cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: బిజెపికి నూరు లోపే.. పికె ధీమా!

ఎమ్బీయస్: బిజెపికి నూరు లోపే.. పికె ధీమా!

బెంగాల్‌లో బిజెపి హంగామా ఒక రేంజిలో వుంది. డిజిపిపై ఫిర్యాదులు చేసిచేసి ఎన్నికల కమిషనర్ చేత డిజిపిని మార్పించేశారు. నందిగ్రామ్‌లో మమత నామినేషన్ వేయబోతున్నారు. రెండు రోజుల తర్వాత బిజెపి తరఫున శుభేందు అధికారి వేయబోతున్నారు. నందిగ్రామ్ హీరో శుభేందుయే తప్ప మమత కాదని, అందువలన మమత ఓడక తప్పదని బిజెపి అంటోంది. నందిగ్రామ్‌లో కానీ, సింగూర్‌లో కానీ సివంగిలా పోట్లాడి సిపిఎంను హడలగొట్టి, అంతిమంగా అధికారం కైవసం చేసుకున్నది మమతాయే అని అందరికీ తెలుసు. శుభేందుకు వ్యక్తిగతంగా ఎంత బలగం వున్నా, అక్కడ మమత సేనానిగా పని చేసి ఓట్లు తెచ్చుకున్నాడని విస్మరించకూడదు. 2019 పార్లమెంటు ఎన్నికలలో గెలిచిన బిజెపి వారందరికీ వ్యక్తిగత సామర్థ్యంతో బాటు మోదీ యిమేజి తోడైంది. అలాగే నందిగ్రామ్‌లో శుభేందు ఒంటిచేత్తో గెలిచాడనడం కంటె తృణమూల్ పార్టీ సభ్యుడిగా గెలిచాడనడం సబబు. ఇప్పుడు కూడా శుభేందు స్వతంత్రుడిగా పోటీ చేస్తే ఏమో కానీ లేకపోతే అతనికి రాబోయే ఓట్లలో బిజెపికి కూడా వాటా యివ్వాల్సి వస్తుంది.

ఇక మమత ఐతే విద్యార్థి దశ నుంచీ ఫైటర్. తన పోరాటాలతో, రౌడీయిజంతో, కాంగ్రెసులోని అనేకమంది నాయకుల మధ్య ఎదిగింది. సొంతంగా పార్టీ పెట్టుకున్నాక అంతా ఆమెదే పెత్తనం. ఈ ఎన్నికలలో ఆమె ఓడుతుందని ఖచ్చితంగా చెప్పలేం. ఓడినా ఆమె పని అయిపోయిందని అనమూ లేము. మునిగిపోయే తృణమూల్‌ను అందరూ వదిలేసి మా పార్టీలో చేరిపోతున్నారు, దీదీ ఓటమి ఖాయం అని బిజెపి ఢంకా బజాయిస్తున్నా, ఎబిపి (అక్కడ అత్యంత ప్రజాదరణ కలిగిన ఆనంద్ బజార్ పత్రిక), టైమ్స్ నౌ రెండూ సి-ఓటరు సహాయంతో చేసిన సర్వేలు మమత మళ్లీ గెలవడం ఖాయం. బిజెపికి వందకు అటూయిటూ వస్తాయి అంటున్నాయి. 8 దశలలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మధ్యలో ఏమైనా జరగవచ్చు.

తృణమూల్‌లోని అవినీతిపరులలో ముఖ్యులందర్నీ తన పార్టీలోకి గుంజుకుంటున్న అమిత్ షా, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ఉద్దేశించి ‘భాయ్‌పో భ్రష్టాచారి’ (మేనల్లుడు అవినీతిపరుడు) అంటూ గర్జించాడు. సిబిఐ అతని భార్య రుజిరా, మరదలు మేనకలపై కేసులు పెట్టేసింది. కరోనా సమయంలో అసన్‌సోల్, రాణిగంజ్‌లలో ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌కి చెందిన బొగ్గుగనులను అక్రమంగా తవ్వుకుని అమ్ముకున్నారని అభియోగం. ఎన్నికలు అనగానే ప్రతిపక్షాలపై యిలాటివి తప్పవు. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలి చేత ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ పేరు చెప్పించారు. స్టాలిన్ వాళ్లూ తరవాయి ఉన్నారు. ఏ మోదీపై హత్యాప్రయత్నం కేసో పెడతారు కాబోలు. ఎన్నికల వేళ మన్‌మోహన్ సింగ్ అయ్యేది, మరొకరయ్యేది యిలాటి ఆరోపణలు తప్పవు. ఎన్నికలు కాగానే వాటిపై విచారణ వుండదదేమిటో! పార్లమెంటు ఎన్నికలలో పాకిస్తాన్‌తో కలిసి కుట్ర చేశారన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ మావోయిస్టులు మోదీ హత్యకు కుట్ర చేశారన్నారు. బెంగాల్ ఎన్నికలలో టైమ్స్‌నౌ వాళ్లు తృణమూల్‌కు బిజెపి కంటె 50 సీట్లు ఎక్కువ వచ్చేట్లుంది అన్నారు కాబట్టి, పోలింగు తేదీకి కాస్త ముందు బంగ్లాదేశీయులు మోదీ హత్యకు కుట్ర పన్నుతారేమో!

అయితే యిలాటివి ఎన్ని జరిగినా బిజెపి మూడంకెలకు చేరడం కష్టం అని తృణమూల్ ఎన్నికల సలహాదారు ప్రశాంత కిశోర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘2019కు ముందు నుంచీ లెక్కవేసుకున్నా 40 మంది నాయకులు పార్టీ విడిచి వెళ్లిపోయారంతే. ఎమ్మెల్యేలలో 10శాతం వెళ్లిపోతే 90శాతం తృణమూల్‌లోనే ఉన్నారు కదా, అలాటప్పుడు తృణమూల్‌ను మునిగే నౌక అని ఎలా అంటారు?’ అంటున్నాడు. టైమ్స్‌నౌ-సిఓటర్ సర్వే టిఎంసి 146-162, బిజెపి 99-115, ఇతరులు 29-37 అంటే అంతకు వారం క్రితం ఎబిపి-సిఓటర్ టిఎంసి 148-164, బిజెపి 92-108, ఇతరులు 31-39 అంది. ఒకవేళ బిజెపి సీట్ల సంఖ్య 100కు చేరితే ఏం చేస్తారు? అని అడిగితే నేనీ వృత్తిలోంచి తప్పుకుంటాను అంటున్నారు. ఇదేదో రాజకీయనాయకుల సవాలులా వుందే అంటే ‘అలాటిదేమీ కాదు, నాకీ పని చేతకాదని అనుకుంటాను, మరో పని చూసుకుంటాను.’ అని వినయంగానే జవాబిచ్చాడు. మరి యుపిలో బిజెపిని ఓడించలేక పోయిన తర్వాత ఆ పని చేయలేదేం? అని అడిగితే దానికి వివరంగానే సమాధాన మిచ్చాడు –

‘దిల్లీలో బిజెపి నెగ్గడానికి సకలయత్నాలూ చేసినా ఆప్‌ను నెగ్గేట్లా చేయగలిగాను. పరిశీలకులు పట్టించుకోలేదు కానీ పంజాబ్‌లో కాంగ్రెసును నెగ్గించడం చాలా క్లిష్టమైన పని. అది కూడా సాధించగలిగాను. యుపి దగ్గరకు వచ్చేసరికి, నేను చెప్పినవి ఏవీ జరగలేదు. సమయం లేదు. అందువలన నేను విఫలం కావడానికి కారణాలున్నాయి. ఇక్కడ బెంగాల్‌లో నేననుకున్నది సాధించలేకపోతే చెప్పటానికి సాకులు లేవు. ఏడాదిన్నరగా పని చేస్తున్నాను. తృణమూల్ నుంచి పూర్తి సహకారం వుంది. అభిషేక్ బెనర్జీ నాతో కలిసి పనిచేస్తున్నాడు, తీవ్రమైన మార్పులకు కూడా దీదీ అంగీకరిస్తున్నారు. ఇంత ఫ్రీ హ్యేండ్ యిచ్చిన తర్వాత కూడా నేను విఫలమైతే, నేనీ వృత్తికి పనికిరానన్నమాట! నా అనుభవం బట్టి బిజెపికి 100 లోపే సీట్లు వస్తాయని చెపుతున్నాను. ఈ మాట పట్టుకుని నన్ను ట్రోల్ చేస్తే చేయవచ్చు. కానీ యిలాటివన్నీ నాకు కొత్త కాదు. ఎన్నికలలో సోషల్ మీడియా వినియోగం నేను ప్రారంభించినదే కదా!’ అన్నాడు.

తృణమూల్‌లోంచి బయటకు వెళ్లేవారంతా అభిషేక్‌నే తప్పుపడుతున్నారు. ప్రశాంత్‌ ద్వారా మేనత్తను ఇన్‌ఫ్లుయెన్స్ చేసి పార్టీని హస్తగతం చేసుకోవడానికి చూస్తున్నాడని ఆరోపిస్తున్నారు. మొత్తమంతా మమతా చేతిలోనే వుందని, ఆవిడ నిర్దేశికత్వంలోనే తామంతా నడుస్తున్నామని ప్రశాంత్ అంటాడు. అభిషేక్‌ను ముఖ్యమంత్రిని చేయడమే మమత లక్ష్యమని బిజెపి నాయకు లంటున్నారు. ‘ప్రజలు మిమ్మల్ని దీదీ (అక్క)ని చేస్తే, కానీ మీరు అభిషేక్‌కు పిసి (మేనత్త) మాత్రమే అయితే ఎలా?’ అని మోదీ మమతను ప్రశ్నించారు. చంద్రబాబే రాజకీయాల్లోంచి తప్పుకుని కొడుక్కి పగ్గాలు అప్పగించనప్పుడు, ఆయన కంటె ఐదేళ్లు చిన్నదైన మమత అప్పుడే తప్పుకుంటారని ఎలా అనుకోగలం? ఆవిడ అనుయాయులందరూ స్కాముల్లో యిరుక్కుని, బిజెపి వైపు తిరిగిపోతున్నారు కాబట్టి వేరెవరినీ నమ్మలేక మేనల్లుణ్ని దగ్గర పెట్టుకుంది తప్ప, అప్పుడే ముఖ్యమంత్రిని చేస్తుందని అనుకోవడానికి లేదు.

తృణమూల్ నాయకులనే కాదు, సినీతారలను కూడా ఆకర్షించే పనిలో పడింది బిజెపి. జనవరి మూడోవారంలో బిశ్వజీత్‌కు జాతీయ అవార్డు యిచ్చిన సమయంలోనే అతని కుమారుడు, బెంగాలీ సూపర్ స్టార్ ప్రసేన్‌జీత్‌ను జనవరి 23 నాటి సుభాష్ బోస్ 125వ జన్మదినోత్సవానికి బెంగాల్ బిజెపి ఆహ్వానించింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మోదీతో అతని ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆ ఫంక్షన్‌కు వచ్చినందుకు థాంక్స్ చెప్పడానికంటూ నెల్లాళ్ల తర్వాత అనిర్వాణ్ గంగూలీ అనే బెంగాల్ బిజెపి కోర్ కమిటీ సభ్యుడు ప్రసేన్‌జీత్ యింటికి వెళ్లి తను అమిత్ షాపై రాసిన ఒక పుస్తకం యిచ్చి ఫోటో తీయించుకుని సోషల్ మీడియాలో పెట్టాడు. వెంటనే ప్రసేన్‌జీత్ బిజెపిలో చేరుతున్నాడన్న ప్రచారం ప్రారంభమై పోయింది. ఈ ప్రచారం ధాటి తట్టుకోలేక వెంటనే అతను నేను రాజకీయాల్లో చేరటం లేదు బాబోయ్, ఇంటికి వచ్చినాయనకి అతిథి మర్యాదలు చేశానంతే అని ట్వీట్ చేయాల్సి వచ్చింది.

ఇక అతన్ని ప్రస్తుతానికి వదిలేసి బిజెపి వారు పాతకాలపు సూపర్ స్టార్, బెంగాలీలో కంటె హిందీలో ఎక్కువ పాప్యులరైన మిథున్ చక్రవర్తిని పట్టుకుని మోదీ సమక్షంలో పార్టీలో చేర్చారు. ఒకప్పుడు నక్సలైట్లకు సన్నిహితంగా వున్న మిథున్ 2011లో తృణమూల్‌లో చేరి, 2014లో ఆ పార్టీ ఎంపీగా రాజ్యసభకు వెళ్లాడు. 2015లో శారదా స్కాములో అతనిపై మచ్చపడితే రూ.1.19 కోట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌కి కట్టాడు. 2016లో అనారోగ్య కారణాలు చెప్పి, తన పదవికి రాజీనామా చేసి, అప్పణ్నుంచి స్తబ్దంగానే వున్నాడు. ‘నేను వానపామును కాదు, త్రాచుపామును, కాటేస్తే అంతే సంగతులు’ అని చెప్పుకుంటున్న 70 ఏళ్ల మిథున్ రాజ్యసభ సభ్యుడిగా తన పదవీకాలంలో ముచ్చటగా మూడే రోజులు రాజ్యసభకు హాజరయ్యేడట. 

మమత కవచంలో అభిషేక్‌ను ఒక బీటగా చూస్తున్న బిజెపి వాళ్లు మమతాను దీదీ అని పిలవడం మానేసి ‘పిసీ’ అని పిలుస్తున్నారు. అది అందిపుచ్చుకుని సిపిఎం లీడరు సుజన్ చక్రవర్తి అసెంబ్లీలో ‘ఇది అత్తా-అల్లుళ్ల పార్టీ అయిపోయింది’ అన్నాడు. ఇలా అభిషేక్ కేంద్రంగా ఎన్నికల ప్రచారం నడుస్తోంది. ఇంతకీ ఎవరీ అభిషేక్ బెనర్జీ? మమత సోదరుడు అమిత్ కొడుకు. అమిత్ భార్య లత మమతకు బాగా సన్నిహితురాలు. ఇతను కలకత్తాలో పుట్టి, పెరిగి, హైస్కూలు చదువు అక్కడే పూర్తి చేశాడు. తర్వాత దిల్లీ వెళ్లి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో బిబిఏ, ఎంబిఏ చేశాడు. 2012లో 24 ఏళ్ల వయసులో రుజిరా నరూలా అనే క్లాస్‌మేట్‌ను పెళ్లాడాడు. ఆమె తండ్రికి దిల్లీలోనే కాక, థాయ్‌లాండ్‌లో కూడా వ్యాపారముంది. రుజిరా అక్కడే పుట్టింది. ఆమె పౌరసత్వంపై వివాదం నడుస్తోంది. కలకత్తా ఎయిర్‌పోర్టులో బంగారంతో పట్టుబడిన కేసూ నడుస్తోంది. అభిషేక్ పేరు ప్రస్తావించి ఆరోపణలు చేస్తూంటే కేసులు పెడుతున్నారని యీ మధ్య బిజెపి నాయకులు అతని పేరెత్తకుండా ‘భాయ్‌పో’ అని వూరుకుంటున్నారు. అభిషేక్ అంటే అస్సలు పడని శుభేందు అధికారి రుజిరా పేరెత్తకుండా ‘మేడమ్ నరూలా’ (అమె పుట్టింటి పేరు) అని వ్యవహరిస్తున్నాడు. ఆమె గుట్టంతా బయటపెడతా అంటున్నాడు. మొన్నటిదాకా తృణమూల్‌లో వుండి వచ్చాడు కాబట్టి చాలా తెలిసే వుండాలి.

2012 ఫిబ్రవరిలో అభిషేక్ పెళ్లి దిల్లీలో అట్టహాసంగా జరిగినపుడు మమత దిల్లీలో వుండి కూడా హాజరు కాలేదు. అందుకంటే అభిషేక్ హంగూ, ఆర్భాటం అమెకు గిట్టదు. ఆమె యిప్పటికీ సీదాసాదా బట్టలు వేసుకుంటూ, కాళీఘాట్‌లో తన పాత యింట్లో వుంటుంది. జనాలామెను సులభంగా కలవగలరు. ఇతను భవానీపూర్‌లో పెద్ద యింట్లో వుంటాడు. తనేదైనా సభ నిర్వహిస్తే భారీ ఎత్తున ఖర్చు పెడతాడు. పెద్దపెద్ద సెలబ్రిటీలను తీసుకుని వస్తాడు. ఆడంబరం జాస్తి. పార్టీ సమావేశాలకు కూడా ఆరేడు కార్లు వెంటేసుకుని వస్తాడు. ఎవరితో కలవడు. స్వభావతః రిజర్వ్‌డ్, దాన్నే యితరులు అహంభావం అనుకుంటారు అని కొందరంటారు. ఏమైనా అతనికి పార్టీలో, ప్రభుత్వంలో అభిమానులెవరూ లేరు. పార్టీ పెట్టినపుడు తనతో బాటు నిలిచిన వాళ్లందరూ తన పేరు చెప్పి డబ్బు సంపాదనలో పడడంతో మమత డిఫెన్స్‌లో పడింది. వాళ్ల మీద చర్య తీసుకోబోతే పార్టీ ఫిరాయిస్తామని బెదిరించసాగారు. ఆ పరిస్థితుల్లో మేనల్లుడిపై ఆధారపడడం ఎక్కువైంది.

నిజానికి తృణమూల్ నాయకులే అభిషేక్‌ను రాజకీయాల్లోకి తీసుకురమ్మనమని సూచించారు. 2011లో శుభేందు అధికారి తృణమూల్ యూత్ వింగ్‌కు అధినేతగా వుండి అధికారం చలాయించేవాడు. అతనికి ముకుతాడు వేయాలంటే అభిషేక్‌ను తేవాల్సిందే అన్నాడు అప్పట్లో మమతకు సన్నిహితంగా వున్న ముకుల్ రాయ్‌ (శుభేందు కంటె ముందుగానే బిజెపిలో చేరాడు). దాంతో ‘తృణమూల్ యువ’ పేరుతో అభిషేక్ అధ్యక్షుడిగా 2011లో ఓ కొత్త సంస్థ ఉద్భవించింది. అతను దాన్ని ఓ కార్పోరేట్ సంస్థగా తీర్చిదిద్దాడు. రూ.30 లతో సభ్యత్వం తీసుకుంటే యువ పేరు ముద్రించి వున్న ఓ టోపీ, టి షర్ట్ యిచ్చేవారు. సభ్యత్వరుసుముల ద్వారా రూ.28 కోట్లు వచ్చాయి. పెద్ద పెద్ద హోర్డింగ్స్ అవీ పెట్టి హంగామా చేశాడు.

2013లో అభిషేక్‌కు కూతురు పుట్టింది. అజనియా అని పేరు పెట్టారు. అవివాహిత ఐన మమతకు తన తల్లి గాయత్రీదేవితో గాఢానుబంధం వుండేది. ఆవిడ పోయిన రెండేళ్లకు యీ పాప పుట్టడంతో, తన తల్లే యీ రూపంలో పుట్టిందని మమత నమ్మకంట. పాపను చాలా ముద్దు చేస్తుంది. 2014 పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. డైమండ్ హార్బర్ నియోజకవర్గం సిటింగ్ ఎంపీ సోమేన్ మిత్రా పార్టీపై అలిగి రాజీనామా చేశాడు. సువ్రత బక్షీ, పార్థ చటర్జీ వంటి సీనియర్ నాయకులు అభిషేక్‌ను నిలబెడితే మంచిదన్నారు. సిపిఎం నాయకుడు అబ్దుల్ హస్నత్ ఖాన్‌ను ఓడించి, అభిషేక్ తన 26 వ ఏట పార్లమెంటు అతి పిన్న వయస్కుడైన ఎంపీ అయ్యాడు. ఆ ఏడాదే శుభేందును యూత్ వింగ్ ప్రెసిడెంటుగా తప్పించి, అతని స్థానంలో తన అనుచరుడు సౌమిత్ర ఖాన్‌ను (వీళ్లు బెంగాలీ హిందువులే, చాలామంది బ్రాహ్మలు కూడా. ముస్లిం పాలకులు యిచ్చిన బిరుదును యింటిపేరుగా చేసుకున్నారు) తెచ్చి, మరి కొద్దికాలానికే సౌమిత్రను తప్పించి, తనే ఆ స్థానంలో కుదురుకున్నాడు. ఈ రోజు శుభేందు అభిషేక్ పైన మండిపడుతున్నాడంటే పడడా మరి!

2017 వచ్చేసరికి ముకుల్ రాయ్‌కు అభిషేక్‌పై అనుమానం వచ్చింది. అతనుండగా, ఈ పార్టీలో కొనసాగినా మమత స్థానంలో తను ఎప్పటికీ రాలేనని, పార్టీని స్వాధీనం చేసుకోవడం కుదరదని గుర్తించాడతను. పార్టీ విడిచి బిజెపిలో చేరాడు. మరో రెండేళ్లకు శోభన్ చటర్జీ కూడా బిజెపిలో చేరాడు. పార్టీ విడిచి వెళ్లేవాళ్లందరూ అభిషేక్‌పై ఓ రాయి వేసి వెళతారు. ఎందుకంటే మమత సాదాసీదా జీవనశైలి కారణంగా ఆమెను అవినీతిపరురాలుగా చూపడం కష్టం. పైగా ఆమెకు కుటుంబం లేదు. మోదీ విషయంలో వాదించినట్లే ‘ఎవరి కోసం డబ్బు పోగేస్తుంది?’ అని వాదించవచ్చు. అందువలన వాళ్లంతా అభిషేక్‌ను దెబ్బలబ్బాయిగా చూపుతూ, మమతకు తెలిసీతెలియకుండా నిధులు వసూలు చేసేస్తున్నాడు అంటున్నారు. ఇంకో కారణం ఏమిటంటే వాళ్ల పదవులు పోవడానికి, హోదా తగ్గడానికి అభిషేక్, అతను పట్టుకుని వచ్చిన ప్రశాంతే కారణమనే అక్కసు వారిలో వుంది.

తృణమూల్ పాలనలో అభివృద్ధి జరగడంతో బాటు అవినీతి కూడా జరిగిందనే మాట బాహాటంగా అంటారు. పదేళ్లగా పాలన సాగిస్తోంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఎలాగూ వుంటుంది. 2019 పార్లమెంటు ఎన్నికలలో ఎదురుదెబ్బ తర్వాత అభిషేక్ సలహాపై మమత ఎన్నికల సలహాదారుగా ప్రశాంత కిశోర్‌ను నియమించగానే అతను ‘అవినీతి జరిగిందని మీరే ఒప్పేసుకోవడం మేలు. అవినీతిపరులుగా ముద్ర పడిన వారందరినీ ఎంత పెద్దవారైనా సరే, బయటకు పంపి, పార్టీ యిమేజి మార్చుకోకపోతే మీ పుట్టి మునుగుతుంది జాగ్రత్త’ అని చెప్పాడు. కమీషన్ల రూపంలో తీసుకున్న డబ్బు వెనక్కి యిచ్చేయండి అని మమత తన పార్టీ నాయకులకు బహిరంగంగా పిలుపు నిచ్చింది. అవినీతి పరులైన వారికి పొగ బెట్టింది. వాళ్లంతా పార్టీ విడిచి వెళ్లారు. జిల్లా స్థాయి పార్టీ నాయకులుగా జులుం చేస్తున్నవారి స్థానంలో చైర్మన్, జిల్లా అధ్యక్షుడు, కో ఆర్డినేటర్, 7 గురు సభ్యుల స్టీరింగు కమిటీ అంటూ యింతమందిని వేసి వారి అధికారాలకు కత్తెర వేయడంతో మరి కొందరు అసంతృప్తులు తయారయ్యారు. నాయకులు, కార్యకర్తలు లేక అల్లాడుతున్న బిజెపి వీరందరినీ వాటేసుకుంది.

ప్రశాంత కిశోర్ స్వయంగా చెప్పుకున్నట్లు, అతను ఓడిపోయేవారిని గెలిపించలేడు. గెలిచే అవకాశం వున్నవాళ్ల మార్జిన్లు పెంచగలడంతే. 23 ఏళ్లగా ఏక వ్యక్తి పాలనలో నడుస్తూ వచ్చిన తృణమూల్‌లో చాలా చెత్త వచ్చి చేరింది. మమత పేరు మీదనే మొత్తం నడిచిపోతూ వచ్చింది. ఆ పార్టీకే చెందిన సువ్రత ముఖర్జీ ఓ సారి అన్నాడు – ‘తృణమూల్‌లో వున్నది ఒకే ఒక పోస్ట్. తక్కినవన్నీ లాంప్-పోస్ట్‌ (దీపస్తంభం)లే’ అని. దీనిలో కలక్టివ్ విజ్‌డమ్ కాన్సెప్ట్ చొప్పించడానికి ప్రశాంత్ ప్రయత్నించాడు. మీడియాతో మాట్లాడడానికి 23 ముగ్గురు అధికార ప్రతినిథులను, 7 గురు సభ్యులు స్టీరింగ్ కమిటీని, 21 మంది సభ్యుల కో ఆర్డినేషన్ కమిటీని, 24 మంది సెక్రటరీలను ఏర్పాటు చేశాడు.

అతని ఐ ప్యాక్ టీము అన్ని నియోజకవర్గాలూ తిరిగి, సర్వేలు నిర్వహించి, ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకున్నవారి జాబితా తయారు చేసింది. ఇప్పుడు టిక్కెట్లు యిచ్చేవేళ, 100 స్థానాల్లో, అంటే మూడో వంతు స్థానాల్లో కొత్త మొహాల్ని చూపుతోంది తృణమూల్. ఈ మార్పులు పాతకాపులకు మింగుడు పడటం లేదు. అభిషేక్‌ను, ప్రశాంత్‌ను తిట్టిపోస్తున్నారు. వీళ్లందరికీ బిజెపి పిలిచి, పీటేస్తోంది. వాళ్ల మీద వున్న కేసులను కోల్డ్ స్టోరేజిలోకి నెట్టేస్తోంది. మొన్నటిదాకా తృణమూల్‌లో వుండి తమపై పెత్తనం చలాయించిన ఈ కొత్త బిజెపి నాయకులు తమ పార్టీలోకి వచ్చి తమ నెత్తిన కూచోడం చూసి పాతకాలం నుంచి పార్టీని అంటిపెట్టుకుని వున్న నాయకులు సణుక్కుంటున్నారు, కొన్ని ప్రాంతాల్లో ఎదిరిస్తున్నారు. వచ్చినవాళ్లు ఎలాటివాళ్లని బిజెపి చూడటం లేదు. ఈ ఫిరాయింపుల ద్వారా మమత నైతిక స్థయిర్యాన్ని దెబ్బ తీయవచ్చని, ఆ పార్టీ పని అయిపోయిందని ఓటర్లను నమ్మించవచ్చని అనుకుంటోంది.

బిజెపి హవా తీవ్రంగా వీచిన రోజుల్లో కూడా అభిషేక్ తన పార్లమెంటు నియోజకవర్గం నుంచి మళ్లీ గెలిచాడు. 1.20 లక్షల మెజారిటీ తెచ్చుకున్నాడు. తృణమూల్ నాయకులు అనేకమంది యిరుక్కున్న శారదా, రోజ్ వ్యాలీ చిట్, నారదా స్కాముల్లో అతను యిరుక్కోలేదు. 2020లో ‘బంగ్లార్ యువ శక్తి’ పేరుతో లక్ష మంది యువకులతో ఒక సంస్థ ఏర్పరచాడు. తను ఎవరికీ అందుబాటులో వుండడు, అహంకారి అనే ముద్ర తుడిచేసుకోవడానికి జనాల్లోకి విరివిగా వెళుతూ, వక్తగా ఎదగడానికి చూస్తున్నాడు. బెంగాల్‌లో వందకు మించి సీట్లు రాకపోయినా బిజెపికి నష్టం లేదు. కానీ మమతకు అది జీవన్మరణ సమస్య. అందుకే తన మేనల్లుణ్ని ప్రశాంత్‌తో కూర్చోబెట్టి, అతని సూచనలను అమలు చేసిచూస్తోంది. 2019 ఆంధ్ర ఎన్నికలలో జగన్ ప్రశాంత్‌ను నమ్మి అతను చెప్పినట్లే తుచ తప్పకుండా చేశాడు. బాబు వెక్కిరించినా, పార్టీలో పెద్దలు విసుక్కున్నా పట్టించుకోలేదు. మమత కూడా అదే చేస్తోంది. జగన్ ప్రత్యర్థి టిడిపి కంటె మమత ప్రత్యర్థి బిజెపి వ్యవస్థాగతంగా చాలా బలమైంది, చేతిలో సకలాధికారాలు కలది. ప్రశాంత్ అక్కడ కూడా తన సత్తా చూపగలిగితే నిజంగా మెచ్చుకోవలసినదే.

లోకేష్ సవాల్ చూస్తే.. బ్రహ్మానందం గుర్తొస్తున్నాడు

దేవి సిక్స్ కొడితే...నేను రెండు సిక్సులు కొడ‌తా

 


×