cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: పృథ్వీ-రాజ్ ‌కపూర్‌ల మధ్య అంతరం

 ఎమ్బీయస్: పృథ్వీ-రాజ్ ‌కపూర్‌ల మధ్య అంతరం

కొందరు దర్శకుల సినిమాలు గమనిస్తే వాళ్లు ఒక థీమ్‌ను అనుసరిస్తున్నట్లు కనిపిస్తుంది. కె బాలచందర్ సినిమాల్లో తండ్రి పాత్రలను కాస్త నెగటివ్‌గా చూపించినట్లు తోస్తుంది. ఒక సినిమాలో అయితే ఏమో అనుకోవచ్చు. కానీ అనేక సినిమాల్లో అదే రకంగా కనబడితే యిది యీయన అబ్సెషన్ ఏమో అనిపిస్తుంది.

‘‘జీవితరంగం’’ సినిమాలో కూతురు యిల్లు గడపడానికి నగరానికి వెళ్లి వేశ్యగా మారి డబ్బు పంపిస్తూ వుంటే పల్లెటూళ్లో తండ్రి పిల్లల్ని కనేస్తూంటాడు. ‘‘ఆకలిరాజ్యం’’లో హీరో తండ్రి కొడుకు మీద విరుచుకుపడడమే తప్ప ఏనాడు సానుభూతి చూపడు. హీరోయిన్ తండ్రి కూతురి సంపాదన మీద బతికేస్తాడు. తన తల్లి చచ్చిపోతే గాజులు కత్తిరించుకుని పారిపోతాడు.  ‘‘రుద్రవీణ’’లో తండ్రి కొడుకు జానపద సంగీతం పాడినా వెలివేసేస్తాడు. ‘‘అపూర్వ రాగంగళ్’’లో కూడా కొడుకుకి, తండ్రికి పడక కొడుకు యిల్లు వదిలి వెళ్లిపోతాడు. ‘‘అంతులేని కథ’’లో హీరోయిన్ తండ్రి కుటుంబాన్ని వదిలేసి పారిపోవడంతో ఆ భారమంతా తనపై పడుతుంది. కులాంతర వివాహాన్ని తలిదండ్రులు ఒప్పుకోకపోవడం అనేక సినిమాల్లో వుంటుంది కానీ ‘‘మరో చరిత్ర’’లో వాళ్లను మరీ కఠినాత్ములుగా చూపించే స్థాయికి వెళ్లిపోయింది.

రాజ్ కపూర్ సినిమాల్లో కూడా యిలాటిది కనబడుతుంది. కళాకారుడెప్పుడూ తన అనుభవాలు, తనకు తెలిసివున్నవారి అనుభవాలకు కాస్త కల్పన జోడించి రచనలు, సినిమాలు చేస్తాడు. బాలచందర్ కుటుంబ నేపథ్యం నాకు తెలియదు కానీ, రాజ్ కపూర్ గురించి పుస్తకాల్లో విస్తారంగా వచ్చింది. దాన్ని బట్టి కొంత అంచనా వచ్చింది. తండ్రికి, కొడుకుకి మధ్య చాలా వ్యత్యాసం వుంది. దాన్ని ఒక ఘర్షణగా మలిచి, రాజ్ కపూర్ సినిమాల్లో తీశాడని అర్థమౌతుంది. మిస్టర్ పెర్‌ఫెక్ట్ అయిన తండ్రికి, తప్పటడుగులు వేసే కొడుక్కి ఓ దశలో ఘర్షణ రావడం సమాజంలో చూస్తూనే వుంటాం. పోనుపోను అంటే కొడుక్కి 40 దాటిన తర్వాత తండ్రి ఆ రోజు తననెందుకు కట్టడి చేశాడో అర్థమైనా, అతను తరుణ వయస్కుడిగా వున్నపుడు తండ్రి మీద గుర్రుగానే వుంటుంది.

