cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ : థాయ్‌లాండ్‌లో మూడువేళ్ల నిరసన

ఎమ్బీయస్ : థాయ్‌లాండ్‌లో మూడువేళ్ల నిరసన

అక్టోబరు 14న థాయ్‌లాండ్ మహారాణి సుతీదా రోడ్డు మీద వెళుతూంటే కొందరు యువతీయువకులు మూడువేళ్లు పైకెత్తి సెల్యూట్ చేశారు. తక్షణం థాయ్ ప్రభుత్వం ‘‘స్టేట్ ఆఫ్ ఎమర్జన్సీ’’ ప్రకటించింది. ఐదుగురి కంటె ఎక్కువమంది గుమిగూడ కూడదని ఆర్డర్లు వేసింది. 20 మంది ప్రదర్శనకారులను అరెస్టు చేసింది. దాంతో మరిన్ని ప్రదర్శనలు జరిగాయి. 

ప్రజాగ్రహానికి దడిసి, ప్రభుత్వం ఎమర్జన్సీ ఎత్తివేసింది కానీ పోలీసుల ద్వారా దమనకాండను కొనసాగిస్తోంది. నిరసనలు మరిన్ని పెరిగాయి. ఆందోళనలు యింకా కొనసాగుతూనే వున్నాయి. ఈ సంఘటనను, దాని పూర్వాపరాలను అర్థం చేసుకోవాలంటే థాయ్ రాజకీయ వాతావరణం కాస్త తెలుసుకోవాలి.

ముందుగా మూడువేళ్ల సెల్యూట్ గురించి వివరించాలి. ‘‘ద హంగర్ గేమ్స్’’ (2008) అనే నవలలో దీన్ని ప్రతిపాదించడం జరిగింది. రాబోయే కాలంలో ఉత్తర అమెరికా ఎలా మారుతుందో ఊహిస్తూ రాసిన నవల అది. సామాన్య ప్రజలంతా ఆకలికి మాడి ఛస్తూ వుంటారు. డబ్బున్నవాళ్లు ఆకలికి మాడి చచ్చేవాళ్ల చేత రోమన్ కాలంలో గ్లాడియేటర్లలా చచ్చేవరకూ పోరాటాలు జరిపించి వేడుక చూస్తూ వుంటారు. అలాటి క్రీడలో పాల్గొన్న దౌర్భాగ్యుడి కథ అది. ఆట నిర్వాహకులు యీ మూడువేళ్ల సెల్యూట్‌ను ప్రవేశపెడతారు. 

ఎవరి పట్లనైనా అభిమానం, కృతజ్ఞత ప్రకటిస్తూ వారికి గుడ్‌బై చెప్పడానికి దాన్ని ఉపయోగించాలని వారి ఉద్దేశం. పోనుపోను అధికార దుర్వినియోగం చేసే నియంతల పట్ల నిరసన తెలపడానికి ప్రజలు దానిని వాడడం మొదలుపెడతారు. ఈ నవల, దాని ఆధారితంగా నిర్మించబడిన సినిమాల ద్వారా థాయ్ ప్రజలు 2014 సైనిక కుట్ర తర్వాతి నుంచి తమ నిరసన తెలపడానికి యీ పద్ధతి ఎంచుకున్నారు. తమ హక్కులు అణచివేస్తున్న సైనికప్రభుత్వం వైఖరి పట్ల తమ ధిక్కారాన్ని ప్రదర్శించడానికి మూడు వేళ్లు చూపసాగారు.

ఇక యీ నిరసనకు గురైన రాణి గారి గురించి చెప్పాలంటే ఈవిడ గతంలో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసేది. అప్పటికే ముగ్గురు భార్యలున్న (ఒకరి తర్వాత మరొకరు) యువరాజు మహా (పూర్తి పేరు మహా వజిరలొంగ్‌కొర్ణ్) యీమెను చూసి ముచ్చటపడి 2014 ఆగస్టులో తన అంతఃపురానికి రక్షకురాలిగా నియమించాడు. 

వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడడంతో 2016 అక్టోబరులో తండ్రి మరణించగానే మూడో భార్యకు విడాకులు యిచ్చాడు. మరో రెండు నెలలకు రాజై, యీమె పదవీస్థాయిని పెంచాడు. అలా పెంచుతూ పోయి, చివరకు 2019 మే 1న పెళ్లాడి రాణిని చేశాడు. అప్పటికి ఆయన వయసు 68, ఆవిడకు 41.

