Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: చావుకి పెడితే లంఖణానికి వస్తుంది...

మీరు ఆటోలో రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు. మిమ్మల్ని ఎక్కించుకోగానే డ్రైవర్‌ పెట్రోలు బంక్‌కి తీసుకెళ్లి పెట్రోలు కొట్టించాడు. దారంతా ట్రాఫిక్‌ జామ్‌. మంత్రి గారు వస్తున్నారని కాస్సేపు ఆపేశారు. ఆ తర్వాత ఏదో ఊరేగింపు. సందుల్లోంచి పోనిమ్మన్నారు. అందరికీ అదే ఐడియా వచ్చినట్లుంది, అక్కడా జామే. పైగా ఎవడో ఛోటా లీడరు అవేళే పోయినట్లున్నాడు. రోడ్డు మధ్యలో మూడు రాళ్లు పెట్టి, నడుమ నల్లజెండా, అతని ఎ4 సైజులో ఫోటో ప్రింటవుట్‌ ఉన్న అట్ట నిలబెట్టారు.

పొరపాటున దానికి తగిలితే తాట తీస్తారనే భయంతో వాహనాలన్నీ దూరంగా వెళ్లడంతో దారి మరీ చిక్కిపోయింది. స్టేషన్‌ చాలా దూరం ఉంది. ఇక ఆందోళన ప్రారంభమవుతుంది. 'రైలు దొరికిన అనేక సందర్భాల్లో ఆలస్యంగా బయలుదేరతీశావ్‌ కదా, యివాళ కూడా ఆలస్యం చేయి దేవుడా' అని ఓ కొబ్బరికాయ లంచం ఎఱచూపారు. కానీ దేవుణ్ని నమ్మడానికి లేదు, రైల్వే వాళ్లనీ నమ్మడానికి లేదు. స్టేషన్‌ బయట ట్రాఫిక్కు జామై గంటల తరబడి వాహనాలు ఆగిపోయినా ఎన్నడూ లేనిది అవేళ రైళ్లను కరక్టు టైముకి పంపించేస్తారు.

'టైముకి స్టేషన్‌ చేరగలమా లేదా? రైలు ఫస్ట్‌ ప్లాట్‌ఫారం మీదకు వస్తుందా? ...రాదు, యిలాటప్పుడు అస్సలు రాదు, దిక్కుమాలిన ఏ పదో ప్లాట్‌ఫాం మీదో తగలడుతుంది. ఇంత సామానేసుకుని, పిల్లలతో ఫుట్‌ ఓవర్‌ బ్రిజ్‌ మీద అడ్డుతగిలే జనాలనీ, అక్కడే నిలబడి తమ రైలు ఏ ప్లాటుఫాం మీదకు వస్తుందో గమనించడానికి సామాన్లతో సహా విడిది చేసిన వాళ్లనూ తిట్టుకుంటూ, తన్నుకుంటూ మనక్కావలసిన ప్లాట్‌ఫాం మీదకు చేరగలమా? చేరినా మన బోగీ ఆ బ్రిజ్‌కు దగ్గర్లో ఉండి ఛస్తుందా? అబ్బే, ఎక్కడో ఆఘోరిస్తుందేమో. ఈ వెతుకులాట పడలేమని పోర్టరును పెట్టుకుందామంటే సమయానికి ఒక్కడూ కనబడడు.

ఈ చక్రాల పెట్టెలు వచ్చాక ఎవరికి వాళ్లే కూలీలై పోవడంతో, అసలు కూలీలు కరువై పోతున్నారు. టైముకి స్టేషన్‌కి చేరితే కూలీల గొడవ చూసుకోవచ్చు, మన టైము ప్రకారం కరక్టుగా చేరామని అనుకున్నా, స్టేషన్‌ టైము యింకోలా ఉంటుందేమో. రైలు కదిలిపోతూ ఉంటే పరిగెట్టగలమా? వాకింగ్‌ అశ్రద్ధ చేయడంతో పొట్ట పెరిగిపోయింది. ఈ బొజ్జేసుకుని పరిగెట్టడమే!? ఎవరినైనా చైన్‌ లాగమంటే లాగుతారా? ఛస్తే లాగరు. మనం యింకోడి కోసం ఎప్పుడైనా లాగామా? నా సంగతి సరే, భార్యాపిల్లల సంగతి? పరుగులు పెట్టడంలో ఏదైనా అయితే..? వెధవది ఆటో కదలడం లేదు. దిగి యింకో ఆటో ఎక్కితే, వాడికి మాత్రం సెపరేటు రూటు ఉందా ఏమన్నానా? వాడు మళ్లీ పెట్రోలు బంకుకి తీసుకెళితే అంతే సంగతులు..'