రాజ్ కపూర్ గురించి మన పాఠకులకు అంతో యింతో తెలిసే వుంటుంది కానీ పృథ్వీరాజ్ గురించి చాలా తక్కువ తెలిసి వుంటుంది. మొఘల్ ఏ ఆజమ్‌ (1960) లో ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ పాటలో అక్బర్‌గా, లేదా ‘‘ఆవారా’’ (1951)లో జడ్జిగా మాత్రమే చాలామందికి గుర్తుండి వుంటాడు కానీ ఆయన జీవితం, వ్యక్తిత్వం మహోన్నతమైనవి. వాటి గురించి కొంతైనా చెప్పకపోతే రాజ్‌కి ఆయనకి వున్న తేడా అర్థం కాదు. పృథ్వీరాజ్ హిందూ పఠాన్. మాతృభాష పస్తో. ఇప్పటి పాకిస్తాన్‌లో లయల్పూర్ జిల్లాలోని సముందరీ అనే ఊళ్లో 1906లో పుట్టాడు. ఆయన తాత తహసిల్‌దార్. తండ్రి పోలీసు అధికారి. మూడో ఏటే తల్లిపోవడంతో, తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోవడంతో, పైగా పోలీసు అధికారిగా వేరే వూళ్లలో పని చేస్తూండడంతో తాత దగ్గర పెరిగాడు పృథ్వీ. ఉన్న ఊళ్లో మెట్రిక్ దాకా చదివి, ఫస్ట్ క్లాస్‌లో పాసయి, జిల్లా కేంద్రమైన లయల్పూర్‌కి వెళ్లి అక్కడ బిఏ సెకండ్ క్లాసులో పాసయి, 1927లో లాహోర్‌లో లా కాలేజీలో చేరాడు. స్కూలు రోజుల నుంచి నాటకాలు వేస్తూ, కాలేజీ రోజుల్లో నాటకాలు ఉధృతంగా వేస్తూ, దానిపై మమకారం పెరగడంతో లా కాలేజీలో ఫస్టియర్ తప్పింది. ఇక చదువు మానేసి, నాటకాలపై పూర్తి దృష్టి పెట్టాడు.

1924లో సముందరీలో పుట్టిన రాజ్ (పూర్తి పేరు రణబీర్‌ రాజ్) కపూర్ కొంతకాలం అక్కడే పెరిగి, కలకత్తాలో, బొంబాయిలలో తండ్రి సినిమా నటుడిగా వుండే రోజుల్లో అక్కడి స్కూళ్లలో చదువుకున్నాడు. కానీ చదువులో ఎప్పుడూ వెనకబడే వుండేవాడు. చివరకు మెట్రిక్ తప్పాడు. రాజ్ ఒక్కడే కాదు, అతని సోదరులు, కొడుకులూ కూడా గ్రాజువేట్లు కాలేదు. కొడుక్కి చదువు రాకపోవడం పృథ్వీకి అస్సలు నచ్చేది కాదు. పృథ్వీరాజ్ నాటకరంగంలోకి వెళతానంటే ఆయన తండ్రి, సవతి తల్లి అభ్యంతర పెట్టారు. వాళ్లని ఒప్పించడానికి కొంతకాలం ప్రయత్నించి, చివరకు భార్యాబిడ్డలను వాళ్ల దగ్గరే వదిలేసి 200 రూ.లు అప్పు చేసి, నా అదృష్టాన్ని పరీక్షించుకుంటానంటూ 1927 చివర్లో లాహోర్ వెళ్లాడు. అక్కడ ఏమీ జరగకపోవడంతో భారతదేశపు వాయువ్య ప్రాంతాన్నుంచి తూర్పు కొసకు కలకత్తాకు వెళ్లాడు.

