Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ : ప్రణబ్ ముఖర్జీ – ప్రధాని పదవీ

ఎమ్బీయస్ : ప్రణబ్ ముఖర్జీ – ప్రధాని పదవీ

మన తెలుగు మీడియాకు ప్రణబ్ ముఖర్జీమీద యింత గౌరవాభిమానాలు ఉన్నాయని ఆయన చచ్చిపోయేదాకా నాకు తెలియలేదు. ఏ వ్యాసం చూసినా, ఏ టీవీ కథనం విన్నా ప్రధాని కావలసిన అత్యంత ప్రతిభావంతుడు, కాంగ్రెసు దుష్టరాజకీయాల కారణంగా, గాంధీ కుటుంబం తొక్కేసిన కారణంగా ఆ పదవి దక్కలేదు అని తెగ వాపోయారు. ఇలా రాసేవాళ్లు క్షేత్రవాస్తవాలు ఎలా విస్మరిస్తారో నాకు అర్థం కాదు. ప్రణబ్ బలాబలాలు ఏమిటో ఒక్కసారి గుర్తు చేసుకునే ముందు, అసలు ప్రధాని కావడానికి కావలసిన లక్షణాలేమిటో ఒక్కసారి పరికిద్దాం.

ప్రధాని కావలసి, కాలేకపోయినవారి జాబితా తీస్తే – సర్దార్ పటేల్ దగ్గర ప్రారంభమవుతుంది. మీరు ఏ రాష్ట్ర ప్రజలను కదలేసినా ‘అసలు మా రాష్ట్రం నుంచి యిప్పటివరకు కనీసం ముగ్గురైనా ప్రధానులు రావలసింది, కానీ మా వాళ్లను అమాయకుల్ని చేసి తక్కినవాళ్లు తన్నుకుపోయారు’ అని వినబడుతుంది. మహారాష్ట్రియన్లు, బెంగాలీలు, తమిళులు.. యిలా ఎంతోమంది ఈ మాట అంటారు. రాజీవ్ హత్య జరిగివుండకపోతే తెలుగువాళ్లు కూడా యిదే మాట అనేవారు. జీవితమంతా కాంగ్రెసులో గడిపి, నెహ్రూ పోగానే ప్రధాని కాదగిన మొరార్జీ చివరకు కాంగ్రెసేతర ప్రధాని కావలసి వచ్చింది. వైబి చవాన్ కూడా మరో దిగ్గజం. అప్పణ్నుంచి యిప్పటివరకు చూసుకుంటే దేశం మొత్తంలో ఎందరో సమర్థవంతులున్నారు.

కానీ అందరికీ ఎందుకు రావటం లేదు? ప్రధాని కావాలంటే రాజకీయ చతురుడై వుండాలి. సొంతంగా పెద్ద సంఖ్యలో ఎంపీల మద్దతుండాలి. పోటీదారుడి గ్రూపు చీల్చగలిగి వుండాలి. సొంత రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసి వుండి, ఇప్పటికీ అతని అనుచరులు చురుగ్గా వుంటూ, అక్కడి ఆర్థిక వనరులపై పట్టు వుండాలి. దేశప్రజలకి అతని పేరు బాగా తెలిసివుండాలి. వక్త అయివుండాలి. లేదా ఏదో రకమైన గ్లామర్ వుండాలి. క్రింది స్థాయి నుంచి ఎన్నికలలో నెగ్గుతూ రావాలి. అన్ని రాష్ట్రాల నాయకులతో, ప్రతిపక్షనాయకులతో కూడా సత్సంబంధాలు వుండాలి.

