Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: ప్రభాస్ కళ్లలో వెలుగు

ఎమ్బీయస్: ప్రభాస్ కళ్లలో వెలుగు

భాసః అంటే వెలుతురు, కాంతి, తేజస్సు. ప్రభాసః అంటే స్ప్లెండర్, బ్యూటీ, లస్టర్. నటుడు ప్రభాస్‌లో యివన్నీ ఉన్నాయి. మంచి పర్శనాలిటీ ఉన్న అందగాడు. మంచి నటుడు కూడా. వాచికం అంత బాగా లేకపోయినా అభియనంతో కవర్ చేసుకుంటూ వచ్చాడు. బాహుబలి 2కి వచ్చేసరికి వాచికం కూడా సరిదిద్దుకుని అల్టిమేట్ మ్యాన్‌ అనిపించాడు. అది దేశమంతటాయే కాక, విదేశాల్లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఒక తెలుగువాడి అందానికి పోస్టర్‌బాయ్‌గా అనిపించి, ఎంతో గర్వపడ్డాం. నిజానికి అందగాడు అంటే కండలున్నవాడని కాదు. 90శాతం మగ లక్షణాలతో పాటు 10శాతం ఆడలక్షణమైన సౌకుమార్యం కూడా ఉండాలి. అందుకే ఎన్టీయార్‌ని అందగాడంటాం. దండమూడి రాజగోపాల్‌ను, కన్నడ ఉదయకుమార్‌ను అనం. చార్ల్‌టన్ హెస్టన్‌కి ఎంతటి ఇంపోజింగ్ పర్శనాలిటీ ఉన్నా అందగాడనం. ఆర్నాల్డ్ ష్వార్జెనెగర్‌కు ఎంత కండలున్నా అస్సలనం. ఎన్టీయార్‌ను ‘‘మల్లీశ్వరి’’, ‘‘మిస్సమ్మ’’లలో చూస్తే నేను చెప్పినది బోధపడుతుంది.

ప్రభాస్‌లో అలాటి అందం ఉంది. అందుకే లవబుల్‌గా అనిపిస్తాడు. గతంలో హరనాథ్ కూడా అలాగే అనిపించేవాడు. అయితే హరనాథ్‌ హీరోయిక్‌గా అనిపించేవాడు కాదు. మ్యాటినీ ఐడాల్ అనిపించేవాడు. హృతిక్ రోషన్ తన తొలి సినిమాలో మ్యాటినీ ఐడాల్‌గానూ కనబడ్డాడు, హీరోయిక్‌గానూ కనబడ్డాడు. మగా, ఆడా అందరూ మెచ్చారు. బాహుబలి 2తో ప్రభాస్‌కు ఆ యిమేజి వచ్చింది. అది మనసులో ముద్రించుకుని పోయాక మరో రకంగా కనబడితే మనసు బాధపడుతుంది. ఆ ఆవేదనను ప్రేక్షకపాఠకులతో పంచుకోవడానికే యీ వ్యాసం. ప్రభాస్ అభిమానులను నొచ్చుకుంటే నొచ్చుకోవచ్చు, నన్ను తిట్టవచ్చు కానీ ఒక సినిమా ప్రేక్షకుడిగా నా ఆశాభంగాన్ని వెలిబుచ్చే హక్కు నాకుంది. ఇది ప్రభాస్ వరకు ఎలాగూ చేరదు కానీ ఆయన హితైషులెవరైనా యీ దిశగా ఆలోచించమని ఆయనకు చెప్తారనే ఆశ లేకపోలేదు.

బాహుబలి 2 చూశాక ప్రభాస్ అందం గురించి పొగుడుతూ రాయలేదు కానీ యిప్పుడిదెందుకు రాస్తున్నావు అనవచ్చు మీరు. బాగున్నపుడు ఎవరైనా చెప్తారు, బాగా లేనప్పుడు కొందరే చెప్తారు. ఓటిటిలో నిన్ననే ‘‘రాధేశ్యామ్’’ చూశాను. చూస్తున్నంతసేపు ప్రభాస్‌కు ఏమైంది అనుకుంటూ మనసు విలవిల్లాడింది. శోకం లోంచే శ్లోకం పుట్టిందన్నట్లు, వేదన లోంచే యీ వ్యాసం పుడుతోంది. ‘‘సాహో’’ కూడా ఓటిటిలోనే చూశాను. అందులోనే ప్రభాస్ చాలా బద్ధకంగా, ఉత్సాహరహితంగా, ఎందుకొచ్చిన గొడవరా బాబూ అన్నట్లు కనబడ్డాడు. ఆ సినిమాలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ, పోలీసో దొంగో తెలియకుండా ఆటలాడుతూ పైకి నిబ్బరంగా, నిశ్చలంగా, జేమ్స్ బాండ్ టైపులో స్టయిలిష్‌గా కనబడే పాత్ర కాబట్టి అలాటి యాక్షన్ చెల్లిపోయింది. పైగా ఫైట్స్ అవీ చాలా బాగా తీశారు. సినిమా ఫర్వాలేదులే అనిపించింది.

రాధేశ్యామ్ మాత్రం అలాటిది కాదు. కథాంశం చాలా గొప్పది. భవిష్యత్తు చేతుల్లో కాదు, గట్టిగా తలుచుకుంటే చేతల్లో కూడా ఉంటుంది అని. అదే థీమ్‌తో అద్భుతరసంతో, జగపతి బాబు సంఘటన వంటి అనేక యిన్సిడెంట్లతో, మలుపులతో కథ రాసుకోవచ్చు. కానీ డైరక్టరు దీన్ని ప్రేమగాథగానే చూపించదలిచారు. మొత్తం ఫోకస్ అంతా హీరోహీరోయిన్ల మీదే నడిచింది. తెరంతా వారి క్లోజప్పులే. అలాటప్పుడు ప్రభాస్ మొహం కళగా కనబడి తీరవలసిన అవసరం పడింది. కానీ ప్రభాస్ కళ్లల్లో వెలుగే లేదు. దాంతో మనసులో ఒక అనుమానం పట్టుకుంది. ‘‘గీతాంజలి’’లో నాగార్జునలా యితనికి ఏదో రోగం ఉండివుంటుంది, హీరోయిన్ రోగం అంటూ బిల్డప్ యిచ్చి, మిస్‌లీడ్ చేసి, చివరకు ఆమెకు రోగం నయమైంది కానీ యితను మిస్టీరియస్ డిసీజ్‌తో కడతేరి పోతాడని ట్విస్టు పెడతారు అనుకున్నాను.

దేవదాసు సినిమాలో హీరో తాగుబోతు. తాగుబోతు చూపుల్లో, మాటల్లో చురుకుతనం ఉండదు. డల్‌గా, నిస్తేజంగా ఉంటాడు. ఆ ఎఫెక్ట్ రావడానికి నాగేశ్వరరావు గారి చేత బాగా తాగించి, యాక్ట్ చేయించారు అని చెప్పుకునేవారు. కాదని ఆయనే స్వయంగా చెప్పారు. రాత్రి బాగా పెరుగన్నంతో భోజనం పెట్టి, నిద్రపుచ్చి, అర్ధరాత్రి లేపి, నిద్రకళ్లతో డైలాగులు చెప్పమనేవారట. ప్రభాస్ యీ సినిమాలో అలాగే నిస్తేజంగా, ఏ వర్చస్సూ లేకుండా ఉన్నాడు. నిజానికి జ్యోతిష్కులకు, విద్వాంసులకు, పండితులకు, స్వామీజీలకు మొహంలో తేజస్సు, వర్చస్సు ఉంటాయి. జ్ఞానసముపార్జన వలన అలా అవుతుందేమో తెలియదు. ఆధ్యాత్మిక గురువులకే కాదు, ప్రొఫెసర్లకు కూడా మొహంలో ఒక కాంతి ఉంటుంది. ఆయన ముఖంలో సరస్వతి తాండవిస్తోంది అంటారు. ప్రభాస్ అటువంటి రోల్ వేశాడు ఇందులో. ‘‘ఈశ్వర్’’లో ధూల్‌పేట వాసిగా వేసిన పాత్రలో అయితే తేజస్సు అక్కరలేదు. కానీ దీనిలో ఉండాలి. ఎప్పుడైతే లేదో, ఏదో ఒక మాయరోగం పెట్టివుంటాడు కథకుడు అనుకున్నాను. తీరాచూస్తే అతని మరణం రాసి పెట్టి వున్నది ప్రమాదంలో, రోగంతో కాదు.

అంటే యిది కావాలని పెట్టిన మొహం కాదు, ఒరిజినలే అలా వుందని అర్థమైంది. ప్రభాస్ మొహంలో ముడతలు వచ్చేశాయని, కళ్ల కింద బాగ్స్ వచ్చేశాయని అవన్నీ సిజిలో తీయడానికి పది కోట్లు ఖర్చయ్యాయని ఏవేవో వార్తలు రాసేశారు. నేను నమ్మను. జగన్‌ను కలవడానికి వెళ్లినపుడు సినిమాలో ఎలా ఉన్నాడో, బయటా అలానే ఉన్నాడు. సిజిలో కళ్ల కింద క్యారీబాగ్స్ తీసేయగలరేమో కానీ కళ్లలో చమక్కు తెప్పించలేరు. ప్రభాస్ మొహంలో కళ ఎందుకు తప్పిందో నాకు కారణం తెలియదు కానీ అది వెంటనే తిరిగి రావాలని గాఢంగా కోరుకుంటున్నాను. ఆయన శరీరం, ఆయన యిష్టం అనుకుని మనం ఊరుకోవచ్చు. కానీ లవర్‌బాయ్ పాత్రలు వేస్తూ,  తెరమీద క్లోజప్పుల్లో కనబడినపుడు ఆయనకు కూడా మన పట్ల ఒక ఆబ్లిగేషన్ ఉంటుంది. అది ఆయన గుర్తిస్తాడని ఆశిద్దాం.

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?