cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: పరశురాముడి చుట్టూ రాజకీయాలు

ఎమ్బీయస్‍:  పరశురాముడి చుట్టూ రాజకీయాలు

పరశురాముడు విష్ణువు దశావతారాల్లో ఆరవ అవతారం. ఆయన పేరు పెద్దగా ఎవరూ పెట్టుకోరు. గుళ్లూ ఎక్కడా కనబడవు. కానీ యిటీవలి రాజకీయాలకు ఆయన ఉపయోగపడుతున్నాడంటే వినడానికి ఆశ్చర్యంగా వుంటుంది. యుపిలో ఎస్పీ అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం పరశురామ జయంతిని సెలవుగా ప్రకటించడం, బిజెపి యోగి ప్రభుత్వం దాన్ని 2017లో రద్దు చేసి, శుభాకాంక్షల యాడ్ మాత్రం యిచ్చి వూరుకోవడం, ప్రముఖ కాంగ్రెసు నాయకుడు జితేంద్ర ప్రసాద దాన్ని పునరుద్ధరించమని 2020లో డిమాండు చేయడం, ఇప్పుడాయన బిజెపిలోకి చేరి, మంత్రిగా అయ్యాడు కాబట్టి, పునరుద్ధరిస్తాడా లేదా చర్చ రావడం – యిదంతా వింతగా తోస్తుంది. పరశురాముడి కథ, యుపిలో దాని ప్రాధాన్యం తెలియకపోతే! అందువలన ముందుగా పరశురాముడి పురాణగాథ చెప్తాను. తర్వాత 2022 ఫిబ్రవరి-మార్చిలలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోయే యుపి రాజకీయాల్లో బ్రాహ్మణ ఓటు బ్యాంకు గురించి వివిధ రాజకీయ పక్షాల కసరత్తుకి వెళతాను.

విష్ణువు పది అవతారాలలో మనిషి రూపంలో వచ్చినవారిలో బ్రాహ్మణుడిగా పుట్టినది రెండు అవతారాల్లోనే! వామనుడు, పరశురాముడు! తక్కినవన్నీ క్షత్రియుడిగానే! బుద్ధావతారం గురించి అస్పష్టత వుంది. రాముడు క్షత్రియుడని అందరికీ తెలుసు. కృష్ణుడి విషయంలో క్షత్రియుడు అవునా కాదా అని కొందరికి సందేహం కాబట్టి ‘శ్రీకృష్ణుడు క్షత్రియుడు కాడా?’ గతంలోనే వ్యాసం రాశాను. అయినా యీ మధ్య ఒకరు అడిగారు – ‘కృష్ణుడు వైశ్యుడని ఇస్కాన్ పుస్తకంలో చదివాను. నిజమా?’ అని. నేను ఇస్కాన్ పుస్తకం చదవలేదు. వారి లాజిక్ తెలియదు. భారతభాగవతాల ప్రకారం కృష్ణుడు క్షత్రియుడే. నందుడి యింట కొంతకాలం పెరిగాడు కాబట్టి ఆయన కులస్తుడు అయిపోడు. పాండవులు విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం చేసినపుడు మారుపేర్లు పెట్టుకుని బతికారు. ద్రౌపది తను నీచకులం దానినని చెప్పుకుంది. అంతమాత్రం చేత ఆమె కులం మారిపోలేదు.

అలాగే కంసభయం చేత కృష్ణుడు బృందావనంలో పదేళ్లవరకు దాక్కున్నాడు. కంససంహారం తర్వాత బయటకు వచ్చేసి రాజ్యనిర్వహణ చేపట్టాడు. మళ్లీ అటు వెళ్లలేదు. వసుదేవుడు బాలకృష్ణుణ్ని నందుడి యింటికి ఎందుకు తీసుకుని వెళ్లాడు?  అతనితో దూరపు చుట్టరికం వుంది కాబట్టి. వసుదేవుడి తాతకు యిద్దరు భార్యలు. ఒకామె క్షత్రియస్త్రీ. మరొకామె గోపస్త్రీ. వసుదేవుడు ఆ క్షత్రియస్త్రీకి మనుమడైతే, నందుడు ఆ గోపస్త్రీ మనుమడు. ఆ చుట్టరికం చేత, నందుడు తన కొడుకుని సంరక్షిస్తాడనే ధైర్యంతో వసుదేవుడు కృష్ణుణ్ని అక్కడ దాచాడు. కృష్ణుడి తల్లీతండ్రీ క్షత్రియులే. యదువంశానికి చెందినవాళ్లు. కృష్ణుడు అనే పేరు అతని రంగుని సూచించినట్లే, గోపాలుడు అనే పేరు గోవులను కాచే హాబీని తెలియపరుస్తుంది తప్ప అతని కులాన్ని కాదు. బృందావనం తర్వాత కృష్ణుడు ఆవుల్ని కాచలేదు, పాలు అమ్మలేదు. యుద్ధాలు చేశాడు, రాజ్యాలు ఏలాడు, దేశరాజకీయాలను నడిపించాడు.