కలకత్తాలో కూడా అంబ పలకకపోవడంతో 1929లో బొంబాయి చేరాడు. జేబులో 70 రూపాయలున్నాయి. అర్దేషేర్ ఇరానీ అనే దర్శకనిర్మాత దగ్గర జీతంలేని జూనియర్ ఆర్టిస్టుగా చేరాడు. ‘‘ఛాలెంజ్’’ అనే మూకీ సినిమాలో అరబ్ వేషంలో కనబడేటప్పటికి నిర్మాత ముగ్ధుడైపోయాడు. ఎందుకంటే పృథ్వీరాజ్ ఎత్తరి. రూపసి. మంచి కండలు అవీ హీ-మాన్‌లా వుండేవాడు. వెంటనే ‘‘సినిమా గర్ల్’’ (1930)లో ప్రముఖ హీరోయిన్ సరసన కథానాయకుడి పాత్ర దక్కింది. 1931 లోగా ఎనిమిది నిశ్శబ్ద చిత్రాలలో నటించాడు. ఆ సంస్థే తొలి టాకీ ‘‘ఆలం అరా’’ (1931) తీస్తే దానిలోనూ నటించాడు. అప్పటికి అతనికి నెలజీతం రూ.200. అప్పుడు భార్యాపిల్లల్ని తన వద్దకు రప్పించుకున్నాడు. ఆ పై ఏడాది గ్రాంట్ ఏండర్సన్ అనే ఆంగ్లనటుడు ఒక థియేటర్ కంపెనీ పెట్టి దేశమంతా షేక్‌స్పియర్ నాటకాలు ప్రదర్శిద్దాం, రా అంటే సినిమాలు పక్కన పెట్టేసి, కుటుంబాన్ని వెనక్కి పంపేసి, దానిలో చేరిపోయాడు. వాళ్లు దేశమంతా తిరుగుతూ 14 నాటకాలు ప్రదర్శించారు కానీ ఆర్థికంగా నష్టం వచ్చింది. 1932 చివరకు కలకత్తా చేరేసరికి కంపెనీ మూతపడింది. దాంతో పృథ్వీరాజ్ అక్కడే ఉన్న న్యూ థియేటర్స్‌లో ఆర్టిస్టుగా చేరాడు.

అక్కడ నితిన్ బోస్, పిసి బారువా, హేమ్ చందర్, ఎఆర్ కర్దార్ వంటి దిగ్గజదర్శకుల వద్ద 12 సినిమాలలో పనిచేశాడు. అవన్నీ టాకీలే. దేవకీ బోస్ తీసిన ‘‘సీత’’ సినిమాలో దుర్గా ఖోటే సీతగా వేయగా, పృథ్వీ రాముడిగా వేశాడు. 1939లో మళ్లీ బొంబాయికి వస్తే, ఆఫర్లు వచ్చి పడ్డాయి. అప్పటిదాకా తారలందరూ నెల జీతాలపై పని చేసేవారు. సినిమా పూర్తయేవరకు జీతానికి గ్యారంటీ వుండేది. కానీ ఒక సినిమా పూర్తయేవరకూ యితరులకు పనిచేయడానికి వీలుండేది కాదు. నేను జీతంపైన పని చేయను, ఫ్రీలాన్సర్‌గా వుంటాను. ఒకేసారి అనేక సినిమాల్లో పనిచేస్తాను అన్నాడు పృథ్వీ. ఆత్మవిశ్వాసంతో అలా చెప్పిన మొదటి నటుడు ఆయనే. నిర్మాతలు ఒప్పుకున్నారు. ఇక అక్కణ్నుంచి 1972లో చనిపోయేవరకు బొంబాయిలోనే వుంటూ నటిస్తూనే వున్నాడు.

తాము సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి కష్టపడవలసి వచ్చింది కాబట్టి పిల్లలు అనిశ్చితమైన యీ రంగం వైపు రాకుండా, బాగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని కళాకారులందరూ అనుకుంటారు. ముఖ్యంగా పెద్దకొడుకుపై తలిదండ్రుల ఆశలు మరీ ఎక్కువగా వుంటాయి. కానీ రాజ్ జీవితం అలా సాగలేదు. తండ్రి తమను పిలిపించుకునేదాకా రాజ్ తల్లి, యిద్దరు తమ్ముళ్లతో పెషావర్‌లో తాత గారి యింట్లో వుంటూ స్థానికంగా వున్న స్కూళ్లలో చదివాడు. తర్వాత బొంబాయికి వచ్చాక దెహ్రాదూన్‌లో, కలకత్తాలో బెంగాలీ మీడియం స్కూల్లో, మళ్లీ బొంబాయి వచ్చాక గిర్‌గాంవ్‌లో మరాఠీ మీడియం స్కూల్లో, ఆ తర్వాత బైకుల్లాలో మరో స్కూల్లో.. యిలా స్కూళ్లు మారుతూ వచ్చాడు. దీనివలన మాతృభాష పస్తో, పంజాబీలతో బాటు, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ప్రావీణ్యం వచ్చింది కానీ చదువు అబ్బలేదు.  