ఈ మహాకు తన తండ్రి భూమిబల్‌కు వున్నంత పేరైనా లేదు. ఆయన 18వ యేట 1946లో గద్దె కెక్కి, 70 ఏళ్లు పాలించాడు. ఇతను ఆయనకు ఒక్కడే కొడుకు. విదేశాలలో, విలాసాలలో పెరిగాడు. ప్రజల గురించి ఎన్నడూ పట్టించుకోలేదు. రాజు పేర వున్న ఆస్తి విలువ 30 బిలియన్ డాలర్లుంటుంది. (రూ. 2.10 లక్షల కోట్లు) గతంలో క్రౌన్ ప్రాపర్టీ బ్యూరో అనే ట్రస్టు పేర వుండేది. దాన్ని ప్రభుత్వమే నిర్వహించేది. 

ఇతను రాజయ్యాక దాన్ని తన వ్యక్తిగత ఆస్తిగా మార్పించేసుకున్నాడు. అతను చెప్పినట్లు సైన్యం చట్టాలను మార్చేస్తూ వుంటుంది. దానికి ప్రతిఫలంగా దేశపాలనను సైన్యానికి వదిలేసి, తను జర్మనీలోని బవేరియాలో అత్యంత వైభోగంగా జీవిస్తూ వుంటాడు. వేరే దేశపు రాజు యిక్కడే కాపురం పెట్టడం బాగా లేదని జర్మన్ పార్లమెంటేరియన్లు అభ్యంతరం తెలుపుతూన్నా పట్టించుకోడు. 

తండ్రి సైన్యం సహాయంతో ప్రజాస్వామ్యయుతమైన పాలన జరగకుండా చూస్తూ వస్తే యితగాడు ఆయన కంటె రెండాకులు ఎక్కువ చదివి, మరింత నియంతగా వ్యవహరిస్తూ, ‘ఆయనే నయం’ అని ప్రజల చేత అనిపిస్తూ తండ్రికి మంచిపేరు వచ్చేట్లు చేస్తున్నాడు. ఇక వ్యక్తిగత జీవితం రసభరితం.

1977లో 25 ఏళ్ల వయసులో తల్లివైపు చుట్టమైన 20 ఏళ్ల సోమసవాలి అనే అమ్మాయిని పెళ్లాడి ఒక కూతుర్ని కన్నాడు. పెళ్లయిన ఏడాదికే మొహం మొత్తి యువాదిడా అనే సినీనటితో కాపురం పెట్టి, పెద్ద భార్యను విడాకులు యిమ్మన్నాడు. ఆవిడ యివ్వనంది. ఇతను ఆమెదే తప్పంటూ ఆరోపణలు చేశాడు. ఆమె వాటికి సమాధానం యివ్వలేకపోయింది. 

ఎందుకంటే థాయ్ చట్టాల ప్రకారం రాజులకు, రాజరికానికి వ్యతిరేకంగా ఎవరూ నోరెత్త కూడదు. లెసే మేజస్టీ (ఉచ్చారణ కరక్టో కాదో) అని అంటారు. తండ్రి కాలం నుంచి కఠినంగా అమలవుతున్న ఆ చట్టాన్ని యితను రాజయ్యాక మరింత బిగించాడు. చివరకు ఫ్యామిలీ కోర్టు ద్వారా 1993లో భార్యతో విడాకులు పుచ్చుకునే లోపున సినీనటితో ఐదుగురు పిల్లలు కన్నాడు. ఆమెను 1994లో పెళ్లి చేసుకుంటే దాన్ని తండ్రి ఆమోదించాడు కానీ తల్లి ఆమోదించలేదు.

పెళ్లయిన రెండేళ్లకు ఆ యువాదిడా పిల్లల్ని, డబ్బును తీసుకుని ఆమె బ్రిటన్‌కు ఉడాయించింది. భగ్గుమన్న యువరాజు మహా ఆమెకు 60 ఏళ్ల ఎయిర్‌మార్షల్‌తో సంబంధం వుందని, అందుకే పారిపోయిందని, రాజమహల్ అంతా పోస్టర్లు వేయించాడు. తర్వాత తన కూతుర్ని బ్రిటన్ నుంచి ఎత్తుకుని వచ్చేశాడు. 