వామనావతారానికి వస్తే చాలా చిన్న కథ. అదితి, కశ్యపులకు పుట్టాడు. చిన్న వయసులోనే ఉపనయనం చేశారు. భిక్షాటనకై అంటూ బలి చక్రవర్తి దగ్గరకు వచ్చాడు. త్రివిక్రమావతారం ఎత్తి అతన్ని పాతాళానికి తొక్కేశాడు. అంతే కథ ముగిసిపోయింది. మరి పరశురాముడి కథ అలాటిది కాదు. రౌద్ర, బీభత్సరస ప్రధానం. పూర్వసమాజంలో భుజబలం ఉన్నవాడే రాజయ్యాడు. రాజయ్యాక ఎవరూ తిరగబడకుండా వుండడానికి రాజు దేవుడితో సమానం, అతను చెప్పినది చచ్చినట్లు వినాలి. లేకపోతే నరకానికి పోతారు అని భయపెట్టడానికి పురోహితవర్గం అవసరం పడింది.

అలా చెప్పినందుకు పురోహితవర్గానికి రాజు సకల సౌకర్యాలు సమకూర్చేవాడు. వారికి కోపం తెప్పించేవాడు కాదు. పురోహితవర్గం చెపితే మాత్రం ప్రజలెందుకు వినాలి? పురోహితుడు చాలా గొప్పవాడు, దేవుడితో డైరక్టు సంపర్కం కలవాడు, అని రాజు ప్రచారం చేసి, అందరి ఎదుటా పురోహితుణ్ని సత్కరించేవాడు. తను కూడా గౌరవించేవాడు. గుళ్లూ గోపురాలూ కట్టి, ప్రజల్లో దైవభక్తి పెంచి, తనే భూమిపై ఉన్న దేవుడు అని పురోహితుడి చేత చెప్పించి తన అధికారాన్ని సుస్థిర పరచుకునేవాడు. ఇది ప్రపంచం మొత్తంలో చూడవచ్చు. అయితే పురోహితులకు, రాజులకు ఆధిపత్య పోరు జరిగిన సందర్భాలూ వున్నాయి. క్రైస్తవ చరిత్రలో వాటికన్‌కి, యూరోప్‌లోని రాజులకు మధ్య జరిగిన జగడాలు రికార్డు అయ్యాయి. చర్చి ఆఫ్ ఇంగ్లండు కథ చదివితే మీకే తెలుస్తుంది.

మన దేశంలో అయితే కుల వ్యవస్థ వుంది కాబట్టి, బ్రాహ్మణుల్లో కొందరు పురోహితులుగా వుండేవారు. ఋషులతో సంప్రదించి, రాజుగారి చేత మతకార్యక్రమాలు చేయించేవాడు. తక్కినవారంతా యితర వృత్తుల్లో వుండగా, బ్రాహ్మణులలో కొందరు మాత్రమే వేదాధ్యయనం చేసి, మరి కొందరు తపస్సు చేసి శక్తులు సంపాదించి, మరి కొందరు అరణ్యాలలో ఆశ్రమాలు కట్టుకుని ఋషి జీవితం గడుపుతూ, యింకొందరు గురుకులాలు నడుపుతూ, యిలా ప్రత్యేక స్థానాలను పొందారు. రాజులు తమ కుమార్తెలను ఋషులకు యిచ్చి పెళ్లి చేసిన సందర్భాలు చాలా కనబడతాయి. అది అనులోమ వివాహమే కాబట్టి, శాస్త్రసమ్మతం. ఆ విధంగా బ్రాహ్మణ-క్షత్రియ సఖ్యత కొనసాగింది. ఋషి జీవితం గడిపేవాళ్లు నేటి సుప్రీం కోర్టు న్యాయమూర్తుల వంటి వారు. పెద్ద పెద్ద వివాదాలు వచ్చినపుడు రాజు వారి దగ్గరకు వెళ్లి తీర్పు కోరేవాడు. వారికి లోభాలు వుండవు కాబట్టి న్యాయంగా తీర్పు చెప్పేవారు. రాజు కూడా దానికి లోబడేవాడు.

