Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: ఫోటోగ్రఫీ ఎథిక్స్

ఎమ్బీయస్: ఫోటోగ్రఫీ ఎథిక్స్

చెన్నయ్‌లో  ఒక రైల్వే స్టేషన్‌లో ఓ దుండగుడు ఓ అమ్మాయిని కత్తితో నరికేస్తూ వుంటే అక్కడున్న జనాలు ఫోటోలు తీస్తూ కూర్చున్నారు తప్ప వెళ్లి ఆమెను రక్షించని ఘటన కొన్నేళ్ల క్రితం జరిగింది. ఇప్పటికి కూడా మనకు వాట్సాప్‌లలో స్కూటర్ యాక్సిడెంటు, కారు యాక్సిడెంటు ఘటనలు వస్తూంటాయి. దీన్ని షూట్ చేసినవాళ్లు తర్వాతైనా వెళ్లి బాధితులను రక్షించారా అనే ఆలోచన మనకు వస్తూంటూంది. ఇప్పుడు మీకు యిద్దరు ఫోటోజర్నలిస్టుల గురించి చెప్తాను. ఇద్దరికీ తాము తీసిన ఫోటోలకు పులిట్జర్ బహుమతులు వచ్చాయి.

పైన కనబడుతున్న దానిలో మొదటి ఫోటో (ఇన్‌సెట్‌లో ఫోటోగ్రాఫర్) దక్షిణ సుడాన్‌లో 1993లో అంతర్యుద్ధకాలంలో తీసింది. సుడాన్‌లో తీవ్రమైన కరువు పరిస్థితులున్నాయి. అయోడ్ అనే ప్రాంతంలో రోజుకి 10-13 మంది పెద్దలు ఆకలితో చచ్చిపోతున్నారు. 5ఏళ్ల లోపు పిల్లల్లో నూటికి 40 మందికి కావలసినంత ఆహారం లేదు. యునైటెడ్ నేషన్స్ అక్కడి పౌరులకు ఆహారం అందించే సత్కార్యం చేపట్టింది కానీ నిధుల కొరత వెక్కిరిస్తోంది. నిధులు కావాలంటే అక్కడి పరిస్థితి కళ్లకు కట్టినట్టు చూపించే ఫోటో జర్నలిస్టులుండాలి. ఎవరినైనా పంపిద్దామంటే అంతర్యుద్ధం చేస్తున్న తిరుగుబాటుదారులు రానీయటం లేదు.

చివరకు యుఎన్‌ఓ వారితో మాట్లాడి కొందర్ని అనుమతించేందుకు ఒప్పించింది. వచ్చిన వారు 24 గంటల్లో తిరిగి వెళ్లిపోవాలనే షరతుపై తిరుగుబాటుదారులు అనుమతించారు. అలాటి భయానక పరిస్థితుల్లో ఆ ప్రమాదకరమైన చోటికి వెళ్లి ఫోటోలు తీయడానికి సిల్వా, కెల్విన్ కార్టర్ అనే యిద్దరు ముందుకు వచ్చారు. 33 ఏళ్ల కార్టర్‌కు అప్పటికే యింట్లో కొన్ని సమస్యలున్నాయి. ఫ్రీలాన్సర్‌గా నిలదొక్కుకోవాలంటే యిలాటి సాహసం చేయాల్సిందే అనుకుంటూ ముందుకు వచ్చాడు. ఇద్దరూ కలిసి 1993 మార్చిలో నైరోబీకి వెళ్లారు. అయోడ్‌కు విమానంలో తిండి పదార్థాలు తీసుకెళ్లడానికి సుడాన్ తిరుగుబాటుదారుల నుండి అనుమతి వచ్చేవరకు అక్కడే వెయిట్ చేశారు. వచ్చాక యుఎన్ ప్రతినిథితో బాటు అదే విమానంలో వీళ్లూ వెళ్లారు.