ఆమెను యువరాణిని చేసి, తన భార్య, తక్కిన పిల్లల పాస్‌పోర్టులు రద్దు చేసేశాడు. ఈ ఉదంతం తర్వాత 1992లో తన సిబ్బందిలో భాగంగా వున్న శ్రీరాశ్మి అనే ఆమెను 2001లో పెళ్లి చేసుకున్నాడు. కాన 2005దాకా దాన్ని బహిరంగ పరచలేదు. అదే సంవత్సరం ఆమెకు కొడుకు పుట్టాక ఆమెను యువరాణిగా, ఆ కొడుకుని తన వారసుడిగా ప్రకటించాడు. కానీ 2014లో హోం శాఖకు ఉత్తరం రాస్తూ ఆమె బంధువులు అవినీతికి పాల్పడ్డారని, అందువలన ఆమె రాచలాంఛనాలను తొలగించాలని కోరాడు. వెంటనే ఆమె 5.5 మిలియన్ డాలర్ల భరణం తీసుకుని విడాకులు యిచ్చి వెళ్లిపోయింది.

దీనికి కాస్త ముందూవెనుకలగా పైన చెప్పిన ప్రస్తుత రాణి సుతిదాను చేరదీయడం, పెళ్లాడడం జరిగాయి. ఈమెతో సంబంధం కొనసాగుతూండగానే 2019 జులైలో సినీనత్ అనే ఆమెకు రాయల్ నోబుల్ కాన్సార్ట్ (రాజుగారి ఉంపుడుగత్తె) అనే బిరుదు ప్రసాదించి అక్కున చేర్చుకున్నాడు. ఈ పదవి శతాబ్దాల క్రితం వుండేది తప్ప ఆధునిక యుగంలో అమలులో లేదు. ఇతను అమలు చేశాడు. 

ఆ ఆదేశం యిచ్చిన మూణ్నెళ్లకే మహారాణి సుతిదాకి తగిన మర్యాద యివ్వలేదంటూ 2019 అక్టోబరులో ఆ పదవి ఉపసంహరించేశాడు. 11 నెలలకు 2020 సెప్టెంబరులో మళ్లీ పదవి వెనక్కి యిచ్చాడు. ఇలాటి నైతిక ప్రవర్తన వున్న యువరాజు గురించిన కథనాలను మీడియా చూస్తూ కూర్చుంటుందా? థాయ్ మీడియాకైతే శిక్షల భయం కానీ, విదేశీ మీడియాకు ఏం భయం? అందుకని అప్పుడప్పుడు యివన్నీ బయటపెట్టాయి.

‘‘ఫార్ ఈస్టర్న్ ఎకనమిక్ రివ్యూ’’ తన 2002 జనవరి సంచికలో అప్పటి ప్రధాని తక్సిన్‌తో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, యితని జూదాలకు అతను పెట్టుబడి పెడతాడని కథనం ప్రచురించింది. వెంటనే పైన చెప్పిన లెసే మేజస్టీ చట్టం ఉపయోగించి, దేశరక్షణకు విఘాతం కలుగుతోందని కారణం చెప్పి, థాయ్‌లో ఆ పత్రిక పంపిణీ ఆపేశారు.

2002లోనే ‘‘ద ఎకనమిస్ట్’’, తర్వాత ‘‘ఏసియా సెంటినెల్’’ రాజుకున్న పేరు యువరాజుకి లేదని, తిక్క మనిషని, పరిపాలనకు తగడని రాస్తే వాటి గతీ అంతే అయింది. 2009లో ఓ ఆస్ట్రేలియన్ రచయిత యితని జీవితంపై ఆధారపడి కాల్పనిక నవల రాస్తే అతనికి మూడేళ్ల జైలుశిక్ష పడింది.

యువరాజుగా యింత అధికారం చలాయించినవాడు తనే రాజైతే ఊరుకుంటాడా? ఇతను రాజు కావడానికి ముందున్న సందర్భం గురించి నేను 2016 ఆగస్టులో రాసిన వ్యాసం లింకు యిస్తున్నాను. https://telugu.greatandhra.com/articles/mbs/mbs-thailand-army-needa-lo-rajyanga-samskarnalu-74084.html. అది చదివితే అప్పటిదాకా ఉన్న రాజకీయ పరిస్థితి తెలుస్తుంది. 

రాజుతో చేతులు కలిపిన మిలటరీ ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ జరిపానంటూ మోసపూరితంగా ఒక రాజ్యాంగాన్ని ప్రజలపై రుద్దింది. ఇది జరిగిన రెండు నెలలకే రాజుగారు 88వ యేట మరణించారు. యువరాజు మహా మహారాజు అయిపోయి, 2017 ఏప్రిల్‌లో మిలటరీ తయారుచేసిన రాజ్యాంగాన్ని ఆమోదించాడు. దాని ప్రకారం 2019 మార్చిలో ఎన్నికలు జరిగాయన్నాడు. 