రాజ్ చిన్నప్పణ్నుంచీ లావుగా వుండేవాడు. మధ్యలో సన్నబడ్డాడు కానీ మళ్లీ ఒళ్లు వచ్చేసింది. లావుగా వుండే కుర్రవాళ్లంటే అందరికీ లోకువే కదా, ఏడిపించేవారు. దాన్ని తట్టుకోవడానికి తనమీద తనే జోకులేసుకుంటూ జోకర్‌గా ప్రవర్తించేవాడు. అతను పెద్దవాడవుతున్న కొద్దీ పృథ్వీకి కొడుకుని చూస్తే దిగులు వేసేది. అతనికి తనలా ఎత్తూ లేదు, కండలూ లేవు, గంభీర కంఠస్వరమూ లేదు. యువ పృథ్వీరాజ్‌ను చూస్తే శశి కపూర్, వయసుమీరిన పృథ్వీరాజ్‌ను చూస్తే శమ్మీ కపూర్ గుర్తుకువస్తారు. చాలా తక్కువ సందర్భాల్లోనే పృథ్వీకి, రాజ్‌కు మధ్య పోలికలు కనబడతాయి. రాజ్ తర్వాత పుట్టిన యిద్దరు కొడుకులు జ్వరాలతో 15 రోజుల తేడాలో చనిపోవడంతో ఆశలన్నీ పెద్ద కొడుకు మీదే పెట్టుకున్నాడు.

కానీ తనలా హీరోయిక్‌గా కాకుండా, లావుగా, మొద్దబ్బాయిలా (చదువు కూడా అంతంతమాత్రమే) కనబడడంతో, యీ పిల్లాడు జీవితంలో పైకి ఎలా వస్తాడాని బెంగ పడేవాడు. తండ్రి తన గురించి బెంగపడుతున్నాడని గ్రహించి రాజ్ కృంగిపోయేవాడు. మెట్రిక్ పరీక్షలో వరుసగా మూడు సార్లు తప్పడంతో చదువు మానేస్తానన్నాడు. తండ్రి పరీక్షకు మళ్లీ కట్టవచ్చుగా అంటే ‘సెకండ్ లాంగ్వేజిగా వున్న ఆ లాటిన్ నాకు వంటపట్టటం లేదు. ఎవరైనా డాక్టరవుదామనుకుంటే మెడికల్ కాలేజీకి వెళతారు. నేను సినిమాలు తీద్దామనుకుంటున్నాను కాబట్టి స్టూడియోలకు వెళ్లి పని నేర్చుకుంటాను. ఇక్కడ మరో ఐదేళ్లు గడపడం వృథా.’’ అని తండ్రికి చెప్పేశాడు. పృథ్వీ నిట్టూర్చి, ఏమీ అనలేక సరే అన్నాడు. వాటితో బాటు పృథ్వీ థియేటర్స్‌లో పని చేస్తూ అన్ని డిపార్టుమెంట్లూ తెలుసుకో అని కూడా అన్నాడు. అప్పటికి రాజ్ వయసు 17.

