Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: ఎన్నికల ఫలితాల విశ్లేషణ- పంజాబ్

ఎమ్బీయస్: ఎన్నికల ఫలితాల విశ్లేషణ- పంజాబ్

ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో 4టిలో బిజెపి మళ్లీ అధికారంలోకి వచ్చేసింది. పంజాబ్‌లో మాత్రం అధికారానికై ప్రయత్నించి విఫలమైంది. కానీ గమనించదగ్గ విషయమేమిటంటే పంజాబ్‌లో బిజెపి ఎప్పుడూ బలంగా లేదు. అకాలీదళ్‌కు జూనియర్ భాగస్వామిగా వుంటూ వచ్చిందంతే. చెప్పుకోదగ్గ నాయకులూ లేరు. అన్ని స్థానాలకూ పోటీ చేసినదీ లేదు. రెండు చిన్న పార్టీలతో కలిసి ఈసారి అన్ని స్థానాలకూ పోటీ చేసినా 7% ఓట్లు (2017తో పోలిస్తే 2% పెరిగాయి), 2 సీట్లు (ఒకటి తగ్గింది) వచ్చాయంతే. ఇప్పుడు ఆప్ అధికారంలోకి వచ్చింది కాబట్టి, 2027 నాటికి దాన్ని దింపడానికి యిప్పటినుంచి ప్రయత్నాలు మొదలుపెట్టవచ్చు. 2024 నాటికే పార్లమెంటు ఎన్నికలలో తన ప్రభావాన్ని చూపవచ్చు.

ప్రస్తుతానికైతే పంజాబ్‌లో బిజెపి నష్టపోయినదీ లేదు, లాభపడినదీ లేదు. దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదు కూడా. మోదీ పర్యటించినప్పుడు పెద్ద కుట్ర జరిగిపోయిందని ప్రచారం మొదలుపెట్టారు, దేశమంతా పూజలు జరిపించారు కానీ కొన్ని రోజులకే యిదంతా అనవసరపు కసరత్తు అనుకున్నారు లాగుంది, ఆపేశారు. అంతకంటె యావచ్ఛక్తులూ యుపిపై వినియోగిస్తే మంచిదనుకున్నారు. అక్కడ అద్భుతమైన ఫలితాలు సాధించారు. పంజాబ్‌లో ఘోరంగా నష్టపోయినదెవరా అని చూస్తే కాంగ్రెసు, అకాలీదళ్ అని చెప్పుకోవాలి. వ్యక్తిగతంగా కూడా ఆప్ తరఫున నిలబడిన అతి సామాన్యుల చేతిలో పెద్ద తలకాయలెన్నో రాలిపోయాయి. బాదల్ కుటుంబీకులు, కెప్టెన్ అమరీందర్ సింగ్, సిద్దూ, చన్నీ అందరూ మట్టి కరిచారు. ఏకైక విజేత ఆప్! ప్రభంజమనే చెప్పాలి.

117 సీట్ల అసెంబ్లీలో 2017లో 20 సీట్లు తెచ్చుకున్న పార్టీ యీసారి ఏకంగా 92 తెచ్చుకుంది. ఓటింగు శాతం చూస్తే 24 నుంచి 42కి పెరిగిందంతే. రాష్ట్రమంతటా ఒకేలా ప్రజాదరణ పొందడం వలననే 42% ఓట్లతో 79% సీట్లు పొందగలిగింది. దాని తర్వాత స్థానంలో 18 సీట్లతో నిలిచిన కాంగ్రెసుకు ఓట్లలో 16% తగ్గి 23% వచ్చింది కానీ సీట్లు మాత్రం 65% నుంచి 15%కు పడిపోయాయి. 3 సీట్లు వచ్చిన అకాలీదళ్ అయితే మరీ ఘోరం. 7% ఓట్లు తగ్గి 18% వచ్చాయి కానీ సీట్లు 13% నుంచి 2.5% కు పడిపోయాయి.

