cloudfront

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: జరా దు:ఖం 02

ఎమ్బీయస్‌: జరా దు:ఖం 02

వృద్ధాప్యంలో తరచుగా గుర్తుకు వచ్చే పదం - చావు. తప్పదని చిన్నప్పటినుంచీ తెలిసినా దాని గురించి ఆలోచించే సమయముండదు. ముసలితనంలో తీరికెక్కువై అదెలా సంభవిస్తుంది? అంత్యకాలం ఎలా గడుస్తుంది? ఎవరు చూస్తారు? మన పనులు మనం చేసుకునే స్థితిలోనే పోతామా? లేదా? అనే దిగులు తినేస్తూ ఉంటుంది. ఎవరి మీదా ఆధారపడకుండా పోతే చాలు అనే ప్రతీవాడూ అంటాడు. భోజనం ఎంత బాగా చేసినా, చివర్లో వడ్డించే డిజర్ట్‌ రుచిగా లేకపోతే భోజనం చేసిన తృప్తి రాదు. జీవితం కూడా అంతే, చివరి అంకం సవ్యంగా గడవాలి. అది మన చేతిలో ఉండదు. మనంతట మనం దాన్ని నిర్వహించే స్థితిలో ఉండం. దానికై పక్కవారిని అన్ని రకాలుగా తర్ఫీదు యిచ్చి ఉంచుకోవాలి. ఇదే కష్టమైన పని.

అకాలమృత్యువు గురించి భీకరంగా వర్ణించడం సబబే కానీ సకాలంలో వచ్చిన మృత్యువును దేవత అనాలి. ఏది సకాలం అంటే భౌతికంగా మనం శిథిలమైనపుడు, శరీరయాతన ఓర్చుకోలేకపోతున్నపుడు, యిక్కడ ఉండటం కంటె వెళ్లిపోవడమే మేలనే కోరిక బలపడినపుడు.. అనాలి. చెయ్యగలిగిన పనులన్నీ చేసేశాక, తక్కినవి చేయడానికి ఓపిక లేనప్పుడు, లోపల ఉన్న చిలుక అస్తి'పంజరం'లో ఉన్నట్లు ఫీలయి, రెక్కలు తపతపా కొట్టుకుంటుంది.

అప్పుడు వెళ్లిపోవడమే విముక్తి అనుకోవాలి. వెళ్లిపోవడం అంటే ఎక్కడికి అనే ప్రశ్నకు ఎవరూ బదులు చెప్పలేరు. పరలోకం గురించి ఎవరికీ స్పష్టమైన అవగాహన లేదు. స్వర్గం, నరకం, పునర్జన్మ, జన్మరాహిత్యం.. యిలాటి విషయాలపై ఎవరి ఆలోచన వారిది. ఇవేమీ లేవనుకునేవారు 'ఈ భూమికి వచ్చాం, మన కర్తవ్యం మనం నిర్వర్తించాం. మళ్లీ పంచభూతాలలో, అనంత చైతన్యస్వరూపంలో కలిసిపోతున్నాం.' అనుకుని ఊరుకుంటారు. దేవుడి మీద నమ్మకం ఉన్నవారు 'మనం యీ లోకానికి వచ్చే ముందే నా తల్లి వక్షంలో స్తన్యం నింపి నా కోసం సమస్తమైన ఏర్పాట్లు చేసిన దేవుడు, పరలోకంలో కూడా నా రాక కోసం అన్ని ఏర్పాట్లు చేయకుండా ఉంటాడా?' అనుకుని ఊరడిల్లుతారు. అందువలన చావు గురించి భయపడేవారు ఎటూ కానివారు.

ఎన్ని రోజులపాటు చింతించి బుర్ర బద్దలు కొట్టుకున్నా ఎవరూ తప్పించలేని గురించి ఆలోచించడం వేస్టు కదా! పాపం పుణ్యం అనేవి ఉన్నాయని, వాటి ఫలితాలు పరలోకంలో అనుభవించవలసి వస్తుందని అనుకునేవారు ఆ ఆలోచన ముసలితనంలో తెచ్చుకుని ప్రయోజనం లేదు. మంచీచెడు చేసే సామర్థ్యమున్న రోజుల్లో చిత్తమొచ్చినట్లు బతికి చివరి దశలో పాపప్రక్షాళనా కార్యక్రమం మొదలుపెడితే ఎలా? గడువుల గురించి, లేటు ఫీ ల గురించి పరలోకం రూల్సు మనకి తెలియవు కదా! 