ఇలాటి ఆలోచనల సుడిగుండంలో పడితే మీరు ఎప్పటికీ పైకి రాలేరు. ఎంతసేపూ ఒకటే ఆలోచన - రైలు అందుతుందా లేదా? దేవుడా, దేవుడా ఆటోని త్వరగా పోనీ. తక్కిన వాహనాలన్నిటినీ మాయం చేసేయ్‌. ఈ ఆలోచనల వలన చాలామందికి బిపి పెరుగుతుంది. టెన్షన్లు పెరుగుతుంది. గుండె బలహీనంగా ఉంటే ఛాతీలో నొప్పి, కొందరికి గుండెపోటు కూడా వచ్చేస్తాయి. ఇలాటప్పుడు యీ ఊబిలోంచి బయటకు రావడానికి ఒకటే మార్గం. రైలు మిస్సయిపోవడం ఖాయం అనే ఆలోచన తెచ్చేసుకోవడమే! ఇక అప్పణ్నుంచి ఆలోచన వేరే మార్గంలో నడుస్తుంది. స్టేషన్‌కి వెళ్లి రైలు వెళ్లిపోయిందని తెలుసుకోగానే యింటికి తిరిగి వెళ్లిపోయి, మళ్లీ టిక్కెట్లు బుక్‌ చేసుకుని యింకో రోజు ప్రయాణం పెట్టుకుందామా? అలా అయితే యీ ఆటోవాణ్నే ఉండమనవచ్చు.

ఇంట్లో వంట చేసుకోలేదు కాబట్టి మధ్యలో హోటల్లో భోజనం చేసి వెళ్లాలి. అక్కడిదాకా మాట్లాడుకుంటే సరిపోతుంది. పోనీ ఎలాగూ బయలుదేరాం కాబట్టి తర్వాత వచ్చే రైలో, బస్సో ఎక్కి వెళ్లిపోదామా? రిజర్వేషన్‌ దొరుకుతుందా? ప్రయివేటు బస్సులయితే రిజర్వేషన్‌ లేకపోయినా ఎక్కించుకుంటాయేమో. పోనీ టాక్సీ స్టాండ్‌కి వెళ్లి నిలబడితే రిటర్న్‌లో ఖాళీగా వెళ్లేవాడు బస్సు చార్జీలకే తీసుకుపోతాడేమో! ఇలా ఆలోచించడం ప్రారంభించగానే చేయాల్సిన పనులు తడతాయి. సెల్‌ఫోన్‌ బయటకు లాగి, బస్సులు ఏ టైములో ఉన్నాయి, చార్జీలెలా ఉన్నాయి, టాక్సీ స్టాండ్‌కు దూరం ఎంత యివన్నీ చూడడంలో ములిగిపోతారు. ఈ లోపున ఆటో స్టేషన్‌కు చేరుతుంది. 

మీ అదృష్టం బాగుండి, దేవుడికి కొబ్బరికాయ ప్రాప్తం ఉండి రైలు ఉందనుకోండి, గబగబా  పోర్టరు అడిగినంతా యిచ్చి, పరుగులు పెట్టి అందుకుంటారు. మీకు బస్సు కోసం పరిగెట్టే ప్రయాస ఆదా. రైలు దొరకదు అనే చావుకి ప్రిపేరయితే, పోర్టరకు అదనంగా వందో, యాభయ్యో యివ్వడమనే లంఖణంతో తేలిపోతుంది. కంటికి ఎదురుగా కనబడిన కంపార్టుమెంటులో ఎక్కేసి సామాను యీడ్చుకుంటూ వెస్టిబ్యూల్‌లో మూడు, నాలుగు బోగీలు దాటుకుని వెళ్లినా మీరు సణుక్కోరు.