ప్రాంతాల వారీగా పంజాబ్‌ ఓటింగు సరళి గమనిస్తే 69 సీట్లున్న మాళ్వా ప్రాంతంలో 66 సీట్లు ఆప్‌కు వచ్చాయి. కాంగ్రెసుకు 2, అకాలీదళ్‌కు 1 దక్కాయి. ఈ ప్రాంతంలోని రైతు కుటుంబాలలో 50% మంది ఆప్‌కి వేశారని సిఎస్‌డిఎస్-లోకనీతి సర్వే అంటోంది. దోఆబాలోని రైతుల్లో 35%, మాఝా లోని రైతుల్లో 26% మాత్రమే వేశారట. 23 సీట్ల దోఆబా ప్రాంతంలో 10 సీట్లు ఆప్‌కు, 9 కాంగ్రెసుకు రాగా అకాలీదళ్ 2తో, బిజెపి 1టితో సరిపెట్టుకున్నాయి. గద్దె నెక్కిన దగ్గర్నుంచి జాతీయ పత్రికలలో కూడా యాడ్స్ గుప్పించిన చన్నీ తన కులస్తులు అధికంగా ఉన్న దోఆబాలో పార్టీని గెలిపించుకోలేక పోయాడు. అతని పార్టీకి ఆప్ కంటె ఒక సీటు తక్కువ వచ్చింది. చన్నీ కాబినెట్‌లో మంత్రి కొడుకు స్వతంత్రుడిగా పోటీ చేసి నెగ్గాడు. ఈ ప్రాంతంలోని రైతు కుటుంబాల్లో 13% మంది బిజెపికి ఓటేశారు. తక్కిన ప్రాంతాల్లో యిది 3%, 4% మాత్రమే ఉంది.

25 సీట్ల మాఝా ప్రాంతంలో ఆప్‌కు 16, కాంగ్రెసుకు 7 రాగా, అకాలీదళ్ బిజెపిలకు చెరొకటి వచ్చాయి. ఇండియా టుడే-ఏక్సిస్ మై ఇండియా పోల్ ప్రకారం పురుషుల్లో 40% ఆప్‌కు, 27% కాంగ్రెసుకు, 20% అకాలీదళ్‌కు వేశారు. స్త్రీలలో 42% ఆప్‌కు, 29% కాంగ్రెసుకు, 18% అకాలీదళ్‌కు వేశారు. కులాల వారీగా చూసుకుంటే హిందూ అగ్రకులాల్లో 39% ఆప్‌కు, 24% కాంగ్రెసుకు, 20% అకాలీదళ్‌కు వేశారు. శిఖ్కు అగ్రకులాల్లో 46% ఆప్‌కు, 20% కాంగ్రెసుకు, 22% అకాలీదళ్‌కు వేశారు. హిందూ ఒబిసిలలో 45% ఆప్‌కు, 22% కాంగ్రెసుకు, 14% అకాలీదళ్‌కు వేశారు. శిఖ్కు ఒబిసిలలో 46% ఆప్‌కు, 24% కాంగ్రెసుకు, 20% అకాలీదళ్‌కు వేశారు.

హిందూ ఎస్సీలలో 29% ఆప్‌కు, 40% కాంగ్రెసుకు, 22% అకాలీదళ్‌కు వేశారు. శిఖ్కు ఎస్సీలలో 38% ఆప్‌కు, 35% కాంగ్రెసుకు, 20% అకాలీదళ్‌కు వేశారు. సిఎస్‌డిఎస్-లోకనీతి సర్వే అంకెలు కూడా దీనికి దగ్గరగానే ఉన్నాయి. కొన్ని చోట్ల 3% తేడా ఉందంతే. కాంగ్రెసు ముఖ్యమంత్రి స్థానాన్ని శిఖ్కు ఎస్సీ యైన చన్నీకి యిచ్చి వాళ్ల ఓట్లన్నీ కొల్లగొడతానని అనుకుంది. ఓటింగు చూస్తే యిదీ వరస! పంజాబ్ దళిత ఓటుపై రాసిన వ్యాసంలో నేను రాశాను – కేవలం సంఖ్యాబలం బట్టి ఓటింగును లెక్క వేయకూడదు, వాళ్లు ఏ మేరకు సంఘటితం అయ్యారో చూడాలని! దళిత ఓట్లు తెచ్చిపెడతాడనే ఆశతో గుర్మీత్ బాబాను బయటకు తీసుకుని వచ్చిన చన్నీ తర్వాత నాలుక కరుచుకోవలసి వచ్చింది.