శ్రమలో, స్వయంకృషిలో ఆనందం పొందే స్వభావం పృథ్వీది. ఆయన చిన్నపుడు యింట్లో ఎందరు పనివాళ్లున్నా రోజూ సాయంత్రం 14 లాంతర్లు తుడిచి కిరోసిన్ నింపే పని ఆయన చేతే చేయించేవారు తాతగారు. అదే స్ఫూర్తితో పృథ్వీ కలకత్తాలో తను స్టార్ అయి వుండి కూడా కొడుకుని మునిసపల్ స్కూల్లో చేర్చి, ట్రామ్‌లో వెళ్లమనేవాడు. బొంబాయిలో కూడా మునిసిపల్ స్కూల్లో చేర్చాడు. రాజ్‌కు అలాటి సిద్ధాంతాలు లేవు. కొడుకుల్ని పెద్ద స్కూళ్లలోనే చదివించాడు. కార్లలోనే పంపాడు. రాజ్ స్టూడియోలకు వెళతానన్నపుడు పృథ్వీ తన మిత్రుడైన కిదార్ శర్మ వద్ద డైరక్షన్ డిపార్టుమెంటులో ఏడో అసిస్టెంటుగా చేర్పించి, అన్ని పనులూ చేయించమన్నాడు. మొదటిరోజు తండ్రితో బాటు కారులో స్టూడియోకి వెళదాం కదాని రెడీ అయి కూర్చున్నాడు. పృథ్వీ బయటకు వచ్చి విషయం కనుక్కుని, ‘సొంత కాళ్ల మీద బతుకు. నీకొచ్చే జీతానికి బస్సులోనే వెళ్లి రా.’ అన్నాడు.

రాజ్ అక్కడ ట్రాలీ లాగడం దగ్గర్నుంచి ఫ్లోర్ తుడవడం దాకా అన్నీ చేశాడు. ఓ రోజు క్లాప్‌బాయ్‌గా పనిచేస్తున్న రాజ్ అజాగ్రత్తగా వుండడంతో ఆర్టిస్టు గడ్డం క్లాప్‌లో చిక్కుకుపోయింది. కిదార్ శర్మ రాజ్‌ను లెంపకాయ కొట్టాడు. అయినా పృథ్వీ నొచ్చుకోలేదు. కొడుక్కి నచ్చచెప్పి మర్నాడు పంపించాడు. కిదార్ శర్మ ఫీలై పోయి, తన తర్వాతి సినిమాలో ‘‘నీల్ కమల్’’లో హీరో వేషం యిస్తానని మాట యిచ్చాడు. ఈలోపుగా రాజ్ బాంబే టాకీస్‌లో అమియా చక్రవర్తి దగ్గర కూడా అసిస్టెంటు డైరక్టరుగా పనిచేశాడు. ఆ తర్వాత ఫిల్మిస్తాన్‌లో సుశీల్ మజుందార్ కింద పనిచేశాడు. బాంబే టాకీస్‌లో రాజ్‌కు రూ.200 జీతం యిచ్చేవారు. అప్పటికే రాజ్‌కు రణధీర్ పుట్టడంతో జీతం చాలక, అక్కడ షిఫ్ట్ అయిపోగానే పృథ్వీలో పనిచేసేవాడు. బొంబే టాకీసు కంటె ఒక రూపాయి ఎక్కువ జీతం అంటే రూ. 201 యిచ్చేవాడు తండ్రి.

పృథ్వీ థియేటర్స్‌లో పనిచేయించినపుడు స్టూడియో తుడవడం దగ్గర్నుంచి కొడుకు చేత చేయించాడు పృథ్వీ. అన్ని డిపార్టుమెంట్లలోనూ సహాయకుడిగా తర్ఫీదు యిప్పించాడు. అందుకే రాజ్‌కు సినిమాకు సంబంధించిన 24 కళల్లోనూ ప్రావీణ్యం లేదా ప్రవేశం వుండడంలో శాంతారాం తర్వాత అతని పేరే చెప్తారు. రాజ్ నటుడిగా కంటె దర్శకనిర్మాతగా పేరు తెచ్చుకోవడానికి యీ తర్ఫీదే కారణం. రాజ్ తన కొడుకులను యిలాటి డిగ్నిటీ ఆఫ్ లేబర్‌తో పెంచలేదు. పెద్ద కొడుకు రణధీర్‌ని తన దగ్గర అసిస్టెంటు డైరక్టరుగా పెట్టుకున్నాడు. తర్వాత అతను నటదర్శకుడనవుతాను ఛాన్సివ్వమంటే ‘‘కల్ ఆజ్ ఔర్ కల్’’ (1971) సినిమాను నిర్మించాడు. రెండో కొడుకు ఋషిని ‘‘బాబీ’’ ద్వారా హీరో చేశాడు. మూడో కొడుకు రాజీవ్ వేరే వాళ్ల సినిమాల్లో రాణించలేక పోతూంటే ‘‘రామ్ తేరీ గంగా మైలీ’’ సినిమా తీసి హీరోగా నిలబెట్టాడు. పృథ్వీ అలాటివి ఏమీ చేయలేదు. ఇంట్లోనే నా కొడుకువి. బయటకు వెళితే నా పేరు ఉపయోగించుకోలేవు అని స్పష్టంగా చెప్పాడు.