యవ్వనంలో ఉండగా 'నాకు చావంటే భయం లేదు. ఇవాళ ఛస్తే రేపటికి రెండు' అంటూ వచ్చినవాళ్లే, ముసలితనం రాగానే ఆయుర్దాయం పెంచుకోవడం ఎలా ఆదుర్దా పడుతూంటారు. దాని కోసం ఆరోగ్యం బాగా చూసుకుంటూ ఉంటే అర్థం చేసుకోవచ్చు, కానీ ఆయుర్దాయం కోసం హోమాలు, పూజలూ చేయిస్తూ ఉంటారు. తలరాత తప్పించుకోలేము అనేవాళ్లు కూడా యిలా చేస్తూండడం నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. కొందరు 'చురుగ్గా, ఆరోగ్యంగా ఉన్నంతకాలమే జీవించాలని ప్రార్థిస్తున్నాను' అంటూంటారు.

అలా ఉన్నంతకాలం చావును ఆహ్వానించే మానసిక స్థితి ఏర్పడుతుందా అని నా సందేహం. ఏది ఏమైనా ఎంతకాలం జీవించామన్నది ముఖ్యం కాదని ఎలా జీవించామన్నదే ముఖ్యమనీ ప్రతివారూ అంగీకరిస్తారు. ప్రాణాపాయం కలిగినపుడు సరైన వైద్యసదుపాయం అందక మరణించే సందర్భం రావడం విషాదకరం. పోయినవాళ్ల కంటె బతికున్నవాళ్లను ఆ బాధ చాలాకాలం పీడిస్తుంది. సరైన వైద్యవసతుల కోసం ఆసుపత్రికి దగ్గరలో నివాసమున్నా, ఆ సహాయం సమయానికి లభిస్తుందా లేదా అన్నది కూడా ఎవరూ చెప్పలేరు. ఆసుపత్రి చైర్మన్‌ కూడా ఏ తీర్థయాత్రకో వెళ్లి వైద్యసహాయం అందక చచ్చిపోవచ్చు.  

నిజానికి చావు మనకు ఎన్నో ఛాన్సులిస్తుంది. తప్పించుకున్నపుడు పెద్దగా పట్టించుకోము. చివరకు ఎప్పటికో అప్పటికి మెటీరియలైజ్‌ అవుతుంది. మంచంలో పడి అవస్థలు పడేవాళ్లు కొంతమందికి ఎంత ప్రార్థించినా రాదు కానీ హుషారుగా తిరిగే కొంతమందిని హఠాత్తుగా ఎగరేసుకుని పోతుంది. తన క్లాసుమేట్స్‌, తన యీడువాళ్లు, సన్నిహితులు ఒక్కొక్కరు వెళ్లిపోవడం గమనించిన మనుష్యులు ఒక దశ వచ్చేటప్పటికి మృత్యువుకు మానసికంగా సిద్ధమవుతారు.

కానీ తన నిష్క్రమణ కారణంగా తన జీవిత భాగస్వామి ఎలాటి అవస్థలు పడుతుందనే (పడతాడనే) బెంగతో బాధపడతారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నంతకాలం ఫరవాలేదు. అనారోగ్యం ప్రవేశించాక పిల్లలతో కలిసి ఉంటే బాగుండుననే భావన మొదలవుతుంది. అది వీలుపడుతుందో లేదో ఎవరూ చెప్పలేరు. పిల్లలు విదేశాల్లో ఉండవచ్చు. దగ్గర పెట్టుకోలేక పోవచ్చు. స్వదేశంలోనే ఉన్నా, అదే ఊళ్లోనే ఉన్నా కలిసి ఉండడం కుదరకపోవచ్చు.

ఈ విషయాల్లో ఎవరి అనుభవం వారిది. వేరేవారితో పోల్చుకుని మనకూ అలాగే జరుగుతుందని భయపడడం, సమయానికి ఎవరూ లేకుండా దిక్కుమాలిన చావు ఛస్తామని బెంగపడడం జరుగుతూంటుంది. భాగస్వామి వెళ్లిపోయాక ఒంటరిగా జీవితం గడపడం నిశ్చయంగా బాధాకరమే. దీనికి పరిష్కారం ఎవరూ చెప్పలేరు. కన్నపిల్లలు అక్కరకు రాకపోవచ్చు, యింటి పక్కవాళ్లు ఆదుకోవచ్చు. వ్యక్తిగతమైన సంబంధాలు కాపాడుకోవడంలో ముందునుంచీ జాగ్రత్తపడాలి తప్ప వార్ధక్యంలోనే ఆ పని మొదలుపెడితే కుదరదు. 

