cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: పాకిస్తాన్‌ రాజకీయాలు

ఎమ్బీయస్‌: పాకిస్తాన్‌ రాజకీయాలు

నేను సాధారణంగా పాకిస్తాన్‌లో సంఘటనలు కవర్‌ చేయను. హిందూస్తాన్‌లో అయితే బతకలేం అంటూ అక్కడకు వెళ్లి వాళ్లు బావుకుంటున్నదేమీ లేదని తెలుసు. అనేక విషయాల్లో వాళ్ల బతుకు అధ్వాన్నంగా ఉంది. 70 ఏళ్లగా ప్రజాస్వామ్యం ఉన్న మన దేశమే యిలా అఘోరించగా, మాటిమాటికి సైన్యం పాలనలో జోక్యం చేసుకుంటూ ఉంటే అక్కడ యింకెలా ఉంటుంది? అక్కడి పాలకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇండియాను, ఇండియన్సును దోషులుగా చూపిస్తారు. మన దగ్గరా కొందరు ఆ ప్రయత్నంలో ఉంటారు. నిజానికి మనం యిక్కడ పాకిస్తాన్‌ వాళ్లపై ప్రయోగించడానికి కత్తులు నూరుతూ కూర్చోలేదు, మన ఏడుపుల్లో మనం ఉన్నాం. అక్కడ పాకిస్తానీలు అంతే. విదేశాల్లో తారసిల్లితే సగటు పాకిస్తానీ మనలాటి వాడే అనే సంగతి అర్థమవుతుంది. వాడికీ అదే అర్థమవుతుంది. కానీ పాలకులు ఎంతసేపూ విషప్రచారం చేస్తూ ఉంటే వాళ్లు అయోమయంలో పడతారు. 

కొందరు ఇండియా-పాక్‌ స్నేహం వర్ధిల్లాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అఖండ్‌ భారత్‌ నినాదాలిచ్చేవాళ్లు పాకిస్తాన్‌, ఇండియా కలిసిపోవాలని కోరుకుంటూ ఉంటారు. కలిసిపోక పోయినా స్నేహంగా ఉంటే డిఫెన్సు మీద పెట్టే బోల్డు ఖర్చు ఆదా అవుతుంది. కానీ అగ్రరాజ్యాలు అలా కానీయవు. మన మధ్య నిప్పు రాజేస్తూ యిద్దరికీ ఆయుధాలు అమ్ముకుంటూ లాభపడుతూంటాయి. ఇలాటి పరిస్థితుల్లో పాకిస్తాన్‌ పాలకులు ఎవరు వచ్చారు, ఎవరు వెళ్లారు, ఎవరు ఇండియాకు సన్నిహితులు, ఎవరు కారు అని వివరంగా తెలుసుకోవడం నా మట్టుకు నాకు బోరుగానే ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఇండియాకు అనుకూలంగా ఉండి, సైన్యంపై ఖర్చు తగ్గిద్దామని అనుకోగానే సైన్యం వాళ్లని దింపేయడానికో, అప్రతిష్ఠపాలు చేయడానికో శతథా ప్రయత్నిస్తుంది. ఇక వాళ్లు కూడా ఇండియా మీద అవాకులు, చెవాకులు మాట్లాడక తప్పదు. ఆ కారణంగా నాకు వాళ్లంటేనే విసుగు. 

మన మీడియా కూడా వాళ్ల గురించి పెద్దగా పట్టించుకోదు. కానీ ఇమ్రాన్‌ ఖాన్‌ దేశాధ్యక్షుడు అవబోతున్నాడు అనగానే చాలా ఉత్సాహం చూపించారు. చాలా అంశాలు రాశారు. క్రికెటర్‌గా ఇమ్రాన్‌ ఖాన్‌ భారతీయుల్లో చాలామందికి యిష్టుడు కావడం ఒక కారణం. ఒక సినిమా యాక్టరు రాజకీయాల్లోకి వస్తే ఎంత క్యూరియాసిటీ ఉంటుందో, ఒక క్రికెటర్‌ వచ్చినా అంత ఉంటుంది. ఆ సందర్భంగా వచ్చిన మెటీరియల్‌ చదివితే నాకు పాక్‌ రాజకీయాల గురించి అంతకుముందు తెలియని కొన్ని విషయాలు తెలిశాయి.

