cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: పార్థా చటర్జీ స్కామ్

ఎమ్బీయస్‍: పార్థా చటర్జీ స్కామ్

బెంగాల్ మంత్రి (నిన్నటి నుంచి మాజీ అయ్యాడు) పార్థా చటర్జీ సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ యింట్లో గుట్టలుగుట్టలుగా కరెన్సీ, బంగారం దొరకడంతో బెంగాల్‌లో ఉద్యోగ నియామకాల స్కామ్‌పై అందరి దృష్టి యిప్పుడు పడింది కానీ కొన్నాళ్లుగా యిది నలుగుతూనే ఉంది. ‘‘ఇండియా టుడే’’ మే 30 సంచికలో ‘‘బ్లాకెస్ట్ ఆఫ్ బోర్డ్‌స్’’ పేర దీనిపై కథనం వచ్చింది. కానీ మన తెలుగు మీడియా పట్టించుకోలేదు. రాజకీయ కోణం ఉంటే తప్ప యిలాటివి హైలైట్ కావు. ఇప్పుడు సోనియాను, రాహుల్‌ను ఈడీ పిలిచింది కాబట్టి ‘నేషనల్ హెరాల్డ్ గురించి మీరు రాయలేదేం?’ అని కొంతమంది పాఠకులు నన్నడిగారు. నేను ఎప్పుడో రాశాను. వాళ్లు పట్టించుకుని ఉండరు.

నిజానికి నేషనల్ హెరాల్డ్ కేసు ఓపెన్ అండ్ షట్ కేసు. సోనియా, రాహుల్‌కు ఎప్పుడో శిక్ష పడాలి. కానీ కేసును నానుస్తూ వచ్చారు. యుపిఏ హయాంలో నత్తనడక నడిచిందంటే సరేలే అనుకోవచ్చు. 2014 నుంచి ఎన్‌డిఏ ప్రభుత్వమే కదా. ఎందుకు సాగదీశారు? ఇలా తీసి, తీసి, చివరకు యిప్పుడు పిలిచారు. ఇప్పుడు సోనియా, రాహుల్ ‘‘అన్నీ 2020లో చనిపోయిన మోతీలాల్ వోరాకే తెలుసు. మాకేం తెలియదు.’’ అని చెప్పి తప్పించుకుంటున్నారు. ఈ కేసులో వీళ్లకు శిక్ష పడుతుందా, లేదా అన్నది ప్రశ్నార్థకమే. మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్ కేసుంది. అన్ని పార్టీల వాళ్లూ దోషులే. కేసు యిప్పటికీ తేల్చరు. నేను గమనిస్తున్న దేమిటంటే రాజకీయ పార్టీలకు దోషులను శిక్షించాలని ఉండదు. వాటిని అడ్డం పెట్టుకుని, రాజకీయ అవసరాలకు వాడుకుంటూ ఉంటారు. ఇప్పుడీ పార్థా కేసుంది కదా, రేపతను బిజెపిలో చేరతానంటే యిది కోల్డ్ స్టోరేజిలోకి వెళ్లిపోతుంది. ప్రస్తుతం అర్పిత యింట్లో దొరికిన సెక్స్ టాయ్స్ గురించి కూడా కథనాలు వండి వారుస్తున్న మీడియా కూడా సడన్‌గా రాయడం మానేస్తుంది. సుజనా చౌదరి, సిఎం రమేశ్‌ల గురించి అంత మాట్లాడిన జివిఎల్ యిప్పుడు మౌనంగా ఉన్నారు కదా!

భవిష్యత్తు మాట ఎలా ఉన్నా ఆ స్కాండల్ ఏమిటో దాని విషయాలు రాస్తున్నాను. బెంగాల్‌లో ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో నియామకాలు స్కూలు సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సి)‘స్టేట్ లెవెల్ సెలక్షన్ టెస్ట్’ (ఎస్‌ఎల్‌ఎస్‌టి) ద్వారా చేస్తుంది. 2017లో 30 వేల ఖాళీల కోసం పరీక్షలు నిర్వహించినపుడు 5 లక్షల మంది పరీక్ష రాశారు. పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ కలకత్తా హైకోర్టులో 2030 పిటిషన్లు పడ్డాయి. ఈ లిటిగేషన్ వలన ఏడాదికి పైగా 6200 ప్రొసీజరల్ లాప్సెస్ ఉన్నాయని బయటపడింది. పరీక్షాఫలితాలను వెబ్‌సైట్‌లో పెట్టకుండా అభ్యర్థులను మీ పేర్లు టైప్ చేసి ఫలితాలు చూసుకోమన్నారు. పాసయినవాళ్లకి ‘‘కాల్డ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్’’ అని కబనడేది. అసలెవర్ని యింటర్వ్యూకి పిలుస్తున్నారో, ఎవరికి ఎపాయింట్‌మెంట్ లెటరు యిస్తున్నారో తెలిసేది కాదు. అంతా గోప్యం.