వృద్ధాశ్రమాలలో జీవితం గురించి ఒక్కొక్కరిది ఒక్కో అనుభవం. మొదటినుంచీ పదిమందిలో కలిసి ఉండడం, పంచుకోవడం అలవాటు పడితే తప్ప అక్కడ సుఖంగా ఉండలేరు. ఫిర్యాదులతోనే శేషజీవితం గడపవలసి వస్తుంది. చావు దానిపాటికి అది వస్తుంది, దానికి దారితీసే అనారోగ్యం ఏడాదో, రెండేళ్లో మనల్ని సతాయిస్తుంది అనే నిర్ధారణకు వచ్చేసి, యిక దానికి ముందు నడిచే సుమారు పదిహేనేళ్ల ఘట్టం ఎలాగ గడుస్తుందో దాని గురించి ఆలోచించడమే మంచిది. అగమ్యగోచరమైన భవిష్యత్తు గురించి ఊరికే ఆలోచనల్లో పడి కొట్టుకోకుండా మనసును వేరే వ్యాపకాల్లో లగ్నం చేయడం మంచిది.

సమాజసేవ చేయడం మంచిదని అంటూ ఉంటారు కానీ వాటిల్లో కూడా చిక్కులున్నాయి. అన్నీ మనం అనుకున్నట్లు సాగవు. అన్ని రకాల పరిస్థితుల్లో సర్దుకోవడం నేర్చుకోవాలి. ముసలితనంలో సెనిలిటీ బాగా వస్తుంది. చాదస్తం, సణుగుడు, విసుగు, కోపం అన్నీ ఎక్కువవుతాయి. పలకరించడానికి వచ్చిన వాళ్లకు మన అజీర్తి గురించి, కీళ్లనొప్పుల గురించి, నిద్ర పట్టకపోవడం గురించి చెప్పి చంపకూడదు. వాళ్లకేం ఆసక్తి? వాళ్లు పైకి ఏమీ అనకపోయినా, 'నీ కంటె చిన్నవాళ్లం, మాకే ఉన్నాయి యీ సమస్యలు, నీ కుంటే ఆశ్చర్యం ఏముంది?' అనుకుంటారు.

పిల్లలు చూడటం లేదని, పట్టించుకోవటం లేదనీ పరులకు చెప్పి ప్రయోజనం లేదు. వాళ్లు ఆర్చేవాళ్లు, తీర్చేవాళ్లు కారు. పైగా చిలవలుపలవలు చేసి పిల్లలకు చేరేశారంటే సంబంధాలు యింకా చెడతాయి. కొంతమంది పెద్ద కొడుకు దగ్గర ఉన్నపుడు రెండో కొడుకుని మెచ్చుకుని, రెండో కొడుకు దగ్గర ఉన్నపుడు పెద్దకొడుకుని మెచ్చుకుంటూంటారు. 'నీ కక్కడ అంత బాగుంటే వాడి దగ్గరే ఉండవచ్చుగా' అనిపించుకుంటారు. ఈ లక్షణాలు మనలో ఉన్నాయేమో మనకు మనమే పరీక్ష పెట్టుకుని వాటిని తగ్గించుకోవాలి. కాకపోతే అందరూ దూరమై పోతారు. 

వీటి మీద నుంచి దృష్టి మరల్చుకోవడానికి మనసును రంజింప చేయడం నేర్చుకోవాలి. ప్రస్తుత సమాజంలో వృద్ధులకు సరైన వసతులు లేవు. పొద్దు పుచ్చేందుకు సరైన అవకాశాలు లేవు. సొంత ఆర్జన కావచ్చు, తలితండ్రుల పట్ల బాధ్యతను డబ్బివ్వడం ద్వారా నెరవేర్చుకుందామని చూసే ఎన్నారై పిల్లలు యిచ్చినది కావచ్చు, వాళ్ల దగ్గర డబ్బు ఉంటోంది.