ఒక ఇమ్రాన్‌ భావాల్లో వచ్చిన మార్పులో నాటకీయత కనబడింది. అతని గెలుపులో కుట్ర కనబడింది. ఇప్పుడు నవాజ్‌ షరీఫ్‌కు, అతని కూతురికి అవినీతి కేసులో కింది కోర్టు వేసిన శిక్ష తీర్పుని హైకోర్టు సస్పెండ్‌ చేసి, వాళ్లు బయటకు పంపడంతో కథ మంచి పాకంలో పడింది. ప్రాసిక్యూషన్‌ ఆధారాలు చూపలేక పోయిందని హైకోర్టు చేసిన వ్యాఖ్య నవాజ్‌ పార్టీకి మంచి ఊపు నిచ్చింది. నవాజ్‌ వంటి ప్రతిపక్ష నాయకుడు స్వేచ్ఛగా తిరుగుతూ ఉపన్యాసాలు దంచుతూ ఉంటే ఇమ్రాన్‌ ఎలా ఉక్కిరిబిక్కిరి అవుతాడో, ఆ  డ్రామా ఎలా ఉంటుందోనన్న ఉత్సుకత పెరిగింది.  ఇవన్నీ పాఠకులతో పంచుకోవాలనిపించింది. ముందుగా చెప్పాల్సిందేమిటంటే - నేను క్రికెట్‌ అభిమానిని కాను. ఇమ్రాన్‌ ఆట గురించి నాకే అవగాహనా లేదు. అతను అధికారంలోకి రావడం చేత ఇండో-పాక్‌ సంబంధాల్లో పెనుమార్పులు వచ్చేస్తాయన్న దురాశ నాకేమీ లేదు.

ఈ వ్యాసపరంపరంతా చదివే ఓపిక లేనివారి కోసం సింపుల్‌గా ఓ మాట చెప్పేస్తాను - పాక్‌ సైన్యం రాజకీయాల్లో నిరంతరం జోక్యం చేసుకుంటూ ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని బలహీన పరచాలని శతథా ప్రయత్నిస్తూ ఉంటుంది. దాన్ని పాక్‌ రాజకీయ నాయకులు ఎలా ఎదిరిస్తున్నారు, ఎప్పుడు లొంగిపోతున్నారు, ఎలా రంగులు మార్చుకుంటున్నారు అనేదే దీనిలో ఆసక్తి కలిగించే అంశం. దీని గురించి పాక్‌ ఎన్నికల విధానం ఎలాటిది? ప్రధాన పార్టీలైన నవాజ్‌ షరీఫ్‌ పార్టీ, భుట్టో పార్టీలు యిప్పటిదాకా ఏం చేశాయి? ఇమ్రాన్‌ వ్యక్తిగత జీవితం ఎలాటిది, రాజకీయ ప్రస్థానం ఎలాటిది? 71 ఏళ్ల ఒడిదుడుకుల వలన పాక్‌ ఆర్థిక వ్యవస్థ ఎలాటిది?.. యివన్నీ తెలుసుకోవాలి. అప్పుడే యీ ఎన్నికలు ఎందుకు, ఎలా జరిగాయో అర్థమవుతుంది. అందువలన నేను చెప్పిన అంశాల గురించి విడివిడి వ్యాసాలు రాసి లింకులు యిస్తున్నాను. ఆసక్తి ఉంటే ఆ నేపథ్యం చదవవచ్చు. అప్పుడు రాబోయే రోజుల్లో అక్కడ రూపుదిద్దుకునే నాటకాన్ని, దానిలో మలుపులను పాఠకులు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 