అక్కడకు దిగగానే సిల్వా, కార్టర్ ఎవరి దారిన వెళ్లి ఫోటోలు తీసుకుని, నిర్ణీత సమయానికల్లా విమానం దగ్గరకు వచ్చేయాలనుకున్నారు. బయటకు ఒంటరిగా వెళితే ప్రమాదం కాబట్టి తిరుగుబాటుదారుల సాయం కోరారు. వాళ్లలో ఒకడు కార్టర్ రిస్ట్‌వాచ్ తీసుకుని వాళ్లకు రక్షణ కల్పించడానికి ఒప్పుకున్నాడు. వాళ్లిద్దరూ అనేక అన్నార్తుల ఫోటోలు తీశారు కానీ, కార్టర్ తీసిన యీ ఫోటోకు ప్రపంచ ప్రఖ్యాతి వచ్చింది. యుఎన్ వాళ్లు నిర్వహిస్తున్న ఒక అన్నదాన శిబిరం వద్దకు ఒకబ్బాయి (మొదట్లో అమ్మాయని పొరబడ్డారు కానీ చాలా ఏళ్ల తర్వాత తండ్రి అబ్బాయని ధృవీకరించాడు) కాలిపోతున్న యిసుకలో నడవలేక యీడ్చుకుంటూ వెళుతూ ఓపిక లేక ఒరిగిపోయాడు. అతను ఏ నిమిషంలోనైనా చచ్చిపోవచ్చు, తిని కడుపు నింపుకోవచ్చు అనుకుని ఒక రాబందు అక్కడకు వచ్చి వాలింది.

రాబందులకు ముక్కు బలంగా వుంటుంది కానీ పాదాలు గోళ్లు బలంగా వుండవు. అందుకని అది ప్రాణులను చంపలేదు. చనిపోయిన తర్వాత పీక్కు తినగలదు. కొన్ని జాతుల రాబందులు మాత్రం చిన్న ప్రాణులను చంపగలవు. రాబందు పక్కన తారట్లాడుతోందంటే దాని అర్థం యీ జీవి కొసప్రాణంతో వున్నట్లే! కార్టర్ యీ అభాగ్యుణ్ని మొదటిసారి ఫోటో తీసినప్పుడు రాబందు ఫ్రేమ్‌లో లేదు. అయితే మరో కోణం నుంచి కూడా తీద్దామని చూసినప్పుడు రాబందు కనబడింది. భలేగా వుందే అని ఫోటో తీశాడు. అమెరికాకు తిరిగి వచ్చి ‘‘న్యూయార్క్ టైమ్స్’’కు అమ్మాడు. అది 1993 మార్చి 26 సంచికలో పడడంతోనే ప్రపంచమంతా సెన్సేషన్ అయిపోయింది. సుడాన్‌లో పరిస్థితి యింత ఘోరంగా వుందా అనుకుంటూ ప్రపంచం నలుమూలల నుంచి యునైటెడ్ నేషన్స్‌కి విరాళాలు వచ్చిపడ్డాయి. 

ఇంతమందిని కదిలించిన ఆ ఫోటోగ్రాఫ్‌కు, దాన్ని తీసిన కార్టర్‌కు విపరీతంగా పేరు వచ్చింది. ఆ ఫోటోకై 1994 ఏప్రిల్‌లో పులిట్జర్ బహుమతి వచ్చింది. ఫోటో చూడగానే చాలామందికి సందేహం వచ్చింది. ఫోటోలో పిల్ల తర్వాత ఏమైందా? బతికిందా లేక రాబందు తన కడుపు నింపుకుందా? అని ప్రశ్నలడగసాగారు, ముఖ్యంగా బహుమతి వచ్చి అందరికీ ఆసక్తి పెరగడంతో! కార్టర్‌ని పేపరు వాళ్లు అడిగి చూశారు. ‘ఏమో, నేను విమానం పట్టుకునే హడావుడిలో వెళ్లిపోయాను. అది దాటిపోయిందంటే తిరుగుబాటుదారులు మా ప్రాణాలు తీసేస్తారు కదా’ అన్నాడు. ఆ సమాధానం బయటకు చెపితే బాగుండదని పేపరు వాళ్లు ‘కార్టర్‌ను అడిగాం. కాస్సేపటికి ఆ పిల్ల ఓపిక తెచ్చుకుని తనంతట తానే నడుచుకుంటూ అన్నదానశిబిరానికి వెళ్లిపోయిందని చెప్పాడు.’ అని రాశారు.

ఆ ఫోటో చూస్తే రాబందే తన రెక్కల మీద శిబిరానికి తీసుకెళితే తప్ప ఆ పిల్ల తనంతట తాను లేచే పరిస్థితిలో లేదని అర్థమౌతోంది. కార్టర్ అబద్ధమాడాడని, ఆ రోజు పట్టించుకోకుండా వచ్చేశాడనీ, తను దగ్గరుండి ఆ పిల్లను శిబిరానికి తీసుకెళ్లలేదనీ అందరికీ తెలిసిపోయింది. నిజానికి ఆ ఫోటోలో వున్నది పిల్ల కాదు, పిల్లాడని 2011లో బయటపడింది. న్యూయార్క్ టైమ్స్ చెప్పినట్లు ఆ శిశువు లేచి శిబిరానికి చేరడం కార్టర్ చూసి వుంటే బట్టల్లేవు కాబట్టి పిల్లో, పిల్లాడో తెలిసిపోయి వుండేది. వాస్తవం ఏమిటంటే ఫోటో తీశాడు, తన పాటికి తను వెళ్లిపోయాడు. బహుమతి రావడంతో ఈ విషయం అర్థం కాగానే వ్యాఖ్యలు రావడం మొదలెట్టాయి. ముఖ్యంగా ఒక వ్యాఖ్య – ‘ఫోటోలో ఒక్కటే కనబడుతోంది కానీ నిజానికి అక్కడ రెండు రాబందులున్నాయి. రెండోదాని చేతిలో కెమెరా వుంది.’ అనే వ్యాఖ్య విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది.

పిల్ల చావుపై బతుకుదామని రాబందు చూసినట్లే, పిల్ల దుస్థితిని అమ్ముకుని పేరు, డబ్బూ తెచ్చుకోవడానికి కార్టర్ కూడా రాబందులాగానే ప్రవర్తించాడని దుమారం రేగడంతో, అవమానం భరించలేక బహుమతి వచ్చిన 4 నెలలకు కార్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఫోటోగ్రాఫర్ల నందరినీ కదిలించివేసింది. అతనితో పాటు అక్కడకు వెళ్లిన సిల్వా 2000లో ‘‘బ్యాంగ్ బ్యాంగ్ క్లబ్’’ అనే పుస్తకం రాస్తూ ‘రాబందును ఏం చేశావని నేనవాళ కార్టర్‌ను అడిగాను. తరిమేశా అన్నాడతను.’ అని చెప్పాడు. నిజంగా తరిమేడే అనుకున్నా ఉత్తరక్షణంలో వచ్చి మళ్లీ వాలుతుంది కదా! ఆ బిడ్డను అక్కణ్నుంచి తప్పించావా లేదా అన్నదే ప్రధానం. (అప)కీర్తిశేషుడైన మిత్రుణ్ని మరీ తిట్టుకోకుండా వుండాలని సిల్వా ఓ వాక్యం చేర్చాడేమో తెలియదు.

*

ఇప్పుడు రెండో ఫోటో గురించి, ఇన్‌సెట్‌లో వున్న ఫోటోగ్రాఫర్ గురించి చెప్తాను. వియత్నాం ఫ్రెంచివారి వలసదేశంగా వుండేది. రెండవ ప్రపంచయుద్ధంలో దెబ్బ తిన్నాక వాళ్లు అక్కణ్నుంచి తప్పుకున్నారు. అప్పటిదాకా ఫ్రెంచివారిపై పోరాటానికి వియత్నామీయులకు కమ్యూనిస్టు దేశాలైన రష్యా, చైనాలు సాయం చేయడంతో కొత్తగా స్వేచ్ఛ పొందిన వియత్నాం మరో కమ్యూనిస్టు దేశంగా మారుతుందని అమెరికాకు భయం పట్టుకుంది. దాంతో ఫ్రాన్స్ స్థానంలో 1955లో అది రంగంలోకి దిగింది. వియత్నాంను లొంగదీసుకోవడానికి భీకరయుద్ధం చేసింది. అమెరికన్ యువతను సైన్యంలోకి బలవంతంగా చేర్చి వియత్నాంపైకి యుద్ధానికి పంపేది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా హో చి మిన్ నేతృత్వంలోని వియత్నాం సేన లొంగకుండా అమెరికాను ముప్పుతిప్పలు పెట్టింది.

తమ కవసరం లేని, తమకు డైరక్టుగా శత్రువులు కానివారితో జరిగే ఒక వ్యర్థయుద్ధంలో తమ పిల్లలు అన్యాయంగా చచ్చిపోవడం చూసిన అమెరికన్ పౌరులు తిరగబడ్డారు. యుద్ధవ్యతిరేక ప్రచారం విరివిగా సాగింది. అయినా అమెరికన్ పాలకులు – ఏ పార్టీకి చెందినవారైనా సరే – యుద్ధం కొనసాగిస్తూ పోయారు. వియత్నాం వంటి చిన్నదేశంపై దారుణ మారణాయుధాలను కురిపించారు. నేపాలం బాంబుల వంటివి అమాయక పౌరులపై వర్షింపచేశారు. ఈ నేపథ్యంలో నిక్ యుట్ అనే వియత్నాం ఫోటోగ్రాఫర్‌ను అసోసియేటెడ్ ప్రెస్ వారు వార్ ఫోటోగ్రాఫర్‌గా నియమించారు. ఆ సంస్థలో అతని అన్నగారు అదే హోదాలో పనిచేశాడు. కానీ విధినిర్వహణలోనే చనిపోయాడు. ఇతను 16 ఏళ్ల వయసులో ఆ పోస్టుకి అప్లయి చేస్తే ‘కుటుంబంలో మరొకరు మరణించడం సబబు కాదు’ అంటూ కంపెనీ తిరస్కరించింది. కానీ యితని ఉత్సాహం చూసి సరేనంది. ఇతను కూడా యుద్ధంలో మూడుసార్లు తీవ్రంగా గాయపడ్డాడు. మోకాలు, చెయ్యి, పొట్ట దెబ్బ తిన్నాయి.

ఇతను అక్కడ పనిచేస్తూండగానే 1972లో వియత్నాంలో ఒక పల్లెటూళ్లో మిట్టమధ్యాహ్నం అమెరికా నేపాలం బాంబు జారవిడిచింది. అది జిగురు కలిపిన ఫయర్‌బాంబ్. టార్గెట్‌ను చేరి దాన్ని అంటిపెట్టుకుని దహించివేస్తుంది. ఆ బాంబు పడడంతో ఆ గ్రామంలోని యిళ్లు దగ్ధమైపోయాయి. మనుష్యుల ఒంటి మీద పడి వాళ్ల దుస్తులు, చర్మం కాలిపోయాయి. ఆడామగా, ముసలీముతకా, చిన్నాపెద్దా ప్రజలంతా భీతావహులై అటూయిటూ పారిపోయారు. కొంతమంది చచ్చిపోయారు. అక్కడ అనేక మంది ఫోటోగ్రాఫర్లు వుండి ఎడాపెడా ఫోటోలు తీస్తున్నారు. ఎటో తెలియకుండా పారిపోతున్న కిమ్ అనే ఒక పాప 21 ఏళ్ల నిక్ కంటపడింది. ఒళ్లు కాలిపోయి, ఒంటిమీద నూలుపోగు లేకుండా, బాధతో, భయంతో వెర్రిగా అరుస్తూ రోడ్ల మీద పరిగెట్టుకుని వస్తూన్న ఆ బాలికను చూడగానే నిక్ తన కెమెరాను క్లిక్ మనిపించాడు. తనతో పాటు యితరులు కూడా పరిగెడుతున్నా ఆమెను కేంద్రంగా పెట్టి ఫోటో తీశాడు.

‘నేపాలం గర్ల్’ను అసోసియేటెడ్ ప్రెస్ ప్రచురించడంతో ప్రపంచాని కంతటికీ అమెరికా వియత్నాంలో పౌరులపై జరుపుతున్న ఘాతుకం తెలిసివచ్చింది. అందరూ అసహ్యించుకున్నారు. ముఖ్యంగా అమెరికన్ పౌరులు! మన ప్రతాపం చూపించేది యీ అభాగ్యుల మీదనా అని అడగసాగారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ దీన్ని ‘ఫేక్’ అన్నాడు. తర్వాతి కాలంలో అతని పార్టీవాడే ఐన ట్రంప్ యీ మాటను విరివిగా, విచ్చలవిడిగా వాడేశాడు. నిక్సన్ అలా అనగానే నిక్ ‘అది ఫేక్ అని నిరూపించండి చూద్దాం’ అని ఛాలెంజ్ చేశాడు. దాంతో నిక్సన్ తగ్గాడు. వియత్నాం యుద్ధం కొనసాగిన కొద్దీ సంజాయిషీలు ఎక్కువగా చెప్పుకోవాల్సి వస్తోందని గ్రహించాడు. యుద్ధవిరమణకై చర్చలు మొదలుపెట్టాడు. అవి అలా సాగిసాగి చివరకు 1975లో అమెరికా వియత్నాం యుద్ధం నుంచి తప్పుకుంది.

ఆ విధంగా యీ ఫోటో, ప్రపంచాన్ని కనీసం అమెరికాను ఓ కుదుపు కుదిపి వియత్నాంలో శాంతి నెలకొనేందుకు దోహదపడింది. దీనికి 1973లో పులిట్జర్ బహుమతి లభించింది. దీని తర్వాత నిక్ టోక్యోలో, సౌత్ కొరియాలో, కూడా పని చేశాక లాస్ ఏంజిలిస్‌కు బదిలీ చేశారు. అక్కడ అనేకమంది హాలీవుడ్ తారల ఫోటోలు తీశాడు. ఎంతో పేరు తెచ్చుకున్నాడు. తన 66వ ఏట 2017లో రిటైరయ్యాడు. 2018లో కేరళ ప్రభుత్వం నిర్వహించిన ప్రెస్ ఫోటో ఫెస్టివల్‌కు హాజరయ్యాడు. ఈ ఏడాది జనవరి 13న అమెరికా ప్రభుత్వం యిచ్చే నేషనల్ మెడల్ ఆఫ్ ఆర్ట్స్ అందుకున్నాడు. అది కళాకారులకు యిస్తూ వుంటారు. అవార్డు అందుకున్న తొలి జర్నలిస్టు అతనే!

ఇదంతా విన్నాక, ఫోటో తీసిన తదనంతరం యితనేం చేశాడనే ప్రశ్న రాకతప్పదు. ఫోటో తీయగానే, కెమెరాను రోడ్డు పక్కన పెట్టేసి, ఆ పాపను ఆపాడు. ఆమె ‘మంట, మంట’ అని అరుస్తోంది. తన దగ్గరున్న వాటర్ బాటిల్లోంచి తనకు నీళ్లిచ్చి తాగమని చెప్పి, తాగగా మిగిలినవి ఆమె శరీరంపై ఒంపేసి మంట చల్లార్చడానికి చూశాడు. ఆ తర్వాత తన కారులో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వాళ్లు సరిగ్గా వైద్యం చేస్తారో లేదోనని, తన ఐడెంటిటీ కార్డు చూపించి హెచ్చరించాడు. ఆ పిల్ల బతికింది. పెరిగి పెద్దదై కెనడాలో స్థిరపడింది. వారానికి ఓ సారైనా ఫోన్ చేసి ‘అంకుల్ నిక్’తో మాట్లాడుతుంది. నిజానికి మరో ఫోటోగ్రాఫర్ కూడా యీ సందర్భాన్ని ఫోటో తీశాడు. కానీ అతని కెమెరాలో సమయానికి ఫిల్మ్ అయిపోయింది. దానితో యిదే ‘ఎక్స్‌క్లూజివ్’ అయిపోయింది. ఇది కూడా జనంలోకి వచ్చేది కాదు. ఆఫీసులో ఇతని యిమ్మీడియేట్ సీనియర్ ‘దీనిలో న్యూడిటీ వుంది’ అంటూ పక్కన పడేశాడు. కానీ ఫోటో ఎడిటర్ ఏడిశావులే అని నోరు మూయించి, వేసేద్దాం అన్నాడు కాబట్టి జనంలోకి వచ్చింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?