సగటు వయసు పెరుగుతున్న కొద్దీ (ప్రస్తుతం తెలంగాణలో 69 ఏళ్లు, ఆంధ్రలో 67 ఏళ్లు ఉందట) వారిని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఉత్పాదనలు తయారవుతాయనుకుంటాను. వారు చదివేందుకు అనుగుణంగా పెద్ద అక్షరాలతో వార్తాపత్రికలు, పుస్తకాలు, వారి అభిరుచులకు అనుగుణమైన టీవీ ఛానెళ్లు, సినిమాలు, శబ్దం మరీ బిగ్గరగా లేని థియేటర్లు, టాయిలెట్‌ సౌకర్యాలున్న బస్సులు, మెట్లు ఎక్కే అవసరం లేని లైబ్రరీలు, కూర్చునేందుకు పడక్కుర్చీల వసతి ఉన్న మాల్స్‌.. యిలా చాలా రావచ్చు.  

ముసలితనంలో మనసును తాజాగా ఉంచుకోవడానికి, అనవసర ఆలోచనల నుంచి మళ్లించడానికి, మంచి వ్యాపకం పెట్టుకోవడం అవసరం. లలితకళల పట్ల ఆసక్తి ఉన్నవారికి అది సులభం. పుస్తకాలు చదువుకుంటూ, పాటలు వింటూ, సభలకు వెళుతూ కాలక్షేపం చేసేయవచ్చు. అయితే అవి అప్పటికప్పుడు పుట్టుకుని రావు. మొదటి నుంచీ అవి అలవర్చుకోవాలి. చిన్నప్పుడు ఉన్నా, ఉద్యోగం చేసినంతకాలం డబ్బు మీదే దృష్టి పెట్టి వీటిని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. దాంతో గ్యాప్‌ తర్వాత మళ్లీ పికప్‌ చేయడమంటే కష్టం. విడువకుండా ఆటలాడేవారు అదృష్టవంతులు. ఆరోగ్యానికీ మంచిది.

కనీసం యిన్‌డోర్‌ గేమ్స్‌ ఆడుతూన్నా సమయం గడిచిపోతుంది. ఇవన్నీ ఉన్నా లేకపోయినా కొత్త విషయాలపై ఆసక్తి పెంచుకోవడం సర్వధా మంచిది. ఏదో ఒకటి నిరంతరం నేర్చుకుంటూ ఉంటే, మనసు దానిపై లగ్నమవుతుంది. విదేశాల్లో వృద్ధులను చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. వాళ్లు యింట్లో వస్తువులు సొంతంగా మరమ్మత్తు చేస్తూ ఉంటారు, గేటుకి పెయింటింగ్‌ వేస్తూంటారు, గడ్డి కోస్తూ ఉంటారు. కాలక్షేపం అవటం లేదని ఫిర్యాదు చేస్తూనే మనం అలాటివి ఏవీ చేయం. పనివాళ్ల చేత చేయించబోయి, తృప్తి పడక వాళ్లను తిడుతూ ఉంటాం.

చివరగా చెప్పాలంటే - ముసలితనంలోనే కాక అంతకు ముందు కూడా మనం శరీరానికి శ్రమ కలిగించాలి. అనవసరపు ఆలోచనలతో మనసుకి శ్రమ కలిగించకూడదు. దేని గురించైనా ప్రణాళిక వేసేందుకు ఆలోచించాలి తప్ప, అది జరుగుతుందా లేదా అన్న ఆలోచనల్లో పడి కొట్టుకుపోకూడదు. అనవసరపు ఆలోచన తగ్గించుకుని, దక్కిన దాన్ని ఆమోదించినవాళ్లే జీవితాన్ని అనుభవించ గలుగుతారు. దీనితో యీ వ్యాసపరంపర ఆపుతున్నాను. ఎవరివైనా జీవితానుభవాలు చదివినప్పుడు అవి మనకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయని తోస్తే  వాటిని మీతో పంచుకుంటాను. 

ఈ సందర్భంలో యింకో విషయం మీకు చెప్పాలి. ఈ వ్యాసాల్లో దేవుని ప్రస్తావన వచ్చినపుడు కొందరు పాఠకులు 'దేవుడున్నాడని మీ నమ్మకమా?' అంటూ ప్రశ్నించారు. నా నమ్మకాలు యిక్కడ అప్రస్తుతం. దేవుడి గురించి మీకెంత తెలుసో నాకూ అంతే తెలుసు. అతడి ఉనికి గురించి, వ్యవహారశైలి గురించి వేలాది సంవత్సరాలుగా చర్చ సాగుతూనే ఉంది. ఏదీ యితమిత్థమని తేలలేదు. మనుష్యుల నమ్మకాలు కూడా ఎప్పుడూ ఒక్కలా ఉండవు. మారిపోతూ ఉంటాయి.