ఈ వ్యాసంలో పాక్‌లో యిప్పటిదాకా ఏం జరిగిందో విహంగవీక్షణంగా చెప్పేస్తాను. పాకిస్తాన్‌లో కూడా మనలాగే ప్రధాని కాలం 5 ఏళ్లు. దౌర్భాగ్యమేమిటంటే ఏ ప్రధానీ తన పదవీకాలాన్ని పూర్తి చేయలేదు. సైన్యం వాళ్లను దింపేస్తూ వచ్చింది. ఈ 71 ఏళ్లలో 31 ఏళ్లు సైనిక పాలనే! ఆయూబ్‌ ఖాన్‌ (1958-69), యాహ్యా ఖాన్‌ (1969-71), జియా ఉల్‌ హక్‌ (1977-88), పెర్వేజ్‌ ముషారఫ్‌ (1999-2008) నియంతలుగా ఏలారు.  ఎన్నికలు జరిగి ఎవరైనా ప్రధాని కాగానే సైన్యాధిపతులు వారిని అవినీతిపరులుగా ముద్రవేసి దింపేసి తాము గద్దె కెక్కేవారు.

మన దేశపు ప్రజాస్వామ్యంలోని లోపాలను చూసి విసిగిన కొంతమంది 'మనవాళ్లకు డిసిప్లిన్‌ లేదండి, మిలటరీ రూలు రావాలి, వీళ్లందరికీ బుద్ధి వస్తుంది' అంటూంటారు. పాకిస్తాన్‌ వాళ్లూ ముందులో అలా అనుకున్నారేమో తెలియదు కానీ యిప్పుడైతే అనరు. సైనిక పాలన ప్రజాస్వామ్య పాలన కంటె అధ్వాన్నంగానే ఉంటుంది తప్ప మెరుగ్గా ఉండదు. ఉంటే గింటే ఓ రెండు మూడేళ్లు. ఆ తర్వాత తమ చిత్తం వచ్చినట్లు చేయడం, విమర్శిస్తే జైలుపాలు చేయడం, ఉరికంబం ఎక్కించడం! ఇది అనేక దేశాల అనుభవం. 

వాళ్ల ప్రాధాన్యత ఉండాలంటే నిరంతర యుద్ధవాతావరణం ఉండాలి. ఆ పేరు చెప్పి బజెట్‌లోంచి నిధులు తీసుకుని తాము హాయిగా బతుకుతారు. దానివలన అభివృద్ధి కార్యక్రమాలకు ధనం ఉండదు. ప్రజల్లో అశాంతి చెలరేగితే దాన్ని జోకొట్టడానికి మతఛాందసత్వాన్ని తెచ్చి పెడతారు. మతఛాందసులు, సైన్యం ఏకమై ఉదారవాదులను, ప్రజాస్వామికవాదులను పీడిస్తారు. వాళ్లు అధికారంలోకి వస్తే వాళ్లల్లో వాళ్లకు లుకలుకలు కల్పిస్తారు. కొంతమందిని లోబరుచుకుంటారు. మీడియాను బెదిరిస్తారు. న్యాయవ్యవస్థను కూడా తమ అదుపులోకి తెచ్చుకుంటారు. అయితే పాకిస్తాన్‌ ప్రజలు ఎప్పటికప్పుడు తిరగబడుతూనే ఉంటారు. అయితే వివిధ ప్రాంతాల మధ్య చీలిపోయి ఉండడం చేత కాబట్టి ఐక్యంగా పోరాడలేకపోతున్నారు. సమాజంలో ఉన్నత వర్గాలు వ్యవస్థకు కాపు కాస్తూ ఉంటారు. అయినా పాక్‌ ప్రజల పోరాటం సాగుతూనే ఉంది.