నెహ్రూ, శాస్త్రి, ఇందిర, మొరార్జీ, చరణ్ సింగ్, విపి సింగ్, చంద్రశేఖర్, నరసింహారావు, వాజపేయి, మోదీ – వీళ్లందరికీ పైన చెప్పిన లక్షణాలు చాలా వున్నాయి. శాస్త్రి, చంద్రశేఖర్, వాజపేయి ముఖ్యమంత్రులుగా చేయకపోయినా జాతీయస్థాయిలో వెలిగారు. ఇక రాజీవ్‌కి ఇందిర కొడుకన్న గ్లామర్‌కు సానుభూతి తోడై ప్రధాని కావడం సుగమమైంది. పైన చెప్పిన లక్షణాలు లేని ప్రధానులు దేవెగౌడ, గుజ్రాల్ – దేవెగౌడ పేరు దేశమంతా తెలియకపోయినా బలమైన రాష్ట్రనాయకుడు. జనతా పార్టీ ద్వారా దేశంలో తక్కిన సోషలిస్టులకు తెలిసిన నాయకుడు. కాంగ్రెసువాళ్లను, కమ్యూనిస్టులను సంతృప్తి పరచడానికి గాను బలహీనమైన వాణ్ని పెట్టాల్సి రావడంతో ప్రధాని అయి, 10 నెలలే పాలించాడు. అతని తర్వాత వచ్చిన గుజ్రాల్‌కు ఆ పాటి పలుకుబడి కూడా లేదు. ఏదో ఆపద్ధర్మంగా ప్రధాని అయి 11 నెలలు మాత్రమే చేశాడు.

ఇక ప్రణబ్ ముఖర్జీ దగ్గరకు వస్తే అతను బెంగాల్‌లో పెద్ద లీడరేమీ కాదు. తన కంటూ ఓ వర్గమంటూ ఏమీ లేదు. గత 45 ఏళ్లగా అతని పార్టీ బెంగాల్‌లో అధికారంలో లేదు. బెంగాల్‌ కాంగ్రెసును బతికి వుంచిన నాయకులలో యితరులున్నారు కానీ యితని కారణంగా పార్టీ బావుకున్నదేమీ లేదు. ఇక ఎంపీలలో యితని వర్గీయులంటూ ఎవరూ లేదు. ఇతను మేధావియే కానీ వక్త కాదు. ప్రజలను ఉత్తేజపరచే ప్రసంగాలు చేయలేడు. పైగా హిందీ బాగా మాట్లాడలేక పోవడం చేత జాతీయంగా రావలసినంత పేరు రాలేదని ఆయనే చాలాసార్లు వాపోయాడు. రాష్ట్రపతి అయ్యాడు కాబట్టి, సాధారణ ప్రజలకు కూడా పేరు బాగా తెలిసింది కానీ లేకపోతే, ఎన్నేళ్లు కాబినెట్ మంత్రి చేసినా పేపరు చదివేవాళ్లకు తప్ప తక్కినవాళ్లెవరికీ పట్టేది కాదు.

అయితే ప్రణబ్ దగ్గర ఉన్నదేమిటంటే అద్భుతమైన మేధస్సు. తక్కిన మంత్రులెవ్వరితో పేచీ పెట్టుకోకుండా, అధికారులతో చక్కగా పనిచేయించుకుంటూ, అవినీతి ఆరోపణలు రాకుండా, నేతలు చెప్పిన పనులు చేసుకుంటూ పోతూ, చాలా ఓపిగ్గా అనేక బాధ్యతలను ఏకసమయంలో చేయగల నేర్పు. అదే ఆయన్ని యింతదూరం తీసుకుని వచ్చింది. ఒట్టి రాజకీయబలమే లెక్కలోకి తీసుకుని వుంటే యిన్నాళ్లు యిన్ని కాబినెట్లలో మనగలిగేవాడే కాదు. తెలివితేటలే ఆయన పెట్టుబడి.