అలాటి తీర్పు చెప్పాలంటే, వారు భుక్తికై ఎవరి వద్దా చేయి చాపకూడదు, పని చేయకూడదు. అందుచేత సమాజమే వారికి కొంత భూమి యిచ్చి, కొన్ని గోవులిచ్చి, పోషణ జరిగేట్లు చూసేవారు. వీరిని చూపించి బ్రాహ్మణులందరూ సోమరిపోతులని యిటీవల కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఒక రాజ్యంలో యిటువంటి వారు ఎంతమంది వుండివుంటారు? పదిపదిహేను మంది చాలరా? తక్కిన బ్రాహ్మణులందరూ ఎవరికి వారు పోషించుకోవలసినదే. అయితే ఋషులూ న్యాయంగానే వున్నారా? రాజంటే భయపడి అతనికి అనుకూలంగా తీర్పులు చెప్పారా? అంటే వ్యక్తిని బట్టి వుంటుంది. ధిక్కరించిన ఋషులతో రాజులు పేచీ పడిన సందర్భాలు పురాణాల్లో కనబడతాయి.

పరశురాముడి కథ మన దేశంలో పురోహిత బ్రాహ్మణులకు, క్షత్రియులకు మధ్య యుద్ధాలు జరిగిన కాలాన్ని రికార్డు చేసింది. మేధోబలంతో మాత్రమే నెగ్గుకుని వస్తున్న ఋషి ఆయుధాలు పూని, క్షత్రియసంహారానికి దిగితే ఏమైందో పరశురాముడి గాథ చెప్పింది. అతనిలో బ్రాహ్మణత్వం, క్షత్రియత్వం మిళితమై వున్నాయి. ఏది అవసరమైతే దాన్ని వాడాడు. అందుకే ఇదం బ్రాహ్మం-ఇదం క్షాత్రం అనే పదబంధం వాడుకలో వచ్చింది. అతనిలో యీ రెండు లక్షణాలూ ఎలా మిళితమయ్యాయో చెప్పే కథ వుంది. భృగుమహర్షి కొడుకు ఋచీకమహర్షి గాధిరాజపుత్రిక ఐన సత్యవతిని వివాహమాడాడు. కొంతకాలానికి భృగువు కోడలి సేవలతో తృప్తిపడి వరం కోరుకోమన్నాడు. ‘నాకు పుత్రుడు కలగాలి, మా అమ్మకు కూడా పుత్రసంతానం లేదు. ఆమెకూ కలగాలి.’ అని అడిగింది. ‘సరే మీ యిద్దరికి వేర్వేరు మంత్రజలాలిస్తున్నాను. ఋతుకాలంలో నువ్వు మేడిచెట్టును, మీ అమ్మ రావిచెట్టును ఆలింగనం చేసుకుని మీమీ జలాలు తాగాలి.’ అన్నాడాయన.

వాళ్లు అలా చేయడంలో తారుమారుగా చేశారు. దాంతో భృగు ‘నీకు క్షత్రియలక్షణాలతో కొడుకు పుడతాడు, మీ అమ్మకు బ్రాహ్మణ లక్షణాలతో కొడుకు పుడతాడు.’ అని చెప్పాడు. ఆ విధంగా గాధికి విశ్వామిత్రుడు పుట్టాడు. అతను రాజుగా ప్రారంభమై, ఋషిగా మారాడు. సత్యవతి విషయంలో ఆమె ‘నా పుత్రుడు కాకుండా పౌత్రుడికి క్షత్రియలక్షణాలు వచ్చేట్లు చేయండి.’ అంది. సరేనన్నాడాయన. ఆ విధంగా ఆమె పుత్రుడిగా జమదగ్ని, పౌత్రుడిగా పరశురాముడు పుట్టారు. జమదగ్ని ధనుర్వేదాన్ని పూర్తిగా నేర్చుకుని, తపస్సు చేసి దేవతలను మెప్పించాడు. ప్రసేనజిత్తు అనే రాజు కూతురైన రేణుకను పెళ్లాడాడు. వాళ్లకు ఐదుగురు కొడుకులు. చివరివాడు రాముడు. (పరశు అంటే గొడ్డలి. అది ఆయుధంగా ధరించాక అతన్ని పరశురాముడని పిలిచారు).

