొండ మీద వదిలేసిన వారెవరు?

అప్పటికి జోకాస్తా కు జరిగినదేమిటో అవగాహనలోకి వచ్చింది. ‘నువ్వు నీ కొడుకు చేతిలోనే మరణిస్తావ’ని తన భర్త లాయియస్‌కు జోస్యు​లు​ చెప్పడంతో తాము ​పిల్లలు​​ వద్దనుకున్నారు. అయితే ఓ రోజు రాత్రి బాగా మద్యం సేవించడంతో అనుకోకుండా రతిలో పాల్గొనడం వ​ల​న ఆమె గర్భవతి అయింది. కొడుకు పుట్టాడు. లాయియస్‌ ఆ ​ పిల్లవాణ్ని చంపేయమన్నాడు. అయితే కన్నబిడ్డను స్వయంగా చంపడానికి ప్రాణం రాక, తనను తాను రక్షించుకోలేని విధంగా వాడి పాదా​లు​ రెండూ బిగించి కట్టేసి, ఒక సేవకుడికి యిచ్చి కొండమీద వదిలేయమంది. ఆ ​ పిల్లవాడే ఈడిపస్‌ అయి వుంటాడు.

తన సేవకుడు కొండ మీద గాలికి వదిలేయకుండా పసిబిడ్డపై జాలితో తన స్నేహితుడైన గొఱ్ఱె​ల​ కాపరికి యిచ్చి వుంటాడు, ఆ కాపరి కోరింథ్‌ రాజుకి యిచ్చినట్టున్నాడు. అనర్థం జరగకుండా ఎంతో​​మంది ఎంత ప్రయత్నించినా విధి క్రూరంగా తమందరి జీవితా​ల​తో ఆడుకుంది. ఇది అర్థం చేసుకున్నాక ఆమె జరిగింది జరిగిందనుకుని ఈడిపస్‌ను నిజా​లు​ తవ్వడం ఆపమని బతిమాలింది. కానీ అతను పట్టుబట్టాడు.

నిజా​లు తెలుసుకోవా​ల​ని పరితపిస్తున్న అతని బాధ యిక చూడలేక గతమంతా ఈడిపస్‌కు చెప్పి ఏడుస్తూ తన అంతఃపురంలోకి పరిగెట్టుకుంటూ వెళ్లి ఉరి వేసుకుని చనిపోయింది. ఈడిపస్‌ పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. తన ప్రమేయం లేకుండానే జరిగినా తల్లితో శయనించిన పాపానికి ఒడిగట్టానని బాధపడ్డాడు. తెలిసి చేసినా, తెలియక చేసినా పాపం పాపమే అనుకుంటూ రాజమందిరమంతా పిచ్చెక్కినవాడిలా తిరిగాడు.

చివరకు జోకాస్తా మందిరానికి వెళితే అక్కడ ఆమె శవం కనబడింది. ఆమె దుస్తుల్లోంచి రెండు బంగారు పిన్నులను బయటకు లాగి వాటితో తన కళ్లు తనే పీకేసుకున్నాడు. ఆ తర్వాత తన బావమరిది, నిజానికి మేనమామ అయిన క్రియాన్‌ను తన రాజ్యానికి రాజప్రతినిథిగా, పిన్నవయస్కులైన తన మగపిల్లలకు  సంరక్షకుడిగా నియమించాడు. దేశం విడిచి వెళ్లిపోయాడు. అతనితో బాటు అతని కూతురు ఆంటిగన్‌ తోడుగా వెళ్లింది. చివరకు అనామకుడిగానే మరణించాడు. ఇదీ ఈడిపస్‌ విషాదగాథ. ఈడిపస్‌ కాంప్లెక్స్‌ గురించి తర్వాతి వ్యాసంలో! (చిత్రం- అంధుడైన ఈడిపస్‌ తన కూతురు ఆంటిగన్‌తో కలిసి నగరాన్ని విడిచి వెళ్లే ఘట్టం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2020)​
mbsprasad@gmail.com