పృథ్వీరాజ్ ఆదర్శాలున్న వ్యక్తి. సినిమా రంగంలో బాగా గడిస్తున్న రోజుల్లోనే 1944లో నాటకరంగంపై ప్రేమతో పృథ్వీ థియేటర్స్ ప్రారంభించాడు. మొదటగా ‘‘శకుంతల’’ నాటకాన్ని ప్రదర్శించాడు. అది విఫలమై ఆ రోజుల్లోనే లక్ష రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టింది. అయినా సిబ్బంది మొత్తానికి రెండు నెలల జీతాన్ని బోనస్‌గా యిచ్చాడు. పౌరాణిక అంశాలను వదిలేసి, కాకుండా దేశం మతకలహాలతో అట్టుడుకుతోంది కాబట్టి మతసామరస్యాన్ని ప్రబోధిస్తూ, సామాజిక అంశాలను, దేశ విభజన వలన నష్టపోయినవారి కథలను స్పృశిస్తూ ‘‘దీవార్’’ ‘‘పఠాన్’’, ‘‘ఆహుతి’’ ‘‘గద్దార్’’ వంటివి రాయించాడు. రైతు సమస్యలపై ‘‘కిసాన్’’, గ్రామీణ జీవితానికి, నగర జీవితానికి కల వ్యత్యాసాన్ని చూపుతూ ‘‘కళాకార్’’, డబ్బు మనుషులను ఎలా చెడగొడుతుందో చూపుతూ ‘‘పైసా’’ రాయించాడు. ఇవన్నీ హిట్సే.

పృథ్వీ థియేటర్స్ 16 ఏళ్లు నడిచింది. 100 మంది పర్మనెంటు స్టాఫ్ వుండేవారు. కశ్మీరు నుంచి తమిళనాడులోని ధనుష్కోటి వరకు, పోర్‌బందర్ నుంచి కలకత్తా వరకు 2662 ప్రదర్శనలు యిచ్చాడు. ప్రతి ప్రదర్శనలో ఆయన పాల్గొన్నాడు. పృథ్వీ థియేటర్స్‌లో అన్ని రంగాలకు చెందిన హేమాహేమీలు తయారయ్యారు. రాజ్, శమ్మీ, శశిలే కాదు, ప్రేమ్‌నాథ్, రాజేంద్రనాథ్ (రాజ్ బావమరుదులు), సజ్జన్, కమల్ కపూర్, పరీక్షిత్ సహానీ తల్లి దమయంతి, షబానా అజ్మీ తల్లి షౌకత్, బిఎం వ్యాస్, మన ఎల్‌.వి.ప్రసాద్, రచయితలు ఇందర్ రాజ్ ఆనంద్, రామానంద సాగర్, డైరక్టర్లు మోహన్ సెగాల్, రమేశ్ సైగల్. ప్రయాగ్ రాజ్, ప్రకాశ్ అరోడా, మ్యూజిక్ డైరక్టర్లు రామ్ గంగూలీ, శంకర్-జైకిషన్ అంతా అక్కడ తర్ఫీదైనవారే.