దాంతో కొందరు అభ్యర్థులు 2018 చివర్లో 29 రోజుల పాటు నిరాహారదీక్ష చేశారు. మరి కొందరు కోర్టుకి వెళ్లారు. హైకోర్టు ‘మీరు అంతిమ ఫలితాలను ప్రకటించండి’ అని అదేశిస్తే 2019 జనవరిలో ఎస్ఎస్‌సిని వాటిని పబ్లిష్ చేసింది. దానిలో కేవలం పేర్లు, ర్యాంకులు ఉన్నాయి తప్ప మార్కులు యివ్వనేలేదు. వెయిటింగ్ లిస్టు కూడా ప్రచురించారు. మార్కులివ్వకపోవడంతో తక్కువ మార్కుల వాళ్లకు ఉద్యోగాలిచ్చేరేమోనన్న సందేహం వచ్చింది. అలాటి వాళ్లు 100 మంది దాకా ఉంటారని ఒక ఉద్యమకారుడు అన్నాడు. బి.ఇడి. ఉండడం కంపల్సరీ అయినా అది లేనివాళ్లకు కూడా ఉద్యోగమిచ్చినట్లు సందేహాలున్నాయి అన్నారు కొందరు ఆందోళనకారులు. అందరూ కలిసి 2019 మార్చిలో ధర్నాకు దిగారు. కోర్టు ఎస్‌ఎస్‌సిని దులిపేసింది. అప్పుడు మమత ఆందళనకారులకు వద్దకు వెళ్లి ఓ కమిటీ వేస్తానని ఒప్పుకుంది. 10 మంది సభ్యుల్లో 5గురు విద్యాశాఖ అధికారులు, 5గురు అభ్యర్థులు ఉంటారంది. తర్వాత యీ ఐదుగురు అభ్యర్థులకు ఉద్యోగాల ఎఱ చూపించి చల్లబరిచారనే ఆరోపణలు వచ్చాయి. ఏది ఏమైనా ఉద్యమం చప్పబడింది.

2019 నవంబరులో ప్రభుత్వం 5గురు విద్యాశాఖాధికారులతో మరో కమిటీ వేసింది. విద్యాశాఖామాత్యుడు పార్థా చటర్జీ సెక్రటరీ కూడా వారిలో ఉన్నాడు. వీళ్లు విషయాన్ని పరిశీలిస్తున్నామంటూ జాప్యం చేశారు. కోర్టులో కేసు పెండింగులో ఉంది. ఈలోగా కొన్ని నియామకాలు జరిగిపోయాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మమత పార్థాకు విద్యాశాఖ యివ్వలేదు. 2021 నవంబరులో కొన్ని నాన్-టీచింగు ఉద్యోగుల నియామకాలు జరిగాయి. 2022 ఫిబ్రవరిలో హైకోర్టు జజ్ గంగూలీ దానిపై సిబిఐ విచారణకు ఆదేశించారు. కానీ డివిజన్ బెంచ్ దాన్ని నిలిపివేసి, రిటైర్డ్ జజ్ ఒకాయన చేత విచారణ జరిపించింది. ఆయన విచారించి, గ్రూపు సి, గ్రూపు డిల  కింద 900 అక్రమ నియామకాలు జరిగాయని తేల్చారు.

జస్టిస్ గంగూలీ ఏప్రిల్ 12న మంత్రికి తెలియకుండా యిలాటివి జరగవంటూ పార్థా చటర్జీని విచారించమని, అవసరమైతే కస్టడీలోకి తీసుకోమని సిబిఐను ఆదేశించారు. డివిజన్ బెంచ్ పార్థాకు నాలుగు వారాల గడువు యిచ్చింది. పార్థా తనకేమీ తెలియదన్నాడు. ఆందోళనకారులను శాంతింపచేయడానికి ప్రభుత్వం మే5న మరో 5వేల టీచింగు పోస్టులను శాంక్షన్ చేసింది. హైకోర్టు మే 12న మార్కులతో సహా కొత్త లిస్టు ప్రచురించమని ఎస్‌ఎస్‌సిని ఆదేశించింది. నాలుగు వారాల గడువు అయిపోవడంతో సిబిఐ రంగంలోకి దిగింది. 69 మంది టీచర్ల నియామకాలు అక్రమంగా ఉన్నాయంది. సిబిఐ వెనక్కాలే ఇడి కూడా దిగింది. ఫలితం యిప్పుడు చూస్తున్నాం. ఈలోగా వచ్చిన ఆరోపణలను పరికిస్తే, ఒక మంత్రిగారి సెక్యూరిటీ ఆఫీసరు తన జిల్లాకు చెందిన 400 మంది అభ్యర్థుల పేర్లు మెరిట్ లిస్టులోకి చేర్చాడట. ఒక్కొక్కరి వద్దా రూ. 12 లక్షలు వసూలు చేశాడట. బీర్‌భూమ్ జిల్లాకు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు ఒక్కోళ్లు సగటున 200 మందికి కోటా ఎలాట్ చేయించుకున్నారట.