దానిలో ప్రధాని అభ్యర్థిగా జనరల్ ప్రయూత్ ముందుకు వచ్చాడు. అతను మిలటరీ జనరల్. అప్పటిదాకా వెనక వుండి, చక్రం తిప్పుతున్నాడు. ఇప్పుడు మిలటరీ యూనిఫాం యిప్పివేసి, మామూలు బట్టలు వేసుకుని రాజకీయనాయకుడిగా అవతారం ఎత్తాడు. అతనికి రాజు మద్దతు ఎలాగూ వుంది.

ఈ పరిస్థితిలో ఒక అవాంతరం వచ్చిపడింది – రాజుగారి సోదరి రూపంలో! ఆమె పేరు ఉబోల్ రతనా. మహా కంటె ఒక ఏడాది పెద్దది. స్విజర్లండ్‌లో పుట్టింది. 22వ ఏట బోస్టన్ వెళ్లి ప్రతిష్ఠాత్మకమైన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో న్యూక్లియార్ ఫిజిక్స్ చదివింది. అక్కడి క్లాస్‌మేట్ ఐన పీటర్ అనే అమెరికన్‌ను 1972లో వివాహమాడింది, ముగ్గురు పిల్లల్ని కంది. విదేశీయుణ్ని పెళ్లాడినందుకు ఆమె రాచమర్యాదలు రద్దయ్యాయి. 

26 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకున్నపుడు మళ్లీ పునరుద్ధరించ బడ్డాయి. 2001లో స్వదేశానికి తిరిగి వచ్చి మాదకద్రవ్యాలకు, ఎయిడ్స్‌కు వ్యతిరేకంగా సామాజిక కార్యకలాపాలు చేపట్టింది. దానధర్మాలు చేసే అనేక ట్రస్టులు నిర్వహించింది. సినిమాలలో నటించింది. 2019లో ఎన్నికలు అనేసరికి తక్సిన్‌కు సన్నిహితంగా వుండే ‘థాయ్ రక్సా చార్ట్ పార్టీ’ తరఫున ప్రధాని అభ్యర్థిగా నిలబడతానంది. దాంతో మహా కంగారు పడ్డాడు. రాచకుటుంబం వారు ఎన్నికలలో నిలబడడం సంప్రదాయానికి విరుద్ధం అంటూ ఆదేశం జారీ చేశాడు. సైనిక ప్రభుత్వం జీహుజూరంది. దాంతో మహాకు సన్నిహితుడైన ప్రయూత్ ఎన్నికల్లో ‘నెగ్గేసి’ ప్రధాని అయిపోయాడు.  

అంతకుముందు మరో మహిళా అభ్యర్థిని వేరేలా తప్పించడం జరిగింది. తక్సిన్‌కు సన్నిహితంగా వుండే మరో పార్టీ ఫ్యూ థాయ్ పార్టీ 2011లో ఇంగ్‌లుక్ అనే మహిళను ప్రధానిగా చేసింది. సైన్యం ఆమెకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయించింది. 2014 మేలో సైనిక కుట్ర జరిపినప్పుడు ఆమెను అరెస్టు చేసి, అవినీతి ఆరోపణలు మోపింది. 

2016లో విచారణ జరిగింది. దాని తీర్పు మహా రాజయ్యాక 2017 ఆగస్టులో వచ్చింది. ఆమె కోర్టుకి హాజరు కాకుండా దేశం విడిచి పారిపోయింది. దాంతో కోర్టు ఆమెకు పరోక్షంగానే ఐదేళ్ల శిక్ష వేసింది. ఆమె లండన్‌లో తలదాచుకుందని వినికిడి. తక్సిన్‌కు పలుకుబడి వుంది కాబట్టి అతను ఎన్నికలలో పోటీ చేయడానికి వీల్లేదంటూ కోర్టు చేత చెప్పించారు. ఈ విధంగా తమకు అడ్డు వచ్చినవారందరినీ తొలగించివేసుకుంటూ మహా, ప్రయూత్ కలిసి దేశాన్ని చిత్తం వచ్చినట్లు ఏలేస్తున్నారు. అడ్డు చెప్పినవారిని ఏరేస్తున్నారు.

ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా, రాజుగారిని నిందించారంటూ లెసే మేజస్టీ చట్టాన్ని ఉపయోగించి కఠిన శిక్షలు వేసేస్తున్నారు. ఆ చట్టాన్ని తొలగించమని యునైటెడ్ నేషన్స్ సలహా యిచ్చింది కానీ వినేవారెవరూ లేరు. వీళ్లిలా ఎవర్నీ ఖాతరు చేయకపోవడానికి కారణం ఏమిటంటే, థాయ్‌కు అమెరికాతోనూ, చైనాతోనూ సత్సంబంధాలున్నాయి. కోల్డ్‌ వార్ సమయం నుంచి అమెరికా చైనా, రష్యాలపై నిఘా వేయడానికి థాయ్‌ను ఉపయోగించుకుంది. 

1960లలో కమ్యూనిస్టు వ్యతిరేక కూటమిగా అమెరికా తీర్చిదిద్దిన ఏసియన్ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్)లోని 5 దేశాల్లో థాయ్‌లాండ్ ఒకటి. ఆమెరికన్ గూఢచారి సంస్థ సిఐఏకు థాయ్‌లో ఒక కేంద్రం వుంది కూడా. ఈ కారణం చేతనే థాయ్‌లో తరచుగా సైనిక కుట్రలు జరిగి ప్రజాప్రభుత్వాలను కూలదోస్తున్నా అమెరికా కిమ్మనదు. నియంతలకు, రాజులకు మద్దతు యిస్తూ వచ్చింది. ఇప్పటికీ మాదకద్రవ్యాల రవాణా నిరోధిస్తున్నామన్న కారణం చెప్పి థాయ్‌తో వ్యాపారసంబంధాలు పెట్టుకుంటోంది. భారీగా పెట్టుబడులు పెట్టింది.

అమెరికాకు చైనా సన్నిహితమైన తర్వాత థాయ్ కూడా చైనాతో సత్సంబంధాలు నెలకొల్పుకుంది. ఎగుమతులు, దిగుమతులు బాగా చేసుకుంటోంది. 2014 సైనిక కుట్ర తర్వాత చైనా థాయ్‌లో పెట్టుబడుల జోరు పెంచింది. థాయ్‌లో చైనా సిటీ కాంప్లెక్స్ కడుతోంది. రక్షణ సామగ్రి అమ్ముతోంది. నౌకా నిర్మాణ కేంద్రం కడుతోంది. కరోనా కారణంగా థాయ్ ఆర్థికవ్యవస్థ కుప్పకూలడంతో నేనున్నానంటూ ముందుకు వచ్చి, ఓ పక్క ఆందోళనలు జరుగుతూండగానే అక్టోబరులో చైనా బెల్ట్ అండ్ రోడ్ పథకంలో భాగంగా 1.62 బిలియన్ డాలర్ల హైస్పీడ్ రైలు లైన్ స్కీముపై సంతకాలు జరిగాయి. ఇలా అమెరికా, చైనాలు రెండిటి మద్దతుతో థాయ్ ప్రభుత్వం రెచ్చిపోతోంది.

సత్సాక్షిత్ అనే మానవహక్కుల కార్యకర్త ఉన్నాడు. అతను 2014 సైనిక కుట్రను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపితే రాజుగారిని అవమానించాడంటూ అతనిపై కేసు పెట్టారు. దాంతో అతను కంబోడియా పారిపోయి అక్కడ తలదాచుకున్నాడు. అక్కణ్నుంచే తన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రయూత్ ప్రభుత్వం అతన్ని యీ ఏడాది జూన్‌లో కంబోడియా నుంచి కిడ్నాప్ చేయించింది. అప్పణ్నుంచి అతను ఆచూకీ తెలియటం లేదు. అతనే కాదు, మరో యిద్దరు అసమ్మతివాదుల శవాలు లావోస్, కంబోడియా మధ్య నదిలో తేలుతూ కనబడ్డాయి. 

ఇతర దేశాల్లో దాక్కున్న అనేక మంది ఉద్యమకారులు హఠాత్తుగా మాయమై పోతున్నారు. సత్సాక్షిత్ ఎక్కడున్నాడో చెప్పాలంటూ లక్షలాది మంది ఆందోళనకారులు బాంగ్‌కాక్ వీధుల్లో నెలలుగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.  హాంగ్‌కాంగ్ ఆందోళనకారులకు ఎంతో కవరేజి యిచ్చిన అమెరికన్ మీడియా దీన్ని అంతలా పట్టించుకోవటం లేదు. చివరకు యీ ఆందోళనలు ఏ రూపాన్ని తీసుకుంటాయో గమనించాలి.

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×