2010 రాజ్యాంగ సవరణల తర్వాత సైన్యం ప్రజాప్రభుత్వాల్ని ప్రత్యక్షంగా కబళించే దారులు మూసుకుపోయాయి. దాంతో లోకం దృష్టిలో పలుచన కాకూడదని పాక్‌ సైన్యం ప్రతి ఎన్నికలో పరోక్షంగా జోక్యం చేసుకుంటోంది. తమకు అనుకూలమైన హవాను సృష్టిస్తోంది. కొత్త ప్రధాని క్రికెటర్‌ కాబట్టి ఆ పరిభాషలోనే చెప్పాలంటే - ఆటగాళ్లను కీలుబొమ్మలను చేసి అంపైర్‌ ఆట ఆడినట్లు ఉంటుంది పాకిస్తాన్‌లో!

ఇటువంటి పరిస్థితుల్లో న్యాయం చేయగలిగేది న్యాయవ్యవస్థే. కానీ దానికీ స్థిరత్వం లేదు. 2008లో ముషారఫ్‌ దిగిపోవడానికి చురుగ్గా ఉన్న న్యాయాధికారులే కారణం. ఇప్పుడు న్యాయవ్యవస్థ సైన్యానికి మద్దతుదారుగా మారింది. రాజకీయ నాయకుల కంటె సైన్యంతోనే వాళ్లకు హాయిగా ఉంది. ఇప్పుడు ఇమ్రాన్‌ సైన్యం తాలూకు మనిషి కాబట్టి, డైరక్టుగా సైన్యాన్ని ప్రోత్సహించినట్లు ఉండదనుకుని ఇమ్రాన్‌కు అనుగుణంగానే న్యాయవ్యవస్థ వ్యవహరిస్తోందని అనుకుంటూండగానే సడన్‌గా నవాజ్‌ షరీఫ్‌ విషయంలో హైకోర్టు ఉదారంగా వ్యవహరించి, అందరినీ ఆశ్చర్యపరిచింది.

ప్రజాస్వామ్య పార్టీల మధ్య ఎవరికీ మెజారిటీ రాకుండా హంగ్‌ పార్లమెంటు (జాతీయ ఎసెంబ్లీ అంటారు) ఏర్పడి బలహీన ప్రభుత్వం ఏర్పడడం సైన్యం లక్ష్యం. ఎందుకంటే పూర్తి మెజారిటీ వస్తే వాళ్లు సైన్యాన్ని ధిక్కరిస్తారు. హంగ్‌ పార్లమెంటు ఏర్పడేట్లా ప్రధాన పార్టీలను బలహీన పరచడం, బోల్డు చిన్నా చితకా పార్టీలను ఏర్పరచి, వాటికి సాయపడడం వాళ్ల వ్యూహం. ప్రస్తుత ఎన్నికలలో వాళ్ల ముందు ఉన్న ఛాయిస్‌ మూడు ఇమ్రాన్‌ నాయకత్వంలోని పిటిఐ (తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌), నవాజ్‌ షరీఫ్‌ నాయకత్వంలోని పిఎంఎల్‌-ఎన్‌ (పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌ - నవాజ్‌) భుట్టో కుటుంబానికి చెందిన పిపిపి (పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ). వీళ్లల్లో ఎవరికి మద్దతివ్వాలో తేల్చుకుని చివరకు ఇమ్రాన్‌కు తోడ్పడింది. అలా ఎందుకు చేసింది అనేది చెప్పడమే యీ వ్యాసాల ఉద్దేశం. 

ఉన్నదున్నట్లు చెప్పాలంటే - సైన్యానికి వీళ్లు ముగ్గురూ నచ్చరు. వాళ్లకు నచ్చేది పెర్వేజ్‌ ముషారఫే. అతని గురించి చెప్పాలంటే - అతను 1943లో దిల్లీలో పుట్టి, కరాచీలో పెరిగి 18 వ ఏట పాక్‌ ఆర్మీలో చేరి డైరక్టరు జనరల్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్‌ అయ్యాడు. నవాజ్‌ షరీఫ్‌ 1997లో ప్రధానిగా ఎన్నికై 1998లో అతన్ని 4-స్టార్‌ జనరల్‌ చేసి, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌కు అధినేతగా చేశాడు. ఇండియాతో కార్గిల్‌ యుద్ధం తద్వారా ఓటమి తెచ్చిపెట్టినది ముషారఫే. షరీఫ్‌ అతన్ని పదవి నుంచి తప్పించేయబోయాడు. అయితే సైన్యం మద్దతుతో ముషారఫే కుట్ర చేసి షరీఫ్‌ను గద్దె దింపేసి, గృహనిర్బంధంలో పెట్టి, విచారణ జరిపించాడు. తను అధ్యక్ష హోదాలో ప్రభుత్వాన్ని నడుపుతూనే ఆర్మీ అధినేతగా 2007 వరకు సైన్యాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాడు.