మీ పక్క ప్రయాణికుడు రాత్రంతా గుర్రు పెట్టి మీ నిద్ర చెడగొట్టినా, ఎదుటి సీట్లో చిన్నపిల్లలు అర్ధరాత్రి దాకా పడుకోకుండా ఆటలాడుతూంటే వాళ్ల అమ్మానాన్నా అదలించక పోయినా గొణుక్కోరు. ఇంకా నయం, రైలంటూ దొరికింది అని సంబరపడతారు. అదృష్టం బాగా లేక, మీరు స్టేషన్‌కు చేరేసరికే రైలు వెళ్లిపోయిందనుకోండి, మీరు దానికి మెంటల్‌గా ఎలాగూ ప్రిపేరయి ఉన్నారు. ఏమీ తొట్రుపాటు పడకుండా 'అబ్బీ, సామాన్లు కిందకి దింపనక్కరలేదు, యిట్నుంచి యిటే బస్‌డిపోకి పోనీయవోయ్‌' అంటారు. బస్సు టిక్కెట్టో? అని మీ ఆవిడ అడిగితే 'ఏ బస్సో ఆలోచించి పెట్టుకున్నాను. ఆటోలో వెళుతూనే ఆన్‌లైన్‌ బుక్‌ చేసేస్తాను. కాంటీన్‌లో కాస్త కతికడానికి, బస్సెక్కడానికి మధ్య అరగంట వ్యవధి ఉందిలే' అని నచ్చచెపుతారు.

ఇంకో సందర్భం. మిస్సవకుండా విమానం ఎక్కేశారు. కానీ వాతావరణం బాగుండకపోవడం చేత బయలుదేరటం లేదు. చేరే చోట ఎలా వుంటుందో తెలియదు. ఆలస్యమైతే ఆ వూళ్లో  ఓ పెద్దాయన దగ్గర తీసుకున్న ఎపాయింట్‌మెంట్‌ కాన్సిల్‌ అయిపోతుంది. ఎలా? ఎలా? ఎన్నిసార్లు ఆలోచించినా దానికి సమాధానమే రాదు. అందుకని ఆ ఆలోచన మానేసి, ఎలాగూ ఆ వూరు వెళుతున్నాం కాబట్టి, ఆ వూళ్లో వేరే పనులు ఏమైనా చేయగలమా అని ఆలోచించి వాటికి సిద్ధపడాలి. విమానం దిగాక ఫోన్‌ చేసి చూస్తే 'సార్‌కి అర్జంటు మీటింగుండి, ఎపాయింట్‌మెంట్‌ వాయిదా పడింది, మీరు వెంటనే వచ్చేయండి' అంటే యిబ్బందే లేదు. అబ్బే, కాన్సిల్‌ అయిపోయింది అంటే వేరే పనులు చూసుకోవచ్చు. ఇలాటి ప్లానులను యీ రోజుల్లో 'ప్లాను బి' గా వ్యవహరిస్తున్నారు.

ఇది పెద్ద బ్రహ్మవిద్యేమీ కాదు. మనసు మరలించుకుని ఫోకస్‌ వేరే దాని మీద పెడితే చాలు, అన్ని విషయాలు వాటంతట అవే తడతాయి. సమస్యేమిటంటే మనం ఒకే విషయం మీద వర్రీ అవుతూ కూర్చుంటాం, అది జరగాలి జరగాలి అని దణ్ణాలు పెడుతూ కూర్చుంటాం. ఎందుకు? ఎందుకంటే పని కాదు అని నెగటివ్‌గా ఆలోచించడం అశుభం అనుకుంటాం. మీ స్నేహితుడు ఎక్కడో డాక్యుమెంట్లు మర్చిపోయాడు, మీ దగ్గరకి వచ్చి నీ కారు తీయ్‌, త్వరగా వెళ్లి చూసి వద్దాం, యింకా అక్కడ ఉన్నాయో లేదో అన్నాడు, మీరు కారు డ్రైవ్‌ చేస్తూనే, అతన్ని ఉపశమింప చేద్దామని 'డాక్యుమెంట్లు పోయాయనుకో, డూప్లికేట్లు తీసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎంత ఖర్చవుతుంది?' అని అడుగుతూ అతని మైండ్‌ డైవర్ట్‌ చేద్దామని ప్రయత్నిస్తే అతను మండిపడతాడు. 'వెధవ అపశకునపు పలుకులు పలక్కు' అంటాడు. అక్కడకు వెళ్లి చూసినప్పుడు డాక్యుమెంట్లు మిస్సయ్యాయని తెలిస్తే ఆ పాపమంతా మీ నెత్తిన చుడతాడు - 'నీ వెధవ నోటితో అన్నావ్‌. అలాగే జరిగింది' అని తిడతాడు, నీ మతిమరుపు వల్లనే కదా యిదంతా జరిగింది అని గుర్తు చేసే సాహసం మీరు చేయరు.