పిల్లలు పెద్దవాళ్లయ్యాక ఒకసారి రేణుక నీళ్లు తీసుకురావడానికి నదికి వెళ్లింది. అక్కడ మహారాజు, మహాభోగి అయిన చిత్రరథుడు భార్యతో జలక్రీడలు ఆడుతున్నాడు. వాళ్లని ఆసక్తిగా చూస్తూ ‘పర’ధ్యానంలో పడిన రేణుక ఆలస్యంగా యింటికి వెళ్లింది. ఋషిపత్నికి సహజమైన ధీరత్వాన్ని కోల్పోయిన రేణుకను చూడగానే భర్త ఆమె మానసిక వ్యభిచారాన్ని గమనించి, ఆమెను శిక్షించదలచాడు. కొడుకుల్ని పిలిచి మీ తల్లి తల తెగనరకండి అన్నాడు. పై నలుగురు తిరస్కరించి శాపానికి గురయ్యారు. రాముడు మాత్రం గండ్రగొడ్డలితో తల్లి శిరచ్ఛేదం చేశాడు. కోపం తగ్గిన తండ్రి నా మాట పాలించి నీకెంతో ప్రియమైన తల్లిని చంపావు కాబట్టి వరం కోరుకో అన్నాడు. తల్లిని బతికించు, వధ విషయం తెలియనీయకు, అన్నల్ని బతికించు, నాకు సదా జయం కలిగేట్లు అనుగ్రహించు అన్నాడు. జమదగ్ని అలాగే చేశాడు.

రాముడు తన తాత సలహాపై శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు మెచ్చి అతనికి గొడ్డలి యిచ్చి దేవతలకు సహాయంగా రాక్షసుల మీదకు యుద్ధానికి పంపాడు. ఆ యుద్ధంలో గెలిచివచ్చి మళ్లీ తపస్సు చేస్తే భార్గవాస్త్రంతో బాటు అనేక అస్త్రాలు యిచ్చాడు. రాముడు యీ పనిలో వుండగా యింటి దగ్గర ఒక ఘోరం జరిగింది. అనూపదేశపు రాజు కార్తవీర్యుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. వాళ్లు ఆతిథ్యం యిచ్చినా అధికారమదంతో ఆశ్రమాన్ని నాశనం చేసి జమదగ్నిని చంపి వెళ్లిపోయాడు. రేణుక సతీసహగమనం చేయబోయింది. అంతలో భృగుమహర్షి వచ్చి, ఆమెను ఆపి, మంత్రజలం చల్లి జమదగ్నిని బతికించాడు. ఈ లోపునే రాముడు తన తండ్రిని అకారణంగా చంపిన కార్తవీర్యుణ్ని చంపుతానని శపథం చేశాడు.