2002 మేలో తూతూమంత్రంగా రిఫరెండం నిర్వహించి 2007 వరకు అధ్యక్షుడిగా ఉండడానికి ప్రజలు ఆమోదించారన్నాడు.  తన ఆధ్వర్యంలోనే 2002 అక్టోబరులో జనరల్‌ ఎన్నికలు నిర్వహించాడు. నవాజ్‌ షరీఫ్‌ పార్టీ, భుట్టో పార్టీ రెండూ సైనిక పాలనకు వ్యతిరేకమే కాబట్టి పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (క్యూ) అనే కొత్త పార్టీ పెట్టించి, దానికే మెజారిటీ సీట్లు వచ్చాయని ప్రకటించాడు. (తాజా ఎన్నికలలో దానికి 5 వచ్చాయి, ఇమ్రాన్‌ను సమర్థిస్తోంది)

ముషారఫ్‌ తన పాలనలో టెర్రరిజాన్ని ఎదుర్కుంటున్నానంటూ అమెరికా నుండి సహాయసహకారాలు పొందాడు. లిబరలైజేషన్‌ విధానాలను చేపట్టి కార్మిక సంఘాలను నిషేధించాడు. ఆర్థికాభివృద్ధి కొంత జరిగినా మానవహక్కుల హననంలో చాలా చెడ్డపేరు తెచ్చుకున్నాడు. తప్పని పరిస్థితుల్లో 2008 ఎన్నికలకు ఒప్పుకున్నాడు. వాటిలో పాల్గొనడానికి 2007లో బేనజీర్‌ భుట్టో విదేశాల నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూండగా హత్య చేశారు. దాని వెనక్కాల ముషారఫ్‌ హస్తం ఉందని అందరి అనుమానం. 2008లో పిపిపి అతన్ని అభిశంసించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూండగా లండన్‌ పారిపోయి అక్కడే ఉండిపోయాడు. బేనజీర్‌ హత్య కేసులో తన వాదనలు అక్కణ్నుంచే వినిపించాడు. 2013 ఎన్నికల సమయంలో మళ్లీ వెనక్కి వచ్చాడు. మరి కొన్ని కేసులు ఎదుర్కున్నాడు. అతను ఎన్నికలలో పాల్గొనకుండా కోర్టులు నిషేధించాయి. రోగాలను సాకుగా చూపి 2016లో దుబాయి వెళ్లి అక్కడే ఉండిపోయాడు. నవాజ్‌ ప్రధానిగా ఉండగా పాక్‌కు వద్దామని చూస్తే అరెస్టు చేస్తానని నవాజ్‌ బెదిరించాడు. సైన్యానికి నవాజ్‌పై కోపానికి యిదో కారణం.

ముషారఫ్‌ తిరిగి అధికారంలో రాగలిగితే సైన్యానికి మహా ఆనందం. అది జరగటం లేదు కాబట్టే తక్కిన వాళ్ల గురించి ఆలోచించారు. వాళ్ల గురించి తెలుసుకుందాం.

(ఫోటో - పాక్‌ సైనిక నియంతలు - ఆయూబ్‌ ఖాన్‌, యాహ్యా ఖాన్‌, జియా ఉల్‌ హక్‌, ముషారఫ్‌)

 ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2018)
mbsprasad@gmail.com