మన దేశంలో యిన్సూరెన్సు వ్యాపారం యింత మందకొడిగా ఉండడానికి యీ ధోరణే కారణం. దానికి యిన్‌కమ్‌ టాక్స్‌ బెనిఫిట్‌ తీసేస్తే నా ఉద్దేశంలో సగానికి సగం మంది కట్టనే కట్టరు. ఇన్సూరెన్సులో ఎండోమెంటు పాలసీలు కూడా ఉన్నాయని చాలామందికి తెలియనే తెలియదు. ఇన్సూరెన్సు అనగానే చావు గుర్తుకు వస్తుంది. ఆలోచించిన మాత్రానే చావు ముంచుకు వస్తుందని అనుకుని బీమా చేయించుకోవడం మానేస్తారు. పైన తథాస్తు దేవతలుంటారని, మనం ఏదైనా అశుభం పలికితే, అది అయిపోతుందని అడలి ఛస్తూ ఉంటారు. ఈ తథాస్తు దేవతలకి వర్కింగ్‌ అవర్స్‌ ఎప్పుడో ఎవరికీ తెలియదు. తాగో, కోపం తోనో అవతలివాణ్ని 'నిన్ను చంపుతా, నరుకుతా, మీ అమ్మను యిలా చేస్తా, అక్కను అలా చేస్తా' అని కూసే కూతలూ ఏవీ ఫలించవు. 'ఒకవేళ నాకేదైనా అయితే..' అంటే మాత్రం వెంటనే ఎలర్టయిపోయి, 'ఒకవేళ' మాట వినిపించుకోకుండా, వాడికి ఏదో ఒకటి చేసేస్తారా? చెడు గురించే కాదు, మనం మంచి గురించి కూడా మాట్లాడడానికి దడుస్తాం.

'ఏదో ఓహో అని బతక్కపోయినా, దేహి అనకుండా గడిచిపోతోంది' అని చెప్పుకోవడానికి కూడా దడిసిపోయి 'అనుకోకూడదు కానీ...' అనే మాట ముందు చేరుస్తాం. ఇటీవలి కాలంలో ఇంగ్లీషు వాళ్ల నుంచి 'టచ్‌ ఉడ్‌' మాట ఎరువు తెచ్చుకుని, దగ్గర్లో ఉన్న చెక్కముక్కను వెతికి పట్టుకుని ముట్టుకుంటున్నార. ఆదిమమానవుడు తనకు ఏదైనా మంచి జరగాలని కోరుకుంటే చెట్లలో ఉన్న పిశాచాలు అవి జరగకుండా చేస్తాయని నమ్మేవాడు. అందువలన ఆశాభావం వ్యక్తం చేయగానే ఆ మాటలు వాటి చెవిన పడకుండా చెట్టు దగ్గరకి వెళ్లి మూసేసేవాడు. అక్కణ్నుంచే టచ్‌ ఉడ్‌ అనే మాట పుట్టిందట. మన గురించి గొప్ప (వాస్తవమే అయినా) చెప్పుకుంటే కీడు కలుగుతుందని నమ్మి ఇప్పటికీ చెట్టు నుంచి పుట్టిన సోఫా చెక్కనైనా ముట్టుకోవడం అనాగరికం.

దేని గురించైనా వర్రీ అవుతున్నపుడు అల్టిమేట్‌గా ఏం జరుగుతుందో ఊహించి, దానికి మానసికంగా సిద్ధపడితే, అంతకంటె నష్టం ఏ మాత్రం తగ్గినా దాన్ని లాభంగా పరిగణించవచ్చు. ఈ ఫార్ములా కొత్తదేమీ కాదు. కీడెంచి మేలెంచమని మనవాళ్లు చెప్పారు. 'హోప్‌ ఫర్‌ ద బెస్ట్‌, ప్రిపేర్‌ ఫర్‌ ద వ(ర)స్ట్‌' అని ఇంగ్లీషువాడూ చెప్పాడు. ఈ సామెతలు వల్లించడం కాదు, మనసా వాచా కర్మణా నమ్మాలి, ఆచరించాలి. లేనిపోని శంకలూ, చాదస్తాలూ, భయాలూ పెట్టుకోకూడదు. జరిగేది ఎలాగూ జరుగుతుంది, యీ లోపున వర్రీ అయి బుర్ర బద్దలు కొట్టుకోకుండా ఉండడానికి యీ ఎప్రోచ్‌ పనికి వస్తుంది.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com