కార్తవీర్యుడు సామాన్యుడు కాదు, వెయ్యి చేతులు కలవాడు. పైగా యితర దేశాల రాజులు కూడా అతనికి అండగా వచ్చారు. రాముడు తన గొడ్డలితో వాళ్లందరినీ చంపాడు. శపథం నెరవేర్చి శాంతించాడు. కానీ కార్యవీర్యుడి కొడుకులు ఊరుకోలేదు. రాముడు లేని సమయంలో జమదగ్ని ఆశ్రమంపై పడి అతన్ని హతమార్చారు. తల్లి గుండెలు బాదుకుని ఏడ్చి, సహగమనం చేసింది. రాముడికి పట్టరాని కోపం వచ్చింది. రాజులు అధికారమదంతో విర్రవీగుతున్నారు, వాళ్లకు బుద్ధి చెప్పాల్సిందేనంటూ గొడ్డలి పట్టుకుని కార్తవీర్యుడి కొడుకుల్ని వధించాడు. కార్యవీర్యుడి రాజసౌధాలను అగ్నికి దగ్ధం చేశాడు. అందువలన ఏదైనా తగలబడిపోతే పరశురామప్రీతి అయిందన్న వర్ణన సాహిత్యంలో వచ్చి చేరింది. ఆపై క్షత్రియసంహారానికి బయలు దేరాడు. కొందరు యితని చేతిలో చావగానే, తక్కినవాళ్లు యితర రాజులను సమీకరించుకుని యితనిపై పడేవారు. అయినా రాముడిదే గెలుపు. ఇలా మొత్తం 21 సార్లు భూమిని చుట్టి తన నెదిరించిన క్షత్రియులందరినీ మట్టుపెట్టాడు. దాక్కున్నవాళ్లు బతికిపోయారు. భర్తలను పోగొట్టుకున్న రాణులు నియోగపద్ధతిలో బ్రాహ్మణుల చేత పిల్లలు కని (అంబిక, అంబాలిక వ్యాసుడి చేత పిల్లల్ని కన్నట్లు) వాళ్లని క్షత్రియులుగా పెంచారు.

తను చంపిన క్షత్రియుల రక్తంతో రాముడు ఐదు మడుగులను ఏర్పరచి, ఆ రక్తంతో భృగువంశీకులకు తర్పణాలు వదిలాడు. అశ్వమేధయజ్ఞం చేసి, దక్షిణగా కశ్యపమహర్షికి సమస్త భూమండలాన్ని యిచ్చేశాడు. ఇతనీ భూమిపై వుంటే, అక్కడక్కడ మిగిలిన రాజుల్ని కూడా చంపేసి, అరాచకానికి కారకుడవుతాడని భయపడిన కశ్యపుడు ‘ఈ భూమండలానికి రాజుగా ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు యిక్కడ వుండడానికి వీల్లేదు.’ అన్నాడు. అప్పుడు అతను దక్షిణతీరానికి వెళ్లి తన గొడ్డలి విసిరితే సముద్రుడు ఆ మేరకు వెనక్కి వెళ్లిపోయాడు. (ఇప్పటి రిక్లమేషన్ అన్నమాట) అది పరశురామక్షేత్రం అయింది.

పరశురాముడి ప్రస్తావన వినాయకుడితో తలపడి అతని దంతాన్ని విరక్కొట్టి, ఏకదంతుణ్ని చేయడంలో, సీతారామకల్యాణానంతరం రాముడి వద్దకి వెళ్లి, భంగపడి తన తేజస్సును అర్పించడంలో కనబడుతుంది. క్షత్రియుడైన భీష్ముణ్ని శిష్యుడిగా స్వీకరించి, కొన్నాళ్లకు అంబ తరఫున అతనితో యుద్ధం చేసి ఓడిపోవడం, ద్రోణుడికి అస్త్రాలను దానం చేయడం, కర్ణుడికి అస్త్రవిద్య నేర్పి, అతను బ్రాహ్మణుడనని అబద్ధం చెప్పి నేర్చుకున్నాడని తెలియగానే (పరశురాముడి వంటి అవతారమూర్తికి కర్ణుడు కుంతీపుత్రుడని తెలియకపోదు, అతను అబద్ధం చెప్పాడనే కోపం వచ్చింది)  శపించడం వంటి ఘట్టాల్లో కనబడుతుంది. అతను చిరంజీవి. మహేంద్రపర్వతంపై తపస్సు చేసుకుంటూ వుంటాడు. సూర్యసావర్ణిక మనువు కాలంలో సప్తర్షులలో ఒకడుగా వుంటాడు.

ఇప్పుడు పరశురాముడి పేరును యుపి రాజకీయాల్లో వాడుకుంటున్నారు. దాని గురించి చెప్పేముందు, మహారాష్ట్రలోని చిత్‌పావన్ బ్రాహ్మణులు కూడా ఆయన్ను తమ ఐకాన్‌గా వాడుకున్న సంగతి చెప్పాలి. ఇవన్నీ ‘‘యుపి బ్రాహ్మల్లో పరశురామస్ఫూర్తి’’ అనే వ్యాసంలో చెప్తాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2021)

mbsprasad@gmail.com

రమ్యకృష్ణ గారికి వయస్సు ఏమిటి?

హను రాఘవపూడి చాలా కష్ట పెడతాడు