కాంగ్రెసు ఎందుకింత చావుదెబ్బ తింది అంటే, కెప్టెన్ ప్రభుత్వం పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత కొంతవరకు దెబ్బ కొడితే, కాంగ్రెసు అధిష్టానం సిద్దూని ఎగదోసి కెప్టెన్ని తొలగించడం, ఆ తర్వాత చన్నీకి వ్యతిరేకంగా సిద్దూ చేసిన ఆగడాలను సహించడం వలన ఆ పార్టీ అంటే ఓటర్లకు అసహ్యం వేసింది. సిఎస్‌డిఎస్-లోకనీతి సర్వే ప్రకారం ఓటర్లలో 58% మంది రాష్ట్రప్రభుత్వం పట్ల, 53% మంది కేంద్ర ప్రభుత్వం పట్ల పూర్తి అసంతృప్తితో ఉన్నారు. కొద్దిపాటి అసంతృప్తి ఉన్నవారు 17% (రాష్ట్రం) 16% (కేంద్రం) ఉన్నారు. దీనివలన గతంలో కాంగ్రెసుకు ఓటేసినవారిలో 31% మంది ఆప్‌వైపు మళ్లారు. అకాలీదళ్ ఓటర్లలో 31%, బిజెపి ఓటర్లలో 16% కూడా ఆప్‌వైపు మళ్లారు.

కాంగ్రెసు కంటె ప్రజలకు అకాలీదళ్ పట్ల మరింత ఏహ్యత ఉందని ఫలితాలు చెప్పాయి. పంజాబ్ కష్టాలన్నిటికీ 2017 వరకు పాలించిన ఆ పార్టీయే కారణమని ప్రజలు గాఢంగా నమ్ముతున్నారు. బిజెపి ప్రవేశపెట్టిన సాగుబిల్లులను మొదట్లో సమర్థించి, ఆ తర్వాత విభేదించి, రైతు ఛాంపియన్లగా వాళ్లు ఆడిన నాటకం ప్రజలను మెప్పించలేదు. పార్టీ భీష్మపితామహుడు ప్రకాశ్ దగ్గర్నుంచి కుటుంబమంతా ఓడిపోయింది. బియస్పీతో పొత్తు పెట్టుకుని, దళిత ఓటర్లను ఆకర్షిద్దామని చూస్తే బియస్పీకి ఒకే ఒక్క సీటు కలిపింది.

బిజెపి విషయానికి వస్తే అది నెగ్గిన పఠాన్‌కోట్, ముకేరియా స్థానాల్లో హిందువులు మెజారిటీలో ఉన్నారు. తక్కిన చోట్ల హిందువులు బిజెపిని పట్టించుకోలేదు. 2019 పార్లమెంటు ఎన్నికలలో ఉన్న 13 స్థానాల్లో కాంగ్రెసు 8, ఆప్ 1 గెలవగా, అకాలీదళ్ బిజెపిలు కూటమిగా ఏర్పడి చెరో 2 గెలుచుకున్నాయి. ఆ లెక్కన బిజెపికి కనీసం 14 అసెంబ్లీ స్థానాలు రావాలి. కానీ రాలేదు రెండిటితో సరిపెట్టుకోవలసి వచ్చింది. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రవాది అని, ఖలిస్తానీలతో సంబంధాలు ఉన్నాయని బిజెపి చేసిన ప్రచారాన్ని ఓటర్లు నమ్మలేదు. అలాగే మోదీ హత్యకు కుట్ర జరిగి, ఆయన్ని కావాలని మధ్యదారిలో నిలబెట్టేసి సెక్యూరిటీ రిస్కులో పడవేశారని, కానీ భగవంతుడే మోదీని కాపాడాడనీ బిజెపి చేసిన ప్రచారాన్నీ ప్రజలు పట్టించుకోలేదు.

దిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మకమైన సంక్షేమపాలన, పాలనాసామర్థ్యం పొరుగునే ఉన్న పంజాబ్‌ను మెప్పించింది. దిల్లీ అర్ధరాష్ట్రమే, పైగా నగరం, ఆ మోడల్ ప్రధానంగా గ్రామీణ రాష్ట్రమైన పంజాబ్‌కు పనికి రాదు అని తక్కిన పార్టీలు వాదించినా ఆప్ బెదరలేదు. 2021 ఆగస్టు నుంచి దిల్లీ తరహా పాలన తెస్తామని గట్టిగా ప్రచారం చేస్తూ వచ్చి పంజాబ్ మనసు గెలుచుకుంది. కేజ్రీవాల్ హిందూ కాబట్టి పంజాబ్‌కు హిందువునే ముఖ్యమంత్రి చేస్తాడనే ప్రచారం జరిగింది. అతను తెలివిగా శిఖ్కునే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపించడంతో శిఖ్కుల్లో 47% మంది ఆప్‌కు ఓటేశారు. తక్కినవాళ్లు కాంగ్రెసు, అకాలీదళ్‌ల మధ్య యించుమించు సమానంగా చీలిపోయారు. హిందువుల్లో 35% మంది ఆప్‌కు, 16% మంది బిజెపికి వేశారు. ఇతరుల్లో 37% మంది ఆప్‌కు 35% మంది కాంగ్రెసుకు ఓటేశారు. గురు గ్రంథసాహెబ్ పట్ల అపచారం విషయంలో శిఖ్కులు యింకా శాంతించలేదు. దోషులను పట్టుకుని శిక్షించడం ముఖ్యమైన అంశమే అని శిఖ్కులలో 79% మంది, హిందువుల్లో 57% మంది అభిప్రాయపడుతున్నారు. ఆప్ ముఖ్యమంత్రి మాన్ ఆ విషయంలో ఏం చేస్తాడో చూడాలి. ఆప్ అధినేత కేజ్రీవాల్ హరియాణ్వీ కాబట్టి మాన్ హరియాణాకు అనుకూలంగా వ్యవహరిస్తాడేమోననే భయాలుంటే అవి తొలి రోజుల్లోనే తొలిగిపోయాయి. చండీఘడ్ మాదే అని నినదించాడు.

ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ 1973లో పుట్టాడు. చదువుకునే రోజుల నుంచీ యూత్ కామెడీ ఫెస్టివల్స్‌లో, ఇంటర్ కాలేజీ కాంపిటీషన్స్‌లో స్టాండప్ కమెడియన్‌గా బహుమతులు తెచ్చుకున్నాడు. చదువయ్యాక కామెడీ వీడియోలు, మ్యూజిక్ ఆల్బమ్స్ చేశాడు. కొన్ని పంజాబీ సినిమాల్లో కూడా వేశాడు. 2008లో స్టార్ ప్లస్ వారి గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. 2011లో మన్‌ప్రీత్ సింగ్ బాదల్ పెట్టిన పంజాబ్ పీపుల్స్ పార్టీలో చేరాడు. 2014లో సంగ్రూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచాడు. చమత్కారపూరితమైన ప్రసంగాలతో లోకసభను మెప్పించాడు. 2019లో మళ్లీ అక్కణ్నుంచే పోటీ చేసి, ఆప్ తరఫున నెగ్గిన ఏకైక ఎంపీగా గుర్తింపు పొందాడు. 2016లో పార్లమెంటు కార్యకలాపాలను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో క్షమాపణ చెప్పవలసి వచ్చింది.

అతని తాగుబోతుతనానికి ఎంత చెడ్డపేరు వచ్చిందంటే చివరకు 2019లో ఒక ఆప్ కార్యక్రమంలో అతను తాగనని ప్రమాణం చేయవలసి వచ్చింది. కమెడియన్ కాబట్టి అధికారంలో ఉంటూ వస్తున్న ప్రకాశ్ సింగ్ బాదల్, కెప్టెన్‌లను వెటకారం చేసి పంజాబీ సామాన్యుడి హృదయాన్ని గెలుచుకున్నాడు. అత్యంత సాధారణ జీవితాన్ని గడుపుతూ, అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల్ని మెప్పించాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి కాగానే భగత్ సింగ్ స్వగ్రామంలో ప్రమాణస్వీకారసభ నిర్వహించాడు. ప్రభుత్వాఫీసుల్లో భగత్ సింగ్‌ది, ఆంబేడ్కర్‌ది తప్ప తన ఫోటో వద్దన్నాడు. ప్రజలు అతనిపై గంపెడంత ఆశలు పెట్టుకుని యింత పెద్ద మెజారిటీతో గెలిపించారు కాబట్టి అది అతని తలపై పెనుభారమే అవుతుంది. వాళ్ల ఆశలు ఏ మేరకు నెరవేరుస్తాడో చూడవలసినదే. (ఫోటో – భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?