నాటకం అయిపోగానే పృథ్వీ జోలె పట్టుకుని బయట నిలబడేవారు. అలా సేకరించిన విరాళాలను ప్రజోపయోగకరమైన పనులకు పంపేవారు. గుమ్మడి తన ఆత్మకథలో రాసుకున్నారు. సినిమాల్లోకి రావడానికి ముందు 1948లో బొంబాయి వెళ్లి నాటకం చూసి ముగ్ధులై బయటకి వచ్చి పృథ్వీయే స్వయంగా జోలె పట్టుకుని నిలబడడంతో తబ్బిబ్బయి, లాల్చీ జేబులో చెయ్యి పెట్టి చేతికి అందింది వేసేశారట. జేబులో ఒక పది రూ.ల నోటు, ఒక వంద నోటు వున్నాయి. రూముకి వచ్చి చూసుకుంటే వంద వేసేసినట్లు అర్థమైంది. పక్కనే స్నేహితుడు వుండడంతో తిరుగు ప్రయాణానికి అతను టిక్కెట్టు కొన్నాడు. సినిమాల్లో చేరాక సారథీ స్టూడియోలో పృథ్వీని కలిసినపుడు మొఘల్ ఏ ఆజమ్‌లో మీ కళ్లు క్రమేపీ ఎర్రబడిన సీనులో యిలా చేసి వుంటారు కదా అని అడిగితే, పృథ్వీ చాలా సంతోషించి, ఆశీర్వదించారు. మన హీరో-కమెడియన్ చలాన్ని ఓ నాటక ప్రదర్శనలో చూసి ‘ఆంధ్రా దిలీప్’ అనే బిరుదు యిచ్చినది కూడా పృథ్వీయే. మరోసారి శవంగా నటించిన నిర్మలమ్మ నటనను కూడా చాలా మెచ్చుకున్నారు.

రాజ్‌కు థియేటర్‌పై మక్కువేమీ లేదు. పృథ్వీ థియేటర్స్ నుంచి కళాకారులను చాలామందిని తన సినిమాల్లోకి తీసుకున్నాడు తప్ప, దానికి తను చేసిందంటూ ఏమీ లేదు. ఆర్థిక కారణాల వలన అది మూత పడినపుడు సాయమూ చేయలేదు. శమ్మీకి దానిపై యింట్రస్టు లేదు. శశి, అతని భార్య జెన్నిఫర్ థియేటర్ నుంచి వచ్చినవాళ్లు కాబట్టి పృథ్వీ మరణానంతరం ఆయన వృద్ధాప్యంలో నివసించిన కాటేజీని పృథ్వీ థియేటర్స్‌గా మార్చి 1978లో మళ్లీ ప్రారంభించారు. తలిదండ్రులు మరణించాక వాళ్ల కుమారుడు కునాల్ దాని నిర్వహణ చూస్తున్నాడు.

సామాజిక స్పృహ కల వ్యక్తి కాబట్టి పృథ్వీ విరాళాలు సేకరించి నవకాళీ మతకలహాల బాధితులను, బిహార్ కరువు బాధితులను, సుభాష్ బోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని, దేశవిభజన తర్వాత వచ్చిన శరణార్థులను ఆదుకునేవాడు. సెంట్రల్ రైల్వే వర్కర్స్ యూనియన్‌కు ప్రెసిడెంటుగా నాలుగేళ్లు ఉన్నాడు. 1951లో వియన్నాలో జరిగిన ప్రపంచ శాంతి సమావేశానికి హాజరయ్యాడు. 1952లో, 1954లో రాజ్యసభకు నామినేట్ అయ్యాడు. ఇక కళల పరంగా, సినిమాల పరంగా చాలా సత్కారాలు పొందాడు. కొడుకు రాజ్ కమ్మర్షియల్ సినిమాలు తీస్తున్న సమయంలో తను తన నాటకం ‘‘పైసా’’ను తన దర్శకత్వంలో 1957లో సినిమాగా తీశాడు. కానీ అది ఘోరంగా ఫ్లాపయింది.

