Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: జరా దు:ఖం

ఎమ్బీయస్‌: జరా దు:ఖం

'జన్మ దు:ఖం, జరా (వృద్ధాప్యం) దు:ఖం, జాయా (పుట్టడం) దు:ఖం పున: పున: (మళ్లీ మళ్లీ), సంసారసాగరం దు:ఖం, తస్మాత్‌ జాగ్రత, జాగ్రత' అని ఆదిశంకరుల శ్లోకం ఉంది. ముసలితనం నిజంగా దు:ఖమయమే. జన్మంతా కష్టాలున్నా భరించడానికి ఓపిక ఉంటుంది. ముసలితనం వచ్చేసరికి శారీరకంగా, మానసికంగా అలసట వచ్చేస్తుంది. అందువలన జీవితంపై విసుగు కలుగుతుంది. '60 తర్వాతే జీవితం ప్రారంభమవుతుంది' అంటూ ఎన్నయినా ఆర్టికల్స్‌ రావచ్చు.

కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. 'శరీరం ఆద్యం ఖలు ధర్మసాధనం' అని ఆర్యోక్తి. ధర్మాన్ని సాధించాలంటే శరీరమే మొదటిది కదా అని అర్థం. శరీరం బాగా ఉంటేనే ధర్మమైనా, ఏ కర్మ అయినా చేయగలం. కానీ శరీరం నిస్సారం అయినపుడు, త్వరగా డస్సిపోతున్నపుడు ఏం సాధించగలం? వ్యాయామం చేయాలి, యోగా చేయాలి, మెడిటేషన్‌ చేయాలి... యిలా చెప్పుకుంటూ పోవచ్చు. ఎంత చేసినా వయోధర్మాన్ని, ప్రకృతి ధర్మాన్ని ఎవరూ అధిగమించలేరు. ఫలానా జంతువు ఆయుర్దాయం యింత అన్నట్లు, మనిషికి మాగ్జిమమ్‌ ఆయుర్దాయం నూరేళ్లు. (అది దాటినవారు అరుదైన మనుష్యులు). కానీ అది కూడా అందుకోలేనివారే ఎక్కువ. జ్యోతిష శాస్త్రప్రకారం పూర్ణాయుర్దాయం అంటే 65.

అందుకే షష్టిపూర్తి ఘనంగా జరిపేవారు. పోనుపోను సగటు ఆయుర్దాయం పెరిగింది. ఇప్పటి పరిస్థితుల ప్రకారం 45కి మధ్యవయసు వస్తుందనుకుంటే 65 దాటితే వృద్ధాప్యం అనే అనుకోవచ్చు. ఈ రోజుల్లో ఒక రకమైన జీవనస్థాయి కలవారు 75,80 వరకు బతుకుతున్నారు కాబట్టి 10, 15 ఏళ్ల వృద్ధాప్య జీవితం తప్పనిసరి అనుకోవాలి.

ముసలితనం వస్తున్న కొద్దీ చూపు మందగిస్తుంది. వినికిడి తగ్గుతుంది. జుట్టు తెల్లబడుతుంది, రాలుతుంది, కీళ్ల నొప్పులు, ఎక్కువ దూరం నడిస్తే ఆయాసం, కాస్త ఎక్కువ తింటే అరక్కపోవడం, నిద్ర పట్టకపోవడం.. యిలాటివెన్నో ముంచుకు వస్తాయి. ఇది సహజం. కారైనా, ఫ్రిజ్‌ అయినా, వాషింగ్‌ మెషినయినా దేనికైనా సరే, కొన్నేళ్ల వరకే గ్యారంటీ ఉంటుంది. తర్వాతి నుంచి ట్రబుల్‌ యివ్వడం మొదలెడుతుంది.