2001 నుంచి ఎమ్మెల్యేగా ఉన్న 69 ఏళ్ల పార్థా చటర్జీ మమతకు కుడిభుజం వంటివాడు. పార్టీలో అతను సెక్రటరీ జనరల్. ఈ మధ్యే పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కూడా అయ్యాడు. 2006-11 మధ్య ఆసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. 2011 నుంచి ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ముఖ్యమైన పదవులు నిర్వహించాడు. అతనికి సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆమె మోడలింగు ద్వారా సినీరంగంలో ప్రవేశించింది. 2008-14 మధ్య బెంగాలీ, ఒడియా సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసింది. పార్థాకు బినామీనని ఒప్పుకోకపోతే, యింత డబ్బు ఎలా సంపాదించిందో ఆమె చెప్పవలసి ఉంటుంది. పార్థా నిర్వహించే దుర్గా ఉత్సవాలలో చురుకుగా పాలుపంచుకుంది. పార్టీలో మాత్రం చేరలేదని కునాల్ ఘోష్ అంటున్నాడు. ఆమె పేర ఉన్న ఫ్లాట్లలో కొన్ని గదుల్లో 50 కోట్ల రూ.ల దాకా నగదు, బంగారం దొరికాయి.

అదంతా పార్థాదేనని, గదులకు తాళం వేసుకుని పెట్టుకుని, తను వచ్చినపుడే తెరిచి చూసుకునేవాడని, తనకు ఏ సంబంధమూ లేదని అర్పిత చెపుతోంది. అరెస్టు కాగానే షరామామూలుగా ఆరోగ్య సమస్యలు, ఆసుపత్రులలో చేరడాలూ యిలాటి వ్యవహారాలు సాగుతున్నాయి. ఇదంతా పార్థా డబ్బు మాత్రమే కాదనీ, మమతకు కూడా దీనిలో హస్తముందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. భయపడుతున్న అర్పిత అప్రూవర్‌గా మారే సూచనలున్నాయని అంటున్నారు. అందువలన మమత వెంటనే జులై 28న పార్థాపై పార్టీపరంగా, ప్రభుత్వపరంగా కఠిన చర్యలు తీసుకుంది. పార్టీ పత్రిక ఎడిటర్‌గిరీ నుంచి, కమిటీల నుంచి, మంత్రిపదవి నుంచి తీసేయడమే కాక, పార్టీ పదవుల నుంచి తీసేసి, పార్టీలోంచే తీసేసింది.

తృణమూల్ కార్యకర్తలపై, నాయకులపై అవినీతి ఆరోపణలు కొత్తగా వచ్చినవి కావు. ఎప్పుడూ ఏవో కేసులు నడుస్తూనే ఉన్నాయి. 2016 తర్వాత ఛోటామోటా నాయకులు కూడా కమిషన్లు కొట్టేశారని, అదే 2019లో పార్లమెంటు ఎన్నికలలో తక్కువ సీట్లు రావడానికి కారణమైందని ప్రశాంత్ కిశోర్ చెప్పడంతో, మమత అవినీతి జరిగిందని బహిరంగంగా ఒప్పుకుని, కమిషన్ డబ్బును వెనక్కి యిచ్చేయమని నాయకులకు పిలుపు నిచ్చింది. చాలామందిని పార్టీలోంచి పంపించి వేసింది. ఇది ఓ పక్క జరుగుతూండగానే పార్థా వంటి వాళ్లు డబ్బు మేస్తూ వచ్చారని దీన్ని బట్టి తెలుస్తోంది. బయటపడి పోయింది కాబట్టి, ‘నాకు దీనిలో ఏ సంబంధమూ లేదు’ అని చూపుకోవడానికి పార్థాను బయటకు నెట్టేసింది. కానీ విచారణలో పార్థా ఏం చెపుతాడో, అది మమతకు చుట్టుకుంటుందో లేదో వేచి చూడాలి.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2022)

mbsprasad@gmail.com

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి