cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: పుదుచ్చేరి ఎన్నికలు

ఎమ్బీయస్: పుదుచ్చేరి ఎన్నికలు

పుదుచ్చేరి అసెంబ్లీ తన పదవీకాలాన్ని పూర్తి చేసుకునే తరుణంలో హఠాత్తుగా ఫిరాయింపులతో బిజెపి ఆ ప్రభుత్వాన్ని కూలదోసింది. ఎన్నికలవేళ నారాయణస్వామి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా వుండకూడదని, తన మనిషైన లూటినెంట్ గవర్నర్ (ఎల్‌జి) ఆధ్వర్యంలో జరగాలని పంతం తప్ప మరేమీ కారణం కానరాదు. నిజానికి పుదుచ్చేరిలో బిజెపి సోదిలోకి కూడా లేదు. 2016 అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి 30 అసెంబ్లీ స్థానాలకు 18 మందే దొరికారు. రాష్ట్ర అధ్యక్షుడితో సహా, ఎవ్వరికీ డిపాజిట్ కూడా దక్కలేదు. మరి అలాటిది ఐదేళ్ల తర్వాత యింత సాహసం చేయడమేమిటి? కర్ణాటకలో ఫిరాయింపుదార్లతో ప్రభుత్వం ఏర్పరచాం కదా, దీన్ని కూడా అలా చేజిక్కించుకుంటే దక్షిణాదిన మరో రాష్ట్రం మన ఖాతాలో వుంటుంది కదాన్న ఆలోచన వారిది.

దానికి కావలసిన సరంజామా అంతా కాంగ్రెస్సే దానికి సమకూర్చి పెట్టింది. పుదుచ్చేరిలో ఎన్. రంగస్వామి ముఖ్యమంత్రిగా (2001-2008) వుండే రోజుల్లో తర్వాతి రోజుల్లో కేంద్రంలో మంత్రిగా ఐన నారాయణస్వామి అతన్ని కష్టాలపాలు చేశాడు. రాష్ట్రంలో అసమ్మతి రాజేశాడు. చివరకు రంగస్వామి 2011లో కాంగ్రెసు విడిచి తన పేర ఎన్నార్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని, గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెసు ప్రతిపక్షంలో వుండి, 2016 ఎన్నికలలో సమర్థుడు. మంచి ఆర్గనైజర్ ఐన నమశ్శివాయం నేతృత్వంలో 15 సీట్లతో నెగ్గింది. 3 సీట్ల డిఎంకెతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక స్వతంత్రుడు మద్దతిచ్చాడు.

నన్ను ముఖ్యమంత్రిని చేస్తారని మాట యిచ్చారు అంటాడు నమశ్శివాయం. కానీ నారాయణస్వామి సోనియాను ప్రసన్నం చేసుకుని, అతన్ని పక్కకు నెట్టి ముఖ్యమంత్రి అయిపోయాడు. దాంతో అతనికి కడుపుమంటగానే వుంది కానీ ఓర్చుకుని, పబ్లిక్ వర్క్స్ మంత్రిగా, కాబినెట్‌లో నెంబర్ టూగా వున్నాడు. ఇప్పుడు బిజెపి ఆశ చూపగానే దానిలోకి చేరిపోయాడు. ఎన్నార్ కాంగ్రెస్ పార్టీతో భాగస్వామిగా కాంగ్రెసును మట్టి కరిపించడానికి ఉవ్విళ్లూరుతున్నాడు.

నారాయణస్వామిని ముప్పుతిప్పలు పెట్టడం బిజెపి యివాళే మొదలుపెట్టిందని అనుకోనక్కరలేదు. 2016 మేలోనే కిరణ్ బేదీని పుదుచ్చేరి ఎల్‌జిగా పంపింది. బిజెపి ఆమెను దిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపిస్తే ఆ ఓటర్లు వద్దన్నారు. అక్కడ పొందలేకపోయిన ముఖ్యమంత్రి హోదాను యిక్కడ చలాయించింది ఆమె. ఎల్‌జి బంగళా నుండే పరిపాలన సాగించేసింది. నిత్యం ముఖ్యమంత్రితో ఘర్షణే. ఆమె దూకుడు ఏ స్థాయికి చేరిందంటే ప్రజలు ముఖ్యమంత్రిని చూసి జాలిపడ సాగారు. పుదుచ్చేరిలో పాగా వేద్దామని నిశ్చయించుకున్నాక, బేదీ అక్కడుంటే ప్రమాదమని బిజెపి అనుకుంది. ఎందుకంటే ఒక ఉత్తర భారతీయురాలు, ఉత్తర భారతీయ పార్టీ ఐన బిజెపి అండ చూసుకుని, మన ముఖ్యమంత్రిని ఏడిపించింది అనుకుంటే నష్టం. అందుకని ఫిబ్రవరి 18న ఆమెను తీసేసి, ఆమె స్థానంలో తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా చేసి, తెలంగాణాకు గవర్నరుగా వున్న తమిళిసైను పుదుచ్చేరి ఎల్‌జిగా కూడా ఉండమన్నారు.

పుదుచ్చేరి అసెంబ్లీలో 30 మంది శాసనసభ్యులు మాత్రమే వున్నా ముగ్గురిని ప్రభుత్వం నామినేట్ చేసి శాసనసభ్యులను చేయవచ్చు. ఎవర్ని పంపుదామాని నారాయణస్వామి తర్జనభర్జన పడుతూండగానే బేదీ 2017 జూన్‌లో కాబినెట్‌కు చెప్పా పెట్టకుండా ముగ్గురి పేర్లు రాష్ట్రపతికి పంపేసింది. వారిలో ఒకరు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా వుండి ఎన్నికలలో పోటీ చేసి 1400 ఓట్లు తెచ్చుకున్నవాడు.  మరొకడు అదే ఎన్నికలో కేవలం 165 ఓట్లు తెచ్చుకున్నవాడు. మూడో వ్యక్తి బిజెపి సానుభూతిపరుడు. తమకు చెప్పకుండా పంపించింది కాబట్టి వారిని లెక్కలోకి తీసుకోకూడదని ముఖ్యమంత్రి రాష్ట్రపతికి మొత్తుకున్నాడు. కిరణ్ బేదీయే వాళ్ల చేత ఓ రాత్రిపూట ప్రమాణస్వీకారం చేయించేసింది. ఇదెక్కడి అన్యాయమంటూ నారాయణస్వామి కోర్టుకి వెళ్లినా లాభం లేకపోయింది. చివరకు ప్రభుత్వానికి కూల్చడానికి వాళ్లు అక్కరకు వచ్చారు. ఈ ఫిరాయింపుల పర్వం జనవరిలో ప్రారంభించారు.

జనవరి 25న ప్రభుత్వంలో రెండవ స్థానంలో వున్న నమశ్శివాయం, తన సహచరుడు తీపైంతన్‌తో కలిసి రాజీనామా చేశాడు. నెలాఖరుకి యిద్దరూ దిల్లీ వెళ్లి బిజెపి తీర్థం తీసుకున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 15న యానాంలో 5సార్లుగా ఎన్నికవుతూ వస్తున్న మల్లాడి కృష్ణారావు రిజైన్ చేశారు. మరుసటి రోజే, ఎన్నికల ప్రచారానికై మర్నాడు రాహుల్ గాంధీ రాబోతున్నాడనగా జాన్ కుమార్ అనే మరో ఎమ్మెల్యే అదే దారి పట్టారు. నారాయణస్వామిని ముఖ్యమంత్రిని చేశాక పుదుచ్చేరికి రావడం రాహుల్‌కి అదే ప్రథమం. సోనియా అస్సలు రానే లేదు. 

రాష్ట్రంలో అసమ్మతి వుందని తెలిసినా మాతాతనయులు కదలలేదు, మెదలలేదు. జాన్ రాజీనామా చేసేక అధికార పక్షంలోను, ప్రతిపక్షంలోను చెరి 14 మంది వున్నారు. ఎల్‌జి ముఖ్యమంత్రిని అసెంబ్లీలో బలం నిరూపించుకోమన్నారు. టపటపా లక్ష్మీనారాయణన్ అనే కాంగ్రెసు ఎమ్మెల్యే, డిఎంకెకు చెందిన వెంకటేశన్ (స్టాలిన్ వద్దన్నా) గోడ దూకేశారు. చివరకు విశ్వాస తీర్మానం రోజుకి కాంగ్రెసు పక్షాన 9 మంది మిగిలారు. డిఎంకె, స్వతంత్ర సభ్యుల మద్దతు వున్నా అవసరమైన 13కి చేరడం కష్టం. నామినేటెడ్ సభ్యులతో కలుపుకుని అవతలివాళ్లు 14 అయ్యారు.

ఓటమి తప్పదని తెలిసి, నారాయణస్వామి తను చేసిన మంచి పనులన్నీ ఏకరువు పెడుతూ దీర్ఘోపన్యాసం యిచ్చి, నామినేటెడ్ వాళ్లకు ఓటు హక్కు లేదని వాదించి, స్పీకరు నిరాకరించడంతో నిరసనగా వాకౌట్ చేసి, పదవికి రాజీనామా చేశాడు. స్పీకరు సోదరుడు వారం రోజుల ముందే బిజెపిలో చేరడంతో స్పీకరు కూడా బిజెపి పక్షమే అని తెలిసిపోయింది. ఎన్నికలు వచ్చిపడ్డాయి. ప్రస్తుతం నామినేషన్ పర్వం సాగుతోంది. ఇప్పటిదాకా వచ్చిన సమాచారం బట్టి యుపిఏలోని కాంగ్రెసు 14, డిఎంకె 13, సిపిఐ 1 పోటీ చేయబోతున్నాయి. ఎన్‌డిఏలోని ఎన్నార్ కాంగ్రెసు 16, బిజెపి 9, ఎడిఎంకె 5 చేస్తాయి. విడిగా పోటీ చేస్తున్న పిఎంకె (పాట్టాల్ మక్కళ్ కచ్చి) 30, విజయకాంత్ డిఎండికె 30 పోటీ చేస్తాయి. కమల్ హాసన్ ఏర్పరచిన కూటమిలో అతని ఎమ్‌ఎన్‌ఎమ్ 17, ఎస్‌యుసిఐ 2 వరకు తెలిసింది. దినకరన్ పార్టీ కూడా పోటీ చేయబోతోంది. ఓ రెండు రోజుల్లో స్పష్టమైన చిత్రం వస్తుంది.

నారాయణస్వామి పదవీకాలంలో అవినీతి ఏమీ బయటపడలేదు. తనెన్నో చేద్దామనుకున్నా బిజెపి కిరణ్ బేదీ ద్వారా అడ్డుపడిందని అతనంటాడు. కాంగ్రెసు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అతనికి ఏ విధంగానూ సాయపడలేదు. తమిళనాడులో స్టాలిన్‌కు హవా వస్తే, అది యిక్కడ కూడా ప్రసరిస్తే యుపిఏకు లాభించవచ్చు. బేదీ ఓవరాక్షన్, బిజెపి తాజా ఫిరాయింపులు 73 ఏళ్ల నారాయణస్వామిపై జాలి కలిగిస్తే పుదుచ్చేరి ప్రజలు అతన్ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయవచ్చు. (ఫోటో - కిరణ్ బేదీతో నారాయణస్వామి, రంగస్వామి,)

– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2021)

mbsprasad@gmail.com

లోకేష్ సవాల్ చూస్తే.. బ్రహ్మానందం గుర్తొస్తున్నాడు

దేవి సిక్స్ కొడితే...నేను రెండు సిక్సులు కొడ‌తా

 


×