ముందు నుంచీ జాగ్రత్తగా చూసుకుంటే కాస్త ఎక్కువ కాలం మన్నుతాయి. లేకపోతే త్వరగా పాడై పోతాయి. కొంతకాలం రిపేర్లతో నడుస్తాయి. మరి కొంతకాలం సగం ఎఫిషియన్సీతో నడుస్తాయి. ఆ తర్వాత సాంతం మూలపడేయాల్సి వుంటుంది. మన ఇంద్రియాలూ అంతే. ఎవరో ఎనభై ఏళ్ల వయసులో ఎవరెస్టు ఎక్కారు, తొంభై ఏళ్ల వయసులో తొమ్మిది మైళ్లు యీత కొట్టారు... అంటే వాళ్లు ముందునుంచీ క్రమశిక్షణతో ఉంటూ అలాటి విన్యాసాలు చేస్తూ ఉండి ఉంటారు. మనం జీవితమంతా ఎసి గదుల్లో, కుషన్‌ కుర్చీల్లో గడిపి, చివర్లో వాళ్లలా సాహసాలు చేయాలంటే కుదిరే పని కాదు. 

ఈ రోగాల్లో చాలా భాగం సైకో-సొమాటిక్‌ వ్యాధులే. మనసు, శరీరం పరస్పరాశ్రితాలు. ఆయుర్వేదంలో చెప్తారు. నేతి గిన్నెను వేడి చేసినపుడు గిన్నె వేడెక్కడం చేత నెయ్యి కరుగుతుంది, నెయ్యి వేడెక్కి కరగడం చేత గిన్నె వేడెక్కుతుంది. అలాగే శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసూ కుదుట పడుతుంది. మనసు దిగులుతో ఉంటే శరీరం కృశిస్తుంది. మానసిక బాధల చేత శరీరం ప్రభావితం కావడమనేది తక్కిన ఏ వయసులో కన్నా వార్ధక్యంలోనే ఎక్కువ.

అందుకే మనసు ప్రశాంతంగా ఉంచుకోండి, ధ్యానం చేయండి, శారీరక బాధలు తగ్గుతాయి అని వైద్యులు సలహా యిస్తారు. ఇది చెప్పినంత సులభం కాదు. ఎందుకంటే ముసలితనమనేది సమీక్షా సమయం. ఎకరా మూడు వేలకు వచ్చినపుడు ఓ పది ఎకరాలు కొని పడేయాల్సింది, ఫలానా షేర్‌లో పెట్టుబడి పెట్టి ఉంటే యిప్పుడు లక్షల విలువ చేసేవి, వాణ్ని అలా అని వుండకూడదు, వీణ్ని అంత చులాగ్గా వదిలేసి ఉండకూడదు, ఫలానావాణ్ని నమ్మి మోసపోయాను, శంకరగిరి మాన్యాలకు బదిలీ అయినా ఫర్వాలేదనుకుని అప్పుడు ప్రమోషన్‌కు ఒప్పుకోవాల్సింది... ఇలా అనంతంగా ఆలోచనలు వస్తూంటాయి.

సినిమా సమీక్ష చూడండి, కథనంలో లోపం ఉంది, గ్రాఫ్‌ పడిపోయింది, సీను పండలేదు... యిలా ఎన్నయినా చెప్తాడు సమీక్షకుడు. అతణ్నే కథ రూపొందించే సమయంలో కూర్చోబెడితే యివేవీ తట్టవు. అలాగే జీవితం కూడా. తరచి తరచి చూసుకున్న కొద్దీ లోపాలే ఎక్కువ కనబడతాయి. కొంత మంచి కనబడినా, యింకా బాగా చేసి ఉండవచ్చు అనిపిస్తుంది.

నిజం చెప్పాలంటే యీ సమీక్షల వలన ఎవరూ లాభపడరు. 'ఇదీ నా గతానుభవం. దీనివలన మీరు నేర్చుకుని బాగుపడండి, ఆ తప్పులు చేయకండి' అని ఎవరికైనా చెప్దామంటే ఎవరూ వినరు. నిజానికి అందరూ అలా వినేసేమాటయితే రామాయణ, భారతాల తర్వాత ఎవరూ ఏమీ చెప్పనక్కరలేదు. సమస్త నీతివాక్యాలు ఉదాహరణలతో సహా అక్కడున్నాయి. అయినా విన్నంత మాత్రాన ఎవరూ నేర్చుకోరు. ఎవరికి వారు అనుభవించి, నేర్చుకోవాల్సినవే చాలా ఉంటాయి.

మన ముందు ఉన్నవాడు నాచుపై జారిపడడం కళ్లారా చూసినా, 'వాడికి చేతకాలేదు, నేనైతేనా..' అనుకుంటూ దానిపై కాలేసి జారిపడాల్సిందే. అప్పుడే పాఠం వంటబడుతుంది. ముసలితనంలో ఒక తాపత్రయం మొదలవుతుంది. తనకు తెలిసినదంతా లోకులకు చెప్పేసి, వాళ్ల కళ్లు తెరిపించి మరీ నిష్క్రమిద్దామని! అవకాశం దొరికితే గతంలోకి వెళ్లి కథలు మొదలెడతారు. అంతవరకూ ఓర్చుకోవచ్చు, కానీ అలాగే చేయమని యీ తరం వాళ్లను ఒత్తిడి చేస్తారు. అక్కడ వస్తుంది ఘర్షణ. పిన్నలు దూరంగా జరుగుతారు.

'నన్ను పట్టించుకోవటం లేదు' అనే వేదన ముసలివాళ్లల్లో బయలుదేరుతుంది. దీన్నే వాళ్లు చెక్‌ చేసుకోవాలి. తెలిసినా అడిగేదాకా సలహా చెప్పకపోవడం ఉత్తమం. సూచన లివ్వవచ్చు కానీ అవి అవతలివాళ్లు పాటిస్తారన్న ఆశ పెట్టుకోకూడదు. చెప్పడం నా ధర్మం, వినకపోతే నీ ఖర్మం అనే ఫిలాసఫీ బాగా వంటబట్టించుకోవాలి. లేకపోతే యింట్లో ముసలివాళ్లుంటే న్యూసెన్సు అని పిల్లలు, మనుమలు అనుకునే పరిస్థితి వస్తుంది. 

నిజానికి ముసలివాళ్లు యువతీయువకులతో మసలితేనే మంచిదని చెప్తారు. సమవయస్కులతో మసలుతూంటే నిత్యం వ్యాధుల గురించి, మరణాల గురించి వినివిని నిరాశానిస్పృహలు కమ్ముకుంటాయిట. అంతకంటే యువతరంతో కబుర్లు చెప్తూ ఉంటే ఆధునిక లోకం పరిచితమవుతుంది, జీవితంపై ఆసక్తి పెరుగుతుంది. అయితే మీరు వాళ్ల దగ్గరకు వెళ్లాలనుకున్నా, వాళ్లు మిమ్మల్ని వాళ్ల దగ్గరకు రానీయక పోవచ్చు.

వాళ్లతో కలవడానికి షార్ట్‌స్‌, టీ షర్ట్‌స్‌ వేసుకోవడం, జుట్టుకు రంగేసుకోవడం ప్రధానం కాదు. మీ ఏటిట్యూడ్‌ వారికి నచ్చాలి. వారి భావాలు మీరు అర్థం చేసుకోగలగాలి.మారుతున్న పోకడలను మీరు జీర్ణం చేసుకుని, వాటికి తగ్గట్టుగానే మీ ఆలోచనావిధానం మార్చుకోగలగాలి. ముఖ్యంగా ఉపన్యాసాలు మానేసి, ఎదుటివాళ్లు చెప్పేది వినాలి. జీవితంలో అన్నీ చూసేసిన మీకు, కొన్ని విషయాలపై వాళ్లకున్న ఉబలాటం విసుగ్గా తోచవచ్చు. కానీ దాన్ని కనబరచకూడదు. వాళ్ల దృక్కోణాన్ని అవగాహన చేసుకోవాలి. వారితో ఆలోచనలు పంచుకోవాలి. అప్పుడే మీ శారీరక, మానసిక బాధల గురించి చింతించడానికి టైముండదు.