వయసు మీద పడినా పృథ్వీలో ఉత్సాహం తగ్గలేదు. వృద్ధాప్యంలో సంస్కృతం నేర్చుకోసాగాడు. పంజాబీ భాషలో సినిమాల్లో నటించడంతో బాటు పుట్టణ దర్శకత్వం వహించిన ‘‘సాక్షాత్కార’’ అనే కన్నడ సినిమాలో నటించాడు. ఒక తెలుగు సినిమాలో నటించడానికి ఒప్పుకుని తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టాడు కానీ యింతలో కాన్సర్ రూపంలో మృత్యువు ముంచుకుని వచ్చింది. మళ్లీ థియేటర్ ఉద్యమాన్ని ప్రారంభించి యీసారి గ్రామీణ ప్రాంత ప్రజల్లో చైతన్యం రగల్చాలని సంకల్పించాడు కానీ విధి కరుణించలేదు. రాజ్ కపూర్‌కి యిలాటి ఉత్సాహాలు ఏమీ లేవు. కేవలం హిందీలోనే నటించాడు. తను నిర్మించి అమిత్ మిత్ర, శంభు మిత్రల చేత డైరక్ట్ చేయించిన ‘‘జాగ్‌తే రహో’’ బెంగాలీ వెర్షన్‌ ‘‘ఏక్ దిన్ రాత్రే’’ లో మాత్రం నటించాడు. దానిలో చివర్లో తప్ప డైలాగులే వుండవు.

ఇదీ ‘‘బూట్ పాలిష్’’ సినిమాలు సామాజిక ప్రయోజనం వున్నవి. ‘‘అబ్ దిల్లీ దూర్ నహీ’’ విభిన్నంగా తీసిన సినిమా. ఇవి బాగా హిట్ కాలేదంటూ, ఎప్పటిలాగా కమ్మర్షియల్ సినిమాలే తీసుకుంటూ పోయాడు. ఇక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. పృథ్వీకి ఆడంబరాలు కిట్టవు. ఎప్పుడూ ఖద్దరే ధరించేవాడు. రాజ్ షోమాన్. పృథ్వీకి ఒక్కటే కారు – ఓపెల్! మార్చరాదా అంటే నాకిది చాలు అనేవాడు. రాజ్ ‘‘ఆగ్’’ సినిమా తీసేటప్పటికే ఫోర్డ్ కొనేశాడు. ‘‘ఆగ్’’ ఓ మాదిరిగా ఆడడంతో తర్వాతి సినిమా ‘‘బర్సాత్’’ భారీగా తీశాడు. దానికి తండ్రి కజిన్ దగ్గర అప్పు చేశాడు. ఈ సినిమా బ్రహ్మాండంగా హిట్ కావడంతో ఆవిడకు అప్పు తీర్చడం వాయిదా వేసి కన్వర్టబుల్ ఓల్డ్స్‌మొబైల్ కారు కొన్నాడు. దాన్ని ఇంటి బయట నిలబెట్టి తండ్రితో ‘‘కొత్త కారు కొన్నాను. బాల్కనీలోంచి చూడండి.’’ అన్నాడు.

పృథ్వీ బాల్కనీలోంచి రోడ్డు కేసి చూసి ‘‘నీ కారెక్కడా కనబడటం లేదు. ఏదో ఒక కారు కనబడుతోంది. కానీ నువ్వు అత్తకు డబ్బు తిరిగిచ్చేదాకా అది నీది కాదు కదా!’’ అన్నాడు. రాజ్ నాలిక కరుచుకుని, ఆ డబ్బు వెంటనే తిరిగి పంపించాడు. అదీ తండ్రికొడుకుల మధ్య తేడా. అయితే రాజ్‌లో ఎన్నదగిన గుణాలు చాలా వున్నాయి కాబట్టే అతను ఇండియన్ సినిమాకు ఒక ఐకాన్ అయ్యాడు. అతని సినిమాలలో తండ్రి పాత్రల గురించి తర్వాతి వ్యాసంలో! (ఫోటోలు – పైవరుసలో తండ్రీకొడుకులు, పృథ్వీరాజ్ అలెగ్జాండర్‌గా, జడ్జిగా, కింద వరుసలో ‘‘పఠాన్’’ నాటకంలో, అక్బర్టగా, ‘‘ఆగ్’’లో రాజ్)

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2021)
mbsprasad@gmail.com

 


×