సర్వసాక్షియైన దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం అంటూనే  గుళ్లో పూజారి మన గోత్రం సరిగ్గా చదవకపోతే ఆందోళన పడిపోతాం. ఆయన చదవకపోతే మాత్రం దేవుడికి తెలియకుండా పోతుందా అని ఊరుకోం. సృష్టిలో సర్వభూతాలకు అధిపతి ఆయనే అంటూంటాం, పరీక్ష పాస్‌ చేయిస్తే వచ్చి తలనీలాలు యిస్తాం అని ఊరిస్తాం. విశ్వమంతా ఆయనదే అయినపుడు మన తలవెంట్రుకలే ఆయనకు కావలసి వచ్చాయా? అనే దిశలో ఆలోచించం.

గత జన్మలో చేసిన కర్మఫలితమే అనుభవిస్తున్నాం అంటాం, మళ్లీ జపాలు, తపాలు చేయించి దాన్ని మార్చేద్దామని చూస్తూంటాం. ఇలా దేవుడి గురించి మనలో చాలా గందరగోళం ఉంది. అయినా నేను ఆ పేరుతోనే ఎందుకు రాస్తానంటే ఏదైనా కాన్సెప్టును దైవభావన ద్వారా ఎస్టాబ్లిష్‌ చేయడం సులభం. దీనికి ఉదాహరణగా చిన్నపుడు చదివిన ఓ కథ ఉదహరిస్తాను.

17 ఆవులున్న ఒక రైతు చనిపోయాడు. తన పెద్ద కొడుక్కి ఆవుల్లో సగం చెందాలని, రెండో కొడుక్కి మూడో వంతు చెందాలని, రెండోవాడికి వచ్చినవాటిల్లో మూడో వంతు మూడోవాడికి చెందాలని వీలునామా రాశాడు. 17ను ఎలా భాగించాలో తెలియక అందరూ తికమక పడ్డారు. అప్పుడు ఆ రైతు స్నేహితుడైన ఒక పెద్దాయన వచ్చి అంతా విని, 'ఇదిగో నా ఆవును కూడా కలుపుతున్నాను. ఇప్పుడు వాటాలు వేయండి.' అన్నాడు.

దాంతో మొత్తం 18 ఆవులయ్యాయి. పెద్దవాడికి 9, రెండో వాడికి 6, మూడోవాడికి 2 వచ్చాయి. పెద్దాయన ఒక్క ఆవు ఆయనకే మిగిలిపోయింది. అంటే ఆయన ఆవు పంపకాల్లో భాగం కాదు. కానీ దాన్ని కలపకపోతే ఆ రిడిల్‌ ఎప్పటికీ తెగేది కాదు. నా దృష్టిలో దేవుడి గురించిన ప్రస్తావన కూడా అలాటిదే. 'మంచి ఏదో, చెడు ఏదో మనకే తట్టేట్లు సృష్టికర్త వివేకాన్ని యిచ్చాడు. దాన్ని ఉపయోగించి సమాజానికి మేలు చేస్తే చాలు...' అని రాసుకుపోతే సులభంగా అయిపోతుంది. అలా కాకుండా 'ప్రకృతి మనకు యీ శరీరాన్ని యిచ్చింది.

ఆదిమ మానవుడికి విచక్షణ ఉండేది కాదు కానీ పోనుపోను సమాజం అతనికి మంచిచెడుల గురించి సామాజిక స్పృహ నేర్పింది. దాంతో అతను వివేకాన్ని అలవర్చుకున్నాడు...' అంటూ రాస్తే జటిలమవుతుంది. సమాజానికి మేలు చేయండి అని చెప్దామనుకున్న సందేశం నీరుకారుతుంది. అందువలన నేను 'దేవుడు' అని రాసి నా అభిప్రాయాలను చెప్తూ ఉంటాను. అంత మాత్రాన నేను దేవుడున్నాడని, అతను పురుషుడే అనీ నమ్మి ప్రచారం చేస్తూన్నట్లు కాదు. పైన చెప్పినట్లు యీ విషయాల్లో ఎవరి నమ్మకం వారిదే.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com