ముసలితనం అంటే కృష్ణారామా అనుకుంటూ గడపాలి అని చాలామంది అంటూంటారు. మతపరమైన కార్యకలాపాలు వేరు, ఆధ్యాత్మికత వేరు. బిజీ లైఫ్‌ గడిపే రోజుల్లో గుడికి వెళ్లడం, రోజూ పూజ చేయడం,  పుణ్యక్షేత్రాలకు వెళ్లడం, పురాణకాలక్షేపాలకు, ప్రవచనాలకు వెళ్లడం యివన్నీ కుదరవు. ముసలితనం వచ్చాక, చేసేందుకు ఏమీ లేక యివన్నీ చేయడం మొదలుపెట్టవచ్చు. చాలామంది అంతకు ముందు అలవాటు లేకపోయినా బొట్టు పెట్టుకోవడం, రుద్రాక్ష మాల వేసుకోవడం, నాన్‌వెజ్‌ తినడం మానేయడం, మందు అలవాటు ఉంటే తగ్గించకోవడం లేదా మానేయడం... యిలాటివి చేస్తూన్నారు.

పంచారామాలు, నవదుర్గలు అంటూ లెక్క పెట్టుకుని తీర్థయాత్రలు కూడా చేస్తున్నారు. ఒకలా చూస్తే యివన్నీ పెద్ద కష్టమైనవి కావు. అసలైన కష్టమంతా మనసును ఆధ్యాత్మికత వైపు మళ్లించుకోవడంలో ఉంది. నా ఉద్దేశంలో ఆ ధోరణి చిన్నప్పటి నుంచీ ఉండాలి. జుట్టు తెల్లబడింది కదాని 'నిష్కామకర్మ యోగం' పట్టుబడదు. ఇలాటి వైరాగ్యాలన్నీ ముసలితనంలో చూసుకుందామనుకుని యవ్వనంలో అటకెక్కించి ఉంచితే ఆ తర్వాత అవి అటక దిగవు. 

నిజానికి పూజాది కర్మకాండలన్నీ సోపానంలో దిగువ మెట్టే. దాని కంటె పైది జ్ఞానమార్గం. మనతో వచ్చిన చిక్కేమిటంటే మనం చావు దగ్గర పడుతూ ఉంటే దిగువ మెట్టు దగ్గర తచ్చాడడం మొదలుపెడతాం. 'సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చల తత్త్వే జీవన్ముక్తి:' అంటారు శంకర భగవత్పాదులు.

ఈ స్టెప్స్‌ దాటుకుని వచ్చి నిర్మోహత్వం స్టేజికి వచ్చేసి ఉండాలి చావు దగ్గర పడేవేళకి. మనం యింకా సత్సాంగత్యం వెతుక్కునే స్థితిలోనే ఉంటున్నాం. ఇటీవలి కాలంలో ప్రవచనాలపై మోజు పెరిగింది. అవి వినడం, ప్రవచనకర్త కాళ్ల మీద పడి దణ్ణాలు పెట్టడంతో సరిపెడుతున్నాం. వాటిని ఆచరణలో పెట్టినపుడే ఫలితం. కాళ్లూ, కీళ్లూ కీచుకీచు మంటూండగా, మెదడులో హాస్పిటల్‌ బిల్లు తప్ప మరేదీ గోచరించని స్థితిలో ఏ సూక్తిని ఆచరించగలం? ఏ పరోపకారం చేయగలం? 

ఇక పూజ చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం అంటూంటారు. ఇటీవలి కాలంలో పూజగది లేకుండా యిళ్లు కట్టడం లేదు. స్తోత్రాలూ అవీ చదివేసరికి గంట దాటుతోంది కాబట్టి అంతసేపు కూర్చుంటే కాళ్లు పట్టేస్తున్నాయని ఆ గదిలో ఎత్తు పీటలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. వీళ్లంతా ఏకాగ్రతతో చేయగలుగుతున్నారా అనే సందేహం నన్నెప్పుడూ పీడిస్తూ ఉంటుంది. ఎందుకంటే నాకు మెడిటేషన్‌లో కూడా ఎప్పుడూ ఏకాగ్రత కుదరలేదు.  కుదురుగా కూర్చున్నపుడే అన్ని రకాల ఆలోచనలూ వెల్లువెత్తుతాయి. ఎక్కడెక్కడి విషయాలూ, ఎప్పటివో సంగతులూ, రేపు వచ్చేవారం పై నెల చేయాల్సిన పనులూ గుర్తుకు వచ్చేస్తాయి.

వీపు గోక్కో బుద్ధవుతుంది, పాదాలు తిమ్మిరెక్కుతాయి. ఇంట్లో చీమ చిటుక్కుమన్నా వినబడుతుంది. పనిమనిషి కాలింగ్‌ బెల్లు కొట్టిన సంగతి యింట్లో ఎవరూ గుర్తించరు కానీ మనమే గుర్తిస్తాం. కోతిలాటి మనసును కట్టడి చేద్దామని అనుకుంటూండగానే పుణ్యకాలం గడిచిపోతుంది. స్తోత్రాలు కూడా ఒకసారి కంఠస్తం అయిపోయాక మెకానికల్‌గా చదివేస్తాం తప్ప పూర్తి దృష్టి పెట్టలేం. 'ఇవాళ సరిగ్గా జరగలేదు కానీ, రేపు శ్రద్ధగా చేద్దాం' అనుకుంటూ లేచిపోతాం. ఇలా ఎన్ని గంటలు కూర్చుంటే మోక్షం వస్తుందా అనిపిస్తుంది. 

మోక్షం అని ఎందుకంటున్నానంటే ముసలితనంలో మాటిమాటికి గుర్తు వచ్చే అంశం - చావు. నా దృష్టిలో సృష్టికర్త వృద్ధాప్యాన్ని యింత వ్యథాభరితంగా చేయడానికి కారణం జీవికి జీవితంపై విరక్తి కలిగించడమే. ముసలితనం పెట్టి ఉండకపోతే ఎవరూ చావడానికి సిద్ధపడేవారు కారు. చివరిదాకా ఒళ్లు శుబ్భరంగా ఆపిల్‌ పండులా నిగనిగలాడుతూ ఉంటే మృత్యువు వస్తే చీదరించుకుంటాం. శరీరం శిథిలమై, జర్జరమై, తన పనులు తను చేసుకోలేక అవస్థ పడేవేళలో మృత్యువు వస్తే అమ్మయ్య, యిప్పటికైనా విముక్తి కలిగిస్తున్నావు కదా నాయనా అంటూ ఆహ్వానిస్తాం.

మృత్యుంజయ స్తోత్రం పఠిస్తే మృత్యువును జయిస్తారని అనుకోకూడదు. మృత్యుభయాన్ని జయిస్తారంతే. పండు మిగలముగ్గితే సునాయాసంగా తొడిమె నుంచి ఎలా జారిపోతుందో, మన మనసును కూడా అలా పరిపక్వంగా చేయమని దేవుణ్ని స్తోత్రం చేయడమన్నమాట. కాయ పచ్చిగా ఉంటే కోసినపుడు బాధ కలుగుతుంది. అలాటి బాధ కలగజేయవద్దని ప్రార్థిస్తాం. 'చావుకి మనను సైకలాజికల్‌గా ప్రిపేర్‌ చేయడానికే యీ వృద్ధాప్యం' అనే ఆలోచన అలవర్చుకుంటే దీని గురించి ఫిర్యాదులు ఎక్కువ చేయం. ఇక చావు, చావు భయం, అంత్యకాలం ఎలా గడుస్తుందన్న భయం గురించి తర్వాతి వ్యాసంలో చర్చించుకుందాం. (సశేషం) 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?