మరి మన్‌మోహన్ సింగ్ దగ్గర ఉన్నవి కూడా యివే లక్షణాలు కదా, ఆయన ప్రధాని ఎందుకయ్యాడు, ఈయన ఎందుకు కాలేకపోయాడు? అనే ప్రశ్న వెంటనే వస్తుంది. ఒక్క ఎంపీ మద్దతు లేకపోయినా మన్‌మోహన్ ప్రధాని అయ్యారంటే కారణం – ఆయన విధేయత. పార్టీ అధినేత ఆయనపై వుంచిన విశ్వాసాన్ని పోగొట్టుకోకపోవడం. ప్రణబ్ దెబ్బ తిన్నది అదే పాయింటు మీద. మన్‌మోహన్‌కు రాజకీయపరమైన ఆశలు లేవు. పివి బలవంతంపై రాజకీయాల్లోకి వచ్చారు. నిర్మోహంగా ఇచ్చిన పదవిని బాధ్యతగా భావించి చేశారు తప్ప రేపూ నాకీ పదవి వుండాలని అనుకోలేదు. 

అందుకే సోనియా ఆయనను ప్రధానిని చేసి తను వెనకనుంచి చక్రం తిప్పింది. మధ్యలో సోనియాకు చికాకేసి ‘దిగిపోండి’ అని వుంటే మన్‌మోహన్ ఉత్తరక్షణంలో దిగిపోయి వుండేవారు. అలాటి మన్‌మోహన్‌కు బదులు సోనియా ప్రణబ్‌ను ప్రధానిని చేసి వుండాల్సింది అని తెలుగు మీడియా తెగ ఫీలవుతోందిప్పుడు.

ప్రణబ్‌కు రాజకీయంగా ఆశలు మెండు. బెంగాల్‌లో కాంగ్రెసును ధిక్కరించి బయటకు వచ్చిన కాంగ్రెసువాదులు ఏర్పరచిన బంగ్లా కాంగ్రెసులో రాజకీయాలు మొదలుపెట్టి వారి ద్వారా రాజ్యసభ ఎంపీగా వచ్చి ఇందిరా గాంధీ దృష్టిని ఆకర్షించి, కాంగ్రెసులోకి దూరాడు. ఇందిర మరణం తర్వాత కాంగ్రెసులోంచి బయటకు వెళ్లిపోయి రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెసు పేర పార్టీ పెట్టి ఘోరంగా దెబ్బ తిని, తాను సైతం గెలవలేక చతికిల పడ్డాడు. మళ్లీ రాజీవ్ గాంధీయే కాంగ్రెసులోకి పిలిచి పీట వేశాడు. ఈయన ఆశపోతుతనం చూసి దడిసిన కాంగ్రెసు, ఆయనకు ముఖ్యమైన పదవులు యిస్తూనే వున్నా అత్యంత ముఖ్యమైన ప్రధాని పదవి మాత్రం యివ్వలేదు. దానికి ముఖ్యకారణం – ఇందిర మరణం తర్వాత ప్రణబ్ చూపిన అత్యుత్సాహం!  

కాబినెట్‌లో ఇందిర తర్వాత అత్యంత సీనియర్ మంత్రి తనే కాబట్టి , కాంగ్రెసు పార్టీ తనను మొదటగా ఆపద్ధర్మ ప్రధానిని చేసి, తర్వాత ప్రధాని అభ్యర్థిగా నిలబెడుతుందని ఆశించాడు. ‘నెహ్రూ మరణించాక ఇందిర వెంటనే ప్రధాని కాలేదు కదా, అలాగే ఇందిర తర్వాత రాజీవ్ కానవసరం లేదు. తన దగ్గర తర్ఫీదు పొంది, ఆ తర్వాత ఎప్పుడో అవుతాడు’ అనుకున్నాడు. అనుకోవడంతో సరిపెట్టలేదు, అక్కడాయిక్కడా అన్నాడు.

ఇందిర మనసును చదవడంలో ప్రణబ్ పొరబడ్డాడు కానీ యితర నాయకులు పొరబడలేదు. నెహ్రూకు వారసత్వరాజకీయంపై నమ్మకం లేదు కానీ ఇందిరకుంది. తన తర్వాత వారసుడిగా సంజయ్‌ను తీర్చిదిద్దింది. అతను అకాలమరణంపాలు కావడంతో వద్దు మొర్రో అంటున్నా రాజీవ్‌ను తెచ్చిపెట్టింది. పార్టీ కార్యకలాపాల్లో తర్ఫీదు యిప్పిస్తోంది.

ఇది తెలిసిన నాయకులు ఇందిర అభిమతం ప్రకారం రాజీవ్ ప్రధాని కావడమే సరైనది అనుకున్నారు. పైగా ‘దేశసమైక్యత కోసం ప్రాణాలర్పించిన ఇందిర’పై పెల్లుబికే సానుభూతిని ఎన్‌క్యాష్ చేసుకోవాలంటే ఆమె కొడుకే, వారసుడిగా ఆమె ఎంపిక చేసినవాడే సరైన వ్యక్తి. మధ్యలో ప్రణబ్ వచ్చి నిలబడితే ప్రజలు ఓట్లు వేస్తారా? అందుకే యావన్మంది కాంగ్రెసు నాయకులు రాజీవ్‌కు జై అన్నారు. ఇది ఊహించలేక ఒంటరిగా మిగిలిన ప్రణబ్ బొక్కబోర్లా పడ్డాడు. తనతో పోటీపడిన వాణ్ని రాజీవ్ సహించగలడా? అందుకే దూరం పెట్టాడు. ప్రణబ్ తనేదో చేసేయగలననుకున్నాడు. బయటకు వెళ్లి పార్టీ పెట్టాడు. ఏమీ చేయలేనని తెలిశాక రాజీ పడ్డాడు.

ఆశ మాట ఎలా వున్నా, బుఱ్ఱ వున్నవాడు కాబట్టి రాజీవ్ మళ్లీ రప్పించాడు. పివి తను ప్రధాని అయిన తర్వాత ప్రణబ్‌ను ప్లానింగ్ కమిషన్‌కు డిప్యూటీ చైర్మన్‌ను చేశాడు, విదేశాంగ మంత్రిని చేశాడు. కానీ పివి ప్రాభవం తగ్గుతోందని గ్రహించగానే ప్రణబ్ సోనియాను మంచి చేసుకోవడం మొదలుపెట్టాడు. యుపిఏ అధికారంలోకి రాగానే అనేక ముఖ్యపదవులు అనుభవించాడు. ఏం చేసినా పూర్ణవిధేయుడని సోనియా అనుకోలేదు కాబట్టే ప్రధానిని చేయలేదు. రాష్ట్రపతిని చేసి చాలులే అంది.

యుపిఏ ఓడిపోయి, ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చాక మాజీ రాష్ట్రపతి హోదాలో ప్రణబ్ ఆరెస్సెస్ సమావేశానికి హాజరయ్యాడు. అలా వెళ్లడం ఏ మాత్రం తప్పుకాదు. కానీ గతచరిత్ర చూస్తే మాత్రం వింతగా తోస్తుంది. అందుకే ప్రణబ్‌కు జీవిత చరమాంకంలోనే ఆరెస్సెస్‌లో మంచి గుర్తుకువచ్చిందాని అడిగారు జనాలు. ఎందుకంటే హాజరైన ఆర్నెల్లకు ఎన్‌డిఏ ప్రభుత్వం ఆయనకు ‘భారతరత్న’ యిచ్చింది.

జీవితమంతా ఆరెస్సెస్, బిజెపి వ్యతిరేకిగా గడిపిన ప్రణబ్‌కు బిజెపి అంత గౌరవం దేనికి కట్టబెట్టిందంటే, సోనియాను ఉడికించడానికే అయి వుండాలి. నిబద్ధత తక్కువై, అవకాశం కోసం పక్కచూపులు చూసే నైజం వుందని గ్రహించడం చేతనే ప్రణబ్‌ను కాంగ్రెసు ప్రధానిని చేయలేదు. అలాటి ఆశలేవీ పెట్టుకోకపోవడం చేతనే పివి నరసింహారావుగారికి ఆ